లెదర్ శాస్త్రవేత్త – విశ్వవిఖ్యాత సాంకేతికవేత్త – పద్మశ్రీ డా. నాయుడమ్మ

0
8

[10 సెప్టెంబర్ ప్రముఖ శాస్త్రవేత్త డా. యలవర్తి నాయుడమ్మ గారి జయంతి సందర్భంగా ఈ రచనని అందిస్తున్నారు శ్రీమతి దాసరి శివకుమారి.]

[dropcap]ప్[/dropcap]రాచీన కాలం నుండి భారతదేశంలో అనేక మంది శాస్త్రవేత్తలు జన్మించారు. వారు తమ పరిశోధనల ద్వారా ఎన్నో నూతన విషయాలను కనుగొన్నారు. దేశ విదేశాలకు ఎంతో విజ్ఞానాన్ని అందించారు. ఇటీవలి కాలంలో యలవర్తి నాయుడమ్మ గారు తమ కృషి ద్వారా ఎన్నో సేవలను అందించారు. వారు సెప్టెంబరు 10న 1922వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం, యలవర్రులో జన్మించారు. తల్లిదండ్రులు అంజయ్య, రాఘువమ్మగారలు. వీరు 5వ తరగతి వరకు స్వగ్రామంలోనూ ఆ తర్వాత, తురుమెళ్ల పాఠశాలకు రోజూ 5 మైళ్లు నడుచుకుటూ వెళ్లి ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ పాఠశాలను తన యూనివర్శిటీ అని ఎంతో మురిపెంగా, భక్తిగా చెప్పుకునేవారు. అటు పిమ్మట ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్మీడియట్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివి 1942లో ‘ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ’లో డిగ్రీ సంపాదించారు. తర్వాత మద్రాసులో ‘లా’ కోర్సులో చేరారు. కాని అది మానివేసి అక్కడే వున్న లెదర్ టెక్నాలజీ సంస్థలో కెమిస్ట్రీ డిమాన్‌స్ట్రేటర్‌గా చేరారు. 1945లో సీతాదేవి గారిని వివాహమాడారు. తాను లండన్ లోని ‘లెదర్ సెల్లర్స్ టెక్నికల్ కాలేజీ’కి ట్రైనింగుకు వెళుతూ భార్యను కూడా ఆంధ్ర మహిళా సభ హాస్టల్లో చదువు కోసం చేర్పించారు. లండన్ లోని శిక్షణ వీరికి ఆచరణకు ఉపయోగపడదని నాయుడమ్మ భావించారు. వెంటనే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అమెరికాలోని ‘లీహాయ్’ విశ్వవిద్యాలయానికి వెళ్లి, యమ్మెస్ పూర్తి చేశారు. అక్కడే ప్రఖ్యాత ఫ్రొఫెసర్ అయిన ‘ఎడ్విన్ రేథయిస్’ వద్ద పి.హెచ్.డి పూర్తి చేశారు. మరింత అధ్యయనం కోసం ‘బోస్టన్ ’ లోని ‘ప్రెరెపింగ్’ కంపెనీలోను, ఆ తర్వాత ‘మిన్నెసోటా’లోని ‘ఎస్.బి. ఫుట్ ట్యానింగ్ ’ కంపెనీలోను పని చేసి ఎంతో అనుభవాన్ని గడించారు. అలా ఆరేళ్ల తర్వాత పూర్తి స్థాయి ‘తోలు శాస్త్రవేత్త’ గా (లెదర్ సైంటిస్ట్) భారతదేశంలో అడుగు పెట్టారు. అలా ఈ రంగంలో మొదటి పి.హెచ్.డి. కూడా వీరిదే. ఇక్కడికి రాగానే మనదేశంలోని ‘సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (CLRI) లో అసిసెంట్ డైరక్టర్‌గా, ఆ వెనువెంటనే డిప్యూటీ డైరక్టరుగా నియమించబడ్డారు.

ఆ రోజుల్లో చర్మ శుద్ధికి నాటు పద్ధతులు వాడేవారు. వారికి సమాజంలో తగిన గౌరవము లేదు. వారికి గౌరవం పెంచాలి. పైగా వారికి రసాయనిక పదార్ధాల వాడకాన్ని తెలియజెయ్యాలని వీరు అనుక్షణం తపించేవారు. తన తీరిక సమయాలలో మద్రాసు విశ్వవిద్యాలయ విద్యార్థులకు లెదర్ టెక్నాలజీ బోధిస్తూ 1956లో వీరు గౌరవ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.

