ఎండమావులు-5

0
8

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది అయిదవ భాగం. [/box]

12

హోటల్ అజంతా దగ్గర పోర్టికోలో ఖరీదైన కారాగింది. అందులో నుండి రాజకుమారుడిలా దిగుతున్నాడు మోహన్. సరస్వతి అంతకు పూర్వమే అక్కడికి వచ్చి అతని కోసం ఎదురు చూస్తోంది.

“గుడ్! మీ లాగ పంక్చువాలిటీ మెయిన్‌టైన్ చేసిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వచ్చారా! మీరు రారేమో అని అనుకున్నాను” కళ్ళనిండా ఆనందం నింపుకుని అన్నాడు. అంత తొందరగా తన మాటల గారడీకి లొంగిపోయి ఆమె వస్తుందని మోహను అనుకోలేదు. అయితే ఆమె రావడం చూసి తన పని ఎంతో కష్టపడకుండా నెరవేరుతుందన్న సంతోషం, తృప్తి అతని వదనంలో కదలాడుతున్నాయి.

“రండి!” కారు వైపు నడుస్తూ అన్నాడు మోహను.

“అదేంటి? హోటల్ అజంతాలో పార్టీ ఇస్తానన్నారు? సినిమా తీస్తున్న మీ స్నేహితుడ్ని పరిచయం చేస్తానన్నారు” ఇలా అడుగుతున్న ఆమె కంఠంలో కుతూహలం, సందేహంతో పాటు కంగారు కూడా అగుపించింది.

ఆమె వాలకం చూసి ఓ మారు చిరునవ్వు నవ్వాడు అతను. ఆ నవ్వు ఆమెకి గిలిగింతలు పెట్టింది. “మా ఫ్రెండ్‌కి అర్జంటు పని ఉందట. అందుకని అతను రావటం లేదు” అన్నాడు.

“అలాగా!” ఆమె కంఠంలో నిరాశ తొంగి చూసింది.

“మీరు నిరాశ పడే అవసరం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా మా వాడ్ని మీకు పరిచయం చేస్తాను. మీకు ఆ భరోసా ఇస్తున్నాను. మొదట హోటల్ అజంతాలోనే మీకు పార్టీ ఇద్దామనుకున్నాను. అయితే మా స్నేహితుడు రాక పోయేసరికి నా మూడ్ మారిపోయింది. ఇంటి దగ్గరే పార్టీ ఇవ్వడానికి ఎరేంజ్ చేస్తాను” అన్నాడు మోహను.

“ఇంటి దగ్గరా!” ఆమె గొంతుకలోని – వదనంలోని కలవర పాటు కలిగించే మాటలు, భంగిమలు అగుపించాయి. ‘ఆందోళనపడ్తోంది’ ఆమె స్థితిని పరిశీలిస్తున్న అతను అనుకున్నాడు.

“మీకేం భయం లేదు. నేను హామీ ఇస్తున్నాను” భరోసా ఇస్తున్నట్లు మాట్లాడేడు అతను.

“అబ్బే! అలాంటిదేం లేదు” తన భావాల్ని కప్పి పుచ్చుకుంటూ అంది సరస్వతి.

ఆమె అతని వెనుక నడుస్తోంది. అలా నడుస్తూ ఉంటే ఆమెకి ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ భావోద్వేగాలు, ఆనందాలు, అన్నీ తాత్కాలికమే అన్న ఆలోచన ఆ సమయంలో ఆమెకి రాలేదు.

అతను కారు డ్రైవ్ చేస్తూ ఉంటే, అతని ప్రక్కన కూర్చున ఆమెకి మహా సంతోషంగా ఉంది. మధుర స్వప్నంలో మునిగి తేలుతున్నట్టుంది ఆమె వాలకం. అతని పరిస్థితీ అంతే ఓ అందమైన ఆడది తన స్వంతం కాబోతోంది. అన్న భావన అతనిలో గర్వాన్ని కలిగిస్తోంది. వెను వెంటనే సుందరి రూపం అతని మనో నేత్రం ఎదుట కదలాడగానే ఇబ్బందికరంగా ముఖం పెట్టాడు అతను.

