ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-12

0
6

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఓ [/dropcap]డెబ్బై ఏళ్ళ వృద్ధుడు తన జ్ఞాపకాలని, ఆ పుస్తకం గురించి మాట్లాడుతున్నాడు. మరో వృద్ధుడు నిశ్శబ్దంగా వింటున్నాడు.

“అసలు విషయం ఇంతవరకూ రాలేదు. సమయం దాటిపోతోంది. నువ్వు కూడా వెళ్ళిపోతావు. మళ్ళీ మొదటికి వస్తున్నాను.

ఆ రోజు వేటకి వెళ్ళిన రోజు. నీ గురి తప్పిన రోజు. నువ్వు భోజనం అయ్యాకా వెళ్ళిపోయావు. కావేరి కూడా నాతో ఏం మట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి పోయింది.

నేను ఆ రోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. డైరీ కూడా ఎప్పుడూ ఉండాల్సిన ప్లేస్‌లో లేదు. ఈ రెండూ కూడా పెద్ద ప్రశ్నల్లా నా ముందు నుంచున్నాయి. ఈ ప్రశ్నలకి జవాబులు కావాలి.

ఆ మరుసటి రోజు నీదగ్గరికొచ్చి అడగాలనుకున్నాను. నీతో మాట్లాడితే, అడిగితే సరి అయిన సమాధానాలు వస్తాయని నేననుకోను. నాకు నమ్మకం లేదు. కాని నిజాలకి కాస్త దగ్గరగా వెళ్ళచ్చు. నేను వేసే ప్రశ్నలు, దానికి వచ్చే జవాబులు, అందులోంచి వచ్చే ఆ పదాలు అన్ని కలిపితే నిజాలు బయట పడచ్చు. అందుకే నీతో మాట్లాడాలనుకున్నాను.

అప్పటికే బాగా పొద్దు పోయింది, బాగా అలిసిపోయాను. నిద్ర పోడానికి వెళ్ళాను. వెంటనే ఓ దుంగలా పడుకున్నాను. ఏ విధమైన కలలు రాలేదు. లేచాక నీ అపార్టుమెంటుకి బండిలో వెళ్ళాను. అప్పటికే నువ్వు వెళ్లిపోయావు.

ఆ గదిలో అందమైన వస్తువుల మధ్య నేనున్నాను. ఏదో అర్థం అయింది. స్పష్టంగా తెలుస్తోంది. అంతకు ముందు రోజు నన్ను చంపాలనుకున్నది నిజం. ఏదో జరిగింది. ఏదో జరుగుతూనే ఉంది. జరుగుతున్నది అది వ్యక్తిగతంగా అని అనిపించింది. అదే నాకు అంతు పట్టడం లేదు.

అంతలో తలుపులు తెరుచుకున్నాయి. అటు వైపు చూసాను.

కావేరి వచ్చింది. వింటున్నావా కావేరి వచ్చింది. ‘కావేరి’ అన్న పదాన్ని ఒత్తి పెట్టి అన్నాడు.

శివరాం ఏమాత్రం కదలకుండా వింటున్నాడు. చేతులు కట్టుకుని కూచున్నాడు.

ఓ ఆఫీసరు తన పై ఆఫీసరు చెప్తున్నది శ్రద్దగా వింటున్నట్లుగా బొమ్మలా కూచున్నాడు.

బ్రహ్మాజీ ఆగేటప్పటికి ఒక్కసారి నిశ్శబ్దం తాండవించింది. తిరిగి బ్రహ్మాజీ కొనసాగించాడు.

“నేను ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని ఆమె వైపు చూసాను. లోపలికి రావడానికి మెట్టు దిగింది. ఆమె ఇంటి నుంచి వచ్చినట్లుంది.

‘వెళ్ళిపోయాడా అతను’ అని అంది. ఆమె గొంతు కొంచెం బొంగురుగా ఉంది.

వెళ్ళిపోయాడు అని తలూపుతూ అన్నాను, కావేరిని పరీక్షగా చూస్తూ. ఆమె అలాగే గుమ్మం దగ్గరే నుంచుంది. ఓ బొమ్మలా నుంచుంది. షిఫాన్ చీరలో సన్నంగా అందంగా ఉంది.

