ఈజిప్టు యాత్ర-2

0
9

[box type=’note’ fontsize=’16’] “నైలు నదీ పరివాహక ప్రాంతాన్ని చూస్తే చాలు… ఈజిప్టు గతమూ, వర్తమానం మన కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుందనే చెప్పవచ్చు” అంటున్నారు నర్మద రెడ్డి తమ ‘ఈజిప్టు యాత్ర’ అనుభవాలను వివరిస్తూ. [/box]

ఈజిప్టు మ్యూజియం

జీసస్ క్రైస్ట్ బాల్యానికి సంబంధించిన విషయాలను చూసిన తర్వాత అక్కడి నుండి మేము ఈజిప్ట్ మ్యూజియానికి వెళ్ళాం. ఈ మ్యూజియంలో ఈజిప్టుల యొక్క జాతీయ సంపదను, నిధి నిక్షేపాలకు భద్రపరిచారు. ఈ మ్యూజియం పది కంటే ఎక్కువ మమ్మీలను, వాటిని భద్రపరిచిన, శిథిలావస్థలో వున్న శవ పేటికలను మరియు సమాధి చేయబడినప్పుడు వుంచిన కానుకలు, వారి ఇష్టమైన వస్తువులతో నిండిన పేటికలు చాలా వున్నాయి. ఇందులో 1,20,000కి పైగా పురాతన వస్తువులూ 12 మమ్మీలూ ఉన్నాయి. దీన్ని 1902లో నిర్మించారు. 2011లో ఈజిప్టులో జరిగిన తిరుగుబాటులో కొన్ని విగ్రహాలనూ రెండు మమ్మీలనూ ఆందోళనకారులచే ధ్వంసం చేయబడ్డాయి. ఇందులో ప్రధానంగా చూడదగ్గది టూటన్ కామెన్ మమ్మీని ఉంచిన బంగారు శవపేటిక. ఇది ప్రపంచంలోకెల్లా ఖరీదైన శవపేటికగా పేరొందింది. అప్పట్లో ఆయన ముఖానికి 14 కిలోల  బంగారు తొడుగు తొడిగారు. ఆయన కోసం చేయించిన బంగారు మంచం, కుర్చీ, నగలు కూడా అక్కడ ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమింటే ‘టూటన్ కామెన్’ మహారాజును నాలుగు పవిత్రమైన స్థలాలలో సమాధి చేయడం.

2011లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా తిరుగుబాటు చేసిన సందర్భంలో ఈ మ్యూజియంను దోచుకునే కొంతమంది విద్రోహులు దోచుకోవడానికి ప్రయత్నిస్తే ఆ మ్యూజియంను కాపాడుకోవడానికి 3000 మంది విద్యార్థులు, యువకులు మ్యూజియం చుట్టూ గొలుసుకట్టి రక్షణగా నిలిచిన జాతి సంపద అయిన ఆ మ్యూజియంను కాపాడుకున్నారట..!

తరువాత మేము లగ్సర్ (Luxor) కు చేరుకున్నాము. అక్కడ మేము సోఫిటెల్ వింటర్ పాలేస్ అనే హోటల్ (Sofitel Winter Palace Hotel) లో దిగాము. ఈ హోటల్ను 1866 సంవత్సరంలో ఒక ప్రముఖ బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్తతో నిర్మించబడింది. అయితే ఇది విపరీతంగా చాలా అందంగా అలంకరించబడి వుంది మేము గతంలో వున్నవాటికంటే.

