ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-4

0
10

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]న[/dropcap]లభైమూడేళ్ళు దాటింది. ఇన్ని ఏళ్ళ తరవాత ఇప్పుడు ఉత్తరం రాసాడు. అసలు ఉత్తరంలో ఏం ఉందో ఆ ఉత్తరం చదివాడు. అందులో ఏం లేదు.

కాని, ఆ ఉత్తరం ఎన్నింటినో కళ్ళ ముందుకి తీసుకొచ్చింది. స్కూలు, హాస్టల్, తన భవంతి, కావేరి, ఉదయం వేట అన్నీ కూడా కదిలాయి.

ఆ ఉత్తరం వారం రోజుల క్రితం వచ్చింది. తను లేక పోవడం వల్ల ఇప్పుడు చేతికి వచ్చింది. ఇప్పుడు చదివాడు.

అందులోని సమాచారం పెద్దగా ఏం లేదు. వస్తున్నానని పొడిపొడిగా రాసాడు.

అదే అతనిలోని శక్తిని లాగేసాయి. కలవరపెడ్తున్నాయి. అటూ ఇటూ తిరిగి, అలిసినట్లనిపించి అక్కడ ఉన్న ఓ పెద్ద సింహాసనం లాంటి కుర్చీలో కూచున్నాడు. దాని పక్కన ఓ నగిషీలు చెక్కిన అందమైన చిన్న గుండ్రటి టేబుల్ ఉంది. దాని మీద ఓ వెండితో చేసిన బెల్ ఉంది.

దాన్ని నొక్కాడు. రామయ్య ప్రత్యక్షం అయ్యాడు.

“ఓ సారి సీతమ్మని రమ్మన్నానని చెప్పు.”

సీతమ్మకి దాదాపు ఎనభై ఐదేళ్ళు పైనే ఉంటాయి. ఆమె ఈ భవనంలోకి నిశ్శబ్ధంగా బ్రహ్మాజీ పుట్టినప్పడు అడుగు పెట్టింది.

ఆమెకి పదేళ్ళకే పెళ్ళిఅయింది. మరో రెండేళ్లకి భర్త పోయాడు. వితంతువుగా అత్తగారింటి ఆరళ్ళు భరించలేక పుట్టింటికి వచ్చింది. వాళ్ళకి బరువైంది. పుట్టింటి వారికి తన మూలంగా వస్తున్న ఘర్షణలు పోట్లాటలు చూడలేక చచ్పి పోడానికి సిద్ధమై కాలవ దగ్గరికెళ్ళిన ఆమెని రక్షించి బ్రహ్మాజీ ఇంట్లో పెట్టారు. ఆమె వచ్చిన రోజే బ్రహ్మాజీ పుట్టాడు. ఇప్పుడు బ్రహ్మాజీ కూచున్నఈ గదిలో సీతమ్మ ఊయల ఊపింది జోలలు పాడింది. బ్రహ్మాజీ ఆలనా పాలనా చూసింది.

ఆమె అహంకారంతో ఏనాడూ ప్రవర్తించ లేదు. తన స్థానం ఏమిటో ఎక్కడో ఆమెకి బాగా తెలుసు, అనవసరంగా మాట్లాడదు. ఇప్పటికీ అదే నిశ్శబ్ధం. కాని మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఆమె గట్టిగా మాట్లాడగా బ్రహ్మాజీ ఎప్పుడు వినలేదు.

సీతమ్మ ఆ ఇంటికి వచ్చిన పన్నెండేళ్ళకి బ్రహ్మాజీ తల్లి వసుంధర ఆరోగ్యం పాడైంది. ఆయాలున్నా, నర్సులున్నాకూడా సీతమ్మ వాళ్ళతో పాటూ ఉండేది. వాళ్ళ కన్నా ఎక్కువగా అన్ని రకాల సేవలు ఆమెకి చేసింది.

