ఈజిప్టు యాత్ర-1

0
9

[box type=’note’ fontsize=’16’] “నైలు నదీ పరివాహక ప్రాంతాన్ని చూస్తే చాలు… ఈజిప్టు గతమూ, వర్తమానం మన కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుందనే చెప్పవచ్చు” అంటున్నారు నర్మద రెడ్డి తమ ‘ఈజిప్టు యాత్ర’ అనుభవాలను వివరిస్తూ. [/box]

నాగరికతకు నడకలు నేర్పిన దేశం

[dropcap]ఈ[/dropcap]సారి మా ప్రయాణం అతి ప్రాచీన నాగరికతకు నెలవైన ఈజిప్ట్ వైపు సాగింది. ప్రపంచ వింతలకు, పురాతన కట్టడాలకు, చారిత్రక నిర్మాణాలకు, మత సంబంధ విశ్వాసాలకు నెలవైన ఈజిప్టును చూడాలని ఎంతో కాలంగా ఎదురుచూశాం. ఆఫ్రికా ఖండంలో ముఖ్య దేశమైన ఈజిప్టుకు మొదటిసారి సముద్రం గుండా వెళితే, రెండోసారి విమానం ద్వారా వెళ్ళి చూశాను. రెండు సార్లు ఆ దేశాన్ని సందర్శించిన నాకు ఎన్నో జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. మొదటి సారి ఆ దేశానికి 2008లో ఒకసారి వెళితే రెండో సారి 2016లో వెళ్ళాను. ఈ మధ్య కాలంలో అక్కడ ఎన్నో మార్పులు వచ్చాయి.

ఈ దశాబ్దం కాలంలోనే అనివార్యపు యుద్ధాలతో, అంతర్గత సంక్షోభాలతో ఆ దేశం చిక్కుకొని ఉంది. పాలస్తీనా శరణార్థులకు సహాకరిస్తున్నాడని, తమ దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఇజ్రాయేల్ కయ్యానికి కాలు దువ్వుతుంటే, పెరుగుతున్న నిరుద్యోగం సమస్య, అస్థిర పాలన, అంతర్గత కలహాలతో ఆ దేశం అట్టుడుకుతుంది. నిత్యం సంచరిస్తూ, తిరుగుతూ వివిధ దేశాల ప్రజలను, ప్రదేశాలను చూడటానికి అలవాటు పడ్డ మాకు ఈ సమస్యలు పెద్దగా కనిపించలేదు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే ఈజిప్టుకు బయలు దేరాం.

ఈజిప్టులో మా పర్యటన కైరో నగరం నుండే ప్రారంభమైంది. కైరో అనేది ఈజిప్ట్ రాజధాని నగరం. ఈజిప్టులో ఇదే పెద్ద నగరం. ఒక రకంగా అరబ్ ప్రపంచంలోనే అతి పెద్ద నగరం కూడా ఇదే. అరబ్బీ భాషలో కైరో అంటే విజయుడు అని అర్థమట. మన హైదరాబాద్ లాగే కైరో నగర వీధులు కూడా చాలా రద్దీగా ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ రూల్స్‌ను పాటించటం లేదు జనాలు. రోడ్డు మూడు లైన్స్‌గా వున్నప్పటికి, ఒకేసారి 5 లేదా 6 కార్లు ప్రయాణిస్తాయి. వీటికి తోడు, ఇక్కడ వున్న పాతకాలం నాటి టాక్సీలు చేసే కఠోరమైన శబ్దం చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఈ ప్రయాణంలో మేము గమనించిన విషయం ఏంటంటే దారికి ఇరువైపుల ఉన్న పురాతన, ఆధునిక భవనాలలో, ఆధునిక భవనాలు ఈ కాలం టెక్నాలజీని ఉపయోగించి కడితే, పాత భవనాలు మాత్రం ఇటుకలతో కట్టి వాటికి సున్నాలు కూడా వేయకుండా అలాగే వదిలేసిన ఇళ్లు ఉన్నాయి.

