ఎందుకు కంటతడి పెట్టిస్తాయి ఈ సినిమాలు?

0
10

[dropcap]ఒ[/dropcap]కసారి చూస్తే కంటతడి పెట్టించి, తర్వాత మళ్ళీ చూసినపుడు ఉద్వేగం కలిగించని సినిమాలు కావివి. ఎన్నిసార్లు చూసినా (నన్ను) కంటతడి పెట్టిస్తాయి. అదేమి చిత్రమో?

రోజర్ ఈబెర్ట్ (1942 – 2013) విమర్శ అనే ప్రక్రియకు ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్న తొలి సినీ విమర్శకుడు. ఆయన “విషాదకరమైన కథల కన్నా ఔన్నత్యాన్ని, మంచితనాన్ని చూపించే కథలే నన్ను కంటతడి పెట్టిస్తాయి” అనేవారు. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చిన విషయమే.

ఒక చిన్న ఉదాహరణగా ‘నిన్నే పెళ్ళాడతా’ (1996) చిత్రం లోని ఓ సన్నివేశం గురించి చెప్తాను. చలపతిరావు, గిరిబాబు అన్నదమ్ములు. మంజుభార్గవి వారి చెల్లెలు. అన్నలు కుదిర్చిన సంబంధం కాకుండా తను ప్రేమించినవాడిని పెళ్ళి చేసుకుంటుంది. అన్నలు పెళ్ళి దగ్గరకు వచ్చి ఆమె భర్తను కొడతారు. ఆ అవమానంతో అతను ఇంకెప్పుడూ వారి మొహం చూడకూడదని నిశ్చయించుకుంటాడు. భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. చాలా సంవత్సరాల తర్వాత అన్నవరంలో చలపతిరావు కుటుంబం, మంజుభార్గవి కుటుంబం ఎదురుపడతారు. పట్టుదలతో చలపతిరావు, గిరిబాబు, భర్తకు భయపడి మంజుభార్గవి పలకరించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. చలపతిరావు భార్య లక్ష్మి భర్తను, మరిదిని తిట్టిపోస్తుంది. చెల్లెల్ని పట్టించుకోకపోవటం రాక్షసత్వం అంటుంది. చలపతిరావు ఆమెను నోరు ముయ్యమని చెయ్యి ఎత్తుతాడు. అతని ఆప్తమిత్రుడైన చంద్రమోహన్ అతనికి అడ్డుపడి “బుద్ధి లేదా?” అంటాడు. చలపతిరావు “ఇది మా కుటుంబ విషయం. నీ జోక్యం అనవసరం” అని వెళ్ళిపోతాడు. స్నేహితుడు అంత మాట అనేసరికి చంద్రమోహన్ అవాక్కవుతాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న నహచరుడు జీవా అనునయంగా అతని భుజాన్ని తాకుతాడు. జీవా చేత దర్శకుడు కృష్ణవంశీ చేయించిన ఆ చిన్న చేష్టలోని మంచితనం హృదయానికి హత్తుకుంటుంది. “నీ బాధ నాకర్థమైంది” అనే భావం అందులో ఉంది. ఇది చిన్న విషయమే అయినా దర్శకత్వ ప్రతిభకు తార్కాణం.

మంచితనంతో, ఉన్నత విలువలతో చూసిన ప్రతి సారీ నా చేత కంటతడి పెట్టించే రెండు చిత్రాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. ఆ చిత్రాలు ‘సత్యకామ్’ (హిందీ – 1969), ‘మ్యాంచెస్టర్ బై ద సీ’ (ఆంగ్లం – 2016).