ఎంత పని చేసినా చిరునవ్వుని ఏరోజున కూడా చెదర లేదు. ఆమెకి ఏ హోదా ఎవరూ ఇవ్వలేదు. కాని, ఆమె ప్రాముఖ్యత, సమర్థింపు అందరికి తెలుసు. ఆమెకి ఎనభై దాటిందన్న విషయం ఆమెకి, బ్రహ్మాజీకి తప్ప ఎవరికీ తెలీదు. అదో పెద్ద టాపిక్ కాదు. దాని గురించి ఎవరూ ఎప్పుడూ పట్టించుకోలేదు.

బ్రహ్మాజీ తల్లి వసుంధరా దేవి పోయినప్పుడు ఆమె ఎవరినీ దగ్గరికి రానీయలేదు. తనే ఆ శవానికి అన్నీ చేసింది. తల్లిని పోగొట్టుకున్న పసిపిల్లలా ఏడ్చింది.

వసుంధర పోయిన తరవాత బ్రహ్మాజీ తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. ఓసారి ఓ దివాన్ గారి భార్య కోసం భవంతి కట్టించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. భవనం కడుతున్నది ఓ చిన్నసైజు కొండ మీద. అక్కడ జారి పడిపోయి కాలు విరిగి మంచం పడ్తే, అప్పుడు కూడా అతనికి కూడా సీత దగ్గరుండి పనివాళ్ళచేత సేవలు చేయించింది. అతనికి పుస్తకాలు చదివి వినిపించింది.

తరవాత బ్రహ్మాజీ పెళ్ళైంది. పాత భవనం పక్కనే కొత్తగా కట్టించాడు చిన్న అందమైన పొదరిల్లు భార్య కోసం. ఆమె గది పక్కనే తన గది. అందులో లండన్ నుంచి, పారిస్ నుంచి అందమైన తెరలు తెప్పించి కిటికీలకి వేసారు. పెద్ద హాల్లో విదేశీ షాండిలీయర్స్‌తో అలంకరించాడు. కొత్త భార్యతో మాట్లాడుకునేందుకు, టీ తాగేందుకు, భోజనం చేసేందుకు అందమైన ప్రదేశాలని చూసుకుని సోఫాలు, టేబుళ్ళూ అరేంజ్ చేయించాడు. గాజు తలుపుల వెనక కనపడేలాగా అందమైన పూలతోట వేయించాడు.

పెళ్ళయ్యాకా హనీమూన్‌కి వెళ్ళారు. సీతమ్మ వాళ్ళ రాక కోసం గుమ్మం దగ్గరే నుంచుంది. ఆహ్వానించింది. కొత్త కోడలు కావేరిని ఆశీర్వదించింది. ఆమె సంతోషపడేలా ప్రవర్తించింది.

కాని సీతమ్మకి కావేరి అసలు అర్థం కాలేదు. ఆమె జీవితం సీతమ్మకి ఎప్పుడూ ఓ పజిల్ లాగా అనిపిస్తుంది. వసుంధర కన్నాకావేరికి దగ్గరగా మసిలింది. అయినా ఆమెకి అర్థం కాలేదు.

ఆమెకి అర్థం కానివి చాలా ఉన్నాయి, గర్భణి అయిన భార్యని బ్రహ్మాజీ ఎప్పుడూ కూడా చూడడానికి ఎందుకు రాలేదు? ఎందుకో తెలీదు.

తెలుసుకోవాలని ఉన్నాఅడగ లేకపోయింది. కాని తన స్థానం ఏంటో ఆమెకి తెలుసు. అడగడం అన్నది తన స్థాయికి మించినది.

కావేరి కూడా గది దాటి బయటికి రాలేదు. తనకి ఏం కావాలో ఎప్పుడూ నోరు విడిచి అడగలేదు. సీతమ్మ అన్నీ కనుకుని చేయించేది. అంతే కాకుండా డాక్టర్లు ఏం చెప్తే, అదే విదంగా చేసింది. ఏ రోజు విషయాలు ఆరోజే అన్నీ బ్రహ్మాజీకి చెప్పేది.

కావేరి విషయంలో బ్రహ్మాజీ ఏనాడు ఉత్సాహం చూపించలేదు. తండ్రి కాబోతుంటే కలిగే ఉత్సాహం బ్రహ్మాజీకి ఎందుకు కలగడం లేదు. ఏం జరిగింది అని ఆ ఇద్దరిని అడగాలని ఉన్నా ఆమె అడగలేదు. అయితే ఆ విషయం గురించి ఏనాడు ఆమె బయట పడలేదు. కాని ఏం జరిగిందో ఆమెకి తెలీదు కాని ఏదో జరిగింది.

