సంపాదకీయం, మే 2021

2
10

[dropcap]దు[/dropcap]ర్దినాలివి. గడ్డు రోజులివి. ఎవరో ఒకరి మరణవార్త వినకుండా తెల్లారటంలేదు. తెల్లారుతూంటే ఏం వార్త వినాల్సొస్తుందోనన్న భయం పట్టిపీడిస్తోంది. బయటకెళ్ళాలన్నా, ఎవరినయినా కలవాలన్నా, ఏమిచేయాలన్నా భయభావన వెంటాడుతోంది. చివరికి టీవీల్లో పాత సినిమాలు చూస్తూంటే, సినిమాలో, ఎవరయినా షేక్‌హాండ్ ఇచ్చినా, సన్నిహితంగా వచ్చినా కరోనా భయం లేదా వీళ్ళకు అన్న ఆలోచన వచ్చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక సంవత్సరం క్రితం నాటికీ ఇప్పటికీ జీవితంలో, ఆలోచనలో, దృక్పథంలో సంపూర్ణంగా తేడా వచ్చేసింది. తేడా రానిది, మీడియాలో, రాజకీయాల్లో!!!!

క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు నిజానిజాలు వివరించి ధైర్యం చెప్పి రాబోయే కష్టాలను ఎదుర్కొనేందుకు మానసికంగా ప్రజలను సిద్ధం చేసే బదులు మీడియా ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. శ్వాస ఆడక కొట్టుకుంటున్నవారు, కొనఊపిరితో వున్నవారు, రోడ్లపై పడిపోతున్నవారు.. ఇలా, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల కష్టాలు చూపిస్తూ, సంబరాలు చేసుకుంటూ, ఇంకా చావండి, ఇంకా ఇంకా అని గెంతులు వేస్తున్నట్టుంది మీడియా ప్రవర్తన.

మీడియా కన్నా రెండాకులు ఎక్కువ చదివేరు ఫేస్‌బుక్ విశ్వవిద్యాలయం, వాట్స్ఆప్ యూనివర్శిటీ ప్రొఫెసర్లు, డీన్లు. నిర్ణయాత్మక స్థానాల్లో వున్నవారి కన్నా, డాక్టర్ల కన్నా తమకే ఎక్కువ తెలిసినట్టు, మిగతావారంతా పనికిరానివారయినట్టున్న వీరి ప్రవర్తన మామూలు సందర్భాలలోనయితే డాన్ క్విక్సోట్లతో, పరమానందయ్య శిష్యులతో పోల్చి నవ్వుకునేవాళ్ళం. కానీ, ఈ సందర్భంలో వీరి ప్రవర్తన చదువుకున్నవారింతా మూర్ఖులా? చదువుకున్నవారింత అంధులా? చదువుకున్నవారింత శాడిస్టులా? నిజంగా వీరికి సమాజమన్నా, సమాజం పట్ల బాధ్యత, దేశమంటే గౌరవాభిమానాలన్న ఏమిటో తెలుసా? అన్న భావన కలుగుతోంది. కరోనానుంచి తప్పించుకునేందుకు ఒకరు ముక్కులో నూనె పోసుకోమంటే, ఇంకొకరు రోజుకో అరటిపండు తింటే చాలు అంటారు. ఒకరు గోమూత్రం తాగితే చాలంటే ఇంకొకరు ఆవిరి పడితే చాలు కరోనా ఆవిరైపోతుందంటారు. ఇంకొకరు ఇదంతా కార్పొరేట్ల కుట్ర, కరోనా అన్నదే లేదంటారు.

