ఎంత చేరువో అంత దూరము-8

10
9

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జాహ్నవి రాసే ఉత్తరాలకు తండ్రి నుంచి బదులు రాదు. తాతగారేమీ ఆశ్చర్యపడలేదు. జాహ్నవి నిరుత్సాహం చెందక ప్రయత్నిస్తూనే ఉంది. రెండో ఉత్తరం రాస్తుంది. దానికీ జవాబు రాదు. ఆఫీసు అడ్రసుకు వచ్చిన జాహ్నవి ఉత్తరాన్ని పట్టించుకోడు ఆనంద్. కాస్త ఏకాంతంగా సమయం గడుపుదామని హోటల్‍కి వస్తాడు. అక్కడ కొందరు అమ్మాయిలు వచ్చి సందడిగా కబుర్లు చెప్పుకుంటుంటారు. వాళ్ళల్లో ఒక అమ్మాయిని చూస్తే జాహ్నవి అలానే ఉంటుందేమోననిపిస్తుంది అతనికి. విచలితమైన మనసుతో బయటకి వచ్చేస్తాడు. ఈసారి జాహ్నవి అతని స్కెచ్ గీసి పోస్టులో పంపుతుంది. తండ్రి మీద ఉండే హీరో వర్షిప్ ఆ ఉత్తరంలో కనిపిస్తుంది. అయినా దానికీ జవాబివ్వడు. తండ్రికి రాస్తున్న ఉత్తరాలను అతను పట్టించుకోకపోవడంతో, ఈసారి పిన్నికి రాయమంటారు తాతగారు. ఆ సూచనని పాటించి ఆమెకు ఉత్తరం రాస్తుంది. విషయం తెలిసిన మాలతి ఖంగుతింటుంది. చివరికి ఆమె దయాదాక్షిణ్యాలు కావల్సి వచ్చాయా అని అసహనానికి లోనవుతుంది. తనని తాను సంబాళించుకోలేక, తండ్రి గదిలోకి వెళ్తుంది. ఉబ్బిన కళ్ళని అదిమి పెట్టిన ఆవేశాన్ని చూసిన భద్రంగారు ఏమయిందని కూతురిని అడుగుతారు. ఆమెకు ఉత్తరాలు రాయొద్దని జాహ్నవికి చెప్పమంటుంది. సరేనంటారాయన. – ఇక చదవండి.]

అధ్యాయం 8

[dropcap]జా[/dropcap]హ్నవి అప్పుడే స్కూల్ నుండి వచ్చింది. మెట్ల మీద తల్లి ఎదురు రాక పోవడం గమనించింది. లోపలికి వచ్చేసరికి రేగిన తలతో, ముఖం మీద తుడిచిన కన్నీటి కాల్వల గుర్తుతో మాలతి కనిపించింది. ఆ పక్కనే తాతగారు ఉన్నారు.

జాహ్నవి స్కూల్ బ్యాగ్ ప్రక్కన పడేసింది.

ఏమీ అడగలేదు.

తల్లి ప్రక్కనే కూర్చొని, భుజాల పై చేయి వేసి ఓదార్పుగా దగ్గరికి తీసుకుంది.

ఆ స్పర్శ చాలు.. వేయి ఏనుగుల బలం నింపుతూ.. మనది విడిపోయే బంధం కాదని జాహ్నవి చెప్తున్నట్టు అనిపించింది.

మలయ మారుతంలా మనసంతా చల్లదనం నిండుకుంది.

నిజానికి మాలతికి ఈ విషయంలో జాహ్నవిపై ఎప్పుడూ కోపం లేదు. తండ్రిని చేరాలన్న ఆ పిల్ల ఆరాటం చూసి, తనకూ ఆవేదననే. అలా అప్పటికి ఆ తుఫాన్ సద్దుమణిగింది.

***

నీలిమ ఫోన్ చేసింది.

“ఎనీ ప్రోగ్రెస్?” అంది.

“ప్రోగ్రెస్ ఏమీ లేదే! నీతో ఎన్నో చెప్పాలి. మీ ఇంటికి వచ్చేయాలంటే టైం చాలా వేస్ట్ చేయాలి, ఎగ్జామ్స్ ముందు.”

“అవును, జానూ, అది నిజమే! అప్పటి లాగా లెటర్ వ్రాస్తావా!”

“లెటరా!”

“హైస్కూల్ పిల్లలప్పటి నుండే ఫోన్స్ ఎందుకు భారతీ! పిల్లలు చెడిపోతారు,” మహేంద్ర గారి గొంతు ననుకరిస్తూ అన్న నీలిమ మాటలకు నవ్వింది, జాహ్నవి.

