ఏమౌతోంది ఈ పిల్లలకి?

3
14

[డా. చెంగల్వ రామలక్ష్మి రచించిన ‘ఏమౌతోంది ఈ పిల్లలకి?’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]రెం[/dropcap]డవ తరగతి చదువుతున్న లాస్య కార్లోంచి రుసరుసమంటూ లోపలికి వచ్చి, చేతిలోని పుస్తకాల బ్యాగ్ సోఫాలో కోపంగా విసిరేసినట్లు పడేసింది.

లోపలి నుంచి రత్న, “వచ్చావా నాన్నా, కాళ్ళు చేతులు కడుక్కుని రా. పాలు తాగుదువు కాని” అంది. “నాకేం అక్కరలేదు. నేనేం తాగను” అంటూ లాస్య సోఫాలో బోర్లా పడుకుంది.

“ఏమ్మా, అలా ఉన్నావేంటి? స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా?” అంది రత్న లాలనగా.

“నానమ్మా! నేను ఆ స్కూల్‌కి రేపట్నుంచి వెళ్లను” అంటుండగా రాము వచ్చాడు.

“ఏమైంది చిట్టితల్లి! ఎందుకు స్కూలుకి వెళ్ళనంటున్నావు?” అంటూ లాస్య పక్కన కూర్చుని నెమ్మదిగా అడిగాడు.

“నేను వెళ్లను డాడీ, సుస్మిత టీచర్ నన్ను తల మీద కొట్టింది” అంది రోషంగా లాస్య.

“లాస్యా, టీచర్ ఎందుకు కొట్టారు? నువ్వేం చేసావు క్లాసులో? అల్లరి చేసావా?” అంది రత్న.

“నేనేం చేయలేదు నానమ్మా అసలు. ఊరికే కొట్టారు. నేను వెళ్లను ఇంక ఆ స్కూలుకి. డాడీ, నన్ను వేరే స్కూల్‌లో జాయిన్ చెయ్యి” అంది రాముతో.

“ఇప్పుడు మధ్యలో వేరే స్కూల్లో చేర్చుకోరమ్మా, మనమిక్కడ ఫీజు కట్టేసాం కదా” అన్నాడు రాము.

“క్లాసు జరుగుతుంటే ఏదో అల్లరి చేసుంటావు. అందుకే టీచర్ దెబ్బ వేసివుంటారు. ఇంట్లో ఎప్పుడైనా తప్పు చేస్తే అమ్మ, నాన్న చిన్నగా ఒక దెబ్బ వేయరా? దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? ఇంకా, ఏమిటో అనుకున్నాను. మధ్యాహ్నం ఎప్పుడో బాక్సులో తిన్న అన్నం. ఆకలి వేస్తూ ఉంటుంది. రెండు బిస్కెట్లు తిని, వేడి పాలు తాగుదువు గాని, రా. కాళ్ళు కడుక్కుని రా” అంది రత్న.

“నాకేం వద్దు.”

“వెళ్ళమ్మా, నానమ్మ చెప్పినట్లు విను. మా మంచి లాస్య కదూ” అన్నాడు రాము ఒళ్ళో కూర్చున్న లాస్య ను ముద్దు పెట్టుకుంటూ.

“నేను పాలు తాగను తాగను, తాగను. నన్ను వేరే స్కూల్లో చేర్పిస్తానంటేనే తాగుతాను” అంది కోపంగా లాస్య.

‘ఇంత మొండిగా తయారైయిందేమిటి? ఇప్పుడే మాట వినకపోతే ముందు ముందు ఎలా ఉంటుంది?’ రత్న ఆశ్చర్యపోతోంది.

“ఇపుడు వేరే స్కూల్ అంటే కుదరదు తల్లీ. వచ్చే ఏడాది మారిపోదువుగాని. మాట వినమ్మా. పాలు తాగు. నిన్ను పార్కుకి తీసుకువెళతాను” రాము బతిమాలుతున్నాడు.

“నాకేం వద్దు డాడీ. స్కూల్ మార్చకపోతే సుస్మిత టీచర్‌ని సారీ చెప్పమను. చెప్తేనే నేను ఆ స్కూల్‌కి వెళతాను” అంది లాస్య.

రత్న ఆశ్చర్యానికి అంతు లేకపోతోంది. ‘టీచరు దీనికి సారీ చెప్పాలా? లేకపోతే స్కూల్‌కి వెళ్ళదా? రాము గట్టిగా కేకలేయడే? ఈ గారాబమే కదా పిల్లల్ని పాడు చేసేది’ అనుకుంది.

