ఎంతో చిన్నది జీవితం

6
11

[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారు రచించిన ‘ఎంతో చిన్నది జీవితం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]‘మ[/dropcap]నిషి జీవితం వెలుగుతున్న కొవ్వొత్తి లాంటిది. ఇలా వెలిగించడం ఆలస్యం అలా కరిగిపోవటం ప్రారంభిస్తుంది. ఇప్పుడే వెలిగించిన కొవ్వొత్తి బాల్యానికి, కౌమారప్రాయానికి గుర్తయితే – సగం కరిగిన కొవ్వొత్తి నడివయసు లాంటిది. ఆ తర్వాత ఇంకేముంది ముసలితనం, మరణం. అంటే కొడిగడుతున్న కొవ్వొత్తి పూర్తిగా కరిగి నేలమీదికి వాలి ఆరిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషి జీవితం ఒక మైనపు ముద్ద.’

ఇంటి పై కప్పు కేసి దృష్టి సారించి చూస్తూ ఆలోచిస్తున్నాను.

“ఏంటి అంత సీరియస్‍గా ఆలోచిస్తున్నారు?” అంటూ వచ్చింది ధరణి.

“ఏం లేదు.. ఈ రోజు నేను ఈవినింగ్ వాకింగ్‌కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక దగ్గర, డిగ్రీలో నా క్లాస్‍మేట్ కరుణాకర్ కనిపించాడు, నలభై ఏళ్ళ తర్వాత! మనిషి ఎంత మారిపోయాడనుకున్నావ్. అసలు నేను గుర్తుపట్టలేదంటే నమ్ము- వయసు మనిషిని ఇంతగా మార్చేస్తుందా అని అనిపించి ఆశ్చర్యం వేసింది!” అన్నాను నేను మా ఆవిడ ధరణి వంక తల తిప్పి చూస్తూ.

“ఏం మారిపోయాడు?” అని అడిగింది తను.

ఆ మాటలతో నాలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్టు గడగడా చెప్పుకుంటూ పోయాను.

“అప్పుడు, సినిమా హీరోలా ఎంత అందంగా ఉండేవాడనుకున్నావ్? ఇంత పొడుగు, ఇంత లావుతో మంచి హాండ్సమ్‌గా ఉండేవాడు, ఒత్తయిన క్రాఫు, ఆకర్షణీయమైన మీసకట్టు ఉండేవి. మంచి పలువరసతో నవ్వితే అందంగా వుండేవాడు. ఎంతోమంది మా కాలేజ్ అమ్మాయిలు వాడి వెంట పడుతూ ఉండేవారు! ఇప్పుడు ఎలా అయిపోయాడనుకున్నావ్ – జుట్టంతా ఊడిపోయి బట్టతల వచ్చేసింది. పళ్ళు కొన్ని ఊడిపోయి, కొన్ని ఎగుడుదిగుడుగా అయిపోయి నవ్వితే ఆదోలా ఉన్నాడు. మనిషి కూడా కొంచెం వంగిపోయి ఆరడుగుల మనిషి కాస్తా ఇప్పుడు ఐదడుగులకు తగ్గిపోయాడు. కొంచెం చెవుడు కూడా వచ్చినట్టుంది – ఏది నేను మాట్లాడినా ‘ఆఁ – ఆఁ’ అనటంతో, ఒక మాట, రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది” అన్నాను ఇంకా ఆశ్చర్యపోతూనే.

“మీరు ఆయన్ని చూడగానే ఏమని పలకరించారు?” అని అడిగింది ధరణి.

“ఓ కరుణాకర్ నువ్వా. నేనసలు గుర్తేపట్టలేదు. ఎంతగా మారిపోయావ్ – అన్నాను తనని నఖశిఖ పర్యంతరం చూస్తూ”.

