ఎంత చేరువో అంత దూరము-23

4
8

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఖాళీ సమయంలో ఆనంద్ ఢిల్లీ షాపింగ్ చేస్తాడు. అందమైన ఫ్రాక్‍లను చూసి నిట్టూరుస్తాడు. జాన్వి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక ఎవరి కోసం ఫ్రాక్స్ కొనాలి అనుకుంటాడు. ఊర్మిళ పుట్టినరోజు వస్తోందని, ఆమెకి ఓ మంచి హ్యాండ్ బ్యాగ్, కొన్ని పంజాబీ డ్రెస్‍లు కొంటాడు. ఓ చక్కని చీరని చూడగానే అతని స్మృతిపథంలో మాలతి మెదులుతుంది. చేతినిండా డబ్బున్నా, కొనాలని ఉన్నా, మనిషే దూరమని అనుకుంటాడు. అప్రయత్నంగా అతని మనసు గతంలోకి వెళ్తుంది. ఊర్మిళ సున్నితత్వాన్ని గుర్తు చేసుకుని, అక్కడ మాలతితో ఎంత ఇబ్బండి పడుతోందో అనుకుంటాడు. తను ఆమెకు ఇంగ్లీషు రచయితల పుస్తకాలు కొని పంపి, నెమ్మదిగా యాప్ సహాయంతో అర్థం చేసుకుంటూ చదవమని చెప్పిన సంగతి గుర్తు చేసుకుంటాడు. ఊర్మిళ ఎం.కామ్‍లో ఉండగా ఓ రోజు హఠాత్తుగా తనకి తీవ్రమైన కడుపునొప్పి రావటం, ఆసుపత్రిలో చేరడం, తన తరఫున ఊర్మిళ సంతకం పెట్టడం అన్నీ జ్ఞాపకం వస్తాయి ఆనంద్‍కి. ట్రీట్‍మెంట్ జరుగుతున్న సమయంలో మాలతిని చూడాలనిపించి రాధమ్మ గారితో మాట్లాడమని నెంబర్ కలిపి ఊర్మిళకిస్తాడు. రాధమ్మ గారి దగ్గర నుంచి మాలతి నెంబర్ తీసుకుని మెసేజ్ పెట్టమంటాడు. తన ఆరోగ్యం బాగోలేదని, తను వాళ్ల కోసం పలవరిస్తున్నానని మెసేజ్ పెట్టమంటాడు. అలాగే పెడుతుంది ఊర్మిళ. మేడం వస్తారు, భయపడద్దని చెబుతుంది. కానీ మాలతి రాదు. ఊర్మిళను హాస్టల్‌కు పంపేస్తాడు. ఒకరోజు రాధమ్మ గారు ఫోన్ చేసి – మాలతి హైదరాబాద్ బయల్దేరిందనీ, కానీ ఇంతలో ఎవరో హాస్పిటల్‍లో ఊర్మిళను ఆనంద్ పక్కన చూశామని చెప్పడంతో,  తన అనుమానం నిజమైందంటూ కూలబడిపోయి, ప్రయాణం మానుకుందని చెప్తారు. ఆనంద్‍ని డిశ్చార్జ్ చేస్తారు. ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటూంటాడు. అప్పుడు అన్నమ్మని వంట చేయడానికి పంపుతుంది ఊర్మిళ. గతంలోంచి బయటపడి ఊర్మిళకు ఫోన్ చేస్తాడు. నర్స్ వచ్చి ఇంజక్షన్ చేసిందా అని అడుగుతాడు. వచ్చి, చేస్తోందని చెప్తుంది. పిల్లల్ని నీ రూమ్‍లోనే పడుకోబెట్టుకుంటున్నావా అని అడిగితే, లేదు పైనే, జానూ దగ్గరే ఉన్నారని చెబుతుంది. అదేంటి వాళ్ళు వెళ్ళలేదా అని అడిగితే, లేదంటుంది ఊర్మిళ. మాలతి ఎందుకు వెళ్ళలేదో అతనికి అర్థం కాదు. – ఇక చదవండి.]

అధ్యాయం 23

[dropcap]మా[/dropcap]లతి వెళ్ళలేదనే విషయం కలిగించిన ఆదుర్దాను దూరం చేస్తూ, ఊర్మిళ బర్త్ డే వస్తోంది అన్న విషయంపై మనసు మళ్ళించాడు.

