దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార తొలి స్వీకర్త దేవికా రాణి రోరిచ్

5
10

[dropcap]మా[/dropcap]ర్చి 9వ తేదీ దేవికా రాణి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

అపురూపం, అద్భుతం, అద్వితీయ అందం ఆమెది. ఆడపిల్లలు సినిమాలలో నటించడం తప్పు అని భావించే రోజులలోనే సినిమాలలో నటించిన ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా’ ఆమె.

భారతీయ సినిమాలో మెరిసిన తొలివేగుచుక్క ఆమె. తొలి సినిమా నటి, నిర్మాత్రి, స్టూడియో అధినేత్రి. లండన్ వెళ్ళి ఆర్కిటెక్చర్, టెక్స్‌టైల్స్, డెకరేషన్ ఇంజనీరింగ్‌లో శిక్షణ పొందారామె. సినిమా నటన, నిర్మాణం, డిజైనింగ్, మేకప్ మొదలయిన శాఖలలో శిక్షణ పొందిన తొలి భారతీయ మహిళ.

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కాని 1933 లోనే ‘భారత్ – ఆంగ్లో – జర్మన్’ చిత్రంలో భర్త హిమాంశురాయ్‌తో కలిసి నటించి, ముద్దు సీన్లో (సందర్బోచితంగా) నటించి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ మహిళ కూడా! ఈమె సినిమాలు రాసి తక్కువైనా వాసికెక్కాయి. నటించి, జీవించి మెప్పించిన పాత్రలన్నీ ఈ నాటికీ సజీవంగా నిలిచాయి. వైవిధ్య భరితంగా వెలుగొందుతున్నాయి.

మన భారతీయ సినిమా పరిశ్రమలో ఈమెది ఒక ప్రత్యేక స్థానం. అనేక రికార్డులు ఈమె స్వంతం. ఈమె స్టూడియో ద్వారా సినిమా నటీనటులు, టెక్నీషియన్లుగా ఎదిగి విజయ ఢంకాని మ్రోగించిన వారెందరో?

తొలి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూరు సమీప బంధువు, భారతీయ సినిమాకు తొలి మహిళ, సంచలన నటీమణి పద్మశ్రీ దేవికా రాణి రోరిచ్.

ఈమె 1908 మార్చి 30వ తేదీన నాటి మద్రాసు ప్రెసిడెన్సీ, నేటి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు లీలా చౌధురి, కల్నల్ మన్మథ్‌నాథ్ చౌధురిలు. వీరు నోబెల్ బహుమతి గ్రహీత, గురుదేవ్ రవీంద్రునికి దగ్గరి బంధువులు, విద్యావంతులకు నిలయమైన సంపన్న జమీందారీ కుటుంబం వీరిది. భారతదేశంలోను, మద్రాసు ప్రెసిడెన్సీలోను తొలి సర్జన్ జనరల్ కల్నల్ చౌధురి.

8 ఏళ్ళ వరకు బాల్యపు విద్యాభ్యాసాన్ని శాంతినికేతన్‌లో సాగించారు. 9 ఏళ్ళ వయస్సులోనే ఇంగ్లాండ్ వెళ్ళి బోర్డింగ్ పాఠశాలలో చదువుకున్నారు. 1920 నాటికి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత పలు వృత్తిపరమైన అంశాలను అభ్యసించడం కోసం పూనుకున్నారు.

ఎలిజబెత్ ఆర్డెన్‌లో ఆర్కిటెక్చర్, టెక్స్‌టైల్స్, డెకర్ డిజైన్ కోర్సులలో అద్భుతంగా శిక్షణ పొందారు. తను ఎన్నుకున్న అంశాలలో అత్యుత్తమ నైపుణ్యాన్ని సంపాదించారు.

రాయల్ అకాడమీ ఆఫ్ డ్రైమొటిక్ ఆర్ట్స్, రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్‌లో చేరారు. వివిధ కళలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని, నైపుణ్యతను సంపాదించారు. ఇవే తరువాత కాలంలో సినిమా రంగంలోని వివిధ రంగాలలో ఈమెని అత్యున్నత స్థాయిలో నిలిపాయి.

ఈమె సినిమా రంగ ప్రవేశం అంత తేలికగా జరగలేదు. కఠిన శ్రమ, నిబద్దత, పరిశీలనా శక్తి, వినయ విధేయతలు ఆమెను ఎదిగేలా చేశాయి. ఈ నేపథ్యాన్ని ఒకసారి అవలోకీస్తే!