‘వెళ్ళి పోయాడా అదేంటీ చెప్పలేదే,’ అంది.”

“ఆమె అలా అనిందా,” అన్నాడు శివరాం.

“అలాగే అంది. అదే విన్నాను కాని నేను కూడా ఏమీ అనలేదు. ఎందుకంటే కావేరికి ఇక్కడ ఏం పని అని ఆలోచిస్తున్నాను కాబట్టి.

నేను నా ఆలోచనల్లో, ఆమె తన ఆలోచనల్లో ఉండిపోయాం. మేమిద్దరం ఆ గదిలో నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఆమె ఆ గదిని కలయ చూస్తూ ఉంది.

ఆమె చూడడంలో నాకు రెండు విధాలుగా అర్థం అయింది. ఒకటి మొదటిసారిగా చూస్తున్నట్లుగా, రెండోది ఆఖరిసారి చూస్తున్నట్లుగా. ఆమె కళ్ళల్లో ఏవిధమైన క్యూరియాసిటీ కనిపించలేదు. ఆమె తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నట్లుగా అనిపించింది. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఆమె చూపు, కదలిక అవీ వేరుగా ఉన్నాయి. ఫొటోలని చూస్తోంది. ఏమాత్రం ఆసక్తితో కాకుండా ఏవో జ్ఞాపకాలని చూస్తున్నట్లుగా ఉంది. ఆ తరవాత ఏం మాట్లాడకుండా గదిలోంచి వెళ్ళిపోయింది.

ఏం జరిగిందో అనేదానికి అనే దానికి ఓ రూపునిచ్చుకోడానికి అవకాశం ఇచ్చింది.

మళ్ళీ నేను ఒక్కడినే గదిలోనే ఉన్నాను. తెరిచి ఉన్న కిటికీలోంచి ఆమె నడిచి వెళ్ళడం చూస్తున్నాను.”

బ్రహ్మాజీ ఆగి శివరామ్‌ని చూసాడు.

“నేను చాలా విఫులంగా చెప్తున్నాను. కాని తప్పదు. అన్నీ డీటెయిల్డ్‌గా చెప్పడం అవసరమే. ఎందుకంటే అన్నీ అవసరమే కాబట్టి. విసుగ్గా ఉందా, విసిగిస్తున్నానా, కాని వినాల్సిందే.” ఎంతో మర్యాదగా అన్నాడు.

“లేదు లేదు. చెప్పు, తరవాత ఏం జరిగింది?”

బ్రహ్మాజీ శివరామ్‌ని చూసి, కళ్ళు చిన్నగా చేసి , పెదిమలని తడుపుకోడానికి మంచి నీళ్ళు తాగాడు.

“ఇంకేం జరిగిందని చెప్పాలి, నువ్వేమో వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు. పైగా రెజిగ్నేషన్ లెటర్స్ మేనేజర్‌కి ఇచ్చి వెళ్ళావు. మరో సారి గదినంతా కలయ చూసాను. నీ పనివాడు ఓ చివర నుంచున్నాడు. రమ్మన్నట్లుగా సైగ చేసాను. దగ్గరకి వచ్చాడు.

శివరామ్ బాబు ఎప్పుడు వెళ్ళి పోయాడు.

ఐదు గంటలకి, బండి తెప్పించుకుని వెళ్ళి పోయారండి.

ఓ అలాగా సామాను ఏం తీసుకెళ్ళాడు.

మామూలు బట్టలే. మీరిచ్చిన సూట్లూ అవి అన్నీ ఇక్కడే వదిలేసారు.

ఏదైనా చెప్పాడా.

ఈ ఇంటిని ఇచ్చేయమన్నాడు. సామాను అమ్మేయమన్నాడు. లాయరుతో అన్ని విషయాలు మాట్లాడారుట. ఆయన అంతా చూసుకుంటారుట. అంతే.

ఆ తరవాత క్షణాలు ఎలా గడిచాయో అక్కడ ఎలా ఉన్నానో తెలీదు. కాసేపటికి తేరుకున్నాను. నాలో మరో ప్రశ్న తలెత్తింది. అడగాలా వద్దా అని లోచించాను. అడగడానికి నిశ్చయించుకున్నాను. దైర్యం తెచ్చుకున్నాను. నా ప్రశ్నకి జవాబు ఇతనే ఇవ్వగలడు. ఆ జవాబు వినలేను. కాని అడగాలి. ధైర్యం చేసాను. దాని జవాబు ఎలాంటిదైనా వినక తప్పదు. అని మనసులో నిశ్చయించుకున్నాను.