అప్పటి భారత ప్రధాని నెహ్రూజీ, వారికి శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల నమ్మకం ఎక్కువ. వారి దృష్టిలో నాయుడమ్మగారు పడ్డారు. వెంటనే వారిని పిలిపించారు. “మిమ్మల్నిCLRI డైరెక్టర్‌ని చేస్తే తోలు పరిశ్రమను ఎలా అభివృద్ధి చేస్తారు?” అని ప్రశ్నించారు.

“తోలు పరిశ్రమ గ్రామాల్లో ఇప్పటికీ కుటీర పరిశ్రమగానే వున్నది. వారనుసరిస్తున్న పద్ధతులకు సాంకేతికత జోడించి, రసాయనిక పదార్ధాలు వాడేటట్లు చూస్తాను. యంత్రాల సహాయంతో వారు పని చేస్తే ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయని చెప్తాను. మన CLRI ప్రయోగశాలలో ఈ తోలు పరిశ్రమ అభివృద్ధి చెందే పరిశోధనలు చేయిస్తాను” అని చెప్పగనే నెహ్రూజీ సంతోషపడ్డారు. CLRI కి నాయుడమ్మగారిని డైరక్టెర్‌ని చేశారు. అన్నమాట ప్రకారం నాయుడమ్మగారు ప్రపంచంలో అతి పెద్ద తోలు పరిశోధనా సంస్థగా CLRI ని తీర్చిదిద్దారు. 1958లో నెహ్రూజీ ఈ సంస్థ కొచ్చినప్పుడు సువాసన భరితమైన తోలు గులాబీల గుచ్ఛంతో ఆహ్వానం పలికారు.

తోటి ఉద్యోగులకు, పరిశోధనా విద్యార్ధులకు ఎన్నో సలహాలనిస్తూ సమయపాలన పాటించమనీ సూచించేవారు. అదే సంవత్సరం వీరు ఈ సంస్థకు రెగ్యులర్ డైరక్టర్ అయ్యారు. ఎన్నో నూతన పధకాలుకు శ్రీకారం చుట్టారు. అందులో ఒకటి ‘లాభం మీది నష్టం మాది’. దీనిలో భాగంగా చర్మకారులు ముడి తోళ్లను విస్తరణ కేంద్రాలకు తెస్తే, వాటిని రసాయనాలతో, యంత్రాలతో, చదును చేసి ఇచ్చేవారు. వాటి వాడకం వలన చర్మకారులకు నష్టమొస్తే కంపెనీకి, లాభమొస్తే చర్మకారులకే. ఇక్కడ చర్మకారులకు అంతా లాభమే కలిగింది. వారికి టెక్నాలజీ పట్ల విశ్వాసం కలిగింది.

మరోకటి ఏంటంటే నష్టాలలో నడుస్తున్న చర్మ శుద్ధి కేంద్రాలను ట్యానరీలను గుర్తించి, శాస్త్రవేత్తలను అక్కడికి పంపించేవారు. వారు వెళ్లి అక్కడ అవసరమైన టెక్నాలజీని ప్రవేశపెట్టి ఆ కేంద్రాలను లాభాల బాట పట్టించేవారు. మరో పధకం ‘గెస్ట్ ట్యానర్’. దీంట్లో భాగంగా ఒక శాస్త్రవేత్త CLRI లో జరిగే పరిశోధనలును గమనించి ఏదైనా సమస్య వస్తే దానిని అప్పటికప్పుడు తెలుసుకుని దానిని అధిగమించటానికి కొత్త కొత్త పరిశోధనా ప్రణాళిక రూపొందించేవారు. ఇలా చర్మ పరిశోధనను ఆధునీకరించటం సాధ్యమేనని ఈ ‘గెస్ట్ ట్యానర్’ నిరూపించింది.

