అవును, ఈ నగరానికి యేమైంది?

0
7

[box type=’note’ fontsize=’16’] “సెలెబ్రిటీ నటుల చిత్రాలు యెలానూ ఆకట్టుకోవట్లేదు, కనీసం ఇవి చూసైనా తెలుగు సినెమా గురించి ఆశావహంగా వుండొచ్చు” అంటూ “ఈ నగరానికి ఏమైంది?” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]పె[/dropcap]ళ్ళి చూపులతో తెలుగు సినెమా ప్రమాణాలనే యెత్తుకు తీసుకెళ్ళిన తరుణ్ భాస్కర్ రెండో చిత్రమిది. ఇతను ఇంతకుముందే సైన్మా లాంటి తన లఘు చిత్రాలతో తన సత్తా చాటుకున్న మనిషి.
రెండో ప్రయత్నంలో కూడా కొత్త నటులనే తీసుకుని, యువతనే సాంకేతిక రంగాలలో యెన్నుకుని వో యూత్‌ఫుల్ సినెమా తీశాడు. నలుగురు కుర్రాళ్ళు, అల్లరల్లరి చేస్తూ, తాగుతూ, నవ్వుకుంటూ, నవ్విస్తూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ వుండే ఆకతాయి చతుష్టయం. కాని అడుగున వొక్కో పాత్రకూ వొక్కో ఆంతరిక కథ వుంటుంది. వివేక్ (విశ్వక్సేన్) లఘు చిత్రాలు తీయాలన్న కోరిక గల యువకుడు. స్నేహితులను వొప్పిస్తాడు కూడా. ఆ స్నేహితుల్లో వొకడు కార్తీక్ (సాయీ సుశాంత్) కెమెరామన్ గా చేయడానికి వొప్పుకుంటాడు. నటుడు కావాలని వున్న కోరిక గల కౌశిక్ (అభినవ్ గౌతం) కి ఇది అందివచ్చిన అవకాశం. నాలుగోవాడు ఉపేంద్ర (కాకుమాను వెంకటేశ్) పని అందరినీ వొకజట్టు గా మిగల్చడం, వొక రకంగా ట్రబల్ షూటర్. వీళ్ళ ప్రథమ ప్రయత్నం సగంలో ఆగిపోయిన తర్వాత నలుగురూ యెవరి దారిన వారు విడిపోతారు.
కార్తీక్ వొక బార్‌లో పనిచేస్తూ, ఆ యజమాని కూతురిని చేసుకోవడానికి వొప్పుకుంటాడు, యెందుకంటే తద్వారా అతనికి అమెరికా వెళ్ళే అవకాశం, డబ్బు, వో బార్ కు యజమానిగా మారే అవకాశం వస్తాయని. ఉపేంద్ర వెడింగ్ వీడియోలు చేస్తుంటాడు. కౌశిక్ డబ్బింగు చెబుతుంటాడు. కార్తీక్ పెళ్ళి నిశ్చయమైన సందర్భంలో నలుగురూ మళ్ళీ కలవడం, రకరకాల పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందుల మధ్య, నవ్వులు పండిస్తూ ఆ ఇబ్బందులు తీరే మార్గంగా మళ్ళీ పోటీ కోసం వో లఘు చిత్రం తీయాలనుకోవడం. ఇదంతా వొక పొర, కింద వొక్కొక్కరి జీవితంలో తీరని నిజమైన కోరికలు, జీవితంతో అయిష్టంగా సర్దుబాటు చేసుకోవలసి రావాల్సిన బాధ వగైరా వున్నాయి.
