ఎంత చేరువో అంత దూరము-7

3
10

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఊరెళ్ళక ముందు భూషణం గారు, భద్రం గారు మాలతి గురించి, జాహ్నవి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచిస్తారు. ఒక రోజు తాతగారి గదిలోకి నాన్న అడ్రసు కావాలి, ఉత్తరాలు రాస్తాను అని అడుగుతుంది జాహ్నవి. భూషణం తాత నాన్న అడ్రసు సంపాదించారని తెలిసి ఆనందంతో గెంతులు వేస్తుంది జాహ్నవి. ఆనంద్‌కి ఉత్తరాలు రాసి జాహ్నవి అతనికి దగ్గరైతే, తనకి దూరమవుతుందేమోనని భయపడి తన ఆందోళనను తండ్రికి చెప్పుకుని బాధపడుతుంది మాలతి. అలా ఏమీ జరగదని, జాహ్నవికి జ్ఞానం ఉందని అంటారు భద్రం గారు. ఆలోచనల్లో పడుతుంది మాలతి. జడ వేసుకుంటూ, అద్దంలో చాలా కాలం తరువాత తనను తాను పరిశీలనగా చూసుకుని, తాను చాలా మారిపోయినట్టు గ్రహిస్తుంది. ఓ తెల్ల కాగితం మీద నాన్నకి ఉత్తరం రాసి, పోస్ట్ చేస్తుంది జాహ్నవి. ఆమె ఎంత ఎదురు చూసిన తండ్రి నుంచి బదులు రాదు. అనుకోకుండా కంప్యూటర్‍లో ఆనంద్ బొమ్మ చూసి, కూతురు తండ్రిపై ఎంత ధ్యాస పెట్టుకుందోనని బాధపడుతుంది మాలతి. కూతురి కోసమైనా తామిద్దరం విడిపోకుండా ఉండాల్సిందని అనుకుంటుంది. ఆఫీసు పని మీద ఊరెళ్ళి తిరిగి వచ్చిన ఆనంద్ తనకి వచ్చిన పోస్ట్ చూసుకుంటూంటే, జాహ్నవి రాసిన ఉత్తరం కనిపిస్తుంది. దాన్ని చదివిన అతడి అంతరంగంలో అలజడి రేగుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 7

[dropcap]అ[/dropcap]ద్భుతాలు ఏమీ జరుగ లేదు. రెక్కలు కట్టుకుని వాలిన ఉత్తరానికి బదులే రాలేదు. ఆనంద్ సమాధానం వ్రాయలేదంటే తాతగారికి ఆశ్చర్యంగా ఏమీ లేదు.

ఒక బంధం విడిపోవడం అంత సులభం ఎలా కాదో, దగ్గరవడానికి కూడా కొన్ని సార్లు ఎన్నో పరిస్థితుల మధ్య సమన్వయం సాధించాలి. జాహ్నవి నిరుత్సాహం చెందలేదు.

‘ఏకోన్ముఖ కార్య సాధనే విజయ రహస్యం’ అన్నాడు వివేకానందుడు.

అందుకు సహనం కావాలి. అది జాహ్నవి దగ్గర పుష్కలంగా ఉంది.

జీవితం లోని ఏ ఆశయ సాధనకైనా విడవని పట్టు ఉండాలి. ఆ పట్టుదలకు పునాది జాహ్నవి బాల్యం నాడే వేసుకుంది.

ఆమె రెండవ ఉత్తరం కూడా పోస్ట్ చేసింది. తాను స్కూల్లో ఎన్నో కాంపిటీషన్స్‌లో విజయాలు అలవోకగా సొంతం చేసుకోవడం గురించి, తనకు వచ్చిన బహుమతుల గురించి, అవి చూసి గర్వించేందుకు తన స్నేహితురాళ్ళలా తనకు నాన్నలేరన్న లోటును తను ఎలా ఫీలయ్యింది అంతా హృద్యంగా వ్రాసింది.

ఎందరు ప్రశంసించినా, నాన్న కళ్ళల్లో తొంగి చూసే ప్రశంస తర్వాతనే అవన్నీ అని వ్రాసింది.

ఆ ఉత్తరం కూడా మొదటి ఉత్తరం లాగే ప్రతిస్పందనకు నోచుకోలేదు.

***

ఆ రెండంతస్తుల భవనం లోకి స్కార్పియో కారు రాజసంగా ప్రవేశంచింది.

వెనుకాలే అటెండర్ ఫైల్స్ తీసుకొని వస్తూంటే, కారు దిగిన ఆనంద్ హుందాతనం ఉట్టి పడే నడకతో ఆఫీస్ లోకి ప్రవేశించాడు.

