ఎండమావులు-12

0
9

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 12వ భాగం. [/box]

26

[dropcap]ఉ[/dropcap]దయం తొమ్మిది గంటల సమయం, సుభద్ర భర్త సుందరాన్ని టిఫిన్ చేయడానికి పిల్చింది. అతను ఫలహారం చేస్తున్న సమయంలో సుధాకర్, సంధ్య విషయం ప్రస్తావనకి వచ్చింది.

“సంధ్యా, సుధాకర్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? సుభద్ర అడిగింది సుందరాన్ని.

సుందరానికి తెలుసు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులని. వాళ్ళు స్నేహితుల్లాగా మిగిలిపోవాలి అంతే కాని అంతకన్నా ముందుకు వెళ్లడం అతనికిష్టం లేదు. ఎందుకంటే కూతురు భవిష్యత్తు గురించి అతను ఎన్నో కలలు కంటున్నాడు. ఆ కలలకి ఫుల్ స్టాప్ పడకూడదు. అందుకే సుభద్రతో “అభిప్రాయానికేంటి? ఇద్దరూ చాలా చురుకైన వారు తెలివితేటలు గలవారు.”

“అంతేనా?”

“అవును”

“వాళ్ళ గురించి మీరు చెప్పదల్చుకున్నది, ఆలోచించినదీ ఇదేనా?”

“మరి?”

“వాళ్ళిద్దరూ మంచి స్నేహితులే కాదు మంచి ప్రేమికులు కూడా. ఒకరి భావాలు మరొకరు తెలుసుకున్నారు. ఒకరి ఆలోచన్లు మరొకరు అవగతం చేసుకున్నారు. ఒకరిమీద మరొకరు అభిమానం, అనురాగం పెంచుకున్నారు. అలాంటి వారి కన్న కలలను సార్థకం చేయడం మన బాధ్యత కాదా?”

“సుభద్రా! నీవు ఏ కాలంలో ఉన్నావో? నీవు చెప్పినవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. కాని ఆచరణకి యోగ్యం కాదు. ఇదేఁ రెండు మూడు గంటలు వినోదించే సినిమా కాదు. సినీ డైలాగులు కాదు, జీవితం. అదే మన అమ్మాయి జీవిత సమస్య. అంతేకాని ఏదో పుస్తకంలో బట్టీ పెట్టిన సంభాషణ కాదు.”

“అదే నా భావన కూడా!”

“ఆ సుధాకర్ మధ్య తరగతి మనిషి, అఫ్కోర్స్ నేనూ మధ్య తరగతి మనిషినే, అయితే నా కష్టాంతానికి తోడు నా ఆలోచనలు, అదృష్టం కలిసి వచ్చి ఆస్తి – అంతస్తులో ఓ మెట్టు ఎదిగాను. అలాంటి నాకు నా కూతురు నా లాంటి జీవితం గడపకూడదు. నా కన్నా ఆస్తి, ఐశ్వర్యంలో ఓ మెట్టు ఎగుపునున్న వాడికిచ్చి పెళ్ళి చేయాలనుకోడం సబవు కాదా? స్వార్థమా?

స్వార్థమే అనుకో, మరేదేనా అనుకో, నాకు కావల్సింది నా కూతురు భవిష్యత్తు. ప్రతీ మధ్య తరగతి మనిషి ఆలోచించేది ఇదే. మొదట అమ్మాయి అభిప్రాయం కనుక్కుని ఆ అభిప్రాయం ప్రకారం నడుచుకుందాం. ఇప్పుడు మనిద్దరికీ ఈ చర్చ అనవసరం. ఇంతకీ సుధాకర్ కుటుంబం గురించి వాకబు చేయాలి కదా!”

అలా అంటున్న సుందరం మాటలు విన్న సుభద్రకి సంద్యతో తను మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి.

