ఎడ్వర్డ్

1
13

[సోమర్‍సెట్ మామ్ రచించిన ఆంగ్ల కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ రాచపూటి రమేష్]

[dropcap]ఆ[/dropcap] రోజు సెంట్ పీటర్స్ చర్చ్, నెవిల్లీ స్క్వయర్‍లో ఒక నామకరణం జరిగింది. అల్బర్ట్ ఎడ్వర్డ్ ఇంకా తన వర్జర్ (సహాయ బిషప్) గౌన్లోనే ఉన్నాడు. కొత్తదిగా, గట్టిగా ఉన్న అతని కోటు బట్టతో కాక కంచుతో చేసినట్లు మెరిసిపోతోంది. దాన్ని ఎడ్వర్డ్ పెళ్లిళ్లకు, అంత్యక్రియలకూ మాత్రమే వాడుతాడు. ఆ కోటు తీశాక ఎడ్వర్డ్ తన హెూదా కొంత తగ్గిందని భావిస్తాడు.. అతడు దాన్ని ఇస్త్రీ చేయడం వంటి వన్నీ స్వయంగా చేసుకుంటాడు. అతడు ఈ చర్చిలో సహాయ బిషప్ (వర్జర్)గా ఉన్న పదహారేళ్లు అటువంటి కోట్లు ఎన్నో ధరించాడు. వాటిని అతడు పారవేయక, బ్రౌన్ పేపర్లో నీట్‌గా చుట్టి తన బీరువా అడుగు అరలలో దాచేవాడు.

వర్జర్ ఎడ్వర్డ్ నిశబ్దంగా చర్చి పాలరాతి గచ్చుపై కొత్తగా పెయింట్ వేసిన చెక్క కవర్ మార్చడం, ఒక వికలాంగురాలి కోసం తెచ్చిన వీల్ ఛేర్‌ను తీసివేయడం వంటి పనులు చేసుకుంటూ, చర్చి వికార్ పని ముగించుకొని వెళ్తాడేమో, తాను చర్చిని శుభ్రపరచి ఇంటికి వెళ్లవచ్చునని ఎదురు చూస్తున్నారు. చర్చి వేదిక పై నుండి ఎత్తైన మెట్లు దిగి, ఇంకా తన యూనిఫామ్‌లోనే ఉన్న వికార్‌ను చూశాడు ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ నాలిక టీ చుక్క కోసం పరితపిస్తున్నది.

ఎర్రటి ముఖంతో చురుగ్గా కనిపించే నలభై ఏళ్ల చర్చి వికార్ ఇటీవలే నియమించబడ్డాడు. అంతకు ముందు చర్చిలో పని చేసిన పాతకాలపు వికార్ అంటే ఇప్పటికీ ఎడ్వర్డకు ఒళ్లు మంట. ఇతరులకు నీతులు చెప్తూ, తాను సోమరిగా ఉండడానికి ఇష్టపడే ఆ వికార్‍కు చర్చికి వచ్చే ధనవంతులతో కలిసి హెూటళ్లలో భోంచేయడం చాలా ఇష్టం. కానీ ఆ వికార్ చర్చిలో ఏ చిన్న అంశము మార్చడానికి ఒప్పుకోరు. కానీ ఇప్పుడొచ్చిన వికార్‌కు అన్నింటిలో తలదూర్చడం ఇష్టం. ఎడ్వర్డ్ చాలా ఓపిక గలవాడు. సెంట్ పీటర్స్ ఒక మంచి ప్రాంతంలో ఉంది. చర్చి కొచ్చేవారు చాలా మంచివారు. ‘కొత్త వికార్ సామాన్యులుండే తూర్పు ప్రాంతం నుండి వచ్చారు. కాబట్టి అతనికి ఇక్కడి కులీన ప్రజల అలవాట్లు తెలుసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు’ అనుకున్నాడు ఎడ్వర్డ్.

కానీ వికార్ మెట్లు దిగి “ఫోర్‌మెన్, ఒకసారి నా ఛాంబరు రాగలవా? నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు.

ఎడ్వర్డ్ మెట్లెక్కి వికార్‌తో బాటూ నడవసాగాడు.

“నామకరణం చాలా బాగా సాగింది సార్. శిశువు మీరు ఎత్తుకోగానే ఏడుపు మానేసింది” అన్నాడు ఎడ్వర్డ్.

