ఎదురుగాలి

0
6

[box type=’note’ fontsize=’16’] “ఆదర్శ వివాహం వెనకాల అతను వేసుకున్న స్కెచ్” తెలిసిన ఆమె ఏం చేసింది, ఇంకో యువతి ఆ మోసగాడి బారిన పడకుండా ఏ చేసిందో అత్తలూరి విజయలక్ష్మిఎదురుగాలి“లో చెబుతారు. [/box]

[dropcap]మ[/dropcap]నస్వినికి శుభవార్త చెప్పడానికి మొబైల్ చేతిలోకి తీసుకోగానే ‘మనస్విని కాలింగ్’ అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఫోన్ మోగింది.

ప్రత్యూష పెదాల మీద చిరునవ్వు మెరిసింది. “నేనే కాల్ చేయాలని మొబైల్ తీసుకున్నా నీ ఫోన్ వచ్చింది.. చెప్పక్కా” అంది ఆప్యాయంగా.

 “ఏం చేస్తున్నావు.. అర్జెంటుగా నాకు ఫేషియల్ చేయాలి, హెయిర్ స్ట్రయిటన్ చేయాలి అరగంటలో వస్తా. నీ పనులన్నీ పక్కన పెట్టేయ్ ” అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది మనస్విని.

కట్ చేస్తున్న జాకెట్ బట్ట, కత్తెర పక్కన పెట్టి లేచి కిచెన్ లోకి వెళ్లి,  అటుకుల ఉప్మా కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తరిగి పెట్టుకుని హాల్లోకి వచ్చి డ్రెస్సర్ మీద క్లంజింగ్ మిల్క్, స్క్రబ్, వగైరా సామాగ్రి సిద్ధంగా పెట్టుకుంది.

మనస్విని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.. మనస్వినికి ఎప్పుడెప్పుడు ఆ వార్త చెప్పాలా అని ఎదురు చూస్తోంది ప్రత్యూష. ప్రత్యుషకి మనస్విని అంటే దేవతతో సమానం. ఇవాళ తను ఇలా స్వంత కాళ్ళ మీద నిలబడి ఉండడానికి మనస్వినే కారణం.

చిన్నప్పుడే తల్లి,తండ్రులను కోల్పోయిన ప్రత్యుషని విశాఖపట్నంలో ఉండే మేనమావ దంపతులు పెంచారు. పదో తరగతి అవగానే బాధ్యత వదిలించుకోడానికి పెళ్లి చేసారు. పెళ్ళికి ముందే అతనికి హార్ట్‌కి సంబంధించిన జబ్బు ఉంది కాని ఆ విషయం దాచి పెళ్లి చేసారు అటు వారు, ఇటు వారు కలిసి.

అత్తగారు, మావగారు సాధింపులు ఉన్నా భర్త మంచివాడు కావడంతో ఏడాదిపాటు సంసారం బాగానే సాగింది.. ఒక రోజు రాత్రి నిద్రలోనే మాసివ్ ఎటాక్ వచ్చి తెల్లారే సరికి కట్టేలా జీవం లేకుండా పడి ఉన్న భర్తను చూసి కొయ్యబారిపోయింది ప్రత్యూష.

అతని చావుకు కోడలే కారణం అని, ఆమె జాతకం మంచిది కాదని అనేక రకాలుగా నిందించి ఆమెని ఇంటినుంచి తరిమేశారు అత్త, మామలు.

పెంచిన మేనమావ శాస్త్రానికి పది రోజులు ఆమెని తన ఇంటికి తీసుకు వెళ్లి, తరవాత “నీ బాధ్యత చేతనైనంత వరకూ మోసాము, ఇంక మా వాల్ల కాదు ఏదన్నా మార్గం వెతుక్కో” అని నిర్మొహమాటంగా చెప్పేయడంతో దిక్కుతోచక క్రాస్‌రోడ్‌లో నిలబడిపోయింది. అప్పుడు అనుకోకుండా విశాఖ రైల్వే స్టేషన్‌లో పరిచయం అయింది మనస్విని.

హైదరాబాద్ డెల్ కంపనీలో పని చేస్తున్న మనస్విని వీకెండ్‌లో తల్లి,తండ్రులను కలుసుకోడానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ప్లాట్‌ఫారం బెంచ్ మీద శోకదేవతలా కూర్చున్న ప్రత్యూషని చూసి, విషయం తెలుసుకుని, ధైర్యం చెప్పి తనతో తీసుకొచ్చి, బ్యుటీషియన్ కోర్సులో చేర్పించింది. అలా నెమ్మదిగా తనకంటూ ఒక జీవితం నిర్మించుకున్న ప్రత్యూష స్వంతంగా పార్లర్ పెట్టుకుని ఆర్థికంగా, మానసికంగా నిలదొక్కుకుంది. అందుకే మనస్విని అంటే ప్రత్యూషకి ఎంతో అభిమానం.

అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్ ద్వారా ప్రత్యూష జీవితంలోకి వచ్చాడు యూఎస్‌లో ఉన్న విశాల్. చాలా తక్కువకాలంలో ఇద్దరి మధ్యా ప్రేమ అంకురించింది. “పది రోజుల్లో ఇండియా వస్తున్నాను, రాగానే పెళ్లి చేసుకుందాం.. ఆ తరవాత నాతో అమెరికా తీసుకువెళ్తాను.. నీ సర్టిఫికెట్లుతో సహా సిద్ధంగా ఉండు” అంటూ మెసేజ్ పెట్టాడు నిన్ననే. అప్పటినుంచి ప్రత్యూషకి ఆనందపు రెక్కలు వచ్చినట్టుగా అనిపించి ఊహలలో తేలిపోతోంది. ఇంతకాలం మనస్వినికి చెప్పకుండా దాచిన తన ప్రేమాయణం చెప్పేయాల్సిన సమయం వచ్చింది… అందుకే ఫోన్ చేసి రమ్మనాలి అనుకున్న మనస్విని తనంతట తానే వస్తోంటే హమ్మయ్య అనుకుంది.