వీరి వ్యవహారం ఇలా వుండగా రాజకీయాలు, వారి అనుబంధ మీడియా, సోషల్ మీడియా కార్యకర్తల ప్రవర్తన, ప్రజల సమస్యపై సానుభూతి కన్నా, వారు అధికారానికి రావటం సహించని వ్యక్తికి పాలన రాదని నిరూపించి అతడిని గద్దె దింపటం తప్ప మరో లక్ష్యం లేనట్టుంది. ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించటం, తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా అడ్డుపడటం, దేశంలో వ్యవస్థలన్నీ హటాత్తుగా పనికిరానివయిపోయినట్టు అపనమ్మకం కలిగించటం, అంతా తమకు తెలుసు అధికారంలో వున్న తమకు నచ్చనివారెందుకూ కొరగానివారన్నట్టు వ్యవహరించటం గత ఏడేళ్ళుగా చూస్తూనే వున్నాం. కానీ, ఈ సంవత్సరం కలిగినంతగా వారిపై అసహ్యం ఇంతవరకు ఎప్పుడూ కలగలేదు. వారివల్ల ఇప్పుడు జరుగుతున్నంత నష్టం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ప్రజల ప్రాణాలకన్నా వీరికి ఆ ఒక్క వ్యక్తిపై ద్వేషం, అతడిని గద్దె దింపాలన్న పట్టుదల ఎక్కువ అన్న భావన కలుగుతోంది విషపూరితము, అనౌచిత్యము, అర్ధరహితము, అన్యాయమయిన వీరి ప్రవర్తన చూస్తూంటే…

ప్రస్తుతం దేశం అత్యంత కఠినమయిన పరిస్థితిని ఎదుర్కుంటున్నదన్నది కాదనలేని సత్యం. నిజానికి ఇలాంటి పరిస్థితిని గత సంవత్సరం ఎదుర్కోవాల్సివస్తుందని భయపడ్డాము. ఇతర దేశాలలో గుట్టలుగుట్టలుగా శవాలు రోడ్లపై పడివుండటం, మనుషులు చికిత్స లభించక రోడ్లపైనే ప్రాణాలు వదలటం చూసి చలించిపోయాం. జాలిపడ్డాం. అతి తక్కువ జనాభా కల దేశాలే ఇలావుంటే మనమేమయిపోతామో అన్ని బెదిరిపోయాము. కానీ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ భారత్ లాక్‌డౌన్ సమయాన్ని సృజనాత్మకంగా వాడుకుని, వైద్య వ్యవస్థను మెరుగుపరచుకుని ఆత్మనిర్భరతను ప్రపంచానికి ప్రదర్శించింది. కరోనాకు విరుగుడుని కనిపెట్టి ప్రపంచానికి భరోసానిచ్చింది. కానీ, అదంతా క్షణంలో బూడిదలో పోసిన పన్నీరయింది. కన్నుమూసి తెరిచేలోగా చినుకు గాలివానయి ప్రపంచాన్ని ముంచెత్తే ప్రళయమయినట్టు, వందలు వేలు పోయి లక్షల సంఖ్యలో కరోనా వ్యాధి సోకటంతో అప్పుడప్పుడే ఊపిరి పీల్చుకుంటూ అప్రమత్తంగా వున్న సమాజం ఉలిక్కిపడింది. కళ్ళు తెరిచేలోగా ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితిలోకి దిగజారింది. ఇలాంటి పరిస్థితిలో కాస్తయినా బాధ్యత, ఆలోచన వున్న పౌరులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏంచేయాలో ఆలోచిస్తారు. అది చేసేందుకు ఉద్యుక్తులవుతారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఉత్సాహపరచుకుంటూ సాటి మనుషుల కష్టాలు తొలగించటంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. కనీసం ఏమీ చేయలేకుంటే మౌనంగా వుండి, తమవల్ల ఇంకొకరికి కష్టం రాకుండా చూసుకుంటారు. కానీ, ఇప్పుడు జరుగుతున్నదేమిటి? జనవరి నుంచీ ఇతర దేశాల్లో కొత్త రూపు దిద్దుకుంటున్న కరోనా వార్తలు తీవ్రతరమయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో కరోనా ప్రబలుతున్న వార్తలొస్తున్నాయి. కరోనా పెరుగుతున్న రాష్ట్రాలుకానీ, ఇంకా తీవ్రత పెరగని రాష్ట్రాలుకానీ హెచ్చరికలను పట్టించుకోలేదు. క్రితం సంవత్సరం కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నదని అలిగినవారు ఇప్పుడు మౌన ప్రేక్షకుల్లా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. పరిస్థితి దిగజారుతున్నదనగానే చేతులెత్తి కేంద్రం మీదకు దోషాన్ని తోసేసి అన్నిటికీ తమ ఇష్టానికి వ్యతిరేకంగా అధికారానికి వచ్చిన అతడే కారణం అంటున్నారు. రోము తగలబడుతూంటే నీరో ఫిడేలు వాయించేడంటారు. కానీ, మన దగ్గర ఇల్లు తగలబడుతూంటే నిప్పు ఆర్పే ప్రయత్నాలు చేసేబదులు తాము వ్యతిరేకించినా అదికారానికి వచ్చినాతడిని ఇరుకున పెట్టే అవకాశం లభించిందని ఆ నిప్పు చుట్టూ నృత్యాలుచేస్తూ సంబరాలుచేసుకునే సంబరాల రాంబాబులుగుర్తొస్తున్నారు. అత్యుత్సాహపరులయిన అమాయకులు ఈ ప్రధాని మా ప్రధాని కాదని కారు కూతలు కూస్తునారు. శివం పట్టిన వారిలా ఊగిపోతున్నారు. మతితప్పిన వారిలా అర్ధం పర్ధంలేని మాటలు మాట్లాదుతున్నారు. అయ్యో మనది ఒకే దేశం, ఇష్టంవున్నా లేకున్నా మనకందరికీ ఒకే ప్రధాని , ఇది నేరారోపణల సమయంకాదు, ముందీ పరిస్థితినుంచి ఎలాగట్టేక్కాలో ఆలోచించాలి అంటే అంధభక్తులు అని పిచ్చివాళ్ళలా ప్రేలపనలు చేస్తూ అదే గొప్పనుకుంటున్నారు.

