ఏకాంత సేతువు..!

0
7

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]అ[/dropcap]టుకేసి తిరిగి పడుకున్న శ్రీనివాసరావును చూసి గాఢంగా నిట్టూర్చింది రాజ్యం. నీలిరంగు పల్చని వెలుతురులో ఫ్యాన్ శబ్దం ఏకాకి నౌక చప్పుడులా విన్పించసాగింది. అలాంటి ఎన్నో రాత్రులను చూసి, భరించి విసుగెత్తిపోయింది రాజ్యానికి. ఆమె కళ్లల్లో కన్నీరింకిపోయి, కరిగిపోయిన విషాదపు చివర్లు, కొత్తలో తడి తడిగా మెరిసే మీనాల్లా కదలాడే కనుపాపల్లో శ్రీనివాసరావు రూపాన్ని అపురూపంగా భద్రపర్చుకుంది. గతాన్ని తల్చుకోగానే పూడ్చుకోలేని ఖాళీ జాగా ఆమె మది గదిలో సరీసృపంలా జొరబడింది. తన పెళ్లయిన కొత్తలో ఏం పాపం చేసిందో తనకే తెలియని ఒక అమాయకత్వం.. ముగ్ధత్వం.. తనకంటే వయసులో అధికుడైన శ్రీనివాసరావును.. అతని శిథిల శిశిరం లాంటి ఒంటరితనపు శూన్యాన్ని, గతాన్ని అందుకోలేని మానసిక పరిణితి తనది.. అప్పుడప్పుడు ఆయనలో పడగ విప్పే క్రోధం.. హిమపుశకలంలా ఆయనలో ఘనీభవించిన నిర్లిప్తత.. తనకేం పట్టదన్న ఏకాంత బైరాగితత్వం.. ఇవన్నీ.. ఇవన్నీ రాజ్యంలో ఆయన పట్ల విముఖత.. ఒక అయిష్టత.. ఒక డోలాయమాన అయోమయ స్థితిలోకి నెట్టివేశాయి.

వేడి అన్నం ప్లేట్‌ను ఎందుకో తెలీని అసహనంతో చటుక్కున గిరావాడేసిన రోజు.. అన్నం మెతుకులు చెల్లా చెదురై శోకదేవతల్లా గదంతా పర్చుకొని అలుముకున్న దుఃఖపు తీవ్రతను తనలో ప్రతిఫలింపజేసే లావాలా ఎగజిమ్మలేదూ!? ఇక ఆ రోజు పగలంతా తన గదికే పరిమితమై.. ఆ అవమానాభారాన్ని ఎవరికీ చెప్పుకోలేని దుఃఖపు జీరని గుండెల్లో జొకొట్టుకొని.. ఒక సుషుప్తిగా తనలో జొరబడ్డ నిశ్శబ్దత.. తన చుట్టూ ఆవరించుకున్న, ఆవరించుకున్న పెగలని విషాదాన్ని గొంతులో నొక్కి పట్టి, ఎలా సాంత్వన పొందాలో, తెలియని అశాంతిలో కొట్టుమిట్టాడుతూ.. గుచ్చుతున్న గతాన్ని.. ముళ్ళలాంటి కాలపు ఘడియల్ని నెమరేసుకోసాగింది రాజ్యం!..

***

రాజ్యానికి తన గదే తన ప్రపంచం! శ్రీనివాసరావుతో పెళ్లయ్యాక మూడు గదుల సొంతింటి వాటాలో అడుగు పెట్టింది రాజ్యం. తనకు బరువు.. బరువుగా అన్పించిన క్షణాల్ని.. తన మనసుకేం బాగోలేని కాలాన్ని, ఎక్కడ ఓదార్పు పొందాలో తెలీని పరిణతి చెందని అనుభవరాహిత్యాన్ని పొరలు.. పొరలుగా రాల్చేసుకునేందుకు తన గది ఒక్కటే తనకు మాత్రమే సొంతమైన అంతర్నిబిడ ధ్యానకేంద్రమైంది. అదే గదిలో ఓ పక్క చిన్న కిరోసిన్ స్టవ్.. వంట పూర్తవగానే సర్ది పెట్టుకున్న కుదురైన వంట పాత్రలు.. స్టవ్ ఆర్పగా వచ్చిన కమురు వాసన.. మరో వైపు పప్పుడబ్బాలు, అటుకుల డబ్బాలు నిండిన ఇనుప అరల బీరువా.. కిరోసిన్ నీలి పొగ గదంతా పర్చుకొని పైన పెట్టుకున్న దేముడి ఫోటోలకు అంటుకున్న మసిపూత.. అటు పక్కనే శ్రీనివాసరావు మొదటి భార్య బ్లాక్ అండ్ వైట్ ఫోటో.. చందమామ బిళ్లల్లాంటి చీరలో.. చిక్కని కనుబొమల నడుమ నుదుటన కాసంత బొట్టు.. భుజంపై ఓ పక్కన నిర్లక్ష్యంగా పర్చుకున్న నల్లని చిక్కని కురులు.. ఆమె కళ్లు నిశ్శబ్దంగా.. తదేకంగా తననే గమనిస్తున్నట్లుగా ఉండేవి. మొఖం తిప్పుకుంది రాజ్యం.. ఆ చూపుల్లోకి కళ్లు పెట్టి చూసేంత సాహసం లేనందుకు.. ఆమెలో ఏదో మూలన తప్పు చేశానన్న గిల్టీ కాన్షస్ లోన మానని గాయంగా చుర్రమనసాగింది. మరో వైపు ఓ చిన్న టేబిల్ ఫ్యాన్ నల్లని రెక్కలతో సుతారంగా, ఆహ్లాదంగా గాలిని వీస్తూ.. తన గదికి ఉన్న ఒకే ఒక చిన్న కిటికీ.. ఆ కిటికీకి మధ్యలో తను అల్లి కట్టుకున్న ఒక చిన్న అడ్డుతెర.. నవ్వుకుంది రాజ్యం.. ఈ అడ్డుతెర సాక్ష్యంగా తనలో చెరలేగే భావాల్ని.. మదిలో నియంత్రించుకోలేని ఎవరికీ చెప్పుకోలేని కోరికల పై ఇలాగే తెర దించుకోవాలేమో!?

మధ్యాహ్నం కిటికీ మూయగానే చిక్కని చీకటి మునివేళ్ళతో తనను పసిపాపలా లాలిస్తూ.. తనలో గూడుకట్టుకున్న వెచ్చని కన్నీటి బొట్లు కనుకొలుకుల గుండా తలగడపై పేరుకున్న ఉప్పునీటి మరకలు.. ఆమె చెదిరిన కాటుకలేఖలు గదిగోడలను అంటిపెట్టుకున్న నల్లని నుసిబొగ్గులా.. గది మూలన అల్లుకున్న సాలెగూడు పల్చని నల్లమబ్బు గూడు కట్టినట్లు విషణ్ణవదనంతో తననే పరికిస్తునట్లు ఊహించుకునేది రాజ్యం. ఉదయాస్తమాయాలు.. ఋతువు మరే వేళాలూ.. ఎవరన్నా గేటు తీసుకొని లోపలికి వస్తే.. ఆశ్చర్యపు దృక్కులకు ఆ కిటికీనే రాజ్యానికి మనోచక్షువు. గదిలో వర్షంలా కురుస్తున్న.. వయసు పెరుగుతున్న ఆమె అనుభవాల ఉక్కబోత.. తన నుండి తనను విడమర్చి చూసుకోలేని నిస్సహాయత.. తానెవరో ఇంట్లో.. తన స్థానమేమిటో కనుక్కోలేని పొత్తిలి దుఃఖం.. లోన సుళ్ళు తిరుగుతూ ఆమెను ప్రతీరాత్రీ వేదిస్తాయి.. రోదింపజేస్తాయి.. ఓ సుఖమూ.. సాన్నిహిత్యం.. మానసిక శాంతి.. సౌఖ్యమూ.. పెదవులపై కాసింత చిర్నవ్వు.. ఏదీ పొందని జీవితమైంది. అన్నీ ఉన్నా.. శ్రీనివాసరావు తనకేమి ఇవ్వడు.. తాను ఆనందపడడు.. తననూ ఆనందపెట్టడు.. నిశ్శబ్దంగా గింజుకున్నకొద్దీ.. ఊబిలోకి లోలోతుగా దిగబడటం తప్ప నేనేం చేయగలను? అనుకున్నప్పుడల్లా.. రాజ్యంలో వయసు తెచ్చిన ఉడుకుమోతుతనంలోన చిక్కని రక్తంతో కలిసి బుసబుసమనేది. గుండెల్లో ఎంతో ఉండీ ఎటూ ఏమీ అనలేని తనంతో కొట్టుమిట్టాడే రాజ్యం.. అతడ్నేదో సాధించాలి అన్న నిరసనజ్వాలలో మండిపోతూ.. తనలో నెగడులా ఎగజిమ్మే క్రోధావేశాకీలలను అదిమి పెట్టుకోలేక గయ్యాళిలా అన్నింటికీ నోరు పారేసుకునేది, అన్న మానసిక జబ్బు బారిన పడి, అదెలాగూ తనను కమ్ముకున్న గుడ్డి వెన్నెలలా.. అదే సుఖమని భావిస్తూ.. వదిలించుకోలేని.. వదలని అబ్సెషన్‌లా ఆ గయ్యాళితనం తన నరనరాన జీర్ణింపచేసుకుంది రాజ్యం.. అందరూ తనను చూసి భయపడేలా.. ప్రేమరాహిత్యంతో కొట్టుమిట్టాడుతూ.. తననెవరూ ప్రశ్నించలేని ఆధిపత్యధోరణిని నిర్మించుకుని, శ్రీనివాసరావును తన పక్కన మరగుజ్జుగా మార్చేసింది. నిజానికి మొదటిసారి అమ్మతో శ్రీనివాసరావు మాట్లాడి వెళ్లినప్పుడు ఆయన నెమ్మదితనం, మెత్తని గొంతు తననెంతో ఆకర్షించాయి.

