కెప్టెన్ లక్ష్మీ సెహగల్

5
11

[dropcap]23[/dropcap]-07-2022 కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె విద్యార్థినిగా ఉన్నప్పుడే తల్లి అడుగు జాడలలో నడిచిన జాతీయోద్యమ నాయకురాలు. గాంధీ మార్గం నుండి నేతాజీ యుద్ధరంగం వైపు దూసుకుని వెళ్ళిన కెప్టెన్. దేశవిభజన, పాకిస్థాన్ విభజన తర్వాత ఆవిర్భవించిన బంగ్లాదేశ్ శరణార్థులకు సేవలందించిన గొప్ప వైద్యసేవకురాలు/కమ్యూనిస్టు పార్టీ తరపున మహిళల కోసం ఉద్యమించిన స్త్రీ పక్షపాతి/దేశంలోని వివిధ ప్రాంతాలలో అల్లర్లు చెలరేగినపుడు శాంతియాత్రలు జరపడం/ప్రకృతి, పారిశ్రామిక విపత్తుల సమయంలో వైద్యసేవలందించిన గొప్ప వైద్యురాలు, రాష్ట్రపతి పదవికి పోటీచేసిన తొలి భారతీయ మహిళ ఆమె.

అంతేకాదు – కత్తిని పట్టి శస్త్ర చికిత్స చేసిన చేతులే – అజాద్ హింద్ ఫౌజ్ కెప్టెన్‌గా తుపాకీని చేపట్టాయి. జీవితాంతం వైవిధ్యభరిత సేవలను అందించి మాతృభూమి ఋణం తీర్చుకున్న ఆమే శ్రీమతి లక్ష్మీ సెహగల్.

ఈమె 1914 అక్టోబర్ 24వ తేదీన నాటి మద్రాసు ప్రెసిడెన్సీ (నేటి కేరళ) లోని పాలక్కాడ్ జిల్లా అనక్కరలో జన్మించారు. ఈమె తల్లి శ్రీమతి అమ్ముకుట్టి స్వామినాథన్ సామాజిక కార్యకర్త, స్వాతంత్ర్య పోరాట యోధురాలు, సంఘ సంస్కరణాభిలాషి. అన్నింటి కంటే గొప్ప విషయం ఈమె భారత రాజ్యాంగ పరిషత్ సభ్యురాలుగా పనిచేయడం. తల్లి వారసత్వాన్ని నూటికి నూరు శాతం పుణికి పుచ్చుకున్నారు. సంఘసేవ, స్వాతంత్ర్యపోరాటాలలో పాలు పంచుకున్నారు. మద్యనిషేధానికి, విదేశీ వస్తు బహిష్కరణోద్యమానికి తల్లితో కలిసి ఊతమందిచారు. ఒకవైపు చదువుకుంటూనే ఈ కార్యకలాపాలలో పాల్గొని ఉద్యమించారు.

తండ్రి ప్రముఖ హైకోర్టు న్యాయవాది సురేంద్ర స్వామినాథన్. వీరు లండన్‌లో చదివారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి బారిష్టర్ పట్టాని సంపాదించారు. వీరిది తొలి నుండి విద్యాధిక, ధనిక కుటుంబం అన్నమాట.

ఈమె చెన్నపట్టణంలోని క్వీన్‌ మేరీస్ కళాశాలలో చదివారు. మద్రాసు మెడికల్ కాలేజిలో యం.బి.బి.యస్. పూర్తిచేశారు. ఆ రోజుల్లో వైద్యవిద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ను అందించేవారు. తమది ధనవంతుల కుటుంబం కాబట్టి తనకి స్కాలర్‌షిప్ మంజూరు చేయవద్దని కోరేవారు. ఆ స్కాలర్‍షిప్‌ను పేద అమ్మాయిలకు ఇవ్వమని అధికారులని కోరిన పెద్ద మనసు ఆమెది.

1938లో యం.బి.బి.యస్. పూర్తయిన తరువాత ప్రసూతి వైద్యంలో డిప్లొమా తీసుకున్నారు. ట్రిప్లికేన్ లోని కస్తూర్బాగాంధీ ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌గా విధులలో చేరారు. ఈలోగా రెండవ ప్రపంచయుద్ధం మొదలయింది. బ్రిటీష్ ప్రభుత్వం సైనికుల కోసం వైద్యులను నియమించే ఏర్పాట్లకు పూనుకుంది. బ్రిటిష్ వారి సైన్యానికి సేవలు చేయడం ఈమెకి ఇష్టం లేదు.