ప్రత్యూష ఆలోచనల్లో ఉండగానే మనస్విని హాయ్ అంటూ వచ్చి డ్రెస్సర్ ఎదురుగా స్పా బెడ్ మీద కూర్చుంది.

 “ఏంటి సంగతి ఏదన్నా పార్టీ హడావుడా” అంది ప్రత్యూష కాటన్ తీసుకుని నీళ్ళల్లో తడిపి మనస్విని మొహం తుడుస్తూ.

 “చాలా ఇంపార్టెంట్ పార్టీ…” వెనక్కి వాలుతూ అంది.

అలా మాట్లాడుతూనే గోల్డ్ ఫేషియల్, హెయిర్ స్ట్రయిటనింగ్ చేసాక, పెడిక్యుర్, వాక్సింగ్ దాదాపు రెండున్నర గంటల సేపు తరవాత ఫ్రెష్‌గా లేచి బాత్రూం లోకి వెళ్ళింది మనస్విని. ప్రత్యూష చేతులు కడుక్కుని కిచెన్ లోకి వెళ్లి పది నిమిషాల్లో అటుకుల ఉప్మా చేసింది.

మనస్విని మాయిశ్చరైజేర్ తీసుకున్ చేతులకి, మొహానికి రాసుకుని ప్రత్యూష చేతిలో ప్లేట్ చూసి “రా, రా ఆకలి దంచేస్తోంది” అంది.

చిరునవ్వుతో ప్రత్యూష ప్లేట్ అందిస్తూ అంది. “ఇవాళ నీకో శుభవార్త చెప్పలక్కా” అంది.

చెప్పు, చెప్పు ఉత్సాహంగా ప్రత్యూష వైపు జరుపుకుంది కుర్చీ.

ప్రత్యూష ప్లేటులో ఉప్మా స్పూన్ తో అటూ, ఇటూ కలుపుతూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి         అంది “నేను చెప్పేది విన్నాక నీకు నా మీద కోపం వస్తుందేమో..”

 “ఎందుకు కోపం” ఆశ్చర్యంగా అడిగి అనుమానంగా చూస్తూ అంది మనస్విని “ఏంటి ఏదన్నా ప్రేమ వ్యవహారమా..    “

ప్రత్యూష మొహంలో సిగ్గు చుక్కలు పొడిచాయి.. ఆ వెలుగు కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే కళ్ళు పూర్తిగా వాల్చుకుంది.

మనస్విని ప్రత్యూష చేతి మీద చేయి వేసి ఆమె వైపు ఆదరంగా చూస్తూ “ఇందులో కోపం రావడానికి ఏముంది ప్రత్యూ.. నువ్వేం ముసలిదానివైపోయావా! పట్టుమని పాతికేళ్ళు లేవు..ప్రేమిస్తే తప్పమీ లేదు.. కానీ ఎవరిని ప్రేమించావో ఆ వ్యక్తీ ఎలాంటివాడో ముఖ్యం … చెప్పు నేను ఏదన్న సాయం చేయగలిగితే చేస్తాను” అంది.

అతనితో తనకి పరిచయం అయిన విధానం మొత్తం చెప్పి అంది ప్రత్యూష “చాలా మంచివాడక్కా.. నేను పరిచయం అయిన కొత్తలోనే నా గురించి మొత్తం చెప్పేసాను. అతను ఎప్పటినుంచో వాళ్ళ పెద్దవాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా నాలాంటి అమ్మాయి దొరికితే ఆదర్శ వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాట్ట. కుల, మత, జాతి భేదాలు లేకుండా ట్రెడిషనల్‌గా ఉండే మంచి అమ్మాయి కోసం చూస్తున్నాట్ట. పది రోజుల్లో ఇండియా వస్తున్నాడు.. రాగానే పెళ్లి చేసుకుందాం అన్నాడు.”

అంతా విన్న మనస్విని కొద్దిసేపు గంభీరంగా ఉండి అంది..” ఎన్.ఆర్.ఐ సంబంధం కదా అని చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నావేమో కదా..”

 “అవును… నేను ఎప్పుడూ నన్ను ఇలాంటి అదృష్టం వరిస్తుందని ఊహించలేదు.. అసలు పెళ్ళే చేసుకోవాలని అనుకోలేదు.. అలాంటిది అనూహ్యంగా ఇంతటి మహత్తర అవకాశం రావడం అదృష్టం కదా.. ఎప్పటికైనా నాకూ ఒక తోడు కావాలని అనిపిస్తుంది కాదక్కా.. అప్పుడు ఇంత మంచివాడు దొరకాలి కదా..”

“నువ్వు చెప్పేది నూటికి నూరు శాతం నిజం… కానీ, ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తిని గుడ్డిగా నమ్మడం అంటే మూర్ఖత్వం అవుతుందేమో ఆలోచించు ప్రత్యూషా! ముఖత పరిచయం అయి కొంతకాలం స్నేహంగా కలిసి ఉన్న వాళ్లనే నమ్మలేని రోజులు ఇవి.”

ప్రత్యూషకి మనస్విని అలా నెగటివ్‌గా మాట్లాడడం నచ్చలేదు.. తనని ప్రోత్సహించి ఉత్సాహ పరుస్తుందనుకుంది.. మనసారా దీవిస్తుంది అనుకుంది.. కానీ ఇలా మాట్లాడుతుందేమిటి? అసంతృప్తిగా చూసింది.

ఆమె చూపులో భావం గమనించిన మనస్విని ప్రేమగా నవ్వి అంది “ఏంటి ముప్ఫై ఐదేళ్ళు వచ్చి కూడా పెళ్లి, పెటాకులు లేని ఈవిడకి ప్రేమంటే ఏం తెలుసు అనుకుంటున్నావా… సరే నీకో కథ చెప్తా విని, నిర్ణయించుకో..”

అబ్బా ఈవిడ ఇప్పుడు విషాద గాథలు చెప్తుంది కాబోలు అనుకుంటూ ప్రత్యూష ఆసక్తి లేకున్నా మనస్విని బాధ పడుతుందని వినసాగింది.

