ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు లభిస్తుందో????

2
9

[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో బుద్ధావతారంపై జరిగిన చర్చను, సంచిక పాఠకులకోసం  కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]

బుద్ధావతారం: చర్చా కదంబం

[dropcap]డా.[/dropcap] విజయభాస్కర్, ఆచార్య రాణీ సదాశివమూర్తి, డా.పిళ్ళా విజయ్, గంగిశెట్టి ల.నా., ఏసీపీ శాస్త్రి, డా. రాయదుర్గం విజయలక్ష్మి ప్రభృతులు.

~ ~

డా. విజయభాస్కర్:

(సిరికోన వాక్స్థలి చర్చల్లో) గౌతమ బుద్ధుడు, దశావతార బుద్ధుడు వేర్వేరు అనే మాట వచ్చినప్పుడు, దశావతార బుద్ధుని గురించి మా మిత్రుడు శ్రీ మోదుగుల రవికృష్ణ గారు నాకు మూడు కథలు పంపారు. వాటిని చదివి నేనెంతో ఆశ్చర్యానికి గురయ్యాను. ఒక కథలో యమధర్మ రాజుకి నరకంలో పాపులు రాక, పనిలేక పోతే పాపుల్ని తయారు చెయ్యడానికి బుద్ధునిగా అవతారించాడట. రెండోది కాశీ పట్టణంలో జరిగినది. మూడోది రాక్షసుల్ని చంపడానికి నాకెంతో ఇష్టమైన దేవుడు శ్రీ మహావిష్ణువు, బుద్ధుని అవతారం ఎత్తి స్త్రీల పవిత్రతను భగ్నం చేస్తాడు..

ఇలాంటి అసహజమైన కథలు వ్రాసిన నేపథ్యం ఏదో ఒకటి ఉండొచ్చు. అది వర్గ ప్రయోజనమో, కాల పరిస్థితుల ప్రభావమో కావొచ్చు.

కానీ ఈరోజుల్లో, ఇన్ని చదువులు చదువుకొని, మానవుడు ఆధునిక విజ్ఞానాన్ని సమాకుర్చుకుంటున్న ఈ రోజుల్లో దేవుడు మనుషుల్ని పాపులుగా మార్చడానికి అవతరించాడనే మాట ఎలా సమర్థించకోగలం? స్త్రీల మానాన్ని హరించడానికి అవతరించాడాన్ని ఏ సూత్రం ప్రకారం ధర్మం అవుతుందో నా బుద్ధికి తోచడం లేదు. గౌతమ బుద్ధుడు దీనికి భిన్నంగా వ్యక్తులశీలం గురించే బోధించాడు. చెప్పింది ఆచరించాడు. నేను చెప్పానని గుడ్డిగా నమ్మకుండా ప్రతీ విషయాన్ని పరీక్షించి చూసుకోమన్నాడు. ఈ మధ్య కొంత మంది బౌద్ధాన్ని దేశం నుండి తరిమేశారని గొప్పగా చెప్పుకుంటూన్నారు. దాని వల్ల బుద్ధునికి వచ్చిన నష్టం ఏమి లేదు. నష్టపోయింది ఈ దేశం. అందుకే గురజాడ “బౌద్దాన్ని తరి మేసి ఈ దేశం ఆత్మ హత్య చేసుకుంది “అన్నారు.

బుద్ధుని బోధలు ఎంతగా ప్రభావితం చేసాయంటే, ఈనేల మీద ప్రతీ అంగుళం అయన పాద స్పర్శ కోసం తహతహ లాడింది. ప్రతీ శిలా అతని శిల్పంలా మారాలను కుంది. నాకు అర్ధం కానీదేమిటంటే గౌతమబుద్ధునిగా మన విష్ణుమూర్తి అవుతారించాడంటే హిందూమతానికి గౌరవమా? లేదు పాపుల్ని పెంచడానికి, స్త్రీ ల మానాన్ని కొల్లగొట్టడానికి బుద్ధునిగా అవతరించాడని చెబితే విష్ణుమూర్తికి, హైందవానికి ఎలా గౌరవమౌతుంది. దాన్ని సమర్థించే పెద్దలు ఆలోచించాలి.

అవి, తాము ఏదిరాసినా చెల్లిపోతుందనే మొండి అహంకారం, రాతలు చదివే రాత లేని అమాయక కాలంలో రాసినవి. వారిని ఇప్పుడు తప్పు పట్టి ప్రయోజనం లేదు. వాటిని ఎవరో ఒకరు సవరిస్తారని, ఇలాంటి వాటిని పరిహారిస్తే బాగుంటుందని భావిస్తున్నాను, సిరికోన లాంటి పండిత సమూహం అందుకు అర్హమైనదని అనుకుంటున్నాను.

తాటిపాముల మృత్యుంజయుడు:

శ్లో: మత్స్యః కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః

 రామో రామశ్చ రామశ్చ బౌద్ధో కల్కిమేవచః

పై శ్లోకం ఏ కాలంలో రాయబడిందో తెలిస్తే, ఈకాలం బుద్ధుడు అవతార పురుషుడుగా పరిగణింపబడ్డాడో లేదో తెలుస్తుంది కదా?!

ఏసీపీ శాస్త్రి:

వ్యాసుడి నాటికే ఈ బుద్ధుడున్నాడనుకోవాలి. ఎందుకంటే దశావతారాలలో ఆయన ఉన్నాడు కాబట్టి!

ద్వాపరయుగపు బుద్ధుడు అవతార బుద్ధుడు. మన గౌతమ బుద్ధుడు కలియుగము బహుశ క్రీస్తు పూర్వము 5 శతాబ్ద ప్రాంతం వాడు. కనుక నామ సామ్యం విస్మరించి వ్యాసుడి బుద్ధుడిని గురించి ఆలోచించాలి. అవతార పురుషుడు స్త్రీల పాతివ్రత్యం చెడగొట్టే స్థాయికి దిగుతాడా అన్నది ఆలోచించవలసిన ప్రశ్న.

దానికి సమాధానం చెప్పాల్సింది ప్రస్తుతం ఉన్న భాగవత పాఠం. పోతనకు అందినది ప్రాచీన సంస్కృత భాగవతము. ‘విమల వ్యాసాలవాలంబు’ అని కనుక నమ్మ గలిగితే ఈ కథ నమ్మాలి.

చదువరులకు అనుమానించే స్వేచ్ఛ ఉంది. కృష్ణలీలలు కూడా అనిమానించ దగినవే.

