తొలి మహిళా శాసన సభ్యురాలు డా. ముత్తులక్ష్మీ రెడ్డి

11
12

[dropcap]22[/dropcap]-07-2022 డా. ముత్తులక్ష్మీ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

వివిధ రంగాలలో తొలి భారతీయ మరియు తొలి దక్షిణ భారతీయ మహిళ ఆమె. బాలుర కళాశాలలో, మద్రాసు వైద్యకళాశాలలో తొలి విద్యార్థిని, మద్రాసు ప్రభుత్వ వైద్యశాలలో పని చేసిన తొలి వైద్యురాలు, అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ స్థాపకురాలు/బాలురు, మహిళలు, వివిధ రకాలుగా బాధితులయిన మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహిళామూర్తి, సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధురాలు, శాసనమండలి సభ్యురాలైన తొలి భారతీయ మహిళ, బాపూజీ అరెస్టుకు నిరసనగా శాసనమండలి సభ్యత్వాన్ని సునాయాసంగా వదిలిన నిస్వార్థపరురాలు, పేరుపొందిన అడయార్ క్యాన్సర్ హస్పిటల్ రూపశిల్పి, జీవితమంతా నిస్వార్థంగా, సామాజిక సేవకోసం తపించిన మహిళా శిరోమణి స్వర్గీయ డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి.

ఈమె 1886 జూలై 30న చంద్రమ్మాళ్, నారాయణస్వామి అయ్యర్‌ల పుత్రికగా పుదుక్కోటలో జన్మించారు. నాడు మద్రాసు ప్రెసిడెన్సీ, నేటి తమిళనాడులో ఉన్న ప్రదేశమది. నారాయణ స్వామి కాలేజి ప్రిన్సిపాల్. కుమార్తెకు ఆయనే తొలిగురువు. 1902లో మెట్రిక్యులేషన్ చదువు పైవేటుగానే చదివారు. తండ్రి కాలేజి ప్రిన్సిపాల్ కావడం, పుదుక్కోట మహారాజు వీరి కుటుంబ సన్నిహితులు కావడం ఈమె చదువుకి భరోసానిచ్చింది. మహారాజా బాలుర కళాశాలలో ఈమెకి చదువుకునే అవకాశం రావడం చాలా గొప్ప పుదుక్కోట రాజు మార్తాండ భైరవ తొండమాన్ సిఫారసుతో ఇది సంభవించింది. ఆ కళాశాలలో ఏకైక విద్యార్థిని ఈమే! పురుషుల కళాశాలలో సీటు సంపాదించిన తొలి మహిళగా ఇంకొక అవార్డు. 1907 నుండి 1912 వరకు మద్రాసు వైద్యకళాశాలలో చదివి పట్టా పుచ్చుకున్న ఏకైక మహిళా డాక్టర్ కూడా ఈమే!

ఎగ్మోర్ వైద్యకళాశాలలో హౌస్ సర్జన్‌గా పనిచేసిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించారు ఈమె. భారతీయ వైద్యరంగంలో ఈమె పాత్ర అద్వితీయం (ఆ నాటికి) ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన విషయాల పట్ల దృష్టిని కేంద్రీకరించారు.

ఆమె సోదరి క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఈ వ్యాధి బాధితుల కోసం హాస్పిటల్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 1949లో క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. 1952లో మద్రాసు శాసనమండలి యం.యల్.సి.గా పదవిని స్వీకరించమని కోరారు. ఇప్పటి రాజకీయ నాయకులు పదవులంటే దొరికిందే చాలని గెంతులేస్తారు. కాని ఆమె క్యాన్సర్ హాస్పిటల్ కోసం స్థలాన్ని కేటాయించమని కోరి పదవిని స్వీకరించారు. పదవి కంటే ఆశయం ముఖ్యమని నమ్మారావిడ. 1954లో అడయార్‌లో హాస్పటల్‌ను నిర్మించారు.

ఈమె దివ్యజ్ఞాన సమాజ నాయకురాలు, శ్రీమతి అనీబిసెంట్, మార్గరెట్ కజిన్స్‌ల ప్రభావంతో మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మెరుగు పరిచే ప్రయత్నాలకు పూనుకున్నారు. గాంధీజీ, సరోజినీ నాయుడు మొదలయిన జాతీయ నాయకుల ప్రభావంతో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

ఈమె రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే 1927లో మద్రాసు ప్రభుత్వం ఈమెను శాసన సభ్యురాలిగా నియమించారు. దేవదాసీ విధానం రద్దు, బహుభార్వాత్వ వ్యతిరేక బిల్లు, పిల్లల అక్రమ రవాణా నియంత్రణ, బాలలపై హింస నియంత్రణ, మహిళల వివాహ వయస్సును పెంచడం మొదలయిన విషయాలను గురించి బిల్లును ప్రవేశ పెట్టారు. 1930లో బాపూజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో గాంధీజీని అరెస్టు చేశారు. దీనికి నిరసనగా శాసన సభ్యురాలి పదవికి రాజీనామా చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