ఓరోజు సుభద్ర మల్లె పందిరి దగ్గర కూర్చుని పూలను మాలగా కడుతోంది. సంధ్య వచ్చి తల్లి కళ్ళు మూసింది. సుభద్ర నవ్వుతూ కూతురి చేతులు విడిపించుకుని “పెద్దదానివయినా నీ అల్లరి పోలేదే పాపా!” అంది.

“నేను అంత పెద్దదాన్ని అయ్యానా?” బుంగమూతి పెట్టింది సంధ్య.

చేస్తున్న పని ఆపుచేసి ఆప్యాయతగా కూతురి తల నిమిరింది సుభద్ర. సంధ్య ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుని మల్లె పందిరి వేపు చూస్తూ ఆలోచిస్తోంది. కూతురు అలా ఆలోచిస్తోందంటే తనకేదో చెప్పాలనుకుంటోంది అని గమనించింది సుభద్ర.

“పాపా! నాకేమేనా చెప్పాలని ఉందా?”

“ఊఁ!!”

“నేనే నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.”

“ఏంటది?”

“మీ నాన్నగారి స్నేహితుడి కొడుకు అమెరికాలో డాక్టరట, అతనికి నిన్ను ఇచ్చి పెళ్ళి చేయాలని మీ నాన్న గారి ఆలోచన.”

తల్లి మాటలకి తృళ్ళిపడింది సంధ్య. “నాకు ఆ సంబంధం ఇష్టం లేదు.”

“ఎందుకని? నీ మనస్సులో మరెవరేనా ఉన్నారా? ఎవరినైనా ఇష్టపడుతున్నావా?

“ఊ”

“ఎవరు?”

“సుధాకర్!”

కూతురు మాటలు విన్న సుభద్ర ఆశ్చర్యపోలేదు. సంధ్య, సుధాకర్ మధ్య ఉన్న పరిచయం చనువు ఆమెకి తెలుసు. ఏదో రోజున ఇలాంటి ప్రస్తావన కూతురు తెస్తుందని ఆమె ఊహించింది.

“అతని కుటుంబం గురించి నీకు తెలుసా?” అడిగింది సుభద్ర కూతుర్ని. చెప్పింది సంధ్య.

కూతురి చెప్పిన విషయాలని బట్టి సుధాకర్ తండ్రి సారధి ఓ హైస్కూలు టీచరని, అతను తన జీవిత ఆరంభం నుండి బాధ్యతలు – బాధ్యతలు – ఆర్థిక సమస్యల నడుమ బ్రతుకు పోరాటంలో ముందుకు సాగుతూ జీవితంలోని సమస్యలతో రాజీపడూ బ్రతుకుతున్న సమాజంలో ఓ సగటు మనిషి అని తెలుసుకుంది.

అంతేకాదు సుభద్రకి మరికొన్ని విషయాలు కూడా తెలిసాయి. ఆ సారధి మొదటి భార్య సరస్వతి, వాళ్ల కొడుకే సుధాకర్. సరస్వతి అతడ్ని వదిలి పెట్టి వెళ్లిపోయిన తరువాత అతను సరస్వతి చెల్లెలు సుమిత్రను పెళ్ళి చేసుకున్నాడు. సరస్వతి గుర్తుకు రాగానే సుభద్ర కళ్ళెదుట ఏవేవో జ్ఞాపకాలు తెరలు తెరలుగా నిలిచాయి.

సరస్వతిది చాలా విచిత్రమైన స్వభావం. ఇద్దరూ ఒకే హైస్కూల్లో చదువుకున్నారు. సరస్వతి పట్నంలో ఉండి చదువుతూ ఉంటే తమ గ్రామంలో హైస్కూలు లేని కారణం చేత తనూ పట్నానికి వెళ్ళి హైస్కూల్‌లో జాయనయింది. ఉదయం బస్సులో వెళ్ళి తిరిగి సాయంత్రం తన గ్రామానికి వచ్చేసేది.

