ఎప్పటాటే

0
5

[dropcap]సం[/dropcap]క్రాంతి వెళ్ళిపోయింది. శివరాత్రి దాకా ఉన్న చలి శివ శివా అంటూ వెళ్ళిపోతుందంటారు మన పెద్దవాళ్ళు. సంక్రాంతి పండగ దాకా ఇళ్ళ ముందు రథాల ముగ్గులాంటి పెద్ద ముగ్గులు వేసి, వేసి నడుములలో పట్టు సడలాయే ఏమో, ప్రస్తుతం మాత్రం రోజు వారి వేసే రెండు ముగ్గుకర్రలకే పాపం అదోలా అయిపోతునారు.

ఎదురింటి కామాక్షమ్మగారు అప్పుడే నిద్ర లేచినట్టుంది. లేచి ఆవులిస్తూ, కళ్ళు నులుముకుంటూ మంచం దిగి నెమ్మదిగా నడుస్తూ వచ్చి బయట తలుపు తీసింది. పనమ్మాయి వచ్చినట్టుంది. వాకిలి ఊడ్చి, కళ్ళాపి చల్లినట్టు కనపడి ఉంది. తడి కూడా ఇంకా ఆరిపోలే. ‘కళ్ళాపి చల్లిన మనిషి ముగ్గుబుట్ట గూట్లోనే ఉంది కదా. రెండు ముగ్గు కర్రలు కూడా వేసి పోతే దాని సొమ్మేం పోయింది’ అనుకుంటూ బయటకి చూసింది. ఎదురింటి సీతమ్మ తమ వాకిలి ముందు ముగ్గేసి లోనకెళూతూ అప్పుడే బయటికొస్తున్న కామాక్షమ్మను చూసి “వదినా, ఇప్పుడే లేచావా” అని, “ఆ మరిచాను మీ ఆయన ఈ మధ్య బయట కన్పించటం లేదు ఊరిళ్ళోనే ఉన్నాడా లేక క్యాంపుకెళ్ళాడా” అని అడిగింది ఆగి.

