కాజాల్లాంటి బాజాలు-118: ఈ వదినతో ఇంతే..

0
9

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]హై[/dropcap]దరాబాదులో పుస్తకాల పండగ వచ్చేసింది. ఈమధ్య రెండేళ్ళనించీ కోవిడ్ కారణంగా నలుగురున్న చోటికి వెళ్ళలేకపోతున్న నేను క్రితంసారి బుక్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళలేకపోయాను. చాలా బాధగా అనిపించింది. అందుకే ఈసారి బుక్ ఎగ్జిబిషన్ గురించిన ప్రకటన చూడగానే తప్పకుండా వెళ్ళాలని తీర్మానించేసుకున్నాను. అనుకోడమే తడవు ఒక్కదాన్నీ వెళ్ళేకన్నా వదినని కూడా రమ్మంటే మంఛిదికదా అనిపించింది. ఎందుకంటే వదిన సలహాలూ, సూచనలూ చాలా బాగుంటాయి అనుకుంటూ వదినకి ఫోన్ చేసేను.

“వదినా, బుక్ ఎగ్జిబిషన్‌కి వెడదామనుకుంటున్నాను. తోడుగా వస్తావేమోనని ఫోన్ చేసేను.” అన్నాను.

“అలాగే.. సాయం రావడానికేం భాగ్యం.. ఎప్పుడెడదామనీ..!” అంది వదిన.

“ఆదివారం వెడదాం.. నీకు కుదుర్తుందా!”

“ఆదివారం ఓకే.. కానీ స్వర్ణా, ఏ ఏ పుస్తకాలు కావాలో ముందరే ఒకసారి ఇంటి దగ్గర అనుకుంటే బాగుంటుంది కదా!”

అవును.. ఆమాటా నిజవే అనుకుంటూ

“నిజవే వదినా.. ఏ పుస్తకాలు కొందామంటావ్!” అన్నాను.

దానికి వదిన “మనం ఇంతకాలం లలితాసహస్రాలూ, విష్ణు సహస్రాలూ గుడ్డెద్దు చేలో పడ్డట్టు పారాయణం చేసేస్తున్నాం తప్పితే ఆ నామాల అర్థాలు, వాటి వివరణలూ తెలుసుకోలేకపోయాం.. ఈమధ్య చాలామంది పండితులు ఆ నామాల వివరాలన్నీ, వాటి విశేషాలతో సహా రాసి పుస్తకాలు వేయించేరు. అవి కొనుక్కుందాం..”

ఆ మాట నాకు చాలా నచ్చేసింది. ఎంతైనా వదిన ఎంత బాగా ఆలోచిస్తుందో అనుకుంటూ..

“తర్వాత..” అన్నాను.

“తర్వాత మంచి పాత నవలలు మళ్ళీ కొత్తగా పబ్లిష్ చేసి అమ్ముతున్నారుట.. అవి చూద్దాం”

ఆహా.. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన నవలలు వరసగా కళ్ళముందు కొచ్చేయి. తన్మయత్వంతో..

“ఇంకా..” అన్నాను.

“ఓ పదిమంది, పదిహేనుమంది కలిసి ఈ మధ్య కథా సంకలనాలు వేయిస్తున్నారు. వాటిని చూద్దాం.” అంది.

“ఓకె.. ఇంకా” అన్నాను.

“అసలు ఈ మధ్య మంచి కవిత్వమే చదవలేదు. కవితల పుస్తకాలు కొత్తవి ఏమొచ్చేయో చూద్దాం..” అంది వదిన.

ఆ మాటలకి నేను “నాకు కవిత్వం అర్థం కాదు వదినా.” అన్నాను.

“నేనున్నానుగా.. నీకెక్కడ అర్థం కాకపొతే అక్కడ నన్నడుగుతూండు.” అంది.

“ఊ.. సరే..” అన్నాను నీరసంగా..

“నీకీ సంగతి తెల్సా స్వర్ణా..!” వదిన ఊరించింది.

“ఏంటీ!.” ఫోన్ చెవికి మరీ దగ్గరగా అంటించేసేను.

“ఈమధ్య ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాల్లో మంచి మంచి కథలు వస్తున్నాయి. అందులో కొంతమంది ఆ కథల్ని పుస్తకాలుగా వేసుకుని, ఎగ్జిబిషన్‌లో పెడుతున్నారని చదివేను.. అవి కూడా చూద్దాం.”

“అలాగే.. అంతే కదా..”

“అంతే అంటావేంటి స్వర్ణా, అసలు నువ్వు ఏ ప్రపంచంలో ఉన్నావ్.. చుట్టూ ఏం జరుగుతోందో చూడవా!”

వదిన వేసిన ఈ అభాండానికి నాకు నోట మాట రాలేదు.

“నేనేం చూడలేదు వదినా… అన్నీ చూస్తూనే ఉన్నానుగా,..”

“మరైతే ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్తరకం పుస్తకం ఏదో చెప్పు!”

వదిన సవాలు విసిరింది.

“తెల్లారిలేస్తే తొంభై పుస్తకాలు వస్తాయి.. అన్నీ అందరికీ తెలుస్తాయా ఏంటీ!”

నేనూ విసురుగానే జవాబిచ్చేను.

