ఎంత చేరువో అంత దూరము-10

15
11

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జాను రాసిన ఉత్తరం చదివిన ఊర్మిళ విస్మయంగా ఉండిపోతుంది. ఆనంద్ తనకీ విషయం చెప్పనందుకు బాధపడతుంది. ఎప్పుడు చెబితే అప్పుడే చెప్పనీ అనుకుంటుంది. ఊరు నుంచి వచ్చిన ఆనంద్‍కి ఎదురెళ్ళి స్వచ్ఛమైన నవ్వుతో పలకరిస్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఉత్తరం సంగతి ప్రస్తావించకుండా ఆనంద్ తనతో ఎంత క్యాజువల్‍గా ప్రవరిస్తున్నాడోనని అనుకుంటుంది. ఆనంద్ చెబితే బాగుండని భావిస్తుంది. బడిలో పిల్లల మధ్య ఏర్పడిన బేధాభిప్రాయాలను తొలగించి, వారి  మధ్య మైత్రికి బాటలు వేస్తుంది ఊర్మిళ. ఆనంద్ ఆ విషయం చెప్పడని గ్రహించిన ఊర్మిళ తనే జానూ ఉత్తరం గురించి అడగాలనుకుంటుంది. ఆ సాయంత్రం వర్క్ తొందరగా ముగించుకుని ఆఫీసు రూములో రిలాక్స్‌డ్‍గా కూర్చున్న ఆనంద్ ముందు జానూ ఉత్తరం గురించి అడుగుతుంది. ఒకటి కాదు, చాలా రాసింది, అక్కడే ఉన్నాయి, చదవుకో అంటాడు. అలా వదిలేస్తే ఎలా అని అంటుందామె. జానూ ఉత్తరాల వెనుక ఎవరున్నారా అని కొన్ని క్షణాలు ఆలోచిస్తాడు ఆనంద్. ఎవరున్నా సరే, తన బాధ్యతను మరొకరు గుర్తు చేయాల్సిన అవసరం లేదని తలుస్తాడు. జానూకి ఉత్తరం రాయమంటుంది ఊర్మిళ. వద్దు, ఇబ్బందులొస్తాయంటాడు ఆనంద్. తాను చైల్డ్ సైకాలజీ చేసింది, ఓ చైల్డ్‌ను బాధ పెట్టేందుకు కాదని అంటుంది ఊర్మిళ. చివరికి ఆమె ఒత్తిడికి లొంగి జానూని హైదరాబాద్‍కి రమ్మని క్లుప్తంగా ఉత్తరం రాస్తాడు ఆనంద్. ఉత్తరం అందుకున్న భద్రం గారు విషయం జానూకి, మాలతికి చెప్తారు. జాహ్నవి ఆనందానికి అంతుండదు. సంతోషంతో ఇల్లంతా గెంతులు వేస్తుంది. తన ఆనందాన్ని నేస్తం నీలిమతో పంచుకోవడానికి వాళ్ళింటికి వెడుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 10

[dropcap]నీ[/dropcap]లిమ ఇల్లు దూరమే.

వెళ్ళడానికి రావడానికి బాగానే సమయం పడుతుంది.

సంతోషంలో నీలూ, జానూ వాటేసుకున్నారు.

అమ్మాయిలిద్దరూ – సాయం వేళలో స్వచ్ఛమైన చల్లగాలికి డాబా ఎక్కారు.

భారతి గారు ఇద్దరికీ పైకి జంతికలు పంపించారు. మహేంద్ర గారు బయటకు వెళ్ళారు. నములుతూ ముచ్చట్లు మొదలు పెట్టారు.

ఒకరి ప్రక్కన ఒకరు పిట్ట గోడ నానుకుని నిల్చుని, మనసారా మాట్లాడుకుంటూంటే, ఇద్దరికీ ఆ క్షణాలు ఎంతో అపురూపంగా ఉన్నాయి.

“హమ్మో! చాలానే జరిగాయి.” అంది నీలిమ.

ఉత్తరాలు, ఫోన్స్ కాకుండా చాలా రోజుల తర్వాత డైరెక్ట్‌గా మాట్లాడుకుంటున్నారు.

ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది.