“ఆ ఆ ఉన్నాడు. రాత్రి రెండు గంటలైంది. క్యాంపు నుంటి ఊడిపడ్డాడు. ఏం ఉద్యోగాలో ఏమో. మనకు వారు ఇంటి గడప దాటడం మాత్రమే తెలుసు కానీ రావటం తెలియదు కదా. క్యాంపని వెళ్తే రెండు రోజులన్నది నాలుగు రోజులు కావచ్చు. నాలుగు రోజులన్నది మరుసటి మధ్యాహ్నానికే ఇంటి దోవపడతారు. అయినా వీళ్ళు పెందలకడనే ఊళ్ళోకి వచ్చినా చక్కగా ఇంటికొస్తారనేదేముంది. క్యాంపుకు వెళ్ళిన నలుగురూ ఇక్కడ బస్సు దిగుతారు కదా. వారు ముచ్చట్లాడుతూ నడుస్తుంటే ఏదో ఒక బార్ కన్పిస్తుంది. ఆ ఇప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తాము, కాసేపు ఇక్కడే కూర్చుంటే పోలే అనుకుంటారు. అనుకొని సిగెరట్లు కొని అటు ఇటు కలమెలగుకొని చివరకు బార్‌లో దూరతారు. ఇక మనకక్కడ వారి చాతాళం తెలియదు కదా. జేబులో పైసలయిపోయి పెందలకడనే తెమిలితే, కాస్త సోయితో వచ్చి నేరుగా తలుపు తడతారు. అలా కాని రోజు ఇంటి ముందు దింపిన ఆటోవాలాయే బెల్ నొక్కి సార్‌ని గడపదాటించి వెళతాడు” అనగానే సీతమ్మ ఎదురగా వచ్చి నిలుచుని “అసలు మన ఆడ పుట్టుకలే దరిత్రపు పుట్టుకలు. చాటు చాటుగా ఏమనుకొని ఏం లాభం. మనల్నిలా భూమిపై వేసిన ఆ దేవుడిని అనాలి. అసలు నాకు తెలియక అడుగుతాను. మనము వాళ్ళకు వాళ్ళకు మనము నచ్చాక పెళ్ళి తంతు పేరున వాళ్ళని సంతలో సరుకులు కొన్నట్టు కొని ఈ నరకం అనుభవించడం ఎంత వెదవాయిత్వమో అర్థం కావడం లేదు అని సాగదీసి అయినా తలరాత నెవరు తప్పిస్తార్లే” అని, “రామరామ ఇదేం పాడు కాలం. కట్నాలు పోయడం కన్నా అదనపు చిల్లర కోరికలూ తీరుతాయి. ప్రతీ పండగ పబ్బానికీ ముడుపులు అవి అందకపోతే బెదిరింపులు, సాధింపులు. అసలిదంతా ఏమిటి? నాకైతే ఒంటరిగా కూర్చొన్నప్పుడు అసలిది బ్రతకేనా అనిపిస్తుంది” అనగానే కామాక్షమ్మ మరీ దగ్గర కొచ్చి, “ఇట్టా రా చెప్పకోడని విషయమే కాని నువ్వు కాబట్టి చెబుతున్నా” అని చెవిదాకా వచ్చి “మా ఆయన నిర్వకం తెలుసా? వాళ్ళ ఆఫీసులో స్వీపర్‌గా పని చేసే ఓ పోరి ఒకటుందట. అదేమో ఈ కాలానికి తగ్గట్టు మొగుణ్ణి మొగసాలకు వదిలేసి నిఖార్సుగా నౌకరీ చేసుకుంటుందట. ఒంటరిది. తాలుగ రెబ్బలా ఉంది వయస్సునుందట పైగా ఎర్రతోలు. నాకు ఈయనొక సారి దానితో బజార్లో కన్పించాడు. ఇద్దరూ సరసరే నడుస్తున్నా రాసుకొని, పూసుకొని ముచ్చట్లాడుతున్నట్టు మాత్రం అన్పించలే. అదే గాక మా ఆయనో ప్రవారాఖ్యుడనుకొంటారు కదా. అనుమానించడం కుదర్లే. ప్రక్క చూపులు అలవాటున్నవాడిలా అప్పటి వరకో నాకు తెలిసి చావలే. మొన్నీ మధ్యన సిద్ధయ్య అనీ వాళ్ళ ఆఫీసున పని చేసే అటెండర్ కన్పించాడు. అదీ కూరగాయలు కొనే దగ్గర గుత్తి వంకాయలు ఏరుతుండగా అప్పుడు మాటల్లో ఆ పోరి సంగతొచ్చింది. మీ ఆఫీసున అది చేస్తున్న పనేమిటి అని అడిగా ఊరుకోలేక.

సిద్ధయ్య నన్ను అదోలా, దాని సంగతి నీకెందుకన్నట్టు చూసి “దాని విషయం నన్నడక్కమమ్మా. అది చేస్తున్న ఉద్యోగం ఏం ఖర్మ దానికంతా ఆదాయమే. ఉద్యోగస్తులందరితో కలుపుగోలుగా ఉంటుంది. పైగా మంచి మాటకారి. కాస్తో కూస్తో చదువుంది” అని ఆగడంతో… “ఏదో చెప్పదలిచి ఆలోచిస్తున్నవేంది?” అని నిగ్గదీసా పరిచయం కొద్దీ.