లాస్యకి ఎలా నచ్చజెప్పాలో రాముకి తెలియట్లేదు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆకలి అంటుంది. బిస్కెట్లు తిని పాలు తాగుతుంది రోజూ. అలా మొండికేసి కూర్చుంటే ప్రాణం ఉసూరుమంటోంది. ఏం చేయాలో తోచక ఆఫీస్‌లో ఉన్న భార్య స్వర్ణకి ఫోన్ చేసి, విషయం చెప్పాడు.

స్వర్ణ వెంటనే స్కూలు ఇన్‌ఛార్జ్ మేడంకి ఫోన్ చేసింది. లాస్య మొండిపట్టు చెప్పి, ఏం జరిగిందని అడిగింది.

ఇన్‌ఛార్జ్ రాణి, వాళ్ళ క్లాస్ టీచర్‌తో మాట్లాడి చెపుతానంది.

రాణి, సెకండ్ క్లాస్ టీచర్ సుస్మిత మంచి స్నేహితులు. రాణి, సుస్మితతో లాస్య సంగతి అంతా చెప్పింది.

సుస్మిత ఆశ్చర్య పోయింది.

“నేను తనకి సారీ చెప్పాలా? నేనేం చేసానని సారీ చెప్పాలి? నేను పాఠం చెపుతుంటే క్లాసంతా తిరుగుతూ డిస్టర్బ్ చేస్తోంది. ‘మాట్లాడకుండా నీ సీట్లో కూర్చో’ అని చెపుతుంటే వినకుండా అలా తిరుగుతూనే ఉంది. నేను కొట్టలేదు. తల మీద నెమ్మదిగా తట్టి అల్లరి చేయకు. కూర్చో, అన్నాను. అదేమన్నా అంత తప్పా? ఆ పిల్లకి నేను సారీ చెప్పాలా? పిల్లలెంత అల్లరైనా చేయొచ్చు క్లాస్ డిస్టర్బ్ చేయొచ్చు. టీచర్ ఒక్కమాట కూడా అనకూడదు. ఆ పిల్ల రోజూ ఎంత గొడవ చేస్తుందో తెలుసా? కాలం తిరగబడుతోంది. పిల్లలు టీచర్‌కి సారీ చెప్పటం కాదు, టీచరే పిల్లలకి చెప్పటం. చాలా చాలా బాగుంది. ఇలా అయితే ఇక ముందు ప్రతి స్టూడెంటూ చిన్న విషయానికే సారీ చెప్పమంటూనే ఉంటాడు. క్లాసు కంట్రోల్ చేయకపోతే మేనేజ్మెంట్ కేకలేస్తుంది. పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళని ఒక చిన్న మాట అంటే వాళ్ళ అహం దెబ్బ తిని వాళ్ళు టీచర్‌నే సారీ చెప్పమంటారు. ఏ అభిమానం, గౌరవం, ఉండవలసిన అవసరం లేనిది టీచర్ల కేనా? లాస్య కాని, వాళ్ళ అమ్మ నాన్న కాని టీచర్ అంటే ఏమనుకుంటున్నారు? చదువు చెప్పే గురువు అంత తేలిగ్గా కనిపిస్తున్నారా వాళ్ళకి? నేను సారీ చెప్పను. నేనీ ఉద్యోగమే మానేస్తాను” అంది సుస్మిత. ఆవేశంతో, దుఃఖంతో, అవమానంతో ఆమె గొంతు వణుకుతోంది. కళ్ళలో నీళ్లు బైటకి రావటానికి సిద్ధంగా ఉన్నాయి.

రాణి, సుస్మిత భుజం పై చెయ్యి వేసి, “నువ్వు చెప్పినదాంట్లో ఏదీ కాదనటానికి లేదు. అంత చిన్న పిల్ల అలా మొండిపట్టు పట్టటం, తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోవటం బాధాకరమే! కాని, ఒక్కటి ఆలోచించు స్వర్ణా! ఆ క్లాసులో ఆ ఒక్క పిల్లతోనేగా సమస్య! మిగతా పిల్లలంతా నిన్ను ఎంతగా ఇష్టపడతారు? ఎంత బాగా మాట వింటారు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిన్నెంత గౌరవిస్తున్నారో నీకు తెలుసు. నువ్వు టీచర్‌గా నీ బోధన ద్వారా, కథలు చెప్పటం ద్వారా, పిల్లలను భావి భారత పౌరులుగా చేయాలని కలలు కంటూ ఇక్కడికి వచ్చావు. ఒక్క పిల్ల అనుచితంగా ప్రవర్తించిందని ఉద్యోగం వదిలేస్తావా? ఇక్కడ మానేసి ఇంకో చోట చేరినా అక్కడా ఇలాంటి పిల్లలుండరా? ఈ విషయం మానేజ్మెంట్ దాకా వెళితే వాళ్ళు లాస్యనే సమర్థిస్తారు. లాస్య వాళ్ళు రెండు లక్షల ఫీజు కట్టారు. పైగా, సెక్రటరీ గారికి కావలసిన వాళ్ళు. ఈ ఒక్కసారికీ ఆ పిల్లకి క్లాసులో సారీ చెప్పెయ్యి. చిన్న పిల్లలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి. చిన్నతనం, తల్లిదండ్రుల గారాబంతో అలా ఉంది. తన తోటి పిల్లలను చూసి తనూ తప్పక మారుతుంది చూడు” అని చెప్పగా చెప్పగా సుస్మిత ఎలాగో ఒప్పుకుంది. ఉద్యోగం అవసరం మరి!