ఈ కైరో నగరంలో ప్రయాణిస్తుంటే నాకు కొన్ని నెలల క్రితం వరకూ అక్కడ జరిగిన అల్లర్లు గుర్తుకు వచ్చాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేసింది ఇదే నగరంలో కదా అని గుర్తుకు వచ్చింది. ఏ దేశంలోనైన ప్రజలకు అనుకూలంగా పాలన కొనసాగించకపోతే, వారి కోరికలు తీరకపోతే ప్రజల నుంచి తీవ్ర నిరసననే వ్యక్తం అవుతుంది. కొంత కాలం క్రితం ఈ నగరం కేంద్రంగా ఇలాంటి ఘర్షణలే, గొడవలే చెలరేగాయి. ఈ ఘర్షణలో వందలాది మంది చనిపోగా వేలాదిమంది గాయపడ్డారు. మా ప్రయాణానికి ముందు పరిస్థితి.

8 కోట్ల జనాభా కలిగిన ఈజిప్టు. పశ్చిమాసియాలోనే పెద్దదేశమైన ఈజిప్టు ఒకప్పుడు వలస పాలకులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దేశం. పక్కన ఉన్న ఇజ్రాయేల్లో పాలస్తీనాకు చెందిన అరబ్బులను అక్కడినుంచి వెళ్ళగొడితే వారిన అక్కున చేర్చుకున్న దేశం కూడా ఇదే. కానీ క్రమంగా పొరుగు దేశాలపట్ల, అక్కడి నుంచి శరణార్థులుగా వచ్చిన వారిపట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా దేశంలో కూడా ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నారు.

ఈ దేశాన్ని 30 ఏళ్లు పాలించిన ముబారక్ పాలనలో ప్రజల సంక్షేమం కోసం పనులు చేయకపోగా వారికి వ్యతిరేకమైన పాలనను కొనసాగించాడు.

ముబారక్ పాలన గురించి ఒక పత్రిక “కైరోలో ధనికులకూ, పేదలకూ మధ్య వ్యత్యాసం రోజు రోజుకు పెరిగిపోతుందని, కొద్ది మంది పెద్దవారి లాభాల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిందని ఫలితంగా ప్రజల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు పెరిగిపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది” అని రాసింది.

ముప్పై సంవత్సరాల ముబారక్ పాలనతో విసిగి పోయిన ప్రజలు “ముబారక్ దిగిపో”, ప్రజాస్వామిక పాలననూ, ప్రజాస్వామిక హక్కులను పున:స్థాపించాలి” అంటూ ఆందోళనలు నిర్వహించారు. కొద్ది రోజుల్లోనే రాజధాని కైరోనుండి ప్రజాఉద్యమం అన్ని నగరాలకూ వ్యాపించింది. విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు, జనాభాలోని ఇతర సెక్షన్లు లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు.

తహీర్ స్క్వేర్ అనే ప్రాంతంలో దేశం నలుమూలలనుండీ 20 లక్షల మంది అక్కడకు చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనను నిర్వహించారు. నిరసనకారులపై ప్రభుత్వం సైన్యాన్ని దింపి బుల్లెట్ల వర్షం కురిపించింది. అరెస్టులు సాగించింది. అయితే ఈ చర్యలు ప్రజల ఆగ్రహాన్ని మరింతగా పెంచాయి. భద్రతా దళాన్ని రంగం నుండి తప్పించి, టాంకులతో, సాయుధ శకటాలతో సైన్యం ప్రవేశించింది. సైన్యానికి బయపడకుండా ప్రజలంతా నైలు నది ఒడ్డునా, ప్రధాన నగరాల్లో రోజుల తరబడి పోరాటం చేయడంతో చివరకు ముబారక్ ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చింది.

