ఎల్లక

0
15

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వజ్జీరు ప్రదీప్ గారి ‘ఎల్లక’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]ను మా ఊరి హైస్కూల్లో పదవ తరగతి పాసై వ్యవసాయం పనులు చేస్తానని అమ్మ నాన్నతో చెప్పాను. వాళ్ళు గట్టిగా పట్టుబట్టి పై చదువులకు పట్నం బోవాలని లొల్లి బెట్టిండ్రు.

చూడబోతే ఇంట్లో కటిక దరిద్రం. చూరుకు వేళ్ళాడే సాలెగూడు ఎప్పుడూ నా కండ్లలో మెదులుతుండేది. సిటీలో ఉన్న మిత్రులకు ఫోన్ చేసి వెళ్ళాను. కాలేజిలో జేయిన్ కావడమైతే జరిగింది గాని నా మనసెప్పుడు ఇంటి చుట్టే తిరిగేది.

చిన్నప్పటి ఒక సంఘటన ఎప్పుడు నా మనసులో మెదిలేది. ఓ రోజు అమ్మ,నాన్న పొలం పనికి బోయి వచ్చినంక తటపటయించుకుంట ఓ ప్రశ్న అడిగాను.

“ఎదురింటి రామయ్య మామోళ్ళందరు ఎందుకు చచ్చిపోయిండ్రు?”.

“ఎల్లక బిడ్డా!”

“ఎల్లకపోతే చచ్చిపోతారా!”

“అవ్ కొడుక! ఇక్కడంతే బతుకుతే గట్టిగా బతుకాలే. లేకుంటే చావాలే. డబ్బు లేకుంటే ఈ దునియా హీనంగా చూస్తుంది. నువ్ బాగా చదువుకుని మంచి నౌకరీ సంపాదించుకో, ఉన్నంతలోనే బతకాలే, అప్పులకు పోయి ఎల్లకుంటే మనం అంతే” నాన్న బాధగా అన్నాడు.

నేను యావరేజ్ స్టూడెంట్‌ను, మొదట పై చదువులంటే భయం వేసినా, ఇక మొండిగా చదివి ఏదో ఒక జాబ్ సాధించాలనుకుని యూనివర్సిటీలో పిజి వరకు నెట్టుకచ్చాను.

ఎప్పుడు పుస్తకాల పురుగునైన నాకు మా ఊరి అమ్మాయి శ్రావణి పరిచయం అయింది. తనది ఆర్ట్స్ గ్రూప్. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళచ్చినప్పుడల్లా ఊరి ముచ్చట్లు మోసుకచ్చేది.

మా ఇద్దరి మధ్య పరిచయం కాస్తా, ప్రేమగా మారింది.

ఎగ్జామ్స్ టెన్షన్‌లో పడి శ్రావణిని ఈ మధ్య కలవలేక పోయాను. ఎగ్జామ్స్ వరకు ఒకరికొకరం కలవకుడదని అనుకున్నాము. కాస్త ఖాళీ టైం దొరికేసరికి సెల్‌కి ఏమైనా మెసేజ్‌లు వచ్చాయేమోనని చుశాను. గ్రూప్ మెసేజ్‌లే తప్ప పర్సనల్ మెసేజ్‍లు ఏవీ రాలేదు.

‘ఇప్పుడు తనేం చేస్తుందో! తనెలా రాస్తుందో! తను ఎక్కడుందో! చూద్దాం, ఒక ఫోన్ చేస్తే తెలియదా’ అనుకుంటూ ఆమె నెంబర్‌కు డయల్ చేశాను. ఫోన్ రింగ్ అయింది, ఎందుకు రిసీవ్ చేసుకోలేదో అర్థం కాలేదు.

హాస్టల్‌లో బిజీగుందేమో, లేక ఫ్రెండ్స్‌తో క్యాంటిన్‍కు వెళ్ళిందా? అనుకుంటుండగా ‘టింగ్’ మని మెసేజ్ టోన్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే శ్రావణి వాయిస్ మెసేజ్ చేసింది.