“ఫోన్ ఏమిటి, నువ్వే మాట్లాడావా! అమ్మాయి మాట్లాడుతూందా! బయట నుండి ఫోన్ చేస్తే తరచు ఎంగేజ్ వస్తూందీ మధ్య.” మళ్ళీ ఆయన గొంతునే అనుకరిస్తూ అంది.

“మైగాడ్” అంది జాహ్నవి.

“అలా ఉంటుంది నా పరిస్థితి.”

“అయితే లెటర్ వ్రాస్తాను లేవే.”

“వ్రాయి! మధ్యాహ్నం పోస్ట్‌కు వస్తే నేను మేనేజ్ చేసుకోగలను.”

“ఓ.కే.” అంది జాహ్నవి.

‘ఓవర్ కేరింగ్ నాన్న’ అనుకుంది మహేంద్ర గారి గురించి.

ఫోన్ ఆఫ్ చేసాక నీలిమ గురించి ఆలోచిస్తూ ఉండి పోయింది. దాన్ని స్కూల్లో దింపేందుకు ముసలి డ్రైవర్‌ని చూసి మరీ పెట్టుకున్నారట. తన వయసువారైన ఫ్రెండ్స్‌తో నవ్వుతూ, తుళ్ళుతూ బయట తిరిగే ‘లక్’ దానికి లేకుండా పోయింది పాపం, అనుకుంటూ లెటర్ వ్రాయడానికి ఉపక్రమించింది.

~

నీలూ,

నాన్నకు లెటర్స్ వ్రాయడం ప్రస్తుతానికి ఆపేయదల్చుకున్నానే. ఆలా అని మానేస్తానని కాదు.

వేసవి సెలవులు పోతే దసరా సెలవులు వస్తాయి. అసలు నాన్ననే దసరా సెలవులకు రమ్మని వ్రాస్తాను. అందరిలా నేనూ నాన్న చేయి పట్టుకొని చాముండి కొండ ఎక్కేస్తాను.

లైట్స్‌లో వెలిగే మహారాజా ప్యాలెస్ నాన్నతో చూడాలి కదా! చిన్నప్పుడు అందర్నీ చూసి నేను పొందలేని అదృష్టాన్ని తల్చుకుని బాధపడిన నా మనసు, మళ్ళీ అన్నీ స్వంతం చేసుకోవడంలో పొందే అనుభూతిని త్వరలో అందుకుంటుంది.

నీలూ, జాబు వ్రాయనంత మాత్రాన నాన్నకు ప్రేమ లేదని ఒక్క రోజు కూడా, ఒక్క నిముషం కూడా అనుకోలేను.

ఈ ఉత్తరాలనేవి తండ్రీకూతుళ్ళ ప్రేమ వారధిలా కలిపే వరకూ సాగుతూనే ఉంటాయి. నాలా ఎందరు కూతుళ్ళు దూరమయిన తమ తల్లికీ లేక తండ్రికీ మౌన సందేశాలు పంపుతూ మనస్తాపం పాలవుతున్నారో..

నీలూ, తాతగారి సలహా ప్రకారం ‘ఆమె’కు లెటర్ వ్రాసాను. అమ్మ చాలా అప్సెట్ అయ్యింది. వంద ఉత్తరాలయినా వాళ్ళ నాన్నకు వ్రాసుకోమనండి. కానీ, ఆమెకు వ్రాయొద్దని చాలా ఫీలయి చెప్పిందిట, తాతగారితో. ఇంక ఆమెకు అదే చివరి ఉత్తరం.

అటు చూస్తే నాన్న ఇంకా రిప్లై ఇవ్వలేదు.

చూసారో లేదో, చేరాయో లేదో.. ఏదీ అర్థం కాని పరిస్థితి.

చీకట్లో అయినా బాణం విసరాల్సిందే.

గురి తప్పు తుందని మానితే ఎలా?

నిరాశగా లేదే! నిర్లిప్తత ఆవహిస్తోంది.

నేనేమి చేయాలో తెలిస్తే ఎంతయినా చేస్తాను.

ఏమి చేయాలో అర్థం కానప్పుడే, సమయం కోసం వేచి చూడక తప్పదేమో!

బాగా చదువుకో నీలి! ఏవి అర్ధం కాకున్నా, నాకు ట్రబుల్ ఇస్తున్నాను అనుకోకుండా అడుగు. అలా నువ్వు నన్ను అడగక పోతే, మన ఫ్రెండ్షిప్‌కు అర్థం లేనట్టే. ఎగ్జామ్స్ అయ్యాక కలుద్దాం.