అతని ముఖ కవళికలు గమనించిన సరస్వతి కారణం అడిగింది. మాట మారుస్తూ రోడ్డు మీద భిక్షమెత్తుకుంటున్న యాచకురాల్ని చూపిస్తూ “ఆ యాచకరాలి రూపం ఎంత అసహ్యంగా ఉందో చూడండి. చూడ్డానికి గగుర్పాటు కలిగిస్తోంది” అని అన్నాడు. ఆమె ఆ భిక్షగత్తెను చూసింది. శుష్కించి అతి నీరసంగా, వయస్సుకి మించిన ముసలితనంలో అగుపించింది. ఇప్పుడు అలా ఉంది కాని ఒకానొకప్పుడు ఆమె కూడా అందంగానే ఉండేది అని అనిపించింది సరస్వతికి.

ఆ యాచకురాలు సరస్వతి వేపు తీక్షణంగా చూస్తోంది. ఆ చూపులు తట్టుకోలేక సరస్వతి తన చూపులు ప్రక్కకి మరల్చుకుంది. ‘వంచనకి గురై, శుష్కించిన, వడలిపోయిన పువ్వులా జీవచ్చవంలా బ్రతుకుతున్నాను నేను ఇప్పుడు. నాలాగే నీవు కూడా కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తే నాలాగే గడ్డి పువ్వులా మిగిలిపోతావు’ అని తనని హెచ్చరిస్తున్నట్లున్నాయి ఆ భిక్షగత్తె చూపులు అని అనుకుంది సరస్వతి.

అంతే కాదు ఆ భిక్షగత్తె చూపుల్లో అనేక భావాలు ఆమెకి అగుపించాయి. ‘నీ ప్రక్కనున్న మగవాడు నీ భర్త అయితే పరవాలేదు. నీ అంత అదృష్టవంతురాలు లేదనుకుంటాను. నీ జీవితం పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటాను. అదే వంచకుడయితే ఆ తళుకు, బెళుకులకి, ఆ మెరుగులకి వెలుగు జిలుగులకి, ఆ ప్రకాశానికి భ్రమపడి దీపం పురుగు అవబోకు’ అని హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తోంది.

వెలుతురు ప్రకాశానికి ఆశపడి దీపం చుట్టూరా తిరుగుతుంది దీపం పురుగు. ఆ సమయంలో దానికి ఆ మంటలో పడి దగ్గమయి పోతానన్న ఆలోచన ఉండదు. ఆ ఆకర్షణే దాని ప్రాణాలు తీస్తుంది. అలా దీపం పురుగువి అవకు నీవు. సర్వనాశనం అవకుండానే దూరంగా పారిపో, నీ అస్తిత్వాన్నిఉనికిని కాపాడుకో. అతని నీడ నీమీద పడనీయకు. అతడ్ని నీ దరిదాపులకి రానీయకు అన్నట్లు ఆ బిక్షగత్తె చూపులు సరస్వతిని హెచ్చరించాయి.

అయితే మోహన్ భావాలు ఆ యాచకురాల్ని చూడగానే మరోలా ఉన్నాయి. అతను ఆ యాచకురాల్ని చూడగానే ముఖం చిట్లించాడు. అతని వదనంపై అసహ్యభావం తొంగిచూస్తోంది. అతని భావాల్ని గమనిస్తున్న సరస్వతి ఇతను పేదరికాన్ని, పేదవాళ్ళని అసహ్యించుకుంటాడు. వాళ్ళ ఉనికిని సహించలేడు. అలా అయితే తను పేదరాలే, ముందు ముందు నన్ను కూడా ఇతను అలాగే అసహ్యించుకుంటాడా? తన అవసరం తీరిన తరువాత తన పరిస్థితి ఇంతేనా ఇలా సాగిపోతున్నాయి సరస్వతి ఆలోచన్లు. ఎవ్వరి ఆలోచన్లతో సంబంధం లేనట్లు బెంజ్ కారు ముందుకు సాగిపోతోంది.