‘నవలా నాయికకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని మెసేజ్ పెడుతూ నవ్వుకున్నాడు ఆనంద్.

ఆ మెసేజ్ వెనుక మనోహరమైన గతం ఉంది.

ఇప్పుడు నవ్వుకునేందుకు మిగిలి ఉన్న జ్ఞాపకాల్లో అది ఒకటైంది.

తనకు ఆరోగ్యం బాగా లేక ఆమె హాస్టల్ నుండి వచ్చేసినప్పుడు – అమ్మణ్ణి ఫోన్ చేసింది.

హాల్లోనే ఫోన్ ఆన్ చేసి, కిచెన్ లోకి తీసుకొని వెళుతూంటే అవతల నుండి అమ్మణ్ణి గొంతు –

“హాయ్ జయంతి” అంటూంది.

ఈ జయంతి ఎక్కడి నుండి వచ్చింది. ఊర్మిళకు ఇంకో పేరు గానీ ఉందేమో అనుకుంటుంటే, ఊర్మిళ ఫోన్ తీసుకొని కిచెన్ లోకి వెళ్ళిపోయింది.

తాను అక్కడ ఉంది ఆమె గమనించలేదు.

వంట చేస్తుండడం వల్లేమో, స్పీకర్ లోనే పెట్టుకుంది. సౌండ్ తక్కువ ఉన్నా వినిపిస్తూనే ఉంది.

“విజయ్ హెల్త్ ఎలా ఉంది” అంటుంది అమ్మణ్ణి.

విజయ్ నా! అతనెవరు? హాయ్ జయంతి అంది, ఈ కొత్త క్యారెక్టర్స్ అన్నీ ఎక్కడ నుండి వచ్చాయి.

“ఇప్పుడు హెల్త్ బాగుందే!” అని ఊర్మిళ గొంతు.

తనకు ఏవో కాగితాలు కావల్సి వచ్చి వెతుకుతుంటే వాళ్ల సంభాషణ చెవిలో పడుతూనే ఉన్నది.

“అది కాదే రోజా! బావను చూసాక నా అభిప్రాయం మార్చుకున్నాను!” అన్న అమ్మణ్ణి మాటలకు తన ముఖం ప్రశ్నార్థకంగా మారిపోయింది.

మళ్ళీ రోజా అంటుందేమిటి? తను మాట్లేడేది ఒక్కళ్ళ తోనే, వంద మందితో కాదు అనుకున్నాడు, చిరాకుగా.

తాను పొరపడుతున్నాడా! అంత లేదు. ఓ పిచ్చి పిల్లకు ఇంతకంటే మంచి ఫ్రెండ్స్ ఎలా ఉంటారు.

తను నవ్వు దాచుకుంటూ వింటున్నాడు.

“మీనాకు పొలాల దగ్గర ఉన్న వాళ్ళ బావ నచ్చినట్టు, నాకూ ఉద్యోగం చేయకున్నా మా బావ నచ్చాడే!”

“ఈ మీనా ఎవరు? ఎప్పుడూ వినలేదు” అంటోంది ఊర్మిళ.

“‘మీనా’నవలలో మీనానే” అంది.

“థాంక్ గాడ్! ఆ పేరు నీకే పెట్టేసుకో!” అంది ఊర్మిళ.

“అది నాకే సెట్ అవుతుంది” అంది అమ్మణ్ణి. సుదీర్ఘమైన ముచ్చట ఏదో పెట్టినట్టుంది. మధ్యలో ఊర్మిళ ఊ, ఊ అంటోంది.

“అందుకే బావనే పెళ్ళి చేసుకుందామనుకున్నానే!”

“అంతేనే! ఎప్పుడైనా తెలిసిన వాళ్ళనే చేసుకోవాలి. అదే సేఫ్!” అంది ఊర్మిళ.

“ఉంటానే! రాజశేఖరం జాగ్రత్త!”

ఆ మాటకు తాను పొలమారినట్టు అయ్యి, తాగుతున్న నీళ్ళ గ్లాస్ ప్రక్కన పెట్టాడు.

అప్పుడే ఊర్మిళను పిలిచి ఈ సోది అంతా ఏమిటి? అని అడగాలి అనిపించింది. ‘వద్దు లే!’ పాపం అనుకున్నాడు.

