కొత్త చూపులో అర్బన్ జీవితాలు – ‘ఎమోషనల్ ప్రెగ్నన్సీ’

0
9

[dropcap]వృ[/dropcap]త్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన పూర్ణిమ తమ్మిరెడ్డి గారు వ్రాసిన 24 కథల సంపుటి ‘ఎమోషనల్ ప్రెగ్నన్సీ’. 14 ఏళ్ళ పాటు పుస్తకం.కామ్ సహ నిర్వాహకురాలిగా వ్యవహరించిన పూర్ణిమ తెలుగు పాఠకులకు సుపరిచితులే.

మనసు, మమత, విచక్షణ, ఇంగితం అన్నీ ఉన్న మనుషులూ ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయని జీవితం నా తాట వలుస్తూ పాఠాలు నేర్పుతుండగా రాసిన కథలివి” అన్నారు పూర్ణిమ ముందుమాటలో. తన చుట్టూ ఉన్న జీవితాల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఈ కథలు బయటికొచ్చాయని అన్నారు. అర్బన్ జీవితాల్లోని కనిపించని, కనిపించకుండా దాచే విషయాల గురించిన కథలివని అన్నారు.

***

ఒక కథ వ్రాయడానికి రచయిత/రచయిత్రి ఎంత మథనపడతారో; తమ ఊహల్లో మెదిలిన భావాలనూ అక్షరాలలోకి ఒదిగించడానికి ఎంత తపన పడతారో, పదాలను, వాక్యాలను కూర్చడానికి ఎంత ఇబ్బందిపడతారో ‘ఓ కథ చచ్చిపోయింది’ అనే కథ చెబుతుంది. మనసులోని భావాలకి అక్షర రూపం ఆశించినట్టుగా రానప్పుడు ఆ రచయిత/రచయిత్రి ఎంత కొట్టుమిట్టులాడుతారో; చెప్పాలనుకున్నదీ ఒకటై, కాయితం మీదకి వచ్చినది మరొకటైతే – తనదనే మమకారాన్ని చంపుకుని నిర్దాక్షిణ్యంగా ఆ కాయితాలని చెత్తబుట్టలోకి విసిరేయాల్సి రావడం చెప్పలేనంత వ్యథని కల్పిస్తుంది. ‘చనిపోయిన కథకీ కథ అల్లగల్గాను’ అని కథలో రచయిత అనుకోవడం – కథ అనే సాహితీ ప్రక్రియకి చావు లేదని పాఠకులకి అనిపిస్తుంది.

‘నిద్ర’ నెరేటర్‍గా మారి కథ చెప్పడం కొత్త ప్రయోగం. ఆధునిక నగరాలలో భిన్న వేళలలో పని చేస్తూ – నిద్రకి దూరమై, క్రమంగా శారీరక మానసిక అలసటకి లోనయ్యే ఎందరో షిఫ్ట్ ఉద్యోగుల వ్యథకి అక్షర రూపం ‘మిషన్ నిద్ర’ కథ. “అర్రె! మీ మేలు కోరి మీ దరికి చేరితే నన్ను ఇంత నిర్దయగా చూస్తారేం?” అని నిద్ర ప్రశ్నిస్తుంది. ఏవేవో ఒత్తిడులు, కారణాల వల్ల నిద్ర పట్టని స్థితికి చేరుకున్న రాజ్ మూడు రోజుల తర్వాత ఇంటికొచ్చి – తొందరగా నిద్రపోవాలని ప్రయత్నిస్తాడు. అతన్ని సాయం చేయాలనుకున్న నిద్ర కూడా సహకరిస్తుంది. కానీ ఓ పీడకల వచ్చి, నిద్ర దూరమై, రాత్రంతా మేల్కొని పగలు పడుకుంటాడు. నిద్ర చేసే మేలు, నిద్ర దూరమైతే కలిగే ఇబ్బందులని నగర జీవితాలకి అన్వయిస్తూ గొప్పగా చెప్పిన కథ ఇది.