13

సాయం సమయ సంధ్య చీకట్లు నలుదిశలా పరుచుకుంటున్న వేళ ఆ బెంజ్ కారు జర్రిపోతులా మెలికలు తిరిగిన తారు రోడ్డు మీద జర్రున జారుకుంటూ ముందుకు దూసుపోతోంది. మోహన్ అతి మెలుకువుగా కారు డ్రైవ్ చేస్తూనే మిర్రర్‍లో సరస్వతి ముఖకవళికలు పరిశీలిస్తున్నాడు.

ఖరీదైన ఆ వాహనంలో ఖరీదైన మనిషి ప్రక్కన కూర్చుని ప్రయాణం చేస్తున్నానన్న భావం ఆమెలో ఒకింత గర్వాన్ని కలిగిస్తోంది. లిప్తకాలం గర్వరేఖ కూడా ఆమె వదనంతో తళుక్కుమని మాయమయింది. ఆ స్థానంలో బెరుకు, కంగారు. అనేక రకరకాలయిన సందేహ భావాలు ఆమె చుట్టూ అల్లుకుంటున్నాయి.

వాహనాన్ని నడుపుతూ అతను ఆమెకు ఏవో చెప్పుకుపోతున్నాడు. ఆమె అన్యమనస్కురాలై వింటోంది. ఆమె మనస్సు అతని మాటలు మీద లేదు.

“మీరు నా మాటలు వినటం లేదు” అతని గొంతుకలో చిరాకు అగుపించింది.

“వింటున్నాను” అంది సరస్వతి.

కారు సడన్‌గా ఆగింది. బయటకు ఆమె తొంగి చూసింది. ఎదురుగా రాజుగారి కోటలాంటి ఉన్నత భవనం అగుపించింది. అది గెస్టు హౌస్ అని గుర్తించింది ఆమె. అతను కారు దిగాడు. ఆమె కూడా దిగింది. కారును షెడ్డులో పెట్టిన తరువాత అతను ఆమె దగ్గరకు వచ్చాడు.

వాళ్ళిద్దరూ అలా రావడం చూసి గెస్టు హౌస్ దగ్గర ఉన్న నౌకర్లు గుసగుసలాడుతూ వ్యంగ్యంగా చాటుగా నవ్వుకుంటున్నారు. అయితే పైకి మాత్రం తమ భావాల్ని వ్యక్తం చేయలేదు. వాళ్ళకి ఆ ధైర్యం లేదు. తమ యజమానికి కాబోయే అల్లుడుగా గౌరవం ఇస్తున్నారు. లేకపోతే మోహన్‌ని ఏనాడో నిలదీసి ఉండేవారు.

అయితే నౌకర్లు వ్యంగ్యంగా గుసగుసలాడుకోవడం, నవ్వుకోవడం మోహన్ గమనిస్తున్నాడు. నౌకర్లు మీద అతనికి చెప్పనలవి కానంత కోపం వచ్చింది. అయితే ఇప్పుడు తన కోపం చూపించే సమయం కాదు కాబట్టి అతను తమాయించుకున్నాడు. దేన్ని లెక్క చేయనట్లు నిర్లక్ష్యంగా ముందుకు అతను అడుగులేస్తుంటే యాంత్రికంగా అతడ్ని అనుసరించింది సరస్వతి.

