ఎంత చేరువో అంత దూరము-25

4
10

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఊర్మిళ గురించి తలచుకుంటూ ఉంటాడు ఆనంద్. మహేష్‍తో కలసి హాస్టల్‍కి వెళ్తాడు. ఊర్మిళను తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికొచ్చాకా, ఫోన్ ఎందుకు చేయలేదని కోపంగా అడుగుతాడు ఆనంద్. ఎందుకు చేయాలని అడుగుతుంది ఊర్మిళ. చచ్చాడో, బ్రతికాడో అని ఒక్క ఫోన్ చేశావా అంటాడు. అలా మాట్లాడద్దని అంటుంది. తానో అనాథననీ, అనాథలాగే బ్రతకడం నేర్చుకుంటున్నానీ అంటుంది. సహాయం చేసేవాళ్ళని విసిగించటం సభ్యత కాదంటుంది. వాళ్ళ మధ్య కాసేపు వాదన జరుగుతుంది. ఓ రోజు ఆనంద్ మామయ్య వస్తాడు. జరిగినదంతా మామయ్యకి చెప్తే, ఆ అమ్మాయి అలిగిందని ఆయన అంటాడు. ‘నిన్ను పెళ్ళి చేసుకోమని ఆ అమ్మాయిని అడుగు’ అని చెప్తాడాయన ఆనంద్‍తో. ఆనంద్ వద్దంటాడు. ‘మాలతి తిరిగొస్తే’ అని అడుగుతాడు. ‘ఇంకా నీలో ఆశ చావలేదా? మాలతి గతం, ఊర్మిళ భవిష్యత్తు’ అని ఆయన చెప్తాడు. కాసేపయ్యాకా, తనకి బయటకు వెళ్ళే పనుందని, వెళ్తున్నానని చెప్తుంది ఊర్మిళ. కారు తీసుకువెళ్ళు అంటే వద్దని చెప్పి తన గదిలోకి వెళ్తుంది. ‘చూశావా మావయ్యా కారు వద్దని ఆటోలో వెళ్తానంటోంది’ అంటాడు ఆనంద్. ఆ అమ్మాయికి హక్కు కల్పిస్తే, తనే కారు తీసుకువెళ్తుంది అంటాడాయన. ఆయన ఊర్మిళని పిలిచి కారెందుకు వద్దంటోందో కనుక్కుంటాడు. ఊర్మిళ చెప్పిన కారణం ఎంతో సబబుగా అనిపిస్తుంది. తర్వాత ఊర్మిళ వెళ్ళిపోతుంది. ఊర్మిళను హ్యాపీగా ఉంచేందుకు ఆమె కోరిక తీర్చాలనుకుంటాడు ఆనంద్. మామయ్యకి చెబితే, శుభస్య శీఘ్రం అంటాడాయన. ఓ రోజు ఊర్మిళను పిలిచి ఈ రోజు నీకో సర్‌ప్రైజ్ ఇస్తానంటాడు ఆనంద్. ఆ మరునాడు ఆమెతో పాటు కారులో బయల్దేరి ఓ అనాథాశ్రమానికి వెళ్తాడు. దారిలో పళ్ళు స్వీట్స్ కొంటాడు. ఆనంద్ ఆపీసులో మాట్లాడుతుంటే, ఊర్మిళ పిల్లలతో గడుపుతుంది. ఊర్మిళ కోరిక ప్రకారం ఇద్దరు పిల్లల్ని పెంచుకోడానికి తెచ్చుకుంటారు. ఊర్మిళకి సాయంగా అన్నమ్మ వచ్చేస్తుంది. ఊర్మిళ చదువుకి ఆటంకం కలగకుండా హోమ్ ట్యూటర్‍ని ఏర్పాటు చేస్తాడు ఆనంద్. గతం నుంచి బయటపడిన ఆనంద్ జాన్వీకి ఫోన్ చేస్తాడు. నాన్న చెప్పిన విషయం విని జాన్వీ ఎంతో సంతోషిస్తుంది. పిన్ని పుట్టినరోజు వస్తోంది అనుకుంటుంది ఉత్సాహంగా. – ఇక చదవండి.]