గంగిశెట్టి ల.నా.:

చరిత్ర పట్ల ఆసక్తిగల వ్యక్తిగా, ఎంత నిశితంగా ఆలోచించినా నాకు అర్థం కాని విషయం, నాటి వారు బౌద్ధం పట్ల ఎందుకింత ద్వేషం పెంచుకొన్నారు? ముఖ్యంగా శాంకర మతస్థులు ఎందుకంత అసహనం చూపారు? అనేది. అదే బౌద్ధానికి పెద్ద తోబుట్టువైన జైనం పట్ల అంత ద్వేషం చూపలేదు. తెలుగునాట అది దారుణమైన హింసకు గురైనా, గ్రామాలకు గ్రామాలే ‘దానవుల పాడు’ లుగా మారిపోయినా, దేశంలో మాత్రం జైనం అనేక ప్రాంతాల్లో తలెత్తుకొనే ఉంది. వాళ్ళ మత బోధలకు, వ్యాపార వ్యవహార దృక్పథాలకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా! అంతెందుకు మన పొరుగుననే కర్ణాటకలో జైనులు గణనీయంగానే ఉన్నారు! బౌద్ధం తాను పెరిగిన బీహార్ లో తుడిచిపెట్టుకుపోవటం అటుంచి, బీహారే ఇప్పటికీ ఒక హింసాభూమిగా మారిపోయింది…. ఆంధ్రదేశం కులహింసాభూమిగా పరిణమించింది…

పంచ మకారాలతో కూడిన తాంత్రిక విధానాల వల్ల, సామాజిక జుగుప్సకు గురియై, అలాటి పరిణామాల నెదుర్కొంది అనడం పరిపాటి. అయితే ఆ తాంత్రిక విధాన ప్రధానమైన ‘వజ్రయానం’ ఎప్పటిది? క్రీ.శ. 5 – 6 శతాబ్దాల నాటిది. బంగారం చేయటంతో ముడిపడ్డ ‘రస విద్య’ కు పేరొందిన సిద్ధ నాగార్జునుని నాటిది. తాంత్రికాచారాలు అత్యంత గోప్యంగా, వారి మత సంస్థల్లో మతవిశ్వాస, ఆచరణల పరంగా జరిగేవే కానీ, బహిరంగంగా, అనియతంగా జరిగేవి కావు. ఈ తాంత్రికాచరణలు, రసవిద్యలు జనంలో తమ పట్టు కోల్పోకుండా ఉండేటందుకు, జన విశ్వాసాల అనుసార్యంగా పెంచుకొన్నవే కావచ్చు అని అగ్రశ్రేణి పండితులు కూడా అభిప్రాయం వెలిబుచ్చారు.. బౌద్ధమనే ఏమిటి? దాదాపు అన్ని మతాలు, మంత్రం కంటే తంత్రానికి ప్రాధాన్యం ఇచ్చే స్థితి కూడా వచ్చింది. వైష్ణవంలో తంత్రానికి ఎంత ప్రాముఖ్యం లేదు? అయినా వాటిపట్ల రాని సామూహిక వ్యతిరేకత, విద్వేషం అంత పరమోత్తమమైన సామాజిక తత్త్వం బోధించిన , ధర్మాన్ని, సమాజాన్ని, బుద్ధిని సమాశ్రయించమన్న బౌద్ధం పట్ల ఎందుకు కలిగింది? నాకిప్పటికీ సరైన సమాధానం దొరకని ప్రశ్నే ఇది! ఈ దేశంలో రాజకీయ పట్టు లేకపోతే, అప్పట్లోనూ ఇప్పట్లోనూ ఏదీ ఏ వర్గమూ బ్రతికి బట్ట కట్ట లేదా? కత్తికి దూరమైనందుకే బౌద్ధం అంతరించిందా? అనే అనుమానముంది.

దేశం మొత్తం మీద మహమ్మదీయం లోకి ‘మారిన’ వారిలో బౌద్ధులు/ఛండాలురిగా నిందితులైన పాషండులు అధిక సంఖ్యాకులు అంటే ఎవరైనా నమ్ముతారా? బెంగాల్ లోని బౌద్ధులే, మనవారి హింసను తట్టుకోలేక తదనంతరకాలంలో మహమ్మదీయం లోకి మారారని అక్కడి పరిశోధనలు తెలియచేస్తున్నాయి..

మరొక మాట!

పౌరాణికత వేరు; చారిత్రకత వేరు. ఈ పురాణాలలో ఎక్కువవాటి కాలం కూడా చర్చనీయమైందే. ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో చరిత్ర విభాగ ప్రథమాచార్యులైన పూజ్యశ్రీ ఓరుగంటి రామచంద్రయ్య గారు శాతవాహనుల చరిత్రకు నిష్కర్షనిచ్చినవారు. అంత స్పష్టంగా వారు ఆ చరిత్రను ఆవిష్కరించడానికి ఆధారాలేమిటి? అగ్ని పురాణం ఇత్యాది ‘ప్రాచీన’ పురాణాలు. అప్పుడు వాటి కాలం ఏమని నిర్ణయించాలి.

అసలు వ్యాసుల వారి విషయమే చూడండి! వేదాలను వ్యాసించిన మహనీయుడే, భీష్మ పర్వాoతర్గతమైన గీత ను వ్రాసిన వారైతే అందులో పునః పునహా ఋగ్యజుస్సామ భేదాలను ఎందుకు వాడతారు? అంటే వారు వేదాలను వ్యాసం చేసిన పిమ్మట, భారతం రాశారా? ఒక విధంగా పురాణాలలో అధిక శాతం అంశాలు జానపదాలకు పెద్దక్కలు…

ఏసీపీ శాస్త్రి:

బీహార్ అసలు స్వరూపం విహార్. విహారము అంటే యజ్ఞ భూమి. ఆర్యసంస్కృతికి పట్టుగొమ్మ. చాలా ప్రాచీన వైదిక సంస్కృతి.

అది బహుశ ఎంత వెర్రి తలలు వేసి ఉంటుందంటే దానిమీద విప్లవం కూడా బీహార్ లోనే బుద్ధుడి రూపం‌లో మొదలయింది..

 వేద సంస్కృతికి మూలము కాశీ. బుద్ధుడు ఆ సంస్కృతికి దెబ్బ కాశీలోనే మొదలుపెట్టాడు.

బౌద్ధమే ప్రాచీనం. ఇక అది వ్యతిరేకంగా విప్లవం లేవదీసిన వైదిక మతం ఎంతప్రాచీనమైనదో ఊహించటం కష్టమే. భారత దేశంలో ఆనాటి రాచరికాలన్నీ వైదిక మతానుసారం మనుస్మృతి ప్రకారం నడిచినవే.