ఈ సమయంలోనే మహిళలాభివృద్ధికోసం, బాలల కోసం కొన్ని కార్యక్రమాలను చేపట్టారు. Children’s Aid Societyని స్థాపించారు. మొదటి గౌరవ కార్యదర్శిగా అనేక కార్యక్రమాలను రూపొందించారు. అనాథ శరణాలయాలను స్థాపించడం, అక్కడి బాలలకు ఆహారం, బట్టలు, వసతి సౌకర్యాలను సమకూర్చడం వీటిలో కొన్ని. బాల బాలికల అభివృద్ధి కోసం వృత్తి విద్యాపాఠశాలలను స్థాపించే ఏర్పాట్లు చేశారు. వారికి ఉపాధి కల్పించే కేంద్రాల స్థాపనకు ప్రభుత్వ సహాయం కోసం కృషి చేశారు.

1926లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా కాంగ్రెస్‌లో ప్రతినిధిగా పాల్గొన్నారు. ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా మొదలయిన దేశాలను పర్యటించారు. భారతీయ మహిళల ఓటు హక్కు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. 1931లో అఖిల భారత మహిళల సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహిళల సమస్యలను గురించి ప్రస్తావించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సదస్సులలో కూడా పాల్గొనేవారు. 1930లో లాహోర్‌లో జరిగిన 5వ అఖిల భారత మహిళా సదస్సులో కూడా భారత ప్రతినిధిగా పాల్గొన్నారు.

‘విమెన్స్ ఇండియా అసోసియేషన్’లో ఈమె నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది. 1931 నుండి 1940 వరకు ‘స్త్రీధర్మ’ పత్రికా నిర్వహణా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. భారతీయ మహిళలకు సంబంధించిన అంశాలు ఈ పత్రికలలో ప్రస్తావించారు. ప్రజలను ముఖ్యంగా ఈ పత్రిక ద్వారా జాగృత పరిచారు. ఈ పత్రికను తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషలలో నిర్వహించారు.

అఖిల ఆసియా మహిళల సదస్సుకు 1935 వరకు అధ్యక్షత వహించారు. ఆ సదస్సులో వివిధ దేశాలకు చెందిన మహిళల సమస్యలను గురించి అవగాహన చేసుకున్నారు.

1937లో మద్రాసు కార్పోరేషన్ లో మొదటి Alder Woman గా పనిచేశారు.

మహిళా సంక్షేమం కోసం ఈమె కృషి చేశారు. అనాథలు, పనిచేసే మహిళల కోసం వసతి గృహాల ఏర్పాటు, బాలికలకు విద్యనిమిత్తం స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయించడం, బాధిత మహిళలకు రక్షణ కల్పించడం మొదలయిన అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. రాజకీయ హక్కులయిన ఓటు హక్కు, రాజకీయ హక్కులు, కల్పించడం కోసం మహిళా సంఘాలతో ఉద్యమించి విజయం సాధించారు.

1954లో మద్రాసు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సలహా బోర్డ్‌కి తొలి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

ఈమె 1954లో అడయార్‌లో ప్రారంభించిన అడయార్ క్యాన్సర్ హాస్పటల్ ఇపుడు దేశంలోని ప్రముఖ కాన్సర్ హాస్పటల్స్‌లో ఒకటిగా వెలుగొందుతూంది.

ఈమె భర్త సురేంద్ర రెడ్డి కూడా వైద్యులే కావడం వీరు వైద్యరంగంలో సేవలందించడానికి దోహదపడింది.

కస్తూర్బా వైద్యశాలలో ఈమె కోరిక మీద బాలలు, మహిళల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. శిశువుల కోసం కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయించడంలో కృతకృత్యులయ్యారు.

ముస్లిం బాలికలకు ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేయించి వారి మనసులనూ గెలుచుకున్నారు. వ్యభిచారిణులను వృత్తి వేధింపుల నుండి రక్షించి, ప్రత్యేక వసతి గృహాలలో వసతిని కల్పించిన మానవతామూర్తి.

‘హార్టోగ్ కమిటీ’లో ఈమె ఏకైక మహిళా సభ్యురాలు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి మహిళాభివృద్ధి పరిస్థితులను పరిశీలించింది. తరువాత అనుసరించవలసిన విధానాలను గురించి దిశానిర్దేశం చేసేవారు.

ఈ విధంగా బాలలు, అణగారిన వర్గాల మహిళలు, క్యాన్సర్ వ్యాధి బాధితుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం కృషి చేసి మనదేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు.

1968 జూలై 22వ తేదీన మద్రాసులో ఈమె వృద్ధాప్య కారణంగా మరణించారు. మరణించేవరకు ఆరోగ్యంగా జీవించారు.

1930లో ‘MY EXPERIENCE AS A LEGISLATOR” పేరుతో మొదటి సారి, 1965లో ‘A PIONEER WOMEN LEGISLATOR’ పేరుతో ఆత్మకథ గ్రంథస్థం చేసి తరువాత తరాలకు స్ఫూర్తిని అందజేశారు.

30-03-1986 న విడుదల అయిన పోస్టల్ కవర్

1956లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. జూలై 22వ తేదీ ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here