అయితే అంతర్గత సంక్షోభం ముగిసిపోయింది కానీ తరచూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చుట్టూ ఉన్న ఇజ్రాయెల్, పాలస్తీనా, సిరియా మొదలైన దేశాలన్ని యుద్ధాల్లో మునిగిపోయి ఉండటంతో ఈ దేశంపై కూడా నిత్యం యుద్ధ మేఘాలు కమ్ముకొనే ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో మేము కైరోలో అడుగు పెట్టాం. మేము హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండానే అక్కడికి చేరుకున్నాం.

అక్కడికి చేరుకున్న వెంటనే మాకు మాకు ఊహించని ఆహ్వానం లభించింది. అయితే మేము హోటలని మా గదికి చేరుకునే క్రమంలో ఒక లిఫ్ట్‌ను ఎక్కాము. కాని అవి చాలా పాతవి కావడంచేత అవి సరిగ్గా పనిచేయలేదు. తీరా రూంలోకి వెళితే అది మేము ఉహించని రీతిలో ఉంది. ఈ హోటల్‌లో రెండవ రాత్రి గడపకూడదని నిర్ణయించుకున్నాము. వెంటనే అదే వీధిలోని మరొక హోటల్ అయిన “మచ్ న్యూస్’ (Much newes) లో బుక్ చేసుకున్నాము. మా పర్యటన ప్యాకేజ్‌లో భాగంగా మేము ఈ హోటల్స్‌లోనే ఉండాలి కానీ అక్కడి వాతావరణ సరిగ్గా లేకపోవడంతో వేరే హోటల్‌కి వెళ్ళక తప్పలేదు. ఆ రాత్రి అక్కడే మా భోజనాన్ని ముగించుకొని అండ్రియా అనే కంపెనీ వారు నిర్వహిస్తున్న ఒక కార్యక్రమానికి వెళ్ళాము. అనుకోకుండా అక్కడికి వెళ్ళడం. పైగా స్టేజీకి దగ్గరలోనే ఉండటం వల్ల ఆ మూజిక్ సిస్టం చేసే శబ్దం వల్ల బాగా ఎంజాయ్ చేయలేకపోయాం. కానీ ఆ ముగ్గురి ప్రోగ్రామ్లను మాత్రం చాలా బాగా చూసాము. ఒక ప్రొగ్రామ్‌లో ఒక సింగర్ ఇంగ్లీష్, అరబిక్, స్పానిష్‌లో పాటలు పాడితే, ఇంకో ప్రొగ్రామ్‌లో బెల్లీ డ్యాన్స్ చేసింది. ఇది ఈజిప్టులో చాలా కాలంలో సంప్రదాయంగా వస్తున్న డ్యాన్స్. అయితే క్రమంగా ఆదరణ కోల్పోతుంది. ఇక మూడవ ప్రొగ్సామ్ ఇద్దరు డ్యాన్సర్స్ చేసిన ప్రదర్శన చాలా బాగుంది. వీరు Tanoura అనే డాన్స్ (నృత్యం)ను చేసారు. ఒకే పొర (layer)లా వున్న వస్త్రమును ధరించి, విడివిడిగా వారి శరీరం మొత్తంను వృత్తాకారం (circle) లో తిప్పుతు, చేసిన నాట్యం అది. శరీరంతో పాటు, వారి తల కూడా వృత్తాకారంలో తిప్పుతు వారు చేసిన నాట్యం చూడడానికి చాలా అందంగా, అద్భుతంగా వుంది. చిరవకు మా ఈ రోజు రాత్రి ప్రోగ్రామ్‌ని ముగించి హోటల్‌కు చేరుకున్నాము.

ఉదయం మేము వేరోక హోటల్‌కు వెళ్ళిపోయాము. ఇది మునుపటి కంటే చాలా బాగుంది. నిన్నటి డ్రైవరే మళ్ళీ మమ్మల్ని హోటల్ నుండి తీసుకొని, మేము ముందే మట్లాడుకున్న మా గైడ్ రైరియా’ (Rairia) దగ్గరకు తీసుకొచ్చాడు. ఇతనితో మేము మా టూర్ (పర్యాటన) ఫ్యాకేజీని మొత్తం ముందే మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి అతనే మాకు మొత్తం తిప్పి చూపించాడు.

