ఎండమావులు-4

0
5

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది నాల్గవ భాగం. [/box]

9

[dropcap]సుం[/dropcap]దరిచ్చిన నెల జీతాన్ని తీసుకు వచ్చి సారధి చేతిలో పెట్టింది సరస్వతి. నోట్లు లెక్క పెట్టిన అతని ముఖ కవళికల్లో మార్పు కనిపిస్తోంది. అతను కనుబొమలు చిట్లించాడు. అవి ఒక్క క్షణం ముడిపడి విడిపోయాయి.

ఆశ్చర్యంతో విప్పారిన నయనాల్తో ఒక్కక్షణం భార్య వంక చూశాడు. “ఇదేంటి? ప్రతీ నెల ఇస్తున్న జీతం కన్నా ఎక్కువుంది” కుతూహలం ఆపుకోలేక ప్రశ్నించాడు సారధి.

అతని ప్రశ్న విన్న సరస్వతి కూడా ఆలోచనలో పడింది. సుందరి మాటలు ఆమె చెవిలో గింగుర్లాడుతున్నాయి. సుందరి నెలజీతం తెచ్చి ఇచ్చింది. తనకి లెక్క పెట్టడం అలవాటులేదు.

లెక్క పెట్టడం బాగుండదన్న ఆలోచన ఉన్న సరస్వతి నోట్లు హేండు బ్యాగులో పెట్టబోయింది.

“ప్లీజ్ సరస్వతి గారూ! లెక్క పెట్టండి నోట్లను” అంది సుందరి.

“నో… నో…! నాకు అలాంటి అలవాటు లేదు. అయినా లెక్క పెట్టే అవసరం ఏంటి సుందరీ” సరస్వతి అంది.

“లేదు సరస్వతి గారూ! మీరు నోట్లు లెక్క పెట్టి చూడవల్సిందే” పట్టుదలగా అంది సుందరి.

“ఎందుకు అలా పట్టుబడున్నారు?”

“దాన్లో ఓ స్పెషాలిటీ ఉంది.”

నోట్లు లెక్క పెట్టిన సరస్వతి కళ్ళు అలా ఆశ్చర్చంతో స్థిరంగా నిల్చిపోయాయి.

“ఏంటి ప్రతీ నెల కంటే ఎక్కువ ఉన్నాయి?”

“అవును” అంటూ తలూపింది సుందరి.

“ఏంటో స్పెషాల్టీ ఈ నెల?”

“దీనికి కారణం బావేనండీ. సరస్వతి గారూ! బావకి మీరు మెదట కృతజ్ఞతలు చెప్పుకోండి. మిమ్మల్ని బావ పొగడ్తల్లో ఆకాశానికి ఎత్తేస్తున్నాడు సుమండీ, మీరు చాలా అద్భుతంగా పాడుతారుట. చాలా మనోహరంగా వీణ వాయిస్తారుట. సంగీతంలో మంచి ప్రావీణ్యత ఉందిట మీకు. నాకు మీరు సంగీతం నేర్పుతుందన్నందకు మీకు ఇప్పుడిస్తున్న ఫీజు చాలదట. అందుకే మరీ పోట్లాడి మీకు త్రిబుల్ ఇంక్రిమెంట్లు శాంక్షను చేయించాడు” అంది సుందరి కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ.

“అదా సంగతి? మీ బావ నన్ను పొగిడేసి ఆకాశానికి ఎత్తేయ వచ్చునేమోకాని అతననుకున్నంత గొప్పదాన్ని కాదు నేను. అంత పాండిత్యం నాలో లేదు.”

“ఉంది” అప్పుడే ఆ గదిలోకి అడుగు పెట్టిన మోహను అన్నాడు.

అతని వంక సూటిగా చూడలేక తలదించుకుని కూర్చున్న సరస్వతి ఒక్కసారి దిగ్గున లేచి నిలబడింది.

“కూర్చోండి సరస్వతి గారూ!” అతను అన్నాడు. కుర్చీలో ముళ్ళమీద కూర్చున్నట్లు వొదిగి కూర్చుంది సరస్వతి.

“మీలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి గూర్చి మీరు తెలుసుకోలేకపోతున్నారు. హనుమంతుడుకి అతని శక్తి సామర్థ్యాలు ఇతరులు పొగిడితే కాని తెలియలేదుట. మీ విషయంలోనూ అంతే, మీలో దాగి ఉన్న శక్తిని గుర్తించండి. మీకు తగిన అవకాశం ఇస్తే ఆ శక్తి తనంతట అదే బయటపడుంది. ఆ సంగీత జ్ఞానం పైకి తెచ్చి మా లాంటి కళాప్రియులకి మీరు ఆనందం పంచి పెట్టాలి.”

“నేనంత గొప్పదాన్ని కాదు. నా కన్నా ఎంత మందో గొప్పవాళ్ళు ఉన్నారు.”

“నాకు అంతటి శక్తి సామర్థ్యాలు లేవు అన్న భావం తొలగించుకున్న నాడు, ఆత్మ విశ్వాసంతో జీవిత మార్గంలో ముందుకు అడుగు పెట్టిన నాడు, సాన పెట్టిన వజ్రంలా – శుద్ది చేసిన బంగారంలా ప్రకాశిస్తారు. ఇప్పుడు సినీ ప్రపంచంలో ఉన్న గాయనీమణుల కన్నా మీరు చక్కగా పాడుతున్నారని నేను వొక్కాణించి చెప్పగలను” మోహను స్థిరంగా అన్నాడు.

అతను అలా మాట్లాడుతున్న సమయంలో అతని దవడ ఎముక ఒక్కసారి కధలాడింది. ఆ కధలికను బట్టి అతను ఎంత స్థిరంగా అన్నాడో ఎంత స్థిరంగా చెప్పగలుగుతున్నాడో అంచనా వేయగలుగుతోంది సరస్వతి.

“ఏమో బాబూ! నాలో అంతటి శక్తి లేదు. నేను అంత గొప్పదాన్ని కాదు. నాలో సినీ ప్రపంచం గురించి ఆశలు పెట్టకండి. పరిగెత్తి పాలు త్రాగే కన్నా నిలబడి నీళ్ళు త్రాగడంలో ఉన్న ఆనందం మరిదేని లోనూ లేదని నమ్ముతున్నదాన్ని.”

“అయ్యో! కర్మ! ఆ మాటలే అనొద్దు అంటున్నాను. మీలో దాగి ఉన్న శక్తి మీరు గుర్తించలేక పోతున్నారన్నదే నా బాధ. మీ సంగీత జ్ఞానానికి వెలకట్టలేం. అందుకే సుందరితో పోట్లాడి ఉడుతా భక్తిగా ఈ మాత్రం శాంక్షను చేయించాను. మీ పీజు కూడా ఇది చాలాదు లెండి మీ సంగీత శక్తి దగ్గర…!” నాన్చుతూ అన్నాడు మోహను.

“మీకు నా కృతజ్ఞతలు” సరస్వతి అంది.

“సరూ! ఏంటి ఆలోచిస్నున్నావు?”

సారధి మాటలకి ఉలిక్కి పడి ఆలోచనా ప్రపంచం నుండి బాహ్య జగత్తులోకి అడుగు పెట్టింది సరస్వతి

“లాయరు సత్యమూర్తి గారి అమ్మాయి సుందరికి సంగీత పాఠాలు నేర్పిస్తున్నాను కదా!”

“ఆఁ..! అవును.”

“ఆ సుందరికి కాబోయే భర్త – బావట మోహను. అతనే ఇప్పుడిస్సున్న ఫీజు చాలదని ఎక్కువ ఇప్పించాడు.”

సరస్వతి మాటలు వినగానే సారధి కనుబొమ్మలు క్షణ కాలం ముడిపడి విడిపోయాయి.

“అతను ఇప్పించడేంటిఁ? నీ సంగీత జ్ఞానం గుర్తించి ఫీజు ఇవ్వరా వాళ్ళు?”

“ఇస్తారు. అయితే ఆ మోహనుది విచిత్రమైన స్వభావం. అంతే కాదు విచిత్రమైన మనిషిలా ఉన్నాడు. సంగీత మంటే పడిచస్తాడుట. తను చిన్నప్పుడు కొన్నాళ్ళు సంగీతం నేర్చుకున్నాడుట. నా సంగీత పరిజ్ఞానం గురించి పొగడ్తల వర్షం కురిపించాడు” ఉత్సాహంగా చెప్పుకుపోతోంది సరస్వతి.