వీరంతా ఒక్క క్షణం ఆగి గత సంవత్సరం కేంద్రం అన్నిటినీ తన అదుపులోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో తమ హక్కును కేంద్రం కాలరాస్తోందని ఇవే రాష్ట్రాల నేతలు ఆరోపించటాన్ని గుర్తు తెచ్చుకోవాలి.

రాజ్యాంగంలో ఆరోగ్యం రాష్ట్రం బాధ్యత. కానీ, అంటువ్యాధులు ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఈ బాధ్యతను కేంద్రం తీసుకోవచ్చని ఎపిడమిక్ డిసీసెస్ ఏక్ట్ 1897, నేషనల్ డిజాస్టర్ మేనెజ్మెంట్ ఏక్ట్ 2005 వంటి రాజ్యాంగంలో వున్న వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం వాడుకుని నిర్ణయాలు తీసుకోవటాన్ని, దేశమంతా వాటిని అమలుపరచటాన్ని అప్పుడంతా విమర్శించారు. కేంద్ర పరిశీలక బృందాలను రాష్ట్రాలకు పంపటం, సలహాలివ్వటాన్ని అవమానంగా భావించారు. ఇలాంటి సమయాల్లో కేంద్రం రాష్ట్రాలు కలసికట్టుగా పనిచేయాల్సివుంటుంది. మన రాజ్యాంగంలో ఆరోగ్యం విషయంలో కేంద్రం కన్నా రాష్ట్రాలదే బాధ్యత ఎక్కువ. కానీ, క్రితం సంవత్సరం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను పక్కనపెట్టి చురుకుగా వ్యవహరించటం రాష్ట్ర ప్రభుత్వాలు హర్షించలేదు. పరిస్థితి దిగజారుతూంటే రాష్ట్రాల్లో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఏంచేస్తున్నారని ఎవరూ అడగటంలేదు. హఠాత్తుగా ఆక్సిజన్ కొరత, మందుల కొరత, వాక్సీన్ల కొరతలు ఎలా ఏర్పడ్డాయి? ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాలను నీరుగార్చటం, గుడ్డిగా వ్యతిరేకించి ఇష్టం వచ్చినట్టు నేరారోపణలు చేయటం, తమ చేతకాని తనానికీ కేంద్రాన్ని దోషిగా నిలపాలన్న ప్రయత్నాలు చూస్తూంటే, దేశంలో కేంద్రానికి తప్ప ఇంకెవరికీ బాధ్యతలేదా? అన్న అనుమానం వస్తోంది. ఇదే నిజమయితే, ఇంక ప్రత్యేక రాష్ట్రాలెందుకు? అక్కడ ఎన్నికలెందుకు? ప్రజాప్రతినిధులు, వారికి అధికారాలు, హక్కులెందుకు? బాధ్యతల్లేనివారికి హక్కులు, అధికారాలెందుకు?

రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం రాష్ట్రాల బాధ్యత అయినా ఏడవ షెడ్యూల్ ప్రకారం అంటువ్యాధుల నిర్మూలన కాంకరెంట్ లిస్ట్‌లో వుండటంవల్ల కేంద్రం బాధ్యత. అంటే ప్రజారోగ్యం విషయంలో కేంద్రం బాధ్యత పరిమితం. అయితే, నిధులు కేంద్రం దగ్గరవుండటంతో ఈ విషయంలో ఎవరిది బాధ్యత అన్నది స్పష్టంగాలేక పరిస్థితి దిగజారితే కేంద్రం రాష్ట్రాలపైనా, రాష్ట్రాలు కేంద్రంపైనా నేరం తోసేయటం ఆనవాయితీ. ఇందుకు భిన్నంగా గత సంవత్సరం కేంద్రం బాధ్యత వహించింది. ఈసారి రాష్ట్రాలకు నిర్ణయం వదిలేసింది. నిర్ణయాలు తీసుకోలేక, ఏమి చేయాలో తెలియక పరిస్థితిని దిగజార్చిన రాష్ట్ర ప్రభుత్వాలు నేరం కేంద్రంపై మోపుతున్నారు. ఈలోగా, తాము వ్యతిరేకించే వ్యక్తి అధికారానికి రావటం సహించక అధికారానికి వచ్చినప్పటినుంచీ అతనికి పాలన చేతకాదని నిరూపించాలని తపనపడుతూ, అతడిని గద్దె దింపాలని ఆత్రపడుతున్న వారిప్పుడు జరుగుతున్నదంతా ప్రధానివల్లే అని ప్రజలను నమ్మించాలన్న ఆత్రంలో , ఒక్క వ్యక్తిని గద్దె దింపటానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, జరిగిన తప్పును గ్రహించి సరిదిద్దుకునే బదులు ఉచితానుచితాలు మరచి ప్రధాని రాజీనామా చేయాలని ఉద్యమిస్తున్నారు. సంకట పరిస్థితుల్లో కలసికట్తుగా వుండాలన్న విచక్షణలేకుండా ఈ దేశంలో తాము ప్రత్యేకం, ప్రజలతో తమకు సంబంధంలేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

కొన్ని నెలల వెనక్కు తిరిగిచూస్తే, వాక్సిన్ తయారయిందనగానే దానిపై లేనిపోని అనుమానాలు రేకెత్తించారు. వాక్సిన్ తయారుచేసిన శాస్త్రవేత్తలను, కంపెనీని బోనులో నిలిపేరు. అవమానాలపాలు చేశారు. ఒక పద్ధతి ప్రకారం వాక్సిన్‌లు ఇస్తూంటే అందరికీ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లాజిస్టిక్స్ అన్న పదం తెలియనివారిలా ప్రవర్తించారు. 130 కోట్లమంది ప్రజలందరికీ ఒక్కసారి వాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయిస్తే ఏమవుతుందో ఊహించటం సులభం. అదే జరుగుతోందిప్పుడు. అందరికీ వాక్సిన్ ఇవ్వాలని గోల చేసిన వారంతా, వాక్సిన్ పద్ధతి ప్రకారం ఇస్తూంటే అదేదో అన్యాయం చేస్తున్నట్టు వ్యాఖ్యానించినవారంతా ఇప్పుడు చేతులెత్తేశారు. పద్ధతిపోయి అయోమయం నెలకొంది. ఇదొక్కటే కాదు, ప్రతి విషయంలోనూ ఇలాగే ఆందోళన జీవుల్లా ప్రవర్తిస్తూ, గోడలు విరగ్గొట్టి, నిరాశ్రయులను చేయటం తప్ప, నీడ గురించి ఆలోచించటం తెలియనివారిలా ప్రవర్తిస్తూ పరిస్థితిని జటిలం చేస్తున్నారు. ఒకవ్యక్తిపై అసహనం వల్ల సమాజ నాశనం, స్వీయ హననానికయినా సిద్ధపడుతున్నారు. ఇది శోచనీయమైన విషయం. ప్రజాస్వామ్యమంటే అధికులు ఆమోదంపొందిన వ్యక్తి అధికారానికి రావటం. తాము వ్యతిరేకించారు కాబట్టి తమ ప్రధాని కాదన్నట్టు వ్యవహరించటం, పాలనకు అడ్డుపడటం, వ్యతిరేకించటం తప్ప ఆలోచించటం తెలియని మేధావుల్లా ప్రవర్తించటం , అవసరమయితే అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు తీసేందుకయినా వెనుకాడకపోవటం చూస్తూంటే, మనకు బయట వేరే శత్రువు అవసరంలేదనిపిస్తుంది.