మొదట మేము గీజాకు వెళ్ళాం. ఈజిప్టు అంటేనే మనకు మమ్మీలు, పిరమిడ్లు గుర్తుకు రాక మానవు. ఎందుకంటే మనం స్కూల్ పుస్తకాల్లో చదువుకున్నవి, సినిమాల్లో చూసినవి ఇవే కదా. ప్రపంచంలోనే అత్యంత గొప్పగా, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమైనవి. ప్రాచీన మరియు మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబాలు అని చెప్పవచ్చు. ఇవి వాస్తవానికి ఈజిప్టు రాజుల సమాధులు.

ఈ పిరమిడ్లలోని ‘గీజా’ వద్ద నిర్మిణమైన ఖుపూ, ఖమ్ర, మెంకార్ పిరమిడ్లు చాలా పెద్దవి. ఈ పిరమిడ్లు చాలా ఎత్తు, ఎత్తున ఉన్నాయి. పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్టును “పిరమిడ్ ఆఫ్ గీజా’ అని కూడా పిలుస్తారు. ప్రాచీన ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈ పిరమిడ్‌ను నాలుగవ ఈజిప్టు ఫారో అయిన ‘ఖుపు’ మరణాంతరం దీనిని 20 ఏళ్ల పాటు నిర్మించారట. అయితే ఈజిప్టు రాజ వంశానికి చెందినవారు మరణించినప్పుడు వారికోసం పిరమిడ్లను నిర్మించాలని ఇంహోటెప్ అనే వాస్తు మొదట ప్రతిపాన చేశాడట. అతని ప్రతిపాదన అప్పటి రాజులకు నచ్చడంతో దీని కార్యరూపం దాల్చింది.

తర్వాత మేము వెళ్ళిన ప్రదేశం పేరు సక్కర (Sakkara). సక్కర అనేది ఒక పవిత్రమైన సమాధి వున్న ప్రదేశం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈజిప్టులో మొదటి పిరమిడ్‌ను నిర్మించినది ఈ ప్రాంతంలోనే. ఇది ప్రపంచంలో, రాతితో నిర్మించిన మొదటి పిరమిడ్. అదే Djoser యొక్క పిరమిడ్. ఈ పిరమిడ్లు క్రీ.పూ 27వ శతాబ్దిలో నిర్మించారు. ఇది ఒక రకంగా పూర్తిగా నిర్మించని కట్టడం అనే చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ఇలాంటి అసంపూర్ణ నిర్మిత పిరమిడ్లు చాలా వున్నాయి. వీటి పైభాగం ఎలాంటి కప్పు లేకపోవడంతో మేము మేము అందులోకి వెళ్లి చూశాం. వీటిని చూశాక మేము తిరిగి వస్తూ ఈజిప్టు పురాతన సంప్రదాయాన్ని తమలో దాచుకున్న రెండు ప్రాంతాలను దర్శించాము. అందులో ఒకటి ప్రాచీన కాలంలో నూనెను నిల్వలచేనే ప్రాంతం అయితే, ఇంకోటి మనం ఇవాళ వాడుతున్న కాగితానికి పూర్వ రూపమైన పేపర్‌ను ఎలా తయారు చేశారో తెలిపే ప్రాంతం అది. నైలునదీ ప్రాంతాలలో విరివిగా పెరిగే సైపరస్ పాపిరస్ మొక్కను ఉపయోగించి ప్రాచీన గ్రీకులు పలుచని కాగితం లాంటి పాపిరస్ పదార్థాన్ని రాయడానికి ఉపయోగించేవారు.