“ఆయన మమ్మల్ని ఎలా పలకరించాడు?” అని ధరణి మళ్లీ ప్రశ్న వేయటంతో ‘ఏమిటీ యక్ష ప్రశ్నలు?’ అన్నట్టు ఆమె వంక అనుమానంగా చూసాను. ఎందుకంటే మా ఆవిడ తెలివి తేటల మీద ఎప్పుడూ నాకు కొన్ని సందేహాలు, అనుమానాలూ ఉంటూ వుంటాయి గనుక.

“ఓ శేఖరం నువ్వా?! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు – బహుకాల దర్శనం – ఆ కాలేజి వదిలిపెట్టి బయటికి వచ్చాక మళ్ళీ మనం కలవనే లేదు – దాదాపు 40 ఏళ్ళు కావటం లేదూ – కులాసానా?- అని అడిగాడు” చెప్పాను.

నేను అలా మాట్లాడుతూ ఉండగానే మా ఆవిడ ఏదో పని ఉన్నట్లు పక్క రూమ్ లోకి వెళ్ళి చేతిలో అద్దంతో తిరిగివచ్చింది. చేరగిల పడుకున్న నా ఎదురు రొమ్ము మీద ఆ అద్దం పెట్టి “చూసుకోండి” అంది.

“ఏంటి?”

“అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి అంటున్నాను”

“రోజూ చూసుకుంటూనే వుంటాగా – గడ్డం చేసుకున్నప్పుడు?!”

“చూసుకోండీ” అని తను దీర్ఘం తీయగానే చూసుకున్నాను.

ముగ్గుబుట్టలా తెల్లగా ఉన్న జుట్టు, కళ్ళకింద క్యారీ బ్యాగులు, చత్వారం కళ్ళద్దాలు, సొట్టలు పడిన బుగ్గలూ కనిపించాయి.

నేను అలా చూసుకుంటూ ఉండగానే తను మాట్లాడుతూ –

“ఆ బ్రహ్మదేవుడు ఎంత తెలివైన వాడంటే ఎవరి ముఖం వాళ్ళకు కనబడకుండా ఎదుటివాళ్ళ ముఖాలు మాత్రం కనిపించేలా, ముందుకు మాత్రమే చూడగల కళ్ళను పెట్టాడు. అందుకే ఎదుటివాళ్లు మనకు కనిపించగానే ‘ఏంటి ఇలా ఉన్నాడు?’ అనుకుంటాం. అసలు బ్రహ్మ ఉద్దేశం ఏమయి వుంటుందంటే నండీ – ఎవడి ముఖాన్ని వాడు చూసుకుంటే తట్టుకోలేక గుండె ఆగి చస్తాడని ఈ ప్లాన్ వేసినట్టున్నాడు. ఇంతలోకి.. ఎవడో తెలివిగల ఒకడు ఆ రోజు ఏ చెరువుగట్టునో కూర్చున్నప్పుడు, అనుకోకుండా నీళ్ళలో తన ముఖం తనకు కనబడి ఈ అద్దాన్ని సృష్టించాలనీ ఐడియా వచ్చింది – అయినా కృత్రిమం, కృత్రిమమే. అసలు అసలే గనుక ఈ అద్దం ప్రభావం అంతగా వర్కవుట్ కావటం లేదు..! “ అంది తర్కశాస్త్రంలో పెద్ద, పట్టా పుచ్చుకున్నదానిలా.

ఆ మాటల్లోని వ్యంగ్యం ఒళ్ళు మండించింది నాకు.

“నీ వెటకారం ఇక్కడ వర్కవుట్ కాదు. ఎందుకంటే ఈ దేశంలో అందవిహీనమైన ముఖం కలవాళ్లే కాదు – చందమామ లాంటి అందమైన ముఖం ఉన్నవాళ్ళం ఉన్నారు” అన్నాను.