“నాకు అప్పుడు ఇరవై ఏళ్ళు.. డిగ్రీ సెకండ్ ఇయర్.. మాది లోయర్ మిడిల్ క్లాసు ఫ్యామిలీ.. అక్క, అన్నయ్య, నేను, తమ్ముడు. అందరిని డిగ్రీ వరకూ చదివిస్తాను, ఉద్యోగాలు చేసుకుని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకండి అన్నారు మా ఫాదర్. అక్క అలాగే డిగ్రీ పాసై తన క్లాస్‌మేట్‌ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.

మాది కోఎడ్యుకేషన్. ప్రశాంత్ నా క్లాస్‌మేట్.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు తరచూ వస్తూ పోతుండేవాళ్ళం. ప్రశాంత్ అన్నయ్య హేమంత్ యూఎస్‌లో మంచి కంపెనీలో ఉండేవాడు. ఒకసారి సెలవులకి వచ్చాడు. అప్పుడు మా ఇద్దరికీ పరిచయం అయింది.. నాలోని అణకువ, అమాయకత్వం హేమంత్‌కి నచ్చాయని, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.. నేను సంభ్రమాశ్చార్యాల నుంచి తేరుకునేలోగానే అతను అమ్మా, నాన్నలతో మాట్లాడడం, వాళ్ళు ఒప్పుకోడం అంతా కలలోలాగా ఛకా, చకా జరిగిపోయింది.

ఏం జరుగుతుందో తెలిసేలోగా ఏడుకొండలవాడి సాక్షిగా హేమంత్ నా మెడలో మూడు ముళ్ళు వేయడం, అతని చేయి పట్టుకుని నేను అంతర్జాతీయ విమానాశ్రయానికి నడవడం, విమానం ఎక్కడం జరిగింది.

“నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? నేను అందగత్తెని కాను, డిగ్రీ కూడా పూర్తీ చేయలేదు, ఆస్తిపాస్తులు లేవు” అడిగాను విమానంలో అతని పక్కన కూర్చుని అతని అందానికి, హుందాతనానికి మురిసిపోతూ.

“అందుకే… నాకు అవన్నీ ఉన్నవాళ్ళు అవసరంలేదు.. ఎవరూ లేనివాళ్ళే కావాలి అనుకున్నాను. ఐ మీన్ ఆదర్శ వివాహం చేసుకోవాలి అనుకున్నాను. చేసుకున్నాను… అనవసర విషయాలు ఆలోచించి మనసు పాడు చేసుకోకు. బి హ్యాపీ. నువ్వు ఉండబోయేది అమెరికా.. తెలుసుగా అమెరికా అంటే.. ఎంతో మంది కలలు కనే స్వర్గం.. ఆ స్వర్గానికి నిన్ను తీసుకువెళ్తున్నా. అక్కడ నువ్వు గడపబోయే అందమైన జీవితం గురించి కలలు కను” అన్నాడు.

కాలిఫోర్నియా ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవగానే నా కళ్ళు చెదిరిపోయాయి. రెప్ప వాల్చడం మర్చిపోయినదానిలా, నడిస్తే నా పాదాలకున్న దుమ్ము ఎక్కడ నేలకి అంటుకుని మెరుపు కోల్పోతుందో, ఎక్కడ ముట్టుకుంటే నా చేతికున్న మట్టి తగిలి మచ్చలు పడుతుందో అన్నట్టు స్థాణువులా నిలబడిపోయాను.

“ఏంటి అలా నిలబడ్డావు.. కమాన్ మూవ్” అన్నాడు అతను పెద్ద, పెద్ద సూట్ కేసులు లాగుతూ.

ఉలిక్కిపడి అతి నెమ్మదిగా అడుగు వేసాను.

స్కిన్ టైట్ గ్రే కలర్ స్కర్ట్, వైట్ షర్టు, వేసుకుని జుట్టు భుజం మీద పడుతోంటే నవ్వుతూ డ్రైవింగ్ సిటులోంచి లేచి వచ్చిన ఒక అమెరికన్ అమ్మాయి హేమంత్‌ని కౌగలించుకుని “హాయ్” అంది. హేమంత్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని “హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యూ” అన్నాడు.

నా వైపు చూసి “షి ఈజ్ ఇసాబెల్లా” అన్నాడు హేమంత్.

ఎవరీమె నేను ఆలోచిస్తుండగానే ఇసాబెల్లా అతనికి సాయం చేస్తే ఇద్దరూ కలిసి సూట్ కేసులన్ని కారు డిక్కీలో పెట్టారు.

“కూర్చో” అన్నాడు ఇసాబెల్లా పక్కన పాసెంజర్ సీటులో కూర్చుంటూ. ఇసాబెల్లా డ్రైవింగ్ చేసింది.

ముప్పావుగంట తరవాత కారు అతి ప్రశాంతంగా ఉన్న ఒక కాలనీలో ఆగడం, గరాజు డోర్ దానంతట అది తెరుచుకోవడం కారు పెద్ద గరాజులోకి సునాయాసంగా వెళ్ళిపోవడం విస్మయంగా చూస్తూ ఉండిపోయాను.

“కమాన్” అంటూ ఇసాబెల్లా నా చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది.

సూట్‌కేసులు లోపలికి తెచ్చి “ఇలా రా నీకు నీ రూమ్ చూపిస్తాను” అంటూ హేమంత్ నన్ను పైకి తీసుకు వెళ్ళాడు..

ఎక్కడ చూసినా నేలంతా కార్పెట్. వంట గది అంటూ వేరుగా లేదు.. ఫ్యామిలీ రూమ్‌తో బాటే ఓ పక్క ఎల్ షేపులో ప్లాట్‌ఫారం, గ్రానైట్‌తో కలిసిపోయిన స్టవ్.. పెద్ద ఫ్రిడ్జ్ .. మరో పక్క సింక్.. ఓ పక్క పాంట్రీ, ఓ పక్క డైనింగ్ ఏరియా..

ఆ ప్రదేశం వదిలేస్తే మిగతా చోట అంతా కార్పెట్.. పైకి తీసుకువెళ్ళి ఒక రూమ్ చూపించి “ఇది నీ రూమ్” అన్నాడు.