***

చిన్నతనంలోనే నాన్నపోయినప్పుడు తను చాలా చిన్న పిల్ల. ఒక అక్క, చెల్లి, ఇద్దరు తమ్ముళ్లతో అమ్మ సంతానలక్ష్మిలా శోభిల్లేది. నాన్న పోయాక ఆడపిల్లల పెళ్ళి ఎలా చేస్తావంటూ బంధుజనాలు బుగ్గలు నొక్కుకోవడాలు, కట్టుబాట్లు, నిష్ఠూరాలు నడుమ బాల్యం ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు రాజ్యానికి. తూనిగల్లా ఎగిరే వయసు నుండి అంకురించిన యౌవనానికి లంగావోణీలతో పయ్యెదను గుట్టుగా కప్పి ఉంచుకునేది రాజ్యం. నానా తంటాలు పడి బంధువర్గాల ప్రాపకంతో అటు అక్క, ఇటు తన కన్నా చిన్నదైన చెల్లి పెళ్లిని ఉన్నంతలో తలో చేయి వేసుమని అభ్యర్ధిస్తూ.. ఇల్లిల్లూ తిరిగి ఎలాగోలా పెళ్లి తంతును కానిచ్చింది రాజ్యం తల్లి. మధ్యలో తనేం పాపం చేసిందో రాజ్యానికి అర్థమవలేదు. ఆకురాలు కాలం నుండి మెల్లి మెల్లిగా చలిమంచుతో కూడిన వెన్నెల రాత్రులకు మారుతున్న కాలం అది. తమ ఇంటి పక్కనే అద్దెకు దిగారు శ్రీనివాసరావుగారి కుటుంబం. ముద్దొచ్చే ఇద్దరు బిడ్డలు, ఒక బాబుతో నిండైన కాపురం. కాని.. ఆయన భార్యను అప్పుడెప్పుడో చూసినట్టుగా జ్ఞాపకం. ఒకసారి ఆవిడకు బాగా జ్వరంగా ఉండి, పొరుగూరికి వెళ్లేందుకు బాడుగ బండిలో శ్రీనివాసరావ ఆమె చేయి పట్టుకుని ఎక్కించేటప్పుడు చూసిదే తప్ప, ఆమెతి పెద్దగా పరిచాయాలు, పలకరింపులూ లేవు. ఆ తర్వాత వారిల్లును ఎప్పుడు చూసినా, తాళం కప్ప వేలాడుతూ ఉండేది. బహుశా, తాము పెద్దక్కను చూసేందుకు పొరుగూరికి వెళ్లివచ్చేసరికి శ్రీనివాసరావుగారు ఇల్ల ఖాళీ చేశారనీ, ఆయన భార్యకు జబ్బు చేసి చనిపోయిందని తెల్సింది. బావి గట్టుపై నిలబడి నీళ్ళు చేదుకుంటుంటే తన వంతు అయిపోయే దాకా ఓపికతో ఉండి, తర్వాత తన బక్కెట్లతో, బిందెలతో నీళ్ళను డ్రమ్ముల్లో నింపుకునేవాడు ఆయన. పిల్లలు గల కుటుంబమేమో. నెలవంక ఉందయించినట్లుండే తన మీగడ తరకలాంటి నడుము భాగాన్ని చూస్తున్నాడేమోననే కంగారులో నీరు గబగబా తోడి బిందెలలో పోసుకుంటూ, సగం లంగా వోణీని తడుపుకునేది కానీ.. అదంతా తన వట్ఠి భ్రమేనని, వయస్సు తెచ్చిన ఆకర్షణలో అదొక భాగం మాత్రమేనని కాలక్రమంలో రాజ్యానికి అర్థమవసాగింది. అసలు ఇల్లు ఖాళీ చేసిన వాళ్ల సంబంధం అటు తిరిగి, ఇటు తిరిగి, తమ వద్దకే రావడమనేది విధి బలీయంలాంటి సంఘటన అనుకోవాలేమో!

***

శ్రీనివాసరావుగారి చిన్నక్క అటు తమ పెద్దక్క ఉండేది ఒక్క ఊళ్లోనే కావడం మూలంగా ఒక్కసారి అమ్మావాళ్లను శ్రీనివాసరావు చిన్నక్క కలిసింది. తన తమ్ముడు చాలా మంచివాడనీ, ఎదిగీ ఎదగని సంతానంతో చేయి కాల్చుకుంటూ, ఇటు ఉద్యోగ జీవితాన్ని నెట్టుకొస్తూ, కష్టపడుతున్నాడనీ, రెండో సంబంధమని ఏమీ అనుకోకపోతే, మీ రాజ్యానికి మావాడిని ఇచ్చి చేయరాదూ? అంటూ అభ్యర్ధించింది. అమ్మ రెండు మూడు రోజులయ్యాక ఆలోచించి చెబుతానంటూ అప్పటికి దాటవేసింది గానీ, ఆవిడ ఆలోచనలు మాత్రం అసలు రాజ్యానికి పెళ్ళెలా అవుతుందనే? లోకం వింతగా పరికించే రాజ్యం, ఎత్తుగా, బలంగా ఎరుపు ఛాయతో శాండోలాంటి రూపుతో ఉండేది. అమ్మో! ఆడపిల్లలు ఇంత ఎత్తుంటే వరుణ్ని వెదికి తేవడం కష్టమే అనేవారు. ఏం ఆడపిల్ల అంటే ఫ్రేంలో బంధించినట్టు ఈ ఒడ్డూ, పొడుగూ ఇంత మాత్రమే ఉండాలి. ఈ కొలతలు దాటవద్దు అనే హద్దులేమైనా ఉన్నాయా? దేవుడిచ్చిన రూపంలో నిర్మితమై ఉన్నవారం కదా! బక్కగా, పొట్టిగా ఉంటే పీలలా ఉంది. రేపు పెళ్ళయ్యాక ఓ బిందెడు నీళ్లు కూడా మోయగలదో లేదో? అనేవారు అంటారు. ఎత్తుగా, ఏపుగా ఉంటే బలాఢ్యురాలు, అచ్చం మగరాయుడే అంటారు. అప్పట్లో తను నవ్వితే అందరూ జమునలా పన్ను పై పన్నుతో ఎంతో అందంగా ఉన్నావు అనేవారు. కాని.. ఆ మెచ్చుకోలు వెనుక కనిపించని దెప్పిపొడుపు ఉందని రాజ్యానికి ఆలస్యంగా తెలిసిన విషయమైంది. ఎందుకంటే తనవి గొరపళ్ళు. నవ్వితే పై పలువరుస గారతో అందవిహీనంగా కన్పించేది. అటు తను రూపం, ఇటు జనాల వింతచూపులు, కవ్వింపులతో విసుగెత్తిన రాజ్యం తల్లికి శ్రీనివాసరావు చిన్నక్క మాటలు అమృతపు పలుకుల్లా ధ్వనించాయి. మీ రాజ్యానికి ఇంత కంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? కానీ కట్నం లేకుండా అటు మంచి భర్త, ఇటు పిల్లలు కలిగిన ఓ కాపురం, అచ్చొచ్చిన జీవితం అనుకో.. అటు మా శ్రీనివాసరావు తెచ్చే జీతంతో మహారాణిలా వెలిగిపోతుంది అని ఊరించి చెప్పిన గారడి మాటలకు తల ఒగ్గి తల్లి రాజ్యానికి శ్రీనివాసరావు సంబంధాన్ని ఖాయం చేసింది. ఓ సందెవేళ్ళ.. మిషను కుడుతున్న రాజ్యం దగ్గర పెళ్ళి ప్రస్థావన నుదురు బెదురు లేకుండా చెప్పింది. తన పెళ్ళితో తల్లి కుటుంబ బాధ్యతల నుండి తప్పుకున్నట్టుగా ప్రకటించి, మిగతా మగపిల్లలు ఎలాగోలా బతుకుతారన్న భరోసాను వ్యక్తపర్చింది. వయసు పొంగు, పెళ్ళిపై లాగుతున్న మనసుతో శ్రీనివాసరావు మెత్తదనానికి పరవశించిపోయి రాజ్యం, సరేనంటూ సమ్మతిని తెలియజేసింది. ఆ రోజు శ్రీనివాసరావు తన తల్లితో సరళంగా మాట్లాడుతూ, “రాజ్యానికేమీ అభ్యంతరం లేదు కదా?” అంటూ సంశయంగా లోనకు చూపులు సారించాడు. అబ్బే! అలాంటిదేమీ లేదని తల్లి చెబుతుంటే “ఓ సారి రాజ్యానితో మాట్లాడాలి” అన్నాడు శ్రీనివాసరావు గంభీరంగా. అలాగేనంటూ రాజ్యాన్ని పిల్చింది తల్లి.

