ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-11

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]బ్ర[/dropcap]హ్మాజీ తిరిగి కొనసాగించాడు.

“నువ్వు ఈ ఊరు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక కావేరి గదిలోకి వెళ్ళాను.

కావేరి చదువుతున్న పుస్తకం సోఫాలో ఉంది. దాన్ని చేతిలోకి తీసుకున్నాను. ఓసారి పుస్తకాన్ని, పేజీలు తిరగేసాను. అందులో అంతా అంతకు ముందు మీరు మాట్లాడుకున్న దేశ చరిత్ర, దాని ఆర్థిక స్థితి. ఆరోగ్య శాఖలు, దొరికే వస్తువుల లాంటి వాటి గురించి ఉంది. పూర్తిగా చదవాలనుకున్నాను. కాని చదవలేదు.

ఆశ్చర్యం వేసింది. మరో సారి తెలిసింది ఈ కావేరి నాకు తెలిసిన కావేరి కాదు. వేరే.

కావేరికి ఎకనమిక్స్, హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉందన్న సంగతి మొదటి సారి తెలిసింది.

ఆ పుస్తకం ఏదో సిగ్నల్ నిచ్చింది. ఏదో అర్థం అయినట్లనిపించింది.

నాకు తెలీకుండా నా జీవితం భయంకరంగా అవుతోంది. ఏదో నిశ్శబ్దం, అందులోంచే ఏవో హెచ్చరికలు. కాని నాకు స్పష్టత కావాలి. ఋజువులుండాలి.

ఒక్కటి మాత్రం నిజం. ఈ పుస్తకం ఓ జవాబు ఇస్తూంటే, ఆ వెంటనే మరో ప్రశ్నని కూడా లేవనెత్తుతోంది. కావేరి కూడా వెళ్ళి పోవాలనుకుంటోందా! ఎందుకు సమాధానం ఎవరు ఇవ్వాలి? నేనా! కావేరినా! లేకపోతే తెర వెనకాలనుండే నువ్వా?

ఈ పుస్తకాలు చదివి, ఆమె ఓ అద్భుత ప్రపంచం గురించి ఆలోచిస్తోంది. అంటే ఆమె ఉంటున్న ఈ ప్రపంచం కన్నా ఇంక అందమైన ప్రపంచం గురించి, ఎంతో బావున్నదాని గురించి ఆలోచిస్తోంది.

అంటే ఆమె ఇక్కడి నుంచి పారిపోదామనుకుంటోంది.

అసలు ఆమె దేన్నుంచి దూరంగా వెళ్ళానుకుంటోంది? ఎవరి నుంచి పారిపోవాలనుకుంటోంది?

అయితే ఆ ఎవరు అన్నది నేనే కావచ్చు. అది నువ్వు కూడా కావచ్చు. ఈ సంగతి పట్టపగలంత స్పష్టంగా ఉంది.

కావేరికి ఏదో తెలుసు, ఆమె ఏదో కావాలనుకుంటోంది. ఆ ఏదో ఇక్కడ ఈ ఇంట్లో దొరకడం లేదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటోంది. అందుకే ఈ పుస్తకాలు చదువుతోంది.

ఆ రోజు ఉదయం జరిగినది మొదటినుంచి గుర్తు చేసుకుంటూంటే, పరిస్థితులు కొంచెం కొంచెం అర్థం అయింది.

నా జీవితం ముక్కలైంది. ఓ భూకంపం వచ్చి నేనున్న ప్రదేశాన్ని రెండుగా చేసింది. ఓ వైపున గతం, అందులో నేను, బాల్యం మరోవైపున చీకటి, నేను చూడలేని ఆ చీకట్లో, దానిలో దారి వెతుక్కోవాలి. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి కాంటాక్ట్‌లో లేదు.

ఏం జరిగింది అర్థం కాలేదు. నేను చెప్పలేను. అతి కష్టం మీద ఆ రోజంతా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాను. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నేను అందులో గెలిచానని అనుకున్నాను.

నాలో జరుగుతున్న అలజడిని కావేరి గుర్తించలేదు. నా మొహంలోని భావాలని ఆమె గమనించలేదు. చదవలేదు.

నా ఆలోచనలన్నీ నా ఊహలేనా. వీటిని ఎవరితోనైనా చెప్పగలనా. ఎవరికైనా చెప్పాలంటే ఋజువులు కావాలి. నిరూపించాలి. నమ్మించాలి. కాని వీటిని నేను నిరూపించలేను. కాని నాలో ఓ గొంతుంది. అది ఋజువుల కన్నా బలమైనది. నన్ను నేను మోసగించుకోడం లేదు. నిజం నాకు తెలుసు.

