ఎక్కడ నుండి ఎక్కడకు?

0
11

[dropcap]నీ [/dropcap]మతంలో నీకున్న విశ్వాసాన్ని ఇతర మతాలను అసత్యాలుగా నిరూపించడానికి ప్రయత్నించనవసరం లేదని, ఏ మతమూ సంపూర్ణమైన సత్యానికి ప్రతీక కాదని మాక్స్‌ముల్లర్ బోధించాడు.

తోటి మానవులను సేవించడం అన్నిటికంటే ముందుగా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం అని ఖురాన్ చెప్తోంది.

ఎవరి హృదయం ధర్మచింతనతో, అహింసా ప్రవృత్తితో, భక్తితో, నిండి ఉంటుందో అతడు పరమాత్మ స్వరూపుడని సిక్కు గురువు ఉపదేశం.

భగవంతుడు ఆరాధనా మందిరాలలో మాత్రమే లేడు. నువ్వు నిజమైన భక్తుడవైతే నీవు తలచుకున్న మరు నిముషంలో నీ ముందు ఉంటాడని కబీర్ ప్రవచించాడు.

అఖండమైన పరబ్రహ్మాన్ని తమ తమ విన్యాసాలను బట్టి ప్రజలు వేరు వేరు పేర్లతో పిలుచుకుంటారని రామకృష్ణ పరమహంస బోధించారు. అహింస ఆచరణ అత్యంత ఆవశ్యకమని అన్ని మతాలూ ఘోషిస్తున్నాయి.

పరిశుద్ధ ఆత్మతో వ్యవహరిస్తూ అహింసను అనుసరించాలని బైబిలూ చెప్తోంది.

విశ్వశాంతిని, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, వసుధైక కుటుంబ భావనను బోధించి ప్రచారం చేసిన మహనీయులెందరికో భారతదేశం పుట్టినిల్లు. కబీర్, నానక్, బుద్ధుడు అందరూ అహింసనూ, సహనాన్నే బోధించారు. అక్బర్, షేర్‌షా, రాణా ప్రతాప్, శివాజీ వీరందరూ జాతి గర్వించదగిన వీరులే కాక అద్వితీయమైన మత సహనాన్ని అవలంబించి మానవత్వానికి విశిష్ఠ స్థానాన్ని కల్పించిన ఆదర్శపురుషులు.

వేల సంవత్సరల సుదీర్ఘ చరిత్రలో విభిన్న మత సాంప్రదాయాలు పెనవేసుకొని పోయిన మిశ్రమ సంస్కృతి భారతదేశంలో తప్ప మరెక్కడా కనిపించదు. అనేక సాంఘిక, మత, సాంస్కృతిక, రాజకీయ అంశాలు భారతీయుల జీవనశైలిలో మమేకం అయిపోయిఆయి. మతానికి అతీతమైన ఒక స్నేహార్ద్రపూరిత జీవన విధానానికి భారతీయులదందరూ అలవాటు పడిపోయారు. మతం వారి జాతీయతా భావాన్ని అధిగమించలేకపోయిందన్నది నిజం.

దేశ గౌరవాన్ని కాపాడటంలో అసమానమైన సాహసం చేసినందుకు ‘పరమవీరచక్ర’ను అందుకొన్న గ్రెనేడ్ వింగ్‍కు చెందిన అబ్దుల్ హమీద్, గార్డ్స్ బ్రిగేడ్‍కు చెందిన అల్బర్ట్ ఎక్కా, వైమానిక దళానికి చెందిన సెఖోన్, బొంబాయి శాపర్స్‌కు చెందిన రాణే, సాయుధ దళాలకు చెందిన తారాపూర్ – వీరందరూ మతానికీ అతీతమైన జాతీయతా భావంతో, దేశభక్తితో పోరాడి విజయానికి కారణమైనవారు కాదా?

“మానవ జాతి చరిత్రలోనే అత్యంత ప్రమాదభరితమైన ఈ తరుణంలో సమస్యల పరిష్కారానికి గల ఒకే ఒక మార్గం అశోకుడు, బుద్ధుడు, పరమహంస వంటి వారి అహింసామార్గం, వారు బోధించిన మత సామరస్యంతో కూడిన శాంతియుత జీవన విధానం. అటువంటి జీవన విధానం మానవ జాతినంతటినీ ఒక త్రాటిపై నడిపించి వసుధైక కుటుంబ భావనతో ముందుకు సాగిపోగలగటానికి స్ఫూర్తి నీయగలదు” అని ప్రఖ్యాత ఆంగ్ల చరిత్రకారుడు ఆర్నాల్డ్ జోసఫ్ ఏనాడో అన్నారంటే ఊరికే కాదు.

తన సమకాలీన ప్రపంచపు గతిరీతులను చూచే ఆయన అంత ఆవేదన చెందారంటే – అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మరింత దిగజారాయి కానీ ఏ మాత్రం చక్కబడలేదు.

సెక్యులర్ వ్యవస్థలోని పౌరుల హక్కులు, సాంఘిక, ఆర్థిక సంబంధాలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వానికి గల అధికారాన్ని అతిక్రమించి వ్యవహరించడానికి ఏ మతాన్ని మన రాజ్యాంగం అనుమతించదు. రాజ్యాంగంలోని 3, 4 విభాగాలలోని అవతారికలలో పేర్కొనబడిన ఉన్నతాశయాలకు నిర్దిష్టమైన రూపం కల్పించబడింది. కులమతాలకు అతీతంగా వివక్షకు తావులేని రక్షణను పౌరులకు రాజ్యాంగం కల్పిస్తోంది. కాని వాస్తవంలో జరుగుతున్నదేమిటి?

మతంతో ప్రమేయం లేని ప్రాథమిక హక్కులకు ‘మతం’ ప్రమేయం వలన భంగం వాటిల్లుతోంది. దురదృష్టం కొద్దీ సర్వత్రా వ్యాపించి ఉన్న హింస, దౌర్జన్యాలను నిర్మూలించే ప్రయత్నాలకు బదులు సంకుచిత రాజకీయాలు సమాజాన్ని జాతి, కుల, మత, స్త్రీ పురుష భేదాలతో విడగొట్టి సమస్యలను రాజకీయం చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే విద్వేష పూర్తిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని వచ్చిన పిటిషన్లపై స్పందిస్తూ సుప్రీం కోర్టు – రాజకీయాల నుండి మతాన్ని వేరు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకొని ఈ తరహా ప్రసంగాలకు అడ్డుకట్టా వేయాలని, అవసరమైన ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ కె.ఎం. జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నంలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here