“ఉన్నారు – నిజమో – కానీ అందమైన వాళ్ళ ముఖం, వాళ్ళకు కనిపిస్తే అహం వచ్చి చేరి అది నెత్తిమీదికి కూడా ఎక్కుతుంది కదా..! అయినా ఇక్కడి నా పాయింటు, ఇప్పటి ఈ సందర్భం, అందం గురించి కాదు మహాశయా – పెరిగే వయసు గురించి – ఆయనెవరో సినిమాకవి – ‘ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం’ అని రాసినట్టు ఎవరికయినా వయసు పెరుగుతుందే గానీ తరగదు. పెరిగే వయసు ఒక్కొక్కరిలో ఒక్కో రకపు మార్పు తెస్తుంది. మీ ఫ్రెండ్‌కు అదే క్లాస్‌మేట్‌కి బట్టతల వస్తే, మీకు జుట్టు నెరిసిపోయింది. ఆయనకు చెవులు సరిగా వినబడవు – మీకు చత్వారం వల్ల కళ్ళు సరిగా కనబడవు. అందం ముచ్చట పక్కన బెడితే – ముసలితనం మాత్రం అందరికీ వచ్చేదే గనుక ఎవరి ముసలి వయసు వారికి కనబడకుండా బ్రహ్మ భలే పని చేసాడు అంటున్నాను” అంది మా ఆవిడ ధరణి తన తెలివితేటలకు తనే మురిసిపోతూ.

దాంతో నాకు కోపం, ఉక్రోషం పొడుచుకొని వచ్చాయి.

“నాకు తెలియదా ఆ సంగతి? పెద్ద నువ్వే తెలివిగలదాన్నని అనుకోకు. ఇందాక కరెంటు పోయినప్పుడే నువ్వు కొవ్వొత్తి వెలిగించావు చూడూ. అప్పుడే నేనూ ఇలాగే ‘కరిగిపోతున్న కొవ్వొత్తిలా ఎంత చిన్నదో కదా ఈ జీవితం’ అనుకుంటున్నాను” అని అన్నాను గొప్పగా .

“అబ్బో!” అంది ఆమె నవ్వుతూ.

ఆ నవ్వు నన్ను ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపించి “నీకూ జుట్టు నెరుస్తోంది – అద్దంలో చూసుకున్నావా?” అన్నాను టిట్ ఫర్ టాట్‍లా.

“చూడనవసరం లేదు. నాకు వయసు పట్ల, జీవితం పట్ల బోలెడు అవగాహన ఉంది” అంది.

‘మా క్లాస్‌మేట్ కరుణాకర్ కలిసిన సంగతి దీనికి చెప్పి పెద్ద పొరపాటు చేసాను. దీన్ని కదిలిస్తే కంపే’ అని మనసులో అనుకుంటూ అటు తిరిగిపడుకున్నాను. ఇంతలో నా వెనకనుంచి ధరణి చెయ్యి నన్ను చుట్టేసి నా ఎద మీద వాలింది ప్రేమగా నన్ను స్పర్శిస్తూ.

***

ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను. మాది ప్రయివేట్ కంపెనీ గనుక రిటెర్మెంట్ వయసు దాటి ఐదేళ్ళయినా మా కంపెనీ వాళ్లు నన్ను వదిలిపెట్టలేదు. ఇంట్లో కూర్చోని అయినా ఆఫీస్ వర్క్ చేసి పెట్టమంటూ రిక్వెస్ట్ చేసారు. అలాగే అని చేస్తున్నాను గానీ ఈ మధ్య వంట్లో ఓపిక తగ్గి చెయ్యాలని అనిపించటం లేదు.. హాయిగా రెస్ట్ తీసుకుందామని అనిపిస్తోంది.

నేను మధ్య హాల్లో కూర్చుని వుంటే ఇంటి వెనుక నుంచి మా అమ్మ గొంతు వినిపిస్తోంది కొద్దిపాటు వణుకుతో,

అమ్మకు ఎనభై నాలుగేళ్లు ఇప్పుడు.. వృద్ధాప్యం మీద పడ్డా బ్రతుకంటే ఏమిటో – ఎలా బ్రతకాలో తెలిసినావిడ గనుక ఇప్పటికీ మానసికంగా బలంగా, సంతోషంగా ఉంటుంది. ఈ అరవై ఐదేళ్ళకు, నన్ను కాస్తంత వైరాగ్యం, వేదాంతం అలముకున్నాయేమో గానీ ఆమెను మాత్రం కాదు. ముని మనవరాలిని చాపమీద పడుకోబెట్టి దాని మీదికి వంగి దాంతో కబుర్లెవో చెబుతోంది.