పసుపురంగు అమెరికన్ జార్జెట్ ఓణీ, లేత గులాబీలు అక్కడక్కడా పసుపు మొగ్గలతో కూడిన లంగా, తలలో తురుముకున్న కనకాంబరాల మాల, కళ్ళకు కాటుక, నొక్కుల జుట్టును ముంగురులు తిప్పి వదిలిందేమో?! అవి అలల్లా గాలికి నుదుటి పై పడుతూ రాజ్యం మొఖంలో తెలీని వింత వెలుగు ప్రకాశించింది. ఇంటి వెనుక పెరట్లో అల్లుకున్న సన్నజాజి గుబురు పాదు పక్కన నిలబడింది రాజ్యం. ఎదురుగా అస్తమిస్తున్న సూర్యన్ని చూస్తున్న శ్రీనివాసరావు. పశ్చిమాకాశం యొక్క అరుణిమ అతని మోములో ప్రతిఫలించసాగింది. “రాజ్యం నాకు పెళ్ళి అయి, ముగ్గురు పిల్లలున్నారు. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? నా పిల్లలకు తల్లిగా, భవిష్యత్లో వాళ్ల లాలన, పనులు అవీ.. మరి.. నేనంటే నీకు..!” అంటూ ఆర్ధోక్తిగా మాటలు తడబడ్డాయి అతనికి. అతని సౌమ్యతతో ఏకీభవిస్తూ, తొలిసారిగా పరపురుషుని చేయి అందుకొని మెత్తగా నొక్కింది. చల్లగా తగిలింది అతని చేయి.. మాటలు లేనివాడిలా అభావంతో నిలబడిపోయాడు శ్రీనివాసరావు.

తర్వాత వారం రోజుల్లో ముహుర్తం ఖాయం చేసుకొని వచ్చిన చిన్నక్క దంపతులు, పంతులుగారి సమక్షంలో ఊర్లోని రామాలయంలో అటు రాజ్యం తల్లి తరపున బంధువులు, ఇటు అక్కా చెల్లెండ్ల నడుమ సాదాసీదాగా దండలు మార్చుకొని ఒక్కటయ్యారు శ్రీనివాసరావు.. రాజ్యం..

***

అశాంతిగా పక్క మీద దొర్లుతూ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ, కొత్తగా వచ్చిన ఆస్తమాతో ఛాతీ పట్టేసినట్లుంటే లేచి వెళ్లి, నీళ్లు తాగి, అటు వైపు తిరిగి పడుకుంది రాజ్యం. శ్రీనివాసరావు చలనరహితుడిగా, వెల్లకిలా పడుకున్నాడు. చేతుల బనియను, గళ్లలుంగీలో.. అతని వదనంలో ఏదీ అఖ్ఖర్లేనితనం.. ఏమీ పట్టని అదే ఉదాసీనత.. కళ్లు గట్టిగా మూసుకుంది రాజ్యం. పెళ్లయిన తెల్లారినుండే పిల్లల నుండి తాను ఎదుర్కొన్న విమఖత.. అయిష్టత.. ఎందకో మనస్సు కష్టంగా అన్పించసాగింది. కొన్ని విషయాలను మది మర్చిపోమ్మన్నా మర్చిపోక మరీ మరీ గుర్తుకు తెస్తూ మానని గాయాన్ని రేపుతుంది.

***

శ్రావణమాసం.. కరిమబ్బుల చల్లదనంతో పాటు తుంపరతో కూడిన జల్లు, పెళ్ళిమండపం నుండి నేరుగా దండలతో తానుండే మూడు గదుల ఇంటికి చేరుకున్నారు శ్రీనివాసరావు, రాజ్యం.. హారతి ఇచ్చి లోనకు ఆహ్వానించింది చిన్నక్క. వరసగా ఉన్న మూడు గదుల పోర్షన్ అది. ఇంటి వెనుక చేదబావి.. కొబ్బరి చెట్లు.. అక్కడక్కడా విరిసిన నందివర్ధనాలతో పచ్చగా ఉంది పెరడు. ఇంటి వెనుక బొగ్గుల కుంపటి. కాస్త దూరంగా పక్కనే బాయిలర్.. ఓ మూలన చిన్న బాత్రూం.. మధ్య గదిలో మంచం పై పడుకున్న శ్రీనివాసరావు కొడుకు ఎనిమదేళ్ల దినకర్ తనను చూడాగనే విసుగ్గా మొఖం తిప్పుకున్నాడు. అతడిని రెండు రోజుల క్రితమే ఇంటికి తీసుకువచ్చారు. టాన్సిల్స్ ఆపరేషన్ జరిగిందట. పెద్ద కూతురు స్వప్న పదేళ్లది. మోకాళ్ల వరకు ఉండే నీలంరంగు ఆఫ్ స్కర్ట్, నల్ల జాకెట్టు వేసుకుంది. చిన్నది నాలుగేళ్ల మున్నీ.. క్రాపు చేయించిన జుత్తు, గుండ్రటి మొఖం.. కలిసిన కనుబొమలతో ఆశ్చర్యపోయి, కొత్త అమ్మ రాజ్యాన్ని పరిశీలిస్తూ ఉండిపోయింది. తొలి రాత్రి మధురోహలతో గదిలోకి అడుగుపెట్టింది రాజ్యం.. మంచం పై పడుకున్న మున్నీని చూసి అక్కడే ఆగిపోయింది.

శ్రీనివాసరావు కింద చాప వేసుకొని పడుకొని తనకేమో మున్నీ పక్కన చోటిచ్చాడు. ఏ అర్ధరాత్రో అతడి చేయి తమకంగా తనను తడుముతుందని ఆశించిన కోరిక భగ్నమైంది. ఎదురు చూస్తూ.. ఎదురు చూస్తూ.. కిటికీ నుండి కదలి వెళ్తున్న చందమామ వైపు చూపులు సారించి నిద్రపట్టని ఆ రాత్రిని అలా జోకొట్టింది రాజ్యం.