సరస్వతి మాట తీరు సారధికి నచ్చలేదు. అందులోనూ ఆమె మనస్తత్వం అతనికి తెలుసు కాబట్టి సారధిలో అనుమాన బీజం మొలకెత్తడం సహజమే. పెళ్ళికి ముందు ఆమె చేసిన హెచ్చరిక అతని చెవుల్లో గింగుర్లు ఆడుతోంది. ఈ మధ్య సరస్వతి మరీ పరధ్యానంగా ఉంటోంది. బహుశ ఆ మోహన్‌తో పరిచయం అయినప్పటి నుండి అవ్వచ్చు. తన దగ్గర ఈ మధ్య రెండు మూడు పర్యాయములు ఆ మోహను ప్రస్తావని తెచ్చింది కూడా. తన కన్నా ఉన్నతుడు అగుపడ్తే చలిచే మనస్తత్వం సరస్వతిది ఇలా ఆలోచిస్తున్నాడు సారధి.

‘తను ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు? ఆమెకి ఏ లోటు రానీకుండా తను చూసుకుంటున్నాడు. అంతే కాదు, సరస్వతి కన్న బిడ్డకి అన్యాయం చెయ్యదు. తనని అన్యాయం చేయదు. తనే సంకుచితంగా ఆలోచిస్తున్నాడు’ ఇలా సాగిపోతున్నాయి సారధి ఆలోచన్లు.

అతను అలా ఆలోచించడానికి కారణం ఉంది. పెళ్ళికి ముందు ఆమె అన్న మాటలు అతని చెవిలో గింగిర్లు ఆడుతున్నాయి. ఆమె చంచలత్వం – తెంపరితనం అతనిలో అపనమ్మకం కలిగించడానికి కూడా ఒక కారణం అవచ్చు.

“ఆ మోహన్‌ని అంతగా ఆకాశానికి ఎత్తి వేస్తున్నావే!” చిన్నగా నవ్వుతూ అన్నాడు సారధి.

అతని మాటల్లో ఆమెకి వ్యంగ్యం అగుపించింది. ఒక్క సారి ఆమె వదనం చిన్న బోయింది. కనుబొమలు ముడుచుకున్నాయి. ముఖంలో కళ తప్పింది.

“మీరు నన్ను అనుమానిస్తున్నారా! మీలో ఇలాంటి ఆలోచన్లు వచ్చేయంటే దాని ఫలితం చెడుగా ఉంటుంది. మీ కంతగా ఇష్టం లేకపోతే నేను సంగీతం నేర్పడానికి వెళ్ళను” ముఖం ముడుచుకుని చిటపటలాడూ విస విస నడుచుకుంటూ అచటి నుండి కదిలిపోయింది సరస్వతి.

“సరూ…. సరూ….!” అని సారధి పిలుస్తున్నాడు.

‘నా మనస్సులో అలాంటి ఆలోచన్లు లేవు. ఏ అనుమానాలూ లేవు. నీవు అపోహ పడ్తున్నావు’ అని గట్టిగా అరిచి చెప్పాలనుకున్నాడు కాని అలా చేయలేక పోయాడు. అతని నోరు పెగల్లేదు.

10

ప్రతీ మనిషిలోని కొన్ని బలహీనతలు ఉంటాయి. ముఖ్యంగా ఆడదానిలో ఉన్న బలహీనతను ఆసరాగా తీసుకుని పబ్బం గడుపుకోడానికి ప్రయత్నం చేస్తారు స్వార్థపరులైన కొంత మంది మగవారు. అటువంటి మగవాళ్ళులో మోహను ఒకడు.

సరస్వతిని చూడగానే “అబ్బా! ఎంత అందంగా ఉంది” అని అనుకున్నాడు. ఆమెతో మాటలు కలిపిన మరుక్షణమే పొగడ్తలకి లొంగిపోయే శాల్తీ అని అనుకున్నాడు. తన పొగడ్తలకి ఆమె నుండి ఎలాంటి రెస్పాన్సు వస్తుంది. ఆమె హదయం ఎలా స్పందిస్తుంది అని అంచనా వేయ గలుగుతున్నాడు. సరస్వతి భావాలు అర్థం చేసుకుంటున్న అతను పరవాలేదు తన దార్లోకి రావడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు అనుకుంటూ తృప్తిగా నిట్టూర్పు విడిచాడు.

