ముచ్చటైన ముచ్చట్ల ‘ఏమండీ కథలు’

1
10

[శ్రీమతి మాలాకుమార్ రచించిన ‘ఏమండీ కథలు’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]ఎం[/dropcap]తోమంది భార్యాభర్తలు జీవితాన్ని గడిపేస్తారు. కొందరు మాత్రమే జీవితాన్నిఅనుభవిస్తారు. అటువంటి కొద్దిమందిలో మాలా, ప్రభాత్ లు ఒకరు. వీరి వివాహ జీవితంలో జరిగిన ముచ్చటైన ముచ్చట్లే ఈ ‘ఏమండీ కథలు’.

భర్త గురించి ఎవరితోనైనా చెపుతున్నప్పుడు భార్యలు సాధారణంగా ‘మా వారు’ లేక ‘మా ఆయన’ అని చెపుతుంటారు. కానీ ఇక్కడ రచయిత్రి ‘మా ఏమండీ’ అని మేజర్ ప్రభాత్ గారిని మనకి పరిచయం చేయడంలో వారికి భర్త  పైన కేవలం అభిమానం, గౌరవమే కాదు, ఎల్లలెరుగని  ప్రేమ కూడా ఉందని మనకి అర్థమౌతుంది.

భర్త దృష్టికోణం నుంచి మునిమాణిక్యంగారు ‘కాంతం కథలు’ రాస్తే భార్య దృష్టికోణం నుంచి మాలాగారు ఈ ‘ఏమండీ కథలు’ రాసారనిపిస్తుంది ఈ కథలు చదువుతుంటే. కథలలోని ప్రతి సన్నివేశంలోనూ ‘ఏమండీగారు’ మాట్లాడే మాటలను తనకు తగినట్టు అన్వయించేసుకుని, అందుకు తగ్గట్టు ఆమెగారు ప్రవర్తించిన విధానం మనకు దృశ్యాన్ని కళ్ళముందు నిలిపి, మన పెదిమలమీదకి నవ్వు తెప్పించక మానదు.

ఏ సంఘటననైనా ఆమెకు సహజసిధ్ధమైన హాస్యంతో మేళవించి చెప్పి, మన కళ్ళముందు ఆ సన్నివేశాన్ని అలా నిలబెట్టేసే రచనా ప్రతిభ మాలాకుమార్ గారిది.

ఈ పుస్తకంలో ప్రతి కథా అటువంటిదే. ఉదాహరణకి చెప్పాలంటే మొట్టమొదటి కథలోనే మాలాగా పునర్జన్మ నెత్తిన కమలగారు పెళ్ళయేక జరుపుకున్న మొదటి న్యూ ఇయర్ పార్టీ గురించి చదువుతుంటే మనకి తెలీకుండానే మన పెదవుల మీదకి చిరునవ్వు వచ్చి చేరుతుంది.

ఆ తర్వాత అందాజా తెలీకుండా చేసిన ‘గాజర్ హల్వా’ కథ, మొదటిసారిగా ఎక్కిన ‘మబ్బుల పల్లకీ’, వెనకాల భార్య ఎక్కారో లెదో చూసుకోకుండా ఏమండీగారు స్కూటర్ మీద వెళ్ళిపోయే ‘నన్ను వదలి నీవు పోలేవులే’ కథ, ఏమండీగారు అనే మాటలకి పౌరుషపడి చేసిన కోర్సుల ‘పౌరుషిణి’, బక్కగా ఉండి భయపడిపోతున్న ఆమెకి ఇచ్చిన యమధర్మరాజు పాత్ర గురించి చెప్పిన ‘మై హూం యమధర్మరాజ్’, పిల్లలనీ, భార్యనీ కూడా యేమార్చిన మేజర్ గారి ప్రతిభ తెలిపే ‘ఎంతెంతదూరం’ కథ, అంతర్జాతీయ ప్రయాణాల్లో పరోపకారైన మేజర్ గారు చేసిన సాహసాలు తెలిపే ‘వీడు వెరుపెరుగడు సూడవె’, తరతరాలుగా ‘వెంటాడే దొంగగారి’ కథ, ‘బుజ్జితల్లి’ పెట్టిన భయం, ఐస్‌క్రీమ్ పెట్టించినందుకే ‘మా ఆయన బంగారం’ అని మురిసిపోతూ చెప్పే కథ, ఏమండీగారు ఒక్క ఏడాదే ముచ్చటగా మూడోసారి కూడా ఆవకాయ పెట్టించే ప్రహసనం, పెట్టుకున్న అలారం దేనికో తెలియని ‘అలారం మోగింది’ కథ, ఏకంగా ఫది డాలర్లు సంపాదించేసిన ‘డాలర్ మొగుడు’ కథ, మనవలకు ఎప్పటికీ గుర్తుండిపోయే ‘డిప్పకటింగ్’ కథలు చదువుతున్నకొద్దీ ఆనందాన్ని ఇనుమడింపజేస్తాయి.