“నా రూమా..” ఆశ్చర్యంగా చూసేలోగా అతను కిందికి వెళ్ళడానికి మెట్లు దిగుతున్నాడు. నేను లోపలికి వెళ్ళాను. మెత్తటి కార్పెట్… డబుల్ కాట్ … ఒక డ్రెస్సర్.. బాత్రూమ్.

 “నా రూమ్ అంటాడేంటి ఇద్దరిది ఒకటి కాదా.. ఈ దేశంలో అందరికి తలా ఒక రూమ్ ఉంటుందేమో” ఆలోచిస్తూ నిలబడిపోయాను.          ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఆ ప్రశాంతత, అద్దాల్లోంచి కనిపిస్తున్న బాక్‌యార్డ్‌లో ఉన్న మొక్కలు, విశాలమైన ఆకాశం, మేఘాలను ఒరుసుకుంటూ వెళ్తూ నిప్పు రవ్వలు రాలుస్తున్నట్టున్న విమానాలు చూస్తుంటే నేనో వింత ప్రపంచంలోకి వచ్చి పడినట్టు అనిపించసాగింది.

అతి సాధారణంగా బతుకుతున్న నన్ను ఏదో అదృశ్య హస్తం హటాత్తుగా ఎక్కడో విసిరేసింది.. ఇది ఏంటి? ఇంత పెద్ద ఇల్లు, ఈ అందమైన లాన్, పెద్ద పడవ లాంటి కారు, ఏ.సి…. ప్రత్యేకమైన గది.. ఇది కలా!… ఈ ఇంట్లో అద్దాల కిటికీ దగ్గర నిలబడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నది నేనేనా!

నేను రెడీ అయి వచ్చేసరికి హేమంత్, ఇసాబెల్లా డైనింగ్ టేబుల్ దగ్గర పక్క, పక్క కుర్చీల్లో కూర్చుని, నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ శాండ్‌విచేస్ తింటున్నారు.

నన్ను చూసిన ఇసాబెల్లా హాయ్ అంటూ “యు లైక్ శాండ్ విచేస్” అనడిగింది.

నేను హేమంత్ వైపు చూసాను.

“నాన్ వెజ్ తింటావా” అడిగాడు. లేదన్నట్టు తలూపాను.. “అయితే అదిగో బ్రెడ్.. అక్కడే టోస్టర్ ఉంది… ఫ్రిడ్జ్‌లో బట్టర్ ఉంది.. “

నేను బ్రెడ్ టోస్ట్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కుర్చీలో కూర్చున్నాను. నేనలా కూర్చోగానే ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆ చూపులో భావం అర్థం కాలేదు.

టోస్ట్ తింటూ అడిగాను హేమంత్‌ని “ఈవిడ మనింట్లోనే ఉంటుందా.. వంట మనిషా…”

హేమంత్ ఆశ్చర్యంగా ఆమెని చూసాడు. “ఆవిడ వంట మనిషిలా కనిపిస్తోందా నీకు?”

ఆ స్వరంలోని సీరియస్‌నెస్‌కి కొంచెం బెదురుతూ “సారీ” అన్నాను.

కానీ త్వరలోనే తెలిసింది ఆమె వంటమనిషి కాదు, ఇంటిమనిషి అని. అతను తన నోటితో తనే చెప్పాడు.

ఆరోజు శనివారం. నిద్ర లేచాక కాని హేమంత్ రాత్రి రాలేదని తెలియలేదు. గబుక్కున మంచం దిగి గదిలోంచి బయటకి వచ్చాను. అంతా నిశ్శబ్దం. భయం వేసింది.. కిందికి దిగి వెళ్ళాను. ఎక్కడా అతను వచ్చిన జాడ లేదు.

లోపలినుంచి గరాజ్ లోకి వెళ్ళే డోర్ తీసి చూసాను. కారు లేదు.. అంటే రాత్రి రాలేదనమాట.. ఎందుకు రాలేదో.. ఎక్కడికి వెళ్లి ఉంటాడు.. ఎవరిని అడగాలి.. ఏమని అడగాలి? అసలు ఎవరున్నారని చుట్టుపక్కల.. ఇంతవరకు నేను గడప దాటి బయటికి వెళ్ళలేదు ఆ రోజు వచ్చాక.

కాఫీ కలుపుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, తాగుతూ అద్దాల్లోంచి బ్యాక్‌యార్డ్ అందాలు చూస్తూ కూర్చున్నాను. స్క్రిమ్ప్లేర్స్ వాటి దారిన అవే టైం ప్రకారం ఆన్ అవుతాయి. జల్లులు, జల్లులుగా గడ్డిని తడుపుతున్న నీటి ధారలు చూస్తూ ఆలోచిస్తుంటే ఏదో భయం ఒళ్ళంతా పాకుతున్నట్టుగా అనిపించింది. ఇతనికి ఏం కాలేదు కదా.. ఆ రోజంతా కళ్ళు గుమ్మానికి అతికించి ఎదురు చూసాను.. ఆ రోజు, మర్నాడు, రెండు, మూడు, నాలుగు, వారం పదిరోజులు గడిచాయి. భయం, నిస్సహాయత, దుఃఖం… అనేక భావాలు నన్ను అస్థిమితం చేశాయి..

బయటకి వెళ్లి చూడాలంటే ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. “ సెక్యురిటీ లాక్ ఉంటుంది.. నేను డోర్ తీసిందాక నువ్వు బయటకి వెళ్ళద్దు.. నువ్వు డోర్ టచ్ చేస్తే అలారం మోగుతుంది.. కాప్స్ వచ్చేస్తారు..” అని అతను ముందే హెచ్చరించాడు. జీవచ్ఛవంలా కూర్చున్నాను రాత్రి, పగలు.

ఆ రోజు సరిగ్గా ఉదయం పదకొండు గంటలకి డోర్ లాక్ తీసిన శబ్దం అయింది. పిచ్చిదానిలా పరిగెత్తాను. హేమంత్ లోపలికి వచ్చాడు.        నేను ఒక్కసారిగా బరస్ట్ అయాను..