“భార్గవ్.. నేను శ్రావణిని, మన ప్రేమ వ్యవహారం తెలిశాక నన్ను ఎగ్జామ్స్ రాయకుండానే ఇంటికి తీసుకొచ్చి బంధించారు. ప్లీజ్ నువ్ ఎక్కడున్న తొందరగా రా..” ఏడుస్తు పంపిన మెసేజ్; నెట్ ప్రాబ్లమేమో ఎప్పడో చేసింది ఇప్పుడచ్చింది.

ఊరెల్లుదామంటే నాన్న అన్న మాట గుర్తుకు రావడంతో ఆగిపోయి రాత్రంతా బాగా ఆలోచించాను.

ఊరెళ్ళితే జరిగే పరిణామాలు ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచనలు మెదడు పొరలల్లో సుడులు తిరుగుతున్నాయి.

మా విషయం నాన్నకు చెప్పి ఒప్పించాలని మార్నింగ్ బస్‌కు భయలుదేరాను.

***

వాకిట్లకు వెళ్ళి బ్యాగు బల్లపై వేసి కూర్చోగానే అమ్మ తిట్ల దండకం మొదలుబెట్టింది, నేను ఇప్పుడు ఏం చెప్పిన వాళ్ళకు అర్థం కాదని కొద్దిసేపు మౌనంగా వున్నాను.

వాళ్ళు స్తిమితపడ్డారనుకున్నాక అరుగు మీద కూర్చుని జరిగిన విషయం చెప్పాను.

“ఆ పిల్లకు ఏదో పెద్దింటి సంబంధం ఒచ్చిందట బిడ్డా! నువ్ దాని మనాది పెట్టుకుని ఎక్కడ ఆగమైతావో అని చెప్పలే” అంది అమ్మ.

“వాళ్లు ఇంటి మీదకు వచ్చి నానా యాగి చేసిండ్రు. రందికి మీ నాన్న తిండి మానేసి ఇగో గిట్లనే కూర్చుంటాండు, నాలుగు రోజుల నుండి ఉలుకు లేదు – పలుకు లేదు”

తాత దగ్గరకచ్చి రందితో మొగురంకు ఒరిగి కూర్చున్న నాన్నను చూపిస్తు అన్నడు.

నాన్న మొఖం చూడాలంటే భయం వేసింది.

“చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి మాకు ఆసరవుతావ్ అనుకుంటే నువ్వేందిరా గిట్ల చేయబడితివి” అమ్మ నా కళ్ళల్లోకి దీనంగా చూస్తూ అంది.

అమ్మ కళ్ళల్లో నీళ్లు నేల మీద రాలుతున్నాయి

“తిండికి ఎళ్లకపోయినా ప్రేమలు, పెళ్లిళ్లు కావలసి వచ్చిందా అని ఊళ్లో తలో మాట అంటాండ్లు.” తాత బీడీ వెలిగించుకుంటూ అన్నాడు.

“నువ్వేం ఫికర్ బడకు. పిల్ల చక్కగుంటది, పైగా మీ ఈడు జోడు బాగుంటది. ఎట్టైన నేను మాట్లాడుతా” పెద్ద మనిషి ఒకతను అన్నాడు.

శ్రావణి నా మాట వినగానే ఇంట్లో కెళ్ళి పరుగెత్తుకుంటు వచ్చింది, బాగా ఏడ్చి ఏడ్చి కండ్లు చింతపిక్కలా మారినాయి. చెదిరిన జుట్టుతో అంతా పీలగా తయారైంది. ఇంటి ముందుకు వెళ్ళగానే వాళ్ళ నాన్న ఆపిండు.

శ్రావణి బాబాయి మాత్రం తాగి ఉన్నట్టున్నాడు. రువ్వడిగా నాపైకి కోపంగా వచ్చాడు. మరోకతను అతని చేతిలో కర్రను తీసుకుని అతన్ని వారించాడు.

