గవర్నర్‌కే తుపాకీ గురి పెట్టిన బీనా దాస్

3
8

[dropcap]ర[/dropcap]వి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య అధికారులను గడగడలాడించిన పోరాటయోధులు ఎందరో? అధికారులను చంపడానికి ప్రయత్నించినవారూ, హతమార్చి ఉరికంబాలను ఎక్కి ప్రాణత్యాగం చేసినవారూ కనిపిస్తారు. ఈ ప్రయత్నంలో విఫలమై జైలు శిక్షని అనుభవించినవారు మన జాతీయోద్యమ చరిత్రలో కనిపిస్తారు.

తొలి రోజుల్లో గాంధీ మార్గంలో పయనించిన ఒక మహిళ/తరువాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభావంతో ముందడుగు వేశారు. తరువాత బ్రిటిష్ వారి అమానుష కృత్యాలను అవగాహన చేసుకుని కసి పెంచుకున్నారు. తన స్నేహితురాళ్ళతో పథకాన్ని రచించి గవర్నర్ మీద కాల్పులు జరిపారు. తృటిలో ఆ గురి తప్పి ఆమె తొమ్మిదేళ్ళ జైలు శిక్ష ననుభవించారు. 1931లోనే కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యాన్ని చదివినా నేరారోపణతో పట్టాని పొందలేక పోయారు. మరణానంతరం 2012లో బి.ఎ. పట్టాని ఈమెకి ప్రదానం చేశారు కలకత్తా విశ్వవిద్యాలయ అధికారులు.

బీనా దాస్ నాటి బెంగాల్ ఫ్రావిన్స్ నేటి పశ్చిమ బెంగాల్ లోని కృష్ణ నగర్‌లో జన్మించారు. తల్లి సరళాదేవి సామాజిక కార్యకర్త, తండ్రి మదాబ్ దాస్ ఉపాధ్యాయుడు. వీరిద్దరు బ్రహ్మసమాజానికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనేవారు. సంఘసేవకులు, వీరి కుమార్తెలకు కూడా ఈ వారసత్వాన్ని అందించారు.

బీనా దాస్ సెయింట్ జాన్ డియోసెసస్ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలలోను, బెతూన్ కళాశాలలోను చదివారు.

తరచుగా వీరి ఇంటికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చేవారు. బోస్‌తో ఈమె కుటుంబీకులు చర్చలు జరిపేవారు. ఆ చర్చలను వింటూ స్వాతంత్ర్య పోరాటం పట్ల ఇష్టాన్ని, అవగాహనను పెంచుకున్నారు బీనా, ఆమె అక్క కళ్ళాణి. బోస్ ప్రభావంతో కళ్యాణి దాస్, బీనా దాస్ ఇద్దరూ గొప్ప స్వాతంత్ర్య పోరాటయోధులుగా చరిత్రను సృష్టించారు.

కలకత్తా నగరంలో ఒక మహిళా విప్లవ సంస్థ ‘ఛత్రి’. బీనా దాస్ ఈ సంస్థ సభ్యురాలిగా పనిచేశారు. పేరుకి తగ్గట్టుగా ఈ సంస్థ విప్లవ పంథాలో పని చేసేది. హింసకు ప్రతి హింస అన్నట్లు హింసా మార్గంలోనే పోరాటం జరిపేది, బ్రిటిష్ అధికారులు, గవర్నర్లను హతమార్చేటందుకు ప్రణాళికలను రచించి అమలు చేసేవారు ఈ సంస్థ సభ్యులైన స్త్రీలు.

1932 ఫిబ్రవరి 6 న కాన్వొకేషన్‌లో పాల్గొనే నిమిత్తం గవర్నర్ స్టాన్లీ జాక్సన్ కలకత్తా విశ్వవిద్యాలయంలోని కాన్వొకేషన్ హాలు లోకి వచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు విశ్వవిద్యాలయ అధికారులు, గవర్నర్‌ను హత్య చేయడం కోసం పథకాన్ని రచించింది ఛత్రి సంస్థ.

కమలాదాస్ అనే సభ్యురాలు బీనా దాస్‌కి రివాల్వర్‌ను అందించారు. బీనా దాస్ కాన్వొకేషన్ హాల్లోనే గవర్నర్ స్టాన్లీ పైన ఐదుసార్లు తుపాకి కాల్పులు జరిపారు.

కానీ దురదృష్టవశాత్తు విఫలమయ్యాయి. వెంటనే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షను విధించారు. 1939లో జైలు నుండి విడుదలయ్యారు బీనా దాస్.

1939 నాటికి దేశం యావత్తు గాంధీజీ నాయకత్వంలో అనేక ఉద్యమాలకు నిలయమయింది. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు గాంధేయులుగా మారారు. ఆయన మార్గమైన శాంతి, అహింసల పట్ల ఆకర్షితులయ్యారు. కొత్తవారు అనేకమంది భారత జాతీయ కాంగ్రెస్‍లో చేరి ఉద్యమానికి ఊతమందిస్తున్నారు.

ఈ పరిణామాలను నిశితంగా గమనించి అవగాహన చేసుకున్న బీనా దాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విధంగా ఈమె జీవితం విప్లవాత్మక హింసామార్గం నుండి అహింసా మార్గం వైపు మళ్ళింది.