సిద్ధయ్య అదోలా నవ్వి “ఎవడు జేబులో పైసలుంచుకొని రహస్యంగా మందలించగలిగితే బోలేడు సిగ్గుపడిపోయి మెలికలు తిరిగిపోతూ కొంత దూరం నడిచి దాని గది అడ్రస్ పూర్తిగా చెబుతాది. దినానికి వెయ్యి రూపాయలు తీసుకుంటుందట (నాకేం తెలుసు గాని అంటున్నారు) శివ శివా. ఈ పెండ్లాళున్న వారికి ఎట్టా బుద్దండది కాని అది అడిగినంత ఇచ్చి ఇంకా సంతృప్తి పడ్డ మా రాజు అదనంగా ఇచ్చి చడీచప్పుడు కాకుండా వెళుతూనే ఉన్నారు. పొద్దుట అంతా బుద్ధిమంతులే. ఎవ్వరినీ తప్పుపట్టలేం. తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కాబట్టి” అని ఆగి, “వీళ్ళదేముంది కానీ పొయిన్నెల మా మేనేజర్ గారు (నలుగరు పిల్లల తండ్రి) పట్నాన పై ఆఫీసులో పనుండి పోయాడు. ఎవరికో ఆపద వచ్చిందని ఆ మర్నాడు ఇదీ సెలవు పెట్టింది. నాలుగు రోజుల తరవాత మాత్రం పట్నం నుంచి వీళ్ళిద్దరూ ఏకంగా టాక్సీలో దిగారు. అంతే మొదట దానిని దాని గది తాన దింపి ఆ తర్వాతనే ఇంటికొచ్చాడట. ఇది మా గౌరన్న దృష్టిన పడబట్టి తెలిసింది. తెలిసినా చేసేదేముంది. ఎవర్నీ ఏమీ అనడం కుదరదు. ఆయన మా అందరికీ అధికారి కదా. గప్‌చుప్ సాంబార్ బుడ్డి” అని నోరు మూసుకొని, “అమ్మగారు ఈ మాట నేనన్నట్టు ఏడా అనకండి. నా నౌకరీ పోద్ది. అయినా మనకెందుకు గానీ ఓ మాట చెబుతా డబ్బులు పెట్టి మొగుణ్ణి కొనుక్కొనేది ఈ లోకాన ఇక్కడి ఇల్లాలు మాత్రమే. కాని అమ్మా డబ్బు తీసుకొని చిలకా గోరింకల్లాగా కులుకేది మాత్రం ఇల్లాలి కంటే నచ్చిన దానితో. అట్టాంటి మనుషులు ఏడ చూసినా కన్పడుతున్న కాలం” అని నవ్వుతూ దండమెట్టి వెళ్లిపోయాడు.

ఇది కామాక్షమ్మ ద్వారా సవిస్తారంగా తెల్సుకున్నాక అనుమాన బీజం సీతమ్మ తలలో చేరింది. అది మొదలు గమనించసాగింది. ఒక్కోనాడు మంచమెక్కి తన కోసం ఆరాటంగా చూసేవాడు పూర్తిగా తోటకూరలా వాడిపడి ఉండటం తన పట్ల అనాసక్తంగా అన్పించడం, మామూలుగా ఉండే పద్దతిన ఉండలేకపోవడం ఆ రోజలెలా ఉండేవి… పొద్దెక్కిందాకా పక్కదిగనిచ్చేవాడు కాదు. నాకే విసుగనిపించేది ఒక్కోనాడు. ఇంట్లో కెళ్ళి పనికి వంగబోతే ఒళ్ళంతా సన్నటి తీపు. నఖ క్షతాలు తగిలిన చోట చిమ చిమ అని తనలో తానే సిగ్గు పడేది నిస్సిగ్గుగ.

