బహుముఖ ప్రజ్ఞాశాలి బుచ్చిబాబు

0
12

[box type=’note’ fontsize=’16’] 14 జూన్ 2021 తేదీన బుచ్చిబాబు గారి జయంతి సందర్భముగా ఈ వ్యాసం అందిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]తె[/dropcap]లుగు సాహితీ లోకానికి బుచ్చిబాబుగా చిరపరిచితుడైన శివరాజు వెంట సుబ్బారావు గారు ఏలూరులో జూన్ 14, 1916 నాడు సూర్య  ప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు జన్మించారు. అక్షరాభ్యాసము కంకిపాడులో జరిగింది. పాలకొల్లులో ఎస్.ఎస్.ఎల్.సి., గుంటూరు ఏ.సి.కాలేజీలో ఇంటర్ మీడియేట్, డిగ్రీ పూర్తిచేసి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ. హానర్స్ చేసి నాగపూర్ విశ్వ విద్యాలయము నుండి ఎమ్.ఏ డిగ్రీ పుచ్చుకున్నారు. చదువుకొనే రోజులనుండి తత్వ,మానసిక శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఏ.సి కాలేజీలో చదివేటప్పుడే అంటే 1936 లోనే కాలేజీ మ్యాగజైన్‌లో ఈయన రచనలు, ‘జువెనేలియా’, ‘బ్రోకెన్ వయోలిన్’ అనే ఆంగ్ల కవితలు, ‘పశ్చాత్తాపము లేదు’ అనే కథ ప్రచురించబడ్డాయి. తరువాత ఈయన బుచ్చిబాబు అనే కలం పేరుతో బాగా పాపులర్ అయినారు. అయన తెలుగు సాహిత్యములో కథా రచయిత, నవలా కారుడు. అంతే కాకుండా చిత్రకారుడు కూడ. అయన వ్రాసిన నవల ‘చివరకు మిగిలేది’ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నవల మనో వైజ్ఞానిక నవలగా నేటికీ సాహితీ రంగంలో నిలిచింది. నవోదయ అనే పత్రికలో 46-47 మధ్యకాలములో సీరియల్‌గా ప్రచురించబడి పాఠకుల ఆదరణ ఎక్కువగా ఉండటం వలన 1952లో నవల రూపములో ప్రచురించ బడింది. వేరు వేరు ప్రచురణకర్తలు ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయటము వలన అత్యధికముగా అమ్ముడైన నవల్లో ఇది ఒకటిగా నిలిచింది. కాత్యాయనీ అనే ఆవిడ ఈ నవలపై విస్తృతంగా పరిశోధించి కాకతీయ విశ్వ విద్యాలయము నుండి డాక్టరేట్ తీసుకున్నారు. ఆవిడ ప్రచురించిన పరిశోధన వ్యాసము పేరు ‘మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శ’. ఈ నవలను కాకాని చక్రపాణి గారు ‘ఫోర్ క్లాసిక్స్ ఆఫ్ తెలుగు ఫిక్షన్’ అనే పుస్తకముగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. వీరి భార్య సుబ్బలక్ష్మి గారు కూడా రచయిత్రియే.

ఈయన ఇంగ్లీష్‌లో ఎమ్.ఏ. చేయటము వలన కొంతకాలము అనంతపూర్‌లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశారు. 1937లో సుబ్బలక్ష్మి గారిని వివాహమాడారు. 1945 నుండి 1967లో చనిపోయే వరకు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. జీవితములో ప్రేమించలేకపోవటమే గొప్ప విషాదమని, ప్రేమించి విఫలము కావటం కాదని బుచ్చిబాబు అంటారు. మానవ జీవితములోని సౌందర్య తృష్ణ, సామరస్యము, కరుణ, విషాదము, ఉల్లాసము, వేదన, వాంఛ, వీటి స్వరూప స్వభావాలను బుచ్చిబాబు తన రచనలలో విశదంగా నిశితంగా వ్యాఖ్యానించారు. ముప్పై సంవత్సరాల కాలములో బుచ్చిబాబు సుమారు 80 కథలను రచించారు. ఇంగ్లీష్‌లో సంతోష్ కుమార్ అనే కలము పేరుతో కవితలు వ్రాసేవారు.1936లో ప్రారంభమైన అయన రచన వ్యాసంగములో, 82 కథలు, అజ్ఞానము అనే వచన కావ్యము, చివరకు మిగిలేది అనే నవల, 40 వ్యాసాలు,40 నాటికా నాటకాలు, షేక్స్‌పియర్ సాహిత్య పరామర్శ, ఇలా పలు రకాల రచనలు చేసి ఆధునిక తెలుగు సాహిత్యములో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు.