తను ఇష్టపడిన వ్యక్తికి నచ్చేలా తన శారీరక అందాన్ని మార్చుకున్న చిత్రకి అతను దక్కాడా? తన రూపును మార్చుకునే క్రమంలో శరీరాన్ని, మనసుని ఎంత కష్టపెట్టుకుంది? పెళ్ళయ్యాకా, పిల్లలు కావాలనున్నప్పుడు, ఒక అబార్షన్ కూడా అయ్యాక, గైనకాలజిస్టుని కలిసినప్పుడు – ఆమె తన రూపు మార్చుకోడానికి చేయించుకున్న ట్రీట్‍మెంట్ ప్రభావం ఆమెపై తీవ్రంగా ఉందనీ, ఆమె తల్లి కాలేకపోవచ్చని తెలుస్తుంది. మరి అతనేం చేశాడు? సమస్యకు సమాధానం వెతుక్కోడమా లేక సమాధాన  పడడమా అని మథనపడుతున్నాడట. ‘ఓ చిత్ర కథ’ స్త్రీ పురుషుల ఆలోచనా విధానాలలోని వైరుధ్యాలను వెల్లడిస్తుంది.

ఒక  జంట మధ్య ఉండే బంధాన్ని శరీరంతో పోలుస్తూ – శరీరం స్థూలకాయమైతే ఆ బంధంలో వచ్చే మార్పులను చక్కగా చెప్పిన చిన్న కథ ‘ఒక ఒబీస్ బంధం’. ప్రతీకాత్మకమైన ఈ కథలోని కొన్ని వాక్యాలు చక్కగా కుదిరాయి. ‘వర్కవుట్ చేయిస్తే పనికి రావచ్చు’ అని అతడంటే, ‘ఇది వర్కవుట్ అయ్యేది కాదు’ అని ఆమె అంటుంది. బంధానికైనా, శరీరానికైనా జంక్ కాకుండా పోషకాహారాన్నివ్వడం అవసరమని ఈ కథ చెబుతుంది. చిన్నకథైనా ఇది రాయడానికి రచయిత్రి చాలా ‘కసరత్తు’ చేశారనిపిస్తుంది.

తాను రాసిన కథల్లోని పాత్రలు రచయిత్రికి తారసపడి ఎన్నెన్నో ప్రశ్నలేసి, భయపెడతాయి. జీవితం గురించి, ప్రేమ గురించి మాట్లాడుతాయి. ఆమె అది కలా లేక భ్రమా అనేది తేల్చుకోలేక ఉద్వేగాలతో సతమతమవుతుంది. అదంతా నిజమేనా? చివర్లో గొప్ప ట్విస్ట్ ఉన్న ‘ఇది కల కాదు.. ఏమో’.

పున్నమి నాటి సముద్రంలా ఉంది మనసు’ అనే వాక్యంతో ప్రారంభమవుతుంది ‘ఘాతుకం’ కథ. జీవితం నిస్సారంగా గడుస్తున్న ఓ వివాహిత మనసులోని అల్లకల్లోలాన్ని చెబుతుందీ కథ. తన బాధని పంచుకోడానికి ఓ మిత్రుడికి ఫోన్ చేస్తే – కారణం ఏదో నీలోనే ఉంది, దాన్ని కనుక్కుని చంపెయ్యమంటాడు. ఒక్కో కారణాన్ని విశ్లేషించి, ఇది కాదు, ఇది కాదు – అనుకునే క్రమంలో – స్నేహితుడి మీద కోపం వచ్చినా, ఆమె ఆలోచనలు నశించి, చక్కని నిద్ర పడుతుంది.

మై_లవ్_లైఫ్.లై’ కథలో ప్రేమలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయి.. తను ఇష్టపడిన అబ్బాయి గురించి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తరహాలో విశ్లేషణ (కోడింగ్ అనచ్చా?) రాయడం చక్కని ప్రయోగం. కంప్యూటర్ పరిభాషలో రాసిన ఈ కథలో – ఆమె ఫ్రెండ్ ఎదురుగా ఉన్నా బాయ్ ఫ్రెండ్ కాలేకపోయినందుకు కారణాలను అన్వేషిస్తుంది. తనని అర్థం చేసుకోవాలంటే ‘మీరేసుకున్న జోళ్ళు వదిలి, నా సాండల్స్ వేసుకుని నడవాలి’ అని కథ మొదట్లో చెప్పి, చివరిలో ‘ఇదిగో మీ జోళ్ళు ఇక్కడున్నాయి, ఇక బయల్దేరండి’ అంటుంది. ఎవరి జీవితాలు వాళ్ళవని, ఇతరుల సమస్యలను మన దృష్టికోణంతో చూడడం అన్నిసార్లు సరైనదని కాదని ఈ కథ చదివాకా అనిపిస్తుంది.

