వేదిక మీద కర్నాటక శాస్త్రీయ గానాన్ని ఆలపించిన తొలి మహిళ శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్

9
9

[dropcap]16[/dropcap]-07-2021 తేదీ డి. కె. పట్టమ్మాళ్ వర్ధంతి  సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

కర్నాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చి వేదిక పైన కచేరి చేసిన తొలి సంగీత కళాకారిణి శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్. ఈమె దక్షిణ భారతదేశ కర్నాటక సంగీత సామ్రాజ్ఞులు ముగ్గురిలో ఒకరు. మిగిలిన వారు శ్రీమతి యం.యస్.సుబ్బులక్ష్మి శ్రీమతి యం.యల్.వసంతకుమారి.

ఈమె పూర్తి పేరు డమల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్. 1919 మార్చి 19 వ తేదీన (నాటి మద్రాసు ప్రెసిడెన్సీ) నేటి తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని ‘డమల్’ అనే ఊరిలో జన్మించారు. తల్లిదండ్రులు కాంతిమతి, డమల్ కృష్ణస్వామి దీక్షితార్‌లు. ఈమె మొదటి పేరు అలమేలు. తల్లిదండ్రులిద్దరూ సంగీత ప్రియులు, కళాకారులు. వీరి ప్రోత్సాహంతో బాల్యంలోనే సంగీత సాధన మొదలు పెట్టింది.

ఈమె పుట్టిన రెండు నెలల వయసులోనే రమణమహర్షులు నాలుక మీద తేనె చుక్కలద్ది ఆశీర్వదించారు. ఎనిమిదేళ్ళ వయసులోనే కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు తన చేతి ప్రసాదమిచ్చి ఆశీస్సులను అందించారు.

తండ్రి తెల్లవారు ఝామునే నిద్రలేపి ముకుందమాల, శ్యామలా దండకం వంటివి సాధన చేయించేవారు.

ప్రతి సంవత్సరం కాంచీపురంలో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలను తిలకించి, ఆస్వాదించే యోగం ఆమెకి దక్కింది. ఆ వేదికను అలరించిన వారిలో అరియకుడి రామానుజం అయ్యంగార్, ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్, రాజరత్నం పిళ్ళె వంటి వారుండడం ఈమె అదృష్టం. వీరు పాడిన గీతాలను ఇంటికి వచ్చి సాధన చేసేవారు.

పాఠశాలతో ‘సతీసావిత్రి’ వంటి నాటికలలో వేషం వేసేవారు. ఒకసారి ఇటువంటి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక పట్టుచీర షాపు యజమాని బంగారు పతకాన్ని బహుమతిగా అందించారు. అప్పుడామెకు పదేళ్ళే! తెలుగు వడియార్ అనే ఉపాధ్యాయుడు ఆమెకు తెలుగు భాషను, త్యాగరాయ కృతులను నేర్పించారు.

కర్నాటక సంగీత త్రిమూర్తులు ముగ్గురిలో వేదిక మీద సంగీత కచ్చేరీలు చేసిన తొలి మహిళ ఈమే! యం.యస్ సుబ్బులక్ష్మి కూడా ఈమే తరువాతే వేదిక మీద కచ్చేరి చేశారు.

1919లో తొలిసారిగా గ్రామఫోన్ రికార్డులో పాడారు. పదేళ్ళ వయసులో ఇలా చేయడం చాలా గొప్ప అని పత్రికలు ప్రస్తుతించాయి.

ఈమె మద్రాసు ఆకాశవాణి ప్రాయోగిక (ఆడిషన్) పరీక్షకు హాజరయినపుడు ఉద్దండ పండితులయిన ముగ్గురు సంగీత సామ్రాట్ల వద్ద పాడవలసి వచ్చింది. వారు టైగర్ వరదాచారి గారు, ఆచార్య సాంబమూర్తిగారు, అంబిదీక్షితుల వారు. అలా అన్నప్రాశన నాడే ఆవకాయ భోజనం లభించిందామెకి.

ఆ తరువాత అంబిదీక్షితులు, జస్టిస్ టి.ఎల్.వెంకటరావు అయ్యర్ గార్ల దగ్గర ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలను; శ్రీ పాపనాశం శివం (అపర త్యాగయ్య) గారి వద్ద వివిధ కీర్తనలను; శ్రీ విద్యాల నరసింహులు నాయుడి గారి వద్ద పల్లవులు, జావళీలు, వర్ణాలను ఆలపించడం అభ్యసించారు.

కొలంబియా వారు చిన్నారి పట్టమ్మాళ్‌తో గ్రామఫోన్ రికార్డులను విడుదల చేసి రికార్డు సృష్టించారు. మద్రాసు కార్పొరేషన్ రేడియోలో ఈమె కార్యక్రమాలు విస్తృతంగా ప్రసారమై శ్రోతలను అలరించేవి. ముత్తుస్వామి దీక్షితుల కీర్తనల పైన సాధికారత సాధించారు. ఆయన కీర్తనలకు పట్టమ్మాళ్ కేరాఫ్ అడ్రగా మారారు.

