ఎల్లమ్మకు ఎడ్లు లేవు, మల్లమ్మకు మళ్లు లేవు

0
13

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

[dropcap]డో[/dropcap]కులూరు గ్రామంలో సింహాచలం అనే గిరిజనుడు ఉండేవాడు. అతనికి ఎల్లమ్మ, మల్లమ్మ అనే పేర్లు గల ఇద్దరు భార్యలు. ఎల్లమ్మకు సంతానం( పిల్లలు) కలగలేదని సింహాచలం మల్లమ్మను పెళ్లి చేసుకున్నాడు. మల్లమ్మకూ పిల్లలు లేరు. సింహాచలంకు నాలుగెకరాల భూమి, జత ఎడ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆరు ఆవులు, ఐదారు తులాల బంగారం, రెండిళ్లు ఉన్నాయి. ఇద్దరు పెళ్లాలను వేరువేరుగా రెండిళ్లలో ఉంచాడు. గిరిజనులలో బహుభార్యత్వం అనే ఆచారం ఇప్పటికీ ఉంది.

ఒక రోజు సింహాచలం తన పొలానికి వెళ్తుండగా దారిలో అతని నేస్తుడి కల్లుచెట్టు కనబడింది. కల్లు త్రాగుదామనుకున్నాడు గాని చెట్టు దగ్గర ఎవరూ లేరు. నేస్తుడికి చెప్పకుండా కల్లు త్రాగడం తప్పు అని తెలిసికూడా చెట్టు ఎక్కి దానికి కట్టిన కుండలోని కల్లు త్రాగుతూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. క్రింద ఒక బండ రాయి మీదపడగా తలకు బలంగా దెబ్బతగిలి అక్కడికక్కడే మరణించాడు. సాయంకాలమైనా ఇల్లు చేరలేదు. అతని పెళ్లాలు గాబరాపడి పొలంకు వెళ్లిన భర్త కల్లు చెట్టు క్రితం చచ్చిపడిన విషయాన్ని ఎవరి ద్వారానో తెలుసుకుని ఏడ్చారు. గ్రామపెద్దలు వారిని ఓదార్చారు. ఎల్లమ్మకు పొలం, మల్లమ్మకు ఎడ్లు, ఆవులు, ఇద్దరికి రెండు తులాలు వంతున బంగారం పంచారు.

ఎల్లమ్మ తన వాటాగా వచ్చిన పొలం తన బంధువుల ఎడ్లు చేత దున్నించుకుని పంటలు పండించి వాటిని అమ్ముకుని బ్రతుకుతుంటే, మల్లమ్మ తన ఆవుల పాలమ్ముకునేది. తన ఎడ్లను అవసరమైన గిరిజనులకు అద్దెకు ఇచ్చేది. ఎద్దుల, ఆవుల పేడతో సేంద్రీయ ఎరువు తయారు చేసి రైతులకు అమ్మి సొమ్ము చేసుకునేది. ఒక రోజు ఎల్లమ్మ పొలంలో మల్లమ్మ ఆవులు పడి వరిచేను బాగా తినేశాయి. ఇది తెలుసుకున్న ఎల్లమ్మ అగ్గిమీద గుగ్గిలం అయింది. మల్లమ్మను నానా తిట్లు తిట్టింది. గ్రామ పెద్దల దగ్గర తగవు పెట్టింది. వారు ఒక రోజు ఉదయం గ్రామంలోని గిరిజనుల సమక్షంలో ఇద్దర్ని పిలిపించారు. “మీరిద్దరూ సింహాచలం పెళ్లాలేకదా! అతడు చనిపోయాక బాగానే బ్రతుకుతున్నారు గాని ఒకరంటే ఒకరికి ఎందుకు ఇష్టంలేదో చెప్పండి. మీరు ఇలా పోట్లాడుకుంటే అందరూ నవ్వుకుంటున్నారు. ఎల్లమ్మకు నీ ఎడ్లు పొలం దున్నుటకు ఇస్తే తప్పులేదు కదా?” అని మల్లమ్మను అడిగారు. “అలాగే మల్లమ్మ ఆవులకు నీ పొలంలో పండిన ఎండుగడ్డి ఇవ్వొచ్చు. ఆమె నీ చెల్లెలు గాబట్టి పండించిన పంట కొంత ఇయ్యి. ఆమె ఆవుల పేడను నీ పొలంలో వేసుకుంటే పంటలు బాగా పండుతాయి. ఇద్దరికీ పిల్లలు లేరు గదా! ఊరిలోని ఇద్దరు అనాథలయిన పిల్లలను పెంచుకోండి. ఐకమత్యంగా ఉంటే మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు” అని బోధపరిచారు. వారు అందుకు అంగీకరించారు.

ఒకటివుండి ఇంకొటి లేకపోతే ‘ఎల్లమ్మకు ఎడ్లు లేవు, మల్లమ్మకు మళ్లు లేవు’ అనే సామెత చెబుతారు గిరిజనులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here