ఫరెవర్, యువర్స్ జానూ.

~

ఉత్తరం మూసేయబోతుంటే, హఠత్తుగా మాలతి గది లోకి వచ్చింది. చదువుకుంటూంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆపిల్ ముక్కలు కోసి తానే పైకి తెచ్చింది.

కంప్యూటర్‌లో వస్తూన్న పాటల శబ్దం వల్లేమో, అమ్మ పట్టీల అలికిడి గ్రహించలేదు. కానీ కూతురు లెటర్ వ్రాస్తూందని మాలతి గ్రహించింది.

మూత తెరిచి బెడ్ మీద ఉన్న పెన్నూ, ఆమె చేతిలో కవర్ చూసి, వచ్చినంత నిశ్శబ్దంగా వెళ్ళి పోయింది, చేతికి ప్లేట్ అందించి.

ఆపిల్ ముక్కలు నములుతున్న జాహ్నవి, రాబోయే ఉపద్రవం ఊహించ లేదు.

జాహ్నవి గదిలో నుండి నిశ్శబ్దంగా వచ్చిన మాలతి గుండెల నిండా పెద్ద సందేహం మోసుకొని వచ్చింది.

జాహ్నవి ఉత్తరం వ్రాయడం గమనించింది.. ఇంకెవరికి వ్రాస్తుంది.

వాళ్ళ నాన్న సమాధానం ఇవ్వట్లేదు కదా, ఇంక ఆ మహాతల్లి వెంట పడుతుందేమో!

తన మాట కంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న తపన ఎక్కువయ్యింది జాహ్నవికి.

తాను ఉత్తరాలు వ్రాయొద్దంది వాళ్ళ నాన్నకు కాదు, కదా! ఎవరికి వద్దన్నానో, ఎందుకు వద్దన్నానో అర్ధం చేసుకోదా! తన అభిమానం ఇంత తీవ్రంగా తన కన్న కూతురే గాయపరుస్తూంటే తానేమి చేయగలదు?

ఆనంద్‌ను ఆ మహాతల్లే రిప్లై ఇవ్వకుండా చేసిందేమో ఎవరికి తెలుసు. తన నమ్మకం అయితే ఖచ్చితంగా అంతే. ఆనంద్ తన దగ్గరికి పిలవకున్నా, రెండు ముక్కలు వ్రాస్తే ఏమి పోయింది? పిల్ల సంతోషిస్తుంది కదా!

అసలు జాహ్నవికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తాను తన స్థానం వదలాల్సింది కాదు.

ఆలోచనల హోరుతో అలిసిపోతున్న మాలతి మనసు అగ్నిగుండంలా ఉంది.

దాని భగ భగల్లో మాలతి శలభం అయింది.

కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది. కుదుట పడిన మనసు తీపి కలలు కంటది.

నిజమే, కానీ కునుకు రావాలి కదా!

అగ్ని గుండం చల్లారాలి కదా!

అప్పటికే నిద్ర మాత్ర కూడా వేసుకుంది.

నీ మనసును జోల పుచ్చడం నా వల్ల కాదు అంది నిద్రాదేవి. మాలతి కోపం అంతా నిద్ర మీదకు మళ్ళింది. నువ్వెందుకు రావో నేనూ చూస్తానన్నట్టు, కసిగా నిద్ర టాబ్లెట్స్ వేసుకుంది.

మరునాడు, ఆమె పట్టీలమోత ఇంట్లో ప్రతి ధ్వనించలేదు. “జానూ, బూస్ట్”, “జానూ, టిఫిన్ రెడీ!” అన్న పదాల పల్లవి వినబడలేదు.

జాహ్నవి, “అమ్మా”, అంటూ క్రిందకు వచ్చి, అచేతనమయి ఉన్న తల్లిని చూసి, షాక్ తిన్నది. తాతగారు అప్పటికే మార్నింగ్ వాక్‌కు వెళ్ళారు.

జాహ్నవి స్ప్రింగ్‌లా క్రింద శ్రీనివాస్ దగ్గరికి పరిగెత్తింది. వాళ్ళ కార్లో అతని సహాయంతో ఫ్యామిలీ డాక్టర్ ఉన్న హాస్పిటల్‌కు మాలతిని తీసుకొని వెళ్ళింది. తాతగార్ని కంగారు పడకుండా చూడమని శ్రీనివాస్‌కు చాలా చెప్పి పంపింది.

