ఎంత చేరువో అంత దూరము-9

17
10

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జాహ్నవి స్కూలు నుంచి వచ్చేసరికి ఎప్పటిలా మెట్ల మీద తల్లి కనబడదు. లోపలికి వెళ్ళి చూస్తే, రేగిన తలతో, ముఖం మీద తుడిచిన కన్నీటి కాల్వల గుర్తుతో అమ్మ, ఆమె పక్కనే తాతగారు కూర్చుని కనిపిస్తారు. జాహ్నవి ఏమీ అడగకుండా, వెళ్ళి తల్లిపక్కనే కూర్చుని భుజాలపై చేయివేసి, ఓదార్పుగా దగ్గరకు తీసుకుంటుంది. ఆ చర్యకి మాలతి సాంత్వన పొందుతుంది, తమది విడిపోయే బంధం కాదని తలుస్తుంది. నీలిమ ఫోన్ చేసి ఏదైనా ప్రోగ్రెస్ ఉందా అని అడిగితే, లేదంటుంది జాహ్నవి. అయితే తనకి ఉత్తరం రాయమంటుంది నీలిమ. కాసేపయ్యాకా, నీలుకి ఉత్తరం రాస్తూ అందులో నాన్న గురించి రాస్తుంది జాహ్నవి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మాలతి జాహ్నవి ఉత్తరం రాయడం చూసి, అది ఆ మహాతల్లికేనేమో అనుకుని, తెచ్చిన యాపిల్ ముక్కలు జానూకి అందించి నిశ్శబ్దంగా తన గదికి వెళ్ళిపోతుంది. ఆమె మనసు తీవ్రమైన అలజడికి లోనవుతుంది. నిద్రపట్టదు. ఎలాగైనా నిద్రపోవాలని మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకుంటుంది. ఉదయాన్నే ఎప్పుడూ వినబడే అమ్మ పిలుపులు వినబడకపోవడంతో తల్లి గదిలోకి వెళ్ళి అచేతనంగా ఉన్న ఆమెను చూసి షాక్ తింటుంది జాహ్నవి. తాతగారు వాకింగ్‍కి వెళ్ళి ఉండడంతో క్రింద పోర్షన్‍లో ఉండే శ్రీనివాస్ సాయంతో తల్లిని ఆసుపత్రిలో చేరుస్తుంది. తనకే ఎందుకిలా అవుతుంది, నాన్నకూ, అమ్మకూ ఎవరికీ తాను పట్టదా అని అనుకుంటుంది జానూ. ఆఫీసులో ఫైల్స్ చూస్తూన్న ఆనంద్ అటెండర్‍ని పిలిచి క్రితం రోజు అరవిందో ఫార్మా నుంచి ఉత్తరమేదైనా వచ్చిందా అని అడుగుతాడు. అతను రాలేదని చెప్తాడు. మధ్యాహ్నం వచ్చిన పోస్టులో జాహ్నవి ఉత్తరం కనబడుతుంది. ఈసారి ఊర్మిలని ఉద్దేశిస్తూ రాసిన ఆ ఉత్తరాన్ని ఎప్పటిలాగే టేబుల్ సొరుగులో పెడతాడు. ఆనంద్ ఢిల్లీ వెళ్ళాకా ఆఫీసు గదులు శుభ్రం చేస్తూ, టేబుల్ సొరుగు తెరిచిన ఊర్మిళకు జానూ రాసిన ఉత్తరం కనిపిస్తుంది. తీసి చదువుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 9

[dropcap]ఆ[/dropcap]మె చిత్తరువులా, ఆఫీస్ రూమ్ చెయిర్‌లో అలాగే కూలబడింది.

ఇది నిజమా! ఈ ఉత్తరం నమ్మాలా!

సంభ్రమం-విభ్రమం

ద్వైదీభావోత్పాతం

ఇప్పుడేమి చేయాలి?

ఆనంద్ గారు ఈ విషయం తనతో ఒక్క ముక్కా చెప్పలేదు, ఎందుకనో! తాను బాధ పడుతుందనా! అంగీకరించదనా! ఏదైనా కావొచ్చు. కానీ ఈ విషయాన్ని రహస్యం చేయడం తనకు బాధగా ఉంది.

“సరే, చెప్పనీ, తన నోటి వెంటే రానీ!” అనుకుంది, స్తబ్ధుగా.

ఉత్తరం కలిగించిన కలవరం ఒక ప్రక్కన.. ఆనంద్ నిజం దాచాడన్న బాధ ఒక ప్రక్కన.

భాష్పపు తెర కరిగి కారిపోయింది చెక్కిలిపై.

