సంపాదకీయం అక్టోబరు 2020

3
6

కొత్త నెలలో కొత్త శీర్షికలు

[dropcap]క[/dropcap]రోనాతో సహవాసం ఆరునెలలు దాటిపోయింది. కరోనా పోలేదు కానీ కరోనా అంటే భయం పోయింది. జాగ్రత్తలు పాటించేవారు పాటిస్తున్నారు. లేనివారు లేదు. ఆయుష్షు తీరినవారు జాగ్రత్తలు పాటించినా కరోనా వేటుకు గురవుతున్నారు. లేనివారు ఎంత అజాగ్రత్తగా వున్నా కరోనా వారి జోలికి రావటంలేదు. జీవితంలోని అనూహ్యతా లక్షణం, అభద్రతాభావం కరోనా కాలంలో మరింత స్పష్టంగా బోధపడుతున్నాయి. కరోనా కాలం లోని ఈ అభద్రతాభావం, అనూహ్యమయిన జీవితంలోని అంశం  కేంద్రబిందువు గా రచించినకథ  ఈ సంచికలో ప్రచురితమవుతున్న డాక్టర్ చిత్తర్వు మధు రచించిన కథ ‘విజేత’. కరోనా ఆధారంగా వచ్చిన కథలన్నిటిలోకీ విశిష్టము, విభిన్నము అయిన కథ ఇది. నిజానికి కథ కాస్త పెసిమిజంతో ముగించినట్టనిపించినా ప్రాక్టికల్‌గా నిజాన్ని నిక్కచ్చిగా ప్రదర్శించిన కథ ఇది. మనిషికి ప్రాణభయాన్ని మించిన భయం, ప్రాణాన్ని మించి విలువయినదీ ఏదీ లేదని ప్రదర్శించిన కథ ఇది. చిత్తర్వు మధు రాసిన సైన్స్ ఫిక్షనేతర కథల్లోకెల్లా విశిష్టమయిన కథ ఇది. సంచిక పాఠకులు ఈ కథను ప్రత్యేకంగా చదవాలని మనవి. కథలో రచయిత మానవ మనస్తత్వాన్ని, సామాజిక మనస్తత్వాన్ని, విధి అనూహ్యలక్షణాన్నీ ప్రదర్శించిన విధానాన్ని గమనించండి. తెలుగు పాఠకులను తెలుగు సాహిత్యంవైపు ఆకర్షించాలనే ప్రయత్నంలో భాగంగా విభిన్నము, విశిష్టము అయిన కథలను అందించాలని సంచిక చేస్తున్న ప్రయత్నంలో భాగం ఈ కథ.