“నిజమే, చాలామంది చిన్న పాపల్ని ఎత్తుకొని, నేను వారిని లాలించి బుజ్జగించే పద్దతి నేర్చుకున్నాను” అన్నాడు వికార్, కాసింత గర్వంగా. తల్లులూ, నర్సులూ అబ్బురంగా వికార్ చిన్న పాపలను తన చేతుల్లోకి తీసుకొని వారిని ఏడవకుండా శాంతపరిచే విధానాన్ని చూసేవారు.

వికార్ వెనకనే ఎడ్వర్డ్ ఆయన ఛాంబర్లోకి నడిచాడు. అక్కడ మరొక ఇద్దరు వెర్జర్లను చూసి ఎడ్వర్డ్ ఆశ్చర్యపోయాడు. వారు అతణ్ణి చూసి చిరునవ్వు నవ్వారు.

“గుడ్ ఆఫర్ట్‌నూన్ సార్” వారిద్దరినీ ఒకరి తరువాత ఒకరిని విష్ చేశాడు ఎడ్వర్డ్.

ముసలివారిద్దరూ దాదాపు ఎడ్వర్డ్ పనిచేసినంతకాలం చర్చి వార్డెన్లుగా పనిచేశారు. పాత వికార్ ఇటలీ నుండి తెచ్చిన పెద్ద టేబిల్ వెనుక వారిద్దరూ రెండు కుర్చీలలో కూర్చుంటే వారి మధ్య కుర్చీలో వికార్ కూర్చున్నాడు. వాళ్లు ఏం చెప్పబోతారో అన్న ఆతృతతో వికార్ టేబిల్ అవతల వైపు నిలబడ్డాడు ఎడ్వర్డ్.

అతనికి గతంలో ఆర్గాన్ వాయిద్యకారుడు వివాదంలో చిక్కుకోవడం, అప్పటి వికార్ అతడిని మందలించడం గుర్తొచ్చింది. ఇటువంటి ప్రతిష్ఠ గల చర్చిలలో వివాదాలకు తావులేదు. వికార్ మాత్రం గంభీరంగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరూ కాస్తా ఇబ్బందిగా కనిపించారు.

‘ఆ ఇద్దరూ చర్చి వార్డెన్లనూ వారికయిష్టమైన పనేదో చేయమని వికార్ బలవంత పెడ్తున్నారు’ అనుకున్నాడు మనసులో ఎడ్వర్డ్,

చర్చి ఉద్యోగానికి ముందు ఎడ్వర్డ్ కులీనుల ఇళ్లలోనే పనిచేశాడు. ఒక పెద్ద వ్యాపారస్థుడి దగ్గర పేజ్ బాయ్‌గానూ, విధవరాలైన జమీందారిణి ఇంట్లో బట్లర్ గానూ పని చేశాడు. తరువాత అతనికి సెంట్ పీటర్స్ చర్చిలో ఉద్యోగం దొరికింది. ఎడ్వర్డ్‌ను ఎవరైనా జమిందారుగానో, సినీ నటుడిగానో పొరబడడం సహజం.

“ఫోర్‌మేన్, నీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఇంతకాలం నువ్వు కష్టపడి పని చేసి అందరినీ మెప్పించావనడం నిజం. కానీ నీకు చదవడం, రాయడం రాదని నాకిటీవలే తెలిసింది” అన్నాడు వికార్.

వెర్జర్ ఎడ్వర్డ్ మౌనంగా నిలబడ్డాడు.

“పాత వికార్ గారికి ఆ విషయం తెలుసు సార్, చదువుకూ, నా ఉద్యోగానికి సంబంధం లేదని ఆయన గారనే వారు” అన్నాడు ఎడ్వర్డ్.

“చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఈ చర్చిలో పదహారేళ్లు పనిచేసి కూడా, చదవనూ రాయనూ నేర్చుకోలేదా?” అన్నాడు వికార్.

“పన్నెండేళ్ల కల్లా నేను పనిలో చేరిపోయాను సార్. వంటవాడు నాకొక సారి చదువు నేర్పాలని చూశాడు, కానీ నాకు ఏమీ బోధపడలేదు. తరువాత నాకు దేనికి సమయం లేకుండా పోయింది” అన్నాడు ఎడ్వర్డ్.

“నీకు కనీసం ఉత్తరం రాయాలని ఎప్పుడూ అనిపించలేదా?”

“మా భార్య బాగా చదువుకుంది సార్, నా తరపున ఉత్తరాలూ అవీ ఆమె రాసి పెడుతుంది. వార్తపత్రికలలో ఫోటోలు చూసి నేను చుట్టూ జరుగుతున్నదేమో తెలుసుకోగలను” అన్నాడు ఎడ్వర్డ్.