సాఫీగా సాగే సంసారనౌకకు ఎదురు గాలి తాకిడి అయ్యింది ఆ ఉత్తరం.

***

ఆనంద్ చేతిలో చిన్న బ్రీఫ్ కేసుతో లోపలికి అడుగు పెట్టాడు.

అతను వస్తున్నానని ఫోన్ చేసినప్పుదే అనుకుంది ఊర్మిళ ఇన్నాళ్ళ మనోవేదనకు స్వస్తి పలకాలని.

అలసిపోయి వచ్చిన అతని చేతికి నీళ్ళ గ్లాస్ అందిస్తూ కళ్ళ లోకి లోతుగా చూసింది. ఆ కళ్ళలో నిజాయితీ, స్వచ్చమైన అదే నవ్వు!

ఆమె తన వంక చూస్తూంటే

-”ఏమిటీ” అన్నట్టు కళ్ళేగరేసి చిరునవ్వుతో ఆమె వంక చూసాడు. ఊర్మిళ నవ్వాననిపించింది. నిజానికి లెటర్ చదువగానే ఆమె మనసు జాహ్నవి రాకకు హృదయ పూర్వక స్వాగతం పలికెంది.

ఒకప్పటి క్యూట్ బేబీ, తాను ముద్దులన్నీ మూట గట్టి ఇచ్చిన చిన్నారి – పెరిగి పెద్దయ్యి కళ్ళ ముందుకు వస్తానంటే ఏ స్త్రీ కయినా మది పరవశమే కదా! మాతృ హృదయ రంజితమే కదా!

అంతే కాదు ఉత్తరం చదివిన ఆమెను జానూ వేదనలో తనకూ భాగం ఉందా? అనే ఆలోచన ముడుచుకొని పోయేలా చేసింది. ఆనంద్‌కు తన వద్ద దాపరికరం ముడుచుకు పోతున్న మనసును బాధతో మెలి పెడుతూంది.

ఆనంద్ తనతో ఎంత క్యాజువల్‌గా ప్రవర్తించాడో -ఏమీ జరుగనట్టే – అతని హృది ప్రకంపనాల చిరు సవ్వడి

కూడా తాను పట్టుకోలేక పోయింది. స్త్రీ హృదయ సముద్రం అంత లోతు అన్న మహానుభావుడెవరో కానీ ఈ మనిషిని అతనికి చూపాలి. ఏమైనా కానీ ఇంక అతన్ని అడిగేయాల్సిందే! ‘ఎందుకు దాచారు ఈ విషయం నా దగ్గర’ అని. అలా అడిగి ఆయనపై తనకున్న గౌరవాన్ని తక్కువ చేయగలదా! ఆ పరిస్థితి రాకుండా ఆనంద్ గారే చెపితే బాగుణ్ణు! అనుకుంది, ఊర్మిళ చెదిరిన మనసుతో.

***

ఇంకొన్ని రోజుల్లో వేసవి సెలవులు.

ఊర్మిళ స్కూల్‌కు వెళ్ళింది. పిల్లలతో గడపటం అంటే ఎంతో ఇష్టం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.

“అక్షయ్! నీకు జ్వరం వచ్చి ఆబ్సెంట్ అయ్యావు కదా! వికాస్ దగ్గర నోట్ బుక్ తీసుకొని, హోమ్ వర్క్ చేసుకుని చూపించు”, అంది.

వాడు ఏమి మాట్లాడలేదు. తల దించుకుని నిలబడ్డాడు.

మిస్‌కు అర్ధం కాలేదు.

“ఏమి అక్షయ్!”

“వాడు నాకు ఇవ్వడు మిస్! వాడు నాతో మాట్లాడడు, కదా!” క్లాస్ టైం అయ్యింది.

బెల్ మ్రోగింది.

“సరే, రేపు చూద్దాం.”

ఆమె చేతిలో బుక్స్ కొన్ని పట్టుకొని బయటకు నడిచింది. లంచ్ అవర్‌లో టీచర్స్ అంతా పిచ్చాపాటి కబుర్లతో ఉంటే, ఆమె మాత్రం ఆలోచిస్తూంది.

ఎందుకు ఇలా పూలలా పరిమళం వెదజల్లే పిల్లల మనసులు కలుషితం అవుతున్నాయి. ఇద్దర్నీ విడివిడిగా పిలిపించి అడిగింది. అర్థం అయ్యింది.

వీడు చదువులో కాస్త వెనుకబడి ఉన్నాడు. అందుకే వీడంటే వాడికి లోకువ. ఇద్దరు ఒకే వీధిలో ఉంటారు. పెద్దవాళ్ళు వాణ్ణి లోకువ కట్టడం చూసి, వీడిలో గర్వం పెరిగింది.