1940వ సంవత్సరంలో సింగపూర్ తరలి వెళ్ళారు. అక్కడ హాస్పటల్‌ను నెలకొల్పారు. పేద కార్మిక శ్రామికులయిన భారతీయులకి వైద్యసేవలను అందించేవారు. క్షతగాత్రులకు కూడా వైద్యసేవలను అందించారు.

మన దేశంలో ఉన్నప్పుడు గాంధీజీ బాటలో తల్లితో పాటు పయనించిన ఈమె తరువాత తన మార్గాన్ని మార్చుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపన్యాసాలకు ప్రభావితులయ్యారు. యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నారు.

1942లో జపాన్ సింగపూర్‌ని బ్రిటిష్ వారి దగ్గరి నుండి తన ఆధీనంలోనికి తెచ్చుకుంది. నేతాజీ జపాన్‌తో స్నేహ బాంధవ్యాలను పెంపొందించుకున్నారు. సింగపూర్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అజాద్ హింద్ ఫౌజ్ (భారత జాతీయ సైన్యాన్ని) ఏర్పాటు చేశారు. మహిళా రెజిమెంటు ఏర్పాటు చేయాలని ఆయన ఆశయం.

మహిళా రెజిమెంట్ నడపడానికి ఈమె పూనుకున్నారు. నేతాజీని కలిసి చర్చలు జరిపారు. ఈమె పట్టుదల, ఉత్సాహం, కార్యదీక్షాగుణం నేతాజీకి నమ్మకం కలిగించాయి. మహిళా రెజిమెంట్ బాధ్యతలను అప్పగించారు.

ఆమెకు అంతకు ముందే శ్రీయుతులు కె.పి.కేశవసనన్, ఎస్.సి. గుహ, ఎన్.రాఘవన్ వంటి జాతీయ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది.

నేతాజీ మహిళా సైన్యం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 1943 జూలై 8వ తేదీన జానకీదేవర్ వంటి వారితో కలిసి పని మొదలు పెట్టారు. వీరందరూ కలిసి 1500 మంది మహిళలతో మహిళా సైన్యాన్ని తయారు చేశారు. మహిళలు వెనకబడి ఉన్న ఆ రోజులలోనే సింగపూర్‌లో అంతమంది వీరనారులతో బ్రిగేడ్ తయారు చేయడం మామూలు విషయం కాదు. అంత గొప్ప సైన్యానికి స్ఫూర్తినిచ్చే పేరు పెట్టాలికదా!

1857 విప్లవ నారీశిరోమణి ఝాన్సీ రాణి పేరు మీద ‘RANI OF JHANSI REGIMENT’ అనే పేరుతో ఈ సైన్యానికి జీవం పోశారు. కొండలు, కోనలలో ఎండ, వాన, వరద, బురదలనక పోరాటాలు చేశారు. 1945లో ఈమెను అరెస్ట్ చేసి రంగూన్‌కి పంపారు. 1946లో జైలు నుండి విడుదలయి స్వదేశానికి వచ్చారు.

1945 ఆగష్టు నెలలో జపాన్ మిత్ర రాజ్యలకు లొంగిపోయింది. నేతాజీ విమానంలో అంతర్థానమయ్యారు. అజాద్ హింద్ ఫౌజ్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.

1945-1946 మధ్యకాలంలో అజాద్ హింద్ ఫౌజ్‌లో పని చేసిన సైనికాధికారులని ఢిల్లీలో విచారణ చేశారు. ఈ విచారణ భారతీయ స్వాతంత్ర్య పోరాటంలో ఒక మహోజ్వల ఘట్టం.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన దేశవిభజన చాలామంది దేశభక్తులకు మనోవేదన కలిగించింది. ఈమె కూడా చాలా బాధను అనుభవించారు. పాకిస్థాన్ నుండి మనదేశానికి వచ్చిన శరణార్థులకు పలురకాల సేవలతో పాటు వైద్యసేవలను అందించారు.

ఈమెకు మొదటి నుండి మహిళల బాధల, సమస్యల పట్ల అవగాహన ఉండేది. ముఖ్యంగా వైద్య సేవల కొరత, ప్రసూతి సమయంలో వారు అనుభవించే ఆరోగ్యసమస్యలు, మాతా శిశు మరణాలు ఆమెను మానసిక వేదనకు గురిచేశాయి.

ఈమె అణగారిన వర్గాల ప్రజలు, సమస్యలతో అల్లాడుతున్న వారికి సేవలను అందించడానికి వివిధ సంస్థల తరపున పనిచేశారు.

