ఏనుగుల బాధ తప్పించుకున్న కుందేళ్ళు

0
5

[box type=’note’ fontsize=’16’] బాల బాలికల కోసం పంచతంత్రం నుంచి ఈ చిన్ని కథని అందిస్తున్నాము. [/box]

[dropcap]ఒ[/dropcap]క అడవిలో ఒక పెద్ద చెరువు వుండేది. ఆ సరస్సు ఒడ్డున బొరియలలో ఎన్నో కుందేళ్ళు నివసిస్తున్నాయి. ఒకరోజు అక్కడకు దూరంగా ఉన్న మరొక అడవి నుండి ‘చతుర్దంతం’ అనే ఏనుగుల రాజు తన అనుచరుల గుంపుతో వచ్చి ఆ సరోవరంలో చొరబడింది. విచ్చలవిడిగా పరుగెత్తుకు వచ్చి జలాశయాన్ని ప్రవేశించిన ఏనుగుల గుంపు కాళ్ళ కింద ఎన్నో కుందేళ్ళు నలిగి మరణించాయి. మరెన్నో గాయపడ్డాయి. చావగా మిగిలిన కుందేళ్ళన్నీ ఒకచోట చేరి, ‘ఇంక ఈ ఏనుగులు దాహం వేసినప్పుడల్లా ఇక్కడకు వస్తూ మనకు ప్రమాదం కలిగిస్తూనే ఉంటాయి. వీటి బాధ తప్పించుకుని మన ప్రాణాలు కాపాడుకోడం ఎలాగా?’ అని ఆలోచించాయి. వాటిలో ‘విజయ’ అనే ముసలి కుందేలు, “నేను ఆ ఏనుగుల రాజు దగ్గరకు వెళ్ళి మన ప్రభువైన చంద్రుని పేరు చెప్పి బెదరగొట్టి కార్యం సాధించుకొస్తాను” అని బయల్దేరింది.

ఆ పౌర్ణమి నాటి రాత్రి ‘చతుర్దంతం’ తక్కిన ఏనుగులతో వస్తున్న అలికిడి వినపడడంతోనే ఆ ముసలి కుందేలు సరోవరం వెనుకనున్న కొండ పైకెక్కి నిలిచి, “గజరాజా, క్షేమమా?” అని మర్యాదగా కుశల ప్రశ్న వేసింది. చతుర్ధంతానికి దూరాన కొండ పైన చిన్న నలుసు లాగ ఉన్న కుందేలును గుర్తించడమే కష్టమైంది మొదట. ఆ గజరాజు తొండం ఎత్తి అటు వైపు చూస్తు “ఎవరు నీవు?” అని అడిగింది.

“నేను చంద్రదేవుని దూతను. శాంతిమూర్తి యైన ఆ మహాత్ముడికే నీవు కోపం తెప్పించావు! ఆయన తన మాటలుగా మీతో చెప్పమని ఆజ్ఞాపించి పంపగా, చంద్ర మండలం నుండి వచ్చాను” అంది విజయ. చతుర్దంతం భయంతో, “మీ దేవునికి ఆగ్రహమా? నేనేమి అపరాధం చేశాను?” అంది.

విజయ, “మా దేవుడు నీతో చెప్పమన్న సందేశం విను. ఇది నా సరోవరం. ఇందు మీరు చోరబడి అపవిత్రం చేశారు. అంతే కాదు. శశిధరుడనైన నాకు కుందేళ్ళంటే ఎంతో అభిమానము. నా ప్రేమకూ, రక్షణకూ పాత్రులైన ఈ సాధు జంతువుల నెన్నిటినో మీ పాదాల కింద తొక్కి చంపి, మరెన్నిటినో గాయపరిచీ మీరు మహాపరాధం చేశారు! మీరంతా తక్షణం ఈ అడవి విడిచి వెళ్ళకపోతే నా చల్లని కిరణాలను అగ్నిజ్వాలలుగా మార్చేసి, మీ చర్మాలపై బొబ్బలు లేవదిస్తాను! అవి పుండ్లుగా మారి చీము నెత్తురులు కారుతూ మీరు సంఘ మరణానికి గురి అవుతారు!” తొణుకూ బెణుకూ లేకుండా ధైర్యంగా దూతగా నటిస్తూ విజయ అన్న మాటలు వినడంతోనే చతుర్ధంతం హడలిపోయింది.

ఆకాశంలో బంగారు రంగులో మెరిసిపోతున్న పున్నమి చంద్రుని ప్రతిబింబం చెరువులో కదులుతూ కనపడింది. ముసలి కుందేలు ఆ గజరాజుకు ఆ ప్రతిబింబాన్ని చూపుతూ, “మా శశిధరుడు కోపంతో ఎలా కంపించిపోతున్నాడో చూడు. ఆయనను మన్నింపు కోరుకుని శాంతపరచు” అంది.

ఏనుగుల రాజు ఆ ప్రతిరూపం ముందు సాగిల మొక్కి, “ప్రభూ! నన్ను క్షమించు. నా పరివారంతో ఇప్పుడే నేనీ అడవిని వదలి పోతాను. ఇక ఎన్నడూ ఇటు వైపు రాను!” అని చెప్పి, అనుచరులతో వెనుకకు తిరిగి అత్యంత వేగంగా వెడలిపోయింది. విజయ విజయగర్వంతో కొండ దిగివచ్చి తోటి కుందేళ్ళ అభినందనలను స్వీకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here