‘సత్యకామ్’ కథ తెలిసినవారికి అందులో కథానాయకుడు సత్యప్రియ్ ఎంత ఆదర్శవంతుడో తప్పక గుర్తు ఉంటుంది. అతనొక మహాత్ముడని చెప్పాలి. కలియుగంలో అలా బతకడం చాలా కష్టం అని అనిపిస్తుంది (ఇలా అనిపించటం కలి మహిమేమో!) సత్యప్రియ్ ఎంతో అనుష్ఠానపరుడైన తన తాతగారి బోధల్ని వంటపట్టించుకుంటాడు. సత్యసంధత, నిజాయితీ మనిషికి శిరోధార్యాలని నమ్ముతాడు. ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఎన్నో ఆశయాలతో ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఒక జమిందారు దగ్గర పనిలో చేరతాడు. అక్కడ రంజనాతో పరిచయమౌతుంది. ఆమె అతణ్ణి ప్రేమిస్తుంది. ఆమె ఒక వేశ్యకు పుట్టినది కావటంతో ఆమెకు సమాజంలో గౌరవం లేదు. జమీందారు ఆమెని అనుభవించాలని అనుకుంటాడు. ఈ విషయం తెలిసిన సత్యప్రియ్ తర్జనభర్జన పడుతూండగానే ఘోరం జరిగిపోతుంది. అన్యాయాన్ని అరికట్టలేని తన నిస్సహాయతకు ప్రాయశ్చిత్తంగా ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆమెను పూర్తిగా చేరదీయలేకపోతాడు. అతని తాతగారు ఆచారాల పేరు చెప్పి వారిని వెలివేస్తారు. ఆమె జమీందారు బిడ్డకు జన్మనిస్తుంది. సత్యప్రియ్ ఆ బిడ్డను తన బిడ్డగానే పెంచుతాడు.

లంచాలు తీసుకోకుండా నాణ్యతాప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ ఉద్యోగం చేయాలని అతని తపన. కానీ లాభాలు చూసుకునే కాంట్రాక్టర్ల గిట్టనితనం వల్ల బదిలీల మీద బదిలీలు అవుతూ ఉంటాయి. ఏడెనిమిదేళ్ళు గడిచాక అతనికి విపరీతమైన జబ్బు చేస్తుంది. ఆసుపత్రిలో చేరతాడు. ఇక ఎంతో కాలం బ్రతకడని తెలుస్తుంది. మాట కూడా పడిపోతుంది. వెనకవేసుకున్నది ఏమీ లేదు. అతని నిజాయితీతో విసిగిపోయిన రంజనా తన గతి, తన బిడ్డ గతి ఏమిటని నిలదీస్తుంది. ఒక కాంట్రాక్టరు నాణ్యతలేని ఒక కట్టడాన్ని అతను ధృవీకరిస్తే తనకు కొంత డబ్బిస్తానన్నాడని చెబుతుంది. ఆ ధృవీకరణ పత్రం మీద అతను సంతకం పెడతాడు. అది చూసి రంజనా చలించిపోతుంది. అతని ఆదర్శాలు వమ్ము కాకూడదని ఆ పత్రాన్ని చించివేస్తుంది. అతను ఎంతో సంతోషిస్తాడు.

అతను అవసానదశలో ఉన్నాడని తెలిసి తాతగారు వస్తారు. ఈ జగం మిథ్య అని, ఆత్మకు నాశనం లేదని, ధైర్యంగా చావుని ఆహ్వానించమని అతనికి చెప్తారు. అతను చనిపోయాక అతని అంత్యక్రియలు ఆయనే చేస్తారు. పెద్దకర్మ కూడా తానే చేస్తానని అంటారు. కొడుకు ఉండగా పెద్దకర్మ మీరు చేస్తారా అని పురోహితుడు అడిగితే వాడు చిన్నవాడు కదా అంటారు. అక్కడే ఉన్న పిల్లవాడు “అది అబద్ధం. నేను మా నాన్న కొడుకుని కాదు కాబట్టి పెద్దకర్మ చేయకూడదు. మా అమ్మ చెప్పింది” అంటాడు. దాంతో విస్తుబోయిన తాతగారు రంజనా ఔన్నత్యాన్ని గుర్తించి ఆమెను, పిల్లవాడిని తీసుకుని తన ఊరికి పయనమౌతారు.