“అవునే, చాలానే జరిగాయి. నా కన్సర్న్ అమ్మ గురించే! ఏవో ఆలోచనలు చేసుకుంటుంది. అవి పాజిటివ్ అయితే పర్లేదే! అలా కాదు కనుకనే బాధ!” అంది.

భూషణం తాతగారు వాళ్ళు వచ్చిన దగ్గర్నుండి ఏమేమి జరిగాయో, తాతగారు ఏమన్నారో అన్నీ మళ్ళీ మాటల్లోకి వచ్చాయి.

మాలతిని తాతగారితో గుడికి పంపడం, ఉత్తరాలు చదువడం..

కేసును శోదించే లాయర్లలా.. ఆ నాటి తమ ముచ్చట్లు..

మాటల్లో ఎన్నో సంఘటనలు మళ్ళీ కళ్ళ ముందు కదలాడి వెళ్ళాయి.

ఏదైనా ప్రయత్నం తోనే కదా, సాధ్యం.

ఇద్దరికీ మనసుల నిండా సంతృప్తి నెలకొంది.

సందె చీకట్లు ముసురుకుంటూంటే డాబా దిగి వచ్చారు.

నీలిమకు, భారతి గారికి బాయ్ చెప్పి, మనసు నిండిన తృప్తితో ఇంటి దారి పట్టింది జాహ్నవి.

***

‘థాంక్ గాడ్! లెటర్ వ్రాసింది, నాన్న గారు. ఆమె వ్రాసి ఉంటే అమ్మ పంపేది కూడా కాదు’, అనుకుంది జాహ్నవి.

సరిగ్గా మాలతి కూడా ఇదే అనుకుంటూంది.

ఆ ‘పాపిష్టిది’ రమ్మని ఉంటే జాహ్నవిని పంపేది కాదు. వాళ్ళ నాన్ననే దాన్ని పిలిచాడు కనుక సరిపోయింది అనుకుంది.

జాహ్నవిపై ఆనంద్ నీడ కూడా పడకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆమె తండ్రి దగ్గరికే చేరుతూంది.. నీరు పల్లం వైపే ప్రవహించేట్టుగా..

అయినా, తన బిడ్డ ఏమి తప్పు చేసిందని తండ్రి ప్రేమకు దూరం కావాలి.

అక్కడికి వెళ్ళినంత మాత్రాన జాహ్నవేమీ మారిపోదు.

అది తన కూతురు. పంచ ప్రాణాలు దాని మీదే పెట్టుకుంది. జాహ్నవి ఎక్కడ ఉన్నా, దాని మనసులో తన స్థానం సుస్థిరం. తాను అనవసర భయాలు పెంచుకుని, అందర్నీ టెన్షన్ పెట్టేసింది అనుకుంది.

అనంద్ దగ్గరికి జాహ్నవి వెళితే, తన విషయంలో ఆనంద్ వైఖరి ఎలా ఉంటుంది? అని ఆలోచన వస్తూంది ఆమెకు ఈ మధ్య.

అతను జాహ్నవికై మైసూర్ వస్తాడా!

వస్తే తనకేమిటి? రాకుంటే తన కేమిటి?

ఆమె మనసు ఏదో అంటోంది. అది ఏమిటో మాలతి ఎన్నడూ తొంగి చూచే ప్రయత్నం చేయదు. తన ఇగోని తన మనసైనా హర్ట్ చేయడం భరించదు.

ఆనంద్ గురించి ఆలోచించట్లేదు అనుకుంటుంది అతని పై చాలా కోపం తనకు అనుకునేది. పుస్తకంలా మనసును మూసి పెట్టింది ఇన్నాళ్ళు. కానీ, మారిపోతున్న మనసును నిస్సహాయంగా చూస్తోంది ఇప్పుడు.

దేవుడి పీఠానికే ఇన్నాళ్ళు పరిమితమైన పెరటి పూలకు ఇప్పుడు ఆమె తలలో చోటు దొరుకుతూంది. ఆ ప్రౌఢలో దరికి రాని వసంతమేదో తనకై తరలి వస్తున్నట్టు..

మనసేదో మధుర గీతం ఆలపిస్తూంది.