అధ్యాయం 25

[dropcap]ఊ[/dropcap]ర్మిళతో పని చేసిన టీచర్, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చూసేందుకు వీలవలేదని ఇంటికే వచ్చింది. జాహ్నవి వచ్చిన సంగతి టీచర్స్‌కు తెలుసు. అంత విశాల హృదయం మాకైతే లేదని కామెంట్స్ కూడా నడిచాయి. కొందరు పిల్లలేమి పాపం చేసారని సమర్థించారు కూడా.

ఇప్పుడు ఇంట్లో పరిస్థితిని ఆవిడ ఇలా ఎనలైజ్ చేసింది.

ఆనందరావు మొదటి భార్య కూతురు, ఊర్మిళ హాస్పిటల్‌లో ఉంది చూసి, తెలివిగా తల్లికి ఫోన్ చేసింది, తల్లి వచ్చి, దిగబడింది.

ఆవిడ అల్లిన కథ చాలా నమ్మశక్యంగా ఉంది, అందరూ అదే అనుకోసాగారు.

అంతే, కుటుంబాల్లో లోపల జరిగినవి ఒకలా ఉంటాయి. బయటకు తెలిసేవి మరొకలా ఉంటాయి.

ఇప్పుడు ఊర్మిళ జీవితం ఏమవుతుందో!

ఆమె పై అభిమానంతో కొందరు, ఈర్ష్యతో కొందరు బాధ పడిపోతున్నారు.

***

చిన్నవాళ్ళిద్దరూ బయట ఆడుకొని వచ్చారు. దాహం వేసి నీళ్ళు తాగాలని, ఫ్రిజ్ డోర్ తెరిచారు. చేతులకు ఉన్న మురికి ఫ్రిజ్‌కు అంటుకున్నది. అక్కడే ఉన్న మాలతి “చేతులు కడుక్కోకుండా ముట్టుకుంటావా, వెధవ!” అంటూ వాడిని ఛెళ్ళున చరిచింది.

ఆ శబ్దానికి రూమ్‌లో వినుతతో ఛాట్ చేస్తూన్న జాహ్నవి వెంటనే పరిగెత్తుకు వచ్చింది.

తన రూమ్‌లో ఉన్న ఊర్మిళ ఉలిక్కిపడింది.

“అనూప్, అనూప్” అని పిలుస్తోంది.

వాణ్ణి ఓదారుస్తూన్న జాహ్నవి దగ్గర నుండి, అన్నమ్మ వచ్చి, తీసుకొని వెళ్ళింది.

వంటింట్లో మాలతి దగ్గరికి వెళ్ళి, గొడవ పెట్టుకుంది జాహ్నవి.

“ఏంటమ్మా! తమ్ముడిని కొట్టావ్,” అంది ఆవేశంగా.

“వెధవ పని చేస్తే ముద్దు పెట్టుకుంటారా!” అంది.

“అమ్మా! నేనిక్కడ ఉన్నఇన్ని రోజుల్లో పిన్ని నన్ను ఒక్క మాట అనలేదు. పిల్లల్ని ఇంకెప్పుడూ ఏమీ అనకమ్మా!” ఏడుపు గొంతుతో అంది జాహ్నవి.

“వాళ్ళను ఇన్ని రోజులు బాగా చూసుకున్నావు. వాడి బర్త్ డే‌కు వాడికి ఇష్టం అని చెపితే పాయసం చేసావ్. మా అమ్మ మంచిదని నేనెంత ప్రౌడ్ ఫీలయ్యానో తెలుసా! పిల్లల్ని ఏమీ అనకమ్మా!” జాహ్నవి ఏడుస్తూంది.

ఆమె చెప్పిందంతా నిజమే. మాలతికి మొదట్లో పిల్లల మీద కోపం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళ పై కోపం లేదు. ఊర్మిళకు తన స్థాన బలం చూపడానికి పిల్లలను పావులుగా వాడుకుంటూంది.

జరిగిన సంఘటన అటు ఊర్మిళ మనసు పై, ఇటు జాహ్నవి మనసు పై తీవ్ర ముద్ర వేసింది.

పిల్లలను దగ్గర కూర్చో పెట్టుకొని బుజ్జగిస్తోంది ఊర్మిళ.

‘అన్న’ మీద దెబ్బ పడే సరికి, తమ్ముడు కూడా ఏడుపు మొదలు పెట్టాడు.

“కళ్ళు తుడుచుకోండి. అలా ఏడవకూడదు. పెద్దమ్మకు మీరు అంటే చాలా ప్రేమ.”