రాణి సదాశివమూర్తి గారు:

ఒక చిన్న ప్రశ్న! మహాభారతంలో ధృతరాష్ట్ర, పాండురాజుల జననానికి పూర్వం నుండి వ్యాసమహర్షి ప్రవేశం వచ్చినప్పుడల్లా ఆయనను వ్యాసునిగా వ్యవహరించారా? కృష్ణద్వైపాయనుని గా వ్యవహరించారా?

తర్కానికి తావీయకుండా ఈ ప్రశ్నకు సంస్కృత మహాభారతములో ఎలా ఉన్నదో చెప్పగలరు! (అని 👇 ఈ కింది మూలాలను ఉదాహరించారు)

తామద్భిః పరిషిచ్యార్తాం మహర్షిరభివాద్య చ౹

మాతరం పూర్వజః పుత్రో వ్యాసో వచనమబ్రవీత్ ౹౹18

(తదనంతరం సత్యవతీ ప్రథమ పుత్రుడు మహర్షి వ్యాసుడు తన కమండలంలోని పవిత్ర జలంతో దుఃఖిని అయిన తల్లిని అభిషేకించి, ఆమెకు అభివాదం చేసి ఇలా చెప్పాడు)

ఏవముక్త్వా మహాతేజా వ్యాసః సత్యవతీమ్ తదా౹

శయనే సా చ కౌసల్యా శుచివస్త్రా హ్యలంకృతా౹౹ 48

సమాగమనమాకాంక్షేదితి సో౽న్తర్హితో మునిః౹

తతో౽భిగమ్య సా దేవీ స్నుపాం రహసి సంగతామ్ ౹౹ 49

ద్వాపరయుగాంతమున పరాశరపుత్రునిగా హరిజన్మించెను. 14 శ్లోకం

అర్థంచేసుకునే సామర్థ్యం లేని వారికోసం వేద విభాగముచేసి వ్యాసుడను పేరును పొందెను. 24వ శ్లోకం

పిమ్మట ఇంకనూ అల్పప్రజ్ఞులకోసమై చతుర్వేద సారమైన భారతమును రచించెను. 25 శ్లోకం

గంగిశెట్టి ల.నా. :

మేష్టారూ! ఆలాటి సూక్ష్మాలని మీ వంటి సంస్కృత విద్వాoసులు వివరించినప్పుడే, మావంటి తెలుగు విద్యార్థులు గ్రహించ సాధ్యం. పై వాక్యాల వల్ల ధృతరాష్ట్ర, పాండురాజుల జనానానికి పూర్వమే, ఆయన వ్యాసునిగా ప్రసిద్ధుడని వైశంపాయనుని నుంచి మహా భారతమును గ్రహించి నైమిశారణ్యవాసులకు ఏతత్కథను వినిపిస్తున్న సూతమహర్షి మాటలతో మనం గ్రహించే వీలుంది. ఆ సూతుడు, వ్యాసమహర్షి శిష్యుని శిష్యుడు. సమకాలికుడైనా ఒక తరం పైనే అంతరముంది… దాని సూక్ష్మతలు విచారించే ముందు, మనం ప్రధానప్రశ్న మీద దృష్టి పెడదాం.

హైమా భార్గవ్:

మతం గురించి, ఇలాంటి చారిత్రక అంశాల గురించి పండితులు చెప్పాలి. సమాజం గురించి వచ్చే చర్చల్లో బౌద్ధం వల్ల కలిగిన నష్టం గురించి ఒక వాదన వుంది. బౌద్ధం అహింస గురించి బోధించింది అంటారు. అహింస పరమ ధర్మమని సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది. సనాతన ధర్మం లో కూడా అహింస వ్యక్తిగత జీవితంలో, అరిషడ్వర్గాలను జయిస్తూ, ధర్మబద్ధంగా వుండమని చెప్పింది. కానీ సమాజ రక్షణ విషయంలో అవసర మైనపుడు యుద్ధం తప్పనిసరి అని భావించింది. కానీ బౌద్ధం స్వీకరించాక ముఖ్యంగా అశోకుడి తర్వాత రాజులలో పరాక్రమం నశించింది. విదేశీ దండయాత్రలను నిలువరించ లేకపోయారు. సమాజ రక్షణ ఒక సమస్యగా మారిందని, అందువల్ల క్రమంగా, ఆ సమస్యను గుర్తించిన వారు బౌద్ద ధర్మాన్ని వదలడం జరిగిందని (ప్రాక్టికల్ గా ప్రయోజనం లేదని) ఒక వాదన వుంది….

పాలకుర్తి రామమూర్తి:

గౌతముని లాంటి యోధుడు “దేని కోసం దేనిని వదలాలో” నిర్ణయించుకోక పోవడంతో జాతి నిర్వీర్య మయింది…

గంగిశెట్టి ల.నా. :

వదలడం వేరు; హింసకు గురి చేయడం వేరు. హింస పలు రకాలు. భౌతిక హింసే, హింస కాదు.

అంటే ఆ నాడు అందరూ బౌద్ధ అనుయాయులే నన్న మాట! అయితే లభ్యమవుతున్న మెగాస్తనీస్ ఇండికాను బట్టి, అతను శాండ్రోకట్టస్ (చంద్రగుప్త) రాజాస్థానానికి వచ్చే నాటికి, ఈ దేశమంతటా కృష్ణ (విష్ణు) ఆరాధన ప్రబలి ఉందని చెప్పడమేమిటి? పోనీ అంతకు మునుపు అలెగ్జాండర్ ఈ దేశం నుంచి వెనక్కి వెళ్తూ, మార్గమధ్యంలో బాబిలోనియాలో మరణించే ప్రయాణంలో, తన వెంట మూడు వందలమంది ముని/ ఋషులను తీసుకు (‘పట్టుకు’)వెళ్లాడు అని చెప్పడమేమిటి? అంతకూ మునుపు ఆ గ్రీకులకు మధ్య ఆసియా సంతల్లో భారత సంపదను పరిచయం చేసిన వణిక్ప్రముఖులెవరు? బౌద్ధులు కారా? చారిత్రక కాలంలో, అటు పడమటికైనా, ఇటు తూర్పు దీవులకైనా సముద్ర వాణిజ్యాన్ని అభివృద్ధి పరచింది నిస్సంశయంగా బౌద్ధులే! దానికి అపారమైన మన శాసనాలే సాక్ష్యం. రాజులు ముఖ్య ప్రజాభీష్టం కొద్దీ ఆగమ హైందవాన్ని ఆదరిస్తే, రాణుల ఆదరణతో, వణిక్కుల ఆదరంతో బౌద్ధం నిలదొక్కుకొంది. శిల్పాది కళలకు పట్టుగొమ్మగా నిలిచింది..