ఆ దృశ్యం సందు గుమ్మం గుండా నాకు కనిపించి నన్ను ఆలోచనల్లో పడేసింది.

మా అమ్మాయి రెండో కాన్పుకని పుట్టింటికి అంటే మా దగ్గరికి వచ్చింది. ఫస్ట్ బాబు.. ఇప్పుడి పాప.

మా అమ్మకు 84 ఏళ్ళయితే దానికి 8వారాలు 4 రోజుల వయసు. జీవిత ప్రారంభ దశలో ఉన్న పాపతో- జీవిత అంత్యదశలో ఉన్న మా అమ్మ కబుర్లు చెబుతూ ఆడకుంటోంది –

“బుజ్జి బుజ్జి చేతులు, బుజ్జి బుజ్జి కాళ్లు, లక్కపిడతలాంటి చిన్ని నోరు – చక్రాల్లాంటి గుండ్రటి కళ్ళతో ఎంత ముద్దుగా ఉన్నావే – నేనెవరో తెల్సా – నీ తాతకు అమ్మను అంటే నీకు తాతమ్మను – నీకు నా పేరే పెట్టారు తెల్సా!” అంటోంది అమ్మ. ఆ మాటలు విని నవ్వుకున్నాను నేను.

పాప బాలసార రోజున “దానికి నా పేరే పెట్టాలి.. ఎప్పుడే. నేను పోయాక, పెడితే దాన్ని మీరు నా పేరుతో పిలుస్తుంటే నేను వినలేను కదా – ఇప్పుడయితే చెవులారా విని సంతోషిస్తాను” అని పట్టుపట్టి కూర్చుంది. దాంతో అమ్మ పేరయిన కమలమ్మను కమలినిగా మార్చి తన కూతురుకు పేరు పెట్టుకుంది నా కూతురు. అందుకని పాపను మాటిమాటికి కమలి – కమలీ అని పిలుసూ ఆనందిస్తుంటుంది, గర్వపడుతుంటుంది అమ్మ.

అమ్మ పెద్దగా చదువుకుంది కాకపోయినా – పల్లెటూరిలో పుట్టి పెరిగిన మనిషయినా జీవితం పట్ల ఆమెకు ఎంతటి అవగాహనో. ‘బతికిన నాలుగు రోజులూ’ అన్నది మాటల మధ్యలో అమ్మ నోటంట మాటిమాటికీ దొర్లే ఊతపదం. మా ఇంటి చుట్టుపక్కల వున్న ఆడవాళ్ళందరూ వాళ్ళింట్లో ఏ సమస్య వచ్చినా సలహాకు అమ్మ దగ్గరికే వచ్చేవాళ్లు. వాళ్ళకు అమ్మ సలహాలిచ్చే తీరును నేను చిన్నప్పటినుంచి చూస్తూ ఆ ఇంట పెరిగాను. అత్త స్థానంలో ఉన్నావిడ “కమలమ్మ గారూ” అంటూ వచ్చి “మా కోడలు మహా గండ్రాగొండిదండీ – అస్సలు చెప్పిన మాట వినదు. నా కొడుకును నాకు కాకుండా చేస్తోంది” అని చెపితే “నరసమ్మా – ఎంత కోడలయినా వయసులో నీ కూతురి సమం కదా. నువ్యూ పెద్ద దానివవుతున్నావ్. బతికినన్నాళ్లూ సుఖంగా, సంతోషంగా బతకుండా ఎందుకొచ్చిన గొడవలు చెప్పు? ‘చిన్నవాళ్ళు చిన్నవాళ్ళే’ అనుకొని మన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలిగానీ ఈ గిల్లికజ్జాలు ఎందుకు? ఈ జీవితాలే శాశ్వతం కాదు!” అంటూ సలహా ఇచ్చి తనను శాంతపరిచి పంపిస్తుంది. సాయంత్రం ఆ కోడలు అమ్మ దగ్గరికి వచ్చి “చూడండి కమలమ్మ గారూ – మా అత్త నన్ను ఎన్ని ఆరళ్ళు పెడుతోందో? బానంత నోరు చేసుకొని అరుస్తుంది. పిల్లి మీదో ఎలక మీదో పెట్టి దెప్పుతుంది. కొడుకుకు నా మీద చాడీలు చెప్పి నా మొగుడ్ని నాకు కాకుండా చేస్తుంది” అని చెబితే – “పెద్దమనిషి ఒక మాట అంటే నీకంత ఉక్రోషం ఎందుకీ లచ్చీ – ఇంకా ఎన్నాళ్లు బతుకుతుందని? దెబ్బయ్యేళ్ళు వచ్చిన మనిషి – బతికిన నాలుగు రోజులూ – దాన్ని మనశ్శాంతిగా బతకనివ్వవా – అది ఏమన్నా, వినీ విననట్టు ఊరుకుంటే గొడవుండదుగా. తనను ఎదిరించి, ఒకటంటే నాలుగు తిరిగి అనాలన్న ఆ పట్టుదల నీకెందుకు” అని, వచ్చిన ఆ లచ్చిని ఆలోచిస్తూ తిరిగి వెళ్ళేలా చేసేది.