“నీ బర్త్ డేకు నీకు ఇష్టం అని పాయసం చేసి పెట్టలేదూ!”

వాడు అవునని తలాడించాడు.

“పెద్దమ్మకు కాస్త ఒంట్లో బాగా లేదు. అలాంటప్పుడు త్వరగా చిరాకు వస్తుంది. మీరు అంటే ఇష్టం లేక కాదు.”

“అమ్మా! జానక్కను ఉంచుకుని, పెద్దమ్మను పంపేద్దాం.”

“తప్పు! అలా అనకూడదు.”

వింటూన్న అన్నమ్మ మొటికలు విరిచి, మూతి మూడు వంకరలు తిప్పింది.

“చెప్పు! ఆళ్ళకు అట్లంటియే చెప్పు. నీ లెక్క తెలివి లేనోళ్ళను చేయి” అంది అన్నమ్మ.

ఊర్మిళ దాని వంక చూసింది.

పాపం! పెద్దదయిపోయింది. తనకంటూ ఉన్న ఓ పెద్ద దిక్కు అన్నమ్మ.

“నేనేమి చేయను! పిల్లలతో ఏమి చెప్పగలం” అంది ఊర్మిళ.

అప్పటికి ఆనంద్ వెళ్ళి మూడు రోజులయ్యింది.

అంతా ఓ.కే.నా అని మెసేజ్ చేస్తే హెల్త్ పరంగా ఓ.కే. కాబట్టి ఓ.కె. అని మెసేజ్ చేసింది.

“ఏమి తల్లివి నువ్వు. పిల్లోని మీద దెబ్బ పడితే కూడా సోయి లేకపాయె!” అన్నమ్మ గొణుగుతూనే ఉంది.

ఊర్మిళ దాని గొణుగుడు పట్టించుకోవడం మానివేసింది.

ఆలోచిస్తూ కూర్చుంది.

పిల్లవాడి మీద ఇంత వరకు ఎవరూ చేయి ఎత్తి ఉండలేదు.

ఈ హఠత్తు పరిణామానికి వాడు ఎంత తల్లఢిల్లాడో!

ఈ ఉప్పెన ఇంతటితో ఆగుతుందా, తననీ, తన పిల్లలనీ ముంచి వేస్తుందా!

జానూను రమ్మని తాను లెటర్ వ్రాయించకూడదా! దాని పరిణామాలు ఇలాగే ఉంటాయా!

అందుకేనా అందరూ జాగ్రత్త పడతారు. ఏమో, తన ఆత్మ సాక్షిగా తను నడుచుకుంది.

***

“అమ్మా! ఎప్పుడు మనం వెళ్ళాలి?” ఆనంద్ వెళ్ళాక మూడవసారి అడిగింది మాలతిని.

ఈసారి మాలతి నుండి వచ్చిన సమాధానానికి నివ్వెరపోయింది.

“మనం ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి, జానూ!” అంది.

“తాతగారు మనం ఇక్కడ ఉంటేనే ఎక్కువ సంతోషిస్తారు” అంది.

“మరి నా స్టడీస్?”

“ఇక్కడ లేవా!”

జాహ్నవి కేమి చెప్పాలో తెలీలేదు. నాన్న ఏమంటారో!

***

మాలతిలో ఊర్మిళను చూసి ఓర్వలేనితనం రోజు రోజుకీ పెరిగిపోతుంది.

ఒక రోజు అన్నమ్మ, ఊర్మిళకు పట్టుకెళ్ళే అన్నం కంచం లోని కూర నిండా కారమే ఉంది.

ఊర్మిళ నోట్లో పెట్టుకొని, కారం భరించలేక ఉక్కిరి బిక్కిరి అయ్యింది.

అన్నమ్మతో జానూను పిలిపించింది.

“జానూ! చూడు, కూర నిండా కారం ఉంది” అంది.

తెల్లబోయి చూస్తూన్న జాహ్నవితో, “బోలెడు టాబ్లెట్స్ వేసుకుంటూన్నాను, జానూ! ఇలా కారంతో తినలేక అన్నం వదిలేస్తే తట్టుకోగలనా!” అంది.

జాహ్నవి గిర్రున తిరిగి వెళ్ళిపోయింది.

తల్లిని గది లోకి పిలిచి విషయం చెప్పింది.