ఎంత సాహస శౌర్యాలు ఉంటే, బంగాళాఖాతం వెంబడి సముద్రయానానికి నాటి వారు పూనుకొని ఉంటారో ఒక్కసారి ఊహించండి. ఎంత ఆర్థిక పుష్టిని వారు కూరిస్తే, రాజు సైన్య సంపద పెంచుకొని ఉంటాడో భావించండి…. జాతిని అహింస పేరిట వారు నిర్వీర్య పరచారనే నింద ఎలా వచ్చింది ( ‘అహింసో పరమో ధర్మః’ అని దాన్ని బోధించింది వైదికమే అని మీక్కాస్తా ముందు హైమ గారన్నారు పాపం)…

ఇక్కడ ఇంతకీ ఇక్కడి నా ప్రశ్నను మరచిపోతారెందుకు? ఈ శాంకర మతస్థులకి బౌద్ధమంటే నాటికీ, నేటికీ ఎందుకింత అసహనం? ఇది చరిత్ర విద్యార్థిగా మాత్రమే నా సందేహం- నేను ఆ రెండు మతాలకు చెందిన వాడను కాను కనుక!

అన్నట్టు, అహింసను బోధించి జాతిని బుద్ధుడు నిర్వీర్యపరచాడన్న వారు, పరోక్షంగా హింసకు వత్తాసు పలుకుతున్నారా??

రాణి సదాశివమూర్తి గారు:

ఇక్కడ సున్నితంగా ఆలోచించవలసిన కొన్ని ప్రశ్నలు:

  1. వైదిక మతం
  2. బౌద్ధ మతం
  3. జైనమతం … అనే వీటిలో “మతం” అనే పదం వీటిమూల/ఆధార గ్రంథాలలో ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నట్టు ప్రమాణవాక్యాలను చూపగలరా? బౌద్ధ, జైనగ్రంథాలు అవి ఆవిర్భవించిన తొలి శతాబ్దాలలో ఏ భాషలో వ్రాయ బడ్డాయి?
  4. అవి ఆవిర్భవించిన తొలి కాలం ప్రవర్తకులైన గౌతమబుద్ధునికి గాని, ఋషభదేవుని నుంచి మహా వీరుని వరకూ జైనులకు గాని వైదికమార్గమును అనుసరించేవారిపై ద్వేష భావం ఉన్నదా?

అలాగే బౌద్ధ, జైనమార్గముల పట్ల ద్వేష భావము ఉన్నట్లు చతుర్వేద, బ్రాహ్మణ, ఉపనిషత్, వేదాంగ, సూత్రగ్రంథాలలో ఎక్కడైనా ప్రస్తావించారా?

చరిత్రకారుల వైఖరులను స్పృశించకుండా (వాటిని తరువాత విశ్లేషిద్దాం) ఈ ప్రశ్నలకు సమాధానాలు వస్తే ఆ పైన అడగాల్సిన మరికొన్ని ప్రశ్నలను ముందుంచుతాను.

నేను మతవాదిగా మాట్లాడటం లేదు. ఒక సాహిత్య గవేషకునిగా అడుగుతున్నాను.

పిళ్ళా విజయ్:

బౌద్ధ, జైనధర్మాల శాంతి,అహింస, సమానత్వం మొదలైన వాటితో కూడివున్న విధానమే భారతదేశపు పతనానికి మూలకారణమని హిందూ మతతత్వవాదులు ఆరోపిస్తూంటారు.ఇది వాస్తవమేనా?

ఇటువంటి ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చరిత్రలో ఎక్కడా కన్పించడం లేదు. బౌద్ధ, జైన ధర్మాల వారి ఉపదేశాలమీద వాటి పరిణామాలమీద హిందూమతవాదులు చేసిన దోషారోపణలకు ధర్మానంద కోశాంబి తమ గ్రంథాలలో సవివరంగా సమాధానాలిచ్చారు. బుద్ధుని మహాపరినిర్వాణం (క్రీస్తుకు పూర్వం 5-12) తరువాత రెండు శతాబ్దాలకు చంద్రగుప్తుడు తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుడు జైన ధర్మం స్వీకరించాడని చెప్పబడుతున్నది. కాని గ్రీకులను యీ దేశం నుంచి తరిమివేసే సమయంలో ఆయనను అహింసా ధర్మం నిరోధించలేదే? ఆయన పౌత్రుడు అశోకుడు పూర్తిగా బౌద్ధుడయిన తర్వాత కూడా విశాలమైన సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాడే! మహమ్మద్ ఇబ్నకాసిమ్ క్రీ.శ.712లో సింధు ప్రాంతం మీద దాడి చేసినప్పుడు పశ్చిమ హిందూ దేశంలో బౌద్ధమతం నామరూపాలులేవు గదా? అక్కడ బ్రాహ్మణ వర్గ ఆధిపత్యం వృద్ధి చెందుతూ వుందిగదా? ఆ స్థితిలో వున్నప్పుడే ఖలీఫాకు చెందిన ఈ కుర్ర సర్దారు సింధుదేశాన్ని అతిసులభంగా జయించాడు. అక్కడ వున్న హిందూరాజును నిలువునా చంపేశాడు. అతని కుమారైలను తన ఖలీఫాకు కానుకగా సమర్పించాడు. ముస్లిములు పంజాబు సింధు ప్రాంతాలలోని కొన్ని భాగాలను వశపరచుకొన్న తరువాత వంద సంవత్సరాలకు శంకరాచార్యుడు ఉద్భవించాడు.

ముస్లిం నాయకుల దగ్గరనుంచి మన సనాతనులు కొన్ని పాఠాలు నేర్చుకోవలసినది యేమీ లేదా? రాజపుత్రులు చాలా సనాతనులు. వారు అహింసను అసలు దగ్గరకే చేరనివ్వరు. అయినా మహమ్మద్ గజనీ చేతుల్లో వినాశనం పొందారు. ఎందువల్ల ? రాజపుత్రులు బుద్ధుని అహింసా విధానాన్ని అవలంబించడం చేతనేనా?

మహారాష్ట్రలోని పీష్వా పదవిలో ఎప్పుడూ బ్రాహ్మణులే ఎక్కువగా ఉండే వారు. కడపటి బాజీరావ్ పీష్వా కార్యదీక్షకు ప్రసిద్ధి చెందినవాడు. పీష్వాల పెత్తనంలో హింస పతాక స్థాయికి చేరుకొన్నట్లుగా కన్పిస్తున్నది. ఇతరులతో జరిగిన యుద్ధాల సంగతి అలావుంచండి. కాని స్వదేశంలోనే పూనాను ఒకసారి దౌలత్ రావ్ సింధియా దోచుకొంటే మరోసారి యశ్వంతరావ్ హెల్కర్ దోచుకొన్నాడు. ఇంతకంటే హింసా పరులు ఇంగ్లీషువాళ్ళ శరణం లోకి వీరు యెందుకు వెళ్ళవలసి వచ్చింది?