పైన పోర్షన్ అంతా ఆఫీస్‌కే పరిమితం.

ఆఫీస్ సెట్టింగ్ అంతా అంత పెద్ద పోర్షన్‌లో చక్కగా అమరింది.

తనకై ప్రత్యేకించుకున్న రూములోకి వెళ్ళి, కేబిన్‌లో ఆఫీస్ వర్క్ చూసుకుంటూన్నాడు ఆనంద్.

ప్యూన్ తెచ్చిన బిజినెస్ రిలేటెడ్ కవర్స్, షేర్స్ మ్యాగజైన్స్ నడుమ నక్కి చూస్తున్న ఓ తెల్ల కవర్ కనిపించింది.

‘ఆ ఉత్తరం అదే’ అనుకున్నాడు. పొందికైన దస్తూరి, భావ క్లుప్తత.. తన నిర్లక్ష్యాన్ని పట్టించుకోక, తన  ప్రతిస్పందనతో నిమిత్తం లేక ఆరు వారాలుగా తనని వెంబడిస్తూన్న ఈ ఉత్తరాల జల్లుకు అలసట లేదా?

ఆఫీస్ చైర్‌లో తల వెనక్కి వాల్చాడు ఆనంద్.

కాలింగ్ బెల్ సౌండ్‌కు ప్యూన్ వచ్చాడు.

“ఇమామి మెంతో ప్లెస్ ఒకటి తెచ్చి పెట్టండి, సుబ్రహ్మణ్యం!” అన్నాడు.

“అలాగే, వేడి టీ కూడా.”

వయసుకు పెద్దవాడు అతను.

సార్ ఎందుకో అప్సెట్ అయ్యారని గ్రహించాడు.

కవర్ చేతి లోకి తీసుకున్నాడు ఆనంద్.

పర్సనల్లీ అని వ్రాసి ఉంది కవర్ మీద.

షరా మామూలే.

నాన్న, నాన్న, నాన్న..

ఆ తర్వాత, ఆ ఉత్తరం విలువ కూడా ఎప్పటిలా, సమాధానానికి నోచుకోక.. అతని పిడికిట్లో ముడుతలుగా మారింది.

తగ్గిపోయింది ఉత్తరం విలువయితే పర్వాలేదు కానీ, వ్రాసింది కన్న కూతురు మరి.

ఆనంద్‌కు ఆ విషయం పట్టకపోవడం ఆశ్చర్యమే!

కానీ, మనిషన్న వాడు ఎక్కడో ఓ అక్కడ బలహీనుడవుతాడు.

అంబుల పొదిలోని ఓ అస్త్రమైనా గురిచూసి, గుండెల్లో గుచ్చక మానదు. ఆ బాధ ఎంత తీయనో, అంత వేదన కూడా.

***

హోటల్ మినర్వాలో వెయిటర్ తెచ్చి పెట్టిన కాఫీ సిప్ చేస్తున్నాడు ఆనంద్. అతని ముఖ కవళికల్లో ఏదో ఆలోచన ద్యోతకమవుతూంది. ఒంటరిగా మినర్వాకు వచ్చి కాఫీ తాగుతున్నాడంటేనే అతను ఒంటరితనం కోరుకుంటున్నాడని అర్థం.

అంతలో ఓ అమ్మాయిల గ్రూప్ కిలకిల నవ్వులతో ముందు టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంది. టీనేజ్ అమ్మాయిలే అంతా.

ఆనంద్ అటే చూస్తున్నాడు. జీవిత ప్రాంగణం లోకి ఇంకా అడుగు బెట్టని వయసు. ఆనంద డోలికల్లో తేలియాడుతున్న  మనసు.

వారి నే గమనిస్తూన్న ఆనంద్ తనని వాళ్ళు గమనించకుండా కాఫీ కప్పు ముఖం దగ్గరికి తీసుకున్నాడు. గమనిస్తూన్నాడని తెలీకుండా అమ్మాయిల హావభావాలు కంటి చివర్లతో గమనిస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు. అతని ఆలోచన లెక్కడికో పోతున్నాయి. ఒంటరిగా వచ్చి, మనశ్శాంతి కలిగిందేమి లేకపోగా, ఏదో అసహనం వేధిస్తోంది.