సరస్వతి కుటుంబం లాగే తమది మధ్య తరగతి కుటుంబం. రెండు కుటుంబాల మధ్య బీరకాయ పీచులాంటి బంధుత్వం కూడా ఉండేది. సరస్వతికి మధ్యతరగతి కుటుంబాల జీవితం అంటే అసహ్యం. “ఏటుంటాయి ఈ కుటుంబాలో, సమస్యల తోరణాలు తప్ప, ఉన్న దానితో సరిపెట్టుకోవాలి, రాజీ పడ్తూ జీవితం గడిపెయ్యాలి” అని తనతో అంటూ ఉండేది.

మరో పర్యాయం సరస్వతి తనతో “సుభద్రా! మనదీ ఓ జీవితమేనా? ఆ సుచరితను చూడు, అందమా – పాడా! శూర్పణఖ చెల్లెలులా ఉంటుంది. అయితే అది చేసుకున్న అదృష్టం, ఓ ధనవంతుడికి కూతురవడం – మరో ధనవంతుడికి కోడలవడం, కట్టిన బట్ట కట్టకుండా ఏడు వారాల నగలు, దిగేసుకుని, బొచ్చుకుక్కని చంకన పెట్టుకుని షికారుకి వెళ్తుంటే నాకు ఎంతో ఈర్ష్యగా ఉందో తెలుసా?” అనేది.

‘అయితే సుచరిత స్థానంలో సరస్వతి పుట్టి ఉంటే బంగారానికి మెరుగు పెట్టినట్టుండేది. సరస్వతికి అందం పిచ్చి, డబ్బు, హెూదా పిచ్చి దానికి తగ్గట్టే సరస్వతి గొప్ప అందకత్తె. ఆ అందానికి తోడు డబ్బుంటే ఆకాశంలో స్వేచ్ఛగా స్వతంత్ర్యంగా విహరించే విహంగంలా, మేఘ సముదాయాన్ని చూసి పురివిప్పి నృత్యం చేస్తున్న మయూరంలా సంతోషంతో చిందులు వేసేది’ సరస్వతి గురించి ఆలోచిస్తోంది సుభద్ర.

“ఏంటి ఆలోచిస్తున్నావు సుభద్రా! సరస్వతి అడిగింది.”

“నీ గురించే.”

“నా గురించా? నా గురించి ఆలోచించే గొప్పదాన్ని కాను నేను.” సరస్వతి కంఠంలో నిరాశ తొంగి చూసింది.

“ఆ సుచరిత స్థానంలో నీవుంటే?

“ఊఁ…. నాకు అంత అదృష్టమా? లేదు, నేను మూడు మూర్తులా మధ్య తరగతి ఆడపిల్లను. కష్టాలు, కన్నీళ్ళు సమస్యల వలయాల్లో చిక్కుకోవడం ఇవే కదా మధ్య తరగతి జీవితాలు. నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు కాని నా జీవితం మాత్రం సంతోషదాయకంగా లేదు. అందులోనూ మగపిల్లలు లేని మధ్య తరగతి తండ్రికి పెద్దకూతురుగా అసలు పుట్టనే పుట్టకూడదు. ఆడజన్మ ఎత్తడమే పెద్ద తప్పు అనుకుంటున్న నాకు ఇటువంటి పుట్టుక మరింత తృప్తి నీయటం లేదు.

నా స్వభావం నీకు తెలుసుకదా! నేను ఆశాజీవిని. ఇక్కడ నాకు దొరకని సుఖసౌఖ్యాలు రేపొద్దున్న మెట్టినింటిలోనేనా దొరుకుతాయని ఆశతో జీవిస్తున్న ఆశా జీవిని నేను. మరో విషయం, నాది చంచల స్వభావం, నేను ఆశించిన సుఖ-సౌఖ్యాలు – భోగ భాగ్యాలు నాకు మెట్టినింట్లో కూడా లభించకపోతే వాటిని వెతుక్కుంటూ తెగింపుతో ఈ సమాజం కట్టుబాట్లు కూడా లెక్కచేయకుండా రెక్కలు విప్పుకుని ఎగిరిపోయిన విహంగంలా ఎగిరిపోవడానికేనా సంకోచించను నేను”