ఆమె పెదవులు పాతపాటలను హమ్ చేస్తున్నాయి. నవ్వడం మరిచినట్టున్న మొఖంలో ఇప్పుడు చిరునవ్వుల కాంతి కొలువుదీరుతున్నది.

తీరైన చీరలతో, కంటికి నదురుగా కనిపిస్తోంది.

మాలతి తన పై తాను శ్రద్ధ కనబరచడం తాతగారు గ్రహించారు.

ఎందుకో అర్థం కాకున్నా, జాహ్నవికి కూడా తల్లిలో మార్పు సంతోషంగా ఉంది.

***

చూస్తుండగానే ఎగ్జామ్స్ మొదలు అయ్యాయి.

ఫుల్ టెన్షన్‌లో అమ్మాయిలు..

ఏ టెన్షన్ తీసుకోకుండా సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జామ్స్ వ్రాసింది జాహ్నవి.

అప్పుడే  హైదరాబాద్ వెళ్ళాలి అని లేదు. ‘ఇన్నాళ్ళు ఎగ్జామ్స్ హడావిడినే కదా! కొన్నాళ్ళు అమ్మతో, తాతయ్యతో హ్యాపీగా గడపాలి’ అనుకుంది.

ఫ్రెండ్స్ అందరికి తన హైదరాబాద్ జర్నీ గురించి చెప్పింది.

ఆశ్చర్యపోయారు అమ్మాయిలు.

ఎన్నో అడగాలని ఉన్నా ధైర్యం లేక ఆగిపోయారు.

వినుత నీలిమకు ఫోన్ చేసింది.

“ఇది అంతా ఎలా జరిగింది” అని.

నీలిమ ఓ అందమైన కట్టుకథ అల్లింది స్నేహితురాళ్ళ కోసం.

భూషణం తాతగారు హైదరాబాద్ వెళితే ఆనంద్ కనిపించారని, జాహ్నవిని వెకేషన్‌లో పంపమని చెప్పారని చెప్పింది.

“మరి ఆవిడ ఏమి అనదా!” అన్నారు.

“కొన్ని రోజులకు తప్పదు” అంది నీలి.

వాళ్ళకు సబబు గానే తోచింది.

అది జాహ్నవి గుడ్ లక్ అనుకున్నారు.

ఫ్రెండ్స్ అందర్నీ భోజనానికి పిలవాలి అని ఉంది జాహ్నవికి.

అమ్మ తాను వెళుతూన్న బాధలో ఉంటే ఇప్పుడెందుకులే, అనుకుంది.

కానీ, మాలతియే ఆ విషయం ఎత్తేసరికి, సరేనంది.

శ్రీనివాస్ ఫ్యామిలీని కూడా పిలిచారు.

“అక్కా! నువ్వు త్వరగా రావాలి.” అంటూ బుంగమూతి పెట్టింది టీనా.

అమ్మ దిగులు ముఖం చూస్తే బెంగగా ఉంది, జాహ్నవికి.

“కొన్ని రోజులే మామ్!” అంటూ బుజ్జగిస్తోంది.

మాలతి ఏమి చెప్తుంది?

ఇదంతా ఎప్పుడయినా అనుకుందా!

మారుతున్న పరిణామాలు విచిత్ర సంఘర్షణకు లోను చేస్తూంటే మౌనంగా ఉంది.

***

తాతగారు కూడా జాహ్నవి లేక చిన్నబోయే ఇల్లును ఊహించలేక పోతున్నారు.

ఆ చిన్న కుటుంబంలో..

ఎవరు లేకున్నా.. ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

పరస్పర మానసిక ఆధారం..

ఎన్నడూ ఎవరూ ఎవరినీ విడిచి ఉండక పోవడం..

ఇవన్నీ వాళ్ళలో జాహ్నవి జర్నీ పట్ల కలవరం కలిగిస్తున్నాయి.

ఒక ఫైన్ డే జాహ్నవి ప్రయాణానికి తేదీ నిర్ణయింపబడింది. అప్పటి నుండి ఇంటి వాతావరణంలో ఉద్విగ్నత చోటు చేసుకుంది. ఎవరికి వారు తమ భావ స్రవంతిలో మునిగి పోతున్నారు.