ఏదయితేనేమి తనకో మంచి పాయింట్ దొరికింది.

“సరేనే!” అంది ఊర్మిళ.

సంభాషణ పరిసమాప్తి అయ్యింది.

ఈ పజిల్ ఛేదించాలి.

ఇంతకీ రాజశేఖరం, విజయ్ ఎవరు?

విజయ్ హెల్త్ ఏమిటి? రాజశేఖరం జాగ్రత్తనే అంటే సరేనంది.

అయితే డెఫినెట్‌గా తానే!

‘మీనాలో మీనా.. బావనే చేసుకుంటా’ ఎక్కడో పొర వీడుతుంది.

అంటే తాను నవలలో హీరోనా!

అయితే ఊర్మిళ..!!

ఆనంద్ కనుబొమ్మలు ఎగరేసాడు. మై గాడ్.. ఆ అమ్మణ్ణి, గుమ్మణ్ణి ఎంత కథ అల్లింది.

ఇంత లైవ్‌గా తానుంటే తనను నవలలో పాత్ర చేయడం ఏమిటి?

ఆ పుస్తకాల పురుగు – పురుగు కాదు నల్లి, ఆ నవలా నల్లి – అల్లిన కథను ఊర్మిళ ఎలా యాక్సెప్ట్ చేసింది. ఈ ఫ్రెండ్‌ను ఇలా భరించక తప్ప దనుకుందేమో!

‘సిల్లీ గాల్స్!’ కనిపించని దరహాస రేఖ..

ఆ మరునాడు తనకు టిఫిన్ పెట్టింది.

వంట కేవో కూరగాయలు తీసుకునేందుకు ఫ్రిజ్ డోర్ తెరిచిన ఊర్మిళ – చేతిలో గిన్నె పట్టుకొని, కూరగాయలు తీసుకొని అటు నుండి ఇటు తిరిగే సరికి, పొడవాటి వాలుజడ భరతనాట్య మాడింది.

‘ఎంత పెద్ద జడ!’

తెలిసిన విషయమే అయినా, ఇంత నింపాదిగా ఎప్పుడూ చూడలేదు.

“ఊర్మిళా! ఇది అంతా నీ జుట్టే!” అన్నాడు సందేహం వచ్చి.

ఆనంద్ తనని గమనించేసరికి, ఊర్మిళ బిడియపడింది.

“కేరళలో అంత కోకోనట్స్ కదా, అక్కడి వాళ్ళకు జుట్టు ఎక్కువే సర్! చాలా మంది అక్కడ అలా జుట్టు విప్పుకునే తిరుగుతారు.” అంది.

“నువ్వు కూడానా!” అన్నాడు.

“అవును సర్” అంది.

తన జుట్టు పట్ల స్త్రీ సహజ మురిపెం ఊర్మిళలో కనిపిస్తోంది.

తల ఎత్తిన ఊర్మిళకు ఆనంద్ పెదవులపై దరహాస రేఖ కనిపించింది.

“ఎందుకో నవ్వుకున్నారు” అంది.

“ఏమి లేదు” అన్నాడు.

ఊర్మిళకు సందేహం వదల్లేదు.

“నిజంగానే మా కేరళ వాళ్ళకు జుట్టు పొడవుంటుంది సర్!”

“అందుకు కాదు. ఏరియల్ అడ్వర్టైజ్ కదా! జుట్టు విరబోసుకుంటానని చెపితే..!”

దాగీ దాగని నవ్వుతో ఆనంద్..

ఊర్మిళకు ముందు అర్థం కాలేదు.

అర్థం అయ్యాక ఉక్రోషంతో ముక్కు పుటాలు అదురుతూంటే –

“అప్పుడు నేను ఏంజల్‌లా ఉంటాను సర్!” అంది.

“అందుకేనా నీకు సహస్రనామ స్తోత్రం ఉంది.”

ఊర్మిళ అర్థం కానట్టు చూసింది.

“జయంతి, రోజా, గీజా..”

ఊర్మిళ ముఖం కందిపోయింది.

అలాగే చేతిలో గిన్నెతో గిర్రున వెనుదిరిగింది.

జడ మరోసారి నాట్యం ఆడింది.