సత్యప్రియ్ ఎంతో కాలం బ్రతకడని తెలిసే సందర్భం, అతను చనిపోయే సందర్భం విషాదకరాలే. భార్య రంజనా, మిత్రుడు నరేన్ ఎంతో దుఃఖిస్తారు. ఇవి జీవితంలో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే అనుభవాలే. ఇలాంటి కష్టాలు అందరూ పడతారు. కానీ ఇలాంటి సందర్భాలలో స్వార్థాన్ని పక్కన పెట్టి ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తే ఆ ఔన్నత్యం గుండెని పిండేస్తుంది. అలాంటి రెండు సన్నివేశాలలో మొదటిది రంజనా ధృవీకరణ పత్రం చించివేసే సన్నివేశం. అప్పటికే మాటపడిపోయిన సత్యప్రియ్ పత్రం మీద సంతకం చేసి ఆసుపత్రిలోని తన పడక దగ్గరకి అప్పుడే వచ్చిన రంజనాకు ఇస్తాడు. తన కోసం అతను తన ఆదర్శాలను పక్కన పెట్టాడని ఆమెకు అర్థమౌతుంది. అతను ఎంత వేదన పడి సంతకం పెట్టాడో తలచుకుని ఆమె శోకిస్తుంది. తుచ్ఛమైన జీవితం కోసం తాను అతని విలువలను బలిచేయాలా? మరణించే ముందు అతనికి శాంతి లేకుండా చేయాలా? అలా చేస్తే తనను తాను క్షమించుకుని బ్రతకగలదా? ఇలా ఆలోచించి ఆమె ఆ పత్రాన్ని చించివేస్తుంది. అది చూసి అతను సంతోషిస్తాడు. అతను మాట్లాడలేకపోయినా అతని కళ్ళలోని ఆనందాన్ని ఆమె చూస్తుంది. ఆ ఆనందం వెనుక ఆమెకు ఇంకో నిజం స్ఫురిస్తుంది. “నేను దీన్ని చించివేస్తానని మీకు తెలుసు కదా?” అంటుంది. ఔనని తల ఊపుతాడతను. వారిద్దరూ ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారో, వారి అనుబంధం ఎంత గొప్పదో మనకి అర్థమౌతుంది. ఇన్నాళ్ళూ అతని నిజాయితీ పట్ల అసహనం ఉన్నా అది పైపైనే. ఇది అతనికి తెలుసు. అతనికిది తెలుసని ఆమెకి తెలుసు. నా ఒక్కడి వల్ల ప్రపంచం మారిపోతుందా అని అతడనుకోలేదు. అతని సాహచర్యంలో ఆమె మారింది. ఆమె పెంపకంలో వారి కొడుకు ఆదర్శవంతుడౌతాడు. ధర్మాన్ని నమ్ముకోవాలి గానీ ఎవరి దయాదాక్షిణ్యాలకు చేతులు చాచనక్కరలేదని తెలుసుకుంటాడు.

రెండో సన్నివేశం తాతగారి ముందు పిల్లవాడు నిజం చెప్పే సన్నివేశం. లోకం ఏమనుకుంటుందో అని తాతగారు అబద్ధమాడతారు. కానీ పిల్లవాడు నిజం చెబుతాడు. రంజనా నిజాన్ని కొడుక్కి చెప్పటానికి వెనుకాడలేదు. పిల్లవాడికి పూర్తిగా అర్థం చేసుకునే వయసు లేకపోవచ్చు. అయినా అది కఠోర సత్యం. అది చెప్పటానికి గుండె ధైర్యం కావాలి. అప్పుడు తాతగారు “నిజమే మాట్లాడతాననే అహంకారం కాదు కావల్సింది, నిజం మాట్లాడేందుకు సాహసం కావాలని ఆ తల్లి చూపించింది” అని అందరి ముందూ అంటారు. ఇక్కడ తన అహంకారాన్ని విడిచి తాతగారు ఆమె ఔన్నత్యాన్ని గుర్తించటం ఆయన గొప్పదనం. ఎంతో అనుష్ఠానపరుడైన తాను చెప్పటమే కానీ పాటించలేకపోయిన సత్యవ్రతాన్ని ఒక సాధారణ స్త్రీ త్రికరణశుద్ధిగా పాటించినందుకు ఆమెపై అపారమైన గౌరవం కలుగుతుంది. కులం కన్నా గుణం ప్రధానమనే ఎరుక కలుగుతుంది. అంతేకాక వారసుడంటే వంశంలో పుట్టినవాడు కాదు, మన ఆశయాలను నిలబెట్టినవాడే అని తెలుసుకుని తల్లిని, పిల్లవాడిని తనతో తీసుకువెళతారు. ఈ మహోన్నత పాత్రలను చూసి హృదయం ద్రవిస్తుంది.