ఆ రోజుల్లో రాగం, తానం, పల్లవులను వేదిక మీద పురుషులు మాత్రమే ఆలపించేవారు. వీటిని వేదిక మీద ప్రదర్శించిన తొలి మహిళా సంగీత కళాకారిణి ఈమే! ఈమెను ‘పల్లవి పట్టమ్మాళ్’ అని ప్రశంసించేవారు. సోదరుడు డి.కె.జయరామతో కలిసి వేదికల మీద కచ్చేరి ఇచ్చేవారు.

1972లో ఎగ్మోర్‌లోని ‘రసిక రంజని’ సభలో పాల్గొన్నారు. 1934లో నాటి బొంబాయి ప్రెసిడెన్సీలోని ముంబైలో, ఉమ్మడి మదరాసు రాష్ట్రంలోని తెలుగు వారి ప్రాంతాలలో కచ్చేరీలు చేశారు.

స్వర్గీయ సుబ్రహ్మణ్య భారతి జాతీయ వాద గేయాలకి స్వరాలు సమకూర్చి అద్భుతంగా, అద్వితీయంగా, అసామాన్యంగా ఆలపించేవారు. ప్రేక్షకులు దేశభక్తితో ఉర్రూతలూగేవారు. దేశంలో ఏ ప్రాంతంలో కచ్చేరి చేసినా దేశభక్తి గేయంతోనే ముగించేవారు. ఈమె దేశభక్తికి ఇదొక తార్కాణం.

సినీగాయనిగాను ఈమె పేరు పొందారు. 1939లో పాపనాశం శివం గారి ద్వారా ‘త్యాగభూమి’ సినిమాలో తొలిసారిగా పాటలను ఆలపించారు. నామ్ ఇరువర్, రామరాజ్యం, వాజక్కై చిత్రాలను తన గానామృతంతో సుసంపన్నం చేశారు.

1950లో ‘జీవితం’ సినిమాలో “ఆంధ్రయువకా! నీదే విజయమురా!” అనే దేశభక్తి గేయాన్ని ఆలపించి తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. 2000 సంవత్సరంలో ‘హేరామ్!’ సినిమాలో బాపూజీకి ప్రాణమైన, శ్రీమతి యం.యస్.సుబ్బులక్ష్మి బాపూజీ కోసం తొలిసారి ఆలపించిన “వైష్ణవ జనతో” గేయాన్ని ఆలపించారు.

అయితే చలనచిత్రాలలో వీరు ఆలపించిన గేయాలన్నీ భక్తి, దేశభక్తి పాటలే!

కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, శ్రీలంక, బ్రిటన్, అమెరికా వంటి దేశాలలో సంగీత కచ్చేరీలు చేశారు. దేశవిదేశాల్లో కర్నాటక సంగీత ప్రాభవానికి పేరు తీసుకుని వచ్చారు.

75 సంవత్సరాల పాటు వేదిక మీద కచ్చేరీలు చేసి శ్రోతలను రంజింపచేసిన తొలి కర్నాటక సంగీత కళాకారిణిగా పేరు పొందారు.

2000వ సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సంగీత దర్శకుడు శ్రీ A.R.రెహమాన్ దర్శకత్వంలో ‘జనగణమన’ వీడియో ఆల్బంను తయారు చేశారు. ఈ ఆల్బంలో తొలి స్వరాన్ని శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్ చేత పాడించి, గౌరవించారు.

ఈమెకి శ్రీ ఈశ్వరన్ అయ్యర్ తో వివాహం అయినది. ఆయన ఈమెకి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఈమె సంగీత యాత్ర విజయవంతమవడానికి, జీవితానికి బాసటగా నిలిచి గొప్ప సంగీత కళాకారిణిగా వెలుగొందడం వెనుక భర్త సహాయం అజరామరం. ఈమె కుమారులు, కోడలు, మనవరాలు, మునిమనవరాలు తరతరాలుగా వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.

ఈమె శిష్యులలో డి.కె.జయరామన్, లలితా శివకుమార్, సుశీలా రామన్, నిత్వ శ్రీమహదేవన్, లావణ్య సుందర రామన్‌లున్నారు. వీరందరూ ఈమె గురుపరంపరను కొనసాగిస్తూ ఈ నాటికీ సంగీత సరస్వతికి జవజీవాలను అందిస్తున్నారు.

ఈమెకు 1961లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1970లో సంగీత కళానిధి, 1971లో సంగీత నాటక అడాడమీ అవార్డు, 1971లో పద్మభూషణ్, 1978లో సంగీత కళాశిఖామణి, 1992లో సంగీత అకాడమీ ఫెలోషిప్, 1998లో పద్మవిభూషణ్ లభించాయి.

75 సంవత్సరాల సుదీర్ఘ సంగీతయానం అనంతరం 2009 జూలై 16వ తేదీన చెన్నైలో మరణించారు.

‘కచేరీల కోసం, కాసుల కోసం కళని నేర్చుకోవద్దు. కళని కళకోసమే నేర్చుకోమని; భావానికి ప్రాధాన్యతనిస్తూ, ఆత్మతో అనుసంధానం చేసుకుంటూ పాడ’మని శిష్యులకి చెప్పేవారు.

2014 సెప్టెంబర్ 3 వ తేదీన ఈమె జ్ఞాపకార్థం 5 రూపాయల విలువతో ఈమె స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

జూలై 16వ తేదీ ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here