ఎవ్వరినీ నొప్పించకుండా సమస్యను పరిష్కరించే ఆ తీరు, ఆ రోజుల్లోనే నన్ను అబ్బురపరిచేది. ఇతరులకు చెప్పటమే కాదు ఇతరులకు చెప్పినవి, తను ఆచరించి చూపించేది కూడా.

తన కోడళ్ళను ఎప్పుడూ ఒక్క మాట అని ఎరుగదు అమ్మ. ఒక్కో కోడలు ఒక్కో రకం అయినా “మన చేతి వేళ్ళే సమంగా ఉండవు. మన కడుపున పుట్టిన బిడ్డలే అందరూ ఒక తీరుగా ఉండదు. మనుషులు అన్ని తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు ఉంటారు” అంటూ అందర్ని సమన్వయపరుస్తూ కుటుంబంలో గొడవలు రాకుండా నిర్వహిస్తూ వచ్చేది.

అమ్మ మాట తీరు చూస్తుంటే ‘మాటకు ఎంతటి శక్తి వుంటుందో కదా’ అని అనిపించేది. ఆ రోజుల్లో ముగ్గురు అన్నదమ్ములం కలిసి ఒక చూరు కింద ఉమ్మడికుటుంబంగా ఉన్నప్పుడు అమ్మ ఒంటిచేత్తో అంతమందిని చాకచక్యంగా నిర్వహిస్తూ వచ్చేది. కోడళ్ల మధ్య పొరపొచ్చాలు ఏమైనా వచ్చినప్పుడు “ఇంటికి పెద్దకోడలివి- బాధ్యతలు మోసే వాళ్ళకు పనుల బరువే కాదు, మాటలు బరువూ మోయక తప్పదు కదమ్మా, సహనం వహించు” అని వదినకు; “ఈ వయసుకే ఇంత అసహనం అయితే ఎలా?ఉన్న జీవితం ముందే వుంది. కుటుంబం అన్న తర్వాత ఏవో వస్తుంటాయి. సర్దుకపోవాలి” అని నా భార్యకు, నా తమ్ముడి భార్యకూ చెప్పిది.