కావేరి ఒంటరిగా ఓ ఇంట్లో, బ్రహ్మాజీ మరో ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు కలిసి ఉండడం లేదో ఆమెకు అర్థం కాని విషయం. ఆమెకి కావేరి అంటే ఓవిధమైన జాలి కలిగింది. ఆమె భర్త నిరాదరణకి గురి అయిన అమ్మాయి. ఆమె బాధ సీతమ్మకి అర్థం అయింది. కాని నిస్సహాయురాలు. వారి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోదలుచుకోడం మంచిది కాదు. తన గౌరవం పోగొట్టుకోదలుచుకోలేదు.

ఆమె పోయే వరకూ బ్రహ్మాజీ ఆమె గదికి వెళ్ళ లేదు. ఆమె మొహం చూడలేదు. ఆమెతో మాట్లాడలేదు.

బతికి ఉన్నప్పుడు, ఆఖరు రోజుల్లో సీతమ్మతో కావేరి బ్రహ్మాజీకి కబురు పెట్టించింది. అయినా కూడా బ్రహ్మాజీ వెళ్ళలేదు. ఒంటరిగా ఎనిమిదేళ్ళు కావేరి తన గదిలో ఉండి పోయింది. ఆమె పోయిన రోజున మాత్రం బ్రహ్మాజీ కావేరి గదికి వచ్చాడు. ఆమె పోయిన వెంటనే ఆమె గది తలుపుకి తాళం వేయించాడు. ఇది జరిగి ముప్పై రెండేళ్ళైంది. ఆ గదిలోకి పని వాళ్ళు, సీతమ్మ మాత్రం శుభ్రం చేయడానికి వెళ్ళేవారు.

భార్య పోయాక బ్రహ్మాజీ ఓ ఏడాది వరకూ ఎక్కడెక్కడో తిరిగాడు. తిరిగి ఇంటికి వచ్చాకా తన ఇంటికి వెళ్ళలేదు. పాత భవనంలో తన తల్లి గదిలోకి మారిపోయాడు వీటన్నిటికీ సాక్షి సీతమ్మ.

జరిగినవన్ని ఓ సారి గుర్తు తెచ్చుకుంటూ గదిలోకి అడుగు పెట్టింది.

శబ్ధం అయింది. కిటికీ దగ్గరున్న బ్రహ్మాజీ వెనక్కి తిరిగాడు. సీతమ్మ నుంచుని ఉంది.

“కూచో” అన్నాడు.

మెల్లిగా వచ్చి, ఓ సోఫాలో కూచుంది. మొహం నిండా ముడతలు, తెల్లచీర. ఈ మధ్య చూళ్ళేదు చాలా రోజులైంది కాని చాలా పెద్దదైంది ఆమెని చూసి, అని అనుకున్నాడు

“నేను ఏర్పోర్ట్ నుంచి నీకు శివరామ్ గురించి ఫోన్ చేసాను. ఇప్పుడు ఆ శివరామ్ మన గెస్ట్ హౌస్‌లో ఉన్నాడు. అసలు నీకు శివరామ్ గుర్తున్నాడా?”

ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టి, ఆ తరవాత తల ఊపింది గుర్తున్నాడన్నట్లుగా.

“ఆ శివరామ్ ఉత్తరం రాసాడు. అంతే కాదు, నిన్న నాతో పాటూ దుబాయ్ నుంచి హైదరాబాదు వచ్చాడు. సాయంత్రం ఇక్కడికి వస్తాడు. ఇదివరకు లాగే……”

ఆ తరవాతది పొడిగించడానికిష్ట పడలేదు. కాని సీతమ్మ అర్థం చేసుకుంది.

“ఇక్కడా, కింద డైనింగ్ హాల్లోనా?”

ఆమె గొంతు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏ విధమైన భావం లేదు. కొత్తగా ఉందన్నట్టు ఆశ్చర్యంగా ఛూడలేదు.

ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి ఎవరిని ఆహ్వానించలేదు. ఎవరూ రాలేదు. ఎప్పుడైనా ఎవరైనా స్నేహితులు, ఆ ఊరు వచ్చినప్పుడు, సరదాగా వేటకెళ్ళే వాళ్లు. ఓ రెండు మూడు రోజులుండి వెళ్లి పోతూంటారు, వాళ్ళైనా కూడా ఆ భవనానికి కాస్త దూరంలో ఉన్న చిన్నగెస్ట్ హౌస్‌లో ఉంటారు.

ఈ భవంతికి వాళ్ళెవరూ ఎప్పుడూ వచ్చేవారు కాదు. వారి సంగతి, మర్యాదలు, కావలసిన సదుపాయాలు, భోజనం, పడక అన్నీ కూడా జమీందారి పద్ధతిలో జరిగేలాగా మేనేజరు చూసుకుంటాడు. అన్నీకూడా బ్రహ్మాజీ పేరు మీద నడుస్తూంటాయి. దీనిమీద ఎవరికి దురభిప్రాయం లేదు. భార్య పోయాక ఆయన పబ్లిక్ లోకి రావడం మానేసాడని అందరికి తెలుసు.

“ఇక్కడ కాదు. డైనింగ్ హాల్లోనే.”

“అలాగే అక్కడే ఏర్పాట్లు అన్ని చేయిస్తాను.”

“మేము ఎనిమిది గంటలకి భోంచేస్తాం, అన్నీ ఎప్పటిలాగా ఉండాలి. అయిపోతాయా?” కుర్చీ కోడుని ఆనుకుని చేతి కర్ర మీద రెండు చేతులు ఆనించి చిన్నపిల్లడిలా అడిగాడు.

“అన్ని అయిపోతాయి. శివరామ్‌కి ఏది ఇష్టమో, ఏం కావాలో ఎలా ఉండాలో అన్నినాకు తెలుసు, దగ్గరుండి నేను చేయిస్తాను. ఈ రాత్రికి ఇక్కడ ఉన్నా పరవాలేదు. కింద వరండా పక్క నున్న ఆ గదులన్నీ శుభ్రం చేసినవే. మీరు ప్రశాంతంగా ఉండండి.”

ఆ మాటల్లో మెత్తదనం బ్రహ్మాజికిష్టం. ఆమె సొంత తల్లి కాదు, కానీ సొంత తల్లి కన్నా ఎక్కువగా చూసింది. బ్రహ్మాజీ పుట్టడం మొదలు చూసింది ఆమెనే. వారి మధ్య ఉన్న బంధం భౌతికమైన దానికన్నా ఎక్కువ. వాల్లిద్దరూ అక్కా తమ్ముడూ కాదు, తల్లీ కొడుకులూ కారు, స్నేహితులు కూడా కారు, వారి బంధానికి పేరు లేదు. భాష కందనిది.

“ఇది వరకు ఎలా ఉండేదో ఆ గది అలాగే ఉంచాలా”

“అవును, ఆరోజుల్లో ఎలా ఉండేదో సరిగ్గా అలాగే ఆ గది ఉండాలి. సరేనా.”

“సరే, అలాగే ఏమాత్రం తేడా రాకుండా అంతా ఏర్పాటు చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఏం వర్రీ కాకూడదు, అలా అని నాకు ప్రామిస్ చేయండి.”

ఆమెకి తెలుసు శివరామ్ ఏ విధంగా ఆ ఇల్లు విడిచి వెళ్లిపోయాడో, దాని మూలంగా బ్రహ్మాజీ ఎంత క్షోభని అనుభవించాడో, ఇప్పుడు ఆమె బాధ అంతా ఇతని రాక వలన బ్రహ్మాజీ మానసికంగా మరోసారి దెబ్బ తింటాడా అని. అందుకే ప్రామిస్ చేయమంది.

అలాగే ఆమె ముడతల చర్మం మీద తన ముడతల చేతిని ఉంచాడు.

సీతమ్మ వెళ్ళి పోయింది. మళ్ళీ ఆలోచనలు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here