ఎండమావులు-16

0
8

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 16వ భాగం. [/box]

34

[dropcap]మ[/dropcap]నకి మన మనస్సులోని ఉద్దేశాలు – కోరికలు – అభిలాషలు వదులుకునేందుకు ఇష్టం ఉండదు. జీవితం మనకి అవసరమయినది ఇస్తుంది. అయితే అవసరాన్ని మించినవి కూడా కావాలనుకుంటాం. ఆశిస్తాము. ఆశకి కోరికలకి అంతమన్నది ఉండనే ఉండదు. ఇచ్చిన దాని పట్ల తృప్తి అనేది ఉంటే జీవితంలో నిజమైన ఆనందం కలుగుతుంది.

ఈ విషయాన్ని తెలుసుకోలేక పోతున్నాడు సుందరం. మొదట అతను మధ్య తరగతి మనిషి. జీవితంలో ఎదగాలి అని ఆశించి కృషి పట్టుదలతో ఎదిగాడు. అయితే ఇంకా ఏవేవో కావాలి. ఏవేవో చేయాలి. తను అనుకుంటున్నట్టు అన్నా జరగాలి అని అనుకుంటే సాధ్యమైన పని కాదు.

విధి విచిత్రమైనది. ఆ విధిని ఎవ్వరూ జయించలేరు. ఎప్పుడు ఎలా ఏది జరగాలో అదే జరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నది. జరగకపోయే సరికి మనలో అసహనం – అసంతృప్తి కలుగుతాయి. యథార్థాన్ని గ్రహించి, తన ఆలోచనలు ఎంత తప్పుడవి అని తెలుసుకుని పరిస్థితులతో రాజీకి వస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి.

అయితే సుందరం ఆలోచన్లు వేరు. జరుగుతున్న పరిణామాలు వేరు. అందుకే అతనిలో అసహనము. కూతురికి పారెస్ సంబంధం తెచ్చి పెళ్ళి చేద్దామనుకున్నాడు. అయితే సంధ్య సుధాకర్‌ని ఇష్టపడడం, సుభద్ర వాళ్ళద్దరి ప్రేమను సమర్థించడంతో తన కోరిక మనస్సుతోనే దాచుకుని కూతురి అభీష్టం నెరవేర్చాడు.

ఆ తరువాత సుధాకర్‌ని ఇల్లరికం చెచ్చుకుందామనుకున్నాడు. ఈ విషయంతోను సుభద్ర అడ్డు పడింది. “మనకి ఒక్క కూతురు, వాళ్ళకి ఒక్కడే కొడుకు. మన కూతురు మనింట్లోనే ఉండాలని మనకెలా ఉంటుందో సుధాకర్ తల్లిదండ్రులకి కూడా వాళ్ళ కొడుకు వాళ్ళ దగ్గరే ఉండాలి అని ఉంటుంది. ఈ ఊర్లోనే ఉంటారు కదా. వచ్చిపోతూ ఉంటారు” అంది. తన ఆ కోరిక కూడా నెరవేరలేదు.

పోనీ అంతటితో అయిపోయిందా? ‘పెళ్ళికి బహుమతిగా నర్సింగ్‌హోమ్ కట్టి ఇస్తాను. ఈ ఊర్లోనే ప్రాక్టీసు చేసుకోండి’ అన్నాడు.

“అలా కాదు. సౌందర్య తన బంగ్లా తనకి అప్పగించింది. అందులో ఉండమని కోరింది. అక్కడే నర్సింగ్‌హోమ్ కట్టమంది. ఆవిడ నాకు ఎంతో సహాయం చేసింది. ఆవిడ మాట కాదన లేను. అక్కడే నర్సింగ్ హోమ్ పెడ్తాను. అది ఖరీదైన ప్రదేశం. చాలా సంపన్నులైన మనుష్యులు అక్కడ. అక్కడ ప్రాక్టీసు పెడ్తే చాలా బాగుంటుంది.. పలుకుబడికి పలుకుబడి, డబ్బుకి డబ్ముకి సంపాదించవచ్చు” అన్నాడు సుధాకర్. దానికి వత్తాసు పలికింది సంధ్య. తన ఆ కోరిక కూడా తీరకుండా పోయింది. తాము ఇక్కడ కూతురు అల్లుడు అక్కడ. కూతుర్ని వదిలి పెట్టలేము అంటే తనకు హైదరాబాద్‌లో కూడా ఇల్లు ఉంది అక్కడికి మకాం మార్చాలి.

