కాజాల్లాంటి బాజాలు-81: ఏం మగవాళ్ళండీ బాబూ!

4
8

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]వాళ కుటుంబ సభ్యుల జూమ్ మీటింగ్‌లో వదిన అందర్నీ ఒక ప్రశ్న అడిగింది…

అదేవిటంటే “ఈ మధ్య మగవాళ్ళు, అంటే మొగుళ్ళు మారారనీ, భార్యకి గౌరవమిస్తున్నారనీ, ఇంటిపనుల్లో కూడా అడవాళ్లకి చాలా సహాయం చేస్తున్నారనీ అంటున్నారు కదా.. అది నిజంగా జరుగుతోందా…” అని.

అవున్నిజవే.. క్రితం తరం వాళ్ల కన్న ఈ తరం మగపిల్లలు భార్య విలువ తెలుసుకున్నారనీ, భార్యలు ఉద్యోగం చేస్తున్నా లేకపోయినా వాళ్ళ అభిప్రాయాలని గౌరవిస్తున్నారనీ కొందరంటే… అసలు ఈ రోజుల్లో ఆడవాళ్ళే మగవాళ్లని మించిపోయి అధికారం చెలాయిస్తున్నారని ఇంకొందరన్నారు. ఇలా వాళ్లందరి మధ్య జరిగిన మాటలు వింటున్న నాకు ఈ మధ్యే మా పక్కింట్లో దంపతులైన బ్రహ్మం, భార్య విద్యల మధ్య జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆ సంఘటన సీన్ బై సీన్ చెప్తాను. ఆస్వాదించండి..

***

“ఎందుకే నీకింత తొందరా…” పొద్దున్నే హడావిడిగా లేస్తున్న భార్య విద్యని రాగయుక్తంగా అడిగేడు బ్రహ్మం..

“ఎందుకేంటీ.. కాసేపటికి కడుపులో గంట మోగితే అప్పుడు తెలుస్తుంది ఎందుకు లేచేనో..” అంటూ విసుగ్గా సమాధాన మిచ్చింది విద్య. పాపం అనిపించింది బ్రహ్మానికి.

నిన్ననే ప్రాజెక్ట్ పూర్తిచేసి పంపించేసేడు కనక కాస్త ప్రశాంతంగా వున్న బ్రహ్మానికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈరోజు వంటయింటి డ్యూటీ తను పుచ్చుకుంటేనో అనిపించింది. అంతే.. అనిపించిందే తడవుగా ఒక్క ఉదుటున మంచంమీంచి దూకుతున్నట్టే లేచేడు.

“ఉండుండూ..” అంటూ విద్య కాళ్ళకి అడ్డం పడిపోయి, “ఇవాళ వంటింటి డ్యూటీ నాకిచ్చెయ్యి..” అన్నాడు ఆమె ముందు నడుం వంచి చేయి చాచుతూ..

“మీకా..” అంది ఆశ్చర్యంగా.

“ఏం.. నాకు రాదనుకుంటున్నావా! చిన్నప్పుడు మా అమ్మ వెనకాలే ఉండేవాడిని. పెళ్ళయేదాకా మటుకు అడపా దడపా వండుకోకుండానే గడిచిందంటావా! నేను దప్పళం పెట్టేనంటే ఆ పోపుఘాటు మూడూళ్ళదాకా వెడుతుందని చెప్పుకుంటారు తెల్సా.. ఒకసారి నేను చేసిన కూటు తినడానికి మా బాసే స్వయంగా వచ్చేడు. అందుకని ఓ కాంతామణీ… నీ పతిని తక్కువ అంచనా వెయ్యకు. ఈ రోజు వంటింటిని నా కొదిలెయ్యి.”

“ఆహా.. అదికాదు.. చింటూ..” అంటూ ఏదో అనబోయిన విద్యతో.. “చింటూ కేం కావాలో నాకు తెల్సు.. ఇవాల్టికి వాణ్ణి కూడా నాకొదిలేసి నువ్వు హాయిగా రెస్టు తీసుకో.. రెణ్ణెల్లనించి నా ప్రాజెక్ట్ గొడవల్లో నేనుంటే పాపం ఇంటా బైటా నువ్వే సంబాళించుకున్నావ్. ఈ పూట నిన్ను సేవించుకునే అవకాశమివ్వు..” అని బతిమాలుతూ, చిన్నప్పుడు స్కూల్లో, కాలేజీల్లో చేసిన అభినయాన్ని మరోసారి విద్య ముందు ప్రదర్శించేడు బ్రహ్మం.