ఎక్కడా లేని విధంగా CLRI లో పూర్తి స్థాయి ఆర్థిక పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక దశ నుండే నిపుణులను తయారు చేయాలని భావించారు. దాని కోసం 10వ తరగతి చదివిన పిల్లలకు చర్మ ఉత్పత్తుల తయారీలో శిక్షణ కోసం CLRI లో ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇవ్వటం ప్రారంబించారు. కొత్త మెషిన్లను తెప్పించి, ఐక్యరాజ్య సమితి నుండి నిపుణులను పిలిపించి ప్రాక్టికల్ శిక్షణతో సహా ఇప్పించారు. కొత్త కొత్త యూనిట్లు ప్రారంభించిన చోట ఇలా శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు దొరికాయి. మరి కొందరు సొంత యూనిట్లే పెట్టుకున్నారు.

1964లో తోలు ఉత్పత్తుల తొలి వారోత్సవాన్ని ప్రాంభింపచేశారు. లెదర్ వీక్, లెదర్ ఫెయిర్‌ల వలన భారత దేశంలోని తోలు ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రాముఖ్యత లభించింది.

నాయుడమ్మగారి ప్రణాళికలకు అంతే లేదు. ఈసారి పాఠశాల విద్యార్ధులను CLRIకి ఆహ్వానించి పరిశ్రమ అంతా తిప్పిచూపించటంతో పిల్లలు ఎంతో ఉత్తేజం పొందారు. వీరిని మరింత ఉత్సాహపరచటానికి తోలు పరిశ్రమపై వ్యాస రచన, చిత్ర లేఖనం, నాటికల పోటీలు కూడా నిర్వహింప జేశారు. విజేతలతో పాటు, పాల్గొన్న వారందరికీ బహుమతులిప్పించారు. చర్మకారులు మూల మూల వున్న గూడేలలో కూడా వున్నారు. వారు చర్మాలను శుద్ధి చేసే విధానాన్ని పరిశీలించటానికి ఇరుకుదారుల్లో నడుచుకుంటూ, చేతి కర్రతో, లాంతరుతో, ఒక సహాయకునితో రాత్రి పూట కూడా ప్రయాణం చేశారు. వారికి కావలసిన ఎంతో సహాయ సహకారాలను అందించి వారి ఆరాధ్య దైవమయ్యారు.

మద్రాసులో ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ తోళ్ల ప్రదర్శనకు కుటీర పరిశ్రమలు నడిపే చర్మకారులను రప్పించేవారు. అందరికీ తన గదిలో కుర్చీలు చాలకపోతే వారితో పాటు తాను నేల మీద కూర్చుని వారికి కావలసిన సలహాలనిచ్చి, ప్రోత్సాహ పరిచి పంపేవారు.

దేశంలోనే అతి పెద్ద పరిశోధనాభివృద్ధి సంస్థ ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ సంస్థ’ CSIR. దీనికి డైరెక్టర్ జనరల్‌గా 1971లో నాయుడమ్మగారు నియమింపబడ్డారు. వెంటనే ‘ప్యాకేజీ అగ్రిమెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇతర దేశాలలో వున్న భారతీయ శాస్త్రవేత్తలు మన దేశానికి వచ్చి పరిశ్రమలు పెట్టుకోవచ్చునని ప్రకటించారు. అలా ఇతరదేశాలకు మన మేధావులు వలసపోయి వుండకుండా తన వంతు ప్రయత్నం చేశారు.

వీరు చేసిన మరో ప్రయోగం ‘శాస్త్రవేత్త – యాజమాన్య పథకం’. దీని ద్వారా ఒక శాస్త్రవేత్త ఇక్కడ 3 సంవత్సరాలు శెలవు పెట్టి స్వతంగా పరిశ్రమ పెట్టుకోవచ్చు. అందులో నష్టపోతే తిరిగి వచ్చి ఉద్యోగంలో చేరవచ్చు అని. ఎంతో పట్టుదలతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి శాస్త్రవేత్తలను ప్రోత్సాహ పరిచిన పథకంగా ఇది పేరొందినది.

ఆ తర్వాత 1981 జూన్ 12న వీరు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా నియమింపబడ్డారు. కాని 16 నెలల తర్వాత రాజీనామా చేశారు.