రాన్రాను అనుమానం మరీ ఎక్కవయింది. ఓ రోజు మరీ నిగ్గదీసింది కూడా. కస్సుమని లేచి “ఒంట్లో బాగుండలేదని చెబితే మనిషివి కాదూ?” అని మరో మంచం మీదకి చేరాడు, ‘మళ్ళీ నా మంచం వైపు గనక వచ్చేవు’ అన్నట్టు మొహం పెట్టి. గమనించగా గమనించగా దీనర్థం సీతకు రెండు మాసాల అనంతరం తెల్సింది. అవ్వ! ఎంత సిగ్గు చేటు పని. “అదీ ఎవరో తెలియని వారితో కాదు మా పక్కింటి పని పిల్లతో. ఇప్పుడది ఎక్కడ ఎదురుపడినా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. తాళికట్టి సంసారం చేస్తూ సరసన ఉన్నాక ఇలా ఎలా ఉండగలుగుతారు?” అని లబలబలాడుతూ కామాక్షమ్మకు చెప్పుకొంది. దీన్ని ఆసాంతం విని “ఈ మొగాళ్ళంతేనే, మనం ఎంత అఘోరిస్తున్నా, ఎంత క్షోభపడుతున్నా మన బ్రతుకులలో మార్పు కన్పించట్లేదు. అయినా పైకి మనవి సజావుగా సాగుతున్న సంసారాలే. వాస్తవానికి మనం మంచి భార్యలమే. పైన పటారం లోన లొటారం అంటారే అలా. అయినా మనం పెదవి విప్పితే ఏదైనా పృధ్వి దాటుతుంది కదా. అప్పుడూ నాలుగు నోళ్ళలో పల్చబడేదీ మనమే కదా. పైగా మగడిని తన వాడిగా నిలుపుకోలేని ఆడ పుట్టుకా పుట్టకేనా అని తోటి ఆడంగుల మాటలు వినలేక చావాలి. అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు ముసుగేసుకుని ఏడ్చినట్టు” అని కళ్ళు తుడుచుకుంది కామాక్షమ్మ.

“ఇంకో మాట” అంది సీత.

ఆసక్తిగా చెవులిటు పడేసింది కామాక్షమ్మ. అప్పటికామె ఇంకా మొహమే కడగలేదు, ఈ ముచ్చట్లలో మునిగి ఉన్నది.

“అదేనే మన గౌరి అక్క రాంబాయి లేదూ?”

“ఉంది.”

“అది మూడేళ్ళ నుంచి తిరుగుబోతు మగడితో వేగి వేగి వేగలేక చూసి చూసి ఓ రోజు ఎదురుపడి నిలదీసిందట. అయినా వాడు పెడచెవిన పెడితే అడ్డు తిరిగిందట. దానికి వాడు ఎగిరిపడి “నీదేంది. నా ఇష్టం. దాన్నసలు ఇంటికే పట్టుకొస్త అని చేయి చేసుకొని మరీ పోయాడు.”

‘అదెట్లా, ఇదేం ఘోరకలి’ అని గుండె రాయి చేసుకొని ‘నీ సంగతి చూస్తాలే’ అనుకొందట మనసులో.

“అదే చెబుతున్నా ఈ మధ్య తూరుపు బజారు సోమయాజులు గారు లేరూ. ఆయన గారితో పబ్లిగ్గా తిరగటం మొదలెట్టిందిట ఎంత రచ్చయినా ఫర్లేదన్నట్టు. పైగా వాళ్ళ వీళ్ళతో ఆ సద్బ్రాహ్మడితో సంతానం కూడా కంటానందిట! దాని సిగ్గు చితక.

ఇది తెలిసి వాడు (మగడు) నోరు చేసుకోబోతే ‘చాల్లేరా మగడా ఆగు. నువ్వా ముండని ఇంటికే తెచ్చుకొంటానంటివి కదా. పైగ నా మెడబెట్టి తోస్తివి గద. నీలాగా నేనూ మనిషిని కానా. నాదీ ఉప్పు పలుసు తింటున్న శరీరమే. నాకూ కోరికలుంటాయి. అంచేత నేనూ తిరుగుతా. నువ్వు నీ దిక్కున్న చోట చెప్పకో’ అందట తెగబడి.

వాడు అవాక్కయి ‘అయితే ఇక నువ్వు నా కొద్దు. మన సంసారం సాగదు’ అన్నాడట పట్టరాని కోపంతో శివాలెత్తుతూ.