“మీకెందుకండీ..” అనబోయిన విద్య మెదడులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే వరమిస్తున్న దేవతలా అభయహస్తం చూపిస్తూ “తథాస్తు..” అంది నవ్వుతూ.. బ్రహ్మానికి బ్రహ్మానందమేసింది. అతనికి వంట చెయ్యడమన్నా, పిల్లలని ఆడించడమన్నా చాలా ఇష్టం. కానీ ఆఫీసు పనులు ఊపిరాడనివ్వక అతని ఇష్టాన్ని పట్టించుకోనివ్వటంలేదు. ఇప్పుడు విద్య అతని కోరికని మన్నించగానే బ్రహ్మానికి ఏనుగెక్కినంత సంబరమనిపించింది.

“మీరు ముందు ఫ్రెష్ అయి రండీ.. ఒక్క కాఫీ మటుకు చేసి తెస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం..” అంది.

ఇద్దరూ హాలీడేని ఆస్వాదిస్తూ విద్య చేసి తెచ్చిన కాఫీ తాగేక వంటింటివైపు నడవబోతున్నవాడల్లా వెనక్కి తిరిగి “నిజంగా రావుకదూ వంటింట్లోకీ..” అనడిగేడు. “ఊహూ..” అంటూ కళ్ళని చక్రాల్లా గుండ్రంగా తిప్పుతూ తల అడ్డంగా ఆడించింది విద్య. అయినా నమ్మకం కుదరక అలమారు వైపెళ్ళి పైన కనిపించిన నాలుగు వీక్లీలనీ తెచ్చి విద్య పక్కన టేబుల్ మీద పెట్టి, టీవీ ఆన్ చేసి రిమోట్ విద్య చేతికిచ్చి, “చింటూ లేవగానే కేకెయ్యి, బూస్ట్ కలిపి తెస్తాను. నువ్వు మటుకు కదలకుండా హాయిగా బుక్స్ చదువుకుంటూ, టీవీ చూస్తూ కూర్చో.. కదిలితే ఊరుకోను సుమా..” అని బెదిరించి మరీ అక్కణ్ణించి నిష్క్రమించేడు.

కాసేపయింది.. చింటూ లేచేడు. వాడి ఏడుపు వినపడిన అయిదు నిమిషాల్లోపే బూస్ట్ కలిపి తెచ్చిచ్చేడు బ్రహ్మం. దానితోపాటు సెకండ్ డోస్‌గా మరో స్ట్రాంగ్ కాఫీ కూడా విద్య చేతి కందించేడు. విద్య మొహం కలువలా విచ్చుకుంది. వెలిగిపోతున్న ఆ మొహాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ వంటింట్లో కెళ్ళిపోయేడు బ్రహ్మం. వంటింట్లోంచి ఘుమఘుమలు వీళ్ళింట్లోకే కాకుండా పక్కింట్లోకి కూడా వ్యాపించేయి.

సరిగ్గా పదకొండుగంటలకల్లా మామిడికాయపప్పూ, గుత్తివంకాయకూరా, మామిడికాయకొబ్బరికాయ పచ్చడీ, ఘుమఘుమలాడిపోతున్న దప్పళంతో సహా డైనింగ్ టేబుల్ మీదకి వంటకాలు చేరిపోయేయి. అవేకాక ఆ రోజు స్పెషల్ అంటూ కమ్మని సేమ్యా పాయసం కూడా చేసేడు. వంట చెయ్యడమే కాదు ఆ వంటలని టేబుల్ మీద అందంగా ఎలా అమర్చాలో కూడా కళాదృష్టికల బ్రహ్మానికి చాలా బాగా తెలుసు. అంత బాగా అమర్చిన బ్రహ్మంలోని కళాదృష్టిని ఎంతో అభినందించింది విద్య. “ఇంతకన్నానందమేమీ…” అని పరవశించి పాడుకున్నాడతను.

పనంతా అయ్యేక మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి భోజనం చేద్దామని వచ్చిన బ్రహ్మానికి టేబుల్ మీద ఎంతో అందంగా అమరిన ఆ వంటకాలని తన మొబైల్లో ఫొటోలు తీస్తున్న విద్య కనిపించింది.

“వాటికెందుకూ ఫొటో.. నీకంత ముచ్చటగా వుంటే నాకు తియ్యి..” అన్నాడు నవ్వుతూ.

“మీకన్నానా …” అంటూ అతనిని మూడు నాలుగు యాంగిల్స్ లో ఫొటోలు తీసేసింది విద్య.

ఇద్దరూ ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ ఎంతో రుచిగా వున్న ఆ భోజనాన్ని ఆస్వాదించేరు.

మర్నాడు బ్రహ్మం ఆఫీసులో ఉన్నప్పుడు అతనికి “బ్రహ్మంగారు మీరేనా..” అంటూ ఒక ఫోన్ వచ్చింది. అవునన్నాడు.

“మేం హీ హీ టీవీ చానల్ నుంచి మాట్లాడుతున్నామండీ…. మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.. కంగ్రాట్యులేషన్స్” అని వినిపించింది అవతల్నించి.