ఈమె జర్మనీలో సినిమా నిర్మాణ రంగంలోని అనేక అంశాలను అధ్యయనం చేశారు. జర్మనీకి చెందిన G.W. పాబ్ట్స్, ఫ్రిట్జ్‌లాంగ్ వంటి వారి పనితనాన్ని అవగాహన చేసుకున్నారు. బెర్లిన్ లోని యూనివర్సల్ ఫిల్మ్ (B.U.F) స్టూడియోలో లఘుచిత్రాల తయారీ కోర్సులో శిక్షణను తీసుకున్నారు. ఇంకా చిత్ర నిర్మాణం, నటనలలో శిక్షణను పొందారు. ఇక్కడ దేవికా రాణి, హిమాంశురాయ్‌లు కలిసి ఒక నాటకంలో నటించారు. అంతేకాదు ఆమె ఆస్ట్రియాకు చెందిన దర్శకులు మాక్స్ రీన్ హార్డ్ దగ్గర కూడా శిక్షణను పొందారు. ఆ రోజులోనే స్టిట్జర్లాండ్, యూరోపియన్ దేశాలలో ఈమెకి మంచి అభిమానులు ఉండడం చాలా గొప్ప విషయం. ఒక మహిళ సుమారు 90 సంవత్సరాల క్రితం ఇతర దేశాలకు వెళ్ళి సినిమా గురించి కృషి చేయడం భారతీయులకి గర్వకారణం. ఇప్పటి వారు ఈమెను స్పూర్తిగా తీసుకోవలసిన అవసరముంది.

మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో కూడా శిక్షణ తీసుకున్నారు. వివిధ విభాగాలలో అత్యుత్తమ శిక్షణను పొందారు. ఈ శిక్షణ తరువాత కాలంలో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత స్టూడియో నిర్వహణలోను, సినిమా నటనలోను, నిర్మాణ బాధ్యతలను నిర్వహించడంలోను ఉనయోగపడిందామెకు.

1928లో హిమాంశురాయ్‌తో పరిచయం ప్రేమగా మారింది. 1929లో వీరిద్దరి పెళ్ళి జరిగింది. ‘ఏ త్రో ఆఫ్ డైస్’ అనే మూకీ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఈమె ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో సహాయకురాలిగా పని చేశారు.

1933లో హిమాంశురాయ్‌తో కలిసి ‘కర్మ’ సినిమాలో నటించారు. ఇది భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ దేశాలకు చెందిన వ్యక్తుల సంయుక్త నిర్మాణం. ఈ సినిమాలోని ముద్దు ఇప్పటికీ రికార్డేనట. ఆంగ్లం, హిందీ భాషలతో కూడిన ఒక ద్విభాషాగీతం ఈ చిత్రంలో రికార్డు సృష్టించింది. బాలీవుడ్ సినిమాలలో తొలి ఇంగ్లీషు పాటగా కూడా చరిత్రలో నిలిచింది. బ్రిటిష్ రాజకుటుంబీకుల కోసం విండర్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. లండన్‌లో రివ్యూ షోలను వేశారు. సినిమా విజయవంతం అయింది.

బురద్వాన్ మహారాణి సుధారాణి కూడా ఈ సినిమాలో వీరితో కలిసి నటించారు. కొన్ని విమర్శలు ఎదురయినా భారత దేశ సినిమా చరిత్రలో పలు రికార్డులను సృష్టించింది ఈ సినిమా.

ఈ సినిమా షూటింగ్ లండన్‌లోని స్టోల్ స్టూడియోలో జరిగింది. లొకేషన్ షూటింగ్ భారత దేశంలో జరిగింది.

1934వ సంవత్సరంలో హిమాంశురాయ్, రాజనారాయణ్ దూబేలతో కలిసి బాంబే టాకీస్ స్టూడియోని స్థాపించారు. అనేక మంది కళాకారులను నటీనటులుగా, టెక్నీషియన్లుగా, సినిమా నిర్మాణంలోని అనేక విభాగాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించే రీతిలో శిక్షణను అందించారు.