ఈ ప్రయత్నంలో భాగమే సంచిక ప్రతి నెల ఒకటవ తేదీ సంచికలో ప్రచురించే సైన్స్ ఫిక్షన్ కథ. ప్రతి నెల ప్రచురితమయ్యే సైన్స్ ఫిక్షన్ కథ తెలుగు పాఠకులకు సైన్స్ ఫిక్షన్ లోని విభిన్నమయిన కథా రచన ప్రక్రియలను పరిచయం చేస్తుంది. సైన్స్ ఫిక్షన్ కథలు పాఠకులకు వైజ్ఞానిక అంశాలను చేరువ చేయటంతో పాటూ భవిష్యత్తుని సూచ్యప్రాయంగా ప్రదర్శించి భవిష్యత్తును ఎదుర్కునేందుకు మానసికంగా సంసిద్ధం చేస్తాయి. తెలుగులో సైన్స్ ఫిక్షన్ కథలు రాయటంలో ఇబ్బంది ఏమిటంటే, పాఠకులకు సైన్స్ అంశాలను వివరించాల్సి వుంటుంది. ఈ వివరణ మరీ ఎక్కువయితే పాఠకులు కథ చదవలేక పోవచ్చు. కాబట్టి, కథారచయిత అటు పాఠకులకు పరిచయంలేని వైజ్ఞానికాంశాలను వివరిస్తూ, ఇటు కథను ఆసక్తికరంగా చెప్పాల్సివుంటుంది. అందుకే తెలుగులో సైన్స్ ఫిక్షన్ కథలు రాసేందుకు రచయితలు అంతగా ఉత్సాహం చూపరు. విమర్శకులయితే ఇలాంటి కథలను కథలుగా పరిగణించరు. వారికి విదేశీ కథలు అర్థమవుతాయి. ఎందుకంటే వాటి గురించి బోలెడన్ని విశ్లేషణలుంటాయి. అవి చదివి వాటిని తమ తెలివిగా ప్రచురించుకుంటారు. కానీ, తెలుగు సైన్స్ ఫిక్షన్ చదివి రాయాలంటే వీరికి అంత శక్తి వుండదు. అవగాహన, ఆలోచనలు వుండవు. అందుకే, ఈ సైన్స్ ఫిక్షన్ కథలపై పాఠకులే స్పందించాలి. ఈ కథలపైన వ్యక్త పరిచే అభిప్రాయాలకు, సందేహాలకు రచయితలు స్పందిస్తారు. సమాధానాలిస్తారు. పాఠకుల స్పందన కలిగించే ఉత్సాహంలో మరింతమంది రచయితలు సైన్స్ ఫిక్షన్ రచనలకు ఉద్యమించాలి. విభిన్న ప్రక్రియలలో రచనలు అందించేందుకు సంచిక సిద్ధంగా వుంది. ఆదరించే పాఠకులను ఆహ్వానిస్తోంది.

ఇంకా అలరించే కథలు, కవితలు, శీర్షికలు, వ్యాసాలతో సంచిక పాఠకులను అలరించాలని ప్రయత్నిస్తోంది.

పాఠకుల ఆదరణ పొందిన ఒక శీర్షిక అయిపోతూంటే దాని స్థానంలో అంతకన్నా ఎక్కువగా పాఠకాదరణ పొందే శీర్షికను అందించాలని సంచిక ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా, ‘నీలమత పురాణం’ ధారావాహిక తరువాత, ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని అందిస్తోంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ ప్రాంతానికీ లేని విధంగా కాశ్మీరుకు ఆవిర్భావం నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా చరిత్ర లభిస్తోంది. కశ్మీరు కవులు భవిష్యత్ దర్శనం చేసినట్టు, భవిష్యత్తులో ఈ భూభాగం అస్తిత్వం ప్రశ్నార్ధకమవుతుందని ఊహించినట్టు, మొత్తం కశ్మీరు చరిత్రను అక్షరబద్ధం చేశారు. కల్హణుడు అసంపూర్ణంగా వదలిన రచనను జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కొనసాగించారు. వీరి స్ఫూర్తితో పెర్శియన్ కవులు కూడా కశ్మీరులో సుల్తానుల పాలన చరిత్రను అక్షరబద్ధం చేశారు. ఇదే స్ఫూర్తి ఢిల్లీ పాలకులు, ఫరిష్తా వంటివారు అనుసరించారు. అంటే చారిత్రిక స్పృహలేనివారు భారతీయులు అని విదేశీయులు సృష్టించిన అపోహ సత్యదూరమని కశ్మీరీయులు నిరూపిస్తున్నారన్నమాట. రాజతరంగిణి రచనల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఈనాడు ఎంతోవుంది. కశ్మీరును ఒక ఇస్లాం రాజ్యంగా భావిస్తూ, ప్రచారం చేస్తున్న సమయంలో కశ్మీరు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్యమయిన అంగమనీ నిరూపిస్తుంది రాజతరంగిణి. అదీగాక, ఇస్లామీయులు భారతదేశంలో ప్రవేశించి అకాండతాండవం చేస్తున్నప్పుడు ఆనాటి సామాజిక పరిస్థితులను వివరిస్తూ, ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాయీ రాజతరంగిణి కథలు. చరిత్రలో మనకు ఇస్లామీయుల రచనలు, లేక విదేశీయుల రచనలు లభిస్తాయి కానీ, ఆ కాలం గురించి లభ్యమయ్యే భారతీయుల గ్రంథం ఇదే. ఇంతవరకూ ఇది తెలుగు పాఠకులకు పరిచయం కాకపోవటం ఒక దురదృష్టం. ఆ భాగ్యాన్ని మాకు అందించిన సరస్వతీమాతకు ప్రణామాలు అర్పిస్తూ ఆ రాజతరంగిణి అనువాదాన్ని అందించటంద్వారా, సామాజిక బాధ్యతను నెరవేర్చటమే కాదు, సాహిత్యపరంగానూ, తెలుగు పాఠకులకు ఉన్నతమయిన రచనను పరిచయం చేస్తున్నామన్న విశ్వాసంతో ఈ కొత్త శీర్షికను అక్టోబర్ 11వ తారీఖు సంచిక నుంచీ ప్రారంభిస్తున్నాము. కశ్మీరు గురించి అనేక వివరాలందిస్తూ, ఆలోచనలను రేకెత్తింపచేసే ఈ శీర్షిక నీలమతపురాణాన్ని మించి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