ఇప్పుడు చర్చి వార్డెన్లు, వికార్ వంక ఇబ్బందికరంగా చూశారు.

“సరే ఎడ్వర్డ్, నీకు విషయం చెప్పక తప్పదు, నేను వీరిద్దరితోనూ మాట్లాడాను. సెంట్ పీటర్స్ లాంటి చర్చిలో నీ లాంటి నిర్లక్షర కుక్షి వెర్జర్ ఉద్యోగానికి సరిపోడు” అన్నాడు వికార్.

ఎడ్వర్డ్ మొఖం ఎర్రబారింది. అతడు బాధపడుతూ ఉండిపోయాడు.

“నీ మీద నాకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు. నీ పని సంతృప్తికరంగానే ఉంది. నీ వ్యక్తిత్వం, నీ పనితనం గురించీ నాకు తెలుసు. కానీ నీ వల్ల ఏదైనా పొరబాటు జరిగితే కష్టం. కాబట్టి రూల్స్ ప్రకారం నిన్ను తీసేయక తప్పదు. కానీ నీ విప్పుడు చదువు నేర్వగలవా?”

“కుదరదు సార్, చిన్నప్పుడే నేర్చుకోలేకపోయాను. ఇప్పుడేమి నేర్చుకోగలను?” అన్నాడు ఎడ్వర్డ్.

“నీతో మేము కఠినంగా వ్యవహరించదలచుకోలేదు ఎడ్వర్డ్. కానీ ఈ సరికే నేనూ, మిగిలిన చర్చి వార్డెన్లు నిర్ణయం తీసుకున్నాం. మూడు నెలల్లో నువ్వు చదవడం, రాయడం నేర్చుకోలేకపోతే నీకు ఉద్వాసన చెప్పక తప్పదు.”

ఎడ్వర్డ్ కొత్త వికార్‌ను ఏమాత్రం ఇష్టపడడం లేదు. సమాజంలో ఉన్నత వర్గాల వారు వచ్చే సెంట్ పీటర్స్ చర్చికి అతడు ఏమాత్రం తగిన వికార్ కాదని అతని అభిప్రాయం. ఎడ్వర్డ్ తన అభిప్రాయాన్ని నిష్కర్షగా వెల్లడించాను.

“సారీ సార్, ఈ వయసులో నేను ఏ విద్యా నేర్చుకోలేను. చదువుకోకుండానే ఇన్నేళ్లు నా విధులు సక్రమంగా నిర్వర్తించాను. ఇక కొత్తగా ఏమీ నేర్చుకోలేను” అన్నాడు ఎడ్వర్డ్. “ఐతే నువ్వు రిజైన్ చేయక తప్పదు” అన్నాడు వికార్.

“ఓకే సార్, నేను అర్థం చేసుకోగలను. నా స్థానంలో వేరొకరు సిద్ధం కాగానే నేను రిజైన్ చేయగలను” అన్నాడు ఎడ్వర్డ్.

జరిగిన పరిణామాలకు ఒకింత బాధపడుతూ, వణుకుతున్న పెదవులలో చిన్నగా నడిచి, తన వెర్జర్ గౌన్‍ను తన గదిలో ఒక కొక్కానికి తగిలించాడు. తాను విధులు నిర్వర్తించిన ఘనమైన వివాహాలు, అంత్యక్రియలను గుర్తుకు తెచ్చుకున్నాడు. చర్చినంతా శుభ్రపరచి, కోటు తీసుకొని, టోపీ చేతిలో పట్టుకుని చర్చి తలుపుకు తాళం వేసి వీధిలోకి నడిచాడు. కానీ పరధ్యానంలో ఇంటి వైపుకు వెళ్లక దారి తప్పాడు. బరువైన గుండెతో చిన్నగా నడిచాడు ఎడ్వర్డ్.

అతనికి భవిష్యత్తు అగమ్యగోచరంగా తోచింది. మళ్లీ వంట పనీ, ఇంటి పనీ చేయదలచుకోలేదతను. ఎందరు వికార్లు మారినా, సెంట్ పీటర్స్ చర్చి పనులన్నీ తలపైకెత్తుకుని నిర్వహించినది ఎడ్వర్డ్ అని చెప్పచ్చును. కాబట్టి చిన్న చిన్న పనులు చేయదలచుకోలేదతను.

ఎడ్వర్డ్ కొంత సొమ్ము కూడ బెట్టాడు. కానీ అది అతను కుటుంబంతో శేషజీవితం గడపడానికి సరిపోదు. అన్ని వస్తువుల ధరలూ పెరుగుతూనే ఉంది. ఇన్ని ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదతను.