ఇప్పుడు వెళ్ళిన స్త్రీ ఇది వరకూ కూడా వచ్చిందా. మొదట చెప్పలేదు. ఇవ్వకపోతే చంపేస్తాను. స్నేహం స్నేహితుడు గుర్తుకు రాలేదు. తల ఊపాడు వచ్చిందన్నట్లుగా. నాకు తెలుసు కావేరి ఇక్కడికి వచ్చింది.

ఒకసారి కాదు, ఎన్నో సార్లు….” అంటూ కుర్చీ వెనక్కి జార బడ్డాడు.

చేతులు రెండూ కిందకి జార్చాడు బ్రహ్మాజీ.

“మళ్లీ అయోమయం. నాకు తెలవాల్సినది మరొకటి కూడా ఉంది. ఇవన్ని ఎందుకు జరిగాయి? ఎప్పుడు జరిగాయి? నేను గమనించక పోవడానికి కారణం మీ ఇద్దరి మీద ఉన్న నా నమ్మకం.

మా ఇద్దరి మధ్య గోడ పెరుగుతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందో తెలీదు. ఈ గోడ మోసంతో చేసిన గోడ. దగా గోడ. నాకు తెలీకుండా జరిగింది. దీనికి నేనెంత వరకు బాధ్యుణ్ణి, ఈ గోడ కట్టడంలో నేను కూడా భాగస్థుడినా! నా తప్పు కూడా ఉందా!,

నేను ఆమెని సరిగ్గా చూడలేదా! నా సంపద, నేనిచ్చిన ఖరీదైన బహుమతులు ఆమెని సంతోషపెట్టలేదా! నా మూలంగా ఆమె సుఖంగా ఉందని అనుకున్నాను. నా వెనకాల ఇలా చేస్తుందని కల్లో కూడా అనుకో లేదు. ఎందుకిలా జరిగిందో నీ ఒక్కడికే తెలుసని నా నమ్మకం.

ఇవన్ని జవాబులు దొరకని ప్రశ్నలు.

కావేరిని నేను అపురూపంగా, అతి ప్రేమతో, ఓ గాజు బొమ్మలా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నానని నీకు తెలుసు. ఇది నిజం. ఆ సంగతి నీకూ, నాకు తెలుసు.

మా ఇద్దరి మధ్యా ఏ విధమైన వాగ్వాదాలు జరగలేదు. ఆమె అన్న దానికి నేను తలూపే వాడిని. ఆమె అన్ని విధాలా స్వతంత్రురాలు. ఆమెకి ఏ విషయంలో కూడా ఎవరూ కూడా నాతో సహా, ఏనాడూ అభ్యంతరం కాని వ్యతిరేకించడం కాని చేయ లేదు. మరి ఎందుకు ఇలా జరిగింది?”

ఆ ప్రశ్నకి సమాధానం కావాలి. ఇది బ్రహ్మాజీని వేధిస్తున్న ప్రశ్న. ఈ నలభై మూడేళ్లు మనసులో ఉన్నప్రశ్న. దానిని ఇప్పుడు గట్టిగా అడిగాడు.

“ఇది వరకు దీని జవాబు దొరక లేదు. జవాబివ్వాల్సిన కావేరి లేదు. ఏదీ కూడా అలా అంత సులభంగా దొరకదు.” అని పైకి చూసాడు.

వాళ్ళ మధ్య ఉన్న కొవ్వత్తుల్లోంచి పొగలు వస్తున్నాయి.

కిటికి లోంచి బయటి తోట భాగం కనిపిస్తోంది. అంతా చీకటిగా ఉంది. అక్కడి చెట్లు ఏవీ కూడా కనిపించడం లేదు. లైట్లున్నాయి, కాని వెలుగుతున్న లైట్ల వెలుగు చీకటిని దూరం చేయడం లేదు.

మళ్ళీ బ్రహ్మాజీ శివరామ్‌ని చూసాడు.

