ఏడురాళ్ల ముక్కుపుడక

0
8

[dropcap]”నా[/dropcap] పక్కన నువ్వు లేకుండా నాకు సన్మానమేంటి రాధా? నువ్వు కూడా వస్తే నలుగురిలోనూ నిండుగా ఉంటుంది కదా! చక్కగా పట్టుచీర కట్టుకుని రాకూడదూ…?” రిటైర్మెంటు తీసుకుంటున్న మాధవ రావుకి ఆరోజు ఆఫీసులో జరిగే వీడ్కోలు కార్యక్రమానికి భార్య రాధను కూడా తనతో రమ్మని బ్రతిమాలుతున్నాడు.

పెరట్లో పూసిన మల్లెలు చేతి మాల అల్లి సిగ చుట్టూ తిప్పి అందంగా అలంకరించుకుంటున్న రాధ, భర్త వంక చూసి చిరునవ్వు నవ్వింది.

“వాళ్లకు రేపట్నుంచీ మీతో పనిలేదు… ఘనంగా వీడ్కోలు పలికి, చేతులు దులిపేసుకుంటారు. ఇంటికి వచ్చేసరికి మీకు దిష్టి తియ్యడానికైనా నేనుండక్కర్లా? పట్టు చీర విప్పి పక్కన పడేసినట్టు, ఆ సన్మానంలో వేసిన దండలు కూడా ఇంటికి రాగానే తీసి పక్కన పెట్టేస్తారు. ఈరోజు సంతోషంగానే గడుస్తుంది. రేపట్నుంచీ దిగులు మొదలవుతుంది. పెరుగుతున్న వయసు, విశ్రాంతి అవసరం అని హెచ్చరిస్తుంటే ఆర్భాటంగా ఈ కార్యక్రమాలు దేనికీ? విధుల నుంచి నిష్క్రమిస్తున్నoదుకా?” భర్తకిష్టమైన పాలకోవా తయారు చేయడానికి సిద్ధం చేసుకున్న ముద్దను, మెత్తదనం కోసం పీట చెక్కమీద వేసి నూరుతూ చెబుతోంది రాధ.

“అబ్బా! నీతో నేను వాదించలేను కానీ, టైమవుతోంది… మరిక నేను వెళ్ళాలి” కండువా తీసి భుజం మీద వేస్కుని, ముందు గదిలో తలుపు వెనక కింది అల్మారాలో దాచి ఉంచిన కొత్త చెప్పుల జత తీసి కాలికి తొడుక్కుంటూ చెప్పాడు మాధవరావు.

తెల్లని లాల్చీ, నాలుగు వేళ్ళ వెడల్పున్న ఆకుపచ్చా, ఎఱ్ఱని జరీ బోర్డరున్న ఎం.ల్.ఏ. పంచెలో హుందాగా, కొత్త పెళ్ళికొడుకులా ఉన్న భర్తను చూసి మురిసిపోయింది రాధ.

కళ్ళజోడు, వాచీ తెచ్చి చేతికి అందించి, భుజం మీదున్న కండువాను సర్ది, మరోసారి కళ్ళ నిండుగా తృప్తిగా భర్తను చూసుకుని, చిరునవ్వుతో సాగనంపింది రాధ.

***

పెళ్లయి ముప్పై నాలుగు సంవత్సరాలు కావస్తోంది. ఇన్నేళ్లలో రాధ తనను విడిచి ఒక్కనాడు కూడా ఉన్నది లేదు. చిటికెనవేలు పట్టుకుని సప్తపదిలో తన అడుగుతో జత కలిసిన ఆమె, తన ఇంట్లో అడుగు పెట్టిన వేళా విశేషం… మాధవరావుకి ప్రమోషను వచ్చింది. ఆమె వచ్చిన దగ్గర్నుంచీ అన్నిటా కలిసొచ్చినా, పిల్లలు కలిగే అదృష్టం మాత్రం లేకపోవడంతో దంపతులిద్దరూ చాలా కాలం క్రుంగిపోయారు.

మాధవరావు ఆలోచనలు ముప్పయి సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి.