రోమ్‍లో పోప్ లాగా సెంట్ పీటర్స్ చర్చిలో వెర్జర్ పనిచేసేవారు జీవితాంతం ఆ పనే చేసేవారు. తన మరణం తరువాత కూడా వికార్లు తన సేవలను ప్రస్తుతిస్తారని అతను అనుకొనేవాడు. అరుదుగా ఒక గ్లాసు బీరు, అలసిపోయినప్పుడు మాత్రమే ఒక సిగరెట్టూ తాగేవాడతను. హఠాత్తుగా అతడి కెందుకో సిగిరెట్ తాగాలనిపించింది.

గోల్డ్ ఫ్లాక్ సిగిరెట్ పాకెట్ కొనేందుకు కొట్టు కోసం ఎడ్వర్డ్ వెతకసాగాడు. అతను ప్రవేశించిన పెద్ద వీధి అంతా నడిచినా ఎడ్వర్డు సిగిరెట్లు అమ్మే షాపు తప్ప మిగిలిన అన్ని దుకాణాలు కనిపించాయి. ‘విచిత్రంగా ఉంది’ అనుకున్నాడు ఎడ్వర్డ్.

రూఢీ చేసుకోవడానికి మళ్లీ అతడు ఆ వీధి మొత్తం నడిచాడు. సిగిరెట్ల షాపు లేదు. ఒకచోట ఆగి ఆలోచించాడు.

‘ఈ వీధిలో నడుస్తూ సిగిరెట్ కాల్చాలనుకొనేవాణ్ణి నేను ఒక్కడినే ఉండను. ఇక్కడ సిగిరెట్లు, స్వీట్లు అమ్మే చిన్న కొట్టు తెరిస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది’ అనుకున్నాడు ఎడ్వర్డ్.

ఎడ్వర్డ్ మనసు కాస్తా కుదుట పడింది. ఇంటికి వెళ్లగానే అతడి భార్య ఎడ్వర్డ్‌కు టీ కప్పు అందించింది.

“ఈ రోజెందుకో మీరు మౌనంగా ఉన్నారు” అంది అతని భార్య. “ఆలోచిస్తున్నాను” అన్నాడు. ఎడ్వర్డ్.

అన్ని కోణాల్లో వ్యాపారం గురించి ఆలోచించి, మరునాడు అదే వీధిలో మరొకసారి గాలించి, తన వ్యాపారానికి పనికొచ్చే చిన్న ఖాళీ దుకాణాన్ని కనిపెట్టాడతను, ఇరవై నాలుగు గంటల తరువాత దాన్ని అద్దెకు తీసుకొని, చర్చి ఉద్యోగం మానేసిన నెలరోజుల కల్లా, సిగిరెట్లు, చాకెట్లు, వార్తపత్రికలు అమ్మే దుకాణాన్ని తెరిచాడతను.

సెంట్ పీటర్స్ చర్చిలో సహాయకునిగా పని చేసిన వ్యక్తి హెూదాకు అది ఏ మాత్రం తగదని ఎడ్వర్డ్ భార్య అంది. కానీ కాలం బట్టి మనమూ మారుతూ ఉండాలి అని ఎడ్వర్డ్ ఆమెను సమాధానపరిచాడు.

వ్యాపారం ఎడ్వర్డ్‌కు బాగా కలిసొచ్చింది. ఏడాదికల్లా అటువంటిదే మరొక షాపు తెరవాలన్న ఆలోచన వచ్చింది ఎడ్వర్డ్‌కు. ఇంకొక పొడవాటి వీధి వెతికి అందులో ఒక దుకాణం అద్దెకు తీసుకున్నాడు, సిగిరెట్లు, పేపర్లు అమ్మేందుకు ఒక మనిషిని నియమించాడు. ఆ షాపు కూడా బ్రహ్మండంగా జరిగింది.