“ఇదుగో ఊర్మిళా! నా పేరు విజయానందో, రాజశేఖరానందో కాదు. మా అమ్మ చక్కగా ఆనంద్ అని మాత్రమే పెట్టింది. హౌ, డేర్, గుమ్మణ్ణి! సారీ అమ్మణ్ణి!” అని,

“అయినా నవలల్లో నాయకులను కాదు, జీవితాల్లోని నాయకుల గురించి తెలుసుకోవాలి అని మీ దోస్త్‌కు చెప్పు!.”

ఊర్మిళ ముఖం నెత్తురంతా ఓడేసినట్టు ఉంది.

“అది కాదు ఊర్మిళా! నువ్వంటే నవలా నాయికలా ఉన్నావు. నేనా పెళ్ళయిన వాణ్ణి, ఓ బిడ్డకు తండ్రిని.. నేనెలా!!.”

నలిచి, నలిచి ఎర్రగా అయిన కళ్ళు, ముక్కుతో అమ్మణ్ణికి అప్పటికప్పుడే ఫోన్ చేసింది ఊర్మిళ, అది కూడా తన ముందే!

“చూసావా, నీ పిచ్చి వల్ల నేను నగుబాటు అయ్యాను” అంది.

“ఏమి జరిగిందే!” అంది అమ్మణ్ణి.

ఊర్మిళ అంతా చెప్పింది, “ఏరియల్, సహస్ర నామ స్తోత్రం అంటూ.. ఇలా మాట్లాడితే ఎంత బాధ అవుతుంది?” అంది.

ఆ తర్వాత ఇంకా పెద్ద జోక్ ఏమిటంటే అమ్మణ్ణి సమాధానం.

“అంత అవమానమా! మై గాడ్ అన్ని మాటలు అన్నాడా! ఒక పని చెయ్యవే లెటర్ వ్రాసి పెట్టి వెళ్ళి పోవే! అప్పుడు గానీ నీ ఆత్మాభిమానం-”

అమ్మణ్ణి మాటలు పూర్తి కాకముందే “ఇదీ నవలల లోని దేనా!” అంది ఊర్మిళ కోపంగా.

“అంతేగా!” అన్న అమ్మణ్ణి మాట విని ఫోన్ ఠక్కున పెట్టేసింది.

ఎప్పుడు తలపుకు వచ్చినా నవ్వు దాగదు తనకు. రేపు ఇదే హోటల్‌లో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కేయడమే అనుకున్నాడు.

లైట్ ఆఫ్ చేసి పడుకున్న తన ఆలోచనలు మళ్ళీ ముందుకు సాగాయి.

మామయ్య హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పూణే నుండి రాలేక పోయినా, ఆ తర్వాత వచ్చాడు.

ఉన్న రెండు రోజుల్లో మామయ్య కళ్ళు ఊర్మిళ చుట్టూనే తిరిగాయి.

ఆ తర్వాత తనకు బోధ మొదలయ్యింది. “ప్రక్కనే పెట్టుకొని ఎందుకు ఆలోచన!” అన్నాడు.

“ఏమిటి” అన్నాడు తను.

“అదే, రా, ఆ అమ్మాయి..”

“ఆ పిచ్చి పిల్లా!” అంటూ నవ్వాడు.

“ఆలోచించు! నేనెందుకు ఈమెలా లేనా అని ఆడవాళ్ళు అసూయ పడే అందం రా!”

“ఇంకా..” నవ్వుతూ అడిగాడు.

“ప్రశాంతమైన వదనం, నిర్మలమైన చూపులు, ముత్యాలన్నీ కూర్చి గుచ్చినట్టు అందమైన పలువరుస..”

“అబ్బో! చాలానే చెపుతున్నావు.”

“ఇంకేముంది రా, చెప్పేది, ఇంపైన భోజనం, ఆప్యాయమైన వడ్డన.. ఒద్దికైన మనిషి..”

“అబ్బ! ఆ ప్రసక్తి వదిలేయ్ మామయ్య!”

మామయ్య వెళ్ళే ముందు కూడా ఊర్మిళ విషయం దృష్టిలో పెట్టుకొమ్మని చెప్తూ వెళ్ళాడు.