ఇల్లంతా తిరిగి తిరిగి అలసి.. అలసి.. విసిరివేయబడ్డ మసిగుడ్డ లాంటి మరికొన్ని రాత్రులు, కొన్ని విషాద భరిత.. ఉద్విగ్న ఎదురు చూపుల నిరీక్షణలో కొన్ని నెలలు.. సంవత్సరాలుగా.. ఘనీభవించిన రాత్రులెన్నింటినో రాజ్యం.. మనసూ.. తనువూ.. ఏకమై భరించింది.

అలా కిటికీలో నుండి కరిగి వెళ్తున్న ఒకనాటి మసక వెన్నెల రాత్రి శ్రీనివాసరావు తన చేయిని మెత్తగా తడిమి లోన దాచుకున్న నిజాన్ని బయటపెట్టాడు. తను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాననీ, ఇక నుండీ తనతో శారీరిక బంధం ఆశించినా.. సంతతిని ఇవ్వలేననీ, ఇక తను ఎప్పటికీ తల్లి కాలేదని తెల్సి హతాశురాలయ్యింది రాజ్యం.

తను నిర్మించుకున్న రంగుల అద్దాల మేడ అందులోని రాజు, రాణి మిగ్రహాల నెవరో ధ్వంసం చేస్తున్నట్టుగా.. రెప్పలచాటున ఉబికి వస్తున్న గోరువెచ్చని కన్నీళ్లను గుండెలయలో బంధించుకుంది. పొంగిన వక్షస్థలంపైన గుచ్చుతున్న మంగళసూత్రాలు బరువుగా అన్పించాయి రాజ్యానికి. విధి కొట్టిన సమ్మెట పోటుకు రాజ్యంలో జవాబులేని శేష ప్రశ్నలెన్నో!

***

వయసు పెరిగేకొద్దీ మరిన్ని విషయాలు అర్థం అవుతూ వచ్చాయి. ఇంట్లో తన స్థానమేమిటో.. ఎవరి అవసరాలకు ఎలాగు పావులా వాడుకుంటున్నారో మధ్య వయసు మహిళగా రాజ్యానికి క్రమంగా అర్థమవసాగాయి. వారాంతాల్లో శ్రీనివాసరావు వెచ్చాలు, కూరగాయలు తెచ్చేవాడు. ఎదుగుతున్న ఇద్దరాడపిల్లలు, సంసారం పొదుపుగా చేయాలి అంటూ ఉప్పూ, పప్పులను డబ్బాలో పోస్తూ అనేవాడు. కిరసనాయిలు పొయ్యి ముట్టించి రాజ్యం అన్నం కూరలు వండేది. పిల్లలు స్కూళ్ళకు వెళ్లిన తర్వాత శ్రీనివాసరావు తరపున బంధువులెవరైనా వస్తే తను మాత్రం వంటగది తలుపు తీసేది కాదు. పక్కనే నున్న నవారు మంచాన్ని వాల్చుకొని తనకున్న మధురోహల జ్ఞాపకాల్ని నెమరు వేసుకొనేందుకు, అలసిన తన మనసుకు, శరీరానికి రిలాక్సేషన్ కోసం రాజ్యం రేడియోను ఆశ్రయించేది. మ్యాటీ కుట్టు లేసిన ఆకుపచ్చ కాటన్ గుడ్డను కప్పుకొన్న రేడియో నుండి మంద్రస్వరంతో ‘పిలిచిన బిగువటరా!’ భానుమతిగారి తేనెలూరే గాత్ర మాధుర్యానికి పరవశం చెందేది. రేడియో నాటకాలు, పాటలు లాంటి శ్రవ్యకళ రాజ్యానికున్న ఏకైక అభిరుచి. మధ్యాహ్నానికి వచ్చిన అతిథులకు అల్పాహారాలు, టీ ఏర్పాట్లు చేయాలని చెప్పడానికై శ్రీనివాసరావు వంటగది తలుపు తట్టేవాడు. లేచి వెళ్లి ఎర్రబడ్డ కళ్ళతో విసుగ్గా తలుపు తీసేది. అమృతాంజనం రుద్దుకున్న మరదలు, అటు తమ్ముడి నిస్సహాయత వారి నడుమ ప్రేమైక రాహిత్యాన్ని.. వీళ్ల సంసారం ఎలా నడుస్తుందోనన్న కుతూహలం బంధువర్గాలో చర్చనీయాంశం అయ్యేది. “తమ్మున్ని బాగానే సతాయిస్తుంది” అన్న అపప్రధ రాజ్యంపై నీడలా పర్చుకోసాగింది. రాజ్యంతో వేగలేక.. తన వేదనను అణిచి పెట్టుకోలేక.. ఎగజిమ్మే దుఃఖాన్ని ఆగ్రహాన్ని నిలువరించుకోలేక.. ఒకరోజు తింటున్న అన్నం పళ్ళాన్ని నేలకేసి బలంగా విసిరి కొట్టాడు శ్రీనివాసరావు. నేల పాలైన ఆహార పదార్థాలు, వంకర్లు పోయిన కంచం, ఆ కంచాన్ని చూసిన బంధువర్గం.. ఈ ఉపకథను చిలువలు పరువలుగా ప్రచారం చేసి దూరం పెరిగిన వారి మధ్య బంధం.. కలవని సమాంతర రేఖలుగా ప్రయాణింపసాగింది. పెద్దది స్వప్న వివాహానికి కూడా వాళ్ల తాతయ్య, అమ్మమ్మ పెళ్లి పెద్దలుగా పీటలు మీద కూర్చుని కన్యాదానం జరిపించారు. శ్రీనివాసరావు నిర్లిప్తత, పేరుకున్న న్యూనత కారణంగా తన తమ్మున్ని ఎలా తొక్కేస్తుందో పచ్చని పందిట్లో మళ్ళీ గొడవలెందుకు అనుకన్నారో ఏమో గానీ బంధువర్గం గప్ చిప్‌గా ఈ తంతును రాజ్యానికి తెలినీయకుండా కానిచ్చారు. నలుగురున్న చోట ఏమీ అనలేక.. ఏమీ అనుకోలేక మనస్ఫూర్తిగా దంపతులకు అక్షింతలను వేసి ఆశీర్వదించి ఫ్రౌఢగా రాజ్యం. గొడ్డుమోతుది.. పిల్లలు లేని గొడ్రాలు అని సమాజపు నిందను భరిస్తూ.. అటు సవతి తల్లి అనే బిరుదును సహిస్తూ శ్రీనివాసరావు పిల్లల్ని సాకింది రాజ్యం.

ఓ రోజు మధ్యాహ్నం వంటింట్లో పని చేసుకుంటూ రాజ్యం.. మున్నీని చూసింది. మున్నీ వెనకాలే నలుగురు కుర్రాళ్ళు సైకిళ్ళేసుకొని ఫోజు కొడుతూ.. ఇంటి వాకిలి వరకు వచ్చి తచ్చాడుతూ వెళ్లిపోయారు. అంతే.. గేటు తీసుకొని లోనకొచ్చిన మున్నీని మెత్తగా చీవాట్లేసింది రాజ్యం. ఇంటి వెనుక పెరట్లో నూతి దగ్గరకు పోయి గిన్నెలు కడగమంది. అలా ఐతేనే భోజనం వడ్డిస్తానని లేకుంటే అన్న విషయాలు నాన్నకు చెబుతానని బెదిరించింది. అప్పటి నుండి మున్నీలో తన పట్ల తీవ్రమైన ద్వేషం పెంచుకుందేమో?! తనతో మాట్లాడటమే మానేసింది. బహుశా అదే మంచిదైంది. షికార్లు కట్టి పెట్టి బుద్ధిగా చదువుకొని, ఇప్పుడు టీచరు ఉద్యోగం చేసుకుంటుంది. తనకు దగ్గ సంబంధం చూసి శ్రీనివాసరావు మున్నీ వివాహం దగ్గరుండి జరిపించారు. మున్నీ కళ్లలోని క్రౌర్యానికి ఉదాసీనత వహించి రాజ్యం తనంతట తానుగా తప్పుకొని కన్యాదాతగా పీటలేక్క లేదు. ఆ పని మున్నీ మేనమామ దంపతులు నిర్వహించారు. పచ్చని పందిట్లోని నవదంపతులకు వీడ్కోలు చెప్పింది రాజ్యం.

అత్తెసరు మార్కులతో పాసవుతూ వచ్చన దినకర్ కూడా అతి కష్టం మీద ఊర్లోనే చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. వెతగ్గా, వెతగ్గా ఊర్లోనే ఉన్న దూరపు బంధుత్వపు అమ్మాయి దొరికిందని పెళ్లి జరిపించాడు శ్రీనివాసరావు.