ఇవతల సుందరం ఆలోచన్లు ఒకలా ఉంటే అవతల సుభద్ర ఆలోచన్లు మరోలా ఉన్నాయి. ఆడపిల్ల జీవితంలో పెళ్ళి ఓ మలుపు. పుట్టినప్పటి నుండి ఓ విధమైన పరిసరాల మధ్య మెలిగిన వాళ్ళు, పెళ్ళి అనే తంతు అవగానే అపరిచిత మనుష్యుల మధ్య, అపరిచిత పరిసరాల నడుమ మెలగాలి. అత్తవారింటిలో ప్రతి క్రొత్త కోడలూ, తన ప్రవర్తనతో – సహనంతో మెప్పించాలి. అప్పుడే ఆడదాని జీవితం సాఫీగా సాగుతుంది.

తన విషయంలో ఈ సమస్య ఎదురవలేదు. తను మధ్య తరగతి మనిషి, తన భర్తకూడా మధ్య తరగతి మనిషే. అందుకే తమ జీవితంలో ఏ సమస్యలూ రాలేదు. అయితే సంధ్య విషయంలో అలా కాదు. తమకి కాలం కలిసి వచ్చి ఓ మెట్టు ఎత్తుకి ఎదిగారు. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నారు. తమకి సంధ్య ఒక్కర్తె కూతురు. చాలా గారాబంగా పెరిగింది.

సంధ్య అత్తవారిల్లు చూసిన తరువాత తనకి అలాగే అనిపించింది. తను అనుకున్నట్టే అయింది. పెళ్ళి అయి అత్తవారింటికి వెళ్లిన సంధ్య అక్కడి పరిసరాలతో ఇమడలేకపోయింది. అసహనం, విసుగు కూతురిలో చోటు చేసుకున్నాయి. తను ఇవన్నీ గమనిస్తూనే ఉంది. కూతురికి నచ్చ జెప్పాలనుకుంది. అయితే కాలమే ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తుందని అనుకుంది. ‘తన కూతురు అత్తవారు కూడా కోడల్ని బాగానే చూసుకుంటున్నారు. సంధ్య తన తప్పు తను తెలుసుకుంటుంది’ అని అనుకుంది.

ఆ తరువాత అత్తవారింటిలో అక్కడి మనుష్యల ప్రవర్తన వల్లనో లేకపోతే, అల్లుడి గొప్పతనం వల్లనో, లేక సంధ్య తన తప్పు తను తెలుసుకోవడం వల్లనో సంధ్యలో మార్పు అగుపించింది.

“మరో నాలుగు రోజులు ఇక్కడ ఉండకూడదా!” అని తను కూతురితో అంటే “మా అత్తగారు ఒక్కరే అన్ని పనులూ చేయలేరు” అంటుంది.

“ఆఁ!! బడాయి. ఇన్నాళ్ళూ నీవే ఆ ఇంట్లో అన్ని పనులూ చేశావా?” అని అంది తను నవ్వుతూ.

“పెళ్లయిన తరువాత నేను కూడా ఆ కుటుంబ సభ్యురాల్ని అయ్యాను. నేను కూడా కొన్ని పన్లు షేరు చేసుకోపేతే ఎలా?” అంటుంది. కూతురి మాటలు తనకి సంతోషాన్ని ఇచ్చేయి. తను కోరుకునేది కూడా కూతురిలో ఇలాంటి మార్పునే.

***

సాయంకాల సమయంలో పూలమొక్కల చెంత కుర్చీ వేసుకుని కూర్చుని ప్రకృతి అందాన్ని పరికిస్తున్నాడు సారధి. సుమిత్ర అక్కడికి వచ్చింది. ఆమె సంతోషంగా ఉంది. ఆమె మనస్సు ఉల్లాసంగా ఉంది.

“మన కోడలిలో వచ్చిన మార్పును గమనించారా?” సారధిని అడిగింది సుమిత్ర,

“ఏంటి?”

“ఈ మధ్య అబ్బాయి కోడలూ ఊరు వెళ్ళి వచ్చారు కదా! వచ్చినప్పటి నుండి కోడలి తీరే మారిపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. అబ్బాయి ఏంటి చెప్పాడో కాని ఆమెలో మార్పు స్పష్టంగా అగుపడుతోంది. ఇప్పుడు మునపటిలా రుసురుసలు లేవు. విసుక్కోడాలు అసలే లేవు. ‘అత్తయ్యా! నాక్కూడా కొన్ని పన్లు చెప్పండి. మీరొక్కరూ ఎంతకని చేయగలరు?’ అంటూ చేతిలో పని తీసుకుని తనే చేస్తోంది” అంది సుమిత్ర సంతోషంగా.

