క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా – అరుణా అసఫ్ అలీ

9
5

[dropcap]జూ[/dropcap]లై 16 అరుణా అసఫ్ అలీ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై, మరొకవైపు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, లోహీయాలతో అభిప్రాయాలను పంచుకుంటూ ఎదిగి ఒదిగిన మహిళ – ఆనాడే కుళ్ళు రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్న ‘క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా – అరుణా అసఫ్ అలీ’.

ఈమె నాటి యునైటెడ్ ఫ్రావిన్స్ నేటి హర్యానాలోని కల్కలో 1909 జూలై 16 వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు అంబాలికాదేవి, ఉపేంద్రనాథ్ గంగూలీ. తండ్రి యునైటెడ్ ఫ్రావిన్స్‌లో రెస్టారెంట్ యజమాని. బ్రహ్మసమాజ ఆచారాలను పాటించేవారు.

ఈమె కుటుంబం లాహోర్‌లోని ‘Sacred Heart Convent’లో చదివింది. అక్కడి పరిస్థితులకు ఇబ్బంది పడిందా కుటుంబం. అందువల్ల నైనిటాల్ తరలివెళ్ళారు. అక్కడి All saints College లో గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేశారు.

ఆ తరువాత కలకత్తా చేరుకున్నారు. అక్కడ గోఖలే స్మారక పాఠశాలలో అధ్యాపకురాలిలా పనిచేశారు.

భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తాలో స్వాతంత్ర్యోద్యమ సమావేశాలను నిర్వహించేది. ఆమె పాల్గొనేవారు. సమావేశాలలో చర్చించే విషయాలను అవగాహన చేసుకునేవారు.

అసఫ్ అలీ అనే ముస్లిం కాంగ్రెస్ నాయకుడిని కలిశారు. ఒకరికొకరు పరస్పరం ఆకర్షించుకున్నారు. అది ప్రేమగా మారింది. అయితే వారి పెళ్ళికి అరుణ తల్లిదండ్రులు అంగీకరించలేదు. మతం, వయోబేధం అందుకు కారణాలు. సుమారు 20 సంవత్సరాల తేడా వారిద్దరికి.

తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా అరుణ అసఫ్ అలీలు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, రాజాజీ, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి కాంగ్రెస్ పెద్దలు హాజరయి ఆశీర్వదించారు.

ఈమె బహిరంగ ఉపన్యాసాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించేవి. వారిలో దేశభక్తిని ఇనుమడింపజేసేవి. ఉప్పు సత్యాగ్రహ సమయంలో కూడా ప్రజలను ఉత్సాహపరిచారు. ఈమెనిలా వదిలేస్తే తమకి ప్రమాదమని ఆంగ్లేయాధికారులు భావించారు.

1932లో ఆమె మీద అభియోగాలు మోపి అరెస్టు చేశారు. తీహార్ జైలులో బంధించారు. తీహార్ జైలులో రాజకీయ ఖైదీలపట్ల వివక్ష ఎక్కువగా ఉండేది. కనీస సౌకర్యాలుండేవి కాదు. వారికి సౌకర్యాలు కల్పించమని అరుణ నిరాహారదీక్ష చేశారు. తత్ఫలితంగా ఖైదీలకు సౌకార్యలను మెరుగుపరిచారు. కాని ఆమెను అంబాలా జైలుకు తరలించారు. ఆమెను ఏకాంత ఖైదీగా ఉంచారు.

గాంధీ-ఇర్విన్ ఒప్పందం ప్రకారంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. అయితే అరుణను విడుదల చేస్తే తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని భావించారు జైలు అధికారులు. తోటి మహిళా ఖైదీలు ఆమెను విడుదల చేస్తేనే తాము జైలు వదిలి వెళతామని ఉద్యమించారు. చివరకు గాంధీజీ ప్రమేయంతో ఆమె విడుదలయ్యారు. సుమారు పదేళ్ళు ఆమె ఉద్యమానికి దూరంగా ఉన్నారు. అయితే దేశ స్వాతంత్ర పోరాటాన్ని పరిశీలిస్తూ, అవగాహన చేసుకుంటూనే ఉన్నారు.

1942 ఆగష్టు 8వ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు క్విట్ ఇండియా తీర్మానం చేశారు. గాంధీజీ ‘Do or Die’ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రముఖ నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్ళలో బంధించింది బ్రిటిష్ ప్రభుత్వం.

అప్పుడు రంగం మీదకి వచ్చారామె. 1942 ఆగష్టు 9 వ తేదీన ఉల్లాసంగా, ఉరకలేసే ఉత్సాహంతో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు.

బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ కాంగ్రెస్ పతావిష్కరణ చేశారు. పోలీసులు అరెస్టు చేయబోయారు. కార్యకర్తలతో కలిసి తప్పించుకున్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులు ఆమె ఆస్తులను జప్తు చేశారు. ఆమెను పట్టిచ్చిన వారికి రూ.5000/-లు రివార్డును ప్రకటించారు. అజ్ఞాతంలో ఉండి భూగర్భ రేడియో, కరపత్రాల ద్వారా తన భావాలను వ్యాప్తి చేశారు. ‘ఇంక్విలాబ్’ పత్రికలో వ్యాసాలు వ్రాసి ప్రచురించారు.

లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్, రామమనోహర్ లోహియా వంటి వారితో తమ భావాలను పంచుకున్నారు.