సరస్వతివి చాలా భయంకరమైన ఆలోచన్లు అనుకునేది సుభద్ర. విప్పారిన నయనాల్తో – ఆశ్చర్యంలో సరస్వతిని అవలోకిస్తున్న సుభద్రకి ఆమె అంతరంగం విచిత్రంగా తోచింది. ఇలాంటి మనిషి తను సుఖపడలేదు. రేపొద్దున్న కట్టుకున్నవాడిని సుఖపెట్టలేదు. ఆమె ఇటువంటి ఆలోచన్లు ఆరోగ్యప్రదం కాదు. ఆడదానికి ఇంత టెంపర్ మెంటాల్టీ మంచిది కాదు. తను పుట్టి పెరిగిన వాతావరణం ప్రకారం ఆలోచించింది సుభద్ర.

తను పెళ్ళి చేసుకున్న సుందరం మొదట మధ్య తరగతి మనిషే. ఆ తరువాత కాలం కలిసిరావడం వల్ల తన భర్త ఇంత వాడయ్యాడు. తనకీ – సుందరానికీ పెళ్ళయిన రోజున పెళ్ళి పందిట్లో తనతో సరస్వతి అన్న మాటలు తన మనస్సులో అలా నిల్చిపోయాయి.

“ఏంటే, సుభద్రా! ఇంత తెలివి తక్కువ పని చేస్తావని అనుకోలేదు” అంది సరస్వతి సుభద్రతో ఏకాంతంలో.

తను చేసిన తెలివి తక్కువ పని ఏంటా? అని ఆలోచిస్తోంది సుభద్ర. సరస్వతి దృష్టిలో సుభద్ర చేసిన తెలివి తక్కువ పని సుందరాన్ని పెళ్ళి చేసుకోవడం.

మన నుదుటిరాత ఎలా వ్రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. మనం శక్తికి మించిన పరుగు పెట్టకూడదనేదే సుభద్ర ఆలోచన. మనకి ఉన్నదాన్తోనే మనం సంతృప్తి పడాలి. పరుగు తీస్తున్న మనస్సు తరంగాన్ని నిగ్రహం అనే కళ్ళెంతో వెనక్కి లాగాలనేదే సుభద్ర ఆలోచన. ఆమెకి వ్యతిరేకం సరస్వతి.

తండ్రి తెచ్చిన సంబంధం ఇష్టపూర్వకంగా అంగీకరించి సుందరం చేత తాళి కట్టించుకోడానికి పెళ్ళిపీటల మీదకు వెళ్ళబోతోంది సుభద్ర. సరస్వతి మాటలకి ఒక్కక్షణం తెల్లబోయి అంతలోనే తమాయించుకుంది సుభద్ర.

“ఏంటే నీవు అంటున్నది?” సరస్వతితో అంది సుభద్ర.

“అదే! తాడు బొంగరం లేనివాడిని తెచ్చి మీ నాన్న పెళ్ళి చేసుకోమంటే డూడూ బసవన్నలాగా అలా తలూపి మెళ్ళో మూడు ముళ్ళూ వేయించుకోవడమేనా? నాకేం నచ్చలేదు నీ తీరు. నీకు స్నేహితురాల్ని – ఆప్తురాల్ని కాబట్టే బాధపడ్తున్నాను.

మీ ఆయన తన సొంతకాళ్ళమీద నిలబడ్లేదు, పైసా ఆస్తి లేదు. వాళ్ళ బావగారి దగ్గర పని చేస్తున్నాడు. రేపొద్దున్న మీ ఆడబడుచు మొగుడు నా వ్యాపారం నేనే చేసుకుంటాను పో! అంటే మీ ఆయన్ని ఉన్న పళాన తగలేస్తే అప్పుడు మీ బ్రతుకు లేంటి? దీని గురించి ఆలోచించేవా?” సరస్వతి నిలదీసినట్లు అంది.