తనకు ఆ భగవంతుడు రూపానికి తోడు వాక్ చాతుర్యం కూడా ఇచ్చాడు. ఆ గుణంతోనే ఎంత మంది ఆడవాళ్ళ జీవితాల్లో తను ఆటలాడుకున్నాడు. అనుభవించి – ఆనందించి వదిలేసాడు. క్రొత్త రుచులు కోసం పరుగులు పెడుతున్నాడు.

‘తను అందగాడు – సరస్వతి అందగత్తె. ఆమె ప్రక్క తనుంటే తమ జోడీ ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ఆమె భర్త మీద తనకి అసూయ కలుగుతోంది. ఒక్కొక్క పర్యాయం ఆమెను భర్త నుండి వేరు చేసి తను దక్కించు కోవాలన్న ఆలోచన కూడా వస్తోంది’ ఇలా సాగిపోతున్నాయి మోహను ఆలోచన్లు.

వెను వెంటనే సుందరి రూపం అతని కళ్ళెదుట కదలాడింది. చేదు మాత్ర మ్రింగినట్లు ముఖం పెట్టాడు. అయితే ఆమె వెనుకనున్న ఆస్తిపాస్తులు, ఆమె తండ్రి పలుకుబడిని తలుచుకోగానే తీపిని తిన్నంతగా ఆనంద పడిపోయాడు.

‘అవును తను ఈ రోజున ఈ స్థానంలో ఉన్నాడంటే, దానికి కారణం మామయ్యే’. అతనిలో స్వార్థం ఉండచ్చు. తనలో కూడా స్వార్థం ఉంది. ఉన్నతస్థాయికి ఎదగాలన్న స్వార్థం తనలో ఉంటే, అవిటికూతుర్ని తనకి అంటగట్టి తనని ఇల్లరికం అల్లుడ్ని చేసుకోవాలన్న స్వార్థం మామయ్యది. అందమైన మొగుడ్ని పొందాలన్నదే సుందరి స్వార్థం. అందుకే తనని ఆదుకోమని తండ్రికిచ్చిన సలహాలో కూడా స్వార్ధం తొంగి చూస్తోంది. మానవుల మనస్తత్వం లోనే కాక ప్రకృతిలో కూడా ఈ స్వార్ధం తొంగి జూస్తోంది.

కాలింగ్ బెల్ మ్రోగడం, నౌకరు అప్పన్న చేస్తున్న పని వదిలి వెళ్ళడం ఒకే పర్యాయం జరిగాయి. మోహన్ స్నానం చేసి టెర్రస్ పైన బట్టలు ఆరవేస్తున్నాడు. ఆ సమయంలో నౌకర్లున్నా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అన్న గాంధీ గారి ఆ ఒక్క సిద్ధాంతమేనా ఆచరిస్తున్న – ఆచరించాలన్న ఉబలాటం ఉన్న వ్యక్తి అతను.

“చిన్నమ్మ గోరూ ఆల్లూ ఇంటికాడ నేరు, ఆల్లు బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే ఎల్లారు. సినబాబు గోరే ఉన్నారు ఇంటి కాడ” అప్పన్న చెప్తున్నాడు. సరస్వతి ఆ మాటలు విని వెనక్కి తిరిగింది.

“అప్పన్నా! ఆ సంగీతం మాష్టారమ్మను పిలు. మాట్లాడాలి”

మోహను ఆజ్ఞాపన విని చిన్నగా నవ్వుకున్నాడు అప్పన్న. ఎందుకేంటే మోహను అభిరుచులు అతనికి బాగా తెలుసు. ‘ఈ కాలం కుర్రకారులవి మరీ ఇసిత్రమైన మనసలు. పొరిగింటి పుల్లకూర రుసి’ చిన్నగా గొణుక్కున్నాడు.

“అమ్మగోరూ! సినబాబు గోరు మిమ్మల్ని పిలుస్తున్నారు” అన్నాడు అప్పన్న సరస్వతితో.

ముందుకు గబగబా అడుగులేస్తున్న సరస్వతి కళ్ళెం పట్టి వెనక్కి లాగిన గుర్రంలా ఠక్కున ఆగిపోయింది.

“ఎవరు?” కనుబొమలు ప్రశ్నార్థకంగా ముడిచి అడిగింది.

“అదేనండీ! మన మోహన్ బాబు గారు.”

“డాక్టరు గారా?”

“అవును.”

వెళ్ళాలా, వద్దా అని తటపటాయిస్తు ఒక్క క్షణం అక్కడ నిలబడింది సరస్వతి.