దగ్గరైన వాళ్ళు దూరమవుతారన్న భయం కలిగినప్పుడు మనసులో చెలరేగే భావాలను అద్భుతంగా ఒడిసిపట్టిన కథ ‘క్షణాలు’. ఒకరితో ఒకరు ఊసులాడుతుంటే ఎన్ని క్షణాలు గడిచిపోతాయో చెబుతూ – ‘ఇదొక ఆట అని, ఈ క్షణాలని ఎంత బాగా ఆదరించి, ఆస్వాదించగలిగితే మేమంత బాగా ఆడుతున్నామన్న మాట’ అని అంటారు. ఈ ఆటను మొదలుపెట్టడంలానే, ఆపడం కూడా మన చేతుల్లో ఉండదని అంటారు రచయిత్రి.

అనవసరమైన, ఇబ్బందికరమైన ఆలోచనలను మనసులోంచి త్రోసిపారేయాల్సిన అవసరాన్ని చెప్పే చిన్న కథ ‘Flush’.

పెళ్ళయ్యాకా మారిపోయిన జీవితం గురించి వాపోయే యువకుడి కథ ‘రాక్షసి’. ఆఫీసు తరువాత ఇంటికే వెళ్ళాలని నియమం పెట్టినవాళ్ళని చంపి పారేయ్యాలనుకుంటాడతను. ఇంటికి వెళ్ళి భార్యని ఫేస్ చేయడం అతనికి ఇష్టం ఉండదు. తననో రాక్షసి లోపల తినేస్తోందని అంటాడు. భార్య రాక్షసి ఎందుకయిందో అతనికి మాత్రమే తెలుసు.

ఉండి కూడా, లేకుండా ఎలా పోతారు మనుషులు అని అనుకుంటుందో భార్య, భర్తతో గాప్ వచ్చాకా. ఒక్కప్పుడు ఎన్నో కబుర్లు చెప్పుకున్న వారిద్దరి మధ్య ఇప్పుడు మాటలు పలచబడ్డాయి. ఇది వరకులా మాట్లాడాలని ఆమె ప్రయత్నిస్తున్నా, అతనివి పొడి మాటలే. ఎందుకని కొందరి జీవన విధానం ఉన్నట్టుంది సారహీనమైపోతుంది? కాస్త మార్మికంగా అనిపించే సంభాషణలో సాగిన కథ ‘ఏనాడు విడిపోని ముడి వేసెనో’.

పాతాళభైరవి సినిమా నేపథ్యంగా అల్లిన ‘నేటికెవరు మన కథానాయకుడు’ కథలో – మాంత్రికుడు నాయకుడు కావాలని ప్రకటన ఇస్తే, నాయిక, ‘ఎటూ సాగని, ఎవరికీ చేరని కథలను నడిపించగలిగే’ ప్రతినాయకుడు కావాలని ప్రకటన ఇస్తుంది. కథలన్నీ ఒకే తరహలో ఉండనక్కరలేదని, వైవిధ్యంతో కూడుకున్నవి, మూసలో ఒదగనివి కూడా ఉండవచ్చని అన్యాపదేశంగా ఈ కథ చెప్పినట్టు తోస్తుంది. ఆసక్తిగా చదివిస్తుందీ కథ.

స్త్రీలకి పెళ్ళీ, పిల్లలే పరమావధి అని భావించే కొందరి ఉద్దేశాలకు ప్రతీకగా అల్లిన కథ ‘Rx మారేజ్’. ఆఫీసులో, ఇంటా, బయట, ఫేస్‍బుక్, వాట్సప్ లలో స్త్రీలు ఎదుర్కునే వేధింపులు, ఇబ్బందికరమైన ప్రశ్నలు, మరిన్ని సెన్సిటివ్ అంశాలను ప్రస్తావిస్తూ సాగుతుందీ కథ.

సంతానం లేని దంపతుల మధ్య పెరిగిన అగాధాన్ని, సలహాలతో బాగుచేద్దామనుకునే ఇరువైపు పెద్దల అభిప్రాయాలని ప్రస్తావిస్తూ సాగే కథ ‘1+1’. పిల్లలు పుట్టకపోతే ఆ దంపతుల మీద societal pressure ఎంతగా ఉంటుందో ఈ కథ చెబుతుంది. ‘ఎవరి కోసమో కాకుండా, మన కోసం మనం మన టర్మ్స్ ప్రకారం పిల్లల్ని కందాం’ అని వాళ్ళు అంగీకారానికి రావడం కథకి సానుకూల ముగింపు.