జపాను పది పన్నెండువందల సంవత్సరాలనుంచి బౌద్ధ ధర్మం అవలంబించిన దేశంగా వుంది. క్రీశ. 1853 లో కమాండర్ పేరీ వారిపైన తుపాకులు ఎక్కుపెట్టడంతోనే వాళ్ళంతా మేల్కొన్నారు. సంఘటితు లయ్యారు. బౌద్ధధర్మం వారిని యెందుకు బలహీన పరచలేదు? ఈనాటి వియత్నాం బౌద్ధ ధర్మం అవలంబించిన దేశంగా భావించబడుతూ వుంది. అమెరికా వంటి శక్తివంతమైన శత్రువుతో పోరాడి వారు యెలా విజయం సాధించారు? సాంఘిక, ఆర్థిక న్యాయం కోసం వియత్నాం ప్రజలు ఇంత శౌర్యంతో యెలా పోరాడారు? వారి మార్గానికి బుద్దుని అహింస ఎందుకు అవరోధం కల్పించలేదు?

వీటన్నింటిని బట్టి రుజువు అవుతున్నదేమిటంటే పరాజయానికి కారణం బుద్ధుడి ఉపదేశాలూ, మహావీరుని ఉపదేశాలూ కాదు. దానికి వేరే కారణం వుంది. భారతదేశం పరాధీనమయినదనీ, దీనికి కారణం బుద్ధుడు, మహావీరుడు అనీ ఆరోపించడం అతి అన్యాయమైంది.. ( ఆధారం: హిందూ మతతత్వం- ఒక పరిశీలన)

రాణి సదాశివమూర్తి గారు:

ఈ వ్యాసకర్తకు కొన్ని ప్రశ్నలు:

  1. తొలి బౌద్ధ, జైన గ్రంథాలు ఏవి?
  2. అవి ఏ భాషలో వ్రాయబడ్డాయి?
  3. వాటిలో ఎక్కడైనా మతము అనే పదము వాడబడిందా?
  4. అనువాద సహాయం లేకుండా ఆ ఆధారగ్రంథాలను ఈ వ్యాసకర్త ఆద్యంతం చదివారా?
  5. అసలు హిందూ మతము అనే పదము మీరు ఏ ప్రాచీన గ్రంథాలలో చూసారో చెప్పగలరా?

వేదములలోనా? భారత రామాయణములలోనా? పురాణములలోనా?

గంగిశెట్టి ల.నా. :

ఆచార్యా! మీ ఆంతర్యాన్ని గ్రహించి, నా వరకు నాకు తోచిన సమాధానాలను మీ ముందుంచుతున్నాను. ఇవీ మిడి మిడి జ్ఞానంతో చెబుతున్నవే! బౌద్ధ వ్యతిరేకత లేని ఇతర ప్రాజ్ఞులు తగు సమాధానాలిస్తే బాగుంటుంది. వారెందుకో జంకుతున్నారు…

1-2: మతమనే పేరు దేనికైనా కొద్ది కాలమైన పిమ్మట, తదనుయాయులచే కానీ, వారి కంటే విభిన్నమైన సమూహంచే కానీ వ్యవహారార్థం వ్యాప్తిలోనికి వచ్చునట్టిదే కదా! ఏదీ తనపేరు తాను పెట్టుకొని రాదు. ఎవరో అల్పజ్ఞులు తప్ప, తమ బోధలకు ఒక ‘మతమ’ని పేరు పెట్టి వ్యాప్తికి తేబోరు.. పైపెచ్చు నాటి ఆత్మ జ్ఞాన సంపన్నులు, ఋషులు ఎక్కడా, తమ పేరు చెప్పుకొన్న వారు కూడా కారు కదా!

పైపెచ్చు అప్పటి వారి దృష్టిలో మత మన్న మాటకు అర్థం కూడా వేరు కదా. అంతెందుకు 16 వ శ. నాటి ఒక తెలుగు శాసనంలో ‘త్రిమతాల వాండ్లున్నూ’ అనే మాట ఉంది. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మతస్థులనుద్దేశించి వాడిన మాట.. కనుక మతమనే మాటకప్పుడు, ఇప్పటి భావనకు అవకాశమే లేదు… అప్పుడు మతమంటే దృక్పథం, దర్శనసంప్రదాయం

3.బౌద్ధ, జైన గ్రంథాలు ప్రాకృతాన్ని తమ రచనా భాషగా స్వీకరించాయి, జన బాహుళ్యానికి అందుబాటులో ఉండడానికి… సకృత్తుగా మాత్రమే, సంస్కృతంలో రాశారు.

4.ఋషభ దేవుని నుండి పార్శ్వనాథుడి వరకు తన పూర్వులందరినీ వర్ధమానుడు, తమ సంప్రదాయ ఆది తీర్థంకరులుగా సమ్మానించాడనేది అందరెరిగినదే. వారికే శ్రమణులనికూడా వ్యవహారమని చదువుకొన్నాము. అవ్యక్త బ్రహ్మమును కాదని, వ్యక్త ఆత్మ స్థితిని వీరు అనుసరించారని, పరమాత్మ స్థితి విచారము కంటే ఇది ముఖ్యమంటూ, దాని విషయమై ఇదమిత్థమంటూ చెప్పకపోవటం వల్లనే వీరికి ‘శాద్వాదులు’ (cf. శాయద్- హిందీ) అనే పేరు వచ్చిందనేది కూడా సువిదితమే… రాధాకృష్ణ పండితుల వారి భావనలో, ‘they are reforms’ (in Vedic thought / Hinduism); revolutions కావు.

ఇక 5 వ ప్రశ్న: యూరోపియనులు, అందునా డచ్ వారు ఈ గడ్డపైకి వచ్చాక కానీ, మహమ్మదీయులు కాని వారినందరిని కలిపి ఒక పేరుతో వ్యవహరించవలసిన అవసరం ఏర్పడలేదు. అందునా వలసరాజ్యం ఏర్పడ్డాక, వారు ఈ దేశీయులను వారి వారి పారంపరిక ధర్మాల, ధర్మశాస్త్ర రీతుల ననుసరించి, పాలించవలసిన అవసరం ఏర్పడడంతో, వాటిని వారి భాషల లోకి అనువదించవలసిన సందర్భం ఉత్పన్నం కావడంతో, నాటికింకా మొఘల్ రాజ్యంతో పాటు, ఇతర ముస్లిం పాలకులు కూడా ఉండడంతో, మహమ్మదీయే తరులందరికీ కలిపి ఈ సామూహిక నామం అనువర్తింప చేసే స్థితి వచ్చింది. It is a colonial state development. ఓరియెంటలిజం అనే మాటకు కూడా అపుడే వ్యాప్తి వచ్చింది.