“నాకు తెలీదు జానూ! నాకీ దొంగ చాటు పనులు తెలీవు. నీ మీద ఒట్టు. ఇది ఆ అన్నమ్మ పనే.”

మాలతికి ఆగ్రహం పెరిగి పోయింది. అన్నమ్మను పిలిచి ఎడా పెడా తిట్టేసింది.

“నువ్వు రేపటి నుండి పనిలోకి రాకు,” అంది.

“చూసినవా! ఊర్మిళమ్మా! నీ సవితి నిర్వాకం. నన్ను పనిలోకి రావొద్దంటుంది. నేను కూడ లేకుంటే నీ గతి ఏందో!” అంది.

అప్పుడే జాహ్నవి, పిన్ని రూమ్ లోకి వచ్చింది.

“పిన్నీ, ఇది అమ్మ కాదు. నా మీద అమ్మ ఒట్టు వేసిందంటే అర్థం చేసుకో!” అంటూ బయటకు వచ్చింది.

“అన్నమ్మా, ఎందుకిట్లా చేసావు!” అంది ఊర్మిళ.

“నీ కోసమే చేసిన. గీ వంకతో నన్నా ఆనంద్ బాబుకు చెప్పి, ఆళ్ళను ఒదిలించుకో!” అంది.

మాలతి ఆవేశం ఇంకా తగ్గలేదు. అన్నమ్మను పని మానేసి పొమ్మని అరుస్తూనే ఉంది.

జాహ్నవి తల్లి చేయి బట్టి, రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది.

“అమ్మా! ఎందుకు అలా అరుస్తావు. చూడు, అలా అరిస్తే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఒక్కసారి అరిచి నువ్వు ఆగినా నరాలపై ఆ స్ట్రెస్ ప్రభావం ఎంతో సేపు ఉంటుంది. నిన్ననే గూగుల్‌లో చూసాను. అమ్మా! అన్నమ్మను వెళ్ళి పొమ్మనకు. వీళ్ళకు ఇక్కడ ఈమె ఎప్పటి నుండో ఉంది. కావాలంటే పిన్ని వంట వరకు ఆమెను చేసి పట్టుకెళ్ళమను. మరోసారి ఇలా చెప్పే అవకాశం ఉండదు ఈమెకు” అంది.

ఏ కళ నుందో మాలతి ఆమె మాట విన్నది.

“నాన్నగారికి కూడా మనం ఆమెను తీసివేయడం నచ్చదు. అటెండర్ లేకుండా ఆమెను వెళ్ళి పొమ్మంటే ఎంత ఇబ్బంది, కోపం వస్తే అరిచేయడమేనా! ఏవీ ఆలోచించవా!” అన్నది.

జాహ్నవి ఓపికా, నిగ్రహం ఆనంద్‌వే వచ్చాయి. హావభావాల్లో, వ్యవహార శైలిలో అచ్చు ఆనంద్‌ను తలపిస్తుంది.

మాలతి ప్రవర్తనలో మార్పేమి లేదు. ఆగ్రహావేశాలకు బానిసలా మారిపోయింది.

‘అమ్మా! మనింటికి వెళదాం’ అంటే, ‘ఇదీ మన ఇల్లే’ అంటుంది. ‘తాతగారు ఒక్కరూ ఉన్నారం’టే, ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎప్పటికి ఎలా ఉంటారు,’ అంటుంది.

“నువ్వు మీ నాన్న దగ్గరికి వచ్చాననుకుంటున్నావు. వెళ్ళి పోవాలనుకుంటున్నావు. కానీ నేను ఉండవలసిన దగ్గరికే వచ్చాను. అందుకే నేను ఎక్కడికీ వెళ్ళవలసిన పని లేదు,” అంది.

అంతటితో ఆగితే బాగుండేది. కానీ ఒక రోజు పెద్దగా అరుపులు వినిపిస్తూంటే, తమ్ముళ్ళతో ఆటలు ఆపేసి, క్రిందకు పరిగెత్తింది.

“నువ్వు కేరళ కుట్టివి కదా! మీ ఎర్నాకుళం వెళ్ళిపో! కావాలంటే పిల్లల్ని హాస్టల్‌లో వేసేయి. డబ్బు కావాలంటే పంపిస్తాం”

“అమ్మా! ఏమిటమ్మా ఇది. నువ్వెందుకు ఇలా అయ్యావు” తల్లిని ఊర్మిళ గది నుండి లోపలికి లాక్కొచ్చింది.