బాక్ వాటర్స్’ కథలో ఉష తను ఇష్టపడిన శరత్‍కి అండగా ఉండాలన్న తాపత్రయపడుతుంది, అవసరంలో ఆదుకోలేకపోతున్నాన్న అపరాధ భావనతో ఉంటుంది. తమ బంధాన్ని కాపాడగలిగేంత శక్తి తన ప్రేమకి ఉందో లేదోనన్న అనుమానం ఆమెకి కలుగుతుంది. శరావతి బ్యాక్ వాటర్స్ ట్రెక్‍లో ఆ అనుమానం నిజమవుతుంది. మనసుని బరువెక్కిస్తుందీ కథ.

సచిన్ టెండూల్కర్‍కి ఉన్న లక్షలాది అభిమానుల్లో ఓ అభిమాని కథ ‘ఓ అల్ట్రా ఫిజూల్ కథ’. ‘జీవితం అన్‍లైన్ క్లాస్ రూమ్ కాదు, జీవితం పాజ్ బటన్‍తో రాదు’ అని కథలోని ముఖ్యపాత్రతో చెప్పిస్తారు రచయిత్రి. 2010లో బెంగుళూరులో ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‍ని లైవ్‍లో స్టేడియంలో చూసేందుకు బెంగుళూరు రమ్మని మిత్రుడు అడిగితే, పనులు వల్ల రాలేనని చెప్తుందామె. కానీ మనసంతా ఆట మీదే ఉంటుంది. పదేళ్ళ తరువాత 2020లో కోవిడ్ సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి సచిన్ టీవీలో చెబుతుండగా చూస్తుందామె. బెంగుళూరు గురించి ఏం రాయాలనుకున్నా ఆ మిత్రుడు గుర్తొచ్చి, అతని ఆలోచనల ట్రాఫిక్ జామ్‍లో ఇరుక్కుపోయి రాయలేకపోతుందామె. రాదు, కాదు, లేదు అంటూ కథంతా చెప్పడం అంత తేలిక కాదని ఆమె అనుకోవడంలో వాస్తవం ఉంది. ప్రతికూల భావాలతో కథని నడపటం కష్టం.

తనలో చెలరేగే అంతర్గత ఉద్వేగాలను మోయలేని ఓ యువతి తలనొప్పి అనే సమస్యతో వైద్యుల దగ్గరికి వెడుతుంది. తల పరిమాణం విపరీతంగా పెరిగిపోతున్న ఆ యువతి కొన్ని నెలలుగా బాధపడి, ఆసుపత్రుల చుట్టూ తిరిగి, డబ్బులు పోగొట్టుకుంటుంది, ఉద్యోగం పోగొట్టుకుంటుంది. డాక్టర్లు ధైర్యం చెప్పినా, మీడియా వాళ్ళ ఆమె కేసుని సెన్సేషన్ చేస్తారు. ఆమె ఓ థెరపిస్టుని కలుస్తుంది. ఆ థెరపిస్ట్ ఆమె గతాన్ని, తల్లిదండ్రులు ఆమెతో ప్రవర్తించిన తీరు వగైరా వివరాలను రాబట్టి, ఆమె సమస్యకి కారణం కనుక్కోవాలని ప్రయత్నిస్తుంది. గతాన్ని చెప్పే క్రమంలో ఆ యువతికి ఓ పెళ్ళిలో పరిచయమైన అశోక్, తర్వాత కొలీగ్ అవడంతో వాళ్ళ మధ్య ప్రేమ పుట్టడం, ఏవో కారణాల వల్ల వాళ్ళు విడిపోవడం గురించి థెరపిస్టుకి చెబుతుంది. ఆ యువతిది ‘ఎమోషనల్ ప్రెగ్నన్సీ’ అని చెబుతుందా థెరపిస్ట్. ఉద్వేగాలు కాస్త తగ్గిన తర్వాత తల సైజు తగ్గదు కానీ, ఆమె తల నొప్పి మాత్రం తగ్గుతుంది. తాను గీసే గీతల్లో, తన మాటల్లో తనని తాను చూసుకుంటూ హుషారుగా మారుతుంది.

అంతే కదా!’ – అతి చిన్న, రెండు వాక్యాల (నాలుగు పదాల) కథ. కానీ ఆ రెండు వాక్యాలనే విస్తరిస్తే ఎంత పెద్ద కథైనా అవగలదు.