‘అరేయ్ నువ్వు కావాలని అసలెవరేడుస్తున్నాడురా, నువ్వేపో. పోయేప్పుడు నా అమ్మోరు ఇచ్చినవి అణాపైసలతో చెతిలో పడేయ్. ఉన్న ఇంటిన కూడ నాకు సగముంది. నువ్వప్పనంగా నాతో ఉన్నదే లెక్కగడితే ఇల్లంతా నాదే. మొదట ఈ లెక్క తేల్చు’ అనేసరికి మగదాష్టీకంతో చేయేత్తి మీదికొచ్చాడట. అదేమో తెడ్డు తీసుకొని ఎదురు వచ్చిందట, అంతే.

‘లం…, లం…’ అనుకొంటూ తల బాదుకొంటూ వెళ్ళిపోయాడట.

‘నేను లం…నయితే నువ్వేవరివిరా? నిన్నేమనాలి?’ అని ఊరుకొన్క ఆ ఉసిన పెద్ద మనుషుల దగ్గరికెళ్ళి పంచాయితీ పెట్టిందట. ఓ తేదీ పెట్టి పెద్ద మనుషులు ఇద్దరినీ పిలిచారు. కానీ వాడు రాలేదు. పైగా వాడీ ఊరొదిలి వెళ్ళిపోయి పది దినాలైందన్నారు. దాంతో పెద్ద మనుషులు ‘రాంబాయీ నువ్వెళ్ళి నీ ఇంట్లో ఉండు. వాడొస్తే లోనకు రానీయకు. తీరైన తర్వాతనే ఏదైనా అని చెప్పు’ అని చెప్పి పంపారట.

ఈ ముచ్చటంతా విన్న కామాక్షమ్మ “అట్టా జరిగితే కానీ వీళ్ళు తోవకు రారాంటా” అని సంతోషం వ్యక్తం చేసింది.

“అది నిజమేనే మరి మనం అలా చేయగలమా? మన నుంచి అవుతాదా? అని సీత అంటుడగా.

“కామాక్షీ, కాఫీ. పొద్దుటే ఏం పెత్తనాలు? మొగుడొకడున్నాడు. వాడికి కాఫీ కలుపుదామ్మన్న ధ్యాస కూడా లేకుండా…” అన్న గాండ్రింపు ఇంట్లోంచి.

ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.

“వస్తానే సీతా” అంటూ అరక్షణం ఆగక లోపలికి పరుగెత్తింది కామాక్షమ్మ.

సీత మాత్రం రెండు నిమిషాలు నిలబడి ‘ఖర్మ ఖర్మ’ అని సణుక్కొంటూ లోనకి నడిచింది.

గడప దాటుతుండగా ‘హై హై ఉస్కో ఉస్కో’ అంటూ ఐదారుగురు పదేళ్ళలోపు పోరళ్ళు చిన్న చిన్న రాళ్లు పెడ్డలు విసురుతూ దోవన కనిపించారు. ఆగి వెనక్కి తిరిగి నిగిడి చూసింది. కుక్కలు లంకె వేసుకుని కుయ్ కుయ్మంటు గుంజుకొంటున్నాయి. వాటిని పొరళ్ళు తరుముతున్నారు. కేకేసింది – “ఏం చేస్తున్నార్రా. వాటికి పెళ్ళలెందుకు వేస్తున్నట్టు? పొండి” అని గదిమింది. ఇది వారి ఆటకు అడ్డుమైనట్టుగా గుర్రుగా చూస్తూ వెళ్ళిపోయారు.

లోనకెళ్ళి కూర్చుంటే ఈ మధ్యన పిల్లులు ఉసి మీద ఇల్లు పీకి పందిరేసినంత ఇదిగా కలవడం గుర్తులోకొచ్చి నవ్వుకొంది. కలహనంతర సంగమం.

ఈ భిన్నత్వంలోనే జీవజాలానికి ఆనందం దొరుకుతుందేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here