***

రాము “రేపు టీచర్‌తో సారీ చెప్పిస్తాలే. నువ్వు పాలు తాగు తల్లీ” అన్నాడు. అప్పుడు లాస్య ప్రసన్నంగా మొహం పెట్టి పాలు తాగింది.

అప్పుడే స్వర్ణ ఆఫీస్ నుంచి వచ్చింది.

రత్న “ఇదేం బాగా లేదురా. నయానో, భయానో బుద్ధి చెప్పాలి గాని ఇలా టీచర్ చేత సారీ చెప్పించటం ఏమిటి? టీచర్ అన్నాక ఒక దెబ్బ వేయకూడదా? ఇంక టీచర్ అంటే దానికి గౌరవం ఏముంటుంది? నిన్ను చిన్నతనంలో మాస్టారు ఎన్ని సార్లు కొట్టారో గుర్తు తెచ్చుకో” అంది.

స్వర్ణ “అత్తయ్యా, ఆ రోజులు వేరు. పిల్లలు ఇప్పుడు మాట వింటున్నారా? మీరే చూసారుగా. నాలుగింటికి ఇంటికి వచ్చింది. దాని మాటకు ఒప్పుకునే దాకా పాలు తాగలేదు” అంది.

“అమ్మా, ఊరికే దాని కోపం పోగొట్టటానికి అన్నాను కాని నిజంగా సారీ చెప్పిస్తామా ఏమిటీ?” అన్నాడు రాము.

కాని, మర్నాడు స్కూల్‌కి లాస్యని తయారు చేస్తుంటే, “డాడీ, గుర్తుందా, సుస్మిత టీచర్ సారీ చెప్పాలి” అంది.

“స్వర్ణా, ఒక గంట పర్మిషన్ పెట్టి నువ్వూ రా స్కూల్‌కి. ఇద్దరం దింపి వద్దాం ఇవాళ” అన్నాడు రాము.

వీళ్ళు వెళ్ళేటప్పటికి స్కూల్ బెల్ అయిపొయింది. సుస్మిత క్లాస్ లోనే ఉంది. లాస్య గుమ్మం లోనే నిల్చుంది. “టీచర్‌ని అడిగి లోపలికి వెళ్ళు లాస్యా” అన్నారు రాము, స్వర్ణ. లాస్య, ‘నా కండిషన్ తెలీదా’ అన్నట్లు చూస్తోంది. రాణి కూడా అక్కడే ఉంది. సుస్మిత వంక చూసింది.

అవమానాన్ని దిగమింగుకుంటూ, ముఖాన నవ్వు పులుముకుని,సుస్మిత “కమిన్ లాస్యా, నీకు కోపం వచ్చిందా నా మీద? సారీ. ఇంకెప్పుడు నిన్ను అననులే” అంది.

లాస్య వెళ్లి కూర్చుంది. స్వర్ణ, రాము “మరీ మొండిగా తయారైయింది. మాట వినట్లేదు” అంటూ నవ్వుతూ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారు.

‘ఏమౌతోంది ఈ పిల్లలకి? ఏమౌతారు భవిష్యత్తులో వీళ్ళు? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇంత చిన్న వయసు లోనే టీచర్ అంటే భయం, గౌరవం లేకపోతే పెద్ద క్లాసుల కెళ్ళాక ఎలా తయారవుతారు ఈ పిల్లలు? ఈ సమాజం ముందు రోజుల్లో ఎలా ఉంటుంది? ఇప్పటి వరకూ బాగున్న పిల్లలనైనా కాపాడుకోవాలి’ అనుకుంటూ ఆలోచనల్లోంచి తేరుకుని పాఠానికి ఉపక్రమించింది సుస్మిత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here