“రేపు నేను ఓ చిన్న కాంపిటీషన్ పెడతాను. ఎవరెవరు రెడీగా ఉంటారు?” అంది.

పిల్లలు ఉత్సాహంగా “నేను.. నేను” అంటూ చేతులెత్తారు,

ఊర్మిళ నవ్వింది.

“నైస్, గాయస్, సీ యూ టుమారో” అంటూ బయటకు నడిచింది.

ఆ మరు రోజు పిల్లలకు ఓ గొప్ప క్లాస్ పీకింది.

తెలివి అంటే చదువు మాత్రమే కాదని, ఎవరికి ఎందులోనయినా ప్రతిభ ఉండవచ్చని చెప్పింది.

ఆర్ట్‌లో రూపక్, క్విజ్‌లో మాధవ్, జనరల్ నాలెడ్జ్‌లో సంతోష్.. రన్నింగ్‌లో అక్షయ్.

క్లాస్ నుండి వెళ్ళాక వికాస్‌ను పిలిచింది.

“అయ్యో! నీకేమిటి రా! ఎందులో రాలేదు. పర్లేదు లే, బాధపడకు. నీకు మార్కులు బాగా వస్తాయి, కదా! ఇలా ఒక్కొక్కళ్ళకు ఒక్కో టాలెంట్ మరి” అంది.

చిన్నబుచ్చుకున్న వాడి ముఖం చూస్తూ, “ఒరే, ఓటమి ఎంత బాధ కదా, పాపం, అక్షయ్ కూడా మార్కులు తక్కువ వస్తే అంతే బాధ పడతాడు రా! మనం మన దగ్గర లేనిది ఒకరికి ఇవ్వాలి. ఒకరి దగ్గర ఉన్నది మనం అడగవచ్చు. మనం హూమన్ బియింగ్స్‌రా, హెల్ప్ ఇస్తూ తీసుకుంటూ పోవాలి. నీవు రూపక్‌తో కలిసి బొమ్మలు దించు. నీ నోట్ బుక్స్ అక్షయ్కు ఇవ్వు” వాడు తలాడించాడు. ఆ తరువాత ఇద్దరూ ప్రాణంగా కలిసి పోయారు.

‘హు! ఏమి లాభం! తాను చెపితే అంతా వేళాకోళం గానే ఉంటుంది ఆనంద్ గారికి. ముందు ఇంట్లో ఉన్న ఇద్దరు కోతులను కంట్రోల్ చేయి, అంటూ ముక్కు మీద నుండి జారిన కళ్ళద్దాల నుండి ఓ లుక్కిస్తారు’ అనుకుంది స్టూడెంట్స్ అందరికీ అతిగా నచ్చే ఆ ఊర్మిళా టీచర్.

***

ఊర్మిళకు అర్థం అయ్యింది. ఆనంద్ ఇంక ఆ విషయం చెప్పడు. తనే చొరవ తీసుకోవాలి.

అతను చెప్పక పోవడానికి కారణాలు ఏమున్నా తమ మధ్య ఓ రహస్యం నలగడం తనకు భరింపశక్యంగా లేదు.

ఆ రోజు వస్తూనే ఆఫీస్ వర్క్ చూసుకోవడానికీ, డాబా మీదకు వెళ్ళాడు.

స్టాఫ్ ఎవరూ లేరు. ఆనంద్ కంప్యూటర్ పై ఏదో పని  చూసుకుంటున్నాడు.

ఊర్మిళ ఆఫీస్ కిచెన్ లోకి వెళ్ళి రెండు కప్పుల్లోకి వచ్చేలా టీ పెట్టింది.

ఆనంద్‌కు ఇచ్చి,కుర్చీ దగ్గరకు జరుపుకుని కూర్చుంది.

ఆనంద్ వర్క్ పూర్తయి  రిలాక్స్డ్‌గా కుర్చీలో వెనక్కు వాలాడు.

టీ సిప్ చేస్తూ, “పిల్లలేరి” అన్నాడు.

“ఆంజనేయులు పార్క్‌కు తీసుకొని వెళ్ళాడు” అంది.

“పిలిపించు! ఈ టూర్‌ల వల్ల పిల్లలను చాలా మిస్ అవుతున్నాను”

“అంతకంటే ముందు మీతో ఒక విషయం మాట్లాడాలి “

“ఓహ్..” అతను కనుబొమ్మలు పైకి ఎగుర వేసాడు.