తాతగారు సత్యప్రియ్‌ని ఆసుపత్రిలో కలుసుకునే సన్నివేశం సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. తనను వెలి వేసిన తాతగారు తన కోసం రావటంతో సత్యప్రియ్ కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. మరణానికి భయపడుతున్నావా అని తాతగారు అడుగుతారు. కాదని తల ఊపుతాడు సత్యప్రియ్. “అవును. నీకెందుకు భయం? నీవు వెళ్ళే చోటు ఆనందలోకం అని నీకు తెలుసు కదా. ఈ శరీరం నీవు కాదని, ఆత్మకు నాశనం లేదని నీకు తెలుసు కదా” అంటారు. ధర్మాన్ని పాటించేవారు ఆనందలోకాలు పొందుతారనే విషయం ఇక్కడ చెప్పకనే చెప్పారు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పేవారు. భీష్ముడు అంపశయ్య మీద ఉండగా పాండవులు, శ్రీకృష్ణుడు ఆయన్ను చూడటానికి వెళతారు. అప్పుడు భీష్ముడు కంటతడి పెట్టుకుంటాడు. అర్జునుడు ధర్మరాజుతో “ఇంత జ్ఞాని అయిన తాతగారు కూడా మాయలో పడి మరణసమయంలో కన్నీరు కారుస్తున్నారే” అంటాడు. అది విని కృష్ణుడు భీష్ముడిని ఆయన కన్నీటికి కారణం చెప్పమని అడుగుతాడు. “పరమాత్ముడైన కృష్ణుడు తోడు ఉన్నా పాండవుల కష్టాలకు అంతులేకుండా ఉందే! భగవంతుడి లీలలు అర్థం చేసుకోవటం ఎవరి తరం అని కన్నీరు వచ్చింది” అంటాడు భీష్ముడు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఆచరించటమే మన పని. స్వార్థాన్ని, మమకారాన్ని వదులుకోవాలి. ఇదే ఈ చిత్రం ఇచ్చే సందేశం.

రంజనా, తాతగారి పాత్రల్లోని లోపాల గురించి మాట్లాడుకున్నాం. మరి సత్యప్రియ్‌లో లోపమేమీ లేదా? రంజనాని పూర్తిగా చేరదీయలేకపోవటం ఒక లోపంగా అనుకోవచ్చు. అతని మనసులో ఎక్కడో ఓ మూల ఆమె అపవిత్రురాలనే భావన ఉండి ఉండవచ్చు. సమాజం ప్రభావం మనిషిపై ఎంత ఉంటుందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకో కోణంలో చూస్తే సంసారభోగాలని వదులుకుని ఆమెకి గౌరవమైన జీవితాన్ని అందించాడనిపిస్తుంది. అతణ్ని ఏ లోపం లేని మహనీయుడిగా చూపించకపోవటం కథారచయిత, దర్శకుల నిబద్ధతకి నిదర్శనం.

నారాయణ్ సన్యాల్ రాసిన బెంగాలీ నవల ఈ చిత్రానికి ఆధారం. ఉపనిషత్తుల్లో వచ్చే సత్యకామ జాబాలి అనే ఋషి పేరు ఆధారంగా ఆ నవలకు ‘సత్యకామ్’ అని పేరు పెట్టారు. సత్యకామ జాబాలి చిన్నప్పుడు జ్ఞానసముపార్జన కోసం గురువు దగ్గరకు వెళ్ళగా ఆయన “నీ తల్లిదండ్రులెవ”రని అడుగుతాడు. తన తండ్రి ఎవరో తన తల్లికి తెలియదని నిజం చెబుతాడు. అతని సత్యసంధతకి ముచ్చటపడి ఆ గురువు అతన్ని శిష్యుడిగా స్వీకరిస్తాడు. హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యప్రియ్‌గా ధర్మేంద్ర, రంజనాగా షర్మిలా టాగూర్, తాతగారిగా అశోక్ కుమార్ నటించారు. ఈ చిత్రానికి ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. సంభాషణల రచయిత రాజిందర్ సింగ్ బేదీకి ఉత్తమ సంభాషణల రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ధర్మేంద్ర నటజీవితంలో అత్యుత్తమ పర్ఫార్మెన్స్‌గా ఈ చిత్రంలోని పాత్ర నిలిచిపోయింది.