“రాధా! మనకి పిల్లలు పుట్టే అవకాశం ఎలాగూ లేదు. ఎవరినైనా దత్తత తీసుకుందామా?” తన మనసులోని మాట చెప్పి, సమాధానం కోసం ఆమె ముఖంలోకి చూసాడు మాధవరావు.

“ప్రతీ జన్మకీ ఏదో ఒక సార్థకత ఉంటుంది. మనకి పిల్లలు కలగకపోతేనేం? అనాథ పిల్లలకి ఆశ్రయం కల్పిస్తున్న ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతీ నెలా మీ సంపాదనలో నాలుగో వంతు అలాంటి ఆశ్రమాలకి కేటాయించండి. అప్పుడు ఒకరిని కాదు, ఆశ్రమంలోని పిల్లలందర్నీ మనం దత్తత తీసుకున్నట్టే అవుతుంది.” దృఢంగా చెప్పింది రాధ.

ఆరోజునుంచీ ఆమె కోరిక మేరకు, తన సంపాదనలో నాలుగో వంతు ప్రతినెలా అనాథాశ్రమానికి అందజేసేవాడు మాధవరావు.

“సార్! మీరు చెప్పిన కమ్యూనిటీ హాలు ఇదే. ఆటో ఆపమంటారా?” అన్న డ్రైవర్ మాటలతో ఈలోకంలోకి వచ్చిపడ్డాడు.

ఒక్కొక్కరూ నిండు మనసుతో విషెస్ చెబుతూ మాధవరావు చేతిలో బొకేలు ఉంచుతున్నారు. భారంగా ముందుకి కదిలి, కలకళలాడుతున్న హాలు ఆవరణ అంతా చుట్టూ పరికించి చూసాడు. పక్కన రాధ లేకపోవడం చాలా వెలితిగా అనిపించింది. పొడిపొడిగా నాలుగు ముక్కలు మాట్లాడి, అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని బయటపడ్డాడు.

***

కోటరులాంటి రాధ ముక్కుకి ముక్కెర చాలా అందంగా ఉంటుంది. కొనదేలిన ఆ ముక్కు చివరన దిష్టి చుక్కలాంటి నల్లపూసంత పుట్టుమచ్చ ఆమె ముఖానికి మరింత అందాన్ని తెచ్చింది.

కళకళలాడుతుండే ఆమె ముఖానికి ‘ఏడురాళ్ల ముక్కుపుడక’ మరింత శోభను తెస్తుందనిపించి, సన్మానం అయిపోగానే తిన్నగా మార్వాడీ షాపుకి వెళ్లి, ముచ్చటగా… మిల మిలా మెరుస్తున్న ఏడురాళ్ల ముక్కుపుడకనొకదాన్ని కొన్నాడు మాధవరావు.

తన రిటైర్మెంటు రోజున రాధకు బహుమతిగా ఆ ముక్కుపుడకనివ్వాలని గబ గబా ఇంటికి బయల్దేరాడు మాధవరావు.

గేటు తోసుకుని లోపలకు వస్తూ, తనకు సన్మానంలో వేసిన దండలూ, బొకేలూ చేతితో పట్టుకుని కొత్త పెళ్ళికొడుకులా ఉత్సాహంగా ముందుకి కదిలాడు.

వరండాలో స్తంభానికి జారబడి, అటు తిరిగి కూర్చుని, సన్నజాజి మొగ్గలు మాల కడుతోన్న రాధ తన రాకను గమనించినట్టు లేదు అనుకుంటూ… దగ్గరగా వెళ్లి ఆమె భుజం మీద చెయ్యి వేసాడు.

స్తంభానికి జారపడిన ఆమె శరీరం నెమ్మదిగా నేలకొరిగింది.

ఒక్క నిముషం… ఏం జరిగిందో అర్థం కాలేదు మాధవరావుకి.

ఆమె భుజాలు రెండూ పట్టుకుని, “రాధా!… రాధా!!” అంటూ గట్టిగా కుదపసాగాడు.

మూసుకున్న ఆమె కనులు అతనివంక చూడలేదు.

ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్న ఆమె ముఖంలో చిరునవ్వు చెరగలేదు.

తెరలు తెరలుగా అడ్డు వస్తున్న కన్నీటి ధారల్ని తుడుచుకుంటూ, రాధని పట్టుకుని గుండె పగిలేలా ఏడ్చాడు మాధవరావు.

“మాధవా! మంచినీళ్లు కూడా తాగకుండా ఇలా ఎంతసేపనిరా?” ఓదార్పుగా భుజం మీద చెయ్యివేశాడు రాఘవ.

సూర్యాస్తమయంతో ఆ ఇంట చీకట్లు నెలకొన్నాయి. ఆరిపోయిన ఆ ఇంటి దీపం ‘రాధ’ సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు మాధవరావు.

“జరగవలసిన కార్యక్రమం ఏర్పాట్లు చూడాలి… ఇలా కూర్చుంటే ఎలా?” లోగొంతుతో అన్నాడు రాఘవ.

“కార్యక్రమం జరిపించేందుకు ఏముందని?” చాలా నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు మాధవరావు.

శక్తినంతా కూడదీసుకుని లేచివెళ్లి, బెడ్రూమ్ అల్మారాలో రాధ చీర మడతల కింద దాచి ఉంచిన పేపర్లు తెచ్చి, రాఘవ చేతిలో ఉంచాడు.

“ఏమిట్రా ఇవి?” కవరులోని కాగితాలను తీసి, చదవడం మొదలుపెట్టాడు రాఘవ.

“అంటే… రాధ తన మరణానంతరం, తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చెయ్యమని ముందుగానే విల్లు రాసి పెట్టుకుందా?” చదువుతున్న రాఘవ చేతులు వణుకుతున్నాయి.

సుడులు తిరుగుతున్న కన్నీటిలో చిక్కుకున్న ఆలోచనలకు అడ్డుకట్ట వెయ్యలేదు మాధవ.

ఆ పేపర్లపై తాను కూడా సంతకం చేసి, మెడికల్ కాలేజీకి సమాచారమందించమని రాఘవని కోరాడు.

తెల్లారి నాలుగుగంటల వేళ… మరోసారి రాధ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు మాధవ.

చలనం లేని ఆమె, తన గుండె చప్పుళ్లకయినా ఉలిక్కిపడి లేస్తుందేమో అన్న పిచ్చి ఆలోచన.

స్వయంగా తానే ఆమె ముఖానికి పసుపు రాసి, రాధకి ఇష్టమయిన జవ్వాది పొడిని కలిపిన నీటితో ఆమెకు స్నానం చేయించి, ముత్తయిదువుగా అలంకరించాడు.

కడసారి ఆమెకు తిలకం దిద్దుతూ, దుఃఖం ఆపుకోలేక… గాజుల గలగలలతో ఇన్నాళ్లూ సందడి చేసిన ఆమె రెండు చేతుల్లోనూ ముఖాన్ని దాచుకుని, చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.

ఇంటిముందు వ్యాను వచ్చి ఆగింది. మెడికల్ కాలేజీ సిబ్బంది ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, రాధ పార్థివ దేహాన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి, వ్యానులోకి ఎక్కించారు.

ఆమెకు ఎంతో ఇష్టమైన క్రీమ్ కలర్, ఎర్రంచు పట్టు చీరతో అలంకరించి, సాగనంపాడు మాధవరావు.

***

“రాధ చనిపోయి నెల రోజులవుతోంది. ఇంకా ఈ ఇంట్లో ఎన్నాళ్లిలా మతి లేనివాడిలా ఒంటరిగా ఉంటావు? నా మాట విని మా ఇంటికి వచ్చెయ్యి మాధవా… లేదా ఏదైనా హోమ్‌లో చేరిపో” స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగాడు రాఘవ.

“రాధతో గడిపిన ఈ ఇల్లు వదిలి నేనెక్కడికీ రాలేనురా! నా చివరి క్షణం వరకూ ఈ ఇంట్లోనే ఉంటాను” చెంపలపై కారుతున్న కన్నీరు, గెడ్డం మీదుగా జారి కిందకి దూకుతుంటే నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ సమాధానమిచ్చాడు మాధవ.