1935 సంవత్సరంలో స్టూడియో వారి తొలి సినిమాగా హిమాంశురాయ్ ‘జవానీ కీ హవా’ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో దేవికారాణి సరసన నజ్మ్-ఉల్-హసన్ నాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయాన్ని సాధించింది. ఇదే జంటతో ‘జీవన్ నయా’ చిత్రాన్ని మొదలు పెట్టారు. అనివార్య కారణాల మూలంగా నిర్మాణం ఆగిపోయింది. అయితే మధ్యలో అపుడు పునర్నించారు. హీరో నజ్మ్-ఉల్-హసన్ స్థానంలో అశోక్ కుమార్ నాయకుడుగా ఎంపిక చేయబడ్డారు. ఈ సినిమా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా చరిత్రని సృష్టించింది.

ఆ తరువాత ఈమె, అశోక్ కుమార్ కలిసి నటించిన సినిమాలు విజయవంతమయ్యాయి. వీరిద్దరు బాలీవుడ్ సినిమా చరిత్రలో హిట్ పెయిర్‌గా నిలిచారు.

అఛూత్ కన్య (1936), ఇజ్జత్, జీవన్ ప్రభాత్ (1937), నిర్మల(1938), వచన్(1938), దుర్గ(1939), అంజాన్(1941), బసంత్ (1943), కిస్మత్(1943), హమారీబాత్ (1943) మొదలయిన సినిమాలలో ఈమె విలక్షణ పాత్రలలో వైవిధ్యపు నటనను ప్రదర్శించారు.

1936వ సంవత్సరములో దేవికారాణి, అశోక్ కుమార్‌లు జంటగా ‘అఛూత్ కన్య’ సినిమాను నటించారు. మనదేశపు కుల వ్యవస్థలోని లోపాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రమది. ఈమె ఈ సినిమాలో అంటరాని మహిళగా జీవించారు. అశోక్ కుమార్ బ్రాహ్మణ యువకుడు. దళిత యువతిని ప్రేమించిన ఈ సినిమా హిందీ చిత్ర పరిశ్రమలో తొలిరోజుల్లోని బ్లాక్ బస్టర్ సినిమాగా రికార్డును సృష్టించింది. ఈ జంట ఆ తరువాత జన్మభూమి, ఇజ్జత్, సావిత్రి, వచన్, నిర్మల, అంజాన్ మొదలైన సినిమాలలో నటించారు.

‘జీవన్ ప్రభాత్’లో వివాహేతర సంబంధమున్న మహిళ పాత్రలో నటించారు. మధ్యయుగంలో పరస్పరం శత్రువులయిన మరాఠ రాజ కుటుంబాలకు చెందిన ప్రేమికులుగా నటించారు ‘ఇజ్జత్’ అనే సినిమాలో.

పిల్లలు లేని స్త్రీలు అనుభవించే బాధలను కళ్ళకు కట్టినట్లు చిత్రించిన పాత్రలో ‘నిర్మల’ సినిమాలో నటించారు.

‘వచన్’ సినిమాలో రాజపుత్ర రాణిగా రాణించారు. ఈ విధంగా విభిన్న కాలాలకు చెందిన మహిళల పాత్రలలో నటించి స్వర్ణయుగపు తొలి హిందీ సినిమాలను సుసంపన్నం చేశారీమె.

ఈమె నటించిన చిత్రాలన్నీ మహిళా కేంద్రీకృత పాత్రలతో నిర్మించబడడం ఒక విశేషం.

1940లో హిమాంశురాయ్ మరణించారు. దేవికా రాణి స్టూడియో నిర్వహణా బాధ్యతలను స్వీకరించారు. ఆ తరువాత బసంత్, కిస్మత్, హమారీ బాత్ వంటి సినిమాలను నిర్మించారు.

1945లో సూడియో భాగస్థులలో అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిలో దేవికా రాణి అపనిందలను భరించవలసి వచ్చింది. ఆమె మానసికంగా క్రుంగి పోయారు.

ఈ సమయంలో రష్యన్ చిత్రకారుడు స్వెటో స్లావ్ రోరిచ్ పరిచయమయ్యారు. ఇతని చిత్రాలను ఈమె ఆస్వాదించేవారు. ఆమె అతని సమక్షంలో సాంత్వనను పొందగలిగారు. ఈ పరిచయం పరిణయంగా మారింది. ఈమె రోరిచ్‌ను పెళ్ళి చేసుకుని దేవికా రాణి రోరిచ్ మారారు. ఈమె స్టూడియో బరువు బాధ్యతలను, బంధనాలను తెంచుకున్నారు.