రోజర్ ఫెదరర్ అభిమాని కథ ‘లవ్ 40’. ఫెదరర్‍తో తనని పోల్చుకుంటూ – అతను ఛాంపియన్‍షిప్ పాయింట్లను పోగొట్టుకుంటే; పోగొట్టుకున్నవీ, పోగేసుకున్నవీ తనకీ ఉన్నాయనుకుంటుందామె. టెన్నిస్ టోర్నమెంట్లు, ఫెదరర్ ఆటతీరు, వివిధ దేశాల మధ్య భౌతిక ప్రయాణాలూ, ఇద్దరి మనసుల మధ్య ఆంతరిక ప్రయాణాలాతో అందంగా అల్లిన కథ ఇది. ‘లవ్ 40’ అన్నది టెన్నిస్ పరిభాషలోని పదం అయినా, వయసు 40లల్లో కొచ్చాకా ఎంతటి గొప్ప ఆటగాడికైనా శరీరం మొరాయించటం మొదలవుతుందని ఈ కథ చెబుతుంది. “నీ ప్రేమ కోసం నేను, నా స్నేహం కోసం నువ్వు ఎదురుచూసే అవసరం లేని లోకాలు ఎక్కడో ఉండే ఉంటాయి” అనే వాక్యాలతో కథ ముగిసి హృదయాన్ని బరువెక్కిస్తుంది.

ఇంకా ఈ పుస్తకంలోని – అనగనగా ఒక రాత్రి, ప్రేమాయణం, శోకం ఒక పరిశీలన, సూసైడ్ నోట్, దాహం – తదితర కథలు ఆసక్తిగా చదివిస్తాయి.

***

పూర్ణిమ గారు తన కథలలో వస్తువు కన్నా కథా నిర్మాణనికి పెద్ద పీట వేస్తారు. అందువల్ల కొన్ని కథలు జటిలంగా అనిపిస్తాయి. కానీ ప్రయత్నిస్తే, అందులోని సొగసు అర్థమవుతుంది.

ఈ కథలలో కొట్టొచ్చినట్టు కనబడేది కథలకి తగ్గ పేరు పెట్టడం. ప్రతీ కథలోనూ  పాఠకులను ఆపి, ఒకటికి రెండుసార్లు చదివించే వాక్యాలున్నాయి (అర్థం కాక కాదు, వినూత్నంగా చెప్పడం వల్ల). పూర్ణిమ గారిది ఓ విభిన్నమైన శైలి అని చదువరులు సులభంగా గ్రహిస్తారు. సమకాలీన అంశాలపై రాస్తున్నా, వాటిని కొత్త కోణం నుంచీ చూసి, తను చూసిన వాటిని మసిపూసి మారేడుకాయ చేయకుండా – పాఠకులు కూడా ‘అవును, నిజమే కదా’ అని భావించేలా కథలను ప్రెజంట్ చేస్తారు పూర్ణిమ. తమకు నచ్చిన విధంగా బతుకుతూ జీవితంలో శూన్యం ఆవరించుకోకుండా చూసుకోవాలని చెప్తాయి ఈ కథలని అనిపించింది. లాప్‍టాప్‍లు, స్మార్ట్ ఫోన్లు, టాబ్‍లు, ఫేస్ బుక్ మెసెజీలు, వాట్సప్ చాటింగులు, ఇ.ఎస్.పి.ఎన్. క్రిక్ ఇన్పో కామెంటరీలు, రీల్స్, ఇన్‍స్టా – ఈ కథల్లో భాగమై – ఆధునిక జీవనంలోకి చొచ్చుకొస్తున్న సాంకేతికత ప్రభావాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తాయి. తెలుగు సాహిత్యంలో విభిన్నమైన కథలను, విభిన్నమైన శైలితో, తనదైన ప్రత్యేకమైన రచనా సంవిధానంతో, సామాన్యంగా అనిపించే విషయాలను అసామాన్యమైన దృష్టితో దర్శిస్తూ, వినూత్నమైన భావవ్యక్తీకరణతో   సృజిస్తున్న రచయిత్రికి అభినందనలు. మూస కథలు, మూస భావాలు, రొటీన్ రచనలతో విసిగిపోయిన సాహిత్యాభిమానులు తప్పనిసరిగా చదివాల్సిన కథలివి. కథారచనపై ఆసక్తికలవారు పదే పదే చదువుతూ అధ్యయనం చేయాల్సిన కథలివి.

***

ఎమోషనల్ ప్రెగ్నన్సీ (కథా సంపుటి)
రచన: పూర్ణిమ తమ్మిరెడ్డి
ప్రచురణ: ఎలమి పబ్లికేషన్స్,
పేజీలు: 252
వెల: ₹ 290.00
ప్రతులకు:
ఎలమి పబ్లికేషన్స్, 8247474541
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ 500027
ఫోన్: 9000413413
ఆన్‍లైన్‍లో
https://www.telugubooks.in/te/products/emotional-pregnancy
https://www.trendguruindia.com/product/emotional-pregnancy/

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here