గాంధీజీ రూపొందించిన ఉద్యమాలలో విస్తృతంగా పాల్గొన్నారామె, ఆ విధంగానే 1942లో మొదలైన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపించారు. ఈ విధంగా జీవితంలో రెండవసారి జైలుకి వెళ్ళారు. ఈసారి 1942 నుండి 1945 వరకు జైలుశిక్షను అనుభవించి విడుదలయ్యారు.

విద్యాధికులు శాసనసభ్యులయితే సేవా కార్యక్రమాలు బాగా జరుగుతాయని భావించింది కాంగ్రెస్ పార్టీ. ఈమెను బెంగాల్ ప్రొవిన్షియల్ శాసనసభకు సభ్యురాలిగా పంపించింది. 1946 నుండి 1947 వరకు ఈమె ఈ పదవిలో పనిచేశారు.

1947లో భారతదేశ విభజన జరిగి స్వాతంత్ర్యం లభించింది. అప్పుడు తూర్పు బెంగాల్ పాకిస్థాన్‌కు దక్కింది. మన దేశంలో పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రంగా ఏర్పాటయింది. ఈ శాసనసభ్యురాలిగా 1947 నుండి 1951 వరకు పనిచేశారీమె,

పాఠశాల విద్యార్థినిగా ఉండగానే వైస్రాయ్ భార్య పాఠశాలను సందర్శించిన సందర్భంలో ఆమె పాదాల మీద పూలు జల్లి మోకరిల్లడాన్ని వ్వతిరేకించారామె.

ఛత్రి సంఘం ఆధ్వర్యంలో పని చేసే అమ్మాయిలు బీనా దాస్ తల్లి సామాజిక కార్యకర్త అయిన సరళాదేవి నడుపుతున్న పుణ్య ఆశ్రమంలో వసతిని పొందేవారు.

నేతాజీ వంటి గొప్ప అమరయోధుడు ఈమె తండ్రి బేణి మాధవ దాసు శిష్యరికం చేశారంటేనే ఈమె తల్లిదండ్రులు ఎంత గొప్పవారో అర్థమవుతుంది.

1947లో జుగాంతర్ గ్రూప్‌కి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు జతీష్ చంద్ర భౌమిక్‌తో ఈమె వివాహం జరిగింది. వీరు పేదల కోసం సేవాకార్యక్రమాలను నిర్వహించేవారు. స్వాతంత్ర్య పోరాటయోధులకు అందించే పెన్షన్‌ను నిరాకరించి తన దేశభక్తి నిస్వార్థమయిందని నిరూపించుకున్నారావిడ.

1960లో కేంద్రప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది.

1944లో ఈమె అక్క కళ్యాణి భట్టాచార్య బెంగాల్ స్పీక్స్ గ్రంథాన్ని రచించి ఈమెకి అంకితమిచ్చారు. ఈ సంఘటన అక్కకి చెల్లిలి పట్ల గల ప్రేమాభిమానాలని తెలియజేస్తుంది.

ఈమె మాతృభాష బెంగాలీలో తన స్వీయ కథను గ్రంథస్థం చేసి అందించారు. 1 శృంఖల్ జంకర్ 2 సిత్రిధన్. తన జీవితానుభవాలని వీటిలో పొందుపరచి అందించారు. ఈమె జీవితచరిత్రతో పాటు సమాంతర రాజకీయ, సామాజిక అంశాలు కూడా జత చేయబడడం విశేషం.

1932లో బి.ఎ. చదువును పూర్తి చేసిన ఈమెకు బ్రిటిష్ ప్రభుత్వం పట్టా ప్రదానాన్ని ఆపి వేసింది. 2012లో ఈమె మరణానంతరం కలకత్తా విశ్వవిద్యాలయం ఈ పట్టాని ఆమె పేరుతో అందించడం విశేషం. ఆమె చూసుకోలేక పోవడం బాధాకరం కూడా!

2012లో కలకత్తా విశ్వవిద్యాలయం వారు 1931 లో బి.ఎ చదివిన ఈమె పేరుతో మరణానంతరం.. ప్రదానం చేసిన డిగ్రీ. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక లోని ఫోటో

చివరి రోజులలో రిషికేష్‌లో జీవనం కొనసాగించారు. భర్త మరణించిన తరువాత దుర్భర పరిస్థితులను ఎదుర్కున్నారు. భయంకర పేదరికాన్ని అనుభవించిన ఈమె జీవిత చరమదశ, మరణం దుర్లభంగా ముగిశాయి.

1911లో జన్మించిన ఈమె మృతదేహం 1986 డిశంబర్ 26 వ తేదీన రిషికేష్ వంటి ఆధ్యాత్మిక కేంద్రంలో రోడ్డు ప్రక్కన దొరికింది. పాక్షికంగా కుళ్ళిపోయిన మృతదేహం పోలీసులకు దొరికింది. నెల రోజుల తర్వాతగాని ఈమెని గుర్తించ లేక పోవడం శోచనీయం.

గొప్ప దేశభక్తురాలిగా వివిధ మార్గాలలో విప్లవాత్మక హింసావాదం నుండి అహింసావాదం వైపు పయనించి స్వాతంత్ర్యం వచ్చినందుకు సంబర పడ్డారామె, రాజకీయ పదవులందుకుని సేవాకార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. కాని ఈ ఫలాలు సామాన్యులకు అందలేదని కలత చెందారు, రాజకీయాలకు దూరమయ్యారు.

అజ్ఞాతంలో జీవించి, అనామకంగా మరణించిన ఆమెకు అంజలి ఘటిస్తూ…

ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here