అతను క్షణంలో చిరునవ్వు పెదాల మీద అతికించుకుని సోఫా దగ్గరకు నడిపిస్తూ “అరెరే… ఇలా అయావేంటి.. నాలుగు రోజులకే ఇలా అయితే నేను ఒక్కోసారి నెలా, రెండు నెలలు కూడా ఇంటికి రాను.. అప్పుడు కూడా ఇలాగే ఉంటావా.. వెరీ బాడ్..” అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి ఆరెంజ్ జ్యూస్ తీసి గ్లాసులో పోసి తెచ్చి, తన మొహంలోకి వెర్రిగా చూస్తూ “నెలా రెండు నెలలా” అంటున్న నా నోటికి అందిస్తూ “ముందు ఇది తాగు చెప్తాను” అన్నాడు.

నేను ఏడుస్తూ “నాకు ఒద్దు.. ముందు చెప్పండి.. ఎందుకు రారు.. ఎక్కడికి వెళ్తారు?” అన్నాను నిలదీస్తూ.

 “తాగు.. లేకపోతే చచ్చిపోతావు..” అన్నాడు బలవంతంగా నా నోటికి గ్లాస్ అందిస్తూ. బలవంతంగా తాగి, గ్లాస్ పక్కన పెట్టి అన్నాను “చెప్పండి”

అతను సోఫాలో వెనక్కి వాలి కూర్చుంటూ “నేను ఎక్కడికి వెళ్ళాను అని నీ క్వశ్చన్… అవునా” అన్నాడు..

అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఎగసింది.. బావురుమంటూ అతన్ని చుట్టేసి అన్నాను “నాకు భయం వేసింది.. మీరలా చెప్పా, చేయకుండా ఇన్నాళ్ళు వెళ్ళిపోతే ఏమయారు అనుకోను.. ఎవరిని అడగను.. నాకెవరు తెలుసని ఇక్కడ .. కనీసం ఈ ఇంట్లో ఫోన్ కూడా లేదు.. నేను ఏమైపోతాను? ఎందుకలా వెళ్లారు? ఆఫీస్ పని ఏదన్నా ఉంటే నాకు చెప్పి వెళ్ళచ్చుగా..” అంటూ వెక్కి, వెక్కి ఏడవసాగాను

“ఏడుపు ఆపు చెప్తాను.. నేను చెప్పేది విన్నాక ఇంక ఎప్పుడూ నీ నోటి నుంచి ప్రశ్నలు వినిపించద్దు ” అంటూ నెమ్మదిగా చెప్పసాగాడు.

అతని నోటినుంచి వస్తున్న ఒక్కో అక్షరం ఒక్కో బాకులా గుండెల్లో గుచ్చుకుంటుంటే స్థాణువులా కూర్చున్నాను… అతను చెప్పదల్చుకున్నదంతా చెప్పి అన్నాడు.. “సో నాకు ఇలా పార్ట్ టైం వైఫ్‌గా, మెయిడ్‌గా ఉంటూ కమ్మటి ఇండియన్ భోజనం వండి పెట్టడానికి నీలాంటి అమాయకురాలు, వినయం, అణకువ ఉండి ఆస్తి లేని అమ్మాయి అయితే నోరు మూసుకుని భరిస్తుందని నిన్ను చేసుకున్నాను.

ఈ దేశంలో బోలెడంత డబ్బు ఉంటుంది.. అన్ని రకాల విలాసాలు ఉంటాయి. కానీ ఇండియాలో లాగా పనిమనుషులు ఉండరు. అక్కడినుంచి పనిమనిషిని తీసుకు రావాలంటే పెద్ద తతంగం.. కానీ భార్యని తెచ్చుకుని పనిమనిషిగా వాడుకోడానికి ఏ తతంగం అవసరం లేదు. అర్థమైంది కదా. నువ్వు లీగల్గా నాతో వచ్చిన పనిమనిషివి. నేనేం చేసినా మౌనంగా భరించడం తప్ప నో అదర్ ఛాయిస్. నన్ను ప్రశ్నించడం, నా మీద భార్యగా పెత్తనం చేయడం అనేవి లేవు ఉండవు.. నానుంచి ఇంతకుమించిన ప్రేమ, అనురాగం ఆశించద్దు.. బెడ్ మీద తప్ప నా పక్కన కూర్చోవద్దు.. ఇవన్నీ నా కండిషన్స్. ఇసాబెల్లా ఆఫీస్ పని మీద ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది.. అలాంటప్పుడు నువ్వు నాకు సుఖం ఇవ్వాలి..

ఇది నా ఆదర్శ వివాహం వెనకాల నేను వేసుకున్న స్కెచ్.

దీని వలన నీకు నష్టం, కష్టం ఏమి ఉండవు.. ఎందుకంటే ఎలాగా నీకు కుకింగ్, క్లీనింగ్ ఎట్సెట్రా అలవాటే. మీ నాన్న పేదవాడు, ఎలాగూ నీకు పెళ్లి చేయలేను అని చెప్పాడు కాబట్టి నీకూ ఒక మగాడి అవసరం ఉంది అవునా.. రోజు కాకపోయినా, అప్పుడప్పుడు నీ శారీరక అవసరాలు నేను తీరుస్తాను. హాయిగా జీవితాంతం సుఖంగా, తిండికి, బట్టకి లోటు లేకుండా ఉంటావు..”

నిశబ్దంగా ఉన్న ఆ పరిసరాలలో అతని స్వరం రంపపు చప్పుడులా ఉంది.. ఆ మాటలు గుండెనే కాక అణువణువూ ముక్కలు, ముక్కలుగా కోస్తున్నట్టుగా అనిపిస్తోంటే అవమానంతో, అసహ్యంతో దహించుకుపోతూ కుప్పకూలిపోయాను.

ప్రత్యూష ఒళ్ళంతా జలదరించింది. భయంతో వణికిపోతూ మనస్విని చేయి గట్టిగా పట్టుకుంది.