“పోలీస్ స్టేషన్‌లో కేసు బెడుదాం పదండ్రి” శ్రావణి మేనమామ అన్నడు.

ఏమైందో అని అమ్మ,నాన్న ఓ నలుగురిని తీసుకుని ఇటువాడకు వచ్చిండ్రు.

“సామరస్యంగా మాట్లాడుదాము కూర్చోండి” కుర్చీలు చూపించాడు సర్పంచ్ బాలరాజు.

మేం నలుగురం, వాళ్ళో నలుగురు చెరో వైపు కూర్చున్నాము.

“ఊరి సమస్య పోలీస్ స్టేషన్ దాక తీసుకెళ్ళడం దేనికి, రా కూర్చో అన్నా, మాట్లాడదాం” అనడంతో బుసబుసమంటున్నవాడల్లా మెల్లగా చెయిర్లో కూర్చున్నాడు వాళ్ళ మేనమామ.

“ఎవరైన వాళ్ళ బిడ్డను వాళ్ళ కన్న గొప్పింట్లోకి ఇవ్వాలనుకుంటారు. వాళ్ళ ఉద్దేశం తప్పు కాదు గదా, బావా” నాన్నను చూస్తూ అన్నాడు సర్పంచ్ బాలరాజు.

“అవును గాని.. పిల్లలు ఇష్టపడ్డారు, పెండ్లికి డబ్బు కన్న రెండు మనసులు కలవడం ముఖ్యం గదా” నాన్న మెల్లగా అన్నాడు.

“మరి వాళ్ళ తాహతుకు మీరు తూగుతారా? అందుకే బయట జాబ్ ఉన్న అతనికిద్దామనుకుంటున్నారు వాళ్ళు. మరి నీ ఉద్ధేశం ఏంటి?”

బాలరాజు మాటకు శ్రావణి శివంగిలా చూసింది.

“మామా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి,” రెక్వెస్టుగ అడిగాను.

“పోరడు బంగారమసొంటోడు. ఏ అలవాట్లు లేవు, చక్కగా చదువుకుంటాండు, నౌకరి అచ్చేదాక జూసి రాకుంటే మీ ఇష్టమచ్చినోళ్ళకిచ్చుకోండ్లి” కులం పెద్ద రాజయ్య ఓ మాట అన్నడు.

“ఏమంటావు వెంకట్రావు” శ్రావణి వాళ్ళ నాన్న వైపు జూసి అన్నడు సర్పంచ్ బాలరాజు.

“సరే మీరందరంటాండ్లు గాబట్టి ఇయ్యాటి సంది ఓ సంవత్సరం జూద్దాం, ఆ తర్వాత నాకిష్టమైన సంబంధం తెచ్చి చేస్తాను.”

“అందరు విన్నారు గదా” బాలరాజు గట్టిగా చెప్పాక నిబంధనలతో కూడిన ఓ బాండ్ పేపర్ రాసి ఇరువురు సంతకాలు చేశారు.

శ్రావణి ఒక్కసారి తల ఎత్తి నావైపు చూసింది. ఆ చూపులో ఎన్నో నిగూఢమైన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు నా మనసులో ఉత్పన్నమౌతున్న జవాబులు అన్ని కండ్లతోనే చెప్పాను.

***

లోకల్ బస్‍లో వెళ్తుంటే అమీర్ పేట చౌరస్తాలో రామనాథం సార్ బస్ ఎక్కాడు. కాస్త వయసు పైబడిన వార్ధక్యపు ఛాయలేవి కనిపిస్తలేవు. అందుకే గుర్తుపట్టానేమో! నా ముందున్న నలుగురిని తోసుకుంటు వెళ్ళాను. అతను జేబులో చిల్లర తీసి కండక్టర్‌కి ఇచ్చాడు.

“సర్ నమస్తే, నన్ను గుర్తుపట్టారా?”