గత 7 సంవత్సరాల నుండి జరుగుతున్న అల్లర్ల కారణంగా ఈజిప్టుకు రావలసిన ప్రయాణీకుల (పర్యాటకుల) సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ విధంగా సందర్శకుల సంఖ్య తగ్గటంతో ఈజిప్టు మీద చాలా ప్రభావాన్ని చూపించింది. కారణం ఎక్కువ మంది ఈజిప్టుల జీవనోపాధి అనేది, పర్యాటక రంగంపైనే ఆధారపడి వుండటం. మాకు ఈ హోటల్ దానికి మంచి ఉదాహరణంగా అనిపించింది. కారణం ఈ హోటల్ చూడటానికి బాగా ఖరీదైనదిగా, అందంగా కనిపిస్తుంది. కానీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. అల్లర్ల కారణంగా పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా వుంది. కారణం ఈజిప్టు ప్రభుత్వం టూరిస్టుల రాకపోకలు తగ్గించాయి. పై కారణంగా మేము వెంటనే అక్కడి నుండి బయలుదేరి మేము వెళ్ళవలసిన చోటుకు వచ్చాము.

మొదట మేము చేరుకున్న ప్రదేశం కోలోస్సి ఆఫ్ మీమ్నన్ (Colossi of Memnon). మేము అక్కడ రెండు విగ్రహాలను గమనించాము. అవి ఫారో Amenhotep III విగ్రహాలు. అవి పూర్తిగా శిథిలావస్థలో వున్నాయి. కాని ఇప్పటికి అవి చూడటానికి చాలా ఆకట్టుకొనే విధంగా వున్నాయి. ఇవి శిథిలావస్థలో వున్న ఫారోల గుడి ముందే నిలబడివున్నాయి.

Colossi of Memonon లోని Amenhotep విగ్రహాల సందర్శనం తరువాత అక్కడి నుండి మేము థేబాస్ నెక్రోపోలిస్ (Theban Necropolis) కు వెళ్ళాము. నిజానికి మేము అక్కడికి వెళ్ళింది Deirol-Bahari (or) Dyrol alBahri చూడటం కోసమే. ఇది ఒక విచిత్రమైన, క్లిష్టమైన స్మశాన వాటిక. ఇది దేవాలయాలు మరియు సమాధులతో నిండిన ప్రదేశం. ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ Deire-Bahari అనే శిధిలావస్థ స్థితిలోని Hatshepsi యొక్క మందిరం.

ఈ దేవాలయం యొక్క గోడలపై Hatshepsut అనే ఈజిప్టు రాణి యొక్క చిత్రపటాలను మరియు ఆమెకు పొరుగు దేశాలతో గల వ్యాపార సంబంధాలకు సంబంధించిన విషయాలను రాయడం జరిగింది. అదేవిధంగా ఈ మందిరంలోని గోడలపై అనేక రకాల జంతువుల, ఆవుల, చేపల, కాంతి కిరణల చిత్రపాటాలను కూడా చిత్రించడం జరిగింది.

నిజానికి Hatshepsut రాణి న్యాయంగానే, అతి చిన్న వయసులోని ఫారోల దగ్గర నుండి సింహాసనంను తీసుకుంది. కానీ ఫారోలు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత, Hatshepsut దేవాలయంను ధ్వంసం చేసి, దాని గోడలపై గల చిత్రపటాలను మరియు గోడలపై చెక్కిన ముద్రణలను చెరిపేసారు. ఇప్పుడు ఒకవేళ మనం అక్కడికి వెళ్తే అక్కడ ఎలాంటి అచ్చులు, ముద్రణలు ఆమెకు సంబంధించినవి (కొన్ని ప్రదేశాల్లో తప్ప) కనిపించవు.

వ్యాలీ ఆఫ్ కింగ్స్:

దీని తరువాత మేము అక్కడి నుండి “వ్యాలీ ఆఫ్ కింగ్స్” కు చేరుకున్నాము. ఆ ప్రదేశం 63 కంటే ఎక్కువ సమాధులు, వాటికి సంబంధించిన గదులు వున్నాయి.