“అప్పుడనిపించింది ఇదేనా స్వర్గం అంటే! ఎన్ని ఆశలు! ఎన్ని ఊహలు! ఏమయాయి?” మనస్విని చెప్పసాగింది.

“ఈ స్వర్గం పేరు ఎండమావి. దేశం కాని దేశంలో నా అనే వాళ్ళు లేని చోట , తోడనుకున్న వాడు, నీడగా ఉంటాను అన్నవాడు ఇప్పుడు తనది కేవలం పాము పడగ అని, నీడనిచ్చినట్టే ఇచ్చి కాటేస్తానని బరితెగించి చెప్తున్నాడు.. ఇప్పుడు నేను ఏమి చేయలేనన్న నమ్మకంతో కదా! నిజంగానే నేనేమీ చేయలేనా!”

యాంత్రికంగా పనులు చేస్తున్నా నా మెదడు ఆలోచించడం మానలేదు. నాలుగు రోజులు నాలుగు యుగాలుగా గడిచాయి. అతని దైహికవాంచ తీర్చుకోడం, గదిలోకి వెళ్లి తలుపు వేసుకోడం.. ఆ గదిలోకి నాకు అనుమతి లేదు.. ఇసాబెల్లా వచ్చినపుడు ఇద్దరూ ఆ గదిలో పడుకుంటారట.

ఒక ఆడది అందుబాటులో ఉంది.. దాని మీద తనకి సర్వ హక్కులూ ఉన్నాయి కాబట్టి ఆమెని యధేచ్చగా అనుభవిస్తున్నాడు.. ఆమె తనకి సేవకురాలు, అన్ని సేవలు చేయాలి.. అది కూడా ప్రశ్నించకుండా.. అతను విధించిన ఆ అత్యంత కఠినం అయిన కట్టుబాటును భరించలేకపోయాను.

“ఎలా బయట పడ్డావక్కా.” ప్రత్యూష ప్రశ్నకి నవ్వింది మనస్విని.

“ఒక్కోసారి ఆ దేవుడే మనకి ధైర్యం ఇస్తాడు.. మనోబలం ఇస్తాడు.. అప్పుడు నాకు ఆ దేవుడే ఇచ్చాడు ఆ శక్తి.. అవసరం అయితే మన అరచేయే ఆయుధంగా మారుతుంది ఆత్మ రక్షణ కోసం.

ఆ రోజు కూడా శనివారం.. అతను ఆలస్యంగా లేచాడు. అప్పటికే నేను లేచి ఇడ్లీ, చట్నీ చేసాను. అతను ఫోన్ మాట్లాడుతూ కిందకి దిగి వచ్చాడు. అతను మాట్లాడుతున్న తీరు, ఆ మొహంలో కనిపిస్తున్న రొమాంటిక్ వెలుగు అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుస్తోంది. రెండు నిమిషాలు మాట్లాడడం అయాక నేను ఇడ్లీ ప్లేటులో వేసి అతని చేతికి ఇస్తూ అప్పటికే టేబుల్ మీద పెట్టిన ఒక కాగితం ఇచ్చాను .

“ఏంటిది?” అడిగాడు.

“చూడండి తెలుస్తుంది..” అతను నొసలు చిట్లించి చదవసాగాడు. కాగితం విసిరేసి గట్టిగా అరిచాడు “ నాన్సెన్స్.. నా ఇంట్లో ఉంటూ, నా తిండి తింటూ నాకు బిల్స్ ఇస్తావా హౌ డేర్ యూ ఆర్ …”

నేను కిందపడిన కాగితం తీసి నీటుగా మడిచి పట్టుకుని “నేను విన్నంత వరకూ ఈ దేశంలో ఎవరికైనా గంటకి ఇంత అని రేటు ఫిక్స్ చేస్తారని తెలిసింది.. మీరు నన్ను ఎలాగా పనిమనిషినే అని డిక్లేర్ చేసారు కాబట్టి నేను కూడా అలాగే ఫిక్స్ అయ్యాను.. ఇక్కడ మరి రేట్స్ సంగతి నాకు తెలియదు కాబట్టి నా శ్రమకి ఇంత అని నేనే ఖరీదు కట్టాను.. ఉదయం లేచిన దగ్గరనుంచి కాఫీ కాయడం, టిఫిన్ చేయడం, వంట చేయడం మీకు అన్ని అందించడం, క్లీనింగ్, వాషింగ్ ఇవన్నిటితో పాటు నెలకి ఎంత లేదన్నా కనీసం ఐదారు రాత్రులు మీకు సుఖం ఇస్తున్నా కాబట్టి అన్నిటికి కలిపి బిల్ ఇచ్చాను. ఇప్పటికి నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలు దాటి మూడో నెలలోకి ప్రవేశించాను.. సో రెండు నెలల జీతం నెలకి నాలుగు వేల చొప్పున ఎనిమిది వేల డాలర్లు నాకు ఇస్తే మీకు ఇవాళ లంచ్, డిన్నర్, పడక సుఖం..”

నా మాట పూర్తీ అవకుండానే అతని చేయి విసురుగా లేచింది. అది చెంప తాకేలోగా ఆ చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అన్నాను “నాకు జీవితంలో విజయం తప్ప ఓటమి తెలియదు.. ఇక్కడినుంచి నేను బయటకు వెళ్ళలేనని నీ ధీమా కదా.. నేను తలచుకుంటే నువ్వు కాదు కదా దేవుడు అడ్డు నిలిచినా వెళ్ళగలను.. కానీ వెళ్ళను.. ఇక్కడే ఉండి నేనేమిటో నీకు తెలియచేస్తాను.. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నీ గుండెల్లో నిద్రపోతాను.. ఖబడ్దార్.. ఆడదంటే మూరెడు తాడుతో, గుప్పెడు సెంటిమెంట్‌తో కట్టేసి ఉంచే కుక్క కాదురా.. ఆడదంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను..” అని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాను.

అమ్మో…! ప్రత్యూష చేయి గుండెల మీదకి వెళ్ళింది.. కళ్ళు పెద్దవి చేసి చూసింది.