“రేపు రాధ పుట్టినరోజు… ఒక్కసారి వెళ్లి తాను ఎలా ఉందో చూడాలనుందిరా” భారంగా అన్నాడు మాధవ.

“హు! ఈ మమకారాలు ఇలా కొనసాగకూడదనే అంతిమ సంస్కారాలు చేసేది. రాధ నిర్ణయం మేరకు ఆమె దేహాన్ని అప్పగించక తప్పలేదు. ఫార్మాలిన్ ద్రావణంలో నిల్వ ఉంచిన ఆమెను చూసి తట్టుకోలేవురా… అనుమతించరు కూడా” … నచ్చచెబుతూ నిట్టూర్చాడు రాఘవ.

“తనకోసం ఎంతో ప్రేమగా ఈ ఏడురాళ్ల ముక్కుపుడక చేయిస్తే… పెట్టుకోకుండానే వెళిపోయిందిరా! ఎలాగైనా ఒక్కసారి నా రాధ ముఖాన్ని చూడటానికైనా మెడికల్ కాలేజీ వారి అనుమతి తీసుకో.” చేతుల్లో ముఖం దాచుకుని, చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు మాధవ.

అతన్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు రాఘవకి. నెల నుంచీ, ఆరు నెలల లోపునే ఆమె దేహాన్ని అనాటమీ తరగతులకి వినియోగించేస్తారు. తరువాత కాలేజీ పరిసరాల్లోనే దహన సంస్కారం చేసేస్తారు. ఒకసారి బాడీని అప్పగించాక నలభై ఎనిమిది గంటల వరకే కుటుంబ సభ్యులు సందర్శించడానికి అనుమతిస్తారు.

ఇవన్నీ ఇప్పుడు మాధవకి వివరించే స్థితిలో లేడు. తప్పనిసరి అయి కాలేజీ యాజమాన్యం వారిని కలిసి పరిస్థితిని వివరించాడు రాఘవ.

అతి కష్టం మీద రాధను చూడడానికి అనుమతిని సంపాదించగలిగాడు.

రేపు ఉదయం రాధను చూడగలను అన్న సంతృప్తితో ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు మాధవ.

సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్నాడు.

ఆస్తమిస్తున్న చంద్రునితో తన మనసులోని బాధనంతా చెప్పుకుంటూ వరండాలో పడక్కుర్చీలో కూర్చున్నాడు.

“రాధే గోవిందా! రాధే గోవిందా!!

రాధా మాధవ… రాధే గోవిందా!!”

నగర సంకీర్తనకు వచ్చిన భక్తులు తన ఇంటిముందు నడుస్తూ కoజిరా, తాళాలు వాయిస్తూ… గొంతెత్తి లయబద్ధంగా పాడుతూ, లోకాన్ని నిద్రలేపుతున్నారు.

దూరమవుతున్న వారి సమూహంలో కలిసిపోయిన రాధ… వెనుదిరిగి మాధవను చూసి ప్రశాంతంగా నవ్వింది.

ఉద్వేగంతో ఆటువైపే చూస్తూ ఉండిపోయాడు మాధవ.

కనుమరుగవుతున్న ఆమె రూపాన్ని కళ్ళల్లో నిలుపుకోవాలని ఆరాటపడుతున్నాడు.

నిశ్శబ్దంలో తన గుండె చప్పుడు తనకే భారంగా వినపడుతోంది.

“మాధవా! ఎండెక్కిపోతోంది… మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కి వెళదామన్నావుగా… పద!” చెప్పాలని అక్కడికి వచ్చిన రాఘవ, చేష్టలుడిగి నిల్చుండిపోయాడు.

కుర్చీలో ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉన్న మాధవ చేతిలోని బాక్సు జారి కిందపడి… అందులోని ఏడురాళ్ల ముక్కుపుడకపై సూర్య కాంతి పడి, తళుక్కున మెరిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here