తమాషా ఏమిటంటే తెలుగు వారికి Gentoos అనే పేరు కూడా అపుడే వ్యాప్తికెక్కింది. CP బ్రౌన్ గారు ఆ మాటను తన నిఘంటువున కెక్కించి, దాని వెనుక న్యూనార్థం చెప్పేటంత వ్యాప్తి. అయితే అంతకు మునుపు మరో బ్రౌను A Grammar of Gentoo Language రాసేశాడనుకోండి…

4.రెండో పేరా: నాటి మహర్షులు వ్యక్తపరచారని కాదు; తర్వాతి వారైన శాంకరమతస్థులకు- లేదా అద్వైతవాదులకు- ఇప్పటికి కూడా, బౌద్ధమంటే ఎందుకింత అసహనమన్నదే నా ప్రధాన ప్రశ్న! దానికి ప్రత్యేక కారణాలున్నాయా? అందునా సామాజిక కారణాలున్నాయా? అని మాత్రమే తెలుసుకోగోరుతున్నాను. ఎంతో బలవత్తరమైన సామాజిక కారణాలుంటే కానీ, కేవల జ్ఞానమీమాంస విభేదాలతో, ఇంత తీవ్ర అసహనాన్ని వ్యక్తబరచరని నా భావన. దానికి సమాధానాన్ని తెలుసుకోడానికి చాలా మందిని పృచ్ఛించాను కానీ, హేతుబద్ధమైన సమాధానము లభించలేదు…

ఇప్పుడూ నా ప్రధాన ప్రశ్నకు సూటిగా ఎందుకు సమాధానం రావటం లేదు?

రాణి సదాశివమూర్తి గారు:

అసలు నేడు వర్తమాన సమాజంలో వీటి పట్ల జరుగుతున్న గందరగోళం ఎక్కడ అంటే…

  1. చాలా మంది చరిత్ర దృష్టి అంటూ మొదలు పెట్టి తెలుగు చరిత్ర కారులు ఈ బౌద్ధ, జైన వైదిక మార్గాలను మూడింటినీ మూడు మతాలుగా చేశారు.
  2. వివిధ వర్ణాలకూ, కులాలకూ ఈ మూడింటిని అంటుకట్టారు. (అంట కట్టలేదు)
  3. ఇక ప్రతి విషయాన్ని ఈ ప్రాతిపదకపైనే చూస్తూ వచ్చారు.
  4. చెలరేగినవని చెప్పబడుతున్న చరిత్రలో చల్లారిపోయిన చిచ్చులకే ఆజ్యం పోస్తున్నారు కానీ ఆ యా మార్గాల ఆధారగ్రంథాలను ఎవ్వరూ చూడటం లేదు.

వీటిని మతాలుగా వేర్పరచటం 1900-2021 సంవత్సరాల మధ్య పెరిగిన, పెరుగుతున్న, పెంచుతున్న సామాజిక అసమానతలకు ఒక అనివార్యమైన అవసరంగా మార్చుకున్నారు. మార్చుకుంటున్నారు.

ఒక విశ్లేషణ:

బుద్ధుని నాటి బౌద్ధం అశోకుని కాలంలో లేదు.

అశోకుని కాలం నాటి బౌద్ధం కుషాణుల కాలంలో లేదు.

కుషాణులనాటి బౌద్ధం హర్షవర్ధనుని కాలంలో లేదు.

హర్షుని కాలం నాటి బౌద్ధం ఆధునిక లామాల, చైనీయుల, జపాన్, కొరియా లలోని బౌద్ధం లో లేవు.

జైనము అంతే…..వైదికమూ అంతే. హైందవము అనే దృష్ట్యా చూడటం కాదు.

వీటిని మతాలు అనడం భారతీయ సమాజంలో వేర్పాటు కుంపట్లను రగిల్చి వాటిలో ఆరని నిప్పులవర్షాన్ని కురిపించడమే.

నేడు జరుగుతున్నది ఏమిటి?

ఎవరు నమ్మిన భావజాలాల దృష్ట్యా వారి ఆలోచనల క్రోడీకరణం…. యథార్థాల వక్రీకరణం……అసత్యాల ఏకీకరణం

అయితే ఇక్కడ అవసరమైన దృష్టి ఏమిటి?

  1. వీటిని తాత్త్విక దృష్ట్యా చూడండి. అద్భుతాలు కనబడుతాయి.
  2. వీటిని మతాలుగా చూడకండి. మూడు సాధనమార్గాలుగా చూడండి
  3. ఈ మూడు మార్గాల ఆధారగ్రంథాలను అధ్యయనం చేయండి. కేవలం చదవంకండి
  4. బుద్ధుని బౌద్ధాన్ని అధ్యయనం చేయండి. ఉత్తర కాలీనబౌద్ధాన్ని కాదు!

అద్భుతమైన అనుభూతి మీ సొంతం అవుతుంది…. ప్రపంచంలోనే బౌద్ధ తర్కం అద్భుతాద్భుతమైన గణితతర్కం. ఆధునిక గణితశాస్త్ర అపరిష్కృత సమస్యలకు ఎన్నింటికో బౌద్ధ తర్కశాస్త్రం లో పరిష్కారాలు లభిస్తాయి. ఆ సంప్రదాయాన్ని రక్షించండి.

  1. మహావీరుని, ఇతర తీర్థంకరుల జైనాన్ని అధ్యయనం చేయండి. ఎంతో మహత్తరమైన నైతిక, ఆత్మిక బలాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు.
  2. వైదిక సాధనా మార్గాలను మీ జీవితాల్లోకి ఆహ్వానించి చూడండి. మీరు విశ్వమంత ఎత్తుకు ఎదుగుతారు. విశ్వమే మీరు కాగలుగుతారు. వసుధైక కుటుంబ భావాన్ని అనుభవించగలుగుతారు.

వైదిక మార్గం అంటే సర్వే భవన్తు సుఖినః

గంగిశెట్టి ల.నా. :

మీ మాటలతో ఎవరూ విభేదించలేరు. చక్కటి సమన్వయాత్మకమైన మాటలు. ప్రపంచంలోని ఏమతాన్నయినా ఇదే సమన్వయ దృష్టితో చూడవలసి ఉంటుంది. ఈ సందర్భంగా, ‘అన్య మతాలు’ అనే మాట పట్ల స్పృహ కలిగిన వారిని, రాధాకృష్ణుల వారి Recovery of Faith అనే చిరుపుస్తకాన్ని చూడకోరుతున్నాను. చిన్నదే అయినా అద్భుతమైన రచన.