గది తాళం తీసి “రండి” అని అతను ఆమెను ఆహ్వానించాడు. చల్లగా ఉన్న ఎ.సి.రూమ్ లోకి అడుగు పెట్టిన సరస్వతికి నరకంలో నుండి స్వర్గంలోకి అడుగు పెట్టినంత అనుభూతి కలిగింది. ఆనంద తరంగాలు హృదయంలో ఉవ్వెత్తున ఎగిసి పడ్తూ ఉంటే గదిని కలయజుడసాగింది.

గదిని పరిశీలనగా చూస్తున్న ఆమె తృళ్ళిపడింది. గది గోడల మీద ప్రకృతిని ప్రతిబింబించే చిత్రాలకి బదులు స్త్రీల నగ్న చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఆ చిత్రాలు చూసిన సరస్వతికి సిగ్గు కలిగింది. ఎందుకంటే

స్త్రీకి, పురుషుడికి ఏఏ అవయవాలు ఉంటాయే ఇద్దరికి తెలుసు. అయితే అవి గోప్యమే. అలా ఉన్నపుడే మోజు అలా కాకుండా ఇంత బాహటంగా స్త్రీ నగ్న శరీర చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు ఉంటే ముఖ్యంగా స్త్రీ అయిన సరస్వతికి సిగ్గు కలిగింది. అయితే ఆమె స్థితిని ఓర కంటితో గమనిస్తున్న మోహన్ చిన్నగా నవ్వుకున్నాడు.

“ఆ గోడలకున్న చిత్రాన్ని చూసి నన్ను అపార్థం చేసుకోడానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్. నన్ను నా అభిరుచులు ఆలోచనలు అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి. స్త్రీ అందాన్ని వస్త్రాల మాటున మరుగు పర్చడమంటే నాకిష్టం లేదు” అన్నాడు మోహను.

నీరసంగా సోపా మీద ముడుచుకు కూర్చుంది సరస్వతి.

స్వీట్లు హాట్లు పండ్లు టేబులు మీద ఒక్కొకటే పేరుస్తున్నాడు మోహన్. ప్రిజ్‌లో నుండి హాట్ డ్రింక్స్ సీసాలు, గ్లాసులు, గోల్డ్ స్పాట్ సీసాలు తీసి టేబులు పై ఉంచాడు అతను.

“క్షమించండి. రోజు త్రాగకపోయినా ఫంక్షనులో ఇలాంటి డ్రింక్సు పుచ్చుకుంటూ ఉంటాను. మీకు అభ్యంతరం లేదనుకుంటాను. మీకు గోల్డ్ స్పాట్ త్రాగడానికి ఉంది” అన్నాడు.

సరస్వతి అతని మాటల్ని మౌనంగా వింటోంది.

“అలా గంభీరంగా బిగుసుకు పోయినట్టు ఉన్న వాళ్ళంటే నాకు భలే చిరాకు. గలగల ప్రవహించే సెలమేరులా త్రుళ్ళుతూ నవ్వుతూ ఉండే వాళ్ళంటే నేను ఇష్టపడతాను” అతని గొంతుకలో చిరాకు అగుపించింది.

“సారీ! మా బాబు గురించి ఆలోచిస్తూ మీతో సరదాగా కబుర్లు చేప్పలేకపోతున్నాను. మీ అభిరుచుల్ని అలవాట్లని గౌరవించలేని కుసంస్కారిని మాత్రం కాదు నేను.”

అలా అందే కాని ఆమెకి అక్కడి వాతావరణం ఇబ్బందికరంగా ఉంది. అయితే ఇంత వరకు వచ్చిన తను వెనక్కి వెళ్ళలేదు. ఎలా జరగవల్సింది అలా జరుగుతుంది అని మనస్సుని కూడదీసుకంది.

ఆమె మాటలు క్షమాపణ-భరోసా మిళితమైన భావాలు స్ఫురించే పలుకులు విన్న అతను “థేంక్సు!” అని అన్నాడు. అతనిలో చిరాకు మటు మాయమయింది. ఆ స్థానంలో తిరిగి ఉత్సాహం చోటుచేసుకుంది.