ఆ ప్రాంతంలో సంప్రదాయకరమైన ఈజిప్టు నూనె (Oil) ను వుంచే ప్రదేశంలో దాన్ని చూసి దాని గురించి తెలుసుకున్నాం. ఇక రెండవది ఫాపిరస్ (Papyrus paper) ను వుంచే ప్రదేశం. ఫాపిరస్ ను సమాధులపై చిత్రపటాలు, శిలాశాసనాలు వేయడానికి ఉపయోగిస్తారు. ఆ ప్రదేశం (store) లోకి వెళ్ళి, దాని తయారీ విధానం, ఉపయోగించే విధానం తెలుసుకున్నాము. మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఫాపిరస్’ను ఉపయోగించే మందు అది నకిలీనా లేదా నిజమైనదా అని సులభంగా తెలుసుకోవచ్చట. నిజమైన ‘ఫాపిరస్’ పై రాసిన శిలాశాసనాల పై కాంతి (light) పడినప్పుడు వాటిపై గల చిత్రపటాలు మరియు శాసనాలు అలాగే వుండి ప్రతిబింబిస్తాయి. కాని నకిలీవి చెల్లాచెదురుగా విడిపోతాయి. లేదా అన్ని ఒకే వరుసలోకి వస్తాయి. ఏదేమైనా ‘ఫాపిరస్” చూడటానికి అద్భుతంగా వున్నా చాలా ఖరీదైనది. అందువల్ల అక్కడ మేము ఏమి కొనకుండానే మా ప్రయాణ దారి అయిన గీజకు తిరుగుప్రయాణం అయ్యాము.

మా గైడ్ చెప్పిన దాని ప్రకారం గీజాలో చిత్రించిన సాంప్రదాయ చిత్రాలన్నీ ఎక్కువగా, మూడు పెద్ద పిరమిడ్ల పైనే చిత్రించారని. కారణం ఆ మూడు సమాధులు ఫారో రాజులవి కావడం. వీటిలో పాటు మేము అక్కడ మొత్తం మొత్తం తొమ్మిది పిరమిడ్లు ఉన్నాయి. మిగిలిన ఆరు ఈ ఫారో రాజుల యొక్క భార్యలు మరియు వారి యొక్క పిల్లలవి. అన్నింటికంటే ముఖ్యమైన పిరమిడ్ “The Great” పిరమిడ్. దీని పొడవు 146 మీటర్లు, వాటి పొరలు (layers) ‘123’ వున్నాయి. నేను తరువాత శవపేటిక వుంచిన పిరమిడ్ లోపలి భాగంలోకి వెళ్ళాను. అందులో ఎలాంటి కాంతి ప్రసరించుటలేదు. చాలా చీకటిగా వుంది. ఇది నాకు చాలా ఎగ్జయిట్‌మెంట్ అనిపించింది.

స్ఫింక్స్

అక్కడి నుంచి స్ఫింక్స్ (Sphinx) ను చూడటానికి వెళ్ళాము. అది ఒక అద్భుతమైన పురాతన, పౌరాణిక వింతజీవి ఆకారం. ఇది మానవ నిర్మితమైన అతి ప్రాచీన కళాఖండాలు అనటంలో సందేహం లేదు! సింహం శరీరం, పక్షిలాగా రెక్కలు ఉంటాయి. మనిషి మొహం, సింహం శరీరం, పక్షిలాగా రెక్కలు గల పౌరాణిక రూపమే స్పింక్. ఒక సున్నపురాతి కొండనే ఆ విధంగా మలిచారు. ఆ ముఖం ఫారో కాఫ్రిది అని చెబుతారు. దీన్ని క్రీ.పూ 2613- 2494 మధ్య కాలంలో నిర్మించారట. దీని వెనుక ఒక చిన్న కథ చెబుతారు. అప్పటి కాలంలో రాజులు తాము అతి శక్తి మంతులు గా ఊహించుకుని, సింహం అంతటి శారీరక బలం, మానవుడికి ఉండే పదునైన తెలివితేటలు కలిస్తే కలిగే రూపాన్ని ఇక్కడ ఒక పెద్ద విగ్రహంగా కట్టించుకున్నారట. భూగర్భ శాస్త్రజ్ఞులు అంచనాల ప్రకారం. ఉత్తర ఆఫ్రికా సముద్ర ప్రాంతాల్లో 50 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం సముద్రనీటి భూమి ఉపరితలంపై పేరుకున్న సున్నపు రాయితో స్ఫింక్స్‌ని చేసినట్టు కనుగొన్నారు.