భర్తతో కలిసి బెంగుళూరు ఫార్మ్ హౌస్‌ను చేరుకున్నారు. 450 ఎకరాల వీరి స్వంత ఎస్టేటులో వ్యాపార లావాదేవీలను చూసుకునేవారు. వన్యప్రాణులను గురించి కొన్ని లఘుచిత్రాలను నిర్మించారు.

ఈమె 45 సంవత్సరాల పాటు ప్రశాంతంగా జీవించారు. 1990వ సంవత్సరంలో మార్చి 9వ తేదీన ఈమె బెంగుళూరులో బ్రాంకైటిస్ వ్యాధితో మరణించినారు. వీరికి సంతానం కలగలేదు. లఘుచిత్రాలు, వీరి ఆస్తులన్నీ కర్ణాటక ప్రభుత్వానికి చెందాయి.

ఈమెని ‘అందమైన ప్రతిభావంతులైన లిటిల్ లేడీ’ అని శ్రీమతి సరోజిని నాయుడు ప్రశంసించారు.

బాలీవుడ్ లో స్వర్ణయుగపు నటీనటులు, 24 విభాగాల టెక్నీషియన్లు సుమారు 280 మంది దాకా దేవికా రాణి, హిమాంశురాయ్‌ల బోంబే టాకీస్ స్టూడియో అనే బడి నుండి రావడం జరిగింది. మెహననాధ్ అలీ, అశోక్ కుమార్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, అమియా చక్రవర్తి, ఫ్రాంజ్ ఓస్టెన్, N.R. ఆచార్య, నజం ఖల్వీ, జ్ఞాన్ ముఖర్జీ, జె. ఎస్. కాస్యప్, హంసావాడ్కర్, కిషోర్ షాహు, జైరాజ్, లీలా చిట్నీస్, మధుబాల, కామినీ కౌశల్, ముంతాజ్ శాంతి, రామశకుల్, మాయాదేవి మొదలయిన వారందరూ ఈమె స్కూల్ వారే.

నర్గీస్ దత్, మధుబాల, మీనా కుమారి వంటి బాల నటులకు అసలు పేర్లకు బదులు వెండితెర నామాలతో నామకరణం చేశారీమె.

ఐరోపా దేశాల నుండి సినిమా నిర్మాణ నైపుణ్యాలను అభ్యసించి, స్వదేశంలో సినిమా నిర్మాణాన్ని సుసంపన్నం చేసి ‘Pillar of the Indian cinema’ గా పేరు పొందారీమె.

ఒకటి రెండు సినిమాలతోనే సూపర్ స్టార్లు, లెజండరీ దర్శకులు, టెక్నీషియన్లం అని గర్వంగా తలలు ఎగరేసేవారు ఈమె జీవితాన్ని, సినిమా రంగానికి ఈమె అందించిన సేవలను గుర్తుంచుకోవాలి. అంతేకాదు – విలువలు మారుతున్న సమయంలో, వేధింపులకు గురైన సమయంలో సినిమా రంగం నుంచి మౌనంగా నిష్క్రమించి గౌరవాన్ని నిలుపుకున్న ధీర నటీమణి ఆమె.

ఈమె భారతీయ గ్రేటాగార్బోగా పేరుపొందారు.

ఈమెకు 1958లో ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించి గౌరవించింది భారత ప్రభుత్వం.

‘ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సినిమా’ దాదా సాహెబ్ ఫాల్కే పేరిట ఇచ్చే పురస్కారాన్ని తొలిసారిగా ఈమెకి అందించింది భారత ప్రభుత్వం. ఇలా భారతీయ సినిమా ప్రథమ గొప్ప మహిళగా ఈమెని గుర్తించి గౌరవించింది.

ఈమె జ్ఞాపకార్థం ది. 13-02-2011వ తేదీన ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

ఈ స్టాంపును ఒంటరి స్టాంపుగా విడుదల చేయలేదు. ఆరుగురు భారతీయ సినిమా నటీమణుల స్టాంపులను ‘Legendary Heroines Of India’ శీర్షికతో విడుదల చేసి గౌరవించారు. ఈ సెట్‌లో ఈమెతో పాటు నూతన్, కానన్ దేవి, సావిత్రి, మీనా కుమారి, లీలా నాయుడుల చిత్రాలను ముద్రించారు.

వీరిలో దేవికా రాణి, లీలా నాయుడు, సావిత్రి తెలుగు మూలాలున్న వారు కావడం తెలుగు వారికి గర్వకారణం.

మార్చి 9 వ తేదీ ఈమె వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here