‘తనతో అతనికేం పని? తలతో మాట్లాడవల్సిన విషయాలు అతనికేం ఉంటాయి? అందులోనూ ఒంటరిగా ఉన్నాడు. ఇటువంటి సమయంలో తను వెళ్ళడం బావుండదు’ అని సరస్వతి ఆలోచిస్తోంది.

‘పిల్చిన తరువాత వెళ్ళకపోవడం కూడా బాగుండదు. సభ్యత అనిపించుకోదు. ఇలాంటి సమయంలో నమ్మకం ప్రాధాన్యమైనది. తన నమ్మకం ఎప్పుడూ తనని మోసగించలేదు. అతను కూడా సంస్కారవంతుడు. చదువుకున్నవాడు. తను కూడా ఆ మాత్రం, ఈ మాత్రం చదువుకుంది! అతనేం చెడ్డవాడు కాదు. సరదా మనిషి అంతే, చాలా తమాషాగా మాట్లాడుతాడు, పైపెచ్చు సంగీతాభిమాని, తన ఫీజు ఎక్కువ చేయడానికి దోహదపడిన వ్యక్తి. అతనికి తనే కృతజ్ఞత తెలియజేసింది కూడా’ అలా ఆలోచిస్తూనే లోనికి అడుగులు వేసింది సరస్వతి.

అలా వెళ్తున్న ఆమె వంక జాలిగా చూస్తున్నాడు అప్పన్న. అతని భావాల్ని అవలోకించి, అర్థం చేసుకునే స్థితిలో లేదు ఆమె.

ఆ సమయంలో అప్పన్నకి మోహను దీపంలాగ అగుపడే, సరస్వతి ఆ దీపం వెలుతురుకి ఆకర్షింపబడి, ఆ దీపం చుట్టూ తిరుగుతూ ఆ దీపంలో పడి మాడి మసి అయిపోయిన దీపం పురుగులా అగుపించింది. అంతే కాదు అప్పుడే విచ్చుకున్న పువ్వులోని మకరందాన్ని గ్రోలాలనే కాంక్షతో పువ్వుచుట్టూ పరిభ్రమించే తుమ్మెదలా కూడా మోహను అప్పన్నకి అగుపించాడు. వాళ్ళిద్దర్నీ ఇలా రకరకాలుగా ఊహించుకుంటూ నిట్టూర్పు విడిచాడు.

‘సిన బాబు గోరి సంగతి తనకి బాగా నెరుక, మందు సీసాలు, ఐసు ముక్కలు, నెయ్యి వేయించిన మసాలా జీడి పప్పు పలుకులు, ఇవన్నీ తను అతనికి సప్లై చేస్తూ ఉంటాడు. కులమింటి ఆడాల్ల మీద తొందర పడి సేయి వేసి సెంప దెబ్బ కూడా తిన్నాడు’ ఇలా సాగిపోతున్నాయి అప్పన్న ఆలోచన్లు. అతని ఆలోచనతో తనకేం సంబంధం లేనట్లు కాలం వెన్న పూసలా కరిగిపోతోంది.

బిక్కు బిక్కుమంటూ, ఒక్కొక్క అడుగూ నెమ్మదిగా వేస్తూ ముందుకు వెళ్తోంది సరస్వతి.

చేయి ఊపి “మేడ మీదకి రండి” అన్నాడు మోహను చిరునవ్వుతో. అతని ఆ నవ్వుతో ఎదుటి వాళ్ళని మైమరిపించే సమ్మోహక శక్తి ఉంది.

చిరు చెమటలు పట్టగా కంపిస్తున్న శరీరంలో తడబడ్తున్న అడుగులలో ఆమె డాబా మీదకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతోంది.

ఆమె తడబాటుని గుర్తించిన అతను “ఎందుకలా భయపడున్నారు? సంశయిస్తున్నారు? నేనేం మిమ్మల్ని తినెయ్యను లెండి” గలగలమని నవ్వుతూ అన్నాడు.