అంతవరకూ ఆ ఆలోచనకే తావివ్వని, అంత దూరదృష్టితో ఆలోచించని సుభద్ర ఓ లిప్తకాలం వణికింది. ఆ అమంగళకరమైన ఆలోచనకి అయోమయంగా సరస్వతి వేపు ఓమారు చూసింది. తనదార్లో పడుతోంది సుభద్ర అని అనుకుంది సరస్వతి.

సుందరం బావగారికి రాజకీయాలంటే మహాపిచ్చి. అతను రాజకీయ వ్యవహారాలు చక్కబెడ్తూంటే సుందరం అతని వ్యాపార విషయాలు చూసుకుంటున్నాడు. అతనికి రాజకీయాల మీద ఎంత ఇష్టం అంటే ప్రాణాలేనా విడిచి పెడ్తాను కాని రాజకీయాల్ని విడిచిపెట్టను అని అంటాడు. “వ్యాపార విషయాలు చూసుకోడానికి నా బావమరిది ఉన్నాడు. నాకేంటి బాధ” అంటూ ఉంటాడు.

“నేను నీవు ఆలోచినంత లోతుగా ఆలోచించలేదే సరూ!” అంది సుభద్ర.

“ఆలోచించాలే! పెళ్లంటే పప్పూ అన్నం తినడం, పల్లకీలో ఊరేగడం కాదు” అంది సరస్వతి.

సుభద్రకి, సుందరానికి పెళ్లయి పదహారు రోజుల పండుగ కూడా అయింది. ఏకాంతంలో భర్త దగ్గర సరస్వతి అన్న మాటలు చెప్పి భయభయంగా భర్త వంక చూసింది.

సుభద్ర ఆమె అమాయకమైన చూపులు, ఆమె రూపం సుందరాన్ని ఆకర్షించాయి. చప్పున ఆమెను తన హృదయానికి హత్తుకుని నుదురు చుంబించాడు సుందరం. భర్త ఆలింగనంలో తన వ్యధని మరిచిపోయి తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది. తన్మయత్వం నుండి తేరుకున్న తరువాత కౌగిలి సడలించిన అతను ఆమెకి ధైర్యాన్ని కలిగించాడు. మొదట సుభద్ర మాటలు వినగానే అతని ముఖం పాలిపోయింది. తరువాత తమాయించుకున్నాడు.

“సుభద్రా! ఆ సరస్వతిని నేను చూడలేదు కాని, ఆవిడ ఆలోచన్లు మాత్రం అంత ఆరోగ్యప్రదమైనవి కావు. ఆమె నీ స్నేహితురాలు అవుతే అవచ్చు కాని ఇలాంటి వాళ్ళు చేస్తే జీవితంలో తాము సుఖపడలేరు. ఎదుటివాళ్ళని సుఖ పెట్టలేరు” అన్నాడు సుందరం. సరస్వతి గురించి సుభద్ర అభిప్రాయం కూడా అదే.

“నేను చాలా అదృష్టవంతురాల్ని” అంటూ భర్త గుండెల్లో తలదాచుకుంటూ అనుకుంది సుభద్ర.

సుందరం భార్యకిచ్చిన మాట ప్రకారం తన భుజబలానికి తోడు బుద్ధిబలం, తెలివితేటల్ని ఉపయోగించి ఓ సాహుకారి దగ్గర గుమస్తాగా చేరి, డబ్బు సంపాదిస్తూ తన సమయస్ఫూర్తితో చాకచక్యంతో వడ్డీ వ్యాపారం చేసి పెద్దవాడయ్యాడు.

“సుభద్రా! ఇదంతా మనిద్దరి అదృష్టం, నిన్న పెళ్ళి చేసుకున్న తరువాత నేను ఇంత వృద్ధిలోకి వచ్చాను” అంటాడు సుందరం సుభద్రతో..

“మీ పట్టుదల – శ్రమ – మీ తెలివి తేటలే మిమ్మల్ని ఉన్నత స్థితికి తెచ్చాయి” అని అంటుంది సుభద్ర.

“నీలో ఉన్న తృప్తి గుణమే నా ఈ అభివృద్ధికి కారణం” అంటాడు సుందరం.