అందులో కొన్నింటి మీద వాటి యొక్క నిర్మాణ తేదీ క్రీ.పూ.16వ శతాబ్దానికి సంబంధించినవిగా వ్రాయబడినది. ఈజిప్టుకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి ఈ వ్యాలీ ఆఫ్ కింగ్స్. ఈజిప్టుని పాలించిన ఫారో చక్రవర్తుల మరణాంతర జీవితం ఉంటుందని విశ్వసించేవారు. అందుకోసం భారీ యెత్తున నిర్మించిన పిరమిడ్లు వ్యాలీ ఆఫ్ కింగ్స్‌లో చూడవచ్చు. క్రీ.పూ. 1069 నాటికి క్రమంగా సమాధులు నిర్మించటం ప్రారంభించారట. అయితే పిరమిడ్లలో ఉంచిన మమ్మీలనూ సంపదలనూ దుండగులు కొల్లగొడుతుండటమే దీనికి కారణం కావచ్చు. ఈ భూభాగంలో సహజసిద్ధంగా ఏర్పడిన పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఫారోలు తాము జీవించి ఉండగానే తమ అభిరుచికి అనుగుణంగా తమ సమాధులని ఇక్కడ తీర్చిదిద్దుకున్నారు. వీటిలో టూటస్ కామెన్ సమాధి ఒకటి. కైరో మ్యూజియంలోని మమ్మీలన్నీ ఇక్కడ బయటపడ్డవే. ప్రస్తుతం ఈ వ్యాలీలో కేవలం మూడింటిలోకే ప్రవేశం ఉంటుంది. భూమిలోపలి పొరల్లో గుహలు తొలచి నిర్మించబడ్డాయి. అద్భుత కుడ్యచిత్రాలతో కూడిన టూటన్ కామెన్ సమాధి అతని మమ్మీని చూడవచ్చు.

ఇపుడు ఈ ప్రాంతం ప్రపంచంలోనే ముఖ్యమైన పురావస్తు పరిశోధన స్థలం ఉంది. ఈ ప్రదేశంలోనే రాజు టూటన్ కామెస్ మరియు అతనికి సంబంధించిన వస్తువుల యొక్క సమాధులు 1922లో కనుగొనబడ్డాయి. మేము వెళ్ళిన సమయం మధ్యాహ్న కావడం పైగా ఎక్కువ వేడి ఉండటంతో మేము చూడాలనుకున్న మూడు సమాధులలో రెండింటిని చూసి, ముఖ్యమైన మూడవ సమాధి అయిన రాజు టూటన్ కామెస్ సమాధి వద్దకు చేరుకున్నాము.

ఆ సమాధిలో రాజు టూటన్ కామెస్ మమ్మీ (ఎండిన శవం), మరియు Seti మమ్మీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ 1922 సంవత్సరంలో Howard Carter జరిపిన త్రవ్వకాలలో రాజు టూటన్ కామెస్ యొక్క సమాధికి చాలా వరకు ధ్వంసం అయినది. కారణం అతని యొక్క పురాతత్వ శాస్త్ర పరిజ్ఞాన నైపుణ్యం సరిగ్గా లేకపోవటం. అందువలన అతనికి సంబంధించిన మమ్మీ శవ పేటిక ఈజిప్టులోని కైరో మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇతని సమాధిలో ఆశ్చర్యకరమైన ముద్రణలు, శాసనాలను కనుగొన్నారు. ఈ ముద్రణలో ఉపయోగించిన రంగులు ఎక్కువగా ప్రకాశించలేవు, కాని ఉత్తేజమైన కాంతి ఈ రంగుల పైన పడినప్పుడు ఈ రంగులు చూడటానికి చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే ఈ రంగులను సహజ సిద్ధమైన ఖనిజాల నుండి తయారు చేసినవి. అక్కడ మెరుస్తున్న నీలం రంగు, నవరత్నాల నుండి వస్తుంది మరియు పచ్చరంగు అయనీకరణం చెందిన రాగి (copper) నుండి బయటకు వస్తున్నాయి. అదేవిధంగా వివిధ రకాల రంగులు కూడా అందులో నుండి బయటకు ప్రకాశిస్తున్నాయి. ఆ సమాధిలోని ప్రతి అంగుళం ఊహా చిత్రాలతో వ్యాపించి వుంది.

కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, అక్కడ ఫొటోలు తీసేందుకు అనుమతించకపోవడం. అందువల్ల మేము ఆ లోయలో ఎలాంటి ఫొటోలు తీసుకోలేదు.

వ్యాలీ ఆఫ్ కింగ్స్‌ని చూసిన తరువాత మేము అక్కడి నుండి కర్ణక్ (Karnak) దేవాలయంను దర్శించుకున్నాము. ఈ దేవాలయంను ప్రత్యేకంగా ఆమున్ (Amun) అనే దేవుడు దర్శనార్థం నిర్మించారు. దీనిని క్రీ.పూ 2000 సంవత్సరంలో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వాటిలో రెండవది. మొదటిది ఏమిటంటే, దీని ప్రత్యేక నిర్మాణం గల “Hypostyle” హాల్ (Hall. ఈ గదిలో 134 కంటే ఎక్కువ స్తంభాలతో, 16 వరుసలలో నిర్మించబడినది. అందులోని 122 స్తంభాలు 10 మీటర్ల పొడవు మరియు మిగిలిన 12 స్తంభాలు 21 మీటర్ల పొడవు కలిగి, చూడటానికి చాలా పెద్దవిగా (భారీగా) అద్భుతంగా కనిపిస్తాయి. ఈ మందిరం నిర్మించడానికి ముఖ్యకారణం దేవుడు Amun ను ప్రార్థించుటకే ఇంత భారీ నిర్మాణం.

మేము Luxor ను వదిలి, మళ్లీ తిరిగి కైరోను చేరుకున్నాము. అక్కడ నుండి వంటనే అలెగ్జాండ్రియా (Alexandria) కు చేరుకున్నాము. మా Alexandria పర్యాటనను త్వరగా ముగించాలని అనుకున్నాము. అందుకే కైరో చేరిన వెంటనే ఇక్కడ వచ్చాము.

అలెగ్జాండ్రియాలో గ్రంథాలయం

అలెగ్జాండ్రియాలో తప్పకుండా చూడాల్సింది అక్కడి గ్రంధాలయం. ఒకప్పుడు ప్రపంచములో అతి పెద్ద గ్రంథాలయం ఇది. 3వ శతాబ్దము మొదటి భాగములో ఈజిప్ట్ కి చెందిన తోలేమి- II సమయములో ఇది నిర్మించినట్లు కనుగొన్నారు. గ్రంథాలయం, దాని భాగములు అనేకసార్లు మంటలలో కాలిపోయినవట. ఇక్కడ చేతితో రాసిన అనేక అనేక అరుదైన గ్రంధాలు ఆ మంటల్లో కాలిపోవడంతో ప్రాచీన కాలానికి చెందిన విలువైన సమచారం అందుబాటులో లేదని చాలా మంది చెబుతుంటారు. 2003లో ఈ గ్రంధాలయాన్ని పునరుద్దరించినప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగిన అంతర్గత ఘర్షణలో కూడా ఈ గ్రంధాలయం స్వల్పంగా దెబ్బతిన్నదట.

అక్కడికి దగ్గరలోనే ఉన్న Alexandria సమాధులను చూసాము. కాని ఈ సమాధులను నిర్మించినది రోమన్స్ (Christian Romans) కావడంతో అతి వారి నిర్మాణ శైలీనే పోలివున్నాయి. ఇలాంటి వాటినే మేము గతంలో రోమ్లో కూడా చూసి ఉండటంతో వెంటనే ఆ పోలికను గుర్తించగలిగాము. వీటి గోడలపై గల చిత్రణలు, బొమ్మలు రోమన్స్చే వేయబట్టప్పటికీ అవి ఈజిప్టుకు చెందినవి కావడంతో ఇది రెండు ప్రాంతాల సంస్కృతిని నిర్మాణ శైలీ ఇందులో కనిపిస్తుంటుంది. తరువాత మేము Pompey’s pillar ను చేరుకున్నాము.

