ఏకాంత సాధన

0
13

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఏకాంత సాధన’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్లోకం:

యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః
(భగవద్గీత 6వ అధ్యాయం, 10 వ శ్లోకం)

[dropcap]యో[/dropcap]గ స్థితిని పొందగోరేవారు నియంత్రించబడిన మనస్సు-శరీరంతో, కోరికలను, భోగవస్తువులను త్యజించి, నిత్యమూ ఒంతరిగా ఏకాంత స్థలము నందు నివసిస్తూ భగవత్ ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. వారు సావధానంగా మనస్సును నియంత్రిస్తూ వుండాలి.

ఎలా అయితే విద్య, ఆటలు, లలిల కళలలో నిష్ణాతత సాధించేందుకు అభ్యాసం అవసరమో అట్టి అభ్యాసం ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా చాలా అవసరం. ప్రతిరోజూ ధ్యాన అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక ప్రావీణ్యత సాధించే పద్ధతిని భగవంతుడు పై శ్లోకం ద్వారా సాధకులకు తెలియజేసాడు.

మొదటి విషయం ఏకాంత ప్రదేశం యొక్క అవసరం. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంలో కొట్టుమిట్టాడుతూ వుంటాము. ఈ ప్రాపంచిక కార్యక్రమాలు, జనులు, మరియు మాటలు, మన మనస్సుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి. మనస్సును కోరికల వలయంలోకి నెట్టి అతలాకుతలం చేస్తాయి. మనస్సులోని ప్రశాంతతను పూర్తిగా కలుషితం చేస్తాయి. మనస్సుని భగవంతుని వైపు ఉద్ధరించటానికి, కొంత సమయాన్ని ప్రతిరోజూ ఏకాంత సాధనకు ఉపయోగించాలి.

ఏకాంతం అంటే మనకు ఎవ్వరూ అవసరం లేకపోవడం. మనలో మనం స్నేహితులుగా మారి మనల్ని మనం దర్శించగల ఆలోచన ఇది. ప్రతీ క్షణం వస్తువులతో, సొషల్ మీడియాలో, స్నేహితుల సమక్షంలో కాలక్షేపం చేసే మనకు ఈ ఏకాంత సాధన ఎంతో అవసరం.

భగవంతునికై ప్రాకులాడని జీవతం నిరర్థకమని మనం ఎంత వరకు భావించగలుగుతున్నామనేదే మన ఆధ్యాత్మిక జీవితపు తీవ్రతను నిర్ధారిస్తుంది. మనం ఆశలు ఐహిక సుఖాలతో తృప్తిపడుతున్నంత కాలం ఆధ్యాత్మికాపేక్షకు బలం చేకూరదు. జీవితంలో ఈ సాంసారిక విషయాలకు ప్రాముఖ్యాన్నిస్తున్నంత వరకు మన ఆధ్యాత్మిక జీవనం కేవలం సాంప్రదాయక రీతిలోనే ఉండిపోతుంది.

ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడూ ఏకాంతమే బలమయిన ఆయుధం. దానిని సద్వినియోగపరుచుకోవాలే కాని అధ్బుతాలు సృష్ఠించవచ్చు.

చాలా మంది వ్యక్తులలో సంకల్ప శక్తి చాలా బలహీనంగా అయినందున వారికి చిన్నతనంలో పాఠశాలలు మరియు కళాశాలలలో క్రమశిక్షణ లేనందున, వారు భౌతిక ప్రభావాలకు లోనవుతున్నందున, వారు ఏకాంతంలోకి వెళ్లడం అవసరం అంటారు మానసిక వేత్తలు.

తన కోరికలను తగ్గించుకున్నవాడు, ప్రపంచం పట్ల కొంచెం కూడా ఆకర్షణ లేనివాడు, వివక్ష మరియు వైరాగ్యం ఉన్నవాడు, భగవంతుని అనుగ్రహం కోసం పరితపించేవాడు, భౌతిక ప్రపంచం నుండి విముక్తి కోరేవాడు, నెలల తరబడి మౌనాన్ని పాటించేవాడు ఏకాంతంగా జీవించగలడు.

పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా సదా భగవన్నామాన్ని మనసులోనే జపిస్తూ, ఆయనను స్మరించేందుకు ప్రయత్నించాలి. నిరంతరం అలా సాధనచేయడంవల్ల నామస్మరణ అప్రయత్నంగానే చెయ్యగలం అట్టివారే కాలక్రమంలో యోగులుగా మారగలరు.

భగవంతుని యందే మనస్సు సంలగ్నం చేయడం యోగి యొక్క మొదటి కర్తవ్యం. క్షణకాలం కూడా మరవకుండా భగవంతుని స్మరిస్తూ వుండాలి. ఈ విధంగా భగవంతుని ఆరాధనలో కాలం గడపగలిగితే త్వరలోనే సమాధి అవస్థకు చేరుకోగలడు.

తన ఆత్మానుభవానికి అనుకూలమైనవాటిని స్వీకరించడం, ప్రతికూలమైనవాటిని విసర్జించడం పట్ల అనుక్షనం జాగరూకుడై వుండాలి. సాధన నిరంతరంగా ఉండాలి. అప్పుడు ఒక్కడే ఆత్మసాక్షాత్కారం పొందగలడు అన్నది విస్పష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here