***

శ్రీనివాసరావు తెలుగు ఉపాధ్యాయుడు. ట్రాన్స్‌ఫర్ల దృష్యా వివిధ జిల్లాల్లో పని చేయాల్సి వచ్చేది. ఇంట్లో రాజ్యాన్నుంచి, పిల్లలను చూసుకొమ్మని చెప్పి, నెల నెలా డబ్బు పంపేవాడు. ఎప్పుడైనా రాజ్యాన్ని తనతోబాటు ఓ వారం రోజులకని తాను పని చేసే జిల్లా కేంద్రానికి తీసికెళ్లెవాడు. అప్పుడెంతో సంతోషించేది రాజ్యం. ఎవరూలేని ఏకాంతంలో.. సాయంత్రం శ్రీనివాసరావు స్కూలు నుండి వచ్చేసరికి వేయించిన పల్లీలో లేక ఉడికించిన బొబ్బర్లో తనకు పెట్టేది. టీ తాగుతూ అప్పుడప్పుడు తమకంగా తనకేసి చూసేవాడు. ‘రాజ్యం! కాస్త తలంటవూ, నూనె పెట్టవూ!..” అంటూ గారాలు పోయేవాడు. వెతికి.. వెతికి తనకో నెమలికన్ను రంగు వెంకటగిరి చీర తెచ్చాడు. కొత్త చొక్కా వేసుకున్నప్పుడు బాగుందా? అని అడిగేవాడు. తెలుగు ఉపాధ్యాయుడు అందునా అల్లసాని పెద్దన పద్యాలు, వసుచరిత్ర, వరూధిని విరహం, చాటువుల ప్రశస్తి చెబుతూ చెబుతూ వచ్చిన సరసత్వం, రసికత భావనలు ఇంకా అడుగంటలేదు అనుకునేది రాజ్యం. ఇన్నేళ్ల సంసారంలో ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నాడు.. అదే చాలు! అనుకొని నిట్టూర్చింది రాజ్యం. మళ్లీ తనను ఇంట్లో దించి తిరుగు ప్రయాణమయ్యేవాడు. ఎన్ని నెలలకు ఎప్పుడు వస్తాడో తెలియదు. రెక్కలు రాని పక్షులను తల్లి కోడి తన రెక్కల్లో దాచినట్టు రాజ్యం శ్రీనివాసరావు పిల్లల్ని అదిరించి.. బెదిరించి ఐనా పెంచి పెద్ద చేసింది.

***

కాన్పు కష్టం తనకు తెలియకున్నా.. స్వప్న తొలి చూలుతో ఇంటికి వచ్చినప్పుడు, పురుడు పోసి ఒడి బియ్యంతో ఒడి నింపి, సారెపట్టి పంపించింది. ఆ తర్వాత వంతు మున్నీది. తనకు కూడా బిడ్డ పుడితే బారసాల జరిపించి, రెక్కలు ముక్కలయ్యేలా చాకిరీ చేసింది రాజ్యం. లోలోన శత్రుత్వపు ఫీలింగ్ ఉన్నప్పటికినీ, సమాజ నియమాలకు లోబడి వ్యవహరించే వారు శ్రీనివాసరావు పిల్లలు. వాళ్ల నాన్నకు సేవలు చేసే ఒక సేవిక, వారింటికి ఊడిగానికి కొని తెచ్చుకున్న ఒక పనిమనిషి లాగే చూశారు ఆమెను. తనలోని మాతృ హృదయాన్ని, స్త్రీ సహజత్వపు సౌకుమార్యాన్ని, పిల్లలు లేని ఆమె మాతృవేదనని అర్థం చేసుకునే సాహాసాన్ని మాత్రం చేయలేదు వారు.

***

వారు.. వారి పనులు, మొగుళ్ళు, పిల్లలు, సంసారాలు, వారి బంధువర్గం, ఆడపడుచులు.. ఇలా వారి సర్కిల్‍ని అభివృద్ధి చేసుకుంటూ రాజ్యం పాత్రను కేవలం తమ తండ్రికి సహాయంగా ఉండే ఒక ఆడమనిషి.. తమ ఇంటికి ఒక కాపలాదారుగా భావించారు. ఇంటికొచ్చినా కూడా అంతే నిర్లక్ష్యంగానూ, అక్కసుగా ప్రవర్తించేవారు. నిద్రలో మెసులుతున్న శ్రీనివాసరావు ఇటు వైపు వత్తిగిల్లాడు. ఇప్పుడు తమ ఇంట్లో తామిద్దరమే. కావల్సినంత ఏకాంతం.. ఆ ఏకాంతంలో ఒకటి కాలేనంటున్న తనువులు.. ఇక మనస్సులు ఎప్పుడో బండబారిపోయాయి. అణగారిన కోరికలు.. ఏదో బతుకుతున్నాం గానీ జీవించటం లేదన్న నిరాశ నిస్పృహ, లోన పాతుకుపోయిన తీవ్ర అసంతృప్తి అవస్థ ఇద్దరిలోనూ ఆవహించింది. పల్చబడ్డ జుట్టు, ఛాతీ పైని వెంట్రుకలు నెరసి, కరిగిన కండలు, జారిన పొట్టతో శ్రీనివాసరావు ఇప్పుడు ఎనభై రెండేళ్ల వృద్ధ బాలుడు రాజ్యానికి. తనూ అంతేగా యాభై ఏళ్ల వైవాహిక చరమాంకంలో ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి తనను తాను పరీక్షగా చూసుకుంటే నెరసిన జుట్టు, జారుముడి, నిగారింపు కోల్పోయిన బుగ్గలు, నీరుకావి నేత చీరలు, మట్టి గాజులతో తన దిగులు మొహం కళతప్పి, తనకే భయం గొల్పేటట్టు.. అందుకే రాజ్యం ఈ మధ్య అద్దం ముందు ఎక్కువ సేపు నిలబడలేకపోతుంది. ఎర్ర బొట్టు దిద్దుకునేంత సేపే తన మొఖం చూసుకునేది. తీక్షణంగా అద్దంలో తన మొఖాన్ని చూసుకున్నా భరించలేని ఎంతో దిగులు.. ఏదో గిల్టీకాన్షెస్ తనను బాధించేది. ఆ మొహం తనను ఎక్కు పెట్టి ఎన్నో ప్రశ్నలు అడిగేది. ఎంతో చరిత్ర చెప్పాలని చూసేవి ఆ కళ్లు.. ఆ తీక్షణతను తట్టుకోలేక ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. కానీ చుట్టూ ఉన్న సమాజం బరితెగించినదనీ అంటారనీ, పిల్లల్ని ఇవ్వలేని శ్రీనివాసరావుని వదిలేసిన మొరటుది, గయ్యాళిది అన్న గండెపెండేరాలకు జడిసి, ఎక్కడకు వెళ్లినా ఏదో ఒక రొంప, అదే రొచ్చు, అదే బురద బ్రతుకు, ఇప్పుడున్న ఈ మురికి చాలదూ? తను జీవితాంతం అనుభవించడానికి, దీర్ఘంగా నిట్టూర్చి శ్రీనివాసరావు చేతి వంక చూసింది. ఛాతి పైని ఆన్చుకున్న అతడి ఎడమ చేయి ఉంగరపు వేలును అంటి పెట్టుకున్న ఉంగరం మసక మసకగా కన్పించింది. తన మొదటి భార్య ఇచ్చిన ఆ ఉంగరాన్ని ఎప్పుడూ తీయడు అతను. అందులోని ఆకుపచ్చరాయి పోయింద. రాయి పోయిన ఆ ఉంగార్ని అదే తార్రలో అలాగే పెట్టుకొని ఉంచుకున్నాడు. కానీ ఉంగరంలో మాత్రం రాయిని ఎన్నటికీ పెట్టించలేదు. “ఆమె పోయింది.. ఆమెతో బాటే పచ్చదనమూ పోయింది. రాయిలా నేను మిగిలాను” అంటూ నిర్వేదపడితే తల నిమిరి ఓదార్చింది రాజ్యం. కానీ.. తన మెత్తని కౌగిలిలో ఒదిగిపోయి, తన గుండెల్లో చోటిస్తే చాలనుకునే పిచ్చి అమాయకత్వం అప్పటిది. తను ముభావంగా ఉన్న సందర్భాలలో తననూ అలాగే అక్కున చేర్చుకొని, లాలిస్తాడేమోనని భావించింది. అలాంటి రాత్రుల కొరకు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూసింది. తానెన్ని పాత్రలు సమర్థవంతంగా పోషించినప్పుటికీ.. తనకు మాత్రం ఎలాంటి సంతృప్తి, ఆనందాన్ని, గుర్తింపును ఇవ్వలేకపోయింది తన వైవాహిక జీవితం.. మసక వెలుతురు దక్షిణం వైపు బెడ్ రూం కిటికీ గుండా వ్యాపించసాగింది. స్ఫోటకపు మచ్చలా మగిలిన ఆ రాత్రిని బరువుగా గడిపిన రాజ్యానికి.. అప్పుడే లేవాలనిపించలేదు.