27

ఏ ఆడంబరం లేకుండా నిరాడంబరంగా జరిగిన సారధి సరస్వతుల పెళ్ళికి వెళ్ళింది సుభద్ర. సుందరానికి ఏదో అర్జంటు పని ఉండటం వలన రాలేక పోయాడు. పెళ్ళి రోజున సరస్వతి కళ్ళల్లో పెళ్లవుతోందన్న ఆనందం కంటే ఆత్మక్షోభ – ఆవేదన, నిర్లిప్తతను చూడగలిగింది సుభద్ర.

సరస్వతి ఆలోచన్లకి తగ్గట్టు ఆమెకి పరిస్థితులు అనుకూలించలేదు. ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఆమె కన్న కలల కల్లలయ్యాయి. అందుకే ఆమె కళ్ళల్లో ఆవేదనా తాలూకా నీలినీడలు అగుపడున్నాయి. అనుకుంటున్న సుభద్ర గాఢంగా నిట్టూర్పు విడిచింది.

“సుభద్రా!”

“ఏంటే సరూ!”

“నా గురించి నీవేంటి అనుకుంటున్నావో నాకు తెలుసు. నేను ఓడిపోయానే, కన్న వాళ్ళ దగ్గర ఎలాగూ నా కలలు – కోరికలు ఫలించలేదు. కట్టుకున్నవాడి దగ్గరయినా నా కలలు సఫలమవుతాయనుకుంటున్న ఆశాజీవిని ప్చ్..! అక్కడ కూడా కోరికలు తీరే అవకాశం లేదు. ఎందుకంటే అతని చుట్టూ బాధ్యతలే బాధ్యతలు. విధి చేతిలో నేను ఘోరంగా ఓడిపాయను” నిరాశగా అంది సరస్వతి పెళ్ళి రోజునే.

సరస్వతి మనస్తత్వం తెలిసిన సుభద్ర ఆమె ఈ సంబంధం ఒప్పుకుంది అని తెలిసినప్పుడే ఆశ్చర్యపోయింది. “అలా నీవు ఎందుకు నిరాశ చెందుతావు? మీ ఆయన నీ ఆశలు – ఆశయాలు సఫలీకృతం చేస్తాడేమో? ఎవరు చెప్పగలరు?” ఓదార్పుగా అంది సుభద్ర.

“…! అతను నాకు మాటిచ్చాడు కాని ఎలా చేయగలడు? మొదటే చెప్పాను అతని చుట్టూ బాధ్యతలు సమస్యలే.”

“నీవు ఇష్టపడి చేసుకున్న సంబంధమే కదా ఇది.”

“ఇష్టమా ఏంటి నా బొంద, అతను నన్ను ‘తనని పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా’ అని అడిగాడు, పుట్టినింటి కంటే మెట్టినింట్లో – గ్రుడ్డి కన్నా మెల్ల నయం అనుకున్న నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇప్పుడు నాకేంటి అనిపిస్తోందో తెలుసా? సెగలో నుండి పొగలోకి వచ్చానా అని అనిపిస్తోంది.”

సుభద్ర సరస్వతి మనస్తత్వానికి గాఢంగా నిట్టూర్పు విడిచింది. సరస్వతిని రాజీ మార్గంలో నడవమని సలహా ఇవ్వడం తప్ప ఏం చేయలేకపోయింది. పెళ్ళికొడుకు సారధిని మొదటి సారిగా చూసిన సుభద్ర అతని మనస్తత్వాన్ని అభిరుచులు ఆశయాలు ఆచరణ అర్ధం చేసుకోడానికి అతని ముఖ కవళికలు అతని చర్యలు – కదలికలు నిశితగా పరిశీలిస్తోంది.