పంపీ స్తంభము

ఇది రోమ్ సామ్రాజ్య విజయోత్సవ స్తంభము. పురాతన కాలము నాటి కట్టడములలో ఇప్పటిదాకా అలెగ్జాండ్రియాలో నిలబడి ఉన్న కట్టడము ఇది. అలెగ్జాండ్రియాలోని పురాతన ఎత్తైన ప్రాంతం పై దీన్ని నిర్మించారు. అరబ్బుల సమాధుల పక్కన ఉన్న ఈ స్తంభం 30మీ. (99 అడుగులు) ఎత్తున ఉంది. ఇది దాదాపుగా 132 ఘనపు మీటర్లతో లేక దాదాపుగా 396 టన్నుల బరువుతో ఉంది. మన దేశంలో అశోకుడు మొదలైన రాజులు తమ పరిపాలనకు చిహ్నాలుగా అక్కడక్కడ శాసనాలు రాళ్ళపై చెక్కి ఉంచినట్టు ఇక్కడ కూడా పంపీ స్తంభములు నిలబెట్టి ఉన్నాయి. ఈ ప్రాంతం చూడటానికి చాలా ఏకాంతంగా వుంది.

మా గైడ్ చెప్పిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, రోమన్స్‌కు ఈజిప్టు వారు అన్నా, వారి సంప్రదాయాలు అన్నా కూడా చాలా ఇష్టం అని. అందుకే వారికి సంబంధించిన నిర్మాణాలను, సంప్రదాయాలకు సంబంధించిన వాటిని నాశనం చేయలేదు అని చెప్పాడు. అలెగ్జాండ్రియా పట్టణం ఈజిప్టు రెండవ పెద్ద పట్టణం అయినప్పటికీ అక్కడ పెద్దగా టూరిస్టులు లేకపోవడంతో అక్కడినుంచి త్వరగా తిరిగి వచ్చాము.

నైలు నది

ఈజిప్ట్ గురించి ఇన్నీ వివరాలు చెప్పిన తర్వాత నైల్ నది గురించి చెప్పకపోతే అది సంపూర్ణం కాదు. నైల్ నది అనేది ఈజిప్ట్ దేశానికి గుండె వంటిది. చిన్నప్పుడు ఎప్పుడో నైల్ నది ఈజిప్ట్ నాగరికతకు మూలం అని చదువుకున్న మాకు ఈజిప్ట్ యాత్ర జరిగే దాకా అది ఎంత నిజమో నాకు అనుభవంలోకి రాలేదు. ప్రపంచంలో అతి పొడవైన నదిగా పేరుపొందిన నైల్ నది మొత్తం 6600 కిలోమీటర్ల పొడవులో ఉంటే ఒక్క ఈజిప్ట్ లోనే 1500 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఎక్కడో ఈజిప్ట్ దక్షిణంగా ఉన్న విక్టోరియా సరస్సులో పుట్టి, సుమారు 8 దేశాల గుండా ప్రవహించి, ఈజిప్ట్‌లో ఉత్తరంగా ఉన్న మెంఫిస్ దగ్గర పాయలుగా విడిపోయి, మెడిటెర్రేనియన్ సముద్రంలో కలుస్తుంది.

నాగరికతన్ని సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే నదుల వెంట ప్రయాణిస్తే చాలు, అన్నీ అర్థమవుతాయన్నట్లు ఈ నైలు నదీ పరివాహక ప్రాంతాన్ని చూస్తే చాలు… ఈజిప్టు గతమూ, వర్తమానం మన కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుందనే చెప్పవచ్చు.

ఎన్నో ఏండ్లుగా వెళ్ళాలి, చూడాలి అనుకున్న ఈజిప్టు యాత్ర మాలో అనేక అనుభూతుల్ని మిగిల్చిందనే చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here