11

అసలే సరస్వతి టెంపర్ మనస్తత్వం, కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడుతుంది. నిర్భయంగా ఉంటుంది. అటువంటి ఆమె కూడా ఈ సమయంలో అతని ఎదురుగా నిలబడి మాట్లాడ్డానికి బిడియ పడింది. ఆమె మనస్సులో ఏదో అలజడి. ఆ గదిలో ఉన్న వాతావరణం, పరిసరాలు – అక్కడ వైభవం ఆమెను ఉద్విగ్నతకు గురిచేస్తున్నాయి. ఆ ఎయిర్ కండీషను రూమ్ చాలా చల్లగా ఉండి ఆమె మనసుని – నరాల్ని ఉత్తేజపరుస్తోంది. గోడలకు చుట్టూరా ఉన్న ప్రకృతి చిత్రాలు ఆమెను ఆకట్టుకుంటున్నాయి.

“మీరు ప్రకృతి ఆరాధకులా? ఆ చిత్రాలని చూస్తున్నారు?” ఆమె దృష్టిని మరల్చడానికి అన్నాడు అతను. చిత్రాల పై నుండి ఆమె దృష్టి అతని వైపు మళ్ళింది.

“నిజమే! కళాకారులకి – కళాభిమానులకి ప్రకృతి అంటే చాలా ఇష్టం -వీళ్ళు ప్రకృతిని ఆరాధించడం సహజమే” తిరిగి గలగల నవ్వుతూ అన్నాడు అతను.

పువ్వుల లుంగీ ధరించిన అతని మిగతా శరీర భాగమంతా నగ్నంగా ఉంది. పచ్చని ఎత్తైన అతని వక్షస్తలం మీద నల్లని తివాసీ పరిచినట్లు వెండ్రుకలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి. కసరత్తు చేసిన శరీరం కండలు తిరిగి ఉంది. అందమైన అతని ముఖానికి కోర మీసం మరింత అందాన్ని తెచ్చి పెడుతోంది. ఉంగరాలు తిరిగిన ముంగురులు పచ్చటి అతని పాలభాగంపై పడి ఉండి గండు తుమ్మెదల్ని జ్ఞప్తికి తెస్తున్నాయి.

తన వంక ఆసక్తిగా చూస్తున్న ఆమె చూపులు ఆమె వాలకాన్ని చూసి ‘పరవాలేదు తన దార్లోకి వస్తోంది’ అనుకుంటూ తృప్తిగా నిట్టూర్పు విడిచాడు మోహను.

“నాకు దిష్టి పెడున్నారా!” అతను చిలిపిగా నవ్వుతూ అన్నాడు. అతను అప్పుడే స్నానం చేసి వచ్చాడు. సబ్బు తాలూకా మంచి సువానస దానితో మిళితమైన పౌడరు వాసన ఆ గదిలో గుబాళిస్తోంది. అతని మాటలకి ఆమె సిగ్గు పడి చటుక్కున తన చూపుల్ని మరల్చుకుంది.

“మీ గురించి సుందూ అంతా చెప్పింది” అన్నాడు అతను.

‘తన గురించి సుందరేం చెప్పి ఉంటుంది చెప్మా!’ ఆలోచిస్తుంది సరస్వతి అంతరంగం.

“కూర్చోండి” ఎదురుగా సోపా చూపించాడు. సోపాలో ఆసీనురాలైంది ఆమె.

“మీకో అబ్బాయి ఉన్నాడు కదూ!”

తలూపింది సరస్వతి అతని మాటలకి,

“మీకు అబ్బాయి ఉన్నాడంటే నమ్మశక్యంగా లేదు. చాలా యంగ్‌గా ఉన్నారు. చెప్పాలంటే మీరు కన్నెపిల్లంటే ఇట్టే నమ్మేస్తారు” ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో ఎవరి బలహీనతలు ఏవో, ఎవర్ని ఎలా లోబర్చుకోవాలో, ఆడదాన్ని ఎలా ఆకట్టుకోవాలో కిటుకు తెల్సిన మోహను అన్నాడు.

పొగిడితే పొంగిపోయే గుణం కొంతమంది ఆడవాళ్ళలో అగుపడుతుంది. ఎదుటి వారి నుండి ప్రశంసలు అందుకోవాలి, ఎదుటి వారి దృష్టిలో ప్రత్యేక స్థానం సంపాదించాలన్న తహతహ కొంత మందికి ఉంటుంది. ఆ కోవకి చెందినదే సరస్వతి. ఆమె సంగతి వేరే చెప్పాలా? ఆమె స్వభావమే వేరు. అందగాడు – ఐశ్వర్యవంతుడు – విద్యావంతుడు అయిన మోహను తనని అలా పొగుడూతూ ఉంటే ఆ పొగడలకు బానిస అవుతోంది ఆమె.