(ఈ క్రింద “మ్యాంచెస్టర్ బై ద సీ” చిత్రం యొక్క పూర్తి కథ ప్రస్తావించబడింది. రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న చిత్రమిది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో రూ. 120 కట్టి చూడవచ్చు.)

ఇక ‘మ్యాంచెస్టర్ బై ద సీ’ విషాదంలో మునిగిపోయి జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి కథ. అతని పేరు లీ. ఎవరితోనూ మాట్లాడడు. అపార్ట్‌మెంట్ బిల్డింగ్ లలో చిన్న చిన్న రిపేరు పన్లు చేసుకుంటూ ఒక చిన్న గదిలో ఒంటరిగా బతుకుతుంటాడు. టెనెంట్లు దురుసుగా మాట్లాడితే దురుసుగా జవాబిస్తాడు. అప్పుడప్పుడు బార్‌కి వెళ్ళి తాగుతుంటాడు. ఎవరైనా తనను పరీక్షగా చూస్తే వారితో కొట్లాటకి దిగుతాడు. అతనెందుకు అలా ప్రవర్తిస్తాడనేది మనకు మొదట్లో తెలియదు. అతని సొంత ఊళ్ళో ఉన్న అన్నయ్య జో గుండెజబ్బు మనిషి. జో కొడుకు ప్యాట్రిక్ పదహారేళ్ళవాడు. జో భార్య మానసిక రుగ్మత కారణంగా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఒకరోజు జో మరణించాడనే కబురు వస్తుంది. లీ అక్కడికి వెళతాడు. ప్యాట్రిక్ చిన్నతనంలో లీ అతన్ని అప్యాయంగా చూసుకునేవాడు. అందుకని చనిపోయే ముందు జో ప్యాట్రిక్‌ని లీ సంరక్షణలో ఉంచుతాడు. ఫ్లాష్‌బ్యాక్ లలో లీ గతం మనకు తెలుస్తుంది.

లీ తన భార్య ర్యాండీ, ముగ్గురు చిన్నపిల్లలతో తన సొంత ఊళ్ళో ఉండేవాడు. ఆ ఊరి పేరు మ్యాంచెస్టర్. సముద్రం ఒడ్డున ఉంటుంది. లీ, ర్యాండీలది ముచ్చటైన కాపురం. లీ కి అన్నయ్యతో పాటు ఎంతోమంది స్నేహితులు. ఒకనాటి రాత్రి లీ ఇంట్లో చలి కాచుకునే ఫైర్ ప్లేస్ కున్న గేటు సరిగ్గా వేయకుండా బయటకు వెళతాడు. మండుతున్న కట్టె ఒకటి బయటపడి ఇల్లు తగలబడుతుంది. పై అంతస్తులో పడుకున్న పిల్లలు ముగ్గురూ చనిపోతారు. కింది అంతస్తులో పడుకున్న ర్యాండీ బయటపడుతుంది. పోలీసు విచారణ జరుగుతుంది. ప్రమాదవశాత్తూ జరిగిందని పోలీసులు లీ ని వదిలేస్తారు. అపరాధభావంతో కుమిలిపోతున్న లీ పోలీసు గన్నుతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. పోలీసులు ఆపుతారు. ర్యాండీ అతన్ని క్షమించలేక విడాకులిస్తుంది. జో లీ ని సముదాయించటానికి ఎంత ప్రయత్నించినా అతను తిరిగి మామూలు మనిషి కాలేకపోతాడు. విషాదంలో కూరుకుపోతాడు. అక్కడ ఉండలేక వేరే ఊరికి వెళ్ళిపోతాడు.