ఆ తర్వాత విజిటర్స్ మధ్యకు వచ్చి కూర్చుంది. ఏదీ బయటకు కనబరచని ఆ అమ్మాయి, గుండె సంద్రమయినట్టు ముఖాన్ని, కళ్ళను దోసిట్లో మూసుకొని భోరుమంది.

ప్రపంచమంతటి నుండి, తాను ఏకాకిగా మిగిలినట్టు, లోకమంతా చీకటి కమ్ముకున్నట్టు..

జాహ్నవి వెంట ఎవరూ లేకపోవడం గమనించి, ప్రక్కన ఉన్నావిడ భుజం మీద ఓదార్పుగా చేయి వేసింది. “అమ్మ అంటే అంతేనమ్మా! అమ్మకు సాటి ఎవరూ రారు. ఒక్క అమ్మ ఉంటే అంతా నీ వెంట ఉన్నట్టే. ఆ ధైర్యం ఇంకెవరి తోనూ రాదు” అంది.

జాహ్నవి కూడా అదే అనుకుంటూంది. ‘నాకు అమ్మ కావాలి. అమ్మే కావాలి’.

‘నాన్న కోసం తన ఆశ, తన ప్రయత్నం అమ్మను లాస్ చేసుకోవడానికి కానే కాదు. అమ్మా, సారీ, అమ్మా, ఎందుకిలా జరిగింది, నేనేమి తప్పు చేసాను’, ఆగని ఆక్రోశం జాహ్నవిలో.

‘నా జీవితంలో అన్నీ ఎందుకిలా జరుగుతున్నాయి. నాన్నకూ, అమ్మకూ ఎవరికీ తాను పట్టదా! వాళ్ళ ఇగోస్ ముఖ్యం. జాహ్నవి ఎవరికీ ముఖ్యం కాదా!’ అంటోంది ఆమె మనసు ఆ క్షణం.

జరిగిన సంఘటన తాతగారిని బాగా కుదిపేసింది.

ఎంత పని చేసింది మాలతి!

కావాలని చెయ్యక పోవొచ్చు. కానీ అంత ఆవేశం ఎప్పుడయినా మంచిదా!

తాను జాహ్నవికి సలహా ఊరికే ఇవ్వలేదు.

ఆమె సహకారం లేనిదే ఆనంద్ కూడా ఆమెను ఆహ్వానించలేడు. ఆమె నుంచి లైన్ క్లియర్ అవుతేనే కదా, ఏదైనా చేయగలడు. అందుకే ఆమెకు వ్రాయమన్నాడు.

మాలతికి తెలివి లేదు. వ్యర్థమైన ఆవేశం తప్పితే. అనుకున్నారు, తనలో తాను ద్రిగ్గుళ్ళుతూ.

***

ఫైల్స్ చూస్తూ ముఖ్యమైన పోస్ట్ కోసం, బెల్ నొక్కాడు ఆనంద్.

“నిన్న పోస్ట్‌లో ‘అరవిందో ఫార్మసీ’ కవర్ ఏమైనా వచ్చిందా!” అన్నాడు.

“మార్నింగ్ వరకు రాలేదు సార్! 12 గంటల పోస్ట్ ఇంకా రాలేదు” అన్నాడు అటెండర్.

ఆనంద్ తల వంచి ముఖ్యమైన కాగితాలేవో చూసుకుంటూండడంతో డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయాడు.

ఈ మధ్యే ఆనంద్ ఒక వెటర్నరీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఆలోచిస్తున్నాడు.

పని పూర్తి చేసిన ఆనంద్, లేవబోతుండగా ప్యూన్ మధ్యాహ్నం పోస్ట్ తెచ్చాడు. వాటిలో కొన్ని షేర్ మార్కెట్ కు సంబంధించిన మ్యాగజైన్స్, కంపెనీకి సంబంధించిన పెద్ద కవర్స్ ఉన్నాయి.

వాటి మధ్య ఒకే ఒక చిన్న కవర్.. అవీ ఆ రోజు వచ్చిన టపా. ఆనంద్‌కు కవర్ చూస్తూనే వెంటనే స్ఫురించింది, ఇది ‘అదే’ అని.

స్టాంప్స్ అంటించిన ఆ తెల్లని కవర్ వంక సీరియస్‌గా చూస్తూ, “ఓహ్” అంటూ కనుబొమ్మలు ముడిచాడు. చేతి లోకి తీసుకొని చదివేసాడు.