“నవ్వు కావేరిని నాకు పరిచయం చేసావు. ఆమె అందం నన్ను ముగ్ధుడిని చేసింది. ఆమె ఏవిదంగా కూడా మా స్థాయికి సరి తూగదు. ఆ సంగతి నీకు, కావేరికి కూడా తెలుసు. కాక పోతే మంచి కుటుంబం అని ఆమె తండ్రి మాటలని బట్టి తెలిసింది. సంగీత సాహిత్యాలంటే ప్రాణం పెట్టే తండ్రి. అదే ఆమెలో కూడా ఉండడంతో సహజంగా నేను ఆమె వైపు ఆకర్షితుడినయ్యాను. సాహిత్యం మీద ఆమెకున్న పట్టు కూడా ఓ కారణం కావచ్చు.

కావేరిని నేను కలిసే నాటికి ఆమె తల్లి ఉంది. ఆమె ఓ టీబీ పేషెంట్. ఇంటి దగ్గర చూసే వాళ్ళు లేరని, ఆమెకి మంచి సేవ ఇవ్వడం కోసం ఓల్డ్ ఏజ్ హోం లాంటి సానిటోరియంలో ఉంచారు. అక్కడే డాక్టర్లు కూడా ఉన్నారు. మంచి ట్రీట్‌మెంటు ఇప్పిస్తున్నాం అని కావేరి అంది. బయటి నుంచి కూడా డాక్టర్లు వచ్చి చూస్తారు. ఆమె తల్లిని నేను చూడలేదు. ఆమెని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంచే నాటికి కావేరి వయసు పదహేడు సంవత్సరాలు.

మా పెళ్ళి నాటికి ఆమె తల్లి చనిపోయింది. మా హనీమూన్ అయిపోయింది. కావేరి వాళ్ళమ్మ ఉన్న ఆ హోం కి వెళ్ళాలని అంది. మేమిద్దరం ఆ సానిటోరియంకి వెళ్ళాం.

అది సిటీకి దూరంగా ఓ ఎత్తైన గుట్ట మీద ఉంది. దట్టంగా, రకరకాల చెట్ల మధ్య ఉన్న తెల్ల బిల్డింగ్ ఎంతో నాజుకుగా కనిపిస్తోంది. కారు ఆపి, మేమిద్దరం సన్నటి దార్లో నడిచి లోపలికి వెళ్ళాం. అది ఓల్డ్ ఏజ్ హోంలా అనిపించ లేదు. ఓ స్టార్ హోటల్ ఫ్రంట్ ఆఫీస్‌లా ఉంది.

అక్కడి వాళ్ళకి మేము వచ్చిన పని చెప్పింది.

మీరు కోరినట్లుగానే ఈ గదిని మేము అలాగే ఉంచాము అంటూ ముందుకి నడిచి, ఓ కారిడార్‌లో ఉన్న చివరి గదికి తీసుకెళ్ళారు.

ఆ గది తలుపులు తెరిచాకా మేము లోపలికి వెళ్ళాం. పెద్ద గది. లోపలికి వెల్ళగానే, కావేరి ప్రతీ అంగుళం తడిమి తడిమి చూసింది. కళ్ళు తుడుచుకుంది. పాపం అనుకున్నాను. ఏం జరిగిందో ఎన్నో ప్రశ్నలు వేసింది.

ఆమెని కనిపెట్టుకుని ఉన్న పని వాళ్ళకి, ఆమెకి సపర్యలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు తెలుపుకుంది. వాళ్ళందరికి పళ్ళు పంచింది.

ఆమె తల్లి ఆఖరి సంవత్సరాలు ఎలా గడిచాయో వాళ్ళు చెప్తూంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ ప్రదేశం, ఆ హోమ్, అది ఓ విషాద కథలకి నిలయంలా ఉంది. అందులో ఉన్నవాళ్ళని చూస్తే నిరాశ, నిస్పృహ, దురదృష్టం వాళ్ళ ప్రపంచంలా అనిపించింది. అది ఓ నిశ్శబ్ద ప్రపంచం. అక్కడ మాటలతో పనిలేదు కాబట్టి, కావేరి నిశ్శబ్దంగా ఉంది. బయటికి వచ్చాకా ఆ చుట్టూ ఉన్న చెట్లని చూస్తూ తిరుగుతూ చాలా సేపు గడిపింది.

ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ చెట్ల నుంచి ఓ విధమైన పరిమళం ముక్కులని తాకుతోంది. గాయపడ్డ హృదయాలకి పలచటి బాండేజి చుట్టుతున్నట్లుగా ఉంది.

ఆమె అక్కడ ఉన్నతీరు, మాట్లాడిన తీరు చూసాక మొదటిసారి అనిపించింది. కావేరి నాకు చెందిన మనిషి కాదని. ఈ కావేరి వేరు. మరో మనిషి. కావేరి డిఫరెంట్.

మా ఇద్దరి మనస్తత్వాలు వేరు. మా పెళ్ళికి ఆకర్షణ ఒకటే ఆధారం. ఆకర్షణ ఎన్ని రోజులుంటుంది. అది పోయాక ఏంటి, చాలా ఆలోచించాను.

మేం ఒకరినొకరం ఇష్టపడ్డాం. అర్థం చేసుకున్నాం. మరి ఇదేంటి, ఆమె వేరు అని ఎందుకు అనిపిస్తోంది. నిజంగా నేను ఆమెని అర్థం చేసుకోలేదా. అలా ఎందుకనిపించింది.

అర్థం చేసుకోడం అన్నపదాన్ని నేను ఎంత త్వరగా వాడేసాను. అది అంత తొందరగా వాడే తేలికైన పదం కాదు. అది అంత సులభం కూడా కాదు. అది నేను నన్ను నమ్మించుకోడానికి వాడిన వాక్యం.

ఇప్పుడు ఆలోచిస్తూంటే అసలు నాకు నేను ఎంత వరకు అర్థం అయ్యాను. తను అర్థం అయ్యాడో లేదో తనకే తెలీనప్పుడు ఇంక కావేరి మనసుని అర్థం చేసుకున్నానని ఎలా అనుకున్నాను. మనిషి మనసులోని లోతుల్ని ఆలోచనల్ని, ఆ ఆలోచనల వెనక ఉన్న కారణాలని పట్టుకోగలనా అనిపించింది. ఇప్పుడు ఇవి నాకు మరో రకం ప్రశ్నలు నా ఎదురుగా ఉన్నాయి.

నిజం చెప్పాలంటే ప్రతీ మనిషిలో మనకి తెలీని ఎన్నో రహస్యాలుంటాయి. మనం గుర్తించని భావాలుంటాయి. మీ ఇద్దరిని చూసాకా నాకు ఒకటే అనిపించింది.

పైకి కనిపించేది పూర్తి వ్యక్తిత్వం కాదు. లోపల అంతు చిక్కని రహస్యాలెన్నో ఉంటాయి.

ఎంత దగ్గరవారైనా కొన్ని సందర్భాలలో అర్థం చేసుకోడం కష్టం. ఇదే జరిగిందా నీ విషయంలో, కావేరి విషయంలో.

ఒక వేళ గడపాల్సి వస్తే ముందు ముందు వీళ్ళ మధ్య గడిపే జీవితం ఎలా ఉంటుంది.!

ఓ వ్యక్తి నిష్క్రమణంతో ప్రపంచం ఆగిపోదు కదా, ఒక వక్తి మరణంతో జీవితం ఆగిపోతుందా. ఇలాంటివే ఎన్నో ప్రశ్నలు, జవాబులు వెంటనే దొరకక పోవచ్చు.

జీవితంలో మిగిలేది ఆఖరున ఇలాంటి ప్రశ్నలే..

ఓ పెళ్ళి నిలవాలంటే ఆకర్షణ ఒక్కటే చాలదు. మనస్సులు కలవాలి, రుచులు కలవాలి ఒకరినొకరు అభిమానించాలి.

చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు ఒక్కసారిగా మారడం కష్టం. అది హనీమూన్‌లో కూడా గమనించాను. కాని దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆమెని అర్థం చేసుకుని ఆమెకి నచ్చేలా ప్రవర్తించగలను. పెళ్ళంటే కొన్ని విధాలుగా త్యాగాలు చెయ్యక తప్పదు. నేనైతే చేస్తాను. మరి ఆమె కూడా చెయ్యాలి కదా, మరి చేస్తుందా. చెయ్యమని చెప్పాలా, అసలు చెయ్యమని చెప్పడం ఏంటీ, ఆమెకిష్టమైతే అడ్జస్ట్ అవుతుంది. పెళ్ళి అంటేనే కొన్ని త్యాగాలు, కొన్ని సద్దుబాట్లు తప్పవు. ఇది ఆమెకి తెలుసు. అందుకే ఏనాడూ గొడవ పెట్టలేదు.

ఒకే రకమైన మనస్తత్వం ఉన్న మనుషులు కలవడం, అందులో పెళ్ళయ్యాక అన్నది అపురూపం. కాని అలా జరగడం లేదు. ఇది ప్రకృతి కన్నింగ్‌తో చేసింది. భార్యాభర్తల తత్వాలు కలవక పోవడం అనేది ఓ పెద్ద కారణంగా అనిపించ లేదు.

మా అమ్మా నాన్నగారు ఇద్దరి ఆలోచనలు కలవవని నాకు తెలుసు. అప్పడప్పుడు వాదించుకునేవారు. అది సహజం అని అనుకున్నారు. కాని మా అమ్మ ఎప్పుడూ బాధ పడినట్లు తెలీదు. మీ నాన్నగారు నాకు సరి అయిన భర్త కాదు. నేను ఈ జీవితంలో ఏం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. నేను సంతోషంగా లేను. అలాంటి మాటలని ఆమె ఎప్పుడూ నాతో ఎప్పుడూ అనలేదు. వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు కలవకపోయినా ఉన్నారు. మా ఇంటికి ఎంతో మంది వచ్చేవారు, మేము కూడా ఎంతో మంది ఇళ్ళకి వెళ్ళే వాళ్ళం. ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు మా ముందే వాదించుకుంటూ కనిపించినా ఎక్కడా బాధ పడినట్లుగా అనిపించ లేదు. మాకు తెలీదు. అదే విధంగా కావేరి నేను మా అభిప్రాయాలు ఆలోచనలు వేరు కావచ్చు. అంత మాత్రాన ఆమెనుంచి విడిపోవాలని నేననుకోలేదు. కాని ఆమె అనుకుంది…

కాని మనం మరొకరి ఇష్టాలను మార్చలేము. ఇదే అనిపించింది కావేరి వాళ్ళమ్మ పోయిన హోంలో నడిచినప్పుడు మొదటిసారి అనిపించింది, మా వివాహం నిలుస్తుందా! నానుంచి ఎలాంటి లోటు రానివ్వను. కావేరి సుఖం నేను కోరుకుంటున్నాను. నన్ను నమ్మి ఆమె నా జీవితంలోకి వచ్చింది. కాని, నేను అనుకున్నట్లుగా కావేరి లేదు. మానవ సంబంధాలు ఇంత దిగ జారిపోతోందేంటి!”

ఇలా అన్నాక బ్రహ్మాజీ నిస్సహాయంగా చేతిని నుదుటికి ఆనించి తల వంచుకున్నాడు

శివరాం ఏం మాట్లాడలేదు. తరవాత ఏం జరిగింది అని కూడా అడగలేదు. కాని బ్రహ్మాజీ కొనసాగించాడు.

“ఆ తరవాత నేను ఇంటికి వచ్చాను. ఆ తరవాతది నీకు తెలుసు. ఒక విషయం నేను గమనించలేదు. నువ్వు కావేరిని పరిచయం చేసినప్పుడు నీకు కావేరి మీద ఇంట్రెస్ట్ ఉందన్న సంగతి తెలీలేదు. అసలు ఆ ఆలోచన రాలేదు. నీకు ఆమె అంటే ఇష్టం అన్న సంగతి నాకు తెలీకుండా ఉంచావు. కాదు అలా ప్రవర్తించావు..

నేను ఆమెకి ఎన్ని ఇవ్వాలో అన్నీ ఇచ్చాను. హోదా, డబ్బు, నా ప్రపంచం లోకి సంతోషంగా ఆహ్వానించాను. కాని ఆమె నా ప్రపంచంలో భాగం పంచుకోలేక పోయింది. ఆమెది చిన్నపిల్ల తత్వం.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here