“నేను అనూహ్యంగా అలా ఎదురు తిరిగే సరికి అతను కుక్కిన పేను అయాడు. అప్పటికే భార్యగా అతని జీవితంలోకి వచ్చిన ఇసాబెల్లకి కూడా నేను తన కజిన్ అని ఇంట్లో పని, పాటలకి ఉంటుందని తీసుకొచ్చాను అని చెప్పాడు. అతని ప్లాన్ రివర్స్ అయింది. నన్ను అతను ఏ వీసా మీద తీసుకు వెళ్ళాడో నాకు తెలియదు.. తెలుసుకునే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా గుడిలో పెళ్లి చేసుకుని తీసుకు వెళ్ళగానే నమ్మి వెళ్లాను. ఇప్పుడు కొరకరాని కొయ్య అయాను.. ఈ సంగతి ఇసాబెల్లాకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది.. కోర్ట్‌కి వెళితే అక్కడ ఒక పట్టాన తేలే వ్యవహారం కాదు.. చాలా పెద్ద ఇష్యూ చేస్తారు.. అతని ఆస్తి మొత్తం కరిగిపోతుంది లాయర్ ఫీజులకి.. అందుకే కాళ్ళ బేరానికి వచ్చి నా చదువుకి, తిండికి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి నన్ను ఇండియా పంపించాడు.

ఇది నా కధ.. ఇప్పుడు ఆలోచించుకో.. అందరికి ఇలాగే జరుగుతుందని అనను.. కానీ ఆలోచించి అడుగు వేయమని శ్రేయోభిలాషిగా చెప్తున్నాను.. నువ్వు ఆలోచించు” అని ముగించింది మనస్విని.

మనస్విని వెళ్ళిపోయాక కూడా ఎంత వదిలించుకున్నా వదలని ఆలోచనలు ఆమెని ఆ రోజంతా వెంటాడుతూ మస్తిష్కంలో తుపాను సృష్టించాయి. అనేక భయాలతోపాటు ఎక్కడో ఒక చిన్న ఆశల మొక్కలు కూడా చిగురించసాగాయి.

అమెరికా భూతల స్వర్గం.. ఆధునిక యువతీయువకుల మెరుపు కల. ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఈ అదృష్టం వరిస్తుంది.. పైగా తనలాంటి అమ్మాయికి.

జీవితంలో ఆల్రెడీ ఒకసారి పరాజయం కలిగాక మళ్ళీ అలాగే జరుగుతుందా..

ఏమో! ఎవరు చెప్పగలరు! కాలం, ఖర్మం కలిసిరాకపోతే చేతిలో తాడే పామై కరుస్తుందట. ప్రత్యూష అస్థిమితమైన మనసుతో ఫేస్‌బుక్ ఓపెన్ చేయలేకపోయింది రెండు రోజులు.

ఈ అవకాశం తనకి మంచి జరగడానికే వచ్చిందేమో! మనస్విని నింపిన సందేహాలు, భయాలు నెమ్మదిగా, ఆశల కిరణాలు తాకిన మంచులా కరిగిపోతూ ఆమె కళ్ళ ముందు అద్భుతమైన ఒక కొత్త ప్రపంచం రంగు, రంగులుగా విస్తరించుకోసాగింది. మనస్వినికి జరిగినట్టే అందరికి జరిగితే ఇన్ని వేలమంది అక్కడ ఎందుకుంటారు? అనుకుంది.

గుమ్మం ముందుకు వచ్చిన అపురూపమైన అవకాశం లేని, పోనీ ఆలోచనలతో వదులుకోడం తెలివితక్కువ కదా!

మూడోరోజు అతని నుంచి ఫోన్ వచ్చింది.. “ఎందుకు ఎఫ్‌బికి రావడం లేదు.. ఆర్ యు ఓకే” అడిగాడు.. అతని స్వరంలో ఆందోళన, ఆత్రుత… ప్రత్యూష నాదస్వరం విన్న నాగుపాము అయింది. అప్పటిదాకా ఉన్న సందేహాలు, భయాలు ఎగిరిపోయాయి.. ప్రేమ నిండిన అతని మాటలు మనసును మల్లెపూల సౌరభంలా తాకాయి. “నేను ఇంకా రెండు రోజుల్లో ఫ్లైట్ ఎక్కుతాను.. బి రెడీ” అన్నాడు.

ఆమె కళ్ళు చకోరాలు అయాయి. ఎదురుచూసిన రోజు వచ్చింది.

వచ్చిన రోజే అతను ఆమెని కలిసాడు.. ప్రేమావేశాలతో ముంచెత్తాడు.. “ఫోటోలో కన్నా బాగున్నావు.. నేను లక్కీ” అన్నాడు. పెళ్లి ఫిక్స్ చేసాడు.

 “నేను మీకు చెప్పాకదా నా జీవితంలో జరిగిన సంఘటన” అంది బిడియంగా..

“ఫర్గెట్ ఇట్… అదొక పీడకల … మర్చిపో.. ముందుంది మంచి కాలం..” అన్నాడు ఆమె నుదురు చుంబిస్తూ.

వస్తూ, వస్తూ ఆమెని ఆశ్చర్యపరుస్తూ, పచ్చల హారం, రెండు పట్టు చీరలు తెచ్చాడు. పెళ్లి సింపుల్‌గా బిర్లా టెంపుల్‌లో జరగడానికి ఏర్పాట్లు చేసాడు.

అతని ప్రేమ ప్రవాహంలో పూర్తిగా మునిగిపోయింది ప్రత్యూష..

అతని రాక, ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ, ఏర్పాట్లు మనస్వినికి చెప్పే ధైర్యం లేకపోయింది. ఎంత ఆత్మీయురాలు అయినా ఆమె కూడా ఆడదే. ఈర్ష్యా, అసూయకి అతీతురాలు కాదుకదా.. ప్రేమ విషయంలో కొంత గోప్యత అవసరం అనుకుంది ప్రత్యుష.