‘రెండు దుకాణాలు విజయవంతంగా నడపగలిగితే మరి కొన్ని తానెందుకు నడపలేను’ అనుకున్నాడు ఎడ్వర్డ్. లండన్ వీధుల్లో తిరిగి పొడవాటి వీధులను ఎంపిక చేసుకొని, సిగిరెట్ షాపులు లేని వీధుల్లో, ఒక కొట్టును వెతికి పట్టుకొని అద్దెకు తీసుకోవడం ప్రారంభించాడు. పదేళ్లలో పది షాపులు తెరచిన ఎడ్వర్డ్ వ్యాపారంలో విపరీతంగా సంపాదించడం ప్రారంభించాడు. ప్రతి సోమవారం అన్ని దుకాణాలు స్వయంగా సందర్శించి, వారపు వసూళ్లను తీసుకొని బ్యాంకు ఖాతాలో వేసేవాడతను. ఒకరోజు కొన్ని నోట్ల కట్టలు, ఒక సంచీ నిండుగా చిల్లర నాణాలు బ్యాంకులో కడ్తూ ఉంటే కాషియర్ ఎడ్వర్డ్ “మేనేజర్ గారు మిమ్మల్ని ఒకసారి కలవమన్నారండి” అన్నాడు వినయంగా. మేనేజర్ గదిలోకి అటెండర్ ఎడ్వర్డ్‌ను తీసుకువెళ్లాడు.

మేనేజర్ “ఎడ్వర్డ్ గారూ, ఇప్పటి వరకూ బ్యాంకులో మీరెంత డిపాజిట్ చేశారో మీకు తెలుసా?” అడిగాడు

“కొంత వరకూ అంచనా ఉంది సార్”.

“ఈ రోజు కట్టినది కాకుండా ముప్పై వేల పౌండ్ల పై చిలుకే, అది చాలా పెద్ద మొత్తం, ఆ మొత్తం మీరు పెట్టుబడి పెడ్తే బాగుంటుంది.”

“నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు సార్, బ్యాంకులో డబ్బు భద్రంగా ఉంటుంది” అన్నాడు ఎడ్వర్డ్.

“తొందరేమీ లేదు. ఎక్కువ డివిడెండ్ ఇచ్చే షేర్లు మీ కోసం మేము ఎంపిక చేస్తాం. దాని వల్ల మేమిచ్చే దానికన్నా మీకు ఎక్కువ వడ్డీ వస్తుంది.”

“నాకు షేర్ల గురించి ఏమీ తెలియదు సార్, మీరే అంతా చూసుకోవాలి” అన్నాడు ఎడ్వర్డ్ ఇబ్బందిగా.

“మేమే అంతా చూసుకుంటాం. ఈసారి మీరు వచ్చినప్పుడు ఆ నగదు ట్రాన్స్‌ఫర్ గురించి ఒక సంతకం చేయాలంతే” అన్నాడు మేనేజర్, చిరునవ్వుతో,

“సంతకం చేయగలను. కానీ నేను ఏ పత్రం పై సైన్ చేస్తున్నానో నాకు తెలియాలి కదా” అన్నాడు ఎడ్వర్డ్.

“మీకు చదవడం వచ్చనుకుంటాను”

“రాదు సార్, తమాషాగా ఉంది కదూ, నాకు చదవడం, రాయడం రాదు, సంతకం కూడా వ్యాపారం పెట్టాక నేర్చుకున్నాను.”

మేనేజర్ ఆశ్చర్యంతో సీట్లో నుంచి గెంతినంత పనిచేశాడు.

“అద్భుతం, ఇంత గొప్ప వ్యాపారాన్ని స్థాపించి, ఇంత డబ్బు సంపాదించిన వ్యక్తికి చదవడం రాదా? చదువు వచ్చి ఉంటే మీరింక ఎంత సంపాదించి ఉండేవారో” అన్నాడు మేనేజర్ సంభ్రమంగా.

“అలా చదువుకొని ఉంటే నేనింకా సెంట్ పీటర్స్ చర్చిలో వెర్జర్ గానే ఉండి ఉంటాను” అన్నాడు ఎడ్వర్డ్ చిరునవ్వుతో.

***

సోమర్‍సెట్ మామ్

విలియం సోమర్‍సెట్ మామ్ (1874-1965) నాటకాలు, నవలలు, కథలకు పేరుగాంచిన బ్రిటిష్ రచయిత. మెడిసిన్ చదివినా, డాక్టర్ వృత్తి చేపట్టక పూర్తిస్థాయి రచయితగానే స్థిరపడ్డాడు. మురికివాడల్లో జీవనం గురించి వర్ణించిన నవల ‘Liza of Lambeth’, of Human Bondage (1915), The Razor’s Edge (1994) వంటి అతని నవలలు పేరు గాంచాయి. సరళంగా, ఆసక్తికరంగా కథలు రాసే సోమర్‍సెట్ మామ్, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ గూఢచారి విభాగంలో కూడా పనిచేసి, ఆ అనుభవంతో ఎన్నో కథలు రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here