ఏరు లేని వారికి పేరు లేదు

0
12

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

చిట్టినాయుడు సూకూరు ముఠాదారు. ఆంగ్లేయుల పాలనలో గిరిజన ప్రాంతాలలో ముఠాదారులదే రాజ్యం. ముప్పై, నలభై గ్రామాలకు ఒక ముఠాదారుడు ఉండేవాడు. ఆ గ్రామ ప్రజల తగాయిదాలు తీర్చేవాడు. అతని తీర్పు ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిందే.

చిట్టినాయుడుకు వందెకరాల భూమి వుంది. ధాన్యం, చోళ్లు, కందులు, పెసలు, మినుములు, వలుసులు పండిస్తాడు. ఏటా వర్షాకాలంలో వరి పండిస్తాడు. తన పొలం దమ్ముపట్టుటకు అతను రైతులను తమ ఏరులు (దుక్కి పశువులు) పంపమని తన ఆధీనంలోని గ్రామాల రైతులకు తన పనివారితో కబురు పంపుతాడు. వెంటనే వారంతా చిట్టినాయుడు పొలం దమ్ము పట్టి వరి ఆకు ఊడ్పులకు తమ ఏరులతో సూకూరు వెళతారు. వారందరికీ భోజనం పెట్టి, కూలి డబ్బులిచ్చి పంపుతాడు. చిట్టినాయుడు పొలం దమ్ము అయ్యాక ఇతర రైతుల పొలం దమ్ములు పడతారు.

గిరిజనులు తమ పొలాలను దున్నుటకు ఆవులు కూడా ఉపయోగిస్తారు. నాగలికి ఒక ప్రక్క ఎద్దు, వేరొక పక్కనే ఆవు కట్టి పొలం దున్నుతారు. పొలంలేని గిరిజనులు ఆవులు, ఎద్దులు, కోడె దూడలు పెంచుతారు. వారు పేడను, తిని వదిలిపెట్టిన గడ్డిని చెత్త గోతులలో వేసి సేంద్రీయ ఎరువు తయారుచేస్తారు.

ఒకరోజు చిట్టినాయుడు పంపించన కబురు అందుకుని రైతు తమ ఏరులతో తరలివెళ్లారు. నాలుగు రోజులు దమ్ముపని పూర్తయ్యాక చేతులు, కాళ్లు కడుక్కుని తమ ఏరులను ఒక దగ్గర నిలిపివుంచుతారు. ఎవరెవరకు ఏరులు తీసుకొని వచ్చారో వారి పేర్లు ఒక పుస్తకంలో రాసుకుని వారికి కూలి డబ్బులు ఇచ్చి పంపుతారు. అలా అందరు రైతులు వెళ్లిపోయారు. ఒక గిరిజనుడు నాగన్న మిగిలిపోయాడు. “ఏమిరా నాగన్నా! నీ పేరెందుకు పిలవలేదు? అని ఒకాయన అడిగాడు. నాకు ఏరు లేదు. అందుచేత నా పేరు పిలవలేదు” అన్నాడు. “అలాగా! నువ్వుకూడా ఒక ఏరును ఏర్పాటు చేసుకో. ఆ ఏరువల్ల నీకు పేరువస్తుంది. ఏరు లేని వారికి పేరు లేదు” అన్నాడు. నాగన్న తనకు సొంతంగా ఒక ఏరు ఏర్పాటు చేసుకున్నాడు. తనకు పేరుందని మురిసిపోయాడు నాగన్న.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here