అతనికేవీ అర్థం కాలేదు. “టీవీయా.. ప్రైజా.. నేను ఏ పోటీలోను లేనే..” అన్నాడు ఆశ్చర్యంగా.

“లేకపోవడమేంటండీ.. భార్యల దినోత్సవం సందర్భంగా మా చానల్ భార్యలకి ఒక పోటీ పెట్టింది. ఈ రోజు భార్య భర్త చేత ఎంత బాగా వంట వండిస్తుందోనని ఆ పోటీ. ఎవరింట్లో వాళ్ళే భర్తలచేత వండించి ఆ వీడియోని మాకు పంపాలన్న మాట. అలా వచ్చిన వీడియోల్లో మీ వీడియోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏమాట కామాటే చెప్పుకోవాలండీ..మీరు వంట మటుకు బ్రహ్మాండంగా చేసేరు. ఆ చెయ్యడంకూడా విసుగనేది అస్సలు మొహం మీద కనపడకుండా ఎంతో పరవశించిపోతూ చేసేరు. దానికి పడిపోయేరండీ మా జడ్జీలు. డైనింగ్ టేబుల్ మీద వంటకాలు మటుకు… అబ్బో.. ఎంత బాగా అమర్చేరూ! ఈవినింగ్ మీ ఇంటి కొచ్చి మీదీ, మీ వైఫ్‌దీ ఇంటర్వ్యూ తీసుకుంటాం.. కంగ్రాట్యులేషన్స్ వన్సెగైన్..” అంటూ ఫోన్ పెట్టేసేరు చానల్ వాళ్ళు.

బ్రహ్మానికి మతిపోయింది. ఏదో తనకున్న సరదాకొద్దీ కొంతా, విద్యకి రెస్ట్ ఇద్దామని కొంతా వంట చేసేడు.. అదీ తన ఇంట్లో.. తన వంటింట్లో.. కానీ అది ఇలా చానల్స్‌కి ఎక్కిస్తుందా విద్యా? ఎంత ధైర్యం! ఇది కనక అమ్మానాన్న, అక్కాబావా, మిగిలిన చుట్టాలూ, స్నేహితులూ చూస్తే హెంత అవమానం…హెంత అవమానం. అసలు ఈ విద్యకి బుధ్దుందా..గుట్టుగా వుంచవలసిన విషయాన్ని టీవీకి ఎక్కిస్తుందా!

వెంటనే ఇంటికి ఫోన్ చేసేడు. “అప్పుడే మీకూ ఫోన్ చేసేరా చానల్ వాళ్ళూ. నాకు చేస్తే ఇప్పుడే మీ నంబర్ ఇచ్చేను. మనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండీ. నాకెంత సంతోషంగా ఉందో..” అంటూ సంబరపడిపోతున్న విద్యని,” కాసేపాపు..” అంటూ అరిచి, “అసలు నువ్వు వీడియో ఎప్పుడు తీసేవ్.. నే వంట చెస్తున్నంత సేపూ చింటూతో రూమ్ లోనే వున్నావు కదా!” అనడిగేడు.

సంతోషాన్ని కాసేపు పక్కకి పెట్టి “పొద్దున్నే కాఫీ కలపడానికి వెళ్ళినప్పుడు వంటింట్లో కిటికీ పైన కెమెరా పెట్టి వీడియో ఆన్ చేసేనండీ.. అదే తీసేసింది మొత్తమంతా.. ఎంత బాగా వచ్చిందో.. నిన్నరాత్రే చానల్ వాళ్లకి పంపేసేను. ఇవాళ భార్యల దినోత్సవం కదా! అది ఇవాళే వేస్తార్టండీ..” చివరి మాట చెప్పేటప్పుడు పక్కకి పెట్టిన సంతోషం మళ్ళీ విద్య గొంతులో కొచ్చేసింది.

“నా మొహంలా ఉంది. అది చానల్లో వస్తే మా అమ్మానాన్నా చూసి ఏవనుకుంటారూ.. ఆమాత్రం తెలియొద్దూ నీకూ?”

“ఏం వాళ్ళకి తెలీకుండా చేస్తే పరవాలేదా. ఇంట్లో పెళ్ళానికి కాళ్ళు నొక్కొచ్చు కానీ అది బైటవాళ్లకి తెలీకూడదా! ఎంచక్క వంట చేసి పెళ్ళానికి పెట్టొచ్చు కానీ అది బైట వాళ్లకి తెలిస్తే నామోషీయా! చేసే పని ధైర్యంగా చెప్పలేని మీరూ ఏం మగవాళ్లండీ బాబూ.. ! ” అంటూ ఫోన్ పెట్టేసింది విద్య.

తల పట్టుకున్నాడు బ్రహ్మం…..

ఇదంతా చదివేక “పాపం బ్రహ్మం” అంటారా లేకపోతే “ఏం మగవాళ్ళండీ బాబూ” అంటారా……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here