ఒక రోజు అన్నమ్మ పనిలోకి వస్తూనే “గా చెట్టుకు గన్ని పూలు పూసినయి. ఇంట్లో ఆడ మడిసివి ఉండి ఏమి లాభం?” అంది.

“పాపం, అన్నమ్మా! వాటిని తెంపబుద్ధెయ్యదు. వాటికీ ప్రాణం ఉంటుంది. అవి అలా ఉంటేనే అందం” అన్నది ఊర్మిళ.

తాను అక్కడే ఈజీ చెయిర్‌లో పేపర్ తిరగవేస్తూ, “కొందరు తెల్ల చీర మతం వాళ్ళు ఉంటారు లే, అన్నమ్మా! వాళ్ళు పూలు పెట్టుకోరు!” అన్నాడు.

ఇంక అప్పటి ఊర్మిళ ముఖం తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది.

‘ఇలాంటి అమ్మాయినా మామయ్య చేసుకొమ్మని చెప్పింది. ఎప్పుడు సన్యాసుల్లో చేరుతుందో తెలియదు’ అనుకొని నవ్వుకున్నాడు.

మరి నాలుగు రోజుల్లో తన లీవ్ అయిపోతుంది. ఈ లోగా ఊర్మిళను హాస్టల్‌కు పంపాలి.

ఇలా ఆలోచించి ఊర్మిళకు చెప్పాడు.

ఊర్మిళ ముఖం చిన్నబుచ్చుకుంది.

కానీ ఏమీ అనలేదు.

తన ఆరోగ్యంపై పేటెంట్ హక్కు తీసుకున్నట్టు డైలాగ్స్ రాలేదు ఆమె నుండి.

మళ్ళీ ఇంత త్వరలో హాస్టల్‌కు పంపిస్తానని బహుశా ఊహించి ఉండదు.

ఆమె ముఖం చిన్నబోయినా, తన నిర్ణయం మారదు.

మళ్ళీ మామయ్య ఫోన్ చేసే లోగా ఈ తిక్కమ్మాయిని వదిలించుకోవాలి, అనుకున్నాడు.

ఊర్మిళను దింపేందుకు మహేష్‌కు కబురు చేసాడు.

ఊర్మిళను కారు ఎక్కించి, విజయ దరహాసం చిందించాడు.

ఊర్మిళ వెళ్ళలేక వెళ్ళింది.

***

తెల్లవారే లేచాడు.

కాఫీ పెట్టుకుందామని పాల కోసం ఫ్రిజ్ డోర్ తెరిచాడు. పాల పాకెట్స్ తీసేవారు లేక డోర్ ముందే పడిగాపులు కాస్తున్నాయి.

కాఫీ పెట్టుకొని తాగాడు.

ఆఫీస్ మిత్రులెవరో చెప్పిన అడ్రస్ ప్రకారం లంచ్‌కు క్యారియర్ వాళ్ళను మాట్లాడుకున్నాడు.

రెండు రోజులు గడిచి పోయాయి.

ఊర్మిళ నుండి ఒక్క ఫోన్ లేదు.

తనలో అసహనం పెరిగి పోతున్నది.

“సర్! ఎలా ఉన్నారు?” అని ఆమె నుండి ఫోన్ సహజంగానే ఉంటుంది. అది జరుగలేదు.

చదువులో బిజీ అయ్యి ఉంటుంది అని సరి పెట్టుకోలేకపోయాడు. ఊర్మిళకు తనకంటే చదువెప్పుడూ ముఖ్యం కాదు.

మరు రోజు కూడా ఫోన్ రాలేదు. ఆమె ఫోన్ కోసం తన మనసింత కొట్టుకోవడం ఏమిటి?

తానే ఫోన్ చేసి కనుక్కోవాలి అనుకున్నాడు. ‘ఇగో’ అడ్డం పడింది.

ఊర్మిళపై కోపం పెరిగిపోతున్నది. ఫోన్ చేయాలి అన్న కామన్ సెన్స్ ఎటు పోయింది. అప్పడప్పుడు బుద్ధి పని చేయదేమో!