ఇదేమిటి, సంబోధన మారింది. ఇప్పుడు ఈ లెటర్ ఊర్మిళకు చూపించాలా! వద్దా!

అతనికి అది ప్రశ్న గానే మిగిలి పోయింది. కాస్త దీర్ఘ ఆలోచన చేసి, లెటర్ టేబుల్ డ్రాయర్‌లో వేసాడు. ఆ తర్వాత కూడా ఆ సంధిగ్ధం అతన్ని వదలలేదు. అందుకే ఆ లెటర్ ఆఫీస్ టేబుల్ డ్రాయర్ లోనే భద్రంగా ఉండిపోయింది.

ఆ తర్వాత ఆనంద్ ఢిల్లీ వెళ్ళాడు.

ప్రస్తుతం జాహ్నవి నాన్నకు, తనకు మధ్య ఉత్తరాల ఆనకట్ట నిర్మించడం వాయిదా వేసింది.

తల్లికి అలా జరగడంతో బాగా డిస్టర్బ్ అయ్యింది. అందుకే అన్నీ ప్రక్కన పెట్టి చదువులోనే మునిగి పోయింది.

జాహ్నవి ఓ వండర్ లాగా కనిపిస్తూంది తాతగారికి. తిరస్కారం పొందిన బాధను దిగమింగడం, కంఠంలో గరళం దాచుకున్నట్టే. తండ్రి నుండి బదులు రాలేదు. అయినా ఇంత తొణకని జాహ్నవి తాతగారికి ఆశ్చర్యం కలిగిస్తూంది.

‘తన వయసుకు ఎంత నిగ్రహం ప్రదర్శిస్తూంది’ అనుకోకుండా ఉండలేకపోయారు.

తండ్రి నుండి బదులు రాలేదు.

ఇప్పుడు పినతల్లి సమాధానం కోసం చూస్తూంది. ఒక వైపు పరీక్షల సమయం. ‘జీవితంలో తండ్రిని చేరడమే గొప్ప పరీక్ష అయ్యింది, ఈ పిల్లకు’ అనుకున్నారు, సాభిప్రాయంగా.

***

ఆదివారం.

ఆనంద్ ఢిల్లీ వెళ్ళాక, కంప్యూటర్‌లో ఆఫీస్ వర్క్ చేసుకునేందుకు రెండు రోజులు ఇద్దరు స్టాఫ్ వచ్చి వెళ్ళారు.

అప్పటి నుండి ఆఫీస్‌కు లాక్ ఉంది.

రేపు ఆనంద్ వస్తే, మళ్ళీ అందరూ బిజీ.

డస్టింగ్ చేయించాలని ఆఫీస్ పోర్షన్ కీస్ పట్టుకొని పైకి వెళ్ళింది, ఊర్మిళ.

ఎప్పుడూ వచ్చే పనామె అయితే తాను వెంట ఉండనవసరం లేదు. కానీ ఆమె ఊరికి వెళుతూ, కొన్నాళ్ళకు వేరే ఆమెను పెట్టింది.

మళ్ళీ ఆనంద్ వచ్చాడంటే ఆఫీస్ ఖాళీగా దొరకడం కష్టం.

ఊర్మిళ డస్టింగ్ చేయిస్తూ ఆనంద్ రూమ్ లోకి వెళ్ళింది.

కొంత పోస్ట్ ఏదో బయటే ఉంది.

వారం రోజులు అవడంతో దుమ్ము పట్టుకొని ఉంది.

ముందు ఆ కాగితాలు, మ్యాగజైన్స్ అంతా డస్టర్‌తో దులిపి, లోపల పెట్టేందుకు ఆనంద్ ఆఫీస్ టేబుల్ డ్రాయర్ తెరిచింది.

అప్పుడు కనిపించింది.

డ్రాయర్‌లో విప్పి పెట్టి ఉన్న ఆ ఉత్తరం.

ఆఫీస్ కాగితంలా కనిపించలేదు.

అయినా, చక్కగా మడిచి పెడదాం అని చేతి లోకి తీసుకుంది.

అక్కడక్కడా కనిపిస్తూన్నఅక్షరాలు.. కుతూహలం పెంచగా, ఎవరబ్బా ఇది, ఎవరిది ఇంత పొందికైన దస్తూరి, పిన్ని ఏమిటి, ఎవరూ.. అనుకుంటూ చదువేసింది.

ఉత్తరం చిన్నదే.. అక్షరాలు కొన్నే..

కాని, చాలా బరువు మోసుకుని వచ్చింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here