ఇది అత్యంత బాధాకరమయిన విషయం. ఒక దేశ ప్రజ వ్యక్తిత్వం సుఖ సమయంలో కాదు, విపత్తుల్లోనే ప్రస్ఫుటమవుతుంది. కష్ట సమయంలో అందరూ ఒకటై నిలబడి కష్టాన్ని గటెక్కించాలి. ఆతరువాత నేరారోపణలు, దోషాల గురించి ఆలోచించవచ్చు. కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచంలోని ఇతర దేశాల్లో ప్రతిపక్షాలు, మేధావుల ప్రవర్తనను మనదేశంలో ప్రతిపక్షాలు, మేధావుల ప్రవర్తనతో పోలిస్తే, బాధ్యాతా రాహిత్యము, మూర్ఖత్వము , అనౌచిత్యము, అపహాస్యము, విచ్చిన్నకరమూ, వినాశకారకమూ మనవారి ప్రవర్తన అని అర్ధమవుతుంది. కరోనా కన్నా అతి భయంకరమయిన వ్యాధి మనదేశాన్ని పట్టిపీడిస్తున్నదని అర్ధమవుతుంది. కరోనాకు వాక్సీన్ వుంది. మాస్క్, సానిటైజేషన్, సోషల్ డిస్తాన్స్ ద్వారా కరోనాను కట్టడిచేయవచ్చు. కానీ, దేశం నరనరానా వ్యాపించివున్న ఈ వ్యాధికి మందులేదు. అత్యంత భయానకమయిన పరిస్థితి ఇది. వీరి ఈ విచక్షణ రహిత ప్రవర్తనవల్ల వీరి లక్ష్యమే దెబ్బతింటోందన్న నిజం ఇన్నేళ్ళయినా ఈ ఆందోళనజీవులు గ్రహించటంలేదు. వీరెంత గుడ్డి వ్యతిరేకత కనబరిస్తే, ప్రజలలో అంత అంధభక్తి పెరుగుతోందన్న నిజం వీరు గ్రహించటంలేదు. నిజంగా ఆ వ్యక్తిని గద్దె దింపాలన్న తపన వీరికేవుంటే, ఇలా ఆందోళనలు, అనుచిత ప్రవర్తనలు కాదు, అతనికి ప్రత్యామ్నాయం చూపాలి. అతనికన్నా సమర్ధవంతంగా ప్రజలలో విశ్వాసాన్ని రగిలించే నాయకుడిని నిలపాలి. ఇందుకు భిన్నంగా రాజీనామా చేయాలని గోలచేయటంవల్ల వారు అపహాస్యమవటమేకాదు, ప్రజల విశ్వాసాన్నీ కోల్పోతూ అభాసుపాలవుతున్నారీ ఆందోళనజీవులు. ముందు కరోనా గండమ్నుంచి గట్టెక్కే ఆలోచనలు చేయాలి. తరువాత రాజీనామాలూ ఇతరాలు. వీరి ఈ డిమాండ్ ఈ ఆందోళన అంతా రాజకీయమే తప్ప దేశ దుస్థితిపత్ల ఆందోళన, ఆవేదనకాదన్న చేదునిజాన్ని స్పష్టంచేస్తోంది. ప్రస్తుతం మనచుట్టూ జరుగుతున్నది చూస్తూంటే కరోనా వల్లకాదు, తమను తాము తెలివైనవారిగా భావించుకుంటూ, ఒక్క వ్యక్తి పైని ద్వేషంవల్ల గుడ్డివారయి విచక్షణ కోల్పోతున్న వారంటేనే ఎక్కువ భయంవేస్తున్నది. కరోనాలాంటి విపత్తులు గతంలో బోలెడొచ్చాయి. భవిష్యత్తులో ఇంతకన్నా భయంకరమయిన విపత్తులు బోలెడొస్తాయి. కానీ అన్నిటినీ తట్టుకుని నిలబడతాడు మనిషి. సరయిన పరిజ్ఞానంలేని సమయంలోనే ప్రపంచమంతా మంచుమయమయినప్పుడే బ్రతికిబట్టకట్టిన మనిషికి ఈ విపత్తులొక లెక్కకాదు. అయితే అప్పుడు నాగరికతలేదు. నాగరీకుడయిన మనిషి మనిషికే శత్రువయ్యాడు.