ఆమెకు ఎంత చెప్పినా లాభం లేదు అని అర్థం అయ్యింది. “మనం ఇక్కడ ఉండాలంటే మనం నాన్నకు నచ్చాలి. వాళ్ళ పిల్లల్ని ఇలా అంటే ఎవరికైనా బాధ కాదా! నన్నెవరైనా అంటే నువ్వు ఊరుకుంటావా!” అంది.

ఆమె కంటే గుప్పెడు పెరిగిన జాహ్నవి, పిల్లకు మల్లే తల్లిని లాలనగా భుజం మీద చేయి వేసి చెప్పింది. “నీకు తెలీదే, అదే నా జీవితం నాశనం చేసింది.”

“ఇట్స్ ఓకే, మా! ఇప్పుడు ఆవేశపడితే పోయినది రాదు, కదా! పైగా చాలా నష్టాలు ఉన్నాయి.”

తల్లి మానసిక స్థితి ననుసరించి, బిడ్డ పెద్ద దానిలా నచ్చచెప్పడం చేస్తూంది.

ఎన్ని చెప్పినా, మాలతి పిల్లలను చిటుకు దెబ్బలు అంటే నొప్పి కలుగని దెబ్బలు వేయడం మానలేదు. క్రికెట్ ఆడిన కాళ్ళతో సోఫా తొక్కారని, మాజా ఒలక పోసారని ఏదో ఒక కారణం ఉంటుంది.

కిచెన్‌లో ఇవి ఇటు జరిపిందని, అవి అటు జరిపిందని, పసుపు డబ్బాపై మూత పెట్ట లేదని అన్నమ్మపై అరుస్తుంది. కాకపోతే అన్నమ్మ మాలతి కోపాన్ని ఎంజాయ్ చేస్తుందనేది వేరే విషయం. కావాలంటే మాలతి అసహనాన్ని ఎలా పెంచాలో కూడా దానికి బాగా తెలుసు.

అప్పుడప్పుడు ఊర్మిళను ఆనంద్ రాగానే వెళ్ళి పొమ్మని అరుస్తుంది.

జాహ్నవిది నెత్తి మీద చేతులు పెట్టుకొని కూలబడే పరిస్థితి అయ్యింది. ఎలా నచ్చ చెప్పి వెనక్కు తీసికెళ్ళాలో, ఆ వయసుకు అర్థం కాని పరిస్థితి. ఆమెకు అది పెద్ద సమస్య అయ్యింది. నాన్న వస్తే ఆయనే చూసుకుంటారు అనుకుంది.

అందరూ ఆనంద్ కోసమే ఎదురు చూస్తున్నారు.

***

ఊర్మిళ రూమ్ లోకి వచ్చి “పిన్నీ!” అంది జాహ్నవి.

ఊర్మిళ సంతోషంగా, “రా! జానూ!” అంది.

వెళ్ళి ప్రక్కన కూర్చుంది.

“ఇప్పుడెలా ఉంది, పిన్నీ! నీకు,” అంది.

“నొప్పులు తగ్గలేదు. జానూ! టాబ్లెట్ పడాల్సిందే!”

“ఓ, అవునా!” అని ఓ నిముషం మౌనం వహించింది.

ఏదో చెప్పాలనుకుంటూంది అని అర్థం అయ్యింది ఊర్మిళకు.

“చెప్పు, జానూ!” అంది.

కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న జాహ్నవి, “సారీ! పిన్నీ!” అంది.

ఊర్మిళ వేదాంతిలా నవ్వింది. “లీవ్ ఇట్ జానూ!” అంది.

జాహ్నవి వెంటనే అక్కడి నుండి కదలలేదు. గంభీరంగా ఉన్న మొహంతో, “నేను నీ రూమ్ లోకి ఎక్కువ రావట్లేదు అని ఫీలవకు పిన్నీ!” అంది.

ఊర్మిళకు అర్థం అయ్యింది, ఆ అమ్మాయి బాధ.

“అనుకోనులే, జానూ! నాకెప్పుడో అర్థం అయ్యింది,” అంది.

జాహ్నవి ముఖం మరింత మాడినట్టు అయ్యింది.

అమ్మ స్థాయి ఎదుటి వారి దృష్టిలో దిగజాడం కూతురుకు బాధనే, కదా!