ఖాళీ కప్పు టేబుల్  మీద ఉంచాడు. డిస్టర్బ్డ్ మైండ్‌తో ఎంత ఇస్తున్నాడో కూడా చూడకుండా చేతికి వచ్చిన నోట్ బేరర్‌కు టిప్ ఇచ్చి, లేచి నిలబడ్డాడు. అప్పుడే అతన్ని ఆకర్షిస్తూన్న పింక్ కలర్ చున్నీ అమ్మాయి  హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూ అప్రయత్నంగా అతడి వంక చూసింది.

“ప్రియాతి ప్రియమైన అనను. ప్రాణప్రదమైన అనాలి కనుక.”

పెదవులు పలుక లేని భావంతో ఆ అమ్మాయి వంక చూసి, గంభీరంగా అక్కడి నుండి నడిచాడు.

“కలవని దిక్కులు కలువవి. తెలిసి ఆరాటం దేనికని!” రోడ్ మీద ధ్వనులకు తోడు ఎఫ్. ఎమ్ రేడియా ధ్వనిస్తూంటే అతని కారు డోర్ గట్టిగా పడింది.

నో డౌట్, అచ్చు ఆ అమ్మాయి లాగే ఉంటుంది అనుకున్నాడు.

అతనలా అనుకున్న కొన్ని రోజులకే, జాహ్నవి అతన్ని మరో అస్త్రంతో విచలితుణ్ణి చేసింది.

ఆనంద్ స్కెచ్ గీసి, పంపింది.

సహజంగా కూతుళ్ళకు తండ్రి మీద ఉండే హీరో వర్షిప్ జాహ్నవి ఉత్తరాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది ఆనంద్‌కు.

ఆ స్కెచ్, ఎక్కడో ఏ మూలో ఆనంద్‌లో దాచి పెట్టిన పితృ వాత్సల్యానికి మేలుకొలుపు అయ్యింది.

అయినా అతను ప్రతిస్పందించలేదు.

మరో ఉత్తరం కూడా అతన్ని నిరుత్తరుడి గానే మిగిల్చింది.

***

బదులు రాని ఉత్తరాల బట్వాడ జరుగుతూనే ఉంది. జాహ్నవి దోసిల్లో నింపుకున్న లేఖా సుమాలు వెదజల్ల బడుతూనే ఉన్నాయి.

జాహ్నవి పేజీల కొద్దీ వ్రాయదు. చదువు ప్రాముఖ్యత వల్ల, సమయాభావం వల్ల కూడా క్లుప్తంగా వ్రాస్తుంది. తన ఉనికిని తెలియజేయటం, నాన్న అటెన్షన్ తన వైపు వచ్చేలా చేయడం..

అదే ఇప్పుడు ఆమె లక్ష్యం.

తాతగారు గమనిస్తూన్నారు. సవ్యసాచిలా ఇటు చదువు కోసం, అటు తండ్రి కోసం జాహ్నవి పడుతున్న పాట్లు..

‘లోపల ఏమి బాధను దిగమింగుతుందో, ఇంత నైరాశ్యం పైకి కనిపించనీయదు. లోతైన గుండె. ఏమైనా మాలతిలా ఆవేశపరురాలు, అమాయకురాలు కాదు. అయినా, ఆనంద్ కూతురికి బదులు ఇవ్వొచ్చు కదా! రమ్మని చెప్పకున్నా దాని తృప్తి కోసం నాలుగు ముక్కలు వ్రాయొచ్చు కదా!’ అనుకున్నారు.

మాలతి అభిజాత్యం దెబ్బతిన్నది. బంగారు తల్లి జాహ్నవికి ఆనంద్ రిప్లై ఇవ్వడా!

ఆమెకు తెలీకుండానే ఆమెలో కూడా ఆనంద్ ఉత్తరం కోసం ఎదురుచూపులు మొదలు అయ్యాయి.

ఇది ఇలా నడుస్తోంటే..

జాహ్నవి తన రూమ్‌లో మరో ఉత్తరానికి శ్రీకారం చుట్టింది. అప్పుడే ‘తాతగారు పిలుస్తూన్నారు’ అని మాలతి కింద నుండి చెప్పింది.

జాహ్నవి ఉత్తరం ఆపి తాతగారి గది లోకి వెళ్ళింది.

“అమ్మలూ! ఏమి చేస్తున్నావ్!”

“నాన్నగారికి లెటర్ వ్రాస్తున్నాను తాతగారు!” అంది.

ఆయన కొద్దిసేపు ఆగి అన్నారు, “సమాధానం రావట్లేదు కదా!”

ఆ ప్రశ్నకు జాహ్నవి దగ్గర సమాధానం ఉంటే కదా!

అవునన్నట్టు చూసింది.