తాతగారి ఫోన్ అందుకుని అప్పటికే భూషణం గారు, రాధామ్మతో కూడా వచ్చేసి ఉన్నారు. తాతగార్లిద్దరూ మాట్లాడుకొని శ్రీనివాస్‌తో జాహ్నవికి సెల్‌ఫోన్ తెప్పించారు,  మాలతి మాటి మాటికీ చెంగుతో కళ్ళు అద్దుకుంటూనే ఉంది. రాధమ్మ గారు తనకు ఉన్న ప్రపంచ పరిజ్ఞానంతో ఆమెకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే – తేదీ  నిర్ణయింపబడిన విషయం ఆనంద్‌కు తెలియజేస్తూ లెటర్ వ్రాసింది జాహ్నవి. తన సెల్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది.

బెంగగా ఉన్న మాలతి ముఖం మనసును కుదిపేస్తోంటే -.తల్లికి పసిపిల్లకు మళ్లే ఎన్నో జాగ్రత్తలు చెప్పసాగింది. మందులు వేళకు వేసుకోమని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మని హెచ్చరికలు చేస్తూనే ఉంది. శ్రీనివాస్‌ను కూడా తాను వచ్చే వరకు అమ్మను, తాతయ్యనూ జాగ్రత్తగా చూడమని రిక్వెస్ట్ చేసింది. మొత్తం వ్యవహారంలో కూల్‌గా ఉన్నది తాతగార్లే! బిడ్డ తండ్రిని చేరడం శుభపరిణామం వారి దృష్టిలో! మాలతి భయాలు, మనోభావాలు లౌక్యం లేనివి.

“భూషణం తాతగారూ!  మీరు నేను వెళ్లిన వెంటనే వెళ్లొద్దు. కొన్ని రోజులు ఉండి వెళ్ళాలి.” అంది.

ఆయన ఎప్పుడూ జాహ్నవి విజ్ఞతకు మొదటి మార్కులే వేస్తారు. మురిసిపోతూ, “అలాగే జానూ తల్లీ! నీ మాట కాదంటానా!” అన్నారు,

ఎంత చేసినా తన వాళ్ళ జాగ్రత్త కోసం ఇంకా ఎంత చెయ్యాలో ఆలోచిస్తున్నది జాహ్నవి. బంధాలు ఎంత బలమైనవో!

***

అనుకున్న రోజు రానే వచ్చింది.

ఇక్కడ మైసూర్ లోనూ, అక్కడ హైదరాబాద్ లోనూ ఒక శుభ తరుణానికి ఆయత్తం చేస్తూ సూర్య భగవానుడు ఆరాటంగా ఉదయించాడు. కూతురు ఉత్తరాలు ప్రేమ పాశమై బంధింపబడిన ఆనంద్, తక్కెడ తూకంలో తల్లి కన్నీటి కంటే, తండ్రిని చేరాలన్న కోరికకే మొగ్గు చూపిన జాహ్నవి – ఇరు ప్రేమ బంధాల కలయికకు, రక్త సంబంధాల ఆకర్షణకు, మానవబందాల మనుగడకు మహత్తర వేదికలా – ఆ రోజు.. జీవితంలో నిలిచిపోయిన బంధాలను, నిలబెట్టేందుకు సంసిద్ధమై పట్టాల మీదకు వచ్చింది  ఆ .రైలు బండి.

శ్రీనివాస్ తన కార్లో డ్రాప్ చేసాడు. ఫ్రెండ్స్ సెండాఫ్ ఇవ్వడానికి వచ్చారు. స్కూల్‌కు వెళ్ళేప్పటి లాగానే రెండు జడలు రిబ్బన్‌తో మడిచి కట్టుకుని, పొడుగు ఫ్రాక్ వేసుకొని, భుజానికి తగిలించుకున్న బ్యాగ్‌తో చేతిలో చిన్న సూట్‌కేస్‌తో – ట్రైన్ ఎక్కింది జాహ్నవి.

నేను జాహ్నవిని వాళ్ళ నాన్న దగ్గరకి తీసుకెళుతున్నానోచ్! అంటూ కూత వేసి కదిలింది రైలు బండి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here