ఆమె మాటలకి చిన్నగా నవ్వుకున్నాడు సారధి. సుమిత్రతో వచ్చిన చిక్కే అది. బోళా మనిషి, సుఖం వస్తే పొంగిపోతుంది. కష్టం వస్తే కృంగిపోతుంది.

‘నీ పద్ధతి మార్చుకో!’ అని తను ఎన్నో సార్లు చెప్పాడు. జీవితంలో అనేక సమస్యలకు మూలకారణం స్వార్థం. ఈ స్వార్థం కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకే మనం ఏ విషయాన్ని – మనుష్యుల తీరు తెన్నుల్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేము. ముందర నిజాలని చూడగలగాలి. తరువాత ఎదుటి వాళ్ళ భావాలను చూడగలగాలి అని తను అనుకుంటాడు.

“మనుష్యుల మాటల్ని చేతల్ని వెంటనే అంచనా వేసి ఓ నిర్ణయానికి వచ్చేకంటే వారిని నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి” అని అనుకున్నాడు సారధి.

“కోడలిలో మార్పు వస్తే నీకు సంతోషమే కదా! నవ్వుతూ అన్నాడు.

“సంతోషం కాకపోవడమేంటి? ఆ అమ్మాయి ముఖం ముడుచుకుని రుసరుస లాడుతుంటే ఒక్కొక్క సమయంలో మనస్సు చివుక్కుమనేది.”

“సుమిత్రా! ఒక్క విషయం. రక్త సంబంధాలలో భావోద్వేగాలు సహజం. వాటి వల్ల ఆనందం కలగచ్చు. బాధ కూడా కలగొచ్చు. ఆ భావోద్వేగాల్ని అదుపు చేసుకుంటేనే జీవితం సవ్యంగా జరుగుతుంది. సుధాకర్ ఆమెని మనతో సవ్యంగా ఉండమని సలహా ఇచ్చి ఉండచ్చు. సలహాలు ఇవ్వడం, సలహాలు తీసుకోవడం తప్పుకాదు. నేరం అంతకన్నా కాదు. సలహాలు ఇచ్చినంత మాత్రాన్న ఎదుటి వాళ్ళు మారిపోతారని కూడా చెప్పలేము. అయితే మనవాడి సలహా సంధ్య నెగిటివ్‌గా తీసుకోకుండా పాజిటివ్‌గా తీసుకుంది. ఆ మాటలు ఆమెను ఆలోచింపచేశాయి. తన తప్పు తెలుసుకుంది. అందుకే ఆమెలో మార్పు సాధ్యమయింది” అన్నాడు సారధి.

ఏదైతేనేఁ కోడలిలో మార్పు వచ్చింది. అదే సుమిత్రకి కావల్సింది.

34.1

కాలచక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. ఆ కాలచక్రంతో పాటే అనేక మార్పులు. సౌందర్య బంగ్లాలో నర్సింగ్ హోమ్ నిర్మించి రెండు సంవత్సరాయింది. ఓపెనింగ్ కూడా అయింది. సుధాకర్, సంధ్య తమ నివాసాలు అక్కడికి మార్చుకుని ప్రాక్టీసు కూడా మొదలు పెట్టారు. అనుకోడమే తరువాయి అన్ని పనులూ ఎలా చకచాకా సాగిపోతున్నాయి అని అనుకుని విస్తుపోవడం ఆ కుటుంబ సభ్యుల పనైంది.

“మా దగ్గరకి వచ్చి ఉండకూడదా? ఇక్కడ మీరిద్దరూ ఉండడమెందుకు?” సుధాకర్ తండ్రితో అన్నాడు.

“రావల్సి వచ్చినప్పుడు తప్పకుండా వస్తాం. ప్రస్తుతం అలవాటయిన పరిసరాలను, మనుష్యుల్ని వదిలి రావాలంటే చాలా కష్టం. ఇక్కడికి, అక్కడికి ప్రయాణం కొన్ని గంటలే కదా! అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాము” సారధి కొడుకుతో అన్నాడు.