“అయితే, ఓ పని చేయి” ఆయన ఆలోచనగా చూసారు.

చెప్పమన్నట్టుగా జాహ్నవి..

“రామదాసు అంతటి వాడు ఏమన్నాడు?” ఆయన జాహ్నవి వంక చూస్తూ..

ఆ చూపులో చూపు కలిపింది జాహ్నవి.

“నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ! అన్నాడు.”

జాహ్నవి తాతగారి భావాన్ని పట్టుకుంటూ, తలాడించింది. చదరంగంలో కొత్త ఎత్తుగడ – బందీ కాబడని రాజు కోసం తిరిగి తన రూమ్ లోకి వచ్చింది జాహ్నవి.

తాతగారు జాహ్నవి గురించి ఇలా అనుకున్నారు, “కార్యసాధకురాలు.”

ఆయన మనమరాలును మదిలో ప్రశంసించకుండా ఉండలేక పోయారు.

“ఆమెకు నేనెందుకు వ్రాయాలి,”  అనే భావానికి జాహ్నవి అవకాశం ఇవ్వక పోవడం ఆయనకు నచ్చింది. జాహ్నవి ‘వ్యూహం’లో ఆమె ఒక పావు మాత్రమే. అవసరమైన దగ్గర, అవసరమైన మేర తమను తగ్గించుకోగలిగిన వారే ఏ బాధ్యతనైనా నిర్వహించగలరు, అనుకున్నారు తాతగారు.

***

తాతగారి సలహా అనుసారం జాహ్నవి ఉత్తరం ఇలా మొదలు పెట్టింది.

పిన్నీ,

నాదొక విన్నపం. నేనో నిస్సహాయురాలిని.

బాల్యం నుండి నాన్న ప్రేమకు దూరమయిన దాన్ని. నాన్నను ఎప్పటికైనా కలుసు కోవాలి అనే ఒకే ఆశతో, చిన్నప్పటి నుండి పెరుగుతూ వచ్చిన దాన్ని.

ఇంత వరకు వ్రాసి, ఆలోచిస్తూ ఆగింది.

అమ్మ గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడాలి. ఇది కేవలం తన వర్షన్. నిజంగా కూడా అంతే. అమ్మ ప్రసక్తి అనవసరమైన కాంట్రవర్సీలకు తావియ్యవచ్చు. అందుకే మాలతి ప్రసక్తి ఎక్కడా రాకుండా జాగ్రత్త పడింది.

తనకు వాళ్ళ మధ్య గొడవేమిటో తెలియనప్పుడు, నాన్నకు అమ్మ మీద ఉన్న అభిప్రాయం ఏమిటో తెలియనప్పుడు..

మిన్నకుండడమే ఉత్తమం. అందుకే నాన్నకు వ్రాసిన ఉత్తరాల్లో అమ్మ టాపిక్ ఎక్కడా వ్రాయలేదు.

పిన్నీ! నన్ను ఒక్కసారి అలౌ చేయండి. అప్పుడప్పుడు వచ్చి వెళతానని అడగనే అడగను. ఒన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. నాన్నను చూసి, మీ అందరితో గడిపి, వెళ్ళిపోతాను. ఆ తృప్తి నా లైఫ్ అంతటికీ సేవ్ చేసుకుంటాను.

నన్ను పరాయి పిల్లలా భావించకండి. మీ చేతుల్లోనే ఉంది, నా లక్, నా హ్యాపీనెస్. ఫర్ ఒన్ వీక్ ఓన్లీ! మీరు నన్ను నిరాశ పరచరని.

ఇంత వరకు వ్రాసి ఆగి పోయింది.

లెటర్ అక్కడే వదిలేసి, తాతగారి రూమ్ లోకి వెళ్ళింది.

“తాతగారూ, నాన్నకు లెటర్స్ వ్రాసిన సంగతి  ఆమెకు తెలియాలా?వద్దా?” అంది.

తాతగారికి భోజనం పెడుతూ, వంటింట్లోకి రూమ్ లోకి తిరుగుతూన్న మాలతి ఖంగు తిన్నది.

ఆమెనా! ఆమె ఎవరు? చివరికి తాతా మనవరాళ్ళకు దాని దయాదాక్షిణ్యాలు కావాల్సి వచ్చాయా! కొన్నాళ్ళు ఆగితే, ఆనందే రిప్లై ఇస్తాడేమో! వీళ్ళ కీ తొందర ఎందుకు? ఛీ, ఛీ, ఏమైనా చేసుకోని.

ఆవేశంతో కందగడ్డలా అయ్యింది మాలతి ముఖం.