***

శ్రీనివాసరావు షుగర్ పేషెంట్. అందుకని ఆయన వీలున్నప్పుడు, చేతనైనప్పుడు మాత్రమే ఉదయం పూట నడకకు వెళ్తారు. మాగన్నుతో చూడసాగింది రాజ్యం అతన్ని. శ్రీనివాసరావు దగ్గుతూ లేచి వెళ్లి మఫ్లర్ తలకు చుట్టుకున్నాడు. పుష్యకాలపు చలి నెమ్మదిగా హెచ్చింది. అటు తిరిగి పటుకున్న రాజ్యం టీ డికాక్షన్‌ను తయారు చేసి పెట్టింది. గేటు తీసిన చప్పుడైంది. బహుశా అతడేనని తలుపు తీసింది. బొటన వేలుకు దెబ్బ తగిలి రక్తమోడుతూ వచ్చాడు శ్రీనివాసరావు అంతే. ఇంతెత్తున లేచింది రాజ్యం.. “మిమ్మల్ని ప్రొద్దు ప్రొద్దున్నే ఎవరు వెళ్ళమన్నారు? ఆ వాకింగులో మసక వెలుతుర్లో ఏం చీరుకుందో ఏం పాడో? పైగా షుగరు, గాయం మానదు. హాస్పటల్‌కు వెళ్దామన్నా దూరంగా ఉన్న కాలనీ మనది. మీ సుపుత్రుడా ఉన్న ఊర్లో ఉన్నా రాడు. పట్టించుకోడు. బిడ్డల సంగతి సరేసరి. అటూ ఇటూ పోతే నేనొక్కతిని ఎంతని చాకిరీ చేయాలి? ఎంత మందనని చూసుకోవాలి? నడుం విరిగిపోతుంది నాకు. పైగా మీకు పథ్యపు తిండి పెట్టాలి.” ఆమె స్వరం తాలుకు ఆగ్రహావేశాలకు తలొగ్గి.. పిల్లిలా లోనకు నడిచి బల్లపై కూర్చున్నాడు నెమ్మదిగా. పసుపు తెచ్చి పట్టీ వేసింది. వెచ్చని డికాక్షన్ తాగి సేదతీరాడు. తనకు మోకాళ్ళ నొప్పులు.. గుదుల్లో దుమ్ము పేరుకుంటే పడదు.. ఒకటే పిల్లి కూతలతో ఆస్తమా.. అందుకని తను స్నానానికి వెళ్లి వచ్చేసరికి అతడే శుభ్రంగా గదులు చిమ్మాడు. తడిగుడ్డ వేశాడు. పొయ్యి కడిగి బియ్యం ఎసరు వేశాడు. ఆమె స్నానం కాగానే వచ్చి కోసి పెట్టిన కూరగాయలను చూసి తృప్తిగా తలపంకించింది. పప్పు, కూరలు సిద్ధమయ్యాయి. దీపారాధన గావించి, నిదానించిన మనస్సులతో ఇరువురు వండుకున్న ఆహార పదార్ధాలను భుజించారు. కాసేపు మధ్యాహ్నం కునుకు. సాయంత్రం టీ. అల్పాహారం, రాత్రికి ఒక పుల్కా, నారింజపండుతో కడుపు నింపుకున్నారు. టి.వీ.లో కాలక్షేపానికి ఏదో ప్రోగ్రాంను చూసి రాత్రి పదయ్యే సరికి సద్దుమణిగిన హృదయాలను చేరదీసుకొని పడకటింట్లో ప్రవేశించారు రాజ్యం దంపతులు.

***

చీకటి తెరలు మెత్తగా ఆమె కురులను స్పృశించసాగాయి. అతని ఒంటి నుండి వస్తున్న ముసలి వాసనను భరిస్తూ.. ఆమె అటు వైపు తిరిగి ఒత్తిగిలింది. కల్లోల అంతరంగంలో ఎగసిపడుతున్న ప్రశ్నల సుడులెన్నో ఆమె బుర్రను తొలచసాగాయి. మనసును మీటే లాలిత్యపు భావన, అందంగా అలంకరించుకొని సిగ్గుల మొగ్గవుతూ.. పడకటింట్లో భర్తతో సరాగాలు ఆడాలన్న చిన్న చిన్న కోరికలు భగ్నమైన విరహిత రాత్రులు.. ఎన్నో.. ఎన్నెన్నో తన జీవితంలో. అప్పట్లో బావి నుండి నీళ్లు చేదీ.. చేదీ కాయలు గాచి గరుకుగా తయారైన తన మొరటు చేతలు.. కాళ్ళు పగుళ్ళు తీసి బండబారినవి. రంగు వెలసిన వాయలు చీరలు కట్టినవే కట్టీ.. కట్టీ.. పల్చబడ్డాయి.. పొగచూరిన కిరసనాయిలు వంట. రేడియోలో నుండి చిన్నగా వచ్చే తేనెలూరే గాత్రాల పులకింత.. తను మ్యాటీ కుట్టు వేసిన రంగు రంగుల గుడ్డలు.. బీరువాలో అట్టే దాచిపెట్టింది. వెనక్కి తిరిగి చూసుకుంటున్న గత కాలపు జ్ఞాపకాల దొంతరలో అలా ఓలలాడసాగింది రాజ్యం. అత్త లేని తన మావగారిని కూడా చంటి పిల్లాడిలా సాకిందే! ఏడాది కోమారు శ్రీనివాసరావు తన తల్లి, తండ్రి, భార్యల తద్దినాలు పెట్టేవాడు. అందర్ని పిల్చి ఆ రోజు భోజనాలు పెట్టేవాడు. భార్య ఫోటోకు దండ, వేసి.. ఆ రోజు రాత్రి కన్నీరు కార్చేవాడు. కుంగిపోయి దుఃఖపడితే తానే ఓదార్చేది. అందరికి మడికట్టుకొని వడ్డించి, ఎంగిలి విస్తార్లు ఎత్తి, కోడలిగా తన గృహస్థ ధర్మాన్ని నిర్వర్తస్తూ, రాత్రికి మగిలి ఉన్నదేదో తిని కడుపునింపుకునేది. ఎందుకు వచ్చాను ఈ కుటుంబంలోకి? ఏం సాధించాను ఇన్నేళ్లలో? నాకంటూ స్వంత పిల్లలూ లేరు.. ఆస్తీ లేదు. దమ్మిడీ సంపాదన కూడా లేకపోయే! పండగకు, పబ్బానికీ ఆయన తెచ్చే చీరలపైనే దృష్టి, తనకు నచ్చకుంటే నచ్చలేదని తిప్పిపంపేది. అప్పటి నుండి ఆమెకే డబ్బిచ్చేవాడు.