“అత్తయ్యా! మీరైనా మామయ్యగారికి చెప్పండి. ఒక్కరే ఉండడం ఎందుకు? మా దగ్గరికి వచ్చేయకూడదా? పెళ్ళయిన కొత్తలో ప్రవర్తించినట్టు నేను ప్రవర్తిస్తాననుకుంటాన్నారా? ఆ సంధ్యను కాను నేను. ఏదో అప్పుడు నా మూర్ఖత్వం, అజ్ఞానం వలన అలా ప్రవర్తించేను. ఇప్పుడు నా తప్పులు నాకు తెలిసాయి” పశ్చాత్తాపపడుతూ, బాధపడుతూ అంది సంధ్య సుమిత్రతో,

సంధ్య మాటలకి సుమిత్ర కూడా నొచ్చుకుంది. “నాకు అలాంటి భావం ఏంలేదమ్మా! కోడలివైనా కూతురివైనా నీవే. పైకి అహంభావిగా అగుపించినా నీ మనస్సు వెన్న అని నాకు తెలుసు” కోడలికి నచ్చజెప్పే పద్ధతిలో అంది సుమిత్ర.

***

సుందరం, సుభద్ర కూతురింటికి వెళ్ళి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళకి ఎవరున్నారు. కూతురు తప్ప.

సారధి, సుమిత్రా రెండు మూడుసార్లు వెళ్లి వచ్చారు. ఆ పరిసరాలు చూస్తే సారధి మనస్సులో అనేక ఆలోచనలు. వాటితో పాటు భావోద్వేగం. గుండెల్లో సన్నని బాధ. ఏవేవో జ్ఞాపకాలు. అందుకే ఎక్కువ రోజులు ఉండలేక వెళ్ళడానికి ఇష్టపడడు సారధి.

సుందరం, సుభద్ర కూతురి దగ్గరకి వెళ్ళారు. ఆ రోజు సుధాకర్, సంధ్య వాళ్ళతోనే పని చేస్తున్న డాక్టర్ సురేశ్ ఇంట్లో ఫంక్షను ఉందని తొందరగా ఇంటికి వచ్చారు. లోపలనుండి వినిపిస్తున్న సంభాషణ విని టక్కున ఆగిపోయారు.

ఎంతో సౌమ్యంగా ఎప్పుడూ మాట్లాడి ఉండే సుభద్ర పరుష వాక్యాలు వింటూ విస్మితులై అలా ద్వారం దగ్గరే ఉండిపోయారు. సుభద్ర ఎవరితోనో మాట్లాడుతోంది. ఆమె కంఠంలో తీవ్రతతో పాటు నిష్ఠూరం కూడా ప్రతిధ్వనిస్తోంది. ఆమెతో మాట్లాడుతున్న ఆ స్త్రీ కంఠంలో దీనత్వం అగుపడుతోంది. ఆ స్త్రీ కంఠస్వరం ఎక్కడో విన్నట్టుంది సుధాకర్‌కి. లోనికి తొంగిచూశాడు. ఆ స్త్రీని బాగా తీక్షణంగా గమనిస్తూ మొదట గుర్తింగలేక పోయినప్పటికి ఆ తరువాత పోల్చుకున్నాడు. ఆమె సౌందర్య.

సౌందర్య ఎముకలు గూడులా బలహీనంగా ఉంది. ఆమె కళ్ళల్లో కాంతిలేదు. ముఖంలో నిరాశ కొట్టాచ్చినట్టు అగుపడుతోంది. భావోద్వేగంతో ముందుకు వెళ్ళబోతున్న వాడల్లా ఆగాడు.

ఓనాడు ఆమెను దేవతకన్నా ఎక్కువుగా ఆరాధించినవాళ్ళు, హారతులు పట్టిన వాళ్ళు ఆమెను ఈనాడు అసహ్యించుకుంటున్నారు. ఆమె దీన స్థితి చూసి సుధాకర్ కన్నుల్లో కన్నీరు చిప్పిల్లాడింది.

ఈనాడు తను ఈ స్థితిలో ఉండడానికి ఓ విధంగా కారణం ఆమె. తను తింటున్న తిండి, కడుతున్న బట్టి, నివాసం అన్నీ ఆవిడ చలవే. ఎంతో నెమ్మదస్తురాలు అయిన తన అత్తగారు సౌందర్యను చీదరించుకోవడం అతను తట్టుకోలేకపోతున్నాడు.

ఛీ… ఛీ…. ఏ మనుష్యులు? డబ్బు హోదా ఉంటే పాత రోజులు మరిచిపోతారు. ఈ డబ్బు హోదా శాశ్వతం అని అనుకుంటారు.

