[dropcap]ఈ[/dropcap] పాడు కరోనా కాయిలా వచ్చి ఈ నడుమ శానా జనము సచ్చిపోయిరి. మనిషిగా పుట్టినంక సాయాల్సిందే కాని శానా చిన్నవాళ్లు, నడి వయసు వాళ్లు కూడా సచ్చిపోతా వుండారు. నిజానికి కరోనా కాయిలా నింకా కొంద్రు సచ్చిపోతే ఆ కాయిలా వచ్చిందనే దిగులులా శానా జనము సచ్చిపోయిరి. వీళ్లంతా ఇంగా ఎంతకాలము బతికి బట్టకట్టాలని అనుకుని వుండిరో ఏమో… సచ్చినోళ్ల కత విడిచి పెడితే బతికి వుండేవాళ్లు సావు, బదుకుల గురించి ఏమనుకొంటావుండారో తెలుసుకోవాలనే బెమ (కోరిక) నాలా పుట్టె.
అట్లే కాను, చేను, దాటి కావళి (బీడు భూమి) పక్క నడిస్తిని. ఆడ మాను నీడలా ఆవులు మేపే అరిగాడు, గొర్రెలు మేపే కుశాల తిమ్ముడు, మేకలు మేపే మీసాల మామ కూకొని వుండారు.
నేను బిరబిర్నా ఆడికిపోయి, “మిమ్మల్ని ఒగ మాట అడగాలా” అంట్ని.
“దానికేం భాగ్యం అడగరా” అనిరి.
“సావు, బదుకుల గురించి మీరేమనుకొంటా వుండారో రవంత చెప్పండా” అంట్ని.
అంతే, ముగ్గురు ఎగాదిగా నన్ని చూసి, “నీకేం పోయే కాలంరా ఇట్లా అడగతా వుండావు” అనిరి.
“పోయే లోపల తెలుసుకొందామని” మెల్లిగా అంట్ని.
“నువ్వు శానా పెద్ద సమాచారము అడగతా వుండావు. సావు చెప్పి వస్తుందా? ఆ సమాచారము చెప్పేకి మా చేతుల్లా అయ్యేలే. మమ్మల్ని విడిరా సామి” అని ముగ్గురు ఆడనింకా లేసి పారేకి సురువు చేసిరి.
నేను అట్లే వాళ్లకి అడ్డంపడి “పోనీ బదుకు గురించి చెప్పండ. మీరు ఇంగా ఎన్నాళ్లు బతకాలని అనుకొంటా వుండారో చెప్పండ” అంట్ని.
“ఇట్లడిగితివి బాగుంది. నా కొడుక్కి, కూతురుకి పెండిండ్లు అయ్యేగంట బతికితే సాలురా” అనె అరిగాడు.
“నేను నా పెండ్లాం సచ్చేగంట బతకాలని అనుకొంటా వుండా… ఏలంటే దానికి నేనంటే ప్రాణమురా” కుశాల తిమ్ముడు అనె.
“నువ్వునా?” అంటా మీసాల మామ పక్క చూస్తిని.
“సావు వచ్చేగంట” అనె.
“ఏమంటివి మామ ఇంగోకిత చెప్పు” ఆత్రంగా అంట్ని.
“నాకి సావు వచ్చేగంట బతకాలని వుండా పా” దిట్టముగా అనె.
“అహా! ఏమి చెప్పితివి, ఏమి చెప్పితివి మామ, నీ మాద్రిగా అంద్రు బదుకు విషయంలా దిట్టముగా వుంటే కరోనా కాదు, దాని అమ్మ అట్ల వైరస్‍లు ఎన్ని వచ్చినా మానవ జాతిని ఏమీ చేసేకి అయ్యెల్దు” అంటా మామకి మప్పిదాలు చెప్పితిని.
***
ఎన్నాళ్లు = ఎన్ని రోజులు