మంటోతో మమేకమైన డా. నరేంద్ర మోహన్

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ హిందీ కవి, నాటకకర్త డా. నరేంద్ర మోహన్ గారికి ఈ వ్యాసం ద్వారా నివాళి అర్పిస్తున్నారు డా. వసంత టి.సి. [/box]

[dropcap]డా.[/dropcap] నరేంద్ర మోహన్ గారు (1937-2021) హిందీ సాహిత్యానికి తలమానికం. 30-7-1937 నాడు లాహోర్‌లో పుట్టిన డా. నరేంద్ర మోహన్ సాహిత్యవనంలో ఒక వటవృక్షం. వీరు బహుముఖ ప్రతిభావంతులు. వీరికి కాగితం-కలంతో అవినాభావ సంబంధం ఉంది. చివరి శ్వాస వరకు వీరు సాహిత్య కృషి చేస్తూనే ఉన్నారు. వీరి కలం నుండి ఎన్నో కవితా సంకలనాలు, నాటకాలు, డైరీలు, సంస్మరణ, జీవితచరిత్ర, ఆత్మకథ మొదలైన ఆణిముత్యాలు వెలువడ్డాయి. కవితా సంకలనాలు – ఇస్ హద్సే మే (1975), సామ్‌నా హోనే పర్ (1979), ఏక్ అగ్నికాండ్ జగహేం బదల్‍తా (1983), హథేలీ పర్ అంగారే కీ తరహ్ (1990), సంకట్ దృశ్య్ కా నహీఁ (1993), ఏక్ ఖిడికీ ఖులీ హై అభీ (2006), నీలే ఘోడే కా సవార్ (2008), రంగ్ ఆకాశ్ మే శబ్ద్ (2011), షర్మిలా ఇరేమ్ తథా అన్య కవితాయేం (2014), రంగ్ దే శబ్ద్ (2015), మృత్యూ సే కవితా (2016). నాటకాలు – కహే కబీర్ సోనో భాయ్ సాధో (1988), సీంగ్‌ధారీ (1988), కలందర్ (1991), నో మాన్స్ ల్యాండ్ (1994), అభంగ్-గాథా (2000), మిస్టర్ జిన్నా (2005), హద్ హో గయీ, యారోం (2010), మంచ్ అంధేరీ మే (2010), మాలిక్ అంబర్ (2012). డైరీలు – సాథ్ సాథ్ మేరా సాయా (2002), సాయే సే అలగ్ (2010). సంస్మరణ – ఫ్రేమ్ సే బాహర్ ఆతీ తస్వీరేం. జీవిత చరిత్ర – మంటో జిందా హై (2012). ఆత్మకథ – కంబఖ్త్ నిందర్ (2013), హ్యా హాల్ సునావాం (2015). సంపాదకత్వం – విభజన్: భారతీయ భాషావోంకీ కహానియాఁ, మంటో కీ కహానియాఁ, మంటో కా నాటక్, నరేంద్ర మోహన్ రచనావళి 12 భాగాలు. వీరి రచనలు వివిధ భారతీయ భాషలలో, ఇంగ్లీషులో అనువాదం అయ్యాయి. వీరికి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రీయ సన్మానాలు, పురస్కారాలు లభించాయి.

శ్రీ నరేంద్ర మోహన్ గారితో చాలా కాలం నుండి నాకు పరిచయం ఉంది. నేను వారి ‘మంటో జిందా హై’ జీవితచరిత్రని తెలుగులోకి ‘మంటో జీవిత చరిత్ర’ అన్న పేరున తెలుగులోకి అనువదించాను. ఛాయా రిసోర్సెస్ సెంటర్, హైదరాబాద్ 2020లో ప్రచురించారు.

జీవిత చరిత్ర ప్రారంభం – కుండ లోని సాగరంలా అనిపిస్తుంది.

***

ఆ మధ్య నేను జీవిత చరిత్ర రాస్తూ ఉంటే ఒక స్నేహితుడు హఠాత్తుగా నా గదిలోకి గబాగబా అడుగులు వేసుకుంటూ వచ్చాడు.

“ఏం చేస్తున్నావు?”

“మంటో బయోగ్రఫీ – జీవిత చరిత్ర రాస్తున్నాను.”

“ఉర్దూలో అశ్లీలమైన రాతలు రాసేవాడు, తాగుబోతు. ఆయన జీవిత చరిత్రా? నీకేమైనా మతిపోయిందా?”

“ఏమో! నాకెందుకో తెలియదు కాని అతడికి నాకు మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది.”

“అవును, సంబంధం ఎందుకు ఉండదు? నువ్వు అమృతసర్‍కి చెందినవాడివి. ఆయనా అంతే. నువ్వు లాహోర్ వాడివి. ఆయన అంతే…” అంటూ వ్యంగ్యంగా కిలకిలా నవ్వాడు.