“అర్థం అయ్యింది” అన్నా డు ఊర్మిళ వంక చూస్తూ

“స్కూల్లో నీ కౌన్సిలింగ్‌కు ఏ పిల్లోడికో పిచ్చెక్కి ఉంటుంది. భయపడకు! అంతా నే చూసుకుంటాలే. నాకు ఇదంతా మాములేగా!” అన్నాడు.

ఊర్మిళకు ఉడుకుమోతుతనం వచ్చేసింది. కోపంగా ఎదురుగా ఉన్న పేపర్ వెయిట్ చేతుల్లోకి తీసుకుంది. అన్నీ జోకులేనా! ఎదుటి వాళ్ళ గుండె మంట ఇతనికి అర్థం కాదా!

“ఏయ్! ఊర్మిళా ఆపు! ఏ పుర్రెకో తగిలితే నీ స్కూల్ పిల్లలతో కలిసి నేనూ కౌన్సిలింగ్‌కు వెళ్ళాలి.”

“అంతే కానీ, నన్ను మాట్లాడనివ్వరన్నమాట.”

“అలాగే మాట్లాడు మరి!”

బుద్ధిమంతుడిలా ఫోజ్ పెట్టాడు.

“తెలివైనవాళ్ళతో మాట్లాడే తెలివి నాకు లేదు లెండి.”

“నేనూ, నీ లాగే లే! మాట్లాడు ప్లీజ్!”

ఇంక లాభం లేదనుకుని డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వచ్చింది. “జానూ లెటర్ వ్రాసిందని నాకు ఎందుకు చెప్పలేదు.”

“ఒకటేమిటి చాలానే వ్రాసింది. టేబుల్ డ్రాయర్‌లో ఉన్నాయి. వెళ్ళి చదువుకో!” అన్నాడు. నిజంగా ఇది కూతురి పట్ల నిర్లక్ష్యమేనా! ఆడవారి మాటలకు అర్థాలు వేరుట, కానీ కొందరు మగవాళ్ళ మాటలు ఎప్పటికీ అర్థం కావు. ఊర్మిళ తెల్లబోయి చూసింది అతని వంక. ఆమెకు ఏమీ పాలుపోలేదు.

“అంటే అలా వదిలేస్తారా! మీకు ఏమీ బాధగా లేదా!”

ఆనంద్ సమాధానం చెప్పలేదు. కానీ అతను ఆలోచిస్తున్నాడని ఊర్మిళకు అర్థం అయ్యింది.

ఆనంద్ నిజం గానే ఆలోచిస్తున్నాడు.

జానూ ఉత్తరాల వెనుక భద్రం గారి హస్తం ఉండొచ్చేమో అనుకున్నాడు.

జాహ్నవికి ఇవ్వవలసిన వేవో ఆమెకు ఇవ్వడం గురించి తన కెవరూ చెప్పనవసరం లేదు

మాలతి ఏదయినా ముఖాముఖి తేల్చుకునే రకం. ఈ డబ్బు గోలలేవి ఆమెకు పట్టవు. ఇది భద్రం గారి పనే అని అతని అనుమానం. ఒక వేళ జాహ్నవియే తన కోసం వ్రాసినా, ఇప్పుడు తానేమి చేయగలడు. ఊర్మిళ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఆమెను, కోరరాని కోరిక కోరి ఇబ్బంది పెట్టడం మనస్కరించకే జానూకు బదులివ్వలేదు.

“జానూకు రిప్లై వ్రాయండి. తాను అనుకున్నట్టు వారం రోజులుండి వెళితే నష్టం ఏమిటి!” అంది.

దీర్ఘమైన ఆలోచన అనంతరం – అతని గొంతు మంద్ర స్థాయిలో పలికింది.

“వద్దు ఊర్మిళా! అనవసర కాంట్రవర్సీలకు తావివ్వొద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్” అన్నాడు.

“మీ మగవాళ్ళకు ప్రేమలుండవా!”

“ప్రేమలు ఒక్కటీ ఆలోఛీస్తే సరిపోదు. ప్రాక్టీకాలిటి ఉండాలి.”

“అదంతా నాకు తెలీదు. నేను చైల్డ్ సైకాలజీ చేసింది, ఓ చైల్డ్‌ను బాధ పెట్టేందుకు కాదు”

“అయితే ఇప్పుడేమి అంటావు!”

“జానూకు రమ్మని లెటర్ వ్రాయండి.”

“బాగా ఆలోచించుకో ఊర్మిళా!”

“నాకు ఇంత కన్నా ఆలోచించడం రాదండీ!” అంది.