ఈ సమయంలో సృజనాత్మక రచయితలు తమ కలాలకు పదునుపెట్టి, నిజానిజాలు వివరించి, ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. ఐకమత్యం ప్రాధాన్యాన్ని నేర్పాలి. ఎవరేది చెప్తే అదివిని, ప్రతీదాన్నీ నమ్మేసే అమాయకత్వనుంచి ప్రజలను విముక్తంచేయాలి తమ రచనలద్వారా. తమ రచనలతో ప్రజలకు భవిష్యత్తుపై ఆశనివ్వాలి. ఎలాంటి పరిస్థితినయినా తట్టుకునే స్థయిర్యాన్నివ్వాలి. ప్రజలకు విచక్షణను నేర్పాలి. అలాంటి రచనలను సంచిక ఆహ్వానిస్తోంది. త్వరలో ‘ఆందోళనజీవులు’ అనే వ్యంగ్య, విమర్శనాత్మక కథల సిరీస్‌ను ప్రారంభిస్తోంది. సంచిక ఆరంభించిన ఇతర శీర్షికల్లానే ఈ కథాసిరీస్ కూడా పాఠకులను ఆకర్షిస్తుందన్న నమ్మకం మాకుంది. ప్రపంచానికి పట్టిన కరోనా విపత్తు త్వరలోనే తొలగుతుందని, మళ్ళీ మంచిరోజులు వస్తాయని సంచిక ఆశిస్తోంది. వివేచనతో, విచక్షణతో ఈ దేశ ప్రజలు వ్యవహరించాలని కోరుకుంటోంది.

1 మే 2021 తేదీ సంచికలో అందిస్తున్న రచనల వివరాలు:

సంభాషణం:

  • డా. పత్రి వెంకట లక్ష్మీ నరసింహ ప్రసాద్ అంతరంగ ఆవిష్కరణ (మొదటి భాగం) – డా. కె.ఎల్.వి. ప్రసాద్

కాలమ్స్:

  • రంగుల హేల 38: సమయచోరులు – అల్లూరి గౌరిలక్ష్మి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక-మే 2021- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -14 – ఆర్. లక్ష్మి

కథలు:

  • జై కిసాన్ – కొండూరి కాశీవిశ్వేశ్వరరావు
  • పదార్థం అందని స్వార్థం – చావా శివకోటి
  • దారి – ఎన్. కె.  బాబు
  • మబ్బు తెలివి – గంగాధర్ వడ్లమన్నాటి

కవితలు:

  • రెండడుగుల ఎడం – శ్రీధర్ చౌడారపు
  • కొత్తగా ఇంకొన్ని – డా. కోగంటి విజయ్
  • ప్రేమ – Savvy
  • అమ్మ – కె. మనస్వి
  • నాయకుడి నటన – సాగర్ రెడ్డి

బాలసంచిక:

  • శాపం లేని జీవితం – కంచనపల్లి వేంకటకృష్ణారావు
  • చిట్టి చిలకమ్మా… – ఏ. అన్నపూర్ణ

అవీ ఇవీ:

  • దూర్వాస మహర్షి – అంబడిపూడి శ్యామసుందర రావు
  • ఆల్కాహాల్ కూడా ఒక మాదకద్రవ్యమే – శ్రీదేవి మురళీధర్

ఎప్పటిలానే ఈ సంచిక కూడా పాఠకులని ఆకట్టుకుందని ఆశిస్తూ…

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here