అసహనం నిలువెల్లా ముప్పిరిగొంటున్నది ఆమెలో.

***

మాలతి, కూతురు ఆమెకు లెటర్ వ్రాయడాన్ని ఇంకా జీర్ణించుకోలేక పోతోంది. ఆమెలో అశాంతి భూతం తిష్ఠ వేసుకుంది. తమ ముద్దుల కూతురుకు రిప్లై ఇవ్వని ఆనంద్ తిరస్కారాని కంటే, ఆవిడ అనుమతిని కూతురు అభ్యర్థించడం మరింత రంపపు కోతగా ఉంది మాలతికి.

ఇంత వరకు ఈ విషయాలు ఏవీ ఇద్దరూ డైరెక్ట్‌గా మాట్లాడుకోలేదు.

సున్నితమైన విషయం మాత్రమే కాదు, భావ వైరుధ్యం ఉన్న విషయం కూడా. కదిలించితే మనస్తాపం మినహా మిగిలేది ఏముంటుంది ఇరువురికీ.

***

మాలతి తనను తాను సంబాళించుకోలేక పోతోంది. తాతగారికి మర చెంబులో నీళ్ళు పెట్టి, హాల్లోకి వచ్చి కూర్చుంది.

ప్రక్క రూమ్‌లో తాతగారు, ఆమె తెచ్చిన నీళ్ళు ఒంపుకుని తాగారు. సన్న జరంచు ఖద్దరు పంచె కట్టుకొని, ఈవినింగ్ వాక్‌కి వెళ్ళేందుకు హాల్లోకి వచ్చారు. అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న మాలతిని చూసి ఖంగుతిన్నారు ఆయన.

శరీరంలో రక్తం అంతా ముఖం లోకి చేరినట్టు, ఉబ్బిన కళ్ళతో, అదిమి పెట్టిన దుఃఖావేశంతో..

మళ్ళీ ఏమి జరిగింది?

మాలతికి ఇంత వయసు వచ్చినా భావోద్వేగాలు నియత్రించుకోవడం, ప్రతికూల పరిస్థితులను సమన్వయ పరచుకోవడం చేత కాదు.

వాళ్ళమ్మ ఉన్నంత కాలం ఒక్కతే కూతురు అని అతి గారాబం చేసింది. మాలతికి మొదటి నుండి నిదానించడం తెలియదు. ఆవేశం, తొందరపాటు ఎక్కువ. “మాలమ్మా, ఏమయ్యిందమ్మా!” అన్నారు. దేనికయినా ఓ సీన్ చేయడం కొందరికి అలవాటు ఉంటుంది.

ఆమె చెప్పదల్చుకున్నదేదో నిగ్రహంగా చెప్పవచ్చు. కానీ అలా ఎలా చెప్పగలదు. ఏ స్త్రీకి అయినా ఇది మాములు విషయం కాదు, గుండెల్ని మండించే విషయం.

తాతగారి ప్రశ్నకు సమాధానం గా, “మీరు, మీరు జాహ్నవికి చెప్పండి నాన్న గారూ!” అంది.

తాతగారు, ‘ఏదో ఉంది విషయం’ అనుకుని, వాకింగ్ స్టిక్ ప్రక్కన పెట్టి, మాలతి ప్రక్కన కూర్చున్నారు.  “ఏమి జరిగింది” అన్నారు సంబాళిస్తూ.

“కొత్తగా జరిగేందుకు ఏముంది? మీరు.. మీరు.. ఆమెకు జానూతో లెటర్ వ్రాయించారు” అంది. “నువ్వొద్దంటే, ఊరుకునే వాళ్ళం కదా! తల్లీ!” అన్నారు.

ఆమె వెక్కుతూంది.

“నీ బాధలో న్యాయం ఉందమ్మా! కానీ, జానమ్మకు అక్కడ ఆమెతో అవసరం కదా! ఆమెను కాస్త కూల్ చేయడం అవసరం అనిపించి..”

ఆయన మాట పూర్తవకుండానే తలని చేత్తో టపీ, టపీ మని కొట్టుకుంది మాలతి.

అతి ప్రయత్నం మీద ఆమె చేతులు పట్టుకొని ఆపారు.

“మాలతీ, ఇంకెప్పుడూ ఆమెకు ఉత్తరాలు వెళ్ళవు. సరేనా!”

“జానూ..”

“అది నేను చెప్పాననే కదా, ఆ పని చేసింది దానికి కూడా చెప్తాను. సరేనా!” ఆయన ఇంక ఆ రోజుకు వాకింగ్ మానుకున్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here