డా. రాయదుర్గం విజయలక్ష్మి:

ముగిసిపోయిన చర్చను మళ్ళీ కొనసాగిస్తున్నందుకు క్షంతవ్యురాలను! కానీ చెప్పకుండా ఉండలేని స్థితివలన, చెప్పాలనుకుంటున్నాను.

దశావతారాలలో నవమావతారంగా బుద్ధావతారాన్ని పేర్కొనడాన్ని గమనించగలం. చారిత్రక బుద్ధుడు, పౌరాణిక బుద్ధుడు అని ఇద్దరు బుద్ధులు ఉన్నారన్న ప్రచారం ఒకటి గమనింపదగినది. మిగిలిన అవతారాలన్నిటికీ, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ నేపథ్యం కాగా, ఒక్క బుద్ధావతారం మాత్రం అందుకు భిన్నమైనది. త్రిపురాసుర సంహారంకోసం, త్రిపురాలలో నాస్తిక మత ప్రచారం, త్రిపురాసురుల భార్యల శీలభంగం, వంటి పాషండపు పనులు చేసి శ్రీ మహావిష్ణువు, త్రిపురాసురులను సంహరించాడట! ప్రచారం చేసింది నాస్తిక మతాన్ని కాబట్టి అది అనుసరణీయం కాదని….

అయితే, ఒక్క బుద్ధావతారంలోనే ఈ వ్యతిరేక భావన రావడానికి కారణం ఏమిటి?

అసలు, పౌరాణిక బుద్ధుని ప్రసక్తి ఎప్పటినుండి కనిపిస్తుంది?

విష్ణు పురాణంలో, మాయామోహుడు రాక్తాంబర ధారియై, జితేంద్రియుడై, శూన్యవాదమును (విజ్ఞానవాదమును) బోధించినాడు, (సన్నిధానం సూర్యనారాయశాస్త్రి..ఆస్తికత్వము)అని కనిపిస్తున్నది. ఈ శూన్య వాద భేదాలు తలసూపింది, విజ్ఞానవాద భేదం తలసూపింది, నాగార్జునుని కాలంలోనే..

కాశీఖండంలో పుణ్యకీర్తి, పద్మపురాణ, విష్ణు పురాణాల్లో మాయామోహుడు అని వర్ణింప బడినాడే గాని బుద్ధుడు అనే పేరు కనిపించదు. అర్హత, అర్హత(నేను చెప్పిన ధర్మమునకు మీరు అర్హులు) అని బోధింపబడిరి కనుక, అసురులు అర్హతులైనారని, బుద్ధ్యత, బుద్ధ్యత (నేను చెప్పినది మీరు తెలిసి కొనుడు) అని బోధింపబడిరి కనుక, “బౌద్ధులైర”ని విష్ణు పురాణం చెబుతున్నది (చూ: సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి, ఆస్తికత్వం).

వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో, శ్రీరాముడు, జాబాలితో, “యధాహి చోరస్సతథా హి బుద్ధః/ తథాగతం నాస్తిక మన్త్ర విద్ధిః (శ్లోకం: 109) అని నిందించినట్లు ఉంది. భాగవతపురాణంలో దేవతల శత్రువులను వ్యామోహింపజేయడం బుద్ధావతార కృత్యమని, ఆంధ్ర భవిష్య పురాణంలో, “శ్రవణ మనన నిధి ద్యాసనములను మూడక్షులుగా నాత్మతత్వ సందర్శనంబు గావించు విద్వాంసుడగు జీవుడు త్ర్యక్షుడనబడును. స్థూల, సూక్ష్మ కారణ దేహంబులు మూడును త్రిపురము లనబడును. జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలందు, క్రమముగా విశ్వ తైజస ప్రాజ్ఞ రూపంబులనున్న తనకుపభోగ్యములైన యా మూడు పురంబులును బ్రహ్మతత్త్వంబెరిగిన యా త్రక్ష్యుడు బ్రహ్మజ్ఞాననామక బ్రహ్మాస్త్రంబున నిర్మూలము గావించుట త్రిపుర సంహారక కథయందు నిగూఢమై ఉన్నది…. అని మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు (హరివంశ శేషము..242) వివరించారు.

అసత్యాన్ని కూడా హింస గానే పరిగణించిన బుద్ధునికి అసురస్త్రీల శీలభంగ గ దోషాన్ని అంటగట్టడం, బౌద్ధంపై ద్వేషాన్ని కలిగించడానికే! అసలు బుద్ధావతార కల్పన, బౌద్ధానికి అపవాదం కల్గించడానికి ఏర్పడిందని తెలుస్తోంది. ఈ పద్ధతి ఉత్తర భారత సాహిత్యాల్లో, క్రీ.శ. 11,12 శతాబ్దాలకే వ్యాపించిందనడానికి శ్రీ హర్షుని శృంగార నైషధము, జయదేవుని గీతగోవిందాల్లోని, దశావతార వర్ణనలే ఆధారాలు,

నిందసి యజ్ఞ విధే రహహ శ్రుతిజాతం

సదయ హృదయ దర్శిత పశుఘాతమ్

కేశవ! ధృత బుద్ధ శరీర! జయ జగదీశ! హరే (గీత గోవిందం..)అంటూ, క్రతువులందు పశు వధను దయతో అడ్డుకోవడం అన్న విషయం కూడా పేర్కొనదగినది. పద్మ పురాణంలో, వేనుని గర్వమణచ డానికి, కాశీఖండములో దివోదాసునిలో పరివర్తనను తీసుకొని రావడానికి విష్ణు పురాణంలో త్రిపురాసుర బుద్ధావతార హేతువులను వివరించే అనేకవాక్యతకూడా ఈ బుద్ధావతారం కల్పితమనే చెబుతున్నది.