“భ్రష్ట జీవితం గడిపి రోగాల్తో శరీరం పుచ్చిపోయి ఇప్పుడు ఇక్కడికి రావడం నీకు సిగ్గుగా లేదా?” సుభద్ర అడుగుతోంది తీక్షణంగా సౌందర్యని.

ఆమె ఎలాంటి మనిషి అవనీ, ఆమె ప్రస్తుతం ప్రాణమున్న మనిషి. అందరిలాగే చీమూ నెత్తురూ ఉన్న మనిషి. అవమానికి బాధపడే మనస్సు ఉంది. దుఃఖం వస్తే కన్నీరు కార్చే కళ్ళు ఉన్నాయి. బాధకి విలవిల్లాడే దురదృష్టవంతురాలు. అలాంటి ఆమె మీద జాలి చూపించాలి కాని హేయంగా చూడకూడదు. ఆమె ఏ బంగ్లాలో ఏ స్థలంలో మాట్లాడుతోందో ఆ స్థలం ఆమెది. తను నిర్మించుకున్న నర్సింగ్ హోమ్ ప్రాంగణం ఆమెది.

సుభద్ర మాటలు ఇంకా కఠినంగానే వినబడుతున్నాయి.

“సరస్వతీ! నీ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసా? ఎందరి జీవితాలు అశాంతి పాలయ్యాయో తెలుసా? పచ్చగా ఉన్న ఈ కుటుంబంలో నీ రాకతో కలహాలు-అశాంతికి నిలయమవుతుందని నీకు తెలుసా?”

అయితే ఈ సౌందర్య పేరు సరస్వతా? సుధాకర్ అనుకుంటున్నాడు.

“సరస్వతీ! నిన్ను చూస్తుంటే నాకు బాధ కంటే అస్యహ్యం వేస్తోంది. జాగుప్ప కలుగుతోంది. నీ చంచల స్వభావమే నిన్ను ఈ స్థితికి తెచ్చింది. నీ అనైతిక ప్రవర్తనతో రోగాలు తెచ్చుకుని ఇప్పుడిలా తగలబడ్డావు. రోగాల్తో పుచ్చిపోయిన నీవు ఎలాగూ చస్తావు. అదే తొందరగా చేస్తే ఎవరికీ బాధ ఉండదు. లేకపోతే ఇంట్లో కలతలు వస్తాయి” సుభద్ర కంఠంలో ప్రతిధ్వనిస్తున్న నిష్ఠూరానికి తల్లడిల్లిపోయింది సరస్వతి.

“నేను నీ స్నేహితురాలిని. నీవు నన్ను అలా అనకు సుభద్రా” అని అంది దీనంగా సౌందర్య.

తన అత్తగారికి సౌందర్య అనబడే సరస్వతి స్నేహితురాలా? ఆమె ఇక్కడ ఉంటే కలతలు రావడమేంటి? ఆలోచిస్తున్నాడు సుధాకర్.

“సరస్వతీ నీవు నీ చంచల స్వభావంతో నీవు పాడవడం కాకుండా నా పెళ్ళి సమయంలోనా భర్త సుందరాన్ని చేసుకుంటున్నానని నీ అసంతృప్తిని వెల్లడించి నన్ను కూడా రొంపిలోకి లాగాలనుకున్నావు. అయితే నేను నీలాంటి చంచల స్వభావురాల్ని కాదు. పాపం నీ భర్త సారధి, ఎంతమంచి మనిషి అతనికి ద్రోహం చేశావు. నీ చెల్లెలు సుమిత్ర ఎంత మంచిది? నిన్ను చూస్తే సుమిత్ర తప్పకుండా అసహ్యించుకుంటుంది. నీ భర్త లాంటి మనుష్యులు అరుదుగా ఉంటారు. అలాంటి ఉత్తమ మనిషి జీవితాన్ని అశాంతిమయం చేశావు. అవమానపాల్జేసావు! నీ చంచలమైన మనస్తత్వంతో అలాంటి మంచి మనిషిని బాధించిన ఫలితం ఊరికే పోతుందా? ఇలా దుర్భరంగా ముగుస్తుంది నీ జీవితం.”

సుభద్ర మాటలకి సరస్వతి బాధపడింది. తను చేసిన తప్పు ఎంత చెడ్డదో తనది ఎంత తొందరపాటు చర్యో గుర్తించింది. గుర్తిస్తే ఏం చేయగలదు? జరగవల్సిన అనర్థం జరిగి పోయింది. ఇప్పుడు పశ్చత్తాపపడ్డంలో ప్రయోజనం లేదు.