స్త్రీల సమస్యల కోసం కృషి చేస్తున్న ‘INDIAN DEMOCRATIC WOMEN’S ASSOCIATION’ కి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ప్రభావితులయిన లక్ష్మి 1971లో C.P.I. (M) పార్టీలో చేరారు. ఆ పార్టీ నుండి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1970-1971లో పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు అక్కడి నుండి బెంగాల్, అస్సాంలలోకి ప్రవేశించిన శరణార్థులకు సహాయం చేయడం కోసం శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్యసేవలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు.

1981వ సంవత్సరంలో ‘INDIAN DEMOCRATIC WOMEN’S ASSOCIATION’ ను స్థాపించడంలో ప్రముఖ పాత్రను నిర్వహించారు.

1984లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి హత్య తరువాత జరిగిన సిక్కు వ్యతిరేక దుర్ఘటనలో వేలాదిమంది సిక్కులు నష్టపోయారు. వీరికి అవసరమైన సేవలను అందించారు.

1984 డిశంబర్‌లో భోపాల్‌లో జరిగిన విషవాయు దుర్ఘటన సందర్భంగా చాలా మంది అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ఈ సమయంలో ఈమె ఆధ్వర్యంలో చాలా సేవాకార్యక్రమాలు జరిగాయి. ఈ విధంగా వివిధ సందర్భాలలో ఈమె అందించిన సేవలు అజరామరం.

సహజంగా కమ్యూనిస్టులు అందాల పోటీల వంటి వాటికి వ్యతిరేకంగా ఉంటారు. 1996లో బెంగుళూరులో ‘మిస్ వరల్డ్’ పోటీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 82 ఏళ్ళ వయస్సులో పాల్గొని అరెస్టయ్యారు.

కెప్టెన్ ప్రేమ్ కుమార్ సెహగల్ లాహోర్‌కు చెందిన వ్యక్తి. అజాద్ హింద్ ఫౌజ్‍లో పనిచేశారు. వీరికి లక్ష్మీ స్వామినాథన్‌కి వివాహం తరువాత లక్ష్మి – లక్ష్మీ సెహగల్ గా మారారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరు లాహోర్ నుండి కాన్పూర్‌ని తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. దేశమంతా తిరిగి వివిధ రంగాలలో సేవలు చేస్తూనే సమాంతరంగా కాన్పూర్‌లో వైద్యశాలను నడిపారు. 92 ఏళ్ళ వయస్సులో కూడా విస్తృతంగా వైద్య సేవలను అందించారు. పేదలకు ఉచిత వైద్యం అందించేవారు. మిగిలిన వారి దగ్గర నామమాత్రపు ఫీజును వసూలు చేసేవారు. అందుచేతనే హాస్పిటల్ ఎప్పుడూ పేషంట్లతో కిటకిటలాడుతూ ఉండేది.

దేశంలోని వామపక్ష పార్టీలన్నీ కలిసి 2002లో ఈమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి. ఈ విధంగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి అభ్యర్థిగా చరిత్రలో నిలిచారు.

భారత ప్రభుత్వం 1998లో పద్మ విభూషణ్ పురస్కారంతో వీరిని గౌరవించింది. 2010లో ఆమె పుట్టిన రాష్ట్రం కేరళలోని కాలికట్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ నిచ్చి సత్కరించింది.

2012 జూలై 23వ తేదీన గుండెపోటుతో కాన్పూర్‌లో మరణించారు. 97 ఏళ్ళ పరిపూర్ణ జీవితాన్ని వివిధ సేవలకి అంకితం చేశారామె. ఈమె పార్థివ శరీరాన్ని కాన్పూర్ లోని ‘గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ వైద్యకళాశాల’కి పరిశోధన నిమిత్తం అందించారు.

13-10-2021 న విడుదలయిన లక్ష్మీ సెహగల్ ప్రత్యేక తపాలా కవర్

ది.13-10-2021 వ తేదీన ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా భారత తపాలాశాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేసింది. కవరు మీది క్యాన్సిలేషన్ ముద్ర, కవరు మీద కుడివైపున సెల్యూట్ చేస్తున్న లక్ష్మీ సెహగల్ కన్పిస్తారు. చిత్రం పక్కన అజాద్ హింద్ ఫౌజ్ యూనిఫామ్‌లో నిలబడిన లక్ష్మి స్ఫూర్తినిచ్చే రీతిని కనిపిస్తారు.

జూలై 23 ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here