నిండుగా మూర్తీభవించిన గంభీరమైన వ్యక్తిత్వం – ఎలాంటి విషమ పరిస్థితినయినా అవలీలగా తట్టుకుని సర్దుకుపోతూ, అవసరమయితే పరిస్థితుల్లో రాజీపడ్తూ, ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవంతో జీవన నౌకను జీవన సాగరంలో ఈడ్చుకు పోగలను అన్న భావాలు అతని వదనంతో అగుపడ్డాయి. సుభద్రకి. అంతేకాదు చాలా శాంత స్వభావుడు. సరస్వతి భావాలకి వ్యతిరేకమైన భావాల ఇతని ముఖంలో అగుపిస్తున్నాయి. ‘చాలా ఉత్తముడులా అగుపడ్తున్నాడు’ తిరిగి సుభద్ర అనుకుంది సారధి గురించి.

పెళ్లయిన తరువాత రెండు మూడు సార్లు సారధిని చూసింది సుభద్ర. ఆ తరువాత సరస్వతి అతడ్ని వదిలి వెళ్ళిపోయిన తరువాత సారధి గురించి సుభద్ర మరిచిపోయింది.

“ఏంటలా ఆలోచనలో పడిపోయావు, సుధాకర్ ఫ్యామిలీ గురించి నీకు తెలుసా అమ్మా!” సంధ్య అడిగింది సుభద్రని.

ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డ సుభద్ర… “ఆఁ… తెలుసు వాళ్ళ కుటుంబంతో మనకి దూరపు చుట్టరికం కూడా ఉంది.”

“అయితే ఇంకేం? అయితే మా పెళ్ళి నిశ్చయమయిపోయినట్టే” అంటున్న సంధ్య ముఖం సంతోషంతో వెలిగిపోయంది. కూతురు చూసిన ఆ తల్లి సుధాకర్ని కూతురు ఎంత ఇష్టపడుతోందో అర్ధం చేసుకుంది.

“సుభద్రా! ఫ్లాష్‌బాక్ లోకి వెళ్ళిపోయావా?” సుందరం నవ్వుతూ అన్నాడు.

“అతని కుటుంబం గురించి వాకబు చేసేను. ఆ సుధాకర్ మరెవరో కాదు నీ స్నేహితురాలు సరస్వతి కొడుకు.”

“తెలుసు.”

“నీకు ఆనాడే చెప్పాను సరస్వతి లాంటి వాళ్ళు సుఖపడలేరని, మొదట సంధ్యకి ఐశ్వర్యవంతుడ్ని అల్లుడుగా తెద్దామనుకున్నాను. అయితే నా నిర్ణయం మార్చుకున్నాను. మనం ఇష్టపడిన వాడితో సంధ్య పెళ్ళి జరిపించడం కంటే సంధ్య, సుధాకర్ ఒకర్ని మరొకరు ఇష్టపడ్డారు కాబట్టి అలా ఇష్టపడిన వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించడం మంచిది అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఆస్తిపరుడ్ని అవచ్చు. అయితే నేను నా గతాన్ని మరిచిపోలేదు. అందుకే రత్నం లాంటి సుధాకర్ని అల్లుడుగా తెచ్చుకోవాలనుకుంటున్నాను.”

“మొదట మీ మాటల్ని విన్న నేను మీరు మీ గతాన్ని మరిచిపోయి వర్తమానాన్ని, భవిష్యత్తునే ఆలోచిస్తున్నారనుకున్నాను” అంది.

“గతాన్ని మరిచిపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. మనం మన తప్పుల్ని సరిచేసుకోవాలంటే గతాన్ని తప్పకుడా తలుచుకోవాలి” అన్నాడు సుందరం.

“ఇప్పుడు మనిద్దరం సుధాకర్ వాళ్ళింటికి వెళ్ళి పెద్దవాళ్లతో పెళ్ళి విషయం మాట్లాడాలి. అమ్మాయిని చూసుకోడానికి రమ్మనమని పిలవాలి. మంచి రోజు చూసుకుని వెళ్దాం” అంది సుభద్ర తృప్తిగా ఇలాగయినా స్నేహితురాలి కొడుకుని అల్లుడుగా చేసుకునే అవకాశం వస్తోంది కదా అని ఆనందపడ్తోంది సుభద్ర.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here