ఇతర పత్రికలలో లభించే రచనలు సంచికలోనూ వుంటాయి. కానీ, సంచికలో ప్రచురితమయ్యే రచనలు సంచికకే ప్రత్యేకం.

ఈ సంచికలో అందిస్తున్న రచనల పూలమాలలోని విభిన్నమయిన వర్ణాల పూల వివరాలు:

కాలమ్:

  • రంగుల హేల 31: వాదోపవాదాల వాగ్ధూళి – అల్లూరి గౌరిలక్ష్మి

గళ్ళ నుడికట్టు:

  • పదప్రహేళిక -10- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -7 – ఆర్. లక్ష్మి

కథలు:

  • విరుగుడు – కస్తూరి మురళీకృష్ణ
  • విజేత – డా. మధు చిత్తర్వు
  • యథాస్థితి – పినిశెట్టి శ్రీనివాసరావు
  • అపరాధం – ఎం. కె. కుమార్
  • ఐ లవ్ యూ బావా – శింగరాజు శ్రీనివాసరావు

కవితలు:

  • దుఃఖం – కాలం – శ్రీధర్ చౌడారపు
  • బాపూ మీ సిగ్గు గమనిస్తున్నాం… – గుండాన జోగారావు
  • కరోనా యోగం – పెద్దాడ సత్యప్రసాద్
  • నేను నేనుగా లేనే!? – యలమర్తి అనూరాధ
  • సవారి కచ్రం – అల్లాడి శ్రీనివాస్

సంభాషణం:

  • ఆర్. జె. హాస్య అంతరంగ ఆవిష్కరణ – సాధన

భక్తి:

  • సరస్వతి నమస్తుభ్యం – డా. జొన్నలగడ్డ మార్కండేయులు

బాలసంచిక:

  • మంచి చేస్తేనే – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • కంటి చూపుకు హాని చేసే కొన్ని అలవాట్లు – అంబడిపూడి శ్యామసుందరరావు
  • ఇంటింటి పలకరింపుల ఆప్తుడు ఈ బాలుడు – ఏ. అన్నపూర్ణ
  • దివ్యాంగ ధీరులు -7 – డా. గురజాడ శోభా పేరిందేవి
  • భారతదేశానికి సేవలందించిన ఐరిష్ మహిళ శ్రీమతి అనీబెసెంట్ – పుట్టి నాగలక్ష్మి
  • బాలుడు – దేవుడు – చందలూరి నారాయణరావు

మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు రచనలతో సంచికను మరింత ఆకర్షణీయం చేసే వీలును కల్పిస్తారని ఆశిస్తూ…

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here