బాపూజీ “అజ్ఞాతవాసం నుండి బయటకు వచ్చి, మీ రివార్డును తీసుకుని పేదవారికి అందజేయండి” అని ఉత్తరం వ్రాశారు. అయినప్పటికి 1946 జనవరి 26వ తేదీ నాటికి తన జైలుశిక్ష పూర్తయిన తరువాతే విడుదలయ్యారు.

తరువాత ‘కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ’లో చేరారు. 1955లో ఇది ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా’లో కలిసి పోయింది. ఈ పార్టీకి కేంద్రనాయకత్వంలో సభ్యురాలిగా పని చేశారు. 1958లో పార్టీని వదిలిపెట్టారు.

1958లో ఢిల్లీ మేయర్‌గా ఎంపికై రికార్డును సృష్టించారు. తరువాత మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మేయర్ పదవిని త్యజించారు.

1964వ సంవత్సరంలో మళ్ళీ భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. కాని రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.

1954లో National Federation of Indian Women ను స్థాపించారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగం. పేదరిక నిర్మూలనకి, సాధికారతకి, అణగారిన వర్గాల అభివృద్ధికి, సూచనలు చేయడమే గాక నిరంతర కృషి సలిపారు. మహిళాభివృద్ధి కోసం, మహిళావిద్యకోసం కృషి చేశారు. కమలాదేవి ఛటోపాధ్యాయతో కలిసి మహిళల హక్కుల ఉద్యమాన్ని నడిపారు. మహిళలకు రిజర్వేషన్ల కంటే ఆరోగ్య రక్షణ, విద్య, ఆత్మరక్షణ అవసరమని ప్రభుత్వానికి నివేదించారు.

‘లింక్’ అనే వారపత్రికను, ‘పేట్రియాట్’ అనే దినపత్రికను నడిపారు. పత్రికల ద్వారా స్వాతంత్రోద్యమ ఘట్టాలను ప్రచారం చేశారు.

ఈమె వివిధ పార్టీల తరపున పని చేయడం విశేషం. సిద్ధాంతవైరుధ్యాలున్న కాంగ్రెస్, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీలలో పని చేశారు. కాని రాజకీయాలు నచ్చక దేనిలోను సరిగా ఇమడలేకపోవడం విశేషం. తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఒంటరి ప్రయాణం చేశారు.

ఇండో సోవియట్ సాంస్కృతిక సమాజం, ఆలిండియా పీస్ కౌన్సిల్ లలో ప్రముఖ పాత్రను పోషించారు.

ఈమె జీవితమే విచిత్రాల మయం. బెంగాలీ హిందూ బ్రాహ్మణ యువతి ముస్లిం వ్యక్తినీ, అందులోనూ సుమారు 20 ఏళ్ళ పెద్దవాడిని పెళ్ళి చేసుకోవడం ఒక మలుపు. పెళ్ళి తరువాత ‘కుల్‌సుమ్ జమాని’ అని పేరు మారింది. అయినా అరుణగానే ప్రసిద్ధి పొందారు.

విభిన్న సిద్ధాంతకారులు, విభిన్న పార్టీలు అందించే పురస్కారాలతో రికార్డు సృష్టించారు. కమ్యూనిస్ట్ రష్యా వారందించే లెనిన్ శాంతి పురస్కారాన్ని 1964 లో పొందారు. బ్రెజ్నెవ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

‘అంతర్జాతీయ అవగాహన’ కోసం కృషి చేసినందుకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే ‘జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన’ పురస్కారాన్ని 1991 లో అందుకున్నారు.

జాతీయ సమైక్యత కోసం కృషి చేసినందుకు ఇచ్చే ‘ఇందిరా గాంధి జాతీయ సమైక్యతా పురస్కారాన్ని’ 1987లో అందుకున్నారు.

భారత ప్రభుత్వ పురస్కారాలు పద్మవిభూషణ్ 1992 లో, భారత రత్నను 1997 లో ఈమెకు లభించాయి.

‘అఖిల భారత మైనారిటీల ఫ్రంట్’ ఈమె గౌరవార్థం ప్రతి సంత్సరం ‘డాక్టర్ అరుణ అసఫ్ అలీ సద్భావన్ అవార్డు’ను మైనారిటీ ప్రముఖులకు అందించి ఆమెను గౌరవించడం ఒక చారిత్రక విశేషం.

ఈమె స్వాతంత్ర్య పోరాటం చేస్తూనే సమాంతరంగా ప్రత్యేకించి అణగారిన వర్గాలు, మహిళాభివృద్ధి కోసం, సాంఘిక సమానత కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేశారు.

జాతీయనాయకులందరు అరెస్టయిన విపత్కర పరిస్థితులలో మన దేశ ఆర్థిక రాజధాని బొంబాయిలో జాతీయ పతాకావిష్కరణ చేసి దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. అందుకు ప్రతిఫలంగా ‘Queen of Quit India’ అని ‘Grand Old Lady of Indian Independence’ అని గౌరవించుకున్నాం.

“నిష్క్రియాత్మక క్రియాశీలత ద్వారా కాకుండా క్రియాశీల విప్లవం ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాడాలి” అని చెప్పేవారు.

“రిస్క్ తీసుకునేంత ధైర్యం లేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు” అన్న ఆమె మాటలు ఈ నాటికీ శిరోభూషణమే!

1996 జూలై 29 వ తేదీన ఢిల్లీలో మరణించారు.

ఈమె జ్ఞాపకార్థం 1998వ సంవత్సరం జూలై 16వ తేదీన రూ.3-00/-ల విలువతో స్టాంపు విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ.

జూలై 16వ తేదీ ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here