మరునాడు పెళ్లి అనగా ఫోన్ చేసింది. “వెడ్డింగ్ కార్డ్స్, మంత్రాలు హడావుడి లేదక్కా. సింపుల్‌గా టెంపుల్‌లో పెళ్లి తప్పక రావాలి” అంది.

“తప్పకుండా వస్తాను.. నువ్వు సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది” మాట ఇచ్చింది మనస్విని.

అతను కొన్న పచ్చటి కంచి పట్టు చీర, పచ్చలహారం, కల్యాణం బొట్టు, కళ్ళ నిండా కాటుక మెరిసి పోతోంది.. గ్రే కలర్ సూట్‌లో అతను హుందాగా ఉన్నాడు.. తనకన్నా దాదాపు ఎనిమిదేళ్ళు వయసు ఎక్కువ అయినా అతని ఠీవి, అందం ముందు ఆ వెలితి బాదించలేదు ఆమెని.

ముహూర్తం సమయం అయింది. అతని అక్క, బావ వచ్చారు.. ఇద్దరు స్నేహితులు వచ్చారు చేతుల్లో పెద్ద పూల దండలతో, స్వీట్ బాక్స్‌లతో.

దండలు మార్చుకోమన్నాడు పురోహితుడు..

ప్రత్యూష అటూ, ఇటూ కలయచూసింది.

“ఎవరికోసం చూస్తున్నావు” అడిగాడు.

“నా ఫ్రెండ్ రావాలి” అంది.

“ముహూర్తం టైం అయింది.. వస్తుందిలే.. ఆవిడ వచ్చిందాకా ఇక్కడే ఉందాం.. ముందు దండలు మార్చుకుందాం” అన్నాడు.

“కానివ్వండి” త్వర పెట్టారు అక్క, బావ..

అతను ఆమె మెడలో దండ వేసాడు.. ఆమె సిగ్గు తెరలు కమ్ముతుంటే తన చేతిలో దండ అతని మెడలో వేసింది.

అతను ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఆ చేయి అందుకుని పెదాలకు ఆనిన్చుకున్నాడు.

ఆమె అణువణువూ జల్లుమంది. నిలువెల్లా పులకించిపోయింది.. ఆ క్షణం మనసులో ఇంకా ఏ మూలో గుచ్చుకుంటున్న సందేహాలు, అనుమానాలు పటాపంచైనాయి .

“వాళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయండి పంతులుగారు” అంది అతని అక్క..

“అలాగే అమ్మా…” పూజారి మంత్రాలు చదవసాగాడు. ప్రత్యూష రెండు చేతులూ జోడించి ఏడుకొండలవాడికి మనసారా నమస్కరించి తనకి ఇంత అదృష్టం కలిగించినందుకు కృతఙ్ఞతలు తెలియచేసుకుంది.

అర్చన అయింది.. హారతి ఇచ్చాడు.. భక్తిగా అద్దుకుంది.

తీర్థ ప్రసాదాలు తీసుకుని వెనక్కి తిరిగారు.. మనస్విని చేతిలో పూలదండలతో ఆయాసపడుతూ వచ్చి, “సారీ ప్రత్యూ.. హెవీ ట్రాఫిక్ … లేట్ అయాను” అని అంటూ ఆప్యాయంగా కౌగలించుకుంది.

ప్రత్యూష కళ్ళు చెమర్చాయి.

“ఈయన మా వారు” మనస్విని కౌగిలి నుంచి విడిపించుకుని పక్కనే ఉన్న భర్తని పరిచయం చేసింది.

మనస్విని చిరునవ్వుతో నమస్కరిస్తూ, పూలదండ అతని చేతికి ఇస్తూ “ఎవరికీ వేస్తారు” అంది చిరునవ్వుతో .

క్షణంలో అతని మొహంలో రక్తం పొంగినట్టు ఎర్రగా అయింది. చూస్తుండగానే ఉగ్రుడైపోయాడు.

మనస్విని అతని అక్క, బావల వైపు చూస్తూ “ఎలా ఉన్నారు వదినగారు?” అంది. ఇద్దరి మొహాలు కత్తివాటుకు నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయాయి.

అప్పటికే ఇద్దరు పోలీసులు చేతిలో సంకెళ్ళతో వచ్చారు..

మనస్విని నవ్వింది అతన్ని చూసి. “కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదు మిస్టర్ హేమంత్.. ఉరఫ్ విశాల్..” అని ప్రత్యూష వైపు చూస్తూ… “ఇతను పదిరోజుల క్రితమే వచ్చినా నాకు చెప్పలేదు నువ్వు.. అప్పుడే నా మాటలు నీకు రుచించలేదు అని అర్థం అయింది.. అయినా అమాయకంగా ఫేస్‌బుక్ స్నేహాన్ని నమ్మి, పెళ్ళికి సిద్ధపడిన నిన్ను చూస్తూ, చూస్తూ వదలలేకపోయాను.. అందుకే ఓ కంట కనిపెడుతున్నాను.. నువ్వు, నేనే కాదు మరో నలుగురిని కూడా వంచించిన నిత్య పెళ్లికొడుకు ఇతను.. భార్య పేరుతో అమెరికా తీసుకు వెళ్లి పనిమనుషులుగా వాడుకోడమే కాదు అవసరం అనుకుంటే తనకి లాభం ఉంది అనుకుంటే భార్యని బజారు వస్తువు చేయడానికి కూడా వెనుకాడడు.. ఇతని చరిత్ర చాలా ఉంది.. ఇతనికి సపోర్ట్‌గా ఉన్న వీళ్ళిద్దరూ నిజం అక్క, బావ కాదు… నీ మెడలో ఉన్న పచ్చలహారం లాగే నకిలీ అక్కా, బావ అంది మనస్విని..

నిలబడిపోయిన దగ్గరే భూమిలో లోపలికి దిగిపోతున్నట్టుగా పరాభవం, పరాజయం, పశ్చాత్తాపంతో కుంచించుకు పోతూ నిలబడింది ప్రత్యూష.. ఆమె మెడలోని పూలదండలోంచి పూలన్నీ ఒక్కో రేకు రాలి కిందపడసాగాయి ఆమె ఆశల్లాగే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here