బుచ్చిబాబు వ్రాసిన కధానికలలో, “నన్ను గురించి వ్రాయరు?, ఆమె నీడ, తడి మంటకు పొడినీళ్ళు, దేశము నాకిచ్చిన సందేశము, ఊడిన చక్రము – వాడని పుష్పము, నా గాజు మేడ” లాంటి బాగా ప్రాచుర్యము పొందిన కథలు ఉన్నాయి. దాదాపు 70 కథలు అనేక కథా సంకలనాలలో దర్శనమిస్తాయి. కథలతో పాటు అయన వ్రాసిన వ్యాసాలలో “నన్ను మరచిన పుస్తకము, నేను శంకరనారాయణ నిఘంటువు” బాగా పేరు తెచ్చుకున్నవి. ఈయన వ్రాసిన వ్యాసాలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. బుచ్చిబాబు రేడియో నాటకాలను, స్టేజ్ నాటకాలను రచించారు. ఈయన వ్రాసిన స్టేజ్ డ్రామా ‘ఆత్మ వంచన’లో అప్పటి సినీ ప్రముఖులు సావిత్రి, పుండరీకాక్షయ్య లాంటి వారు నటించారు. ఆంధ్ర కళా పరిషత్ కాకినాడ వారు నిర్వహించిన నాటక పోటీలలో ఉత్తమ డ్రామా అవార్డును ఆనాటి మేటి నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బుచ్చిబాబు గారు అందుకున్నారు. బుచ్చిబాబు తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను గమనిస్తూ ఆ సీనరీలను చిత్రీకరించేవారు. ఎక్కువ భాగము దక్షిణాది పల్లె వాతావరణాన్నిప్రతిబింబించే చిత్రాలను గీసేవారు. తన చిన్ననాటి సంగతులను అనుభూతులను, అనుభవాలను ‘అంతరంగ కథనం’ పేరుతో ప్రచురించారు. ‘అంతరంగ కథనం’లో ద్రౌపది, సీత పాత్రలకు ఉన్న తారతమ్యాన్ని ఎంతో కళాత్మకంగా వర్ణించారు. ఇది ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా ప్రచురించబడి పాఠకుల విశేష ఆదరణ పొందింది.

బుచ్చిబాబు కథలలో ఒక ఆవేదన, సంవేదన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందువల్ల కొందరు విమర్శకులు బుచ్చిబాబును నిరాశావాది, పలాయనవాదిగా వర్ణిస్తే, మరికొందరు విమర్శకులు క్రియాశీలవాది గాను, ఆశావాది గాను, సౌందర్య ఆరాధకుడిగాను వర్ణిస్తారు. అయన నవలలు కథలు చదివినవారికి జ్ఞానతృష్ణ, వివేచన, విషయ పరిజ్ఞానము స్పష్టముగా కనబడుతుంది. ఈయనకు మరణానంతరము షేక్‌స్పియర్ సాహితి పరామర్శ అనే పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బుచ్చిబాబు గారు 51 ఏళ్ల వయస్సులో అంటే 1967లో స్వర్గస్థుడైనారు. కానీ తెలుగు సాహితి ప్రపంచములో కథానిక, నవలా రచయితగా తెలుగు పాఠకుల మదిలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here