ఆ వేట జరిగిన రోజు ఉదయం నాకు తెలిసిన నిజం, నా స్నేహితుడు నన్ను చంపాలనుకుంటున్నాడు. ఇది గాలిలో నేను మోపిన నేరం కాదు. నిజం. దీని గురించి చెప్పలేను.

ఈ భయంకరమైన నిజం నాలోనే ఉంది. నాలో ఇంత అసహనం ఉన్నప్పుడు నేను నీతో కావేరితో ఇదివరకు లాగా కళ్ళల్లోకి చూసి మాట్లాడగలనా! మనం ముగ్గురం కలిసి సినిమాలు చూడగలమా! కలిసి ఆటలు ఆడగలమా! ఆ విధంగా జీవించగలమా! చాలా కష్టం. ఆ రోజులు రావు. మనం ముగ్గురం కలిసి భోంచేయకుండా ఒక్కరోజు కూడా లేము. మనం ముగ్గురం ఒక్కలా ఉన్నాము. నీ ప్రవర్తన గమనించాకా నేను మీతో ఇదివరకు లాగా ఉండడం కష్టం అనిపించింది. ఉండలేను కూడా.

నీ మనసులో, కావేరి మనసులో ఏం ఉందో చూచాయగా కూడా చెప్పకుండా, నన్ను నా ఊహలకి వదలేసి నువ్వు వెళ్ళి పోయావు ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు మనసు విప్పి చెప్పు. సమాధానం కావాలి.

అందుకే నిజం కావాలి. నిజాన్ని చూడాలి. నేను ఏదీ ఊహించకూడదు. నన్ను ద్వేషించడానికి, చంపాలనుకోడానికి కాని ఏదో కారణం ఉంది. మరొకటి కూడా తెలుసుకోవాలి. నువ్వు కావేరిని కోరుకుంటున్నావని అనిపిస్తోంది. కావేరి కూడా కావచ్చు.

నువ్వు నాకు తెలుసు. కావేరి కూడా తెలుసు. మీ ఇద్దరికి నేను తెలుసు. మన మధ్య దాపరికం లేదు. నేను మొదటిసారి కావేరిని చూడడం. పెళ్ళి చేసుకోవాలని అనుకోడం, నా పెళ్ళి, అంతా ఓపెన్. బహిరంగమే. ట్రాన్స్‌పరెంట్. క్లీన్. మీ ఇద్దరినీ నేను నమ్మితే, మీరు నన్ను ఓ వెర్రివాడిగా చూసారు. నాకు ఏ మాత్రం అనుమానం వచ్చినా అంత దూరం రానిచ్చే వాడిని కాదు.

మనిద్దరం ఎన్నో ఏళ్ళగా ఒకరికొకరం తెలుసు. అలాగే కావేరి కూడా. రాత్రింబవళ్ళూ కూడా తెలుసు. ఆమె శరీరం. మనసు, ఆత్మ అన్నీ తెలుసు.

నా గురించి నాకు ఎంత తెలుసో ఆమె గురించి కూడా అంతే తెలుసు.

అలాంటిది, నువ్వూ, కావేరీ, ఆ ఆలోచన క్రేజీగా ఉంది. ఆ ఆలోచనని కొట్టి పారేసాను.

 ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించి మనసుని తేలిగ్గా ఉండేది.

కోరికలు ఎంత దారి తప్పినవైనా ఎంత కాలం దాచి ఉంచగలరు. అది కష్టం. అందుకే తన దగ్గర స్నేహితుడి మీద ప్రయోగించినా ఆశ్చర్యం ఉండదు. నీమీద నిఘా ఉంచితే. నిన్ను గమనించడానికి ఎవరినైనా పెట్టాలా.

నిజానికి నాకు ఈర్ష్య లేదు. నేను అందరి లాంటి భర్తని కాను. అనుమానం నరాలని తోడెస్తుంది నేను కావేరిని అనుమానించలేదు.

కావేరి ఓ అమూల్యమైన రత్నం. అపరూపం, విలువైన వజ్రాన్ని ఓ కలెక్టర్ కొన్నట్లుగా నాకు ఆమె ఓ బహుమతి. ఆమె అబద్దాలు చెప్పదు. మోసకారి కాదు. నమ్మకస్తురాలు. ఆమె ఆలోచనలు నాకు తెలుసు. అందుకు నిదర్శనం ఆమె డైరీ. నీకు దాని గురించి చెప్పాలి.