“గుర్తున్నావ్.. గుర్తున్నావ్.. భార్గవ్ కదు”

“అవును సార్”

“ఏం చేస్తున్నావు?” కండక్టర్ ఇచ్చిన టికెట్ జేబులో పెట్టుకుంటూ అన్నాడు.

“ఇక్కడే కంపెనీలో వర్క్ చేస్తున్నాను”

“ఈ రోజు ఆదివారం సెలవే కదా మన ఇంటికెళ్ధాం పదా”

“మళ్ళీ వీలు చూసుకుని వస్తాను”

“పర్లేదు స్టాప్ వచ్చింది దిగేయ్” అనడంతో ఇద్దరం బస్ దిగి ఓ గల్లిలోనుండి ఇల్లు చేరాము.

టీ తాగాక చిన్ననాటి ముచ్చట్లు, ఫ్రెండ్స్ ఎవరెవరు ఎక్కడుంటున్నారోనని అందరిని పేరు పేరున గుర్తుచేశాడు.

ఆ తరువాత నేను జరిగిన విషయం మొత్తం వివరించాను.

“భార్గవ్ నా స్టూడెంట్ ఒకరు ఇక్కడే ఇన్‌స్యూట్ పెట్టాడు. అతన్ని కలిస్తే నీకేమన్న హెల్పవచ్చు”

“ఎక్కడుంటాడు సర్, వెళ్ళి కలుస్తాను” నా ఆత్రుతను గమనించాడేమో..

“ఒక్క నిమిషం” అంటూ సెల్ తీసుకుని కాల్ చేశాడు.

అతను ఇక్కడికి దగ్గరలోనే వున్నానని సార్ దగ్గరకే వస్తున్నానని చెప్పి అరగంటలో అక్కడికి వచ్చాడు.

రామనాథం సార్ నన్ను పరిచయం చేసి జరిగిన విషయం కూడా వివరించాడు. చాలా సేపు మాట్లాడాక ఇన్‌స్టిట్యూట్‍కి తీసుకవెళ్ళి మెటీరియల్ బుక్స్ ఇచ్చాడు అరవింద్.

ఎలా ప్రిపేర్ కావాలో వివరించాడు. దాంతో నేను కంపెనీలోనే పని చేస్తు రాత్రుళ్ళు చదువుకునే వాడిని.

నోటిఫికేషన్ రాగానే అప్లై చేయించి తన రూంలోనే వుంచుకుని డౌట్స్ క్లారిఫై చేస్తు ప్రిపేర్ చేయించాడు.

ఈ టైంలోనే నాకు కాలం విలువ తెలిసింది. టెన్షన్ పడినప్పుడల్ల ఉద్యోగం సాధించిన వాళ్ళ యొక్క జీవిత చరిత్రను చెప్పి స్ఫూర్తి నింపి ఎగ్జామ్స్ రాయించి నన్ను ఓ కొత్త లోకంలోకి తీసుకపోయాడు.

మనసుకు కాస్త రిలీఫ్ అయిందిప్పుడు. అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళ బాగోగులు తెలుసుకున్నాను.

శ్రావణితో మాట్లాడాలని వుంది. ఎలా వుందో? ఊరెళ్ళుదామంటే ఊరిపెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందం గుర్తుకువచ్చి మనసుకు సంకెళ్ళు వేస్తుంది.

ఎప్పటిలానే రూం దగ్గర్లో వున్న సాయిబాబా టెంపుల్‌కి వెళ్ళి బాబాను దర్శించుకుని కాసేపు కూర్చుండి కంపెనీ పని చేస్తు ఈవినింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తున్నాను.

కాలచక్రం గిర గిర తిరుగుతునే వుంది.

“ఎల్లకపోతే మన బతుకింతే” అన్న నాన్న మాటలు, ఉద్యోగం వస్తేనే శ్రావణితో పెండ్లి అన్న వాళ్ళ మాటలతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలి, డబ్బు సంపాదించాలి అని తప్ప నాకు వేరే ఏ ఆలోచన లేకుండా చేశాయి.