నిద్దుర లేచి బ్రష్ చేసుకోగానే పొగలు కక్కే కాఫీ రెండు అరచేతుల మధ్య భక్తిగా పట్టుకొని నిల్చునే ఊర్మిళ.. భూమి కందిపోతుందేమో నన్నంత సున్నితమైన ఆ నడకతో ఇల్లంతా నడయాడుతున్నట్టే ఉంది. కిచెన్ ముందు నుండి వెళుతూంటే ఇంకా ఆమె కూనిరాగాలు తీస్తూ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. వస్తువులన్నీ స్తబ్ధుగా పడి ఉన్నాయి. పరిసరాలన్నీ కళ తప్పాయి..

ఇల్లు దేవత లేని గుడిలా ఉంది.

మనసు శూన్యానికి సంకేతమయ్యింది.

ఏమి ఉందని ఊర్మిళలో –

ఇంత మానసిక బికారితనం వచ్చింది తనకు.

ఉండే ఉంటుంది, చురుకుగా కదిలే కళ్ళల్లో ఏమి భావాలున్నాయో తానెప్పుడూ చదువలేదు. ఆమె సేవలు కృతజ్ఞత అనుకున్నాడు. ఆమె మనస్తత్వపు వైఖరి ని పిచ్చి పిల్లగా తీసి పడేసాడు. ఆమె వ్యక్తిత్వ మహోన్నత అంచులను తన వ్యవహారికత అందుకో లేకపోయిందేమో! ఆమెను నిరసించాడు.

హేళన పట్టించాడు. సరదాగానే అయినా నొచ్చుకుందేమో! అందుకేనా ఫోన్ చేయలేదు. అలా అయి ఉండదు.

‘మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువు కదా!’ (ఆత్రేయ) ఊర్మిళకు తనపై కోపం రాదు. వచ్చినా నిలువదు.

ఊర్మిళ లోని ఎమోషన్స్‌కు అంత ప్రాధాన్యమెప్పుడూ ఇవ్వని తాను ఇప్పుడు ఆమె గురించి ఆలోచన సాగిస్తున్నాడు.

ఆమెను  డబ్బు ఇచ్చి చదివిస్తున్న అనాథ గానే భావించాడు. ఎప్పుడూ జీవితం లోకి ఆహ్వానించాలనుకోలేదు. కానీ ఎక్కడో ఆమెకు చిన్న ఎంట్రీ దొరికింది. హాస్పిటల్‌లో, తర్వాత కూడా ఆమె చేసిన సేవలు, తనను, మాలతిని కలపాలి అన్న ధృక్పథం, తన విషయంలో ఆమె డెడికేషన్ – మనసును మరో మనసుతో కట్టిపడవేసేది ఆత్మ సౌందర్యమేనేమో!

ఊర్మిళ ఫీలింగ్స్ ఏమయి ఉంటాయి. ఆమె తరుపున కూడా తానే ఆలోచించాడు. చదువు ఊర్మిళలో సెల్ఫ్-కాన్ఫిడెన్స్ తేవాలని భావించాడు. అయితే అమ్మణ్ణి కూడా ఊరు వెళతాననడం ఊర్మిళలో దిగులును, భయాన్ని పెంచింది. అందుకే హాస్టల్‌లో చేరి, చదువుకోమనగానే మొహమాటం వదిలి, చేరి పోయింది. తనపై మానసిక ఆధారత ఎక్కువ చేసుకుంది. ఎందుకు అంటే తనకు ఏకైక ఆధారం తానే కావడం వల్లేమో! తన చుట్టూ ఆమె రక్షణ వలయం చుట్టింది. తన ఆరోగ్యం ఆమెకు ముఖ్యం. అందుకే కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ ఇద్దరి మధ్య పెన వేసుకున్న మానసిక ఆధారతకు అంతకు మించి అర్థమే లేదా! ప్రతి బంధానికి వెనుక ఉండేది ఏమిటి? మానసిక ఆధారతనే కదా! స్వార్థ త్యాగమే కదా!

మహేష్‌కు హాస్టల్ వెళ్ళేది ఉంది రమ్మని చెప్పాడు.

అంతలో ఓ ఆలోచన!

ఇంతకీ ఊర్మిళ హాస్టల్ లోనే ఉందా!

ఆత్మభిమానం అంటూ అదేదో నవలలో నాయికలా ఎక్కడికైనా వెళ్ళిపోలేదు గదా! మై గాడ్!

లేకుంటే ఇన్ని రోజులు ఫోన్ చేయకుండా ఉండగలదా!

మహేష్ కారు స్పీడ్ పెంచాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here