జో చనిపోయినపుడు పరామర్శించటానికి ర్యాండీ వస్తుంది. మరో పెళ్ళి చేసుకుని గర్భంతో ఉంటుంది. ఆమెను చూసి పాత జ్ఞాపకాలతో సతమతమవుతాడు లీ. ఆ ఊళ్ళో ఉండటం ఇష్టం లేక లీ ప్యాట్రిక్‌ని తనతో పాటు తీసుకెళదామనుకుంటాడు. ప్యాట్రిక్ ఒప్పుకోడు. తనకు స్కూలు ఉందని అంటాడు. ఆ సంవత్సరం స్కూలు అయ్యేదాకా అక్కడే ఉండిపోవాలని లీ నిశ్చయించుకుంటాడు. కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు ర్యాండీ తన బిడ్డతో లీకి వీధిలో తారసపడుతుంది. తమ పిల్లలు చనిపోయినపుడు అతన్ని నిందించినందుకు క్షమించమంటుంది. ఆ విషయాన్ని మరిచిపోయి కొత్త జీవితం ప్ర్రారంభించమంటుంది. లీ అక్కడ ఉండలేక గబగబా వెళ్ళిపోతాడు. తర్వాత లీ తన స్నేహితుడికి, అతని భార్యకి ప్యాట్రిక్‌ని దత్తత ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. నువ్వు ఇక్కడ ఎందుకు ఉండకూడదు అని ప్యాట్రిక్ అడిగితే నా వల్లకాదని దీనంగా అంటాడు లీ. ప్యాట్రిక్ అర్థం చేసుకుంటాడు. అప్పుడప్పుడు ప్యాట్రిక్ తనవద్దకు రావచ్చని, అతను వచ్చినపుడు ఇద్దరూ ఉండటానికి వీలుగా ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుంటానని లీ అంటాడు. అక్కడితో కథ ముగుస్తుంది.

ఇంత విషాదకరమైన కుటుంబకథాచిత్రం ఈ మధ్యకాలంలో రాలేదు. అయినా విషాదం కంటే మంచితనమే ఇందులో కన్నీరు పెట్టిస్తుంది. ఆ మంచితనం కనిపించే సన్నివేశం ర్యాండీ లీని క్షమాపణ అడిగే సన్నివేశం. విచిత్రమేమిటంటే పిల్లలు చనిపోయిన తర్వాత ర్యాండీ, లీ మధ్య ఏమి సంభాషణ జరిగిందో చిత్రంలో చూపించరు. అంత విషాదం జరిగాక ఆమె అతనిపై ఎంత రగిలిపోయిందో మనం ఊహించుకోవలసిందే. ఆ క్షోభకి ఏ రచయితా అక్షరరూపం ఇవ్వలేడేమో? ఏ తల్లి అయినా తన పిల్లల చావుకు కారణమైన భర్తని వదిలి వెళ్ళిపోక ఏమి చేస్తుంది? అయితే అతను ఆ ఊరికి తిరిగి వచ్చాక అతని పరిస్థితిని ఆమె చూసింది, ఇతరులు చెప్పగా వింది. అతను ఒక జీవచ్ఛవంలా ఉన్నాడని ఆమెకి అర్థమైంది. ఒక పొరపాటుకి అతని జీవితం ఛిన్నాభిన్నం అయిందని గ్రహిస్తుంది. ఆమెలోని మానవత్వం అతన్ని క్షమిస్తుంది. “నేను నిన్ను అనరాని మాటలన్నాను. ఆ మాటలన్నందుకు నేను నరకానికి పోతాను” అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎంత దారుణంగా అతన్ని నిందించిందో, అప్పటికే కుంగిపోయిన అతను ఆ మాటలకు ఎంత బాధపడ్డాడో మనం ఊహించవచ్చు. ప్రస్తుతం ఆమెతో “నీ తప్పేమీ లే”దంటాడతను. ర్యాండీ “అప్పుడు నా హృదయం ముక్కలైంది. ఎప్పటికీ అది అతకదు. కానీ నీ హృదయం కూడా గాయపడిందని నాకు తెలుసు” అంటుంది. “యూ కాన్ట్ జస్ట్ డై” (ఇలాగే జీవితాన్ని అంతం చేసుకోవద్దు) అంటుంది. “ఐ లవ్ యూ” అని కూడా అంటుంది.

ఒక్కోసారి విధి క్రూరంగా ఉంటుంది. ఎవరు మనవారో, ఎవరు పగవారో తెలియకుండా చేస్తుంది. అంతా సద్దుమణిగాక బంధాలు విచ్ఛిన్నమై ఉంటాయి. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అదే ర్యాండీ పరిస్థితి. అతను మంచివాడని తెలుసు. అతని మీద ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు ఆమె మరొకరి భార్య. తాను తొందరపడిందా అనే భావన ఆమెను తొలిచివేస్తూంది. కానీ ఏమి చేయగలదు?