“నువ్వు అనవసరంగా ఏవేవో ఊహిస్తున్నావు. నేను ఒక రచయితను. ఆయన ఒక రచయితే. రచయితకి రచయితకి మధ్య ఉండే బంధం మాది.”

నేను మాటను మార్చాను. “గాలీబ్ గురించి తెలుసా?”

“ఆ… కవేగా! తెలుసు.”

“గాలీబ్‌కి మంటోకి మధ్య ఎన్నో సమానతలు ఉన్నాయి తెలుసా?”

***

నేను మంటో జీవిత చరిత్రను అనువాదం చేసేటప్పుడు ఎన్నోసార్లు ఫోనులో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎంతో ఓపికగా నాకు కొన్ని ఉర్దూ పదాల అర్థాలను చెప్పేవారు. వారు అనువాద ప్రతిని చూసి ఎంతో సంతోషించారు. “వసంతా! మీరు నన్ను తెలుగు వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. కృతజ్ఞుడిని” అని అంటూ ఉండేవారు. నేను వారి కన్నా వయస్సులో చిన్నదాన్ని, వారికి ఉన్న జ్ఞానం నాకెక్కడ ఉంది. అయినా వారు నా సాహిత్య కృషిని వేనోళ్ళ పొగిడేవారు. “ఇంకా ఎన్నెన్నో రచనలు నీ కలం నుండి రావాలి” అని అనేవారు.

దాదాపు 20 సంవత్సరాల క్రితం మేము ఔరంగాబాద్‍లో ఉన్నప్పుడు మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చారు. తెలుగు వాళ్ళ భోజనం ఎంతో పౌష్టికం, బాగుంటుంది అని తినేవారు. మా శ్రీవారు కామేశ్వర సోమయాజి గారితో రచయితల గురించి, రచనల గురించి చర్చిస్తూ ఉండేవారు. ఆ సమయంలో నేనూ, మా శ్రీవారు మన గుడిపాటి వెంకట చలం గురించి చెబుతూ ఉండేవాళ్లము. ఆయన చాలా ఉత్సాహంగా వినేవారు. అసలు ఇటువంటి రచయిత ఆంధ్రలో ఉన్నారని హిందీ వాళ్ళకి తెలియనే తెలియదు అని అన్నారు. నేను చలం గారి జీవిత చరిత్ర ‘రమణీ సే రమణాశ్రమ్ తక్’ (హిందీ) రాస్తున్నప్పుడు కొన్ని అంశాలు చదివి వినిపించేదాన్ని. ఇదంతా వారి డైరీలో రాసుకున్నారు. నేను దానిని తెలుగులో అనువదించాను. ‘చలనం’ పత్రిక వాళ్ళు వేసుకున్నారు.

శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారి ‘మాధవి’ నాటకాన్ని నేను హిందీలోకి అనువదించాను. దీనికి నరేంద్ర మోహన్ గారే ‘ఏక్ ఔర్ మాధవీ!’ అన్న పేరు సూచించారు. దీనికి ముందుమాట రాసారు.

చలం గారి ‘బ్రాహ్మణీకం’ -హిందీలో ‘నయానీడ్’ (అనువాదం హేమలత) అన్న పేరన ప్రచురితం అయింది. ‘నయానీడ్’ అన్న పేరును నేను సూచించాను. మోహన్ గారికి ఎంతో నచ్చింది. నేను అడగగానే దీనికి ముందుమాట రాసారు.

ఔరంగాబాద్ నుండి డా. అరుణా లోఖండే, డా. మంగళా వైష్ణవ్, డా. రాజ్‌కుమర్ గడ్‌కర్ ఫోన్ చేసినప్పుడు వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. మోహన్ గారి స్నేహితుడు డా. లక్ష్మీరెడ్డి గారు, డా. మాణిక్యాంబ గారు మోహన్ గారి కొన్ని రచనలని తెలుగులోకి అనువదించారు. నాతో ఫోన్‍లో మాట్లాడారు. మోహన్ గారు ఇక లేరు అన్న విషయం చెప్పి చాలా బాధ పడ్డారు.

‘మంటో జీవిత చరిత్ర’, ‘ఏక్ ఔర్ మాధవీ’ హైదరాబాద్‍లో పుస్తకావిష్కరణ చేద్దాం అని అన్నారు. ఆ తరువాత వారి ఆరోగ్యం బాగాలేక ఇదంతా ఆగిపోయింది. నేను ఎంతో బాధ పడుతున్నాను. నరేంద్ర మోహన్ గారూ, మీ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మీరు ‘కొండెక్కని దీపం’గా నిలిచిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here