“మీ బాబుకి తల్లిపాలా, పోతపాలా?”

అతని ఆ ప్రశ్న ఆ సమయంలో అసందర్భమైన ప్రశ్నలా తోచింది. అయితే ఏం అనలేక పోయింది. ఆమె వదనంలో సిగ్గుభావం తొంగి చూసింది.

“పోతపాలే!”

“అయితే పరవాలేదు పాలు పట్టడానికి మీరే ఉండక్కర లేదు”

సరస్వతి అతని మాటలుకి జవాబియ్యలేదు. అతను చకచకా ప్లేటులో తాను కట్ చేసిన కేక్ ముక్కలు, స్వీటు-హాట్, ఆపిల్ ముక్కల్ని ఉంచాడు. ప్లేటు ఆమెకి అందించిన తరువాత గోల్డ్ స్పాట్ బాటిల్‌ని కూడా అందించాడు.

ఆమెకు ఎదురుగా ఉన్న సోపాలో కూర్చుని టీపాయి మీదున్న హాట్ డ్రింక్స్, సీసాలో నుండి ద్రవాన్ని గ్లాసులో వొంచుకుని సోడా, ఐసు ముక్కలు వేసి మెల్లగా సిప్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో జీడిపప్పు పకోడిని నముల్తున్నాడు.

“మీరు తినటం లేదు, నోటికి పని కల్పించండి” అన్నాడు మోహన్.

సరస్వతి ఆలోచనల్లో పడింది. సారది దగ్గర కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే తను ఇతని దగ్గర మూగ దానిలా ప్రవర్తిస్తోందేంటి? తను ఇతనికి లొంగిపోతోంది? అతని ఆస్తి, అంతస్తు, అతను తనని ఉన్నత స్థాయికి తీసుకువస్తానని కల్పించిన ఆశలకి దాసోహం అవుతోందా? ఇతని మీద తనకి భక్తా? కృతజ్ఞతా? లేక ఆకర్షణా? ఇలా ఆత్మ విమర్శ చేసుకుంటోంది. తను ఉన్నతంగా సమాజంలో ఎదగాలంటే ఇలాంటి సంఘటల్ని ఎదుర్కోక తప్పదు. అయితే ఒక్క విషయం మోహన్‌లో మాటల చాతుర్యంతో పాటు ఆకర్షణ శక్తి ఉంది. మాటల్లో కమ్మదనం చూసే చూపుల్లో కొంటెతనం తనని బలహీనురాల్ని చేస్తున్నాయి. అతను అయస్కాంత శక్తి అయితే ఆ అయస్కాంత శక్తికి అకర్షింపబడ్డ వస్తువు తను.

“తీసుకోండి” ద్రవాన్ని గొంతుకలో పోసుకుంటూ అన్నాడు మోహన్. గ్లాసులో తేలుతున్న ఐసుముక్కల వేపు చూస్తు తనకిచ్చిన ద్రవాన్ని గొంతుకలో పోసుకుంటోంది. అతని మాటలు తియ్యగా హోమియో మాత్రల్లాంటాయి. అందుకే అతని కోరిక తిరస్కరించలేకపోతోంది.

వగరుగా పుల్లగా ఘాటుగా ఉన్న ఆ ద్రవం గొంతుకలో పడగానే గొంతుక మండినట్టుయింది ఆమెకి. ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆమె గుటకలు వేస్తుంటే అతను మాత్రం ఆ డ్రింకును అమృతం త్రాగినంతగా మహానంద భరితుడై త్రాగుతున్నాడు మోహన్.

“మీరు సంతోషంగా లేరు. దేని కోసమో మథనపడున్నారు” అన్నాడు మోహన్.

“అబ్బే! అదేం లేదు” ఆమె మాటలు ముద్ద ముద్దగా ఉన్నాయి మత్తుగా ఉంది. ఆమెకు ఇచ్చిన డ్రింకులో ఏదో మత్తు మందు కలిపి ఉంటారు.