“సుధాకర్ ఎవరో గుర్తించిన తరువాతే అతడి చదువుకు సాయం చేశావు, నీ బంగ్లా ఇచ్చావు. ఇది నీ స్వార్థం అని నాకు తెలుసు. మనం అనుకోనవి కొన్ని జీవితంలో జరుగుతూ ఉంటాయి. నీ కొడుకు సుధాకర్ నా కూతురు సంధ్య ప్రేమించడం, వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడం జరిగాయి. అందుకే మనిద్దరం వియ్యపురాళ్ళం అయ్యాం. అయితే నేను నిన్ను వియ్యపురాలిగా అంగీకరించలేకపోతున్నాను.”

సుభద్ర మాటలకి సుధాకర్ తృళ్ళిపడ్డాడు. సంధ్య పరిస్థితి అదే. సౌందర్య అనబడే ఈ సరస్వతి తనకి తల్లా? అందుకే తన తల్లిదండ్రులు సౌందర్య సినిమాలు చూడవద్దని ఆంక్షలు పెట్టేవారు.

“సుభద్రా! సుధాకర్ ఎవరో తెలిసిన తరువాత నేను ఎంత పొంగిపోయనో తెలుసా? అతను తల్లిదండ్రులు మీద ఏర్పరుచుకున్న ద్వేషభావం విని తల్లడిల్లిపోయాను. హితబోధ కూడా చేశాను సుధకి. తన కన్న తల్లి మీదున్న ద్వేషం, కోపం, కసి తెలుసుకున్న తరువాత నా హృదయంలో చెప్పనలవి కానంత బాధ కలిగింది. అందుకే నా గురించి సుధాకర్‌కి తెలియకూడదని ‘నేనే నీ కన్న తల్లిన’ని చెప్పుకోలేకపోయాను. నా మూగబాధను మనసులోనే దాచుకున్నాను. చచ్చినపాముని మరింత చంపకు. నా పతనమైన జీవితం నాతోనే సమాస్తం అయిపోవాలి. పతిత కొడుకుగా సమాజంలో సుధాకర్‌ని ఎప్పుడు ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు. అవమానపర్చకూడదు అని అనుకున్నాను. నా మాతృ ప్రేమను చంపుకుని మూగదానిలా ఉండిపోయాను. ఎదురుగా కొడుకు ఉన్నా నేను నీ తల్లిని అని చెప్పుకోలేక తల్లడిల్లిపోయాను. ఆత్మక్షోభతో కుమిలిపోయాను. మూగగా రోదించాను. సుభద్రా వియ్యపురాలిగా కాదు, స్నేహితురాలిగా ఆదరించలేవా?”

“ఎప్పటికీ అంగీకరించలేను. నీదే కన్న ప్రేగయితే, నీలో కన్న ప్రేమ కొడుకు మీదుంటే ఆ పసి గుడ్డును అలా వదిలి వెళ్ళి ఉండే దానివి కాదు. ఛీ… ఛీ…! నిన్ను నా స్నేహితురాలిగా చెప్పుకోడానికే సిగ్గుగా ఉంది. వియ్యపురాలివని చెప్పుకుని నా పరువు నన్నే తీసుకోమంటావా? సుధాకర్‌కి నీవు తల్లివని తెలియదు. తెలుస్తే ఎంత ఎంత అసహ్యించుకుంటాడో తెలుసా? ఇప్పుడు నీ మీద ద్వేషం పెంచుకుని చీదరించుకుంటాడు. కుమిలిపోతాడు, బాధ పడ్తాడు. ఆ నాడు నీ చంచల స్వభావం వల్ల -కండకావరంతో, కామంతో విలాసవంతమైన జీవితం గడపాలన్న కాంక్షతో అలా కొడుకుని వదిలి వెళ్లావు. నీలో మాతృత్వం మమతానురాగాలుంటే నీవు ఆ పని చేసి ఉండేదానివా? అయినా సుధాకర్‌ని కన్నంత మాత్రాన్న నా అల్లుడు నీ కొడుకు కాదు, సుమిత్ర కొడుకు.”

“సుభద్రా! నీ మాటలు నాకు శూలాలు గ్రుచ్చుకుంటున్నంతగా బాధిస్తున్నాయి.”

“నా మాటలే నీకు బాధ కలిగిస్తూ ఉంటే, నీ చేతలు ఎంత మందికి బాధ కలిగించాయో తెలుసా?”

