ఎదురు చూపులు

0
11

[శ్రీ టి.ఎస్.ఎస్. మూర్తి రచించిన ‘ఎదురు చూపులు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు వెళ్ళి పదిహేను నిమిషాలు కూర్చున్న తరువాత..

యజమాని: ఏమోయ్ ఆగమ రావూ, పని.. కాయా? పండా?

గుమాస్తా: ఏమో? ఆగమని అన్నారు గదండీ. గదిలో ఏసీ గూడా వేశారుగదండి. ఔనండి. పండనే అనుకోండి.

యజమాని: సమయాభావంలో భావం?

గుమస్తా: చిత్తం. అది వారి చిత్తం కదండి.

యజమాని: మనసులో మసలే మాట మనకి చెప్పేందుకు ఇంత జాప్యమెందుకు?

గుమస్తా: మరే.. ఆడపిల్లగదండీ..

యజమాని: ఐతే, గియితే.. కుదిరితే, ఇంకా ఆడ పిల్లా?

గుమాస్తా: అవును కదండి.

ఐదు నిమిషాల తరువాత..

వాళ్ళింట్లో ఎంచక్కా, చక్కటి కీర్తనలు వినిపిస్తున్నాయి. ఇంతలో “..సీతమ్మ చెప్పవమ్మా..” అంటూ మంగళంపల్లి వారు ఆలపించిన రామదాసు కీర్తన వినిపించింది.

యజమాని: వింటున్నావా ఆగమా?

గుమస్తా: అయ్యా, ఇంక హమ్మయ్యా అనుకోండయ్యా! తమరి మనసులో మాట రామయ్య పెడచెవిన పెట్టకుండా సీతమ్మ చెవిన వేసినట్టుందయ్య.

యజమాని: మరి.. స్థాయి..?

గుమస్తా: ఆయనకేమండి? గాత్రం హెచ్చు స్థాయే గదండి?

యజమాని: ఆగమా, భాషతో ఇంత ఆగమా? నేను అనేది వాళ్ళ స్థాయి, మన స్థాయి.

ఆ కీర్తన అయిపోయి, ‘తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు..’ అనే కీర్తన మొదలయింది.

యజమాని: ఆగమా, ఏమిటి ఈ హంగామా? చూడబోతే, మన మాటలకి తగ్గట్టు కీర్తనలేంటోయ్? యాదృచ్ఛికమా లేక అలెగ్జా లాంటి యాంత్రిక ప్రభావమా?

గుమస్తా: అయ్యో! ఎంత మాటండయ్యా? యంత్రాలకి తెలుగు అప్పుడే అబ్బిదంటారా? అబ్బే.. ‘అబ్బో’ అనేందుకు ఇంకా ఎన్ని తరాలో! ఇది భగవదేచ్ఛ అనే నా మనసులో గంట కొడుతోంది. మనం వచ్చి అరగంట అయింది. అదిగో గడియారం కూడ గంట కొట్టింది. ఇవే మంగళ వాయిద్యాలు అనుకుందాము.

యజమాని: అంతేనంటావా, ఆగమా?

మరో మూడు నిమిషాల తరువాత..

ఇంతలో, ‘ఏమి సేతురా లింగా..’ అంటూ మంగళంపల్లి వారి గాత్రం వినిపించింది.

గుమస్తా: అలా చూడకండయ్యా? అది కూడ మీ మనసులో భావమేగా?

యజమాని: సరేగానీ, ఈ యుగంలో కూడ ఎంతసేపు ఈ పడిగాపులు?

గుమస్తా: ఏ యుగమైనా యోగం ముఖ్యం గదండి. అయినా, ఇది ఒక్క చోటే కదండి ఇచ్చుకునే వాళ్ళు పుచ్చుకునే వాళ్ళ దగ్గర చూపులు, తరువాత ఎదురు చూపులు!

యజమాని: నిజం సుమ్మీ. కనేటప్పుడు ఎరుగము. కన్నకొద్దీ కనిపిస్తోంది కన్న ప్రేమ. ఎంతసేపు అయినా పరవా లేదు. వారు పండంటే పండగేగా!

ఇంకో మూడు నిమిషాల తరువాత..

అప్పుడు వినిపించింది, ‘తెర తీయరా తిరుపతి దేవర..’ అని, మరోసారి మంగళంపల్లి వారి గాత్రంలోనే.

తెర ప్రక్కకు తీసి, అబ్బాయి తలిదండ్రులు బయటకు వచ్చి, వారి అబ్బాయికి వీరి అమ్మాయి నచ్చిందని చెప్పారు. తెరలు తొలగి, ఆ చల్లని గదిలో ఈ తీయని కబురు వీనుల విందు చేసింది.

అరగంట తరువాత, వారు యజమాని ఇల్లు చేరాక..

గుమస్తా: అయ్యా, కతికితే అతకదని అక్కడ వద్దన్నారు. ఇప్పుడన్నా నోరు తీపి చేసుకుని.. ఆ పైన నాకు సెలవిస్తే..

యజమాని: ఎన్ని రోజులు?

గుమస్తా: చిత్తం, రెండు.

యజమాని: బ్రహ్మ గారిని వెంట బెట్టుకురా. ‘మీదు కట్టి, పెళ్ళి పనులు మొదలు పెట్టాలి’ … అంటున్నారు అమ్మ గారు … ఊ, ఆగమ రావూ, మళ్ళీ ఎప్పుడు వస్తావు?

గుమస్తా: చిత్తం. తమరు పనులు పురమాయించక మునుపే.

 ****** స్వస్తి ******

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here