రెండో రోజు మేము మరిన్ని ప్రదేశాలను తిరిగి చూసాము. అందులో మొదటి ప్రదేశం ఆల్ ఖలీఫా వాల్ మొఖట్టమ్ (Alkhalifa walmoquattam) ప్రాంతం. ఇక్కడే మహ్మద్ మహ్మద్ ఆలీ ఫసా యొక్క మసీదు నిర్మించబడినది. ఈ మసీదును “మహ్మద్ అలీసాఫా” తన మరణానికి ముందే నిర్మించుకున్నాడట. తన మరణాంతరం తనను ఈ మసీదులోనే సమాధి చేయాలని దాన్ని పాలరాయిచే నిర్మించారు. కానీ దాని బయటి నిర్మాణం మాత్రం రాగిచే తయారు చేసారు. దాని లోపలి భాగం మాత్రం చెక్కతో నిర్మించారు. దీనిలో ముఖ్యమైనది ఏంటో తెలుసా ఈ మసీదులోకి వెళ్ళిన కాంతి మొత్తం ఒకే చోట నిక్షిప్తం అయి వుంటుంది. అదీ 365 సంఖ్యను సూచిస్తుంది (ఒక సంవత్సరాని వుండే రోజుల సంఖ్య కావచ్చు..!).

అక్కడ మేము ముస్లిముల యొక్క ప్రార్థన చేసే విధానాలను, వారి మత సంప్రదాయాలను కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా మసీదులోని ‘5’ స్తంభాల యొక్క ప్రాముఖ్యతను కూడా అడిగి తెలుసుకున్నాము. ప్రార్థన అనేది వీరి మతంలో అతి ముఖ్యమైన పాఠం.

దీని తరువాత మేము Misr Al Qadima-Al Davoura కు చేరుకున్నాము. ఇది ఒక క్రైస్తవుల చర్చి (ప్రార్థన మందిరం) ఉన్న ప్రదేశం అది. అక్కడ నిర్మించిన చర్చిని “హోలీ ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్’ అని అంటారు. ఈ స్థలానికి క్రైస్తవ మతానికి ముఖ్య వ్యక్తి అయిన జీసస్ బాల్యానికి సంబంధించిన ముఖ్య ఘట్టం ఈ ప్రాంతంలో జరిగిందనే కారణంతో దాన్ని క్రైస్తవులు ముఖ్య దర్శనీయ స్థలంగా భావిస్తారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న బెత్లహేంలో జీసస్ పుట్టిన తర్వాత అక్కడి రాజు నుండి జీసస్‌కు ప్రమాదం ఉందని తెలిసి అతని తల్లి మేరీ, మరియు జోసఫ్ అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈ ఈజిప్టులోని ఈ ప్రాంతంలో కొంత కాలం తలదాచుకున్నారట, దాదాపు 3 సంవత్సరాలు ఈ ప్రాంతంలోనే జీసస్ నివసించి తిరిగి హేరోద్ రాజు మరణించిన తర్వాత తన కుటుంబంతో ఇక్కడి నుంచి తిరిగి స్వస్థలానికి వెళ్ళాడని బైబిల్ కథ ఆధారంగా క్రైస్తవులు నమ్ముతున్నారు. ఈ చర్చి ఇటుకలతో కాకుండా పిల్లర్లతో నిర్మించారు. ఈ చర్చి మొత్తం ముద్రించిన చిత్రపటాలతో నిండి వుంది. ఈ చర్చి యొక్క అడుగు భాగం మాత్రం మూయకుండా తెరిచి వుంచారు. అందులోనుండి జీసస్, మేరీ మరియు జోసఫ్ నిద్రించిన స్థలాలను కూడా చూడవచ్చు. ప్రస్తుతం రోమన్ క్యాథలిక్ పర్యవేక్షణలో ఉన్న ఈ చర్చికి నిత్యం పర్యాటకులు వస్తూ పోతూ ఉంటారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here