“ఆపు సుభద్రా ఆపు. నీ మాటలు నేను భరించలేను. కుమిలిపోతున్నాను. బాధపడున్నాను. నీ మాటలు నా హృదయాన్ని గాయపరుస్తున్నాయి. నేను చేసింది తప్పే అని అంగీకరిస్తున్నాను. అయితే

నా కొడుకుని దూరం నుండి చూసి వెళ్ళిపోతాను. నేను వాడి తల్లినని చెప్పుక్కర్లేదు. నిజం తెలిసి నా కొడుకు నన్ను తూలనాడితే భరించే శక్తి నాలో లేదు. ఇప్పటికే నేను సగం చచ్చిన దాన్ని అయ్యాను. ఇంకా నిన్ను చంపకు.”

“సరస్వతి! ఇప్పుడు బాధపడితే లాభం ఏంటి? జరగవల్సిన అనర్థం ఎప్పుడో జరిగిపోయింది.”

“నిజమే అనర్థం జరిగిపోయింది. నా పతిత జీవితం తెలుసుకుని నా కొడుకు ఎన్ని తిట్టినా పరవాలేదు. అసహ్యించుకున్నా పరవాలేదు. నేను కూడా నేను చేసిన పనికి కుమిలి పోతున్నాను. అశాంతి పాలు అవుతున్నాను. నేను చావు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ మృత్యువు కూడా నన్ను కరుణించటం లేదు. పోనీ నీ కూతురు కూడా డాక్టరే! చచ్చిపోయే ముందు నాకు వైద్యం ఇప్పించకూడదూ?”

సరస్వతి ఎంత ఆవేదనకి, సంఘర్షణకి గురవుతుందో సుభద్రకి తెలుసు. అయినా సరస్వతి మీద సుభద్రకి జాలి కలగడానికి బదులు మరింత ద్వేషం పెరుగుతోంది. కఠినత్వం పెరుగుతోంది.

“నీది పాపిష్టి జన్మ. అందుకు నీవు ఈ మాత్రమయినా బాధ ననుభవిచవల్సిందే. ఇది నేను నీకు ఇస్తున్న శాపం కాదు. నాకు నీ మీదున్నకోపం నన్ను ఇలా మాట్లాడిస్తోంది. నీవు చావడానికి నా కూతుర్ని మందివ్వమమంటున్నావు. నీవు ఎలాంటి పాపాలు చేసావో అలాంటి పాపం పని నా కూతురు చేయమనా నీ ఉద్దేశం? నిన్ను చంపి నా కూతురు హంతుకురాలు అవాలా? నీలాంటి పాపిష్టి బ్రతుకులు కావు మావి.”

“సుభద్రా! నేను చనిపోయేలోపున ఆయన్ని ఓమారు చూడాలని ఉంది. అది నాకు తీరని కోరికే అని కూడా నాకు తెలుసు. కనీసం నా పతనమైన జీవితం, జీవితంలో నేను పొగొట్టుకున్న ఆప్యాయతానురాగాలు, మమతలు, ఎలాగూ నాకు లభించలేదు. నేను అనుభవించిన విలాసవంతమైన జీవితం ఎండమావి అని తెలిసేటప్పటికే జరగవల్సిన అనర్థం జరిగిపోయింది. ఆ నరక జీవితంలో నేను నరకయాతన అనుభవించాను. ఆత్మక్షోభతో, మానసిక సంఘర్షణతో అనేక అగచాట్లు అనుభవించాను అన్యాయాలకి బలి అయిపోయాను. పతనమైన నా జీవితాన్ని డైరీలో వ్రాసాను. ఈ డైరీ చదివి నా కొడుకు నన్ను అర్థం చేసుకుని నా మీద పెంచుకున్న అసహ్యాన్ని తగ్గించుకుని క్షమించి నామీద జాలి పడ్తాడని నా ఆశ” అంది సరస్వతి.

“నిన్ను ఎవ్వరూ ఆదరించరు, జాలిపడరు, మరింత ద్వేషిస్తారు. ఆదరిస్తారని భ్రమపడున్నావు. నిన్ను అసహ్యించుకుంటారు. చీదరించుకుంటారు. నీవు చేసిన తప్పుడు పనులు అటువంటివి. నీ భర్త క్షమించడు, సుమిత్ర కూడా క్షమించదు. తోబుట్టువని జాలిపడదు. నీ కొడుకు అసలే క్షమించడు. నీవు చేసిన ఆ తప్పుడు పనులకి ఈ జన్మలోనే – ఈ భూమ్మీదే ఆ భగవంతుడు నీకు తగిన శిక్ష విధించాడు.”