తన పథకాలను గ్రామీణ ప్రజల సాంకేతిక పరిజ్ఞానానికై మరింత విస్తరింప జేశారు. అలాంటి పథకాలు దేశానికి అవసరమని వాదించి ప్రభుత్వాన్ని ఒప్పించారు. దాని ఫలితమే ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్’ (CDA) స్థాపించబడింది. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచటం, వ్యవసాయ అధారిత, చర్మ సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించటం మొదలగునవి CDA లక్ష్యాలు. ‘ఆహారం కోసం వ్యవసాయం – కలప కోసం అడవి’ అనే ఆలోచన మారాలి. ప్రతి మొక్కను వేరు నుండి, ఆకు వరకు ఉపయోగించకోవచ్చు. ఉదాహరణకు వరి మొక్కను తీసుకుంటే దాని నుండి ధాన్యం, పశుగ్రాసమే కాకుండా, కార్డుబోర్టు కాగితం, ఇంటి పై కప్పు, పుట్టగొడుగుల పెంపకంలో క్రాపుగా వాడుకోవచ్చు. వరి పొట్టును ఇంధనంగా, బూడిద చేసి దానిని సోడియమ్ సిలికేట్, సోలారి గ్రేడ్ సిలికేట్, పింగాణీ వస్తువులు, ధృడమైన సిమెంటు అంటూ 100 రకాల ఉత్పత్తులను శాస్త్రవేత్తలచే గుర్తింప చేశారు. వ్యర్థ పదార్ధాల నుండి సంపద సృష్టించటమే ధనిక దేశాల లక్షణమని చెప్పేవారు.

‘ది ఫుడ్ అండ్ ఎగ్రికల్చరల్ ఆర్గనైజేషన్’ అనునది యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఒక ప్రత్యేక ఏజన్సీ. ఇది ఒక అత్యుత్తమ సంస్థ. ఇందులో 5 సంవత్సరాలు పని చేస్తే చాలు. జీవితాంతం పన్ను లేని పెన్షను పొందవచ్చు. అలాంటి సంస్థలో ఉన్నత పదవి కోసం నాయుడమ్మగారిని ఎంపిక చేశారు. కాని వారు దేశభక్తి పరాయణులు గదా! తన దేశాన్ని ఆ దేశానికి అందించే సేవలు వదిలి పెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అ పదవిని తనకు వద్దనేశారు. కాని తన సంస్థలో పని చేస్తూ తనంటే ఈర్ష్యతో రగిలిపోయే మరో వ్యక్తికి ఆ పదవి వచ్చేటట్లు చేసిన ఉదార స్వభావి, కారుణ్యమూర్తి అని చెప్పుకోవచ్చు.

వీరు కుల మతాలకు అతీతంగా వుండి ఏ మతం వారైనా, సమర్థతను బట్టి ఆయా పదవుల్లో నియామకాలు జరపాలని వాదించేవారు. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారుగా వుండేవారు.

వీరు ప్రతి సంవత్సరం విదేశీ పర్యాటనలు చేసి అక్కడి సాంకేతికతను ఆకళింపు చేసుకునేవారు. ఆ విధంగానే 1985లో రష్యాలో జరుగుతున్న సమావేశానికి జూన్ 10వ తేదీన మద్రాసు నుండి బయల్దేరి వెళ్లారు. రష్యా నుండి జూన్ 21న కెనడాలోని ఒట్టావాలో IDRC బోర్డు మీటింగులో పాల్గొనేందుకు బయల్దేరారు. జూన్ 23 రాత్రి AI 182 కనిష్క విమానం ఎక్కారు. అది మాంట్రియాల్ నుండి లండన్ మీదుగా ఢిల్లీ వెడుతుంది. 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే ఆ విమానం అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది. ఆ దుర్ఘటనలో మన ప్రియతమ శాస్త్రవేత్త నాయుడమ్మ అసువులు బాశారు. ప్రపంచ దేశాలన్నీ ఒక ప్రముఖ తోలు శాస్త్రవేత్తను, మార్గదర్శకుణ్ణీ కోల్పోయాయి. వారి మరణంతో మన భారతదేశానికి ముఖ్యంగా తోలు పరిశ్రమకు, చర్మకారులకూ కోలుకోలేని దెబ్బ తగిలింది. తోలు పరిశ్రమే విలవిలలాడింది.

(ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయిన డా. రావి శారద గారికి కృతజ్ఞతలతో – దాసరి శివకుమారి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here