“ఐ లవ్ యూ” అన్న తర్వాత “నేనా మాట అనకూడదేమో” అంటుంది ర్యాండీ. ఆమెను ఆపటానికి అతను “నా హృదయం ఎప్పుడో శూన్యమైపోయింది” అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమె ఏడుస్తూ ఉండిపోతుంది. ఈ సన్నివేశంలో సంభాషణలు సహజంగా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఎవరూ అనర్గళంగా మాట్లాడలేరు. వాక్యాలు పూర్తిచేయలేరు. ర్యాండీ గద్గదస్వరంతో ముక్కలు ముక్కలుగా మాట్లాడుతుంది. దుఃఖం ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ కళ్ళు తుడుచుకుంటుంది. ర్యాండీ పాత్రలో నటించిన మిషెల్ విలియమ్స్‌కు ఈ సన్నివేశానికే ఉత్తమ సహాయనటి ఆస్కార్ నామినేషన్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అంత గొప్పగా నటించింది. ఐతే అవార్డ్ దక్కలేదు. “ద న్యూ యార్కర్” పత్రికలో ఆంథొనీ లేన్ అనే విమర్శకుడు “ఈ చిత్రం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకోకుండా ఉండటం అసాధ్యం” అన్నాడు.

ర్యాండీ తనని క్షమించిందనే విషయం లీ కి కొంచెం సాంత్వన కలిగించిందనే అనిపిస్తుంది. అందరికీ దూరంగా పారిపోయే లీ.. ప్యాట్రిక్ తన ఇంటికి రావచ్చని అనటమే ఇందుకు నిదర్శనం. శూన్యమైపోయిన హృదయంలోకి మళ్ళీ బంధాల్ని ఆహ్వానిస్తున్నాడన్నమాట. అలా నెమ్మదిగా బంధాలు పెంచుకుని అతడు కొంతకాలానికి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడనే చిన్న ఆశతో చిత్రం ముగుస్తుంది. అంతులేని విషాదంలో కూడా చిరుదివ్వె వెలిగించే శక్తి మానవత్వానికే ఉంది.

చిత్రమంతా చిన్న చిన్న ఫ్లాష్‌బ్యాక్ లతో నడుస్తుంది. గజిబిజిగా వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకుడు మొదట్లో తికమకపడతాడు. లీ గంభీరంగా ఉన్నవి ప్రస్తుతంలో జరిగే సన్నివేశాలని, గలగలా మట్లాడుతున్నవి గతంలో జరిగిన సన్నివేశాలని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సాఫీగా సాగుతున్న అతని గతంలోని గాయాలు ఏమిటనే కుతూహలం కలిగించి తర్వాత అసలు విషయం బయటపెడతారు. కెన్నెత్ లోనెర్గన్ స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించాడు. స్క్రీన్ ప్లే కి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఆస్కార్ అవార్డులలో కథకి వేరుగా, స్క్రీన్ ప్లే కి వేరుగా, సంభాషణలకి వేరుగా అవార్డులు ఇవ్వరు. అన్నిటికీ కలిపి ఒకే స్క్రీన్ ప్లే అవార్డ్ ఇస్తారు. కాకపోతే ఒరిజినల్ స్క్రీన్ ప్లే, అడాప్టెడ్ స్రీన్ ప్లే అని వేరుగా ఉంటాయి. ఒరిజినల్ స్క్రీన్ ప్లే అంటే కొత్త కథతో రాసినది. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అంటే అప్పటికే నవల లేదా నాటక రూపంలో ఉన్న కథ ఆధారంగా రాసినది. రీమేక్ చిత్రాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఈ చిత్రానికి ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డ్ వచ్చింది. లీ గా నటించిన కేసీ యాఫ్లెక్‌కి ఉత్తమ నటుడి ఆస్కార్ అవార్డ్ దక్కింది. ఎవరినీ తన జీవితంలోకి ప్రవేశించనీయకుండా గిరి గీసుకుని ఉండే పాత్ర అతనిది. అనుక్షణం దుఃఖాన్ని దిగమింగుకునే పాత్రలో అతడు జీవించాడనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here