ఆమె అంతరంగంలో అలజడి ఆరంభమయింది. సారధిని – మోహన్‌ని, సరి పోల్చుకుంటోంది సరస్వతి. తన భర్త మోహన్‌కి ఎందులోనూ సాటిరాలేడు. అడుగడుగునా సమస్యలు దానికి తోడు లేమి, వీటి నడుమ నలిగిపోతున్న తన జీవితంపై హ్యేయ భావం కలగసాగింది. ఆమెకి మరో జన్మంటూ ఉంటే దనవంతుల ఇంట్లో పుట్టాలి. పెళ్ళాడితే మోహను లాంటి వాడ్ని చేపట్టాలి. తన జీవితం ఉంది. ఎందుకు? సుఖమా? సంతోషమా? ఓ ముద్దూ ముచ్చటా? సమస్యలో సహజీవనం చేయాలి. తనకి ఇలాంటి జీవితం గడపాలంటే కంపరం కలుగుతోంది. రెక్కలు జాచుకుని స్వేచ్ఛగా ఎగిరిపోవాలనిపిస్తుంది ఒక్కొక్క పర్యాయం.

“ఏంటోఁ అంత గంభీరంగా ఆలోచిస్నున్నారు? వైరాగ్యమంతా మీ ముఖంలో తాండవిస్తోంది. ఇంత చిన్న వయస్సులోనే వైరాగ్యం మంచిది కాదు” గలగల నవ్వుతూ అన్నాడు మోహను.

“అబ్బే… ! ఏఁ లేదు” సర్దుకుని కూర్చుంది. సరస్వతి. అతి చనువుగా మాట్లాడుతున్న అతని మాటలు ఆ సమయంలో ఆమెకు చిరాకనిపించటం లేదు. .

“మీరు చాలా అందంగా ఉంటారు. చాలా కమ్మగా పాడుతారు. మీరు కనక సినీ ఫీల్డులో ఉంటే హీరోయన్ చాన్సు లభించేది. ఆ పీల్డులో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు, గాయణీమణులు మీ కాలి గోటికే సరిపోరు” అతను మాటలు ఆపుచేశాడు.

అతని మాటలు ఆమెకి పంచదార గుళికల్లా తియ్యగా ఉన్నాయి.

“నిజంగానా?” అని మనస్సులో అనుకుంటున్నారు కదూ!” అతను విచిత్రంగా నవ్వుతూ అన్నాడు.

‘తన మనస్సులో మాట ఈయన కెలా తెల్సు చెప్మా!’ ఆలోచిస్తోంది సరస్వతి.

“ఎదుటి వాళ్ళ ముఖ భంగిమలను బట్టి వాళ్ళ మనస్సులో మాట – ఉద్దేశాలు ఇట్టే పసిగట్టే స్వభావం నాది” అన్నాడు అతను.

అతని మాటలు ఆమె వింటోంది, కాని ఆమె మనస్సు మాత్రం వేరే లోకాల్లో విహరిస్తోంది.

“నా మాటలు మీరు వినటం లేదు” చిరాకు అతని కంఠంలో తొంగిచూసింది.

ఆలోచనా ప్రపంచం ఉండి బయట పడిందామె, “లేదు…. లేదు…! వింటున్నాను. చెప్పండి” అంది.

అతని మెడలో బంగారు గొలుసు, రెండు చేతుల వేళ్ళకీ ఉన్న బంగారపు ఉంగరాలు తళుక్కుమన్నాయి. అతని ఐశ్యర్యాన్ని అంచనా వేస్తోంది సరస్వతి అంతరంగం.

“మీకు సినిమాల్లో పాడాలని ఉన్నా – నటించాలని ఉన్నా నాతో చెప్పండి. నేను రికమండేషను చేస్తాను” అతని మాటలు వింటున్న ఆమె విప్పారిన నయనాలతో అతని వేపు చూసింది.

“అబ్బా! ఇతనికంత పలుకుబడి ఉందా? అని ఆలోచిస్తున్నారు కదూ!” కళ్ళు చిట్లించి గలగల నవ్వుతూ అన్నాడు మోహను.

అతని మాటలకి ఒక్కసారి కంగారు పడింది సరస్వతి. తన భావాల్ని బయట పడనీయకుండా జాగ్రత్త పడ్డాన్ని ప్రయత్నం చేస్తోంది.