అతనింకా సందిగ్ధంలో ఉండగానే, ఫార్మసీ లెటర్ పాడ్ నుండి ఓ కాగితం చింపి అతని ముందు ఉంచింది.

“నీవే వ్రాయి. తన చివరి లెటర్ నీకే వ్రాసింది” అన్నాడు.

ఆనంద్ ఎమోషనల్ అయ్యాడు.

“నేను వ్రాస్తే మీరు వ్రాయలేదు, అనే ఫీలింగ్ ఉంటుంది.”

ఆనంద్ చేతిలో కాగితం వంక ఓ క్షణం చూసాడు. చిన్ని జాహ్నవి మున్నీని ఎత్తుకుని పరిగెడుతోంది అతని కళ్ళ ముందు.

రెండే వాక్యాలు వ్రాసి, ఊర్మిళ చేతికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళి పోయాడు.

‘జానూ! యూ కెన్ కం! యువర్ లవింగ్ డాడ్!’

***

ఊర్మిళకు సంబరంగా ఉంది. తన చేతుల్లో ఆరు నెల్లు పెరిగిన పాపాయి, పెరిగి పెద్దయ్యి, కనబడబోతోంది.

పిల్లలను పిలిచి చెప్పింది, జానక్క వస్తోందని.

వాళ్ళ సందేహాలకు నేర్పు జోడించి సమాధానం చెప్పింది.

కొలాజ్‌లో జానూ నెత్తుకుని ఉన్న తన ఫోటోను ఆప్యాయంగా చూసింది.

సంబరంగా అటెండర్‌ను పిలిచి ఉత్తరం పోస్ట్ చేయమంది. మరో రెండు రోజుల్లో జానుకు ఉత్తరం చేరుతుంది అనుకుంది తృప్తిగా.

***

ఆమె ఊహ నిజం చేస్తూ, ఉత్తరం రెక్కలు కట్టుకొని ఎగిరి వచ్చి, పోస్ట్ డబ్బాలో పడకముందే తాతగారి చేతిలో బడింది.

ఫ్రం అడ్రస్ హైదరాబాద్ చూస్తూనే తాతగారు స్లోమోషన్‌లో పరిగెత్తే సినిమా హీరోలా, వాకింగ్ స్టిక్ పక్కన పడవేసి, పైనకి వచ్చారు.

“జానమ్మా! హైదరాబాద్ నుండి ఉత్తరం వచ్చింది”, అన్నారు గట్టిగా.

చాపపై పుస్తకాలు పరిచి, వర్క్ చేసుకుంటున్న జాహ్నవి, ఒక్క ఉదుటున లేచి తాతగారి దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది.

“తీసుకో! నువ్వే చదువు వింటాం”, అన్నారు.

వంట యింట్లో రేపటికి ఆకుకూరలు ఫ్రిజ్ నుండి తీయబోతున్న మాలతి వెంటనే హాల్లోకి వచ్చింది.

జాహ్నవి ఉద్విగ్నంగా ఉత్తరం తెరిచి, అందులో ఉన్న రెండే రెండు వాక్యాలు చదివేసింది.

పదే పదే సంభ్రమంగా ఉత్తరం వంక చూస్తోంది.

కల కాదు నిజం.

నిజంగా నిజం.

జాహ్నవి మనసు నింగిని తాకి వచ్చింది. సంతోషంలో అమ్మను, తాతయ్యను కౌగలించుకుంది.

సంతోషం నిలువరించు కోలేక ఇల్లంతా గెంతింది. ఆ అమ్మాయిని చూస్తూ, పెద్ద వాళ్ళ కళ్ళల్లో ఆనందంతో నీళ్ళు ఉబికి వచ్చాయి.

కూతురి సంతోషం మాలతికి అమితమైన ఆనందం కలిగించింది.

జాహ్నవి, నీలూకు ఫోన్ చేసింది.

ఆనందంగా, ఉద్విగ్నమైన కంఠంతో జాహ్నవి నీలూకు చెప్తూంటే సంతోషంగా వింటూండి పోయారు.

భూషణం గారికి కూడా ఫోన్ చేసి ఆయనతో కూడా సంతోషం పంచుకున్నారు.

జాహ్నవి నీలిని కలిసి వస్తానని అన్నది. ఆమె జీవితంలో నాన్న అనే అధ్యాయానికి, నాంది ప్రస్తావన మొదలైన శుభ తరుణం. ప్రాణ స్నేహితురాలితో ఆ ఆనందం పంచుకోవాలని ఆమె అభిలాష.

ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూన్నా కాదన లేకపోయారు. త్వరగా రమ్మని చెప్పారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here