ఏదైనా అంటే తనతో రాద్ధాంతమని జడుసుకునే బంధవర్గం. ఎప్పుడైనా, పెళ్ళిళ్ళికో పేరంటాలకో వెళ్తే “అబ్బో! రాజ్యంగారా?” అంటూ తప్పుకు తిరిగే జనం. “ఇప్పటికీ మా నాన్నను సాధిస్తుంది. ఆయనకు ఇష్టమైనవి ఏవీ చేసి పెట్టదు. ఆయనను ఎక్కడికీ, ఎవరింటికీ వెళ్లనీయక కట్టడి చేస్తుంది. పథ్యపు తిండితో, ఆయన బక్కచిక్కి పేషెంట్‌లా తయారయ్యాడు. ఇంటికి వెళ్లినా మనమల్ని, మనుమరాళ్లనూ అలా కూర్చోవద్దు.. ఇలా తిరగుతూ తినవద్దు.. అన్నం మెతుకులు అలా పారబోయవద్దు వంటి కఠినమైన పద్దతులతో పిల్లలను మూడవుట్ చేస్తుంది. మాకూ వెళ్లాలనిపించదు” అని కూతుళ్ళు ఫిర్యాదు. కొడుకు దినకర్ ఇప్పటికీ తనను చూస్తే చాలు మొఖం తిప్పేసుకుంటాడు. ‘గయ్యాళిది’ అని ఇంత ముద్ర వేసారే..! దీని వెనుక ఉన్న మృదు స్వభావం.. మన మంచి కోరి చెప్పే హితవు.. తగదు అన్న పనులను గమనించనీయదు ఈ సమాజం. ‘రెండో భార్య’ అనగానే చిన్న చూపు. ఆ పై సవతి తల్లి అనే నెగెటివే షేడ్, పిల్లలు లేని తన లోపం.. వెరసి బంధువర్గానికి రాజ్యం.. సాధించే మహిళగా అగుపడింది. పెనుతుఫానులో కొట్టుకొనిపోతున్న శ్రీనివాసరావు కుటుంబానికి తాను ఒక పెద్దదుంగలా మారి వారినందరినీ ఆవల ఒడ్డుకు పడవేసింది.. కానీ.. తీరం చేరాక పడవ తగులబెట్టినట్లుగా.. తనకు ఇంత నెమ్ము, ఆస్తమా ఉన్నా ‘అయ్యో! పాపం!’ అని జాలిపడే మనిషి లేడు. తానే ఏదో హోమియో మందుగోలీలు అవీ వేసుకొని కాలం వెళ్ళబుచ్చుతుందే.. తప్ప, తానేనాడు పెద్ద ఆసుపత్రికి వెళ్లిందీ లేదు.. చూయించుకుందీ లేదు. ఆయనలో ఏదో కొద్దో గొప్పో తన చేతి వంట ఉప్పుతిన్న మమకారమే కావచ్చు. లేదా తన పిల్లలకింత చాకిరీ చేసిందన్న జాలినే కావచ్చు గానీ, ఈ వృద్ధాప్యంలో ఇలా తోడంటుగా నిలబడ్డాడు. తన తిట్లను, సణుగుడును భరిస్తూ, ఇంటి పనులకు ఇప్పుడు ఆసరా అవుతూ, అవసరం ఐతే తన బట్టలూ మడతపెడుతూ, తనతో మడత పేచీ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. బహుశా కొట్లాడే ఓపికా, శక్తి సన్నగిల్లాయి కావచ్చు. ఆ మాత్రానికే రాజ్యం సాధిస్తుంది అన్న అపనింద, మొగుడ్ని చేతిలో పెట్టుకొని ఆడిస్తుందన్న కోర్తి పురస్కారం తనకివ్వబడ్డాయి.. ఇలాంటి అభిజాత్య పోకడలు ప్రతీ గృహిణిలోనూ కానవస్తాయి.

కుటుంబంలోని మొదటి భార్యలు, సంతతి గలవారు ఏం చేసినా చెల్లుతుంది. వారిని గౌరవించి, తాంబూలాలిచ్చి సత్కరిస్తుంది మన లోకం. తన లాంటి గొడ్రాలు, సవతి హోదాలో ఉన్నవారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా అందుకు తగ్గ కారణాల్ని వెతకక, అబ్బో సవతి, పిన్ని, ఆయన రెండో భార్య గడుసు, పెళ్లుసు మనిషి, అన్న నెగెటివ్ ఆరోపణల్ని చాలా సులభంగా కళ్ళకు కట్టిస్తుంది లోకం. అందుకే తన యాభై ఏళ్ల వైవాహిక జీవితంలో తనెంత మందితో సర్దుకొని, రాజీపడిపోయి సంతోషంగా, ఉందమన్నా, ఉండలేక కవ్వించే కోరికల మనసును చంపుకోలే, మొండిరాయి లాంటి మొగడితో వేగుతూ, ఇలా తను అన్నదే వేదం, తన మాటే శాసనంలా, ఇంటిని అటు శ్రీనివాసరావును గుప్పిట్లో బంధించింది. ఇందులో అప్పుడప్పుడు తన విజయగర్వం తొణికిసలాడేది. అందర్లాంటి సంసారమే. అందులో అందరికి ప్లస్సులయిన పాయింట్లలో తాను ఓడి.. అందరికీ చాతగాని పాయింట్లలో తాను గెలిచి, తనను తాను గెలిపించుకుంది రాజ్యం.

“నీకు మొగిలిపువ్వులాంటి మొగుడొస్తాడు” అంటూ ఊరించే బామ్మలు, సిగ్గుల మొగ్గలయ్యే కన్నెపిల్లలు.. మొగిలిరేకుల్లోని అదే రఫ్‌నెస్, గడ్డాల గరుకుతనం, వారి కోరమీసాల గిలిగింతలు వగైరాలన్నీ కన్పెపిల్లలను కవ్వించి మనసును రువ్వించి, వాళ్లను పాదాక్రాంతులుగా చేస్తుంటే.. మొగిలిపువ్వుల్లోని గాఢమైన పరిమళం, గుబాళింపులు, మొగిలిరేకుల వాలుజడ, పట్టుచీరల్లో ఆ రేకులను దాచుకొని, ఆ చీర గానీ పెట్టె గానీ తెరచినపుడు మనసు తాజాగా పరవశం పొంది, తన్మయత్వపరిచే ఆ అలౌకిక భావన లాలిత్యపు సున్నిత ఉద్వేగాలను పలికించే మగువలకు ఎందుకు ఆపాదించరు? కాస్తో, గీస్తో గీరగా మాట్లాడినా, కరుకుగా ప్రవర్తించినా అతి మెత్తన, అతి నెమ్మది పనికి రాదనీ తన మైటే చెల్లుబాటు కావాలని పంతం పట్టేవారి ముద్దు చేసే అల్లరిని, చిరుతాపాలు అలకలను ఎందుకు సమాజం విసుగ్గా, విరుపుగా చూస్తుందోనని గిర్రున తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలకేసి చూస్తూ తమ చుట్టూ వీస్తున్న నిశ్శబ్ద సమీరాలను ప్రశ్నించింది రాజ్యం.

సత్యభామ, కైకలను అభిజాత్యపు పోకడలో మగ్గుతున్న అహంభావులుగా, గయ్యాళులుగా చిత్రీకరించిన మన సమాజం అలాంటివారి జీవితసార్శ్యాల లోతులను స్పృశించి అసలు సత్యదర్శనం గావించిందా? నాలాంటి వారి జీవితాల రెండో కోణం అసలు వెలుగు చూస్తుందా? నిష్కళంకమైన ప్రేమను అందించగల నా హృదయపు ఔన్యత్యాన్ని దుఃఖపు జీర అంటిన కాలం చెక్కిలిపై మాయని మచ్చలా చేసారే? వీరినేమనాలి అసలు? భగ్నహృయంగా మారి వేదనతో కూడిన ప్రతీ రాత్రిని కౌగలించుకొని ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ, కరగని రాతి వెన్నెలను కురిపిస్తున్న చంద్రునికేసి జాలిగా చూడసాగింది రాజ్యం. నిద్రపట్టని కన్నులతో అటు వైపు ఒత్తిగిల్లిన శ్రీనివాసరావు పక్కను చేతిలో తడిమింది. ఖాళీతనమేదో వెక్కిరిస్తూ స్పర్శకు అందసాగింది. తన ప్రశ్నలకు ఇవ్వని జవాబులా.. లోన సుళ్ళు తిరుగుతున్న దుఃఖమేదో పైకి తన్నుక వస్తానంటోంది.. రాజ్యానికి..