నలుగురి కథా వివరంగా చెప్పక పోయినా ఇద్దరివి మాత్రం రేఖా మాత్రంగా చెప్పాడు కథకుడు. వేరే విధంగా నెట్టుకురాలేకపోయిన కార్తీక్ పెద్దింటి సంబంధానికి వొప్పుకుంటే తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతాడు. అంతవరకూ అతని అభినయం నమ్మబుద్ధి కలిగేలా వున్నా, చివరిలో వొక్క సీన్ లో మనసు మార్చుకోవడం సినెమేటిక్ అనిపించింది. ఇక వివేక్ లఘు చిత్రం తీసే సందర్భంలో శిల్ప అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. నాటకీయంగా వంటొచ్చా అని అడుగుతాడు, రేపు పెళ్ళయ్యాక ఇంట్లో వంట నువ్వే చెయ్యాలిగా అని. (చాలా పాత సినెమాలో రాజ్ కపూర్ అమాయకంగా నాయికను అడుగుతాడు నా పిల్లలకు తల్లివవుతావా అని. ఆమె సిగ్గుపడిపోతుంది). ఇది కొంచెం విభిన్నంగా వుందీ అనుకున్నా ఆ కెమెరా దొంగలించడం అవీ పూర్తి సినెమేటిక్ గా వున్నాయి. వొరిజినల్‌గా లేదు. సరే, వివేక్ దుందుడుకు స్వభావం వల్ల ఆ జంట విడిపోతుంది గాని, వెళ్ళే ముందు అతనితో చెబుతుంది : నీకు ఆ దుందుడుకుతనం వెనుక భయం దాగుంది. నువ్వలా భయస్తుడిగా వున్నంత కాలం నువ్వూ, నీతో మరొకరూ సంతోషంగా బతకలేరు. అసలు ఇతని వొక్క కథే సినెమా మొత్తం పరచుకున్నా సరిపోదు. కేవలం రేఖా మాత్రంగా చర్చిస్తే అసంతృప్తే. ఆ నల్ల కళ్ళద్దాల ప్రతీక అతని కథను, అతని మనస్తత్త్వాన్ని వివరంగా చర్చిండంతో సమానం కాదు.
ఈ నటులకిది తొలి ప్రయత్నం అనుకుంటే, అందరూ బాగానే చేశారు. వివేక్ సాగర్ నెమ్మదిగా తన ప్రత్యేకమైన ధ్వనిని సంతకాన్ని స్థిరపరచుకుంటున్నాడు. బొమ్మిరెడ్డి నికేత్ కెమెరా పనితనం బాగుంది. ఇన్ని బాగున్నా సినెమాలో చాలా చోట్ల సాగదీస్తున్నట్టుగా వుంటుంది. సినెమా కథనం ప్రేక్షకుడిని కుర్చీకి కట్టేసినట్టుగా వుండాలి. పెళ్ళిచూపులు ఆ పని చేసింది. ఇక సాంకేతికత యెంత గొప్పగా వున్నా కథ, కథనం మీద శ్రధ్ధ తగ్గితే అసంతృప్తే మిగులుతుంది. నేను చెప్పదలచుకున్నది వొక సమాచారాన్ని తలచుకోవడం ద్వారా వివరిస్తాను. అప్పట్లో బాగా నచ్చిన చిత్రం “మాసూం”. ఇది శేఖర్ కపూర్ తొలి ప్రయత్నం. అద్భుతమైన నటులు, సాహిత్యం, పాటలు, సంగీతం అన్నీ వొక మరపురాని చిత్రంగా చేశాయి దీన్ని. ఎరిక్ సెగాల్ కథకు నకలు అంటారు. అయితే నేను చెప్పదలచింది అది కాదు. చాలా యేళ్ళ తర్వాత శేఖర్ ఇంటర్వ్యూలో చూశాను. అతనంటాడూ ఈ చిత్రం తీసే నాటికి తనకు సినెమా గురించి యెంత మాత్రమూ అవగాహనా లేదని, కాకపోతే తనకు కథ, కథనం గురించి విపరీతమైన స్పష్టత వుందన్ని, అది చెబితే తన టీం సభ్యులు తమ పనులు చేశారనీ, సినెమా ఆ విధంగా తయారైందనీ. అందుకే పెళ్ళి చూపులు ఆకట్టుకున్నంతగా ఇది ఆకట్టుకోలేదేమో.
సెలెబ్రిటీ నటుల చిత్రాలు యెలానూ ఆకట్టుకోవట్లేదు, కనీసం ఇవి చూసైనా తెలుగు సినెమా గురించి ఆశావహంగా వుండొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here