“అదే చెప్పేది. అన్ని పుస్తకాల్లోనూ ప్రత్యేకమైంది ఏదీ అని.. సర్లే.. నీకెలాగు తెలీదు కదా.. నేనే చెప్పేస్తాను, విను.

గత కొన్నేళ్ళుగా మనం ఉత్తరాలు రాయడం మర్చిపోయేం.. సంగతులన్నీ ఈమెయిల్, వాట్సప్ లలో చెప్పేసుకుంటున్నాం. కానీ ఇదివరకు ఉత్తరాలు ఎంత భావుకతతో రాసుకునేవాళ్లం. పోస్ట్‌మేన్ కోసం ఎంతగా ఎదురుచూసేవాళ్లం.. ఆ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసుకునేలా కొంతమంది రచయిత్రులు ఉత్తరాలు రాసి పుస్తకంగా వేసారు. అది మటుకు తప్పక తీసుకోవాలి. అమ్మకీ, నాన్నకీ, తోబుట్టువులకీ, పిల్లలకీ రాసే ఉత్తరాలు ఎంత బాగుంటాయీ! స్నేహితులూ, భార్యాభర్తలు, ప్రేయసీప్రియులు రాసుకునే ఉత్తరాలు ఎంత భావుకత్వంతో ఉంటాయీ.. అలా అందరూ రాసినవి ఓ పుస్తకంగా వచ్చింది.. అది తప్పకుండా తీసుకుదాం.”

వదిన చెప్పింది ఎంత నిజం! అందుకే నాకు వదినంటే అంత ఇష్టం. అన్నీ ఎంచక్కా తెల్సుకుంటుందీ, అంతే చక్కగా వివరిస్తుంది.. అందుకే వెంటనే సంతోషంగా

“అలాగే వదినా.. అదైతే తప్పకుండా తీసుకుందాం. ఇంకా ఏవైనా ఉన్నాయా!”

“నువ్వు క్రైమ్ కథలూ, అనువాద కథలూ చదువుతావా.. చదివే అలవాటుంటే అవి కూడా చూడొచ్చు.” అంది.

“సర్లే.. అవీ చూద్దాం..” అంటుంటే వదిన మధ్యలో అందుకుని,

“చదవడానికి కథల పుస్తకాలు ముందు నువ్వు తీసికెళ్ళు. నవలలు నేను తీసుకుంటాను. చదివాక ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందాం. సరేనా!”అంది.

“సరే వదినా, ఇంతకీ మనం కేష్ పట్టుకెడితే బాగుంటుందా.. లేకపోతే ఫోన్ పే, గూగుల్ పే చేస్తే మంచిదంటావా!” అనడిగేను.

“ఏవో.. ఆ విషయం డబ్బులు కట్టేదానివి నీకు తెలియాలి. నాకేం తెలుస్తుందీ!” అంది చల్లగా.

నేను తెల్లబోయేను.

“ఇదేంటి వదినా! ఇద్దరం కల్సి కదా కొనుక్కుంటున్నాం.”

“కలిసెక్కడ కొనుక్కుంటున్నాం? నువ్వు కొనుక్కుందుకు వెడుతూ నన్ను సాయం రమ్మన్నావంతే. అయినా నువ్వు కాదేమో కానీ నేనయితే అచ్చమైన తెలుగుదేశంలో పుట్టినదాన్ని”.

“అంటే..!” అన్నాను వదిన అన్న మాట అర్థం కాక..

“అంటే.. తెలుగువాళ్ళని ఎవర్నైనా డబ్బిచ్చి పుస్తకాలు కొనుక్కున్నవాళ్లని చూసేవా! ఎక్కడోక్కడ తెచ్చుకుని చదివి ఇచ్చేస్తారంతే.. నేనూ అంతే..” అంది స్థిరమైన గొంతుతో వదిన.

“మరి నేను రమ్మంటే ఎందుకు వస్తానన్నావూ!” అడిగేను ఉక్రోషం పట్టలేక.

“చెప్పేను కదా, సాయం రమ్మంటే వస్తానన్నానని. ఎవరైనా హోటల్‌కి వెడుతూ రమ్మని పిలిస్తే పిలిచినవాళ్ళే కదా హోటల్ బిల్లు కట్టేదీ! ఆ మాత్రం తెలీదూ!” అంది దీర్ఘం తీస్తూ.

నాకు అదేదో సినిమాలో సౌందర్య బ్రహ్మానందం చేత హోటల్లో ఆర్డర్ ఇప్పించి, బిల్లు అతను కడతాడని చెప్పి, బ్రహ్మానందాన్ని బకరాని చేసిన సీను గుర్తొచ్చింది.

“అంటే నన్ను బకరాని చేస్తున్నావన్న మాట..” అన్నాను కచ్చగా.

“నీలాంటివాళ్లని ప్రత్యేకంగా చెయ్యాలా.. ఇలా నన్ను సాయం రమ్మని పిలిచి నీ అంతట నువ్వే బకరావి అయిపోలేదూ!”

పకపకా నవ్వుతూ వదిన ఫోన్ పెట్టేసింది.

ఎంత జాణవమ్మా వదినాఆఆఆఆఆఆ… అంటూ పళ్ళు గట్టిగా పిండుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here