ఈ శాపం మాకెందుకు?

0
52

ఏ చీకటి రాత్రి భూమి మీదికి వచ్చామో
కామాంధుని కౌగిలి ప్రతిరూపం అయ్యామో
పుట్టినరోజుల సంతోషాలు ఎక్కడ?
తల్లిదండ్రులే మా ప్రేమను పక్కకు పెట్టారే
ఏమి చేశామని ఈ శాపం! మాకెందుకు?

ఉదయాన్నే సూర్యునికి నమస్కారం పడేసి
మహా విజ్ఞాన శాస్త్రవేత్తల వలె
గోనె సంచిని ఆస్తిగా భావించి
అపురూపమైన వస్తువులు దారి వెంట
పోగు చేసుకుంటూ ఆత్మవిశ్వాసం మెండుగా!
అవనిపై మా లాంటి అడుగులు ఎవరు వేస్తారు?

ఆహారాన్వేషణ నిరంతర పోరాటం
చెత్త కుప్పల దగ్గర ఉన్న పదార్థాల కోసం
కుక్కల పందుల కోతులతో పోటీపడి
వారిని జయించి నిత్య పోరాటాలతో
కన్నతల్లి ముద్ద కన్నా అడుక్కునేదే ఇష్టం!

నిద్ర సుఖమెరగదన్నట్లు
రాత్రి స్టేషన్లలో అంగడి ముందరో
ఏ వీధి అరుగు మీదనో స్వప్నాలకు దగ్గరగా
రేపటి ఆలోచన లేకుండా ఎంత సుఖం నిద్రో

కాలాలతో పనిలేదు రాత్రింబవళ్లు తేడా లేదు
చదువులు లేని జీవన నిరంతర పోరాటం
ఆదుకునే వారి కోసం అన్వేషణ
మాకంటూ లేదా సమాజములో ఒక స్థానం
ఈ శాపం మాకెందుకు ఇచ్చాడు దేవుడు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here