మాలతి అలికిడి విని నిశ్శబ్దంగా అక్కడి నుండి లేచి వచ్చింది.

బెడ్ మీద ఉన్న ఊర్మిళ పెదవుల మధ్య శుష్కహాసం నిలిచింది.

***

కొరియర్‌లో కేక్, ఫ్లవర్ బొకే వచ్చాయి. ఆనంద్ పంపించాడు.

“పిన్నీ! హ్యాపీ బర్త్ డే!” జాహ్నవి కేక్ బాక్స్‌తో సంతోషంగా ఆమె గది లోకి అడుగు పెట్టింది.

“ఏమిటిది, జానూ!”

“సర్‌ప్రైజ్ పిన్నీ! నాన్న నాకు ముందే మెసేజ్ చేసారు – ‘కేక్, బొకే వస్తున్నాయి పిన్ని బర్త్ డే రేపు’ అని. ఆన్‍లైన్‌లో డ్రెస్ కూడా ఇప్పుడే వచ్చింది. నువ్వు తయారు కావాలి. నేను ఆ ఫోటోస్ నాన్నకు పంపాలి.”

“ఈ పరిస్థితుల్లో ఎందుకు జానూ!”

“అదంతా నాకు తెలీదు. నాన్న చెప్పారు. అంతే!” తలుపు చేరవేసి వెళ్ళింది.

అన్నమ్మ సహాయంతో డ్రెస్ వేసుకుంది.

పిల్లలు సంతోషంగా ఎగరడం మొదలు పెట్టారు, “అమ్మా హ్యాపీ బర్త్ డే” అంటూ.

మాలతికి సందడికి నిద్రాభంగం అయ్యింది.

ఏమిటా అని ఇవతలకు వచ్చింది.

ఊర్మిళ కేక్ కట్ చేస్తోంది.

జాహ్నవి ఫోటోస్ తీస్తుంది.

“మూడు ఫోటోస్ బాగా వచ్చాయి. పిన్నీ, పిల్లలతో కూడా ఒకటి తీస్తాను.”

“నువ్వు కూడా రా, జానూ!”

“నాన్న ఇప్పుడే మెసేజ్ పెట్టారు పిన్నీ! ఫోటోస్ చాలా బాగున్నాయి” అని.

జాహ్నవి బయటకు వచ్చాక అడిగింది, “ఏమిటి, నాన్న అంటున్నావు.”

“పిన్ని బర్త్ డే. నాన్న కేక్, బొకే పంపారు. ఫోటోస్ తీసి పంపమన్నారు.”

“ఉహూ” అంది మాలతి.

మాలతి మూడ్ ఆఫ్ చేసుకుంది.

వాళ్ళు ఇంత కన్నా హ్యాపీగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుని ఉండవచ్చు. అప్పుడు మాలతి ఒంటరితనం అనే ముసుగు కప్పుకుని ఉంది. ఇప్పుడు ఇదంతా చూసి భరించలేక పోతుంది.

ఎదురుగా సజ్జాపై జంట పావురాళ్ళ దగ్గర మరో పావురం వచ్చి, వాలింది. వెంటనే వాటిల్లో ఒకటి ముక్కుతో కొత్త పావురాన్ని నెట్టేస్తున్నది. పావురాలకు చట్టాలు, న్యాయాలు లేవు. దేనికి బలం ఉంటే దానిదే గెలుపు.

కళ్ళు తిరుగుతున్నట్టవుతున్నాయి. కళ్ళు మూసుకొని పడుకుంది.

జాహ్నవి వచ్చి, బి.పి. చెక్ చేసి అదిరి పోయింది. మైసూర్ అంటే అన్నీ తెలుసు. ఇక్కడ ఎలా? వేణుకు ఫోన్ చేసింది. ఊర్మిళకు చెప్పింది. నాన్న ఇచ్చి వెళ్ళిన డబ్బులో కొంత, హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని, ఆంబులెన్స్ లోకి ఎక్కి, మాలతి వెంట హాస్పిటల్‌కు వెళ్ళింది.

ఊర్మిళ జానూకు ధైర్యం చెప్పిందే కానీ, వెంట వెళ్ళి సహాయం చేయలేని పరిస్థితి.

పాపం, జాహ్నవి ఎంత దిగులు, టెన్షన్‌కు లోనవుతుందో!

ఆనంద్ గారు ఎప్పుడొస్తారో!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here