యాభై సంవత్సరాల వయసుకే నాన్న పోతే- ఎంతో ధైర్యంగా నిలబడి నాన్న బాధ్యతలను కూడా తనే నిర్వర్తించి పెంచి పెద్ద చేసింది. మమ్మల్ని నాన్న పోయినప్పుడు పలకరించటానికి వచ్చిన వాళ్ళను ఉద్దేశించి – “నూరేళ్లు మనిషి జీవితం అనుకుంటాం. కానీ ఈయన అర్ధాయుష్షుతో పోయారు. ఎలా బతకటం అన్నది మన చేతుల్లో వుంటుందేమో గానీ – ఎంతకాలం బతుకుతాం అన్నది మన చేతుల్లో ఉండదు కదా – బతికింది కొద్ది కాలమైనా రాజాలాంటి బతుకు బతికారు. ‘కాకిలా కలకాలం బతికినదాని కన్నా హంసలా ఆరు నెలలు బతికినా చాలు’ అని అనేవాళ్ళు కదా అనుభవజ్ఞులయిన పెద్దవాళ్ళు. ఊరంతటి చేతా ధర్మరాజు అనిపించుకున్నారు” అని అమ్మ అనటం నాకు ఇప్పటికీ గుర్తుంది.

మాకు చిన్నప్పుడు మహాభారత కథ చెబుతూ అనేది – కౌరవులు నూరుగురు – అంతమంది ఉన్నా ఏం లాభం? అధర్మానికి కొమ్ము కాసారు. పాండవులు ఐదుగురు అయినా ఒక్క చేతివేళ్లలా కలిసి వుండి ధర్మాన్ని ఒక్క తాటి మీద నడిపించారు. సంఖ్య కాదు ముఖ్యం విషయం ప్రధానం – ‘రాశి కాదు వాసి ఉండాలి’ అనేది అమ్మ.

ఊరిపెద్దగా నాన్న అందరికీ తలలో నాల్కలా ఉండేవారు. కష్టంలో ఉన్నవాళ్ళను ఆదుకోవటం, అన్నం లేని వాళ్ళకు అన్నం పెట్టడం ఊరిజనంలో దైవభక్తి పెంపొందేలా ఏవేవో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాటు చేయడం, గుళ్ళల్లో పూజలు, నైవేద్యాలు సరిగ్గా జరిగేలా చూడటం చేసేవాడు. ‘ఆధ్యాత్మిక భావాలు కలవాడెప్పుడూ తెలిసి తెలిసి తప్పుచేయడు – ఆ జ్ఞానం లేకనే దేశంలో ఇన్ని అరాచకాలు’ అని బాగా నమ్మేవారు ఆయన.

‘అంతగా దేవుడంటే ఇష్టపడేవాడు గనుకనే దేవుడికి ఆయనంటే ఇష్టమై అంత త్వరగా తీసుకెళ్ళాడు’ అని ఊరి జనం అనుకునే వాళ్ళు. కారణం ఏదయితేనేం ఆయుప్రమాణం మనిషి చేతిలో ఉండదని నాన్న మరణంతో అర్థమయింది మాకు.

నాన్నలా ఎంతమందో అల్పాయుష్కులు ఈ లోకంలో. ‘అసలే చిన్నదనుకున్న జీవితం మరింత చిన్నదై పోతుంది ఈ ఆకాల మరణాలతో, అనిపించింది నాన్న మరణం చూసాక’. అని ఆలోచిస్తున్న నాకు ధరణి కనిపించటంతో నా దృష్టి అటు మళ్ళింది. మా అమ్మాయి పురిటికి వచ్చినప్పటి నుంచీ మా ఆవిడ చాలా బిజీ అయిపోయి నాతో మాటలు, వాదనలు తగ్గించేసింది. అటు బాలింతను, ఇటు చంటిపిల్లను కాక, ఎడ పిల్లాడ్ని, పెద్దదయిన అమ్మను, మొగుడ్నయిన నన్ను ఇంతమందిని చూసుకోవలసి రావటంతో అస్తమానం పనే సరిపోతుంది తనకు, ఇప్పుడు కూడా మనవడికి అన్నం అనిపించడం కోసం వాడితో ఇల్లంతా పరుగులు పెడుతూ, కనిపించింది. అయినా ధరణి ప్రత్యేకంగా నా దగ్గర కూర్చొని ముచ్చట్లు చెపుతూ ఉపదేశాలు చేయకపోయినా పరోక్షంగా తన మాటలతో చర్యలతో జీవిత తత్వాన్ని బోధిస్తూనే వుంది ఎప్పటికప్పుడు.

