ఈనిన జింక

0
6

[dropcap]జిం[/dropcap]క ఈనింది –
మరో జీవ సృష్టికి కారణమైంది
ఓ కొత్త జీవ పదార్థ సృష్టికి మురిసిపోయింది
ప్రకృతి అందాలకు మరో అందెను చేర్చింది.

మనిషి గరుత్మంతున్నుండి –
విమానాన్ని సరికొత్తగా సృష్టించినట్లు
అంతటి ఘనకార్య రచన చేసినందుకు
ఆనందం – గర్వం…

తల్లి తన పిల్ల ఒడలినంతటినీ
పుడుముతూంది – ప్రేమగా
నాలుక నాళికాగుచ్ఛంతో
చర్మ సంజీవనీ లేపాన్ని పులుముతోంది.

పిల్ల కళ్ళు వెలుగును చూడాలని తపిస్తున్నాయి
కొత్త అనుభవంతో తనువంతా కొట్టుమిట్టాడుతోంది…
స్థావరత్వాన్నించి – జంగమత్వానికి మారాలన్నది దాని తత్త్వం
తప్పటడుగుల నుండి – అడుగులు
అడుగుల నుండి పరుగులు…
పిల్ల – తల్లి మనసుకు ప్రీతి జేసింది –
వినతకు గరుడునిలా…

అప్పుడు
అప్పుడు – అక్కడకు వచ్చిందో వనరాణి!
మృగరాణి – సింహిణి!
ఇంకేముంది! అంతా ముగిసినట్లే గదా!
దానికి తల్లి పరమాన్నం – పిల్ల తాంబూలం కావల్సిందే గదా!
కాక తప్పడమన్నది కలలో జరుగుగాక…
యమధర్మరాజును – ఉత్త చేతుల్తో సాగనంపడానికి –
అదేమన్నా సతీ సావిత్రా లేక మార్కండేయ మహర్షా?…
దున్న కూడా కాదు – ఎదురొడ్డి కొమ్ముల బాకులు ఝుళిపించడానికి –
అల్పప్రాణి – పంజా గాలి వీస్తే ఊపిరితిత్తుల గాలి నిల్చిపోతుంది
అంతా నిశ్చలం – తుఫాను తర్వాత కాలంలా
గోళ్ళ చురకత్తుల చింపబడ్డ చర్మపు ఉడుపులు…
దంత క్షత ఛిద్రాల నుండి వుబికి వచ్చే నెత్తుటి ఊటలు
పెద్ద కొండరాయి క్రింద నలిగిన చిన్న యిసుక దిబ్బ

కుత్తుక నాళం ఆఖరుసారిగా వూదిన తూతకొమ్ము
నిల్చిపోయిన కళ్ళద్దాలు –
నిక్కబడి నిల్చిపోయిన కాళ్లు – అచేతనం
టెంకదీసిన నేరేడుపండు –
తల్లి పరుగందుకుంతే పిల్లైనా చిక్కుతుంది గదా!
కానీ,
తల్లి పరుగందుకోలేదు
పిల్లను కడుపున పొదుగుకుని –
పిల్లతో బాటే చస్తానని –
మృత్యువు ముందు కూలబడలేదు.

ఏమిటీ! తన పిల్లను పొట్టన పెట్టుకోడానికి వచ్చిందా?
ఎవతి అది?
నిలువుటద్దపు సింహిణి ముందు నిల్చుంది జింక!
తల పిడికిళ్ళతో యిమిడివున్న చురకత్తుల్ని –
వంచిన తలతో ఝుళిపిస్తూ –
మృగరాణికి ఎదురుగా సాగుతూంది!
సాగుతూన్న వేగం చిన్నదైనా –
దానిలో యిమిడి వున్న వడికి –
వన రాణి
వనరాణి – అదిరిపడింది!
వనరాణి! బెదురుపడింది!
వెనుకడుగు వేసింది
వెనుకడుగు వేసింది!
అడుగు వెనకకు, వెనుకకు!
వన రాణి!
వనరాణి వెనుదిరిగింది!
వడిగా నడక సాగించింది!
వడివడిగా నడుక సాగించింది –
చురకత్తులతో జింక వెన్నంటుతుంటే –
వనరాణి – ఊహించని ఎదురుదెబ్బతో –
ఓ ఘీంకారం లాంటిదాన్ని కక్కింది –
అవమాన భారంతో గొంకు వడిన ఘీంకారం
అదురు – బెదురు నిండిన వడివడి నడక చాలించి –
మృగరాణి పరుగు లంకించుకుంది!

జింక వెన్నంటి – అల్లంత దూరం తరిమికొట్టింది
జింక వాపసు వచ్చింది – తన పిల్ల చెంతకు.
అప్పటి క్షణాల్లో –
జింకలో పెల్లుబికిన శక్తి ప్రమాణం –
‘యురేనియం’ అణువిచ్ఛిత్తిలో ఉద్భవించిన –
ఉష్ణప్రమాణానికి సమానం!
ఉదజని అణుసంయోగంలో ఉద్భవించిన –
ఉష్ణశక్తి ప్రమాణానికి సమానం!
ప్రజలు –
ఛీకొట్టిన ప్రభుత్వాన్ని గద్దె దించడంలో –
వాడిన ఓటు దెబ్బకు సమానం!
బ్రతుకులు రోసిన నోళ్ళ నుండి వెలువడిన –
శాపనార్థాల శక్తితో సమానం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here