వెళ్ళైన వెంటనే మేము హనీమూన్‌కి లండన్ వెళ్ళాం. ఆ సంగతి కూడా నీకు తెలుసు. లండన్‌కి దగ్గరలో ఉన్న కొన్ని దేశాలని, వాటికి దగ్గరగా ఉన్న ప్రదేశాలన్ని చూసాం. ఓరోజున అక్కడ షాపింగ్ చేస్తూంటే కావేరి ఓ డైరీని చూసింది. పసుపు రంగు లోఉంది. వెల్వెట్ జాకెట్. దాన్నిఆమె ఇష్టపడింది. వెంటనే నేను కొని ఆమెకి ఇచ్చాను.

ఆమె వెంటనే దాన్ని అందుకుని నాతో ఏమందో తెలుసా నాకు బాగా గుర్తు.

‘ఇది నా మనసు. నా ఆత్మ ఇందులో ఉంటుంది’ అని అంది. నా హృదయానికి ప్రతి రూపం అని అంది. అందులో తన భావాలు, ఆలోచనలు అందులో రాస్తానని అంది. అందులో రహస్యాలు ఏం ఉండదని, నేను కూడా దానిని చదవచ్చు అని అంది. మన మధ్య అలాంటివి ఏం ఉండదని అంది. ఒకరి మీద ఒకరికి అనుమానం అనేది ఉండకూడదు, నమ్మకం ఉండాలని అంది. నమ్మకం మీద పెళ్ళి పునాదులు బలపడతాయని మన జీవితం బావుంటుంది అని అంది. ఇన్ని మాటలు అన్న మనిషి ద్రోహం చేస్తుందని అనుకోను.

ఆ తరవాత వెంటనే తను రాసినది నాకు చూపించింది. ఇండియా వచ్చాక దానిని నా ముందరే దానిని ఓ సొరుగులో ఉంచింది, దానిని నాకు చూపించింది. దాని తాళం చేతులు మా ఇద్దరి దగ్గర ఉంటాయి. మా ఇద్దరిలో ఎవరైనా ఎప్పుడైనా దాన్ని తెరిచి ఆ డైరీ చదవచ్చు.

డైరీ వచ్చిన మొదట్లో తేదీల ప్రకారంగా మెయింటేన్ చేసింది. ఏ రోజున ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది, నాతో పంచుకున్నవి, నాతో మాట్లాడినది, ప్రతీ చిన్న విషయం రాసేది, బలవంతంగా చూపించేది, చదవమని నా ముందుంచేది. ఆమె తన డైరీలో ఏం రాసిందో అదే నాతో చెప్తోందా,లేదా అన్న అనుమానం నాకు లేదు. ఏం చెప్తోందో అదే రాసేది. అందులో నాకు అనుమానం లేదు.

డైరీ రాయాలన్నది కావేరి ఆలోచన. పైకి చెప్పుకోవలన్నది కూడా ఆమె ఆలోచనే.

అది చాలా కాన్ఫిడెన్షియల్, ఓ ఇద్దరి మనుషుల మధ్య, ఓ భార్యాభర్తల మధ్య ఉన్నది ఏదైనా కాన్ఫిడెన్షియల్. అది సీక్రెట్. దానిని మేం మర్చి పోలేదు. ఒకవేళ ఏదైనా రహస్యాలు ఉంటే ఆమె అందులో తప్పక రాసేది. ఆ డైరీలో ఉండేది. కావేరి నాకు అన్నీ ఇవ్వాలనుకుంది. ఆమె శరీరం ఆమె ఆత్మ ఆలోచనలు అన్నీ. ఆమె సంతోషం నా సంతోషం. ఆమెని ఆనందపరచడమే నా జీవిత లక్ష్యం అనుకున్నాను. ప్రపంచం అంతా తిప్పాను. ఆమెకి ఈ ఇంట్లో హోదా, టౌన్‌లో ఓ పెద్ద భవనం, ఖరీదైన వస్తువులు అన్నీ ఇచ్చాను. అందుకే ఆమె మనసులో ఏం ఉందో చదవాలనుకున్నాను.

అందుకే డైరీ చదవాలని అనుకున్నాను, అందుకని ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆమె గదిలోకి వెళ్లి తాళం తీసి, ఆ సొరుగు తెరిచాను. అది ఖాళీ. అందులో ఉండాల్సిన డైరీ లేదు. ఏమైంది. ఆమె మా ఒప్పందం మరిచిపోయిందా అన్న అనుమానం వచ్చింది.” ఆగిపోయాడు.

బ్రహ్మాజీ కళ్ళు మూసుకున్నాడు. పదాల కోసం వెతుకుతున్న వాడిలాగా ఆగిపోయాడు. దారి వెతుకుతున్న గుడ్డివాడిలాగా అక్కడే ఉండిపోయినట్లుగా ఉండిపోయాడు.