***

ఆ రోజు మా ఇంటి ప్రాంగణంలో అటూ ఇటూ పరుగులు పెడుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు మా మనవడు బంటీ. ఉన్నట్టుండి కాలు జారి కిందపడి మోకాలి చిప్ప పగలగొట్టుకొని ఏడుపు లంకించుకున్నాడు. అక్కడే బట్టలారేస్తున్న ధరణి పరుగున వచ్చి వాడ్ని లేపింది. కాళ్ళకు, చేతులకు అంటిన మట్టి దులిపి నల్లా తిప్పి వాడి కాళ్లూ చేతులూ కడిగి “ఏడవకు – చిన్నదెబ్బేలే, ఆటలన్నాక ఇక దెబ్బలు తగలవా?” అంది.

ఆ మాటల్లో నుంచి నాకొక జీవనతత్వం బోధపడింది.

“అవును – ఆటలన్న తర్వాత దెబ్బలు తగులుతాయి. జీవితం కూడా ఒక ఆటే గనుక అక్కడా కిందా మీదా పడక తప్పదు – దెబ్బలూ తగలక తప్పవు. పడిలేచి వంటికి అంటుకున్న దుమ్మును దులుపుకొని మళ్లీ ఆటను కొనసాగించినట్టు – జీవితం అనే ఆటలో కూడా మనసుకు తగిలిన దెబ్బలను కడుక్కొని – అంటిన దుఃఖం, నిరాశా, నిస్పృహ, వైరాగ్యం అనే దుమ్మును దులుపుకొని మళ్లీ జీవితమనే ఆటను కొనసాగించక తప్పదు! అందుకే చెబుతారు. సైకియాట్రిస్టులు life ని sportive గా తీసుకోమని. ‘ఏం జరిగినా అందులో నుంచీ పాజిటివ్ దృక్పథం తోనే చూసి మన మంచికే అనుకోవాలి గానీ నెగటివ్ థింకింగ్‌తో స్ట్రెస్ పెంచుకోవద్దు’ అని. పరీక్షలో ఫెయిల్ అయితే ఫెయిల్యూర్స్ నుంచే విజయానికి మెట్లు నిర్మించుకోవాలని – జీవితంలో ఓడిపోతే ఆ అనుభవాల నుంచే జీవిత పాఠాలు నేర్చుకోవాలన ఇలా! అంతేగా మరి, అలా ఉండకుంటే ఎంత చిన్నదయినా ‘ఈ బతుకు బతకలేం’ అనుకున్నాను నేను, తీగ పట్టుకొని డొంకంతా కదిలేలా లాగినట్టు మా ఆవిడ అన్న ఆ ఒక్కమాటను పట్టుకొని, జీవితం ఆలోచనల డొంకనంతా లాగుతూ.

***

ఆ రోజు కలిసిన మా క్లాస్‍మేట్ కరుణాకర్ కాల్ చేసాడు అనుకోకుండా. ఇద్దరం పరస్పరం ఫోన్ నెంబర్ తీసుకున్నాంగానీ అంత త్వరగా ఫోన్ చేస్తాడని అనుకోలేదు.

“ఏం చేస్తున్నావ్ మిత్రమా?” అన్నాడు.

“ఏం లేదు. ఖాళీనే. గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నాను” అన్నాను ఏదో తమాషాగా మాట్లాడుతున్నానని అనుకుంటూ.

కరుణాకర్ నవ్విన శబ్దం.

“నువ్వేం చేస్తున్నావ్ – ఎలా వుంది రిటైర్డ్ లైఫ్” అని అడిగాను నేను.

“చాలా బాగుంది అప్పుడు చేయటానికి వీలు కుదరని కొన్ని ముఖ్యమైన పనులను మా ఆవిడ ప్రభావంతో ఇప్పుటి చేయగలుగుతున్నాను.”

“ఏంటో ఆ పనులు?”