“మీ కంత పలుకుబడి ఉందా?”

“యస్!”

“నా కన్నా మించిన వాళ్ళున్నారు. నా కంత అదృష్టమా?”

ఆమె మాటలకి గది దద్దరిల్లేటట్లు నవ్వాడు మోహను.

“మీరు పొరబడున్నారు. సినీ ఫీల్డులో మహానుభావులే పాడక్కరలేదు. ఆ మాత్రం ఈ మాత్రం పలుకుబడి పరపతి ఉండి వ్యక్తిత్వానికి విలువ ఇవ్వడం మానేసిన ప్రతీ ఒక్కరూ రాణిస్తారు. ఇదంతా మీ కెందుకు? మీకు ఇష్టం ఉందా, లేదా అన్నది మొదట చెప్పండి. నేను అన్నీ చూసుకుంటాను.”

“మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు.”

“చెప్పడం మానేయండి” అని గలగల నవ్వుతూ ఆమె అంగీకారానికి ఆనంద భరితుడైన మోహను ఒక్క సారి లేచి సరస్వతి చేతిని నెమ్మదిగా తన చేత్తో వత్తాడు. ఈ హఠాత్పరణామానికి ఆమె నివ్వెరబోయింది.

అతని అతి చనువు ఆమెను కలవర పెట్టింది. బెరుకు బెరుకుగా అతని వంక చూసింది. ఆమె పరిస్థితిని గమనించిన మోహన్ నొచ్చుకున్నట్లు నటిస్తున్నాడు.

‘క్షమించడండి సరస్వతి గారూ! ఆనందం అవదుల దాటడం వల్ల ఏం చేస్తున్నానో తెలుసుకోలేని పరిస్థితిలో అతి చనువుగా ప్రవర్తించాను” అతని వదనంలో పశ్చత్తాప భావన తొంగిచూసింది. అది చూసి ఆమెలో కలవరపాటు తగ్గి మామూలు మనిషి అయింది. ‘కొంత మంది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భావోద్రేకాలకి లోనయి అలా ప్రవర్తిస్తున్నారు. మనిషి అయితే భోళా మనిషే’ అని అనుకుని ఆమె తన మనస్సుకి సర్ది చెప్పుకుంది.

ఆమె మాట్లాడక పోవడం చూసి తిరిగి “క్షమించండి” అన్నాడు.

“పరవాలేదు. ఎవరి వల్లనేనా పొరపాట్లు జరగడం సహజమే. నేనేమీ తప్పుగా అనుకోవటం లేదు.” అంది.

“ఒక్క మాట”.

“ఏమిటి?”

“రేపు నా పుట్టినరోజు. ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి సుందరి, మామయ్య, అత్తయ్య వాళ్ళ దగ్గరో లేకపోతే మా కుటుంబ సభ్యుల దగ్గరో జరుపుకునే వాడిని. ఈ సారి మాత్రం ఒంటరిగా ఈ పుట్టినరోజుకి పార్టీ జరుపుకేనే పరిస్థితి వచ్చింది. ప్రతీ పుట్టిన రోజుకి నా స్నేహితులకి ఆప్తులకి పార్టీ ఈయడం నాకు అలవాటు. మీరు మరోలా భావించకుండా ఉంటే రేపు సాయంత్రం హోటల్ అజంతాలో మీకు నేను పార్టీ ఇస్తాను. మీరు కాదనకూడదు – రాననకూడదు. ప్లీజ్! అంతే కాదు మరో విషయం” రహస్యం చెప్తున్నట్లు అన్నాడు మోహను.

“ఏంటీ?”

“సినిమా తీస్తున్న నా స్నేహితుడ్ని కూడా ఈ పార్టీకి ఆహ్వానిస్తున్నాను. అతనికి పరిచయం చేస్తాను. మీరు తప్పకుండా రావాలి…!” అభ్యర్థిస్తున్నట్లు ముఖం పెట్టాడు.

అతని చుట్టూరా తాను అల్లుకున్న ఆశల వలయం ఒక్కసారి సరస్వతి కళ్ళలో మెదిలింది. తమ సినిమాలో పాడబోతుంది అన్న భావన ఆమె శరీరాన్ని పులకరింపచేసింది. దానికి కారకుడయిన మోహను వంక కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ “సరే!” అంది సరస్వతి. అతను ఆనందంతో తబ్బిబ్బు అయ్యాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here