మళ్లీ మొదలు పెట్టాడు.

“అర్ధరాత్రైంది. ఇంట్లో అంతా నిద్ర పోతున్నారు. కావేరి కూడా బాగా అలిసి పోయింది. ఆమెని డిస్టర్బ్ చేయదలచుకోలేదు.

మర్నాడు కావేరి కనిపిస్తుంది కదా అడగాలనుకున్నాను. ఎందుకంటే కావేరి తన మనసులోవి అన్నీ నాతో చెప్పలేదు. కొన్ని విషయాలు నాకు తెలియ కూడదని అనుకుంది. అందుకే అవి చెప్పలేదు. వాటిని నేను చదవకూడదని అనుకుంది. నేను చూడకూడదని అనుకుంది, అందుకే డైరీని ఒరిజినల్ సొరుగు నుంచి తీసేసింది. ఎందుకలా చేసిందో తెలీదు. ఎందుకంటే కావేరి మొదట్లో అలా లేదు.” బ్రహ్మాజీ ఆపాడు.

కుర్చీలో కూచుని రెండు మోచేతులు కుర్చీ రెండు కోళ్ళ మీద ఆనించి వేళ్ళని ఒకదాన్లో మరొక చేతి వేళ్లని దూర్చి తలని కాస్త ముందుకి వంచాడు.

“మొదట్లో నేనంటే ఎంతో ప్రేమగా ఉండేది. జీవితంలోని ముఖ్యమైన మలుపులో ఆమె సాహచర్యం నాకు ఆనందాన్నిచ్చింది. ఆమె కృతజ్ఞత చూపించింది. అది కూడా ఎంతో చెప్పలేనంత. ఆ కృతజ్ఞత అంతా అక్షరాల రూపంలో డైరీలో రాసుకుంది. మొదటి రోజే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు రాసి చూపించింది. ఇది ఓ అపురూపమైన బహుమతి అంది.

నాలో ఏ విషయాలు, తనకి నచ్చిందో, ఏవి నచ్చలేదో అవి అన్ని కూడా ఓపెన్‌గా రాసింది. అవన్ని నాకు చూపించింది. నవ్వేసి ఊరుకున్నాను. అప్పుడు నాకు పాతికేళ్ళ యువకుడిని. నేను ధనికుడిని. సమాజంలో ఓ గొప్ప హోదా ఉన్న వాడిని. ఓ పొజిషన్ ఉంది. భవిష్యత్తు నాకోసం అందమైన దారి వేసింది.

నడిచొచ్చిన దారిలో కాస్సేపు ఆగి, వెనక్కి తిరిగి గతాన్ని చూస్తు ఆలోచిస్తూంటే, నాది చక్కటి సంతృప్తితో ఉన్న జీవితం. మంచి సంస్కారం ఉన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. ఒక్క మచ్చ లేదు. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్న వాతావరణంలో పెరిగాను.

వ్యాపారంలో నష్టాలొచ్చాయి. గొడౌన్‌లో సామాను అంతా కాలిపోయింది, అది కూలిపోయింది, వర్కర్లు ధర్నా చేస్తున్నారు లాంటి వార్తలు ఏవీ నా జీవితంలో లేవు. జీవితం అంతా సక్రమంగా నడుస్తోంది. అన్నీ కూడా సజావుగా జరిగి పోతున్నాయి. అంతా సంతోషం. కాని కారణం లేకుండా దేవుళ్ళు కూడా జీవితాన్ని తలకిందులు చేస్తారు అని అర్థం అయింది.

మొదట్లో ఎంతో ఉత్సాహంగా డైరీని చూపించిన కావేరి, రాను రాను డైరీ ఆమె చూపించడం మానేసింది. ఆ సొరుగు చూసేందుకు నాకు కూడా హక్కుంది, ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి అప్పుడప్పుడు చూసే వాడిని.

కాని చాలా రోజుల తరవాత కనిపించింది. అంటే డైరీ ఒరిజినల్ ప్లేస్‌లో పెట్టింది. ఆమెకి తెలీకుండా చూసాను తరవాతే తెలిసింది. ఆమె రాతలు పూర్తిగా అర్థాన్నివ్వలేదు. అవి సీక్రెట్ మెసేజ్‌లు, ఏవో కోడ్‌లు అవీ ఉన్నాయి, అవి ఏంటో నాకు అర్థం కాలేదు.

ఆలోచించగా నాకు అర్థం అయింది. తను కొన్ని షేర్ చేయడానికి, చెప్పుకోడానికి ఇష్టపడటం లేదని ఆలోచించాకా అర్థం అయింది.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here