***

చిక్కని చీకట్లను తొలగిస్తూ వెలుగు రేఖలు దక్షిణపు బెడ్ రూం కిటికీ పరదాల మాటున లేతగా వికసించసాగాయి. బద్ధకంగా నిద్ర పట్టని అరమోడ్పు కన్నులతో బెడ్ దిగింది రాజ్యం. బహుశా అప్పటికే శ్రీనివాసరావు వాకింగ్‌కని బయలుదేరాడు కావచ్చు. మఫ్లర్, చెప్పులు కనిపించకపోయేసరికి అనుకుంది.. లేదంటే.. పెరటి పొదులో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. తానొచ్చేసరికి ఎప్పట్లాగే టీ డికాక్షన్ పెట్టడానికి సన్నాహం చేసుకోసాగింది. అతను వాకింగ్ వెళ్తే తనకి భయమే. చాతగాని మనిషి ఎక్కడ పరిడోతాడో అని, వద్దని వరిస్తుంది. ప్రొద్దున్నే వాకింగ్ కు వెళ్లిన శ్రీనివాసరావు కూరగాయలతో గుమ్మంలో ప్రత్యక్షమయ్యేసరికి ఊపిరి పీల్చుకుంది. “ఇంతే సేపా?!” అంటూ ఎప్పట్లాగే రుసరుసలాడుతూ వెళ్లి చేతి సంచీ లాక్కోబోయింది. వద్దని చనువుగా చేయి తోసేసి ఆయనే వంటింట్లో పెట్టాడు. టీ డికాక్షన్ బాగుందని మెచుకుంటూ అభిమానంతో చూశాడు ఆమె వంక. “రాజ్యం! రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు ఒక్కొక్కరుగా ఎవరి గమ్యస్థానాలకేసి వారు సాగిపోగా.. మిగిలిన ఖాళీ జ్ఞాపకాల్తో ఇద్దరమే మిగిలిన కాలమిది. ఈ శ్యూన్యవస్థలో.. కొద్ది కొద్దిగా కాలం రాలుస్తున్న అనుభవ పత్రాలలో మరి కొంచెం సుఖాన్ని అనుభవించలేమా? ప్రతీ రాత్రి నువ్వెన్ని మందుబిళ్లలు మింగినా, నిద్ర పట్టని దీర్ఘరోగివి. నీ మనసులో పేర్కొన్న అలజడిని, ఇన్నేళ్ల గత కాలపు అనుభవాలను నేను చెరపలేను. రాజ్యం!.. కాలంతో బాటు మనం చేసుకున్న ఒడంబడికలు, ఒప్పందాలూ పూర్తి అయ్యాయి. యాభై ఏళ్ల మన వివాహ ప్రస్థానంలోని ఒత్తిడి నాలో ఎలాంటి సంచలనాలు సృష్టించలేకపోయినా.. నీకంటూ నాతోని ఉన్న అనుభవాలు ఏకైక దుఃఖపు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ ప్రవాహపు ఊపులో నీకు ఊతమిచ్చి ఆదుకున్నది.. అన్నింటినీ తోసిరాజన్న సౌఖ్యాన్ని నీకిచ్చింది.. నీ చుట్టూ అల్లుకున్న.. నీతో నీవు చేసుకున్న కమిట్‌మెంట్.. పదునైన.. బాణాల్లా.. ములుకుల్లా నీవు విసిరే మాటల తూటాలు. ఎలాంటి గిల్టీ ఫీలింగ్‌కు లోను కాకుండా.. నిర్భయంగా నీ చుట్టూ నీవే అల్లుకున్న ఆ వలయం.. ఆదే గూటికి నీవిప్పుడు రాణివి రాజ్యం.. నీకు కల్గిన అసౌకర్యానికి, నిస్సంతుగా నీవు మిగిలిపోవడానికి నేనే కారణం. రోజూ నీతో నీవు అడగాల్సిన ప్రశ్నలకు సమాధానం మన జీవితాల రెండో కోణం అది నీకూ, నాకే తెల్సు.. మనిద్దరి నడుమ రహస్యాలు లేని పల్చబడని దాంపత్య బంధముంది చూడు. అది నువ్వు సృష్టించుకున్న వలయంతో పరిపుర్ణమైంది రాజ్యం. అందుకే నువ్వున్నా, నా మాటల కరుకు ధోరణి అన్నా, ఇప్పటికీ నేను భరిస్తూ అలవాటుగా.. అలవాటు చేసుకున్న జీవితానికి ఒక ఆలంబన అనుకున్నాను గనుకే మన ఇద్దరి నడుమ ఇప్పుడు ప్రేమైకభావన అనిర్వచనీయమైన బంధంగా.. ఒకరి తలపై మరొకరికి నీడ నిచ్చే గొడుగుగా ఉందాం. నీవు లేని నా జీవితం శూన్యం.. రాజ్యం!..” ఆమె చుట్టూ చేతులు వేసి, తెల్లని నొక్కుల జుత్తులోకి వేళ్లు జొనిపి.. మార్దవంగా ఆమె చెంపలను సుతారంగా స్పృశించాడు. కాటుక కన్నుల్లో మళ్లా చిట్లిన విషాదరాగపుటంచులు. వెచ్చని కన్నీటి కణమేదో రాజ్యం కన్నుల కోలనులో కొత్త అర్ధంతో వెలిగింది.

అమాయకత్వంతో.. ఆశ్చర్యాన్ని కలగలిపినట్లుగా ఆహ్లాదంగా నవ్వింది రాజ్యం. “ఇన్నాళ్లూ నా సర్వాన్ని ధ్వంసం చేసుకున్నాను. నైరాశ్యపు నిర్వేదంలో నేను మంచిదాన్ని కాదు.. అన్న భ్రమను నా చుట్టూ సృష్టించుకొని, దుఃఖమే నిజమనుకున్న బోధపడని సత్యంతో సావాసం చేస్తూ.. ఒకరికొకరం ఆగంతుకుల్లా బతుకుతూ.. మనలో విద్యుత్కాంతిలా ప్రవహించే భయాన్ని విబిన్న రంగాల్లో.. రూపాల్లో ప్రదర్శిస్తూ, భౌతికంగా, మానసికంగా మన మధ్య సృష్టించుకున్న ఈ ఏకాంత సేతువుకు చేరో పక్క నిలబడ్డామిప్పుడు. చిక్కని చీకటిలో అక్కడో వంతెన ఉన్నట్టూ తెలీనేలేదు మనకు. దాన్ని దాటి నీ చేయి అందుకోవాలన్న స్పృహను ఆదిలోనే తుంచేసుకున్న ఎంపిక నాది. మన జీవితపు ఎన్నిక మనది. ఈ ఖాళీ ఇంట్లో ఖాళీ మనషులుగా మిగిలిపోక, నిరర్ధక భయాలను వదిలించుకొని జీవితమంటే కలవడం, విడిపోవడం, పోగొట్టుకోవడం, నిరీక్షించడమే ఐతే మన జీవితపు అస్తవ్యస్త శకలాలకు నైరూప్యానికి ఒక ఆకారమివ్వలేమా?” హేతుబద్ధంగా, సముదాయింపుగా, ఉజ్జాయింపుగా ఆమె మాటల్లో ధ్వనించిన నిజాయితీకి చలించిపోయాడు శ్రీనివాసరావు.

ఎటో తేలిపోకుండా, ఎవరినీ తోసిపుచ్చకుండా.. నేల మీదే నిలబడి.. గోడకు ఎత్తిపెట్టి చివికిన నవారు మంచం మాత్రం ఇద్దరినీ తన ఒడిలోకి తీసుకొని, ఇన్నాళ్ళూ మనిషితనం లేని ఈ ఖాళీజాగా నిండుకుంటుందనీ, వెచ్చని చేతుల చిరుస్పర్శలోని అనిర్వచనీయమైన ఆత్మీయతను ఒకరి నుండి మరొకరు ఒంపుకుటారనీ, ఒక సుదీర్ఘ నిరాక్షణానంతరం తన నీడలోని నిండుతనాన్ని.. సంతోషంతో కలుపుతూ.. హుందాగా.. ఠీవిగా.. రాజసంగా.. అచ్చం పక్వత చందిన రాజ్యంలాగే ధీరదృక్కులతో నిలబడింది. దుమ్ము పేరుకున్న రేడియో నుండి గులాం అలీ గజల్ ఏదో చివరకి వస్తున్న కదలిక.. లోపల.. లోలోపల.. ఎంతో లోతుల్లో.. తిప్పే మలుపుల్లో.. తోసే అఖాతాల్లో.. విషాదస్వరాన్ని మీటింది. ఇవేం పట్టనట్టుగా.. వెక్కిరిస్తున్నట్లు పరుచుకున్న సర్రియలిస్టిక్ ముసలి నీడలు మాత్రం గోడలపై ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here