సుభద్ర మాటలు వాడిగా తగిలి సరస్వతి హృదయాన్ని గాయపరుస్తున్నాయి. “ప్లీజ్ సుభద్రా! విపరీతమైన శారీరక – మానసిక బాధను అనుభవిస్తున్నాను. కనీసం ఈ డైరీ నా కొడుక్కి అందచేయగలవా?” ప్రాదేయపడ్తూ అడిగింది సరస్వతి సుభద్రను.

“ఎందుకు? నీవు ఎవరితో ఎలా తిరిగావో నీ కొడుకు తెలుసుకోడానికా? నీ భ్రష్ట జీవితం గురించి తెలుసుకోడానికా? నీ పాప పంకిలమైన జీవితం తెలుసుకోడానికా? ఆ డైరీ చదివితే నీ కొడుక్కి నీ మీద మరింత ద్వేషం, అసహ్యం కలుగుతుంది. అయినా నీ మీద జాలి చూపడమంటే అవినీతిని ప్రోత్సహించడమే!” అంటూ డైరీ గిరాటు వేసి బయటకు వచ్చింది సుభద్ర.

అక్కడ కూతుర్ని అల్లుడ్ని చూసి నిశ్చేష్టురాలయింది. అంతా విన్నట్టుంది వాళ్ళ వాలకం. పాలిపోయిన వదనంలో, ఆవేదనతో అలమటిస్తున్న మనోభావాల్తో బాధకి ప్రతిమూర్తిగా నిలబడ్డాడు సుదాకర్. తన తల్లి చరిత్రహీనురాలు అని తెలుసుకుని సంధ్య ఏఁ అనుకుంటుందో అన్నదే అతని బాధ.

జీవితంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. అలాగే తన తల్లికి కీర్తికాంక్ష అనే బలహీనత ఆమె పతనానికి దారి తీసింది. అందరికీ వెలుతురిచ్చిన దీపం తన చుట్టూరా చీకటిని మిగుల్చుకున్నట్టు అందరి అభివృద్ధికి కారకురాలయిన ఆమె జీవితంలో విషాధం మిగుల్చుకుంది – ఇలా ఆవేదనతో ఆలోచిస్తున్న సుధాకర్ డైరీ తీసి పేజీలు తిరేగేస్తున్నాడు.

డైరీ చేతిలోకి తీసుకుని సరస్వతి వైపు చూశాడు సుధాకర్. దైన్యమూర్తిలా ఉంది ఆమె, వదనంలో ఇన్నాళ్ళ వరకూ తను అనుభవించిన క్షోభ. పయనించి పయనించి ఇక నేను పయనించలేను. ఇప్పుడు నాకు కావల్సింది విశ్రాంతి అన్న భావన అగు పడ్తున్నాయి.

ఆ విశ్రాంతి మృత్యువుతోనే ఆమెకు లభిస్తుంది. ఆ మృత్యువు కూడా తన కొడుకు సన్నిధిలోనే లభించాలన్నదే ఆమె కోరిక. సుధాకర్ మరో విధంగా ఆలోచిస్తున్నాడు. తన తల్లి భయంకరమైన సుఖ వ్యాధితో బాధపడుతోంది. ఆ వ్యాధినపడ్డ వాళ్ళ జీవితం రోజుల్లోనే, ఈ చివర క్షణాల్లో ఆమె మనస్సు శాంతిగా ఉంటే మంచిది. వైభవోపేతమైన తన తల్లి జీవితాన్ని ప్రస్తుత జీవితంతో సరిపోలుస్తూ చాలా బాధపడ్డాడు సుధాకర్.

సరస్వతి చేతుల్తో తల బాదుకుంటూ రోదిస్తోంది. ఆమె రోదన సుధాకర్‌ని, సంధ్యను కూడా కదిలించింది.

డైరీలో వ్రాసిన నల్లని అక్షరాల వేపు సుధాకర్ దృష్టి మరల్చాడు. పరిసరాలను కూడా మరిచిపోయి అతను డైరీ చదువుతుంటే, నెమ్మదిగా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడిచిన సంధ్య అతని వెనక నిలబడింది. ఆమె దృష్టి కూడా డైరీలోని అక్షరాల మీద పరుగులు తీస్తోంది. సరస్వతి సన్నటి రోదన ఇంకా ఆగలేదు. ఆ రోదన వింటూ ఉంటే మనస్సు ద్రవించుకుపోతోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here