ఒక రోజు అనుకోకుండా రామనాథం సార్, అరవింద్ సార్ ఇద్దరు కలసి వచ్చారు.

అరవింద్ సార్ నన్ను ఎత్తుకుని గాల్లో గిరగిర తిప్పాడు.

“కంగ్రాట్స్ భార్గవ్” షేకాండ్ ఇస్తు అన్నాడు రామనాథం సార్.

“కంగ్రాట్స్” చేయందిచ్చాడు అరవింద్ సార్.

స్వీట్ తినిపించి విషయం చెప్పారు. నేను పాస్ అయ్యానని.

“పాస్ కాగానే సరిపోదు గద సార్, మన దేశంలో మెరిట్ కన్న రిజర్వేషన్లకే ప్రాధన్యత ఎక్కువ. దాంతో చేతి వరకచ్చి చేజారినవాళ్ళెంతో మంది ఉన్నరు. రేపు ఉద్యోగంలో చేరే వరకు నమ్మకంలేని వ్యవస్థ మనది” భయంగా అన్నాను.

“భార్గవ్ డోంట్ వర్రీ. ఇక్కడి దాక వచ్చావు. నేను నీకు ఉద్యోగం వచ్చాక నీ ఫియాన్సిని కలిపే బాధ్యత నాదని చెప్పాను గదా” డీలా పడ్డ నా భుజంపై చేయివేసి అన్నాడు అరవింద్.

‘గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః’

చిన్నప్పటి నుండి నేను ఆరాధించిన సాయిబాబా వీరి రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడనుకున్నాను.

చూస్తుండగానే తహశీల్దార్‌గా పోస్టింగ్ ఆర్ఢర్ చేతికచ్చింది. ఈ విషయం ముందు అమ్మ,నాన్నకు చెబుతానని ఫోన్ చేస్తుంటే అరవింద్ సార్ “ఫోన్ కన్న డైరెక్టుగా వెళ్ళి చెపితే బాగుంటది” అన్నాడు.

ఇద్దరం కార్లో ఊరు భయలుదేరుతుండగా జేబులో సెల్ రింగయింది. నేను ఫోన్ ఎత్తి షాక్‌తో కుప్పకూలాను.

సార్ ఫోన్ తీసుకుని అమ్మతో మాట్లాడాక కార్ హాస్పిటల్ వైపు తిప్పాడు. అక్కడకు వెళ్ళే సరికి నాన్న ఐ.సి.యు.లో ఉన్నాడు. సార్ వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడాడు.

“నీ చదువు కరాబైతదని చెప్పకన్నాడు రా” అమ్మ చాతి కొట్టుకుంటు ఏడుస్తూ అంది.

“నిజమేరా! నువ్ ఉద్యోగం సంపాదించే వరకు ఊళ్ళోకి రానన్న నీ పట్టుదలను అందరికి గొప్పగా చెప్పేవాడు.” చిన్నాన దగ్గరకచ్చి అన్నాడు.

“నీకు డిస్టబెన్స్ కాకుడదనే సంవత్సరం నుండి జబ్బు దాచుకున్నాడే గాని ఎవ్వరికి చెప్పలేదు” సర్పంచ్ బాలరాజు దగ్గరికి తీసుకుంటూ అన్నాడు.

విగతజీవి అయిన నాన్నను అంబులెన్స్ మాట్లాడి ఎక్కించాడు అరవింద్ సార్.

నేను నాన్నను గట్టిగా పట్టుకుని ఏడ్చాను.

తను గిరిగీసుకున్న కట్టుబాట్లను తెంచుకుని నా భుజంపై చేయివేశాడు శ్రావణి వాళ్ళ నాన్న.

ఇప్పుడు ఉద్యోగం ఉంది – చెప్పుకోడానికి నాన్న లేడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here