తిక్కన శాంతిపర్వము (2.38-48) దశావతార వర్ణనలో బుద్ధావతారాన్ని పేర్కొనలేదు. సంస్కృత భారతంలో ‘సాత్వత’ నవమావతారంగా పేర్కొనబడినది. సోమన పండితారాధ్య చరిత్రలో బుద్ధావతారాన్ని పేర్కొంటూ, వైష్ణవుండే బౌద్ధుడు, బౌద్ధుడే వైష్ణవుడని వివరిస్తూ, బౌద్ధ వాదాలను ఖండించాడు. ప్రప్రథమంగా శ్రీనాథుని శృంగారనైషధంలో, స్తుతిరూపమైన బుద్ధావతార వర్ణన కనిపిస్తుంది . ఏక యద్యయ వాది…..అని స్తుతిస్తూ, బుద్ధ! నీ గట్టి హృదయ సంపుటము దాకి మరునంపకోలలు , కుంఠితము లయ్యాయని, మార విజయాన్ని వర్ణించాడు. పోతన భాగవతంలో పేర్కొన్న బుద్ధావతారం కూడా మూలానుసరణమైన రాక్షస సమ్మోహనార్థం ధరించిన అవతారమే గాని, ఈ బుద్ధుడు జన్మించినది మధ్యయుగంలో నట! త్రిపురాసుర వృత్తాంతంలో బుద్ధుని కలిపి చెప్పిన తెలుగు కవులలో , 15వ శతాబ్దానికి చెందిన, పదకవితా పితామహులు అన్నమాచార్యులే ప్రథములు “తరుణుల వలపించు తగిలి పైకొనడు”, “బుద్ధుని మోహాను రాగం”, “కెలసి బిత్తలే తిరిగేటి భూతం”, “పురసతుల మానముల పొల్ల సేసిన చేయి” వంటి వర్ణనలతో, త్రిపుర.. ఉదంతమే పేర్కొనబడినది. రాయల కాలంలో, నంది తిమ్మన, శ్రీకృష్ణదేవరాయలు, ఈ ఉదంతాన్నే వివరించారు. పాండురంగ మాహాత్మ్యంలో, దిగంబరుడు, ముండిత శిరస్కుడు, బర్హి పించము ధరించిన మాయామోహుని వర్ణన చేయబడినది.

వెరసి, తెలియవచ్చేదేమంటే, బుద్ధుని విష్ణువు నవమావతారంగా ఏర్పరచి, బౌద్ధంలోని మంచి లక్షణాలను పశుహింసను నిషేధించడం వంటివాటిని గురించి చెబుతూ, త్రిపుర దాహ కథతో బుద్ధునికి సంబంధాన్ని కల్పించడం, బౌద్ధం పట్ల నిరసన భావాన్ని కలిగించడానికే అని గమనింపవచ్చు.

వజ్రయాన బౌద్ధం లోని గుహ్యసమాజ తంత్రం వలన, విసిగి ఉన్న ప్రజలకు, ఈ త్రిపురాసుర… ఉదంతం మరికొంత ఆజ్యం పోసినట్లు అయింది. బుద్ధుని దశావతారాలలో ఒక అవతారంగా కల్పించడం, పైగా నాస్తిక మతాన్ని బోధించాడు(త్రిపురాలలో) అని చెప్పడం, శీలానికి అత్యంత ప్రాధాన్యాన్నిచ్చిన బుద్ధునికి, రాక్షస స్త్రీల శీలభంగదోషాన్ని అంటగట్టడం…. ఇలా చాపక్రింద నీరులా విష్ణుమూర్తి అవతారంగా రూపెత్తించి, బౌద్ధాన్ని భ్రష్టుపట్టించడం. …ఇవన్నీ ఒక పథకం ప్రకారం నెమ్మదిగా కొనసాగిన ప్రక్రియ. మరి నాటి ప్రజల చేతనలో నిక్షిప్తమై, వర్తనలో ప్రస్ఫుటమవు తున్న ఒక దర్మాన్ని మరుగు పరచాలంటే అంత సులభసాధ్యం కాదుగదా!

ఈ నేపథ్యంలో వెలసినవే, యమధర్మరాజుకు పనిలేకపోవడం, పాపులను పెంచడానికి విష్ణువు బుద్ధావతారం ఎత్తాడనడంవంటి కథలన్నీ కూడా!

హైమా భార్గవ్:

చాలా చాలా వివరంగా, విశ్లేషించారు. అభినందనలు. ఎన్నో గ్రంథాలను రెఫెర్ చేశారు. నిజంగా చెబుతున్నాను. చాలా కృషి చేశారు. ఈ చర్చల వల్ల ఏమీ తేలడం లేదు. మన దేశంలో 500 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలకు చారిత్రక ఆధారాలు లేవు. అన్నీ అసంపూర్తిగా వున్నాయి. అలాంటిది వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాల చరిత్రను నిర్ధారించడం సులభ తరం కాదు. ఆధారాలు దొరికినపుడు అందరం హర్షిస్తాము. అదే తేలడం లేదు కదా. పోతే, బౌద్ధం మీద ద్వేషం కలిగించడానికి విష్ణువును పౌరాణికులు, గ్రంథ కర్తలు నవమ అవతారంగా పేర్కొనడం….అనే వాదన తర్కానికి నిల బడదు అనుకుంటున్నాను. ఒకప్పటి పౌరాణికులు, గ్రంథకర్త లు నిజమైన భక్తినీ, భగవంతుడి పట్ల అంకిత భావం గలిగిన వారు. వారికి తాము నమ్మిన దైవాన్ని వక్రంగా, నీచంగా చిత్రీకరించి, నవమ అవతారంగా చేయవలసిన అవసరం, అనైతిక దృక్పథం లేవు. అలా చేస్తే జనం చీదరించుకునేది బుద్ధుడిని కాదు. శ్రీమహావిష్ణువును. ఈ విషయం జ్ఞానం వున్న ఆ గొప్ప వారికి తెలియదా. ఇంత సింపుల్ లాజిక్ ను మనం ఎందుకు మిస్ అవుతున్నాం.? అలా బుద్ధుడిని నవమ అవతారంగా చూపించి, లేని అటెన్షన్ ను బుద్ధుడికి కలిగించే బుద్ధి తక్కువ పనిని పౌరాణికులు, రచయితలు చేస్తారా? ఒక్క విషయం మనం ఆల్లోచించాలి. వాళ్ళకు కూడా మన లాగే బుద్ధుడి విషయంలో కాస్త కన్ఫ్యూజన్ లేక ఆధారం దొరికి వుండక పోవచ్చు. లేకపోతే ఆ బుద్ధుడి వివరాలు వేరే కావచ్చు. ఇవన్నీ అగమ్య గోచరంగా వున్నాయి. ఏదో కొండను తవ్వి, ఎలకను పట్టినట్లు వుందేమో..అనిపిస్తోంది. అందు వల్ల నేను ఈ పాయింట్స్ చెప్పి విరమిస్తున్నాను….

P.S.:

(ఎలకేమిటి? ఎక్కడ? … సమాధానం లభించలేదు. అసలు నా ప్రధాన ప్రశ్నకు ఎవరూ సమాధానమివ్వటానికి తలపెట్టనే లేదు… ప్చ్… ఎప్పుడు సరైన సమాధానం లభిస్తుందో! ― గంగిశెట్టి ల.నా.)

(సిరికోన భారతి సౌజన్యం).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here