ఇక్కడ రెండు కథల గురించి మటుకు చెపుతాను.

మొదటిది ‘ఆపరేషన్ సక్సెస్ – పేషెంట్ డైడ్!!!!’ కథ. డిగ్రీ చదువుతున్న మాలాగారికి అవసరం లేకపోయినా పాపం ఆ పెద్దాయన జీవనభృతికి అవసరమనే దయార్ద్ర హృదయంతో తెలుగు సబ్జెక్ట్ చెప్పడానికి మహదేవ్ గారనే మాస్టారుగారిని నియమిస్తారు మేజర్ గారు. ఇంక చూస్కోండీ.. మాలాగారూ, ట్యూషన్‌లో తనూ చేరతానని వచ్చిన ఆమె ఫ్రెండు రాణీ కలిసి ట్యూషన్ బదులు రోజూ అమాయకంగా ఆ మాస్టారు చెప్పే మునక్కాయలతో సహా భోజనం కానిచ్చిన కబుర్లూ, చింతకాయ పచ్చడి రుచులూ వింటూ పరీక్ష ఎలా డుమ్మా కొట్టారో చదువుతుంటే మన పొట్ట చెక్కలవకమానదు.

ఇంకో కథ. ‘సాబ్ అందర్.. అమ్మా బాహర్… దర్వాజా బంద్’. విరిగిపోయిన హాండిల్ ఉన్న తలుపు ఉన్న గది లోపలికి వెళ్ళి తలుపేసుకుని, తర్వాత ఆ తలుపు తీయడానికి రాక సాబ్ లోపల్నించి అరుస్తుంటే బైట జహీరాతో కలిసి ఆయన మీద సెటైర్లు వేసుకుంటూ, పైకి అమాయకంగా అనిపిస్తున్న చురకత్తుల్లాంటి ప్రశ్నలతో మేజర్ గారిని ఇబ్బంది పెట్టిన మాలాగారి సంభాషణా చతురత ఈ కథలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ కథ చదువుతున్నంతసేపూ వచ్చే నవ్వుని ఆపుకోవడం నాకు చాలా కష్టమైపోయింది.

‘మీరు మీరుగానే ఉండండి’ కథలో తనున్నా లేకున్నా భార్యకు ఎటువంటి ఇబ్బందీ కలగకూడదనే ఉద్దేశంతో మేజర్ గారు చేసిన ఏర్పాట్లు చూస్తుంటే గుండెల్లో సన్నని మంట మొదలౌతుంది.

ఆఖరి కథ చదువుతుంటే గుండె నీరౌతుంది.

ఒక చక్కటి దాంపత్య జీవితాన్ననుభవించిన మాలాగారు మేజర్ ప్రభాత్ కుమార్ గారిని హీరోగా చేసి ఈ ‘ఏమండీ కథలు’ పుస్తకం వ్రాసి వారి ‘ఏమండీగారి’ని చిరంజీవిని చేసారు.

భార్యాభర్తలిద్దరూ ఎంచక్కా జూమ్మని స్కూటర్ మీద వెళ్ళే చక్కటి ముఖచిత్రంతో వచ్చిన ఈ 200 పేజీల ‘ఏమండీ కథలు’ పుస్తకం ప్రస్తుతం 150 రూపాయలకే అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ, రచయిత్రి దగ్గరా కూడా దొరుకుతోంది.

వెంటనే కొనేసుకుని, చదివేసి, ఆనందించండి.

***

ఏమండీ కథలు
రచన: మాలా కుమార్
ప్రచురణ: అచ్చంగా తెలుగు
పేజీలు: 200
వెల: ₹150
ప్రతులకు:
+91 85588 99478
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేయడానికి
https://books.acchamgatelugu.com/product/emandi-kathalu/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here