“శేఖరం, వేదాంత పండితుల లెక్క ప్రకారం ఈ జీవితం బుద్బుదప్రాయం. అంటే నీటి బుడగలాంటిది.. రెప్పపాటు అంత క్షణికమైనది కదా. అలాంటి జీవితాన్ని ఆలస్యం చేయకుండా కొంతైనా సార్థకం చేసుకోవాలని మా ఆవిడ ఎప్పుడూ అంటూ వుంటుంది. మనం కారణజన్ములు, అవతార పురుషులు అంత గొప్పవాళ్ళం కాకపోయినా మన స్థాయిలో మనం నలుగురికి మన అవసరం ఉన్నవాళ్ళకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నాం. పొద్దున్నే మా ఇంటి పక్కనే ఉన్న గుడికి వెళ్ళి ఈ ప్రపంచాన్నంతా చల్లగా కాపాడమని చేతులు జోడించి ఆ దేవుడికి దండం పెట్టుకుంటాం. సాయంత్రాలు మా ఇంటి చుట్టుపట్టుల వున్న బీదపిల్లలకు చదువు చెబుతాను నేను. మా ఆవిడ వాళ్ళకు తినటానికి ఏమన్నా పెట్టడం, పండగలకు కొత్తబట్టలు కొనివ్వడం, పుస్తకాలు కొనివ్వడం చేస్తుంది. నెలకొకసారి వృద్ధాశ్రమానికో, అనాథాశ్రమానికో వెళ్ళి మా శక్తి కొలది విరాళాలివ్వడం – అక్కడ వుంటున్న వాళ్ళకు పండ్లు, చీరలు, పంచలు తీసుకెళ్లడం చేస్తాం. మా ఆవిడ అలా అలా నడుచుకుంటూ వీధిలోకి వెళ్ళి ఫుట్‌పాత్ మీద కూర్చుని వుండే బిచ్చగాళ్ళకు ఎండాకాలమైతే గొడుగులు, చల్లటి నీళ్లు ఇవ్వడం; చలికాలమైతే దుప్పట్లు ఇవ్వటం చేస్తుంటుంది. అందులో తనకెంతో తృప్తి ఆనందం దొరుకుతాయని చెబుతుంది. నిజానికి నాకు కూడా అంతే ఫ్రెండ్ – చేసేవి ఉడతలా చిన్న చిన్న సహాయమే అయినా అందులో ఎంత ఆనందం ఉంటుందో. పుచ్చుకోవటంలో కన్నా ఇచ్చుటలో ఎంత హాయి, తృప్తి వుంటాయో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది శేఖరం” అన్నాడు కరుణాకర్. అంతవరకూ చెవుల్లో నాగస్వరం వినిపిస్తున్నట్టు వింటుండిపోయిన నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు ప్రత్యక్షానికి తిరిగివచ్చాను.

“వెరీగుడ్ కరుణాకర్ – వింటుంటేనే ఎంతో బాగుంది. ఇక ఆ పనులన్నీ చేస్తున్న మీకు ఎలా ఉండాలి. నీ మాటల్ని ఇంకా ఇంకా ఈ సారి ఫేస్ టు ఫేస్ వినాలని వుంది. కలుద్దాం ఫ్రెండ్” అంటా ఫ్రెండ్‌కు బై చెప్పి కాల్ ఆఫ్ చేసాను.

“ఎవరు? మీ ఫ్రెండ్ కరుణాకర్ గారా?” అంటూ వచ్చింది ధరణి.

ఆశ్చర్యపోయాను నేను, ‘అవతలి గొంతు వినకపోయినా తనకు ఎలా తెలిసింది’ అని.

“అందంగా జీవించటం ఒక కళ. ఆ కళ తెలిస్తే చిన్నదైన జీవితంలో కూడా చిరంజీవిగా నిలిచిపోవచ్చు సాటి మనుషల జీవితాల్లో, గుండెల్లో మమైకమై!” అంది ధరణి, తలా తోకా లేనట్టున్న ఆ మాటల్లో జీవనసారాన్ని కాచి వడపోస్తూ.

ఆశ్చర్యం మరింత పెరిగిపోయింది నాలో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here