ఆ పరిస్థితుల్లో కూడా ఆమెకు ‘తను తప్పుచేస్తోందా?’ అని అనిపించింది. మరుక్షణమే అతను తను సినీ ఫీల్డులోకి ఎంటర్ అవడానికి చేయబోతున్న రికమండేషను, తన ప్రసిద్ది గాయినిగా మారుబోతున్న దృశ్యం కళ్ళెదుట నిల్చింది. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదు. ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఇలాంటి సంఘటల్ని ఎదుర్కోక తప్పదు.

“మీలో ఆనందం – హుషారు ఎలా తేవాలో నాకు తెలుసు” నిటారుగా నిలబడి అన్నాడు అతను.

“రండి నాతోను” అతని మాటలు కూడా ముద్ద ముద్దగా ఉన్నాయి. ఓ హాలు లాంటి పెద్దగదిలో హోమ్ ధియోటర్ ఉంది. వినోదం కోసం పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో థియేటర్లు ఉంటాయి అని తను వింది. అందుకే ఆశ్చర్యపోలేదు సరస్వతి.

“కూర్చోండి” సోపా చూపించి అన్నాడు మోహన్. ఆమె కూర్చుంది.

కూచిపుడి నృత్య ప్రదర్శన ఆరంభమయింది, తన్మయత్వంగా చూస్తోంది కాని మత్తులో కళ్ళు ఒక వేపు మూతలు పడుతున్నాయి. సడన్‌గా దృశ్యం మారిపోయింది తెరమీద ఆ తెరమీద కదుల్తున్న దృశ్యాల వేపు చూస్తున్న ఆమె నిశ్చేష్టురాలైంది. స్త్రీ పురుషుల కలయికను వివిధ భంగిమల్లో చూపిస్తున్న ఆ దృశ్యాల్ని చూసి అంత మత్తులోనూ సరస్వతి సిగ్గుపడింది. ఆమె నరాలు జివ్వు మంటున్నాయి.

ఇలాంటి చిత్రాలు గొప్పవాళ్ళింట్లో వేసుకుని వినోదిస్తారని తను వింది. అతని వంక ఓమారు చూసింది సరస్వతి. తెరపై కదుల్తున్న దృశ్యాన్ని చూస్తూ సీసాలో ఉన్న ద్రవాన్ని గొంతుకలో పోసుకుంటున్నాడు. అతని కళ్ళల్లో కనబడున్న నిషా చూసి ఒక్కసారి కంపించింది సరస్వతి.

“నేను ఇక బయలు దేరుతాను” అంటూ లేచింది సరస్వతి.

“సరూ! జస్ట్ వన్ మినిట్! ఆగు” అన్నాడు. అతని ఏకవచన సంబోధన ఆమెకి విచిత్రమనిపించింది అతి చనువు చిరాకు కూడా వేసింది. అతని ముద్దముద్ద మాటల్ని బట్టి అతను ఎంత నిషాలో ఉన్నాడో అంచనా వేస్తోంది. తడబడుతున్న అడుగులో ఆమె దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు.

“సరూ! నాకు కంపెనీ ఈయవూ?” అని అడుగుతున్నాడు.

పెళ్ళయిన సరస్వతికి ఒక్క విషయం మాత్రం అర్థమయింది. అతను పొందుకోరుతున్నాడు. పెళ్ళయిన తనకి లైంగికానుభవం క్రొత్తకాదు. పెళ్ళికాక పోయినా పరాయి స్త్రీలతో లైంగికానుభవం అతనికి క్రొత్తకాదు. అయితే ఇంతవరకు తను తన భర్త దగ్గరే లైంగికానుభవం పొందింది. ఇప్పుడు ఇతను తనతో లైంగికానుభవం కోరుతున్నాడు. అతని మాటల అర్థం ఇదే. అయితే తను ఇతని కోరికకి లొంగి పోవల్సిందేనా? కొత్త ఒరవడి చుట్టింది అవుతుంది తను.

తన ఆశలు ఆశయాలు వేరు తీరని కోరికలో జీవితాంతం బాధపడవల్సిందేనా? వాటిని తీర్చుకోడానికి తనవంతు ప్రయత్నం చేయడంలో తప్పేంటి? తన కోరికలు తీరాలంటే తనకు ఇష్టం లేకపోయినా కొన్నిటి దగ్గర తలవొంచక తప్పదు.

అతని దగ్గరనుండి గుప్పని వాసన వస్తోంది. ఆమెకి అతి సమీపంగా వచ్చాడు మోహను. అతని కళ్ళల్లో కాంక్ష మొండుగా అగుపడ్తోంది. గదిలో ఫేను తిరిగుతున్నా వాతావరణం వేడిగా ఉంది. ఆమె వివాహిత, బిడ్డల తల్లి, సంప్రదాయ కుటుంబం స్త్రీ అన్న ఆలోచన అతనికి ఆ సమయంలో రాలేదు. అతని లక్ష్యం కేవలం ఆ సమయంలో తన లైంగిక వాంచ తీర్చుకోవడమే.

‘తప్పదు. కొద్ది క్షణాలు కళ్ళుమూసుకుని ఏదో విధంగా కాలం గడిపేస్తే అతని వాంఛ తీరుతుంది. తన కోరిక తీరుతుంది. అతని కోరిక తీర్చడం తన ఉజ్వలమైన భవిష్యత్తుకి సోపానం అవుతుంది. అందుకే అతడంటే ఇష్టం లేకపోయినా మనస్సు హృదయం లేని ఓ మర బొమ్మ అయిపోవాలి’ ఇలా ఆలోచిస్తోంది సరస్వతి.

“సరూ….. సరూ…..” అంటూ మీద మీదకు వస్తున్నాడు, తూలుతున్నాడు. అతని అడుగులు తడబడ్తున్నాయి. ఆమెకి చాలా సమీపానికి వచ్చాడు. అతని వెచ్చని ఊపిరి మెడభాగానికి తగులుతోంది. అంతకు పూర్వం తాను తెరపై చూసిన దృశ్యాలు ఒక్కొక్కటి ఆమె కళ్ళెదుట కదలాడుతున్నాయి. ఆ దృశ్యాలు ప్రభావం ఆమెలో కూడా కోరికను పెంచుతోంది.

పరిస్థితుల ప్రభావం మనిషి జీవితంపై అపారంగా ప్రభావం చూపిస్తుంది. ఆ పరిస్థితులకి లొంగిపోయి విచక్షణాగుణం కోల్పోతారు మనుషులు. ఆ సమయంలో తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. అదే పరిస్థితి ప్రస్తుతం సరస్వతిది. ఆమె పరవశంతో కనులు మూసుకుంది. అతను ఆమెను పెనవేసుకున్నాడు. అతని చేతులు ఆమె చుట్టురా బిగుసుకున్నాయి. ఆమె పెదవుల్ని తన పెదవుల్తో బందించి మత్తులో మునిగిపోయాడు.

అతని వెచ్చని ఆలింగనంలో నలిగిపోతున్న సరస్వతికి ఆ క్షణంలో భర్త, కొడుకు, మిగతా కుటుంబ సభ్యులు, తన ఇంటి గౌరవ మర్యాదలు ఇవేవి ఆమెకి ఆ సమయంలో స్ఫురణకి రాలేదు.

సమాజ కట్టుబాట్లు లక్ష్యపెట్టలేదు. కేవలం తన అభీష్టం నెరవేర్చుకోవడమే ఆమె లక్ష